Gunde Ninda Gudi Gantalu January 26th Episode: రోహిణి మరో కన్నింగ్ ప్లాన్.. దోషిగా మీనా.. కష్టాల్లో సుమతి..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కథ మొత్తం రోహిణి చుట్టూనే తిరుగుతూ, ఆమె అల్లుకున్న అబద్ధాల వల మరింత బిగుసుకుంది. రోహిణి విషయం సత్యానికి తెలిసిన క్షణం నుంచే కథ కీలక మలుపు తిరిగింది. సత్యం నేరుగా ప్రభావతిని ప్రశ్నించడంతో ఇంట్లో దాగి ఉన్న ఉద్రిక్తత ఒక్కసారిగా బయటపడింది. 'రెండోసారి గర్భం అంటే ఆలోచించాల్సిందే' అన్న సత్యం మాటలు ప్రభావతిని షాక్‌కు గురిచేశాయి. మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినా, సత్యం అనుమానం మరింత పెరిగింది. రోహిణిపై ప్రభావతికి ఉన్న ప్రత్యేక అభిమానం గురించీ ప్రశ్నించడంతో ఆమెపై కూడా సందేహాలు మొదలయ్యాయి. తన క్యారెక్టర్‌పై అనుమానం రావడంతో ప్రభావతి తీవ్ర ఆవేశంతో మనోజ్ గదికి వెళ్లి రోహిణిని నిలదీసింది.
కుటుంబ సభ్యులంతా హాల్లో ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 'నీ గతం ఏంటి? ఎవరు నువ్వు?'అంటూ ప్రభావతి వేసిన ప్రశ్నలు రోహిణిని మాటలేకుండా చేశాయి. హాస్పిటల్‌కు వెళ్లిన విషయం బయటపడడంతో కథ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో రోహిణి ఏడుపుని ఆయుధంగా మార్చుకుంది. చివరకు 'మొదటిసారి గర్భవతి అయ్యాను, ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది' అంటూ కొత్త కథ అల్లింది. ఇది నిజమా లేక మరో అబద్ధమా అన్న సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. చివరికి విషయం మీనా మీదికి మళ్లి, ఆమె దోషిలా మారడం రోహిణికి మరోసారి తప్పించుకునే అవకాశం ఇచ్చింది. నేటి ఎపిసోడ్‌లో నిజం కన్నా రోహిణి నాటకమే పైచేయి సాధించినట్టు కనిపించింది.

Photo Courtesy: jiohotstar
సోమవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాల తీవ్రతతో సాగింది. ఇంట్లో ఒక్కసారిగా రోహిణి గతం గురించి చర్చ మొదలవడంతో వాతావరణం పూర్తిగా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఎప్పుడైన అసలు తప్పు బయటపడుతుందోనన్న భయంతో రోహిణి మరో కొత్త డ్రామాకు తెరతీయాలని నిర్ణయించుకుంటుంది. తనకు మొదట నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందని, కానీ అది అబార్షన్ అయ్యిందని చెబుతూ సానుభూతి సంపాదించే ప్రయత్నం చేస్తుంది. ఈ మాటలతో ప్రభావతి పూర్తిగా కరిగిపోతుంది. 'నా కోడలు ఎంత మంచిదో... తన బాధలన్నీ తనలోనే దాచుకుంది' అంటూ భావోద్వేగానికి లోనవుతుంది. అదే సమయంలో ఈ గొడవకు కారణమైంది మీనానే అన్న భావనతో ఆమెపై ఇష్టం వచ్చినట్టు తిట్టి, అనవసరంగా వేరే వాళ్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది.
ఇదే అవకాశంగా తీసుకున్న రోహిణి మరింత రెచ్చిపోతుంది. మొదటి నుంచీ మీనా తనను తప్పుగానే చూస్తుందని, తాను ఎదుగుతున్న ప్రతిసారి ఇలాంటి నిందలు వేసి తనను మానసికంగా హింసిస్తోందంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. ఆమె నటన అందరి మనసులను కదిలించేలా ఉంటుంది. ఈ సమయంలో మనోజ్ కూడా రంగంలోకి దిగుతూ, తన భార్యను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఇకపై తన భార్య విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ కఠినంగా వార్నింగ్ ఇస్తాడు.
ఈ పరిస్థితుల్లో బాలు మాత్రం మీనాకు అండగా నిలుస్తాడు. రోహిణి ప్రెగ్నెన్సీ విషయం నిజమే అని, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టడం కూడా వాస్తవమేనని స్పష్టంగా చెబుతాడు. 'ఇందులో నా భార్య చేసిన తప్పేముంది? ఆమెకు తెలిసిన నిజాన్ని ఇంట్లో చెప్పడమే కదా ఆమె చేసిన పని' అంటూ తిరిగి ప్రశ్నిస్తాడు. అంతేకాదు, ఇలాంటి పెద్ద విషయాలను కూడా ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టుకుంటేనే మీ కాపురం ఎంత బాగుందో అందరికీ అర్థమవుతుందంటూ చురకలు వేస్తాడు.
ఇక ఈ విషయం నీకు ఎలా తెలిసిందంటూ రోహిణి నేరుగా మీనాను ప్రశ్నించడంతో అసలు కథ బయటకు వస్తుంది. మీనా తాను అదే హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా పూలు వేయడానికి వెళ్తుంటానని, అలా వెళ్లిన సమయంలో రోహిణి అక్కడ కనిపించడంతో నిజం ఏం జరిగిందోనని అనుమానం వచ్చి, కంగారుతో హాస్పిటల్‌లో అడిగి తెలుసుకున్నానని చెబుతుంది. అయితే ఇది విన్న రోహిణి... 'నా విషయాలు నీకు ఎందుకు అవసరం?" అంటూ మీనాను తప్పుపడుతుంది. ఈ సమయంలో శృతి కలగజేసుకొని పరిస్థితిని సూటిగా ప్రశ్నిస్తుంది. క్యాజువల్‌గా ఒక విషయం అడిగితే అందులో మీనా చేసిన తప్పేంటి? అది అంత పెద్ద నేరమా? అంటూ రోహిణి వైపు తిరిగి నిలదీస్తుంది.
కానీ శృతి మాటలు ప్రభావతికి మరింత కోపం తెప్పిస్తాయి. రోహిణి గురించి ప్రశ్నించే అధికారం, ఆమె విషయాలు తెలుసుకునే హక్కు మీనాక్షికి ఎక్కడిది అంటూ ప్రభావతి తీవ్రంగా రెచ్చిపోతుంది. అయితే బాలు మాత్రం మరోసారి మీనాకు మద్దతుగా నిలుస్తాడు. రోహిణి తనకు కడుపు వచ్చిందన్న విషయాన్ని ఇంట్లో చెప్పలేదని, కడుపు పోయిన విషయం కూడా దాచిందని గుర్తు చేస్తాడు. అంతేకాదు, రెండోసారి కడుపు రావాలని ప్రయత్నించినప్పుడు కూడా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్‌లో చూపించుకోలేదని ప్రశ్నిస్తాడు. ఈ విషయాలన్నీ మీనాకు తెలిసి, తెలిసిన నిజాన్ని ఇంట్లో చెప్పిందంతే గానీ, అందులో ఆమె చేసిన తప్పేముందని బాలు స్పష్టంగా అడుగుతాడు.
కానీ ప్రభావతి మాత్రం బాలు మాటలను పట్టించుకోకుండా మీనాకు కఠినమైన వార్నింగ్ ఇస్తుంది. 'ఇకపై ఇలాంటి గొడవలు పుట్టించావంటే ఈ ఇంట్లో ఉండనివ్వను... నిన్ను ఇంటి నుంచి వెళ్లగొడతా'అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. ఈ మాటలతో మీనా పూర్తిగా షాక్‌కు గురవుతుంది. ఇదే సమయంలో రోహిణి తన డ్రామాను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. 'నా మీద ఇంత అసూయ ఎందుకు? నాపై లేనిపోని నిందలు ఎందుకు వేస్తున్నావ్? ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే నేనే వెళ్లిపోతా' అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఆమె కన్నీళ్లతో మరోసారి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది.
ఈ పరిణామాలతో ఇంట్లో పరిస్థితి పూర్తిగా చేజారిపోయినట్టు కనిపిస్తుంది. సత్యం చివరకు కలగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. 'ఇక చాలు... ఏడుస్తోంది కనిపించడం లేదా? ఈ గొడవలో మీనా చేసిన తప్పేంటి?' అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. మీనా తనకు తెలిసిన నిజాన్ని మాత్రమే ఇంట్లో చెప్పిందని, రోహిణి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా, అబార్షన్ జరిగిన విషయాన్ని కూడా ఇంట్లో దాచిందని స్పష్టంగా చెబుతాడు. ఈ విషయంలో రోహిణి తప్పు చేసిందని సత్యం తేల్చి చెప్పడంతో పాటు, అనవసరమైన వాగ్వాదాలు ఆపేసి ఎవరి పనులు వారు చూసుకోవడమే మంచిదని పరిస్థితిని సెట్ చేస్తాడు. సత్యం మాటలతో గొడవకు తాత్కాలిక బ్రేక్ పడగా, అందరూ మౌనంగా తమ తమ గదుల్లోకి వెళ్లిపోతారు.
అయితే ఈ ఘటన మీనాను పూర్తిగా కుదిపేస్తుంది. అందరి ముందూ తననే దోషిగా నిలబెట్టారని భావించి కన్నీళ్లతో కరిగిపోతుంది. ఈ సమయంలో బాలు మీనాకు అండగా నిలుస్తూ ఆమెను దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు. 'ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు. రోహిణి గురించి నాకు ముందే తెలుసు... ఆమె పెద్ద కిలాడి. ఈ విషయం ముందే నాకు చెప్పి ఉంటే మూలాల నుంచే నిజం బయటకు తీసుకువచ్చేవాడిని' అంటూ మీనాకు ధైర్యం చెబుతాడు. కానీ మీనా మాత్రం 'నా తలరాత ఇంతే... ఏది చేసినా నేనే తప్పుగా కనిపిస్తాను' అంటూ మరింత భావోద్వేగానికి లోనవుతుంది. దానికి బాలు సమాధానంగా, 'అనవసరంగా బాధపడకు. ఎప్పటికైనా ఈ నిజం బయటపడుతుంది. రోహిణి మీద నాకు ముందునుంచే అనుమానం ఉంది. ఆమె బాగోతాన్ని తప్పకుండా బయటపెడతాను' అంటూ స్పష్టంగా చెబుతాడు.
అయితే ఈ మాటలన్నింటినీ దొంగచాటుగా వింటున్న రోహిణి లోపల మాత్రం భయంతో వణికిపోతుంది. బాలు, మీనా ఇద్దరూ కలిసిపోయితే తనకు ప్రమాదమేనని, తన గతాన్ని వారు కచ్చితంగా బయటపెడతారని కంగారుపడుతుంది. వారిని ఇలా వదిలిపెట్టడం తనకు ముప్పేనని భావించి మరో కొత్త డ్రామాకు తెరతీయాలని నిర్ణయించుకుంటుంది. దీని భాగంగా నేరుగా ప్రభావతి దగ్గరికి వెళ్లి నటన మొదలుపెడుతుంది. 'నాకు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు... నాపై లేనిపోని చాడీలు, నిందలు వేస్తున్నారు. నేను ఏం పాపం చేశాను?' అంటూ ప్రభావతి మీద పడి ఏడుస్తుంది. రోహిణి కన్నీళ్లతో ప్రభావతి మరోసారి కరిగిపోతుంది. దీంతో ప్రభావతిలో మీనా, బాలు మీద ఉన్న అక్కస్సు మరింత పెరుగుతుంది.
'వాళ్లు నీ జోలికి రాకుండా తగిన గుణపాఠం చెబుతాను. అవసరమైతే వాళ్లను ఈ ఇంట్లో నుంచే వెళ్లగొడతాను' అంటూ రోహిణికి హామీ ఇస్తుంది. ఇక తర్వాత రోహిణి నేరుగా మనోజ్ దగ్గరికి వెళ్లి అతనిమీద పడి దొంగ ఏడుపు ఏడుస్తుంది. తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని, తాను చేయని తప్పులకు బాధపడాల్సి వస్తోందని వాపోతుంది. భార్య కన్నీళ్లు చూసిన మనోజ్ వెంటనే ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. బాలు, మీనా ఇద్దరినీ 'చదువురాని దద్దమ్మలు' అంటూ అవమానిస్తూ, వాళ్ల మాటలను పట్టించుకోవడం మానేయమని రోహిణికి సూచిస్తాడు.
ఇదే సమయంలో రోహిణి తన అసలు ప్లాన్‌ను మనోజ్ ముందు పెడుతుంది. "మనమిద్దరం వేరే కాపురం పెట్టుకుందాం" అని చెప్పడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడిప్పుడే తన బిజినెస్‌లో స్థిరపడుతున్నానని, ఈ సమయంలో తన తల్లి ఎంతో సపోర్ట్‌గా నిలుస్తోందని చెబుతాడు. అలాంటప్పుడు తల్లిని వదిలి రాలేనని, మరికొన్ని రోజులు వేచి చూడాలని రోహిణికి చెబుతాడు. అయినా కూడా బాలు-మీనా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అంతా తన అమ్మే చూసుకుంటుందని ఆమెకు భరోసా ఇస్తాడు.
ఈ సంభాషణ మధ్యలో మనోజ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతాడు. మొదటి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎన్ని నెలలైందని అడుగుతాడు. దానికి రోహిణి నాలుగో లేదా ఐదో నెల ఉంటుందని చెప్పడంతో మనోజ్ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. 'ఇన్ని రోజులూ నేను తండ్రి అవుతానో లేదో అనే సందేహంలో ఉన్నాను. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు అలాంటి సమస్యలు లేవన్న నమ్మకం వచ్చింది' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలో తాను ఆ ఫీలింగ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసేవాడినని చెప్పుకుంటూ మరింత ఎమోషనల్ అవుతాడు. మనోజ్ మాటలు వింటున్న రోహిణి లోపల మాత్రం కలత చెందుతుంది. తన నిజం ఎప్పుడైనా బయటపడితే మనోజ్ తన నుంచి దూరమవుతాడన్న భయంతో, అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నానని మనసులోనే అతనికి సారీ చెప్పుకుంటుంది.
ఇక మరోవైపు మీనా తన చెల్లి సుమతి పని చేసే హాస్పిటల్‌కు వెళ్లి జరిగిన మొత్తం విషయాన్ని ఆమెకు చెబుతుంది. ఈ విషయంలో ఇకపై జోక్యం చేసుకోకూడదని, రోహిణి గురించి తనకు తెలిసిన నిజాలను ఎవరికీ చెప్పవద్దని సుమతికి సూచిస్తుంది. ఈ సమయంలోనే సుమతికి డాక్టర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రోహిణి విషయం బయటపెట్టినందుకు ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తానంటూ డాక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో సుమతి భయపడిపోతుంది. ఇకపై ఇలాంటి తప్పు చేయనని వేడుకున్నా, ఆమె జాబ్ ఉంటుందా ఊడుతుందా అన్నది సస్పెన్స్‌గా మారుతుంది.
అదే సమయంలో అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ట్రాక్ కూడా చూపిస్తారు. మీనా, శృతి ఇద్దరూ కలిసి హాల్లో హర్రర్ మూవీ చూస్తుంటారు. ఇది చూసిన ప్రభావతి కోపంగా వారిని తిట్టి గదిలోకి పంపిస్తుంది. దీంతో శృతి, ఎలాగైనా అత్తయ్యను భయపెట్టాలని ఓ రివెంజ్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తుంది. ప్రభావతికి చుక్కలు చూపించేలా శృతి చేసే పనులు వచ్చే ఎపిసోడ్‌లో మరో వినోదాన్ని పంచబోతున్నాయి.


Click it and Unblock the Notifications











