Gunde Ninda Gudi Gantalu January 27th Episode:ప్రభావతిని వణికించిన శ్రుతి.. సుమతి ఉద్యోగానికి ముప్పు..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాల తీవ్రతతో, ఉత్కంఠ భరితంగా సాగింది. ఇంట్లో రోహిణి గతం గురించి చర్చ మొదలవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అసలు నిజం బయటపడుతుందన్న భయంతో రోహిణి మరో కొత్త డ్రామాకు తెరతీయగా, తనకు నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందని, అది అబార్షన్ అయ్యిందని చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంది. దీంతో ప్రభావతి పూర్తిగా కరిగిపోయి మీనాను ఈ గొడవకు కారణమంటూ తీవ్రంగా మందలిస్తుంది.ఇదే అవకాశంగా తీసుకున్న రోహిణి, మీనా తనను మొదటి నుంచీ తప్పుగానే చూస్తోందని ఆరోపిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తుంది. మనోజ్ కూడా భార్యకు మద్దతుగా నిలిచి, ఇకపై ఆమె విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తాడు.
అయితే బాలు మాత్రం మీనాకు అండగా నిలుస్తూ, రోహిణి నిజాలను దాచిపెట్టిందని స్పష్టంగా ప్రశ్నిస్తాడు. మీనా హాస్పిటల్‌లో నిజం ఎలా తెలిసిందో వివరించినా, ప్రభావతి మాత్రం ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చివరకు సత్యం జోక్యం చేసుకుని గొడవకు తాత్కాలిక బ్రేక్ వేస్తాడు. అయినప్పటికీ మీనా తీవ్రంగా కుంగిపోతుంది. బాలు ఆమెను ఓదార్చుతూ రోహిణి బాగోతం తప్పకుండా బయటపడుతుందని ధైర్యం చెబుతాడు. ఇవన్నీ విన్న రోహిణి మరింత భయపడి, ప్రభావతి-మనోజ్‌ల వద్ద మరో డ్రామా ఆడుతూ పరిస్థితిని తనవైపుకు తిప్పుకుంటుంది. మరోవైపు సుమతిపై రోహిణి ఫిర్యాదు ఇవ్వడంతో ఆమె ఉద్యోగానికి ముప్పు వస్తుంది. జాబ్ నుంచి తీసివేస్తానని డాక్టర్ హెచ్చరించడంతో సుమతి ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనే ఉత్కంఠగా మారింది.

మంగళవారం ఎపిసోడ్ లో రోహిణి చేసిన తప్పిదానికి నేరుగా బాధ పడాల్సి వచ్చిన వ్యక్తి మీనా చెల్లెలు సుమతి. రోహిణి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన ఘటన హాస్పిటల్‌లో పెద్ద వివాదంగా మారడంతో, సుమతిని ఆమె డాక్టర్ తీవ్రంగా మందలిస్తుంది. 'నీ నిర్లక్ష్యం వల్ల నా హాస్పిటల్‌కు చెడ్డ పేరు వచ్చింది. నువ్వు వెంటనే జాబ్ మానేయాలి... లేకపోతే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా' అంటూ డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలతో సుమతి పూర్తిగా కుంగిపోతుంది. ఈ ఉద్యోగం తన జీవితానికి ఎంత ముఖ్యమో చెబుతూ, మరోసారి ఇలాంటి తప్పు జరగదని ప్రాధేయపడుతుంది. తన కన్నీళ్లతో చేసిన విన్నపం డాక్టర్ మనసును కొంత కరిగించినా, పూర్తిగా క్షమించదు. ఈ తప్పుకు శిక్షగా ఈ నెల మొత్తం ఆఫ్ సాలరీతోనే పని చేయాలి అనే కఠినమైన షరతు విధిస్తుంది. దీనిపై సుమతి ప్రశ్నించగానే, 'మాకు లక్షల్లో నష్టం వచ్చినప్పుడు నీకు వేలల్లో కూడా పోకూడదు. డబ్బు విలువ నేర్చుకో' అంటూ హెచ్చరిస్తుంది. దీంతో సుమతి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక మరో ట్రాక్‌లో మీనా జీవితంలో మరో భావోద్వేగ ఘట్టం చోటుచేసుకుంది. మీనా స్నేహితులు ఇంటికి వచ్చి పూలు గుచ్చడానికి సహాయం చేయమని కోరుతారు. అయితే బాలు ఇంటికి రాగానే తనను చూసుకోవాలని, ఆయనను తాను తప్ప ఇంట్లో ఎవరూ పట్టించుకోరు అని మీనా అంటుంది. ఇది విన్న స్నేహితులు, 'మీ మధ్య గొడవలు ఉన్నాయని మాకు తెలుసు. మీ సంసారంలో మేమెందుకు ఇబ్బందులు తీసుకురావాలి?'అంటూ సైలెంట్‌గా వెళ్లిపోతారు. అదే సమయంలో బాలు మీనాకు ఫోన్ చేస్తాడు. 'నీ గురించే ఆలోచిస్తున్నా" అని మీనా చెప్పడంతో, బాలు ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. స్నేహితులు పూలు అల్లడానికి రమ్మన్న విషయం చెప్పి, అడగాలనే ఫోన్ చేశానని మీనా వివరిస్తుంది. దానికి బాలు,'ఈరోజు నేను రావట్లేదు, నువ్వు వెళ్లొచ్చు' అని స్పష్టంగా చెబుతాడు. కానీ మీనా అక్కడితో ఆగదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ ఉంటారు? తింటారా లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
ఇది ఆమె ప్రేమను చూపించినా, బాలు మాత్రం 'అనవసరంగా నా గురించి ఎక్కువ ఆలోచించకు, నీ పని చూసుకో' అంటూ ఫోన్ పెట్టేస్తాడు.దీంతో వెంటనే మీనా తన స్నేహితులకు ఫోన్ చేసి తాను కూడా వస్తానని చెబుతుంది. కానీ వారు ఇప్పటికే మరో అమ్మాయిని మాట్లాడుకున్నామని చెప్పడంతో, మీనా పూర్తిగా ఉత్సాహం కోల్పోతుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు. శృతి రవికి ఫోన్ చేసి ఇంటికి త్వరగా రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రవి తనకు అర్జెంట్‌గా ఒక ఈవెంట్ పడిందని, అందుకే ఇంటికి లేటుగా వస్తానని చెబుతాడు. దీంతో శృతి తీవ్రంగా డిసప్పాయింట్ అవుతుంది. ఇద్దరూ కలిసి బయట డిన్నర్‌కు వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, "ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏమిటి?" అంటూ రవిపై కోపం చూపిస్తుంది. ఈ విషయం ఇప్పుడే తెలిసిందని, తప్పనిసరిగా అక్కడ ఉండాల్సిందే అని రవి చెప్పడంతో శృతి మరింత అలుగుతుంది.
'ఇంటికి రా.. లేకపోతే బయటే పడుకో!' శృతి హెచ్చరికతో రవి టెన్షన్
శృతి కోపంలో 'ఇంటికి రా... లేకపోతే ఈరోజు మొత్తం బయటే పడుకోవాలి'అంటూ రవిని బెదిరిస్తుంది. శృతి మాట మీద నిలబడుతుందని బాగా తెలిసిన రవి, కంగారుతో వెంటనే తన వదిన మీనాకు ఫోన్ చేసి విషయం చెబుతాడు. దీంతో మీనా 'టెన్షన్ పడకు... నేను చూసుకుంటా' అంటూ రవికి సపోర్ట్ చేస్తుంది. రవికి ఇది కొంత ఊరటనిస్తుంది. ఇక ఇంతలోనే శృతి ఇంటికి చేరుకుంటుంది. మీనా, 'ఏంటి మీ మధ్య గొడవ జరిగిందట కదా?' అని అడగడంతో శృతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. 'ఇప్పుడే కదా నేను కాల్ కట్ చేశాను... ఇంతలోనే నీకు ఫోన్ చేసి చెప్పాడా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అప్పుడే మీనా చాకచక్యంగా విషయం మార్చుతూ, 'వాళ్లకు వర్క్ టెన్షన్స్ ఉంటాయి... మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు?' అంటూ శృతి మనసు చల్లబరుస్తుంది. అలాగే ఈరోజు బాలు కూడా లాంగ్ ట్రిప్ ఉందని ఇంటికి రావడం లేదని చెప్పడంతో, శృతి ఒక్కసారిగా కొత్త ఐడియాతో ఉత్సాహపడుతుంది.
నైట్ హారర్ మూవీ ప్లాన్.. మీనా భయం మొదలు!
'ఈరోజు మనిద్దరం కలిసి నైట్ హారర్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం' అంటూ శృతి తన క్రేజీ ప్లాన్‌ను మీనాకు చెబుతుంది. అయితే మీనా మాత్రం 'నాకు భయం... నేను ఎప్పుడూ దయ్యాల సినిమాలు చూడలేదు' అంటూ వెనకడుగు వేస్తుంది. దానికి శృతి, 'నేనున్నాను కదా... ఎందుకు టెన్షన్?' అంటూ ధైర్యం చెబుతూ, త్వరగా భోజనం సిద్ధం చేయమంటుంది. అందరూ పడుకున్న తర్వాత శృతి హారర్ మూవీ పెట్టి ఎంజాయ్ చేస్తుంటే, మీనా మాత్రం భయంతో వణికిపోతుంది. ఇంతలోనే ప్రభావతి హాల్‌లోకి వచ్చి లైట్ వేస్తుంది. దీంతో మీనా ఒక్కసారిగా 'దయ్యం!' అంటూ కేక వేస్తుంది. ఉలిక్కిపడ్డ ప్రభావతి, 'అసలు మీరు ఇంత రాత్రి ఏం చేస్తున్నారు? అందరూ పడుకున్నాక ఈ గోల ఏమిటి?' అంటూ ఇద్దరిపై కోపం చూపిస్తుంది.
'నాకు భయం తెలియదు!' ప్రభావతి ఓవర్ యాక్షన్.. శృతి ప్లాన్ స్టార్ట్
శృతి మాత్రం భయపడకుండా, 'మేము హారర్ మూవీస్ చూస్తున్నాం... మీరు కూడా వచ్చి చూడండి ఆంటీ' అని సరదాగా అంటుంది. దానికి ప్రభావతి, 'నాకు దెయ్యాల సినిమాలంటే భయం లేదు. నేను చిన్నప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా పక్క ఊరి జాతరకు వెళ్లొచ్చేదాన్ని' అంటూ గొప్పలు చెబుతుంది. తన డిక్షనరీలో భయం అనే పదమే లేదంటూ ఓవర్ యాక్షన్ చేయడంతో, శృతి ఎలాగైనా అత్తయ్యను భయపెట్టాలని నిర్ణయించుకుంటుంది. మీనా ఎంత వద్దని చెప్పినా శృతి వినదు. టెక్నాలజీ, డబ్బింగ్ స్కిల్స్ ఉపయోగించి అత్తయ్యకు ఈ రాత్రి చుక్కలు చూపించాలని ఫిక్స్ అవుతుంది. ముందుగా ప్రభావతి గది దగ్గరకు వెళ్లి బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసి హారర్ మూవీ సౌండ్స్ ప్లే చేస్తుంది. ఒక్కసారిగా వినిపించిన అరుపులు, భయానక శబ్దాలకు ప్రభావతి ఉలిక్కిపడుతుంది. సౌండ్స్ ఆగకుండా రావడంతో ఆమె భయం మరింత పెరుగుతుంది.
అరుపుల ఎఫెక్ట్‌కు మనోజ్ కూడా గజగజ..
ప్రభావతి గదివైపు నుంచి వినిపిస్తున్న భయానక అరుపులను విని మనోజ్ కూడా ఒక్కసారిగా గజగజ వణుకుతాడు. ఈ పరిస్థితిని గమనించిన శృతి, ఇక్కడితో ఆగకుండా డోస్ మరింత పెంచుతుంది. ఈసారి తన డబ్బింగ్ టాలెంట్ మొత్తం బయటకు తీసి, హర్రర్ వాయిస్‌లో 'బయటికి వస్తావా లేదా?' అంటూ హెచ్చరిస్తుంది. ఆ భయానక స్వరం వినిపించగానే ప్రభావతి, మనోజ్ ఇద్దరికీ కంగారు మొదలవుతుంది. ఎలాగైనా ధైర్యం తెచ్చుకుని ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కిందికి రావాలని నిర్ణయించుకుంటారు. అయితే ఒకరికి తెలియకుండా ఒకరు కిందికి రావడంతో, ఆ చీకట్లో ఒకరినొకరు చూసుకుని దయ్యం అనుకుని భయపడిపోతారు. అరుపులు, గందరగోళంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఇది చూసిన మీనా, 'ఇక చాలు శృతి... మరీ ఎక్కువ భయపెట్టితే బాగోదు' అంటూ వేడుకుంటుంది.మీనా మాటలకు స్పందించిన శృతి బయటికి వచ్చి,'ఏంటి అత్తయ్య... భయం అంటే నాకు తెలియదు అన్నారు కదా? ఇప్పుడు మాత్రం తెగ భయపడుతున్నారు' అంటూ హేళన చేస్తుంది. దీంతో ప్రభావతి మండిపడుతూ, 'ఇది మీ ఇద్దరి పనే' అంటూ మీనా, శృతి ఇద్దరిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఉద్రిక్త వాతావరణంతోనే నేటి ఎపిసోడ్ ముగిసింది.
అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమో: ఇక రాబోయే ఎపిసోడ్‌లో మరో కొత్త డ్రామాకు తెరలేవనుంది. కిచెన్‌లో మీనా పని చేస్తుండగా, అకస్మాత్తుగా పిండి డబ్బా జారి కింద పడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రభావతి మీద మొత్తం పిండి పడిపోతుంది. ఆ పరిస్థితిని చూసిన మనోజ్, నవ్వుతూ "మమ్మీ... అచ్చం దయ్యం లాగానే ఉన్నావు" అంటూ సరదాగా అంటాడు. ఈ మాటతో ప్రభావతి మండిపడి, మనోజ్‌ను కొట్టడానికి వస్తుంది. ఈ సీన్ కామెడీతో పాటు టెన్షన్‌ను కూడా పెంచబోతోంది.
అంతేకాదు, మరుసటి రోజు శృతి తల్లిని ప్రభావతి కలిసినట్లు తెలుస్తోంది. 'మీనా వల్లే శృతి చెడిపోయింది. మీరు పట్టించుకోకపోతే నా కోడలు మరింత దూరమవుతుంది. మీనా-శృతి మధ్య దూరం పెరిగేలా చేయండి' అంటూ ప్రభావతి శృతి తల్లిని రిక్వెస్ట్ చేస్తుంది. దీనిని మంచి అవకాశంగా భావించిన శృతి తల్లి శోభ, 'ఇదే సరైన ఛాన్స్... ఈ గొడవను ఎంత పెద్దది చేయాలో అంత పెద్దది చేద్దాం' అంటూ తన కమింగ్ ఐడియాను అమలు చేయడానికి సిద్ధమవుతుంది. మొత్తంగా చూస్తే... హారర్ అల్లరి నుంచి కుటుంబ గొడవల వరకు, ఈ ట్రాక్ సీరియల్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. శృతి అల్లరి ఎక్కడ వరకూ వెళ్తుంది? ప్రభావతి-మీనా మధ్య గొడవ మరింత ముదిరుతుందా? శోభ ప్లాన్ ప్రభావతి కుటుంబాన్ని ఎలా కుదిపేస్తుంది? అనేది మరింత ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











