Gunde Ninda Gudi Gantalu January 29th Episode:మీనాపై ప్రతీకారం.. శోభన ఎంట్రీ.. తోడికోడళ్ల మధ ప్రభావతి చిచ్చు.
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ సరదా, భావోద్వేగాలు, అపార్థాలతో పాటు తీవ్రమైన ఘర్షణలతో ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మనోజ్ తన భయాన్ని బయటపెడుతూ, అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశాడు. అదే సమయంలో బాలు, రవి ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలతో ఇంట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మీనా, శృతి వేర్వేరు కారణాలు చెప్పినా, ప్రభావతి మాత్రం దీనికి మీనానే కారణమని నిందలు మోపింది. అయితే శృతి ధైర్యంగా స్పందించి, ఇది తన ఐడియానేనని స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరుసటి రోజు బాలు ట్రిప్ నుంచి అలసిపోయి రావడం, మీనా అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం, ఇల్లు కట్టాలనే బాలు లక్ష్యం ఎమోషనల్‌గా చూపించారు. మరోవైపు శృతి రవికి ఇచ్చిన సర్ప్రైజ్ ఫెయిల్ కావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
అదే సమయంలో జరిగిన పొరపాటు వల్ల నేలపై నూనె పడటం, ఆ విషయం తెలియక ప్రభావతి జారి పడటం కథను కీలక మలుపు తిప్పింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రభావతి మీనా మీద అటెంప్ట్ మర్డర్ ఆరోపణలు చేయడం, మనోజ్ కూడా అదే బాటలో మాట్లాడడం హైలైట్‌గా నిలిచాయి. ఇక్కడ బాలు తన సెటైర్లతో పాటు ఘాటైన మాటలతో ప్రభావతిని నిలదీయడం ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. చివరికి శృతి నేరుగా ఎదురు నిలబడి నూనె పడిన తప్పు తనదేనని చెప్పడం, రోహిణి విషపు మాటలు, ప్రభావతి కొత్త మాస్టర్ ప్లాన్ సంకేతాలు ఎపిసోడ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాయి. ఇక చివర్లో మీనా అత్తకు నాటువైద్యం చేయాలనుకోవడం, తేలు-స్వామీజీ కథతో తన మనసు బలం చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ డ్రామా, ఎమోషన్, రాబోయే కుట్రలతో ఆసక్తిని పెంచింది.

గురువారం ఎపిసోడ్ భావోద్వేగాలు, అపార్థాలు, అనుమానాలు, హాస్యం కలగలిసిన సన్నివేశాలతో ఎపిసోడ్ చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి కాలుజారి కిందపడడంతో ఇంట్లో కలకలం రేగింది.నొప్పులతో విలవిల్లాడుతున్న ప్రభావతిని చూసి మీనా వెంటనే నాటు వైద్యం చేయాలని నిర్ణయించుకుంటుంది. వేడి నీళ్లతో కాపడం పెట్టాలని గదిలోకి వెళ్లే సమయంలో బాలు తన తల్లి స్వభావాన్ని మీనాకు హెచ్చరిస్తాడు. 'అమ్మ నీ మంచి పనినీ తప్పుగా అర్థం చేసుకుంటుంది' అని బాలు చెప్పిన మాటలు క్షణాల్లో నిజమవుతాయి. గదిలోకి వచ్చిన మీనాపై ప్రభావతి తీవ్ర ఆరోపణలు చేస్తుంది. 'వేడి నీళ్లను నా కాలుపై పోసి సంతోషపడాలనుకుంటున్నావా? నేను నొప్పితో బాధపడుతుంటే నీకు ఆనందమా?' అంటూ లేనిపోని నిందలు వేస్తూ కసురుకుంటుంది. బాలు చెప్పినట్లుగానే తల్లి ప్రవర్తన చూసి మీనా లోలోపల నవ్వుకుంటుంది.
అయితే, మీనా ఒక్క మాటతో తన స్థాయిని చాటుతుంది. 'మీరు ఏమనుకున్నా సరే... వేడి నీళ్లు ఇక్కడ పెడుతున్నాను. నచ్చితే వాడుకోండి, లేకపోతే వద్దు. మీరు తిట్టినా, కొట్టినా మీరు నా అత్తయ్యే. మీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యత' అని చెప్పి గదిని విడిచిపెడుతుంది. ఈ మాటలు మీనా సహనాన్ని, బాధ్యతను స్పష్టంగా చూపిస్తాయి. మీనా వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి మళ్లీ కాపడం పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే నీళ్లు చల్లారడంతో వంటింట్లోకి వెళ్లి మళ్లీ వేడి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.
ఇంట్లో మరోవైపు మీనా టేబుల్‌పైకి ఎక్కి వస్తువులు సర్దుకుంటుండగా, ప్రభావతి తనలోని అక్కసును బయటపెడుతూ ఆ టేబుల్‌ను కాలితో తంతుతుంది. దీంతో మీనా బ్యాలెన్స్ కోల్పోయి కిందపడబోతుంది. క్షణాల్లో స్పందించిన బాలు మీనాను పట్టుకుని ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే, మీనా చేతిలో ఉన్న కుంకుమ పిండి ప్రభావతి మీద పడటంతో ఆమె రూపం పూర్తిగా మారిపోతుంది. కుంకుమతో నిండిన ప్రభావతిని చూసి బాలు భయంతో 'దయ్యం... దయ్యం' అంటూ అరుస్తాడు. ఆ మాటలతో ఇంట్లోని వారంతా పరుగున వచ్చి ప్రభావతి అవతారాన్ని చూసి గజగజ వణికిపోతారు. మనోజ్ అయితే భయంతో వణికిపోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ గందరగోళంలో ప్రభావతి కోపంతో ఊగిపోతూ "నన్ను దయ్యమంటారా?" అంటూ ఆగ్రహంతో రగిలిపోతుంది.
ఇదంతా సరిపోనట్టు శృతి చేష్టలు ప్రభావతికి తట్టుకోలేనివిగా మారతాయి. అత్తయ్యపై సెటైర్లు వేస్తూ, ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో "మా అత్తయ్య దిష్టిబొమ్మ గెటప్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడం ఇంట్లో కొత్త అగ్గి రాజేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన రోహిణి వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్లి శృతి చేసిన పనిని చెబుతుంది. అప్పటివరకు లోపలే కాచుకుంటున్న కోపం ఒక్కసారిగా బయటపడుతుంది. "ఇక లాభం లేదు... ఏదో ఒకటి చేయాలి. మీనాతో కలిసి శృతి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. ఇన్నాళ్లు బిడ్డలా చూసాను... నా ఓపిక నశించింది" అంటూ ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోతుంది.
ఈ వ్యవహారంలో తాడోపేడా తేల్చాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది.
ఇక తన పెద్ద కోడలు రోహిణితో కలిసి ప్రభావతి నేరుగా మీనాక్షి ఇంటికి వెళ్లడం కథలో కొత్త చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో ఆగ్రహంతో ఊగిపోతున్న శృతి, తన తల్లి శోభనకు ఫోన్ చేసి "అర్జెంటుగా వచ్చి కలవాలి" అంటూ పిలవడం ఆసక్తిని మరింత పెంచింది. మీనాక్షి ఇంట్లో ప్రభావతి-మీనాక్షి మధ్య సంభాషణ సరదా, సెటైర్లతో సాగింది. ప్రభావతిని చూసిన వెంటనే మీనాక్షి "మళ్లీ ఏం జరిగింది? బాలు గాడు ఏమైనా అన్నాడా?" అంటూ ప్రశ్నించగా, "ఉందిగా... మీ ముద్దుల కోడలు శృతి. మీనాతో చేరి నాకు చుక్కలు చూపిస్తోంది. నన్ను లెక్క చేయడం లేదు. గంజిలో ఈగ తీసినట్టు తీసేస్తోంది" అంటూ తన గోడును విప్పుకుంటుంది ప్రభావతి. ఈ మాటలతో ఇద్దరి మధ్య సంభాషణ హాస్యభరితంగా మారినా, లోపల మాత్రం అసంతృప్తి ముదురుతూనే ఉంటుంది.
ఇంతలోనే శృతి తల్లి శోభన మీనాక్షి ఇంటికి చేరుకుంటుంది. అడుగుపెట్టగానే తన సెటైరికల్, కన్నింగ్ మాటలతో ప్రభావతిపై పంచులు వేస్తుంది. "ఏంటి ఇలా పిలిచారు? ఏమైనా డబ్బులు కావాలా?" అంటూ ప్రశ్నించగా, ప్రభావతి ఒక్కసారిగా రియాక్ట్ అవుతుంది. "ఈ విషయం తెలిస్తే మా ఆయన నన్ను చెప్పుతో కొడతాడు" అంటూ తన బాధను బయటపెడుతుంది. అనంతరం ప్రభావతి శృతి చేష్టలను ఒక్కొక్కటిగా వివరించసాగుతుంది. ఇటీవల మీనాతో కలిసి శృతి పూర్తిగా మారిపోయిందని, తనకు విలువ ఇవ్వడం లేదని, అత్తగా గౌరవం చూపడం లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఆరోపిస్తుంది. అంతటితో ఆగకుండా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని కూడా చెబుతుంది.
ఈ మాటలు విన్న శోభన మాత్రం నవ్వుకుంటూ చాలా లైట్‌గా తీసుకుంటుంది. "ఏదో చిన్న పిల్ల. గారాబంగా పెంచుకున్న మీరే అడ్జస్ట్ కావాలి" అంటూ రివర్స్ పంచ వేస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఆగదు. "మాకు గౌరవం ఇవ్వడం లేదు. రవిని కూడా పనిమనిషిలా చూస్తుంది. రారా-పోరా అంటూ పిలుస్తుంది. అంతేకాదు అతనితో కాళ్లు పట్టించుకుంటుంది" అంటూ శృతిపై మరిన్ని ఫిర్యాదులు చేస్తుంది. దీనికి శోభన మరింత కూల్‌గా స్పందిస్తుంది. "మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ జనరేషన్ పిల్లలు అంతే. భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన లేకుండా హ్యాపీగా ఉన్నారు కదా. అనవసరంగా మీరు ఎందుకు బాధపడుతున్నారు?" అంటూ ప్రభావతిని మళ్లీ ఇరకాటంలో పడేస్తుంది.
అయితే ప్రభావతి మాత్రం తన నియమాలు, పరువు ప్రతిష్టల గురించే మాట్లాడుతుంది. "ఇలా ఉంటే మా ఇంట్లో నడవదు. మాది పరువు గల కుటుంబం. అందరూ పద్ధతిగా ఉండాలి. నా పెద్ద కోడలు నేను చెప్పినట్లు వింటుంది. కానీ శృతి మీనా సావాసం వల్ల చెడిపోతోంది" అంటూ లేనిపోని చాడీలు చెబుతుంది.
దీంతో శోభన లోలోపల నవ్వుకుంటుంది. "ఇది మీ ఇంటి విషయం. నేను జోక్యం చేసుకోవడం సరికాదు. మీకు అంతగా భరించే శక్తి లేకపోతే మా కూతుర్ని, అల్లుడ్ని మా ఇంటికి పంపించండి. మేము చూసుకుంటాం. కానీ ఇలాంటి చిన్న విషయాలకు నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేయొద్దు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అయితే బయటకు వెళ్లిన తర్వాత శోభన తనలో తాను మరో ప్లాన్ వేసుకుంటుంది. "వాళ్లే ఒకరోజు శృతిని భరించలేక మా ఇంటికి పంపిస్తారు. అల్లుడు కూడా ఇక్కడికే వచ్చేస్తాడు" అని భావిస్తూ, ఈ గొడవను ఇంకా పెంచేలా తన కన్నింగ్ ఐడియాను అమలు చేయాలని నిర్ణయించుకుంటుంది. మరోవైపు ప్రభావతి మాత్రం తన ప్లాన్ అనుకున్నట్లుగా జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. "ఎలాగైనా శృతి-మీనాలను విడదీయాలి. నా యజమానిషిని మళ్లీ చలాయించుకోవాలి" అంటూ కొత్త కుట్రలకు తెరలేపుతుంది.
ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో శోభన నేరుగా మీనాను కలిసి, "నీ సావాసం వల్లే నా కూతురు చెడిపోయింది. అనవసరంగా శృతి జీవితంతో ఆడుకోవద్దు" అంటూ లేనిపోని నిందలు వేయడం గమనించవచ్చు. ఈ మాటలతో మీనా తీవ్ర ఆగ్రహానికి లోనవుతుంది. ఆ విషయాన్ని బాలు దగ్గర చెప్పడంతో, బాలు కూడా కోపంతో ఊగిపోతూ శృతిని నిలదీయడం ప్రారంభిస్తాడు. ఈ గొడవలను చూస్తూ ప్రభావతి మాత్రం లోపల సంతోషపడటం మరో ట్విస్ట్. తోడికోడళ్ల మధ్య నిత్యం గొడవలు జరుగుతుంటే తన కుట్రలు ఫలిస్తాయని ఆమె భావిస్తుంది.


Click it and Unblock the Notifications










