Gunde Ninda Gudi Gantalu February 4th Episode: చింటూ దత్తతపై ఉత్కంఠ.. మనోజ్‌కి రోహిణి బాయ్ ఫ్రెండ్ లెటర్..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో బాలు-మీనా రచ్చ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. ఇంట్లో మొదలైన చిన్న గొడవ నడిరోడ్డుపైకి చేరడంతో సీన్ మొత్తం కామెడీగా మారిపోయింది. ఒకరినొకరు తిట్టుకుంటూ రోడ్డుపై హడావుడి చేయడం, చుట్టూ ఉన్నవాళ్లు ఆశ్చర్యంగా చూడడం హైలైట్‌గా నిలిచింది. ఈ గొడవ పీక్స్‌కి చేరిన సమయంలో ట్రాఫిక్ పోలీస్ ఎంట్రీ ఇచ్చి రూ.500 ఫైన్ వేయడంతో ఇద్దరికీ బుద్ధి వచ్చింది. అప్పటివరకు గొడవపడిన జంట ఒక్కసారిగా ప్యాచ్ అప్ కావడం నవ్వులు పూయించింది. ఇక మరోవైపు ఎపిసోడ్ సీరియస్ మోడ్‌లోకి వెళ్లింది. రోహిణి తల్లి సుగుణమ్మ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు పరుగులు తీస్తుంది. రిపోర్ట్స్ రావాల్సి ఉండటంతో ఆమె గుండెల్లో ఆందోళన పెరుగుతుంది.
ఇదే సమయంలో మనోజ్ నుంచి కాల్ రావడం ట్విస్ట్. ఎక్కడున్నావ్ అన్న ప్రశ్నకు రోహిణి అబద్ధం చెప్పడంతో మనోజ్ అనుమానం మొదలవుతుంది. దివ్య షాప్‌లో కనిపించడంతో రోహిణి బాగోతం బయటపడుతుందేమోనన్న భయం పెరుగుతుంది. రోడ్డుపై గొడవ తర్వాత ఇంట్లో బాలు-మీనా ట్రాక్ మళ్లీ ఫన్నీగా సాగుతుంది. కోపంతో మీనా గ్లాసులు విసిరితే, బాలు స్వీట్ తెచ్చి సారీ చెప్పి ఆమెను కూల్ చేస్తాడు. చింటూని చూసేద్దామన్న మీనా మాటకు బాలు ఒప్పుకోవడంతో ఆ ట్రాక్ ముచ్చటగా ముగుస్తుంది. ఇక మనోజ్ ఆగ్రహాన్ని ఎదుర్కొన్న రోహిణి, స్వామీజీ పేరుతో తన కన్నింగ్ ప్లాన్ అమలు చేసి మరోసారి తప్పించుకుంటుంది. వంటింట్లో రవి చేసిన లడ్డూలు, శృతి బిజినెస్ ఐడియా, ప్రభావతి ఎంట్రీతో వచ్చిన డ్రామా... మొత్తంగా ఈ ఎపిసోడ్ ఫన్, టెన్షన్, ట్విస్టులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

బుధవారం ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, ప్రశ్నలు, కీలక నిర్ణయాలతో కథ ఆసక్తికర మలుపు తిరిగింది. బాలు-మీనా కలిసి చింటూను కలవాలనే ఉద్దేశంతో సుగుణమ్మ ఇంటికి వెళ్లడం నుంచే ఎపిసోడ్ ప్రధానంగా సాగింది. సుగుణమ్మ ఆరోగ్య పరిస్థితిని చూసి బాలు, మీనా ఇద్దరూ ఒక్కసారిగా ఆందోళనకు గురవుతారు. "కనీసం మీ ఆరోగ్యం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదేంటి?" అంటూ బాలు ప్రశ్నించగా, "మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేకపోయాను" అని సుగుణమ్మ సమాధానం ఇస్తుంది. అయితే కావాలనే దూరం పెడుతున్నారా? మేమేమైనా మీకు ఇబ్బంది కలిగించామా? అని బాలు గట్టిగా అడగడంతో, అలాంటిదేమీ లేదని ఆమె స్పష్టం చేస్తుంది.
ఇక్కడే బాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 'ఈ పరిస్థితుల్లో కూడా నీ కూతురు వచ్చి చూడలేదా? ఇలాంటి సమయంలో రాకపోతే ఆమె మనిషేనా?" అని తీవ్రంగా మాట్లాడతాడు. దీనికి మీనా కూడా స్పందిస్తూ "ఎంత బిజీగా ఉన్నా తల్లి ఇలాంటి స్థితిలో ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉంటుంది?" అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే సుగుణమ్మ తన కూతుర్ని సమర్థిస్తూ, "ఆమె రాలేని పరిస్థితుల్లో ఉంది. కానీ నా బాగోగులు చూసేందుకు నర్స్‌ని ఏర్పాటు చేసింది" అని చెబుతుంది.
ఇంతలో బాలు, "చింటూ ఎక్కడ? ఎందుకు కనిపించడం లేదు?" అని ప్రశ్నిస్తాడు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చింటూను బంధువుల ఇంటికి పంపించామని సుగుణమ్మ అబద్ధం చెబుతుంది. "లోకల్ అయితే వెళ్లేటప్పుడు కలిసి తీసుకెళ్తాం" అని బాలు అనగా, "వేరే ఊరు" అని చెప్పి తప్పించుకుంటుంది.
ఈ పరిణామాలన్నింటి మధ్య బాలు కీలకమైన విషయాన్ని లేవనెత్తుతాడు. "మీ ఆరోగ్య పరిస్థితి ఇలానే ఉంటే, ఈ వయసులో చింటూను చూసుకోవడం, పిల్లవాడి భవిష్యత్తు అన్నీ ప్రశ్నార్థకమే. అందుకే చింటూను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాం" అని సుగుణమ్మకు చెబుతాడు. ఇది విని సుగుణమ్మ కళ్లలో ఆనందం మెరుస్తుంది. అయితే ఈ నిర్ణయం తన చేతిలో లేదని, కూతుర్ని అడిగి చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేస్తుంది. 'ఇది మీ సమస్య మాత్రమే కాదు... చింటూ భవిష్యత్తు కూడా. ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకోండి' అంటూ బాలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. మీనా కూడా, 'ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పండి. మమ్మల్ని పరాయివాళ్లలా చూడకండి' అని సుగుణమ్మకు ధైర్యం ఇస్తుంది. వెళ్లే ముందు తాము తీసుకువచ్చిన స్వీట్స్‌ను చింటూ కోసం ఇవ్వమని చెప్పి బాలు-మీనా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఆ తరువాత సుగుణమ్మ.. రోహిణికి ఫోన్ చేస్తుంది. బాలు-మీనా తన ఇంటికి వచ్చారని, చింటూ దత్తత విషయం మాట్లాడారని సుగుణమ్మ తన కూతురు రోహిణికి ఫోన్ చేసి చెబుతుంది. ఈ మాట విన్న క్షణంలోనే రోహిణికి ఎక్కలేని ఆగ్రహం వస్తుంది. 'అసలు వాళ్లను ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? పిల్లవాడిని ఎందుకు వారితో కలవనిచ్చావు?' అంటూ వరుసగా ప్రశ్నలతో సుగుణమ్మను నిలదీస్తుంది. తాను ఏ విషయమూ చెప్పలేదని, చింటూను వారికి కలవకుండా జాగ్రత్త పడ్డానని సుగుణమ్మ వివరణ ఇచ్చినా, రోహిణి కోపం తగ్గదు.
ఈ సమయంలో సుగుణమ్మ తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ, "ఈ పరిస్థితుల్లో నేను కూడా చింటూని దత్తత ఇవ్వాలని ఆలోచిస్తున్నాను" అని చెప్పడంతో రోహిణి పూర్తిగా రెచ్చిపోతుంది. "నా జీవితం రోడ్డుపాలు చేయాలనుకుంటున్నావా? వాడు నా ఇంట్లో ఉంటే నా జీవితం నాశనం అవుతుంది" అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ మాటలకు సుగుణమ్మ కూడా ఘాటుగా స్పందిస్తుంది."వాడిని నువ్వు కన్నావు కావచ్చు. కానీ చిన్నప్పటినుంచి వాడి అలనా పాలనా నేనే చూసుకున్నాను. వాడిపై నీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. వాడి భవిష్యత్తు కోసం నేను బాలు-మీనాలకు దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అంటూ తన సంచలన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.
ఇది విని రోహిణి షాక్‌కు గురవుతుంది. 'అంటే నా కొడుకు నీకు భారమయ్యాడా?' అంటూ లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సుగుణమ్మ మాత్రం తన నిర్ణయం చింటూ భవిష్యత్తు కోసమేనని మరోసారి స్పష్టం చేస్తుంది.దీంతో రోహిణి, "నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయొద్దు. వాడి బాగోగులు నేను చూసుకుంటాను" అంటూ విషయం ముగించేందుకు ప్రయత్నిస్తుంది. అయినా కూడా దత్తత వ్యవహారం ఏలాగైనా ఆపాలని రోహిణి పక్కా ప్లాన్ వేస్తుంది. ఈ క్రమంలో బాలు-మీనాలపై లేనిపోని నిందలు వేసి వ్యవహారాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకుంటుంది.
దీనిలో భాగంగా ప్రభావతి దగ్గరికి వెళ్లి, "బాలు-మీనా చింటూని దత్తత తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు" అని చెబుతుంది. అయితే ప్రభావతి మాత్రం ఊహించని విధంగా స్పందిస్తూ, "దత్తత తీసుకుంటే తప్పేంటి? చింటూని ఇంట్లోకి తీసుకొస్తే, ఆ ముగ్గురిని ఇంట్లో నుంచి బయటకు పంపించవచ్చు. అలాంటి అవకాశానికే నేను ఎదురుచూస్తున్నాను" అని అంటుంది. అలా చేస్తే తన కొడుకు కూడా రోడ్డు పాలవాల్సి వస్తుందని రోహిణి ఒక్కసారిగా ఆందోళనకు గురవుతుంది. దీంతో ఈ ప్లాన్ వర్క్ అవుట్ కాదని అర్థం చేసుకుంటుంది.
మరోవైపు బాలు తీవ్రంగా ఆలోచనలో మునిగిపోతాడు. అతని పరిస్థితిని గమనించిన మీనా దగ్గరికి వెళ్లి, "ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు?" అని అడుగుతుంది. దానికి బాలు, "చింటూ దత్తత విషయంలో సుగుణమ్మ సరైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఆమెకు మనపై నమ్మకం లేదా?" అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. దీంతో మీనా శాంతంగా వివరిస్తూ, "చిన్నప్పటినుంచి చింటూని సుగుణమ్మే పెంచింది. సడన్‌గా వాడిని దూరం చేయాలంటే ఆమెకు కష్టం అనిపించి ఉండొచ్చు. అందుకే దత్తత నిర్ణయంపై సందేహంగా ఉంది. దేవుడు అనుకున్నది అలాగే జరుగుతుంది. ఈ విషయం గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు" అంటూ బాలునికి ధైర్యం చెబుతుంది.
మరుసటి రోజు రోహిణి తన స్నేహితురాలు దివ్యను కలుస్తుంది. బాలు-మీనా తన కొడుకు చింటూని దత్తత తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పగానే, దివ్య మాత్రం ఊహించని విధంగా స్పందిస్తుంది. "ఇది మంచి నిర్ణయమే. వాడి భవిష్యత్తు బాగుంటుంది. పైగా ఎప్పుడూ నీ కళ్లముందే ఉంటాడు కదా" అంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. దివ్య మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేస్తుంది. "నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు మా ఇంట్లో ఉంటే ఎప్పటికైనా నా విషయం బయటపడుతుంది. వాడిని దూరం పెట్టలేను. అలా అయితే నా కాపురమే ఆగమవుతుంది" అంటూ తన భయాన్ని బయటపెడుతుంది.
అప్పుడు దివ్య మరో కొత్త ఆలోచన చెబుతుంది. "బాలు-మీనాలు దత్తత తీసుకునే బదులు... నువ్వే చింటూని దత్తత తీసుకుంటే?" అని సూచిస్తుంది.ఈ మాటలకు రోహిణి షాక్ అవుతుంది. "నా కొడుకునే నేను దత్తత తీసుకోవడం ఏంటి? పైగా మనోజ్‌కి వాడు అంటే పడదు. అత్తయ్య ప్రభావతికి కూడా ఇది నచ్చదు. దత్తత అసాధ్యం" అంటూ తేల్చేస్తుంది.అయితే దివ్య అడిగిన "మరి నీ ప్లాన్ ఏంటి?" అన్న ప్రశ్నకు రోహిణి తన అసలు ఆలోచనను వెల్లడిస్తుంది. అమ్మ సుగుణమ్మను, చింటూని సిటీకి తీసుకొచ్చి ఇక్కడే ఉంచాలని భావిస్తున్నట్లు చెబుతుంది. ఇందులో భాగంగా ఇద్దరూ కలిసి చింటూ కోసం స్కూల్‌కు వెళ్లి అడ్మిషన్ వివరాలు తెలుసుకుంటారు.
తర్వాత రోహిణి తన తల్లి సుగుణమ్మకు ఫోన్ చేసి, "త్వరలోనే నిన్ను, చింటూని సిటీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. చింటూ స్కూల్లో ఇప్పుడే అడ్మిషన్ కూడా తీసుకున్నాను" అని చెబుతుంది. ఈ మాటలు విన్న సుగుణమ్మ ఆనందానికి అవధులు ఉండవు. ఇదే చోట ఎపిసోడ్ ముగిసి, రాబోయే పరిణామాలపై ఆసక్తిని పెంచుతుంది.
అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో షాకింగ్ ట్విస్ట్.. ఇక రాబోయే ఎపిసోడ్‌లో ఉత్కంఠకర పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. రోహిణి గతానికి సంబంధించిన ఓ లెటర్ తనకు వచ్చిందని మనోజ్ ప్రభావతికి చెబుతాడు. ఈ విషయంపై క్లారిటీ కోసం ప్రభావతి రోహిణిని పిలిచి నిలదీసే ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఈ లెటర్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ పంపి ఉండవచ్చని రోహిణి అనుమానిస్తుంది. "వాడు జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు?" అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతుంది. దీంతో రోహిణి మరోసారి పెద్ద చిక్కుల్లో పడినట్టేనా? ఆమె గతం బయటపడుతుందా? ఈ పరిణామాలు బాలు-మీనా, చింటూ కథను ఏ మలుపు తిప్పుతాయన్నది రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











