Gunde Ninda Gudi Gantalu February 13th Episode:రవి-శృతి జీవితంలో కలకలం.. మీనాపై గుణ దాడి.. రెచ్చిపోయిన బాలు..
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ భావోద్వేగాలు, షాకింగ్ సన్నివేశాలతో సాగింది. బాలు-మీనా కలిసి రాజేష్ తల్లిదండ్రుల షష్టిపూర్తి వేడుకలకు చేరుకున్నా.. అక్కడ కనిపించిన దృశ్యాలు ఇద్దరినీ షాక్‌కు గురిచేశాయి. కనీస ఏర్పాట్లు లేకపోవడం, ఆకలితో ఉన్న రాజేశ్ తల్లిదండ్రులు 'అమ్మా... అన్నం పెట్టండి' అని అడగడం పరిస్థితి తీవ్రతను చాటిచెప్పింది. రాజేష్ భార్య కన్నీళ్లతో తన బాధ చెప్పగా, అసలు నిజం బయటపడుతుంది. లోపలికి వెళ్లిన బాలు-మీనాలకు మద్యం మత్తులో ఊగుతున్న రాజేష్, అతని గ్యాంగ్‌ను చూసి విస్తుపోతారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, మద్యం ను ఏరులై పారించడం, డబ్బును వృథాగా ఖర్చు చేయడంతో రాజేష్ ప్రవర్తన బాలును తీవ్రంగా కలచివేస్తుంది. పైగా 'నీ లక్ష రూపాయలతో ఎంత గ్రాండ్‌గా చేశానో చూడు'అంటూ బాలుకి గొప్పలు చెప్పడం ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది.
అలాగే..తిన్నేటప్పుడు మటన్ ముక్కలు రాలేదని గొడవ జరగడం. ఈ క్రమంలో బాలు మీద దాడి జరగడం, పరిస్థితి అర్థం చేసుకుని మీనా అతడిని బయటకు తీసుకువస్తుంది. చివరికి ఇద్దరూ ఒక్క ముద్ద కూడా తినకుండా ఇంటికి తిరుగుతారు. ఇంట్లో మీనా వ్యంగ్యంగా జరిగిన విషయాన్ని చెప్పగా, బాలు మాటలేక మౌనంగా మారిపోతాడు. ఇచ్చిన డబ్బు వృథా అయిందన్న నిజం అతడిని లోలోపల కుదిపేస్తుంది. మరోవైపు రోహిణి జీవితంలో ఊహించని మలుపు. దినేష్ అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి ఆమె కొడుకుతో ఫోటోలు దిగి పంపించడం. తిరిగి ఫోన్ చేయడంతో బెదిరిస్తూ లొకేషన్ పంపిస్తాడు. భయంతో రోహిణి అయోమయంలో నిలిచిపోతుంది. చివర్లో దాబాకు వెళ్లిన బాలు.. తన అంతరాత్మ మాటలు విని ఆత్మపరిశీలనలో పడతాడు.

Photo courtesy: Jio Hotstar
శుక్రవారం ఎపిసోడ్‌లో బాలు తీవ్ర మానసిక సంఘర్షణలో కనిపించాడు. ఫంక్షన్‌లో జరిగిన అవమానాన్ని భరించలేక మళ్లీ మందు తాగాలని దాబాకు చేరుకుంటాడు. కానీ, అక్కడ అతని అంతరాత్మే ప్రశ్నిస్తుంది. 'దైవంలాంటి పెళ్లాం మాట వినకుండా, అనవసరంగా స్నేహితులకు అప్పులు ఇచ్చి నువ్వే అప్పుల పాలవుతున్నావ్... ఇకనైనా సరిగా ఉండరా?' అంటూ గుణపాఠం చెబుతుంది. అయితే బాలు మాత్రం తాను చేసింది పని తప్పు కాదని, స్నేహితుడికి సహాయం చేయడం తప్పేమీ కాదని తనని తాను సమర్థించుకుంటాడు. ఈ క్రమంలో అంతరాత్మ మీనాకు సారీ చెప్పమని సూచించగా, ఆ మాటలు నచ్చక బాలు మద్యం సీసాతో దాడి చేయబోయి అదుపు తప్పుతాడు. చివరకు 'నేను ఏం చేస్తున్నాను?' అనే ఆలోచనలో పడిపోతాడు.
మరుసటి రోజు రాజేష్ తన తప్పు తెలుసుకుని బాలు ఇంటికి వచ్చి బాలు-మీనాలకు క్షమాపణ చెబుతాడు. ఆర్భాటంగా ఫంక్షన్ చేసి డబ్బు వృథా చేశానని, వచ్చిన బంధువులు తిని, తాగి రచ్చ చేసి, లేనిపోని నిందలు వేశారని వాపోతాడు. మీనా ముందే హెచ్చరించినా తానే పట్టించుకోలేదని ఒప్పుకుంటాడు. ఇకపై బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన అనుభవాన్ని పంచుకుంటాడు. అంతేకాదు, కట్నంగా వచ్చిన డబ్బును బాలుకు ఇచ్చి అప్పు కట్టమని చెబుతాడు. 'అప్పు ఎంత త్వరగా తీరితే అంత మంచిది... లేకపోతే వడ్డీ పాపంలా మింగేస్తుంది' అంటూ హితవు పలుకుతాడు. ఫంక్షన్‌లో జరిగిన అవమానానికి మరోసారి సారీ చెబుతాడు.
ఈ సమయంలో మీనా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అలాగే కూతురిని స్కూల్లో చేర్పించాలని సూచిస్తుంది. ఆడపిల్ల-మగపిల్ల అనే తేడా లేదని స్పష్టంగా చెబుతుంది. రాజేష్ వెళ్లిన తర్వాత బాలు 'చూశావా... స్నేహితులకు సహాయం చేస్తే డబ్బు తిరిగి వస్తుంది'అంటూ కాస్త బిల్డప్ ఇస్తాడు. దీనికి మీనా గట్టిగా స్పందిస్తూ, 'స్కూల్లో పాఠాలు నేర్చుకోక.. ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటున్నారు' అంటూ చురకలు అంటిస్తుంది. అయినా బాలు తన పట్టుదల వదలకుండా స్నేహితుడికి సహాయం చేయడం తప్పు కాదని అంటాడు. దీనికి మీనా 'నిజమైన స్నేహం అంటే అప్పులు చేసి ఆదుకోవడం కాదు... అప్పులే రాకుండా జాగ్రత్తగా చూసుకోవడమే నిజమైన స్నేహం' స్పష్టంగా చెబుతుంది .
మరోవైపు రవి జీవితంలో అనూహ్య మలుపు తిరిగింది. తన రెస్టారెంట్‌కు వచ్చిన రవికి ఊహించని షాక్ ఎదురైంది. అతడు పనిచేస్తున్న ప్లేస్‌లోకి ఓ యువతి ఎంట్రీ ఇచ్చి, 'ఇక నుంచి ఈ ప్లేస్‌కి నేనే ఇన్‌చార్జ్... నీ ఉద్యోగం కూడా పోయింది' అంటూ షాక్ ఇస్తుంది. ఈ మాటలు విన్న రవి అవాక్కవుతాడు. 'నాకు తెలియకుండా నా ఉద్యోగం ఎలా తీసేస్తారు? కారణం ఏమిటి?'అంటూ ప్రశ్నిస్తాడు. కానీ ఆ యువతి మాత్రం 'ఇక్కడ డ్రామా చేయకుండా మేనేజర్‌తో మాట్లాడుకో' అంటూ కాస్త రఫ్‌గా స్పందిస్తుంది. దీంతో రవి వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లి వివరణ కోరుతాడు. మొదట మేనేజర్ సెటైరికల్‌గా 'నిన్నే కాదు, నన్నూ తీసేశారు' అంటూ చెప్పడంతో రవి మరింత అయోమయంలో పడతాడు. అయితే వెంటనే అసలు విషయాన్ని వెల్లడిస్తూ, 'ఇకపై ఈ హోటల్ బాధ్యతలను నా కూతురికి అప్పగిస్తున్నాను. ఇక నుంచి ఆమెనే న్యూ బాస్'అని చెబుతాడు. ఆ కూతురు ఎవరో కాదు, ఇంతవరకు కిచెన్‌లో కుక్‌గా పనిచేసిన అమ్మాయే అని బయటపడటంతో అక్కడున్న సిబ్బంది మొత్తం షాక్ అవుతారు.
రవి ఆందోళనగా 'అయితే నా ఉద్యోగం ఉందా లేదా?' అని అడగగా, న్యూ బాస్ 'నీలాంటి ఉద్యోగిని ఎవరు తీసేస్తారు? నీ ప్లేస్ నీకే ఉంటుంది. టెన్షన్ పడొద్దు' అంటూ హామీ ఇస్తుంది. అంతేకాదు, ఇకపై తనను 'బేబీ' అని పిలుస్తానని చెప్పడంతో రవి కాస్త అసహజంగా స్పందించినా ఒప్పుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న శృతి ఎంట్రీ ఇస్తుంది. రవిని హగ్ చేసుకుని 'బేబీ' అంటూ షాక్ ఇస్తుంది. దీంతో లేడీ బాస్ 'నీకు పెళ్లి అయ్యిందా?' అని ప్రశ్నించగా, శృతి 'మాది లవ్ మ్యారేజ్... ఒకరంటే ఒకరికి ప్రాణం' అంటూ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది. మొత్తం సన్నివేశం చూస్తే కొత్త లేడీ బాస్ ఎంట్రీతో రవి-శృతి మధ్య విభేదాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఈ ట్రాక్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
ఇక మరోవైపు మీనా పుట్టింట్లో కలవరం మొదలైంది. మీనా తమ్ముడు శివ రౌడీ గుణతో చేరి పార్టీలు, పబ్బులు, మద్యం అంటూ తిరుగుతున్నాడు. అటు తల్లి పార్వతి కొడుకు కోసం ఎదురుచూస్తూ కంగారుపడుతుంటే, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సుమతి కూడా ఆందోళన చెందుతుంది. ఈ విషయాన్ని మీనాకు చెప్పాలని భావించినా, పార్వతి 'ఇప్పుడు అవసరం లేదు... రాత్రిపూట ఫోన్ చేస్తే బాగోదు' అంటూ అడ్డుకుంటుంది. ఇంతలోనే శివ మద్యం మత్తులో ఇంటికి చేరుకుంటాడు. ఎక్కడికి వెళ్లావు? ఇంత లేటు ఎందుకు? అని సుమతి ప్రశ్నించగా, తనను డిస్టర్బ్ చేయొద్దంటూ శివ వార్నింగ్ ఇస్తాడు. తాగొచ్చావా అని నిలదీస్తే, గుణతో బయటికి వెళ్లి అతడి పోస్ట్ చూసి ఓ పెగ్గు తాగాల్సి వచ్చిందని చెప్పుకొస్తాడు. దీంతో పార్వతి తీవ్రంగా స్పందిస్తూ, 'మద్యం జీవితంలోకి ఒక్కసారి వస్తే వదలదు... చెడు సహవాసాలకు దూరంగా ఉండి చదువుకో'అంటూ హెచ్చరిస్తుంది.
అయితే శివ మాత్రం కోపంగా అరుస్తూ, 'నేనేమైనా బాలు లాగా రోజూ తాగి తందనాలు చేస్తున్నానా? నెలకోసారి తాగితే ఇంత రచ్చా?' అంటూ ఇంట్లో నానా హంగామా చేస్తాడు. ఇలా శివ చదువును పక్కనపెట్టి చెడు అలవాట్లకు బానిస అవుతుండటంతో సుమతి, పార్వతి ఇద్దరూ తీవ్ర ఆందోళనకు గురవుతారు. మరుసటి రోజు పార్వతి మీనాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. శివ గుణతో తిరుగుతున్న విషయం, అతడి ప్రవర్తన గురించి వివరించి కన్నీళ్లతో బాధపడుతుంది. 'వాడు ప్రయోజకుడు అవుతాడని అనుకున్నా... ఇలా చెడు అలవాట్లకు బానిస అవుతాడని ఊహించలేదు'అంటూ మనోవేదన వ్యక్తం చేస్తుంది.
ఇక అప్కమింగ్ ఎపిసోడ్లలో మీనా నేరుగా గుణ దగ్గరకు వెళ్లి తన తమ్ముడు విషయంలో హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి మీనా అతడిపై చేయి చేసుకోవడం, గుణ కోపంతో మీనాను నెట్టి వేయడంతో ఆమె తలకు గాయం అయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి గుణను చితకబాదినట్లు ప్రోమోలో చూపించారు. మొత్తానికి శివ చెడు సహవాసం, మీనా కుటుంబంలో పెరుగుతున్న ఉద్రిక్తత, గుణతో ఎదురుదాడి వంటి పరిణామాలతో రానున్న ఎపిసోడ్లు మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











