Gunde Ninda Gudi Gantalu February 23th Episode: రోహిణికి మూడింది.. ప్రభావతికి గుండెపోటు.. దినేష్ మాయలో మనోజ్..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శృతి-శోభన మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. రవి-నీతు వ్యవహారంపై శోభన కూతురిని హెచ్చరించినా, శృతి మాత్రం రవిపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేస్తుంది. గతాన్ని గుర్తుచేస్తూ తల్లికి కౌంటర్ ఇవ్వడం ఈ సీన్‌కు మంచి ఎమోషన్ జోడించింది. ఇక మీనా బొమ్మల కొలువు పెట్టాలనే ఆలోచనతో ఇంట్లో సందడి మొదలవుతుంది. బాలు సరదాగా చేసిన పని కాస్త ప్రమాదంగా మారినా, చివరికి ఇద్దరూ నవ్వుతూ సర్దుకుంటారు. సత్యం మాటల మాయతో ప్రభావతిని ఒప్పించడం కామెడీ టచ్ ఇచ్చింది. డాన్స్ స్కూల్‌లో ప్రేమ జంట రొమాన్స్‌ను మీనా పట్టుకోవడం, ఆ తర్వాత వారు ప్రభావతి దగ్గర అబద్ధం చెప్పడం డ్రామాకు దారి తీసింది.
నిజం తెలుసుకోకుండా మీనాపై ప్రభావతి కోపం చూపడం ప్రేక్షకులను అసహనానికి గురిచేసింది. బొమ్మల కొలువుతో ఇంట్లో కొత్త ఉత్సాహం కనిపించినా, ఖర్చుల విషయంలో మనోజ్-రోహిణి అసూయ మొదలవుతుంది. చివరకు బాలు రూ.15,000 ఖర్చును అందరికీ సమానంగా పంచడంతో పరిస్థితి కాస్త చల్లారుతుంది. శృతి తన వాటా ఇచ్చి రవి మిగతా డబ్బు ఇస్తాడని చెప్పడం మెచ్యూరిటీగా అనిపించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో బొమ్మల కొలువు పేరుతో ఆనందం మొదలైనప్పటికీ, అదే సమయంలో అపార్థాలు, అసూయలు, చిన్న గొడవలు కూడా తెరపైకి వచ్చాయి. రాబోయే ఎపిసోడ్లలో ఇవే పెద్ద మలుపులకు దారి తీసేలా కనిపిస్తున్నాయి.

సోమవారం ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇచ్చింది.సీరియల్ ప్రారంభంలోనే మీనా బొమ్మల కొలువు ఏర్పాట్లలో బిజీగా ఉంటుంది. అదే సమయంలో ప్రభావతి వచ్చి ఆమె ప్రయత్నాలకు అడ్డు పడేలా ప్రవర్తిస్తుంది. ఈ వ్యవహారాన్ని ఇంట్లో ఉన్నవాళ్లంతా గమనిస్తుంటారు. ఇంతలో బాలు వచ్చి 'ఇవి సరిపోతాయా?' అని అడగడంతో, ఇంకా బొమ్మలు కావాలంటూ మీనా చెబుతుంది. కానీ ప్రభావతి మాత్రం ఎలాగైనా బొమ్మల కొలువును అడ్డుకోవాలన్న ఉద్దేశంతో నానా మాటలు అంటుంది.
ఇక్కడే మీనా డాన్స్ స్కూల్‌లో ప్రభావతి శిష్యులు ప్రేమ్‌కుమార్ ప్రవర్తనను బయటపెడుతుంది. వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పినా, ప్రభావతి మాత్రం తన శిష్యులు అలాంటివారు కాదంటూ వారికే సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, తానే కొత్త బంగిమ నేర్పించానని, అందులో భాగంగానే వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారని సమర్థించుకుంటుంది.
ఈ క్రమంలో మనోజ్ రంగంలోకి దిగి, 'డాన్స్ గురించి తెలియని వాళ్లు మాట్లాడొద్దు' అంటూ తల్లి తరఫున నిలబడి మీనాను తక్కువ చేసి మాట్లాడతాడు. దీంతో బాలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'నీకు పూలు అల్లడం వచ్చా? వంటలు చేయడం వచ్చా? డ్రైవింగ్ చేయడం వచ్చా?' అంటూ మనోజ్, ప్రభావతిని నిలదీస్తాడు. ఎవరి పని వారి గొప్పని, అనవసరంగా తక్కువ చేసి మాట్లాడొద్దని గట్టిగా చెబుతాడు. అంతలో సత్యం వచ్చి అసలు ఏం జరిగిందో అడుగుతాడు. ప్రభావతి మాటల్లో విషయాన్ని మళ్లించేందుకు ప్రయత్నించినా, మీనా మాత్రం పవిత్రమైన డాన్స్ స్కూల్‌లో స్టూడెంట్స్ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని, డ్యాన్స్ స్కూల్ ను అపవిత్రం చేస్తున్నారని చెబుతుంది. దీంతో సత్యం మీనాకు మద్దతుగా నిలబడి, 'ఇలాంటి విషయాలను నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత నీదే' అంటూ ప్రభావతికి కఠిన హెచ్చరిక ఇస్తాడు.
ఇంట్లో జరిగిన గొడవ తర్వాత ప్రభావతి కోపంతో డాన్స్ స్కూల్‌కు వెళ్లిపోతుంది. అక్కడ తన స్నేహితురాలు మీనాక్షితో జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ బాధపడుతుంది. అప్పటికే ప్రేమ్ కుమార్ ప్రవర్తనపై అనుమానం ఉన్న మీనాక్షి, 'ఇప్పటికైనా నిజం అర్థం చేసుకో... వాళ్ల వ్యవహారంలో ఏదైనా తేడా జరిగితే నువ్వు బాధ్యురాలివి కాదని చెప్పుకోలేవు'అంటూ ప్రభావతిని హెచ్చరిస్తుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయినా, పోలీసులు వస్తే ముందు నీ అడ్రస్ ఇస్తానంటూ భయపెడుతుంది. ఈ మాటలతో ప్రభావతి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది. ముందుజాగ్రత్తగా తన శిష్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుని, ఆ ప్రేమ జంటను ఇకపై దూరంగా ఉండాలని హెచ్చరిస్తుంది. దీంతో తమ వ్యవహారం మాస్టర్‌కు తెలిసిపోయిందని ఆ జంటకు అర్థమవుతుంది. ఈ ట్రాక్ ఏ మలుపు తిరుగుతుందో రాబోయే ఎపిసోడ్లలో చూడాల్సిందే.
మరోవైపు మీనా-బాలు కలిసి వృద్ధ దంపతులను కలవడానికి వెళ్లడం భావోద్వేగంగా మారింది. వారి కోసం ప్రత్యేకంగా వంట చేసి తీసుకెళ్లిన మీనాను చూసి ముసలి దంపతులు కంటతడి పెడతారు. 'మమ్మల్ని మా వాళ్లే దూరం పెట్టారు... ఈ దిక్కులేని వాళ్లకు దేవుడే మిమ్మల్ని పంపించాడు' అంటూ ఎమోషనల్ అవుతారు. ఈ సందర్భంగా మీనా బొమ్మల కొలువు కోసం మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పడంతో, ఆ వృద్ధ దంపతులు తమ దగ్గర ఉన్న మట్టి బొమ్మను ఆమెకు బహూకరిస్తారు. అనుకోని ఈ కానుకతో మీనా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది.
సోమవారం ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామాకు చేరుకుంది. మరోవైపు మనోజ్ తన వ్యాపారం డల్‌గా ఉందని నిరాశలో ఉంటాడు. ఈ విషయాన్ని గమనించిన రోహిణి... 'ఎప్పుడూ స్పోర్టివ్‌గా ఉండాలి... అదే నిజమైన వ్యాపారవేత్త లక్షణం'అంటూ భర్తను మోటివేట్ చేస్తుంది. అదే సమయంలో ఓ కస్టమర్ షాప్‌కు వచ్చి ఫర్నిచర్ వెరైటీస్ చూపించమని అడుగుతాడు. మనోజ్ ఎంతో శ్రమించి అన్నీ చూపించడంతో దాదాపు రూ.10 లక్షల విలువైన ఫర్నిచర్‌ను సెలెక్ట్ చేస్తాడు. ఒక్క డీల్‌తో రూ.4-5 లక్షల లాభం వస్తుందని సంబరంగా రోహిణికి చెబుతాడు.
కానీ బిల్లు ఇవ్వగానే ఆ కస్టమర్ 'వచ్చేవారం లాటరీ తగిలాక తీసుకెళ్తా' అనడంతో మనోజ్-రోహిణి షాక్ అవుతారు. కోపంతో మనోజ్ బాడీగార్డ్‌ను పిలిచి అతడిని బయటకు ఎత్తిపడేయమని ఆదేశిస్తాడు. 'మళ్లీ కనిపిస్తే చంపేస్తా'అంటూ వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇంతలో ఫకీర్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి మనోజ్‌కు ఓ చిట్టి ఇచ్చి మాయమైపోతాడు. అందులో 'గుడి దగ్గరకు రా... అసలు విషయం చెబుతా'అని ఉండటంతో రోహిణి ఇది కచ్చితంగా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ పని అని గ్రహిస్తుంది. నమ్మొద్దని చెప్పినా, మనోజ్ మాత్రం నిజం తెలుసుకోవాలని గుడికి వెళ్తాడు.
అక్కడ దినేష్ స్వామీజీ వేషంలో జాతకాలు చెబుతూ కనిపిస్తాడు. తనకు బెదిరింపు ఉత్తరాలు వస్తున్నాయని మనోజ్ చెప్పగానే, స్వామీజీ "నీ భార్య పేరు జన్మనామం ప్రకారం 'క'తో మొదలవుతుంది... ఇప్పుడు 'రో'తో పిలుస్తున్నారు" అంటూ చెప్పడంతో మనోజ్ పూర్తిగా నమ్మేస్తాడు. ఆపై మరో లేఖ ఇచ్చి 'ప్రభావతికి గుండెపోటు... మనోజ్ ఆత్మహత్య'అంటూ రాసి ఉండటంతో పాటు, పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాత్ర పేరు తన పేరని సంకేతం ఇస్తాడు. దీంతో ఈ పని చేసింది బాలు అని మనోజ్ ఫిక్స్ అయిపోతాడు.
కోపంతో ఇంటికి వచ్చి అందరి ముందు బాలుపై ఆరోపణలు చేస్తాడు. మీనా మాత్రం బాలు అలాంటి వ్యక్తి కాదని గట్టిగా వాదిస్తుంది. సత్యం కూడా మీనాకు మద్దతుగా నిలబడి 'బాలు ఏదైనా ఉంటే ముఖాముఖి చెబుతాడు'అని స్పష్టం చేస్తాడు. అయినా ప్రభావతి ఇదే అవకాశంగా తీసుకుని బాలు-మీనా ఇక ఇంట్లో ఉండకూడదని ఆదేశిస్తుంది. మీనాపై లేనిపోని నిందలు వేస్తుంది. దీనికి మీనా కూడా ఘాటుగా స్పందిస్తూ.. 'ఈ ఇంటిపై మీకు ఎంత హక్కో మాకూ అంతే... మమ్మల్ని వెళ్లిపొమ్మని చెప్పే అధికారం మీకెక్కడిది?' అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.
మరోవైపు ప్రభావతి మాత్రం 'మనోజ్ ఎదుగుతుంటే బాలు ఓర్వలేక బెదిరింపు లేఖలు రాస్తున్నాడు'అంటూ మరింత రెచ్చగొడుతుంది. వెంటనే బాలు ఇంటికి రావాలని మీనాకు చెబుతుంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందేమోనని మీనా ముందే బాలుకు వార్నింగ్ ఇస్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో నకిలీ స్వామీజీ మాయ, బెదిరింపు లేఖలు, బాలు మీద అనుమానాలు, బాలు-మీనా ఇంటి నుంచి వెళ్లిపోవాలన్న ప్రభావతి నిర్ణయం కథను కీలక మలుపుకు తీసుకొచ్చాయి. రాబోయే ఎపిసోడ్లలో బాలు-మీనా నిజంగానే ఇంటి నుంచి వెళ్లిపోతారా? రోహిణి గతాన్ని బాలు తెలుసుకుంటాడా? అన్న ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications










