Gunde Ninda Gudi Gantalu February 24th Episode: బాలు పంచ్‌కు కూలిన బాడీగార్డ్.. రోహిణి ప్లాన్ ఫెయిల్..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. బొమ్మల కొలువు ఏర్పాట్లలో బిజీగా ఉన్న మీనాకు ప్రభావతి అడ్డు పడే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో బాలు వచ్చి ఇంకా బొమ్మలు కావాలన్న మీనా మాటకు మద్దతుగా నిలుస్తాడు. డాన్స్ స్కూల్‌లో ప్రభావతి శిష్యుల ప్రవర్తనపై మీనా ప్రశ్నించగా, ప్రభావతి మాత్రం వారికే సపోర్ట్ చేస్తుంది. మనోజ్ కూడా తల్లి వైపు నిలబడి మీనాను తక్కువగా మాట్లాడడంతో బాలు మండిపడి... ఎవరి పనిని వాళ్లే గౌరవించాలని గట్టిగా హెచ్చరిస్తాడు. సత్యం కలగజేసుకుని అసలు విషయం తెలుసుకుని మీనాకు మద్దతుగా నిలబడి ప్రభావతిని హెచ్చరిస్తాడు. కోపంతో డాన్స్ స్కూల్‌కు వెళ్లిన ప్రభావతి అక్కడ మీనాక్షి హెచ్చరికలతో ఆలోచనలో పడుతుంది. ముందుజాగ్రత్తగా ప్రేమ జంటను దూరంగా ఉండమని ఆదేశిస్తుంది.
మరోవైపు మీనా-బాలు వృద్ధ దంపతులను కలిసి వారికి భోజనం అందిస్తారు. దేవుడే పంపించాడంటూ ఆ ముసలి దంపతులు ఎమోషనల్ అవ్వగా, మీనాకు మట్టి బొమ్మను బహుమతిగా ఇస్తారు. ఇక మనోజ్ ట్రాక్ పూర్తిగా థ్రిల్లర్‌గా మారుతుంది. లాటరీ డ్రామాతో వచ్చిన కస్టమర్, ఫకీర్ వేషంలో వచ్చిన వ్యక్తి ఇచ్చిన చిట్టీ... చివరకు స్వామీజీ వేషంలో ఉన్న దినేష్ మాయ మాటలతో మనోజ్ పూర్తిగా నమ్మేస్తాడు. మరో లేఖలో ప్రభావతికి గుండెపోటు, మనోజ్ ఆత్మహత్య అంటూ రాయడంతో ఈ పని చేసింది బాలు అని ఫిక్స్ అవుతాడు. ఇంటికి వచ్చి బాలు మీద ఆరోపణలు చేయగా మీనా, సత్యం అతడిని సమర్థిస్తారు. కానీ ప్రభావతి ఇదే అదునుగా బాలు-మీనా ఇంట్లో ఉండకూడదని ఆదేశిస్తుంది. మీనా గట్టిగా ఎదురు నిలవడంతో ఇంట్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. రాబోయే ఎపిసోడ్‌లో బాలు-మీనా ఇంటి నుంచి వెళ్లిపోతారా? రోహిణి గతాన్ని బాలు తెలుసుకుంటాడా? అన్న ఉత్కంఠ పెరిగింది.

Photo courtesy: Jio Hotstar
మంగళవారం ఎపిసోడ్ మొత్తం హై వోల్టేజ్ డ్రామాతో నిండిపోయింది. తనకు వస్తున్న బెదిరింపు లెటర్ల వెనుక బాలు ఉన్నాడంటూ మనోజ్ ఇంట్లో అందరి ముందు ఆరోపణలు చేస్తాడు. దీంతో మీనా వెంటనే స్పందిస్తూ.. బాలు అలాంటి వ్యక్తి కాదని, ఏదైనా ఉంటే ముఖాముఖీ మాట్లాడే మనస్తత్వం అతనిదని స్పష్టం చేస్తుంది. ఆధారాలు లేకుండా నిందలు వేయడం సరికాదని గట్టిగా వాదిస్తుంది. అయినా మనోజ్ మాత్రం వినిపించుకోకుండా, 'ఈరోజు తాడోపేడో తేల్చుకుంటా' అంటూ తన బాడీగార్డ్‌ను ఇంట్లోకి పిలుస్తాడు. ఆ భారీ కాయాన్ని చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ప్రభావతి మాత్రం బాలు పని అయిపోయిందన్నట్టుగా సంబరపడుతుంది. మీనా మాత్రం ధైర్యంగా 'మా ఆయన గుండె ధైర్యం ఎక్కువ... ఆయనతో పెట్టుకోవద్దు'అంటూ హెచ్చరిస్తుంది.
మనోజ్ బాలుకు ఫోన్ చేయమని మీనాను ఆదేశిస్తాడు. ఫోన్ చేసేందుకు బయటికి వెళ్లిన మీనా, అదే సమయంలో బాలు ఇంటికి చేరుకుంటాడు. గేటు దగ్గర జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న బాలు ఆవేశంతో లోపలికి దూసుకొస్తాడు. "నేను నీకు బెదిరింపు లెటర్లు రాసానా? నీకు నేను అవసరమా?" అంటూ మనోజ్‌ను నిలదీస్తాడు. బాడీగార్డ్ అండ ఉందన్న ధైర్యంతో మనోజ్ కాస్త రెచ్చిపోతాడు. బాలు చేయి చేసుకోబోతుండగా బాడీగార్డ్ అడ్డుపడతాడు. అంతే... బాలు ఒక్క గుద్దుతో బాడీగార్డ్‌ను నేలకూల్చేస్తాడు. ఆ దెబ్బకు అతడు చిన్నపిల్లాడిలా ఏడవడంతో ఇంట్లోవాళ్లంతా కంగుతింటారు. అపమానంతో మండిపోయిన మనోజ్ 'షాప్ మెయింటెనెన్స్ మొత్తం నీకే పెట్టాను... ఒక్క దెబ్బకే కూలిపోయావా?' అంటూ బాడీగార్డ్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు.
ఇంట్లో జరిగిన గొడవ తర్వాత బాలు నేరుగా మనోజ్‌ను నిలదీస్తూ 'అసలు ఎవడు నీకు లెటర్లు రాసింది? ఎందుకు నా మీద నిందలు వేస్తున్నావ్?'అని ప్రశ్నిస్తాడు. దీంతో మనోజ్ తనకు ఫకీర్ వేషంలో ఓ వ్యక్తి లెటర్లు ఇచ్చిన విషయాన్ని బయటపెడతాడు. దీనిపై బాలు మండిపడుతూ.. 'ఈ విషయం అప్పుడే చెప్పుంటే వాడు ఎవడో నీ ముందే క్లారిటీ ఇచ్చేవాడిని కదా... అనవసరంగా ఇంత గొడవ ఎక్కడిదాకా తీసుకొచ్చారు?' టూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇక్కడే సత్యం కూడా కలగజేసుకుని ఇలాంటి కీలక విషయాన్ని ముందే చెప్పాల్సిందని మనోజ్‌కు క్లాస్ పీకుతాడు. రవి అయితే 'ఇది చిన్న విషయం కాదు... తప్పకుండా పోలీస్ కేసు పెట్టాలి' అని స్పష్టం చేస్తాడు. శృతి కూడా అదే మాట చెబుతూ 'వాళ్లను స్టేషన్‌కు తీసుకెళ్తే అన్ని విషయాలు బయటపడతాయి'అంటూ గట్టిగా అంటుంది.
అయితే ఈ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. పోలీస్ కేసు పెడితే షాప్‌కు పోలీసులు తిరుగుతారని, అలా అయితే బిజినెస్ దెబ్బతింటుందని చెప్పి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. కానీ బాలు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. 'పోలీస్ కేసు వద్దంటోంది ఎందుకు? లెటర్లు రాసింది ఎవరో బయటపడితే ఎవరికైనా ఇబ్బందా?' అంటూ మీనాతో తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. మీనా కూడా రోహిణి పాత్రపై డౌట్ వ్యక్తం చేస్తుంది. దీంతో బాలు 'ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను... ఎలాగైనా వాడు ఎవడో పట్టుకుంటా... వాడి జాతకం బయటపెడతా' అంటూ ఛాలెంజ్ విసురుతాడు.
ఈ మాటలన్నీ గోడ చాటుగా విన్న రోహిణి లోపల భయం మొదలవుతుంది. వెంటనే తన స్నేహితురాలు దివ్యను కలిసి ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెబుతుంది. బాలు ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడని, అతడికి చెక్ పెట్టాలంటే అతని ఫోన్‌లో ఉన్న శివ వీడియోను తప్పకుండా కొట్టేయాలని ప్లాన్ వివరిస్తుంది. మొదట దివ్య అంగీకరించకపోయినా, రోహిణి రిక్వెస్ట్ చేయడంతో చివరకు రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకుంటుంది.
మరోవైపు తన అన్న మనోజ్‌కు బెదిరింపు లెటర్లు రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే పట్టుదలతో బాలు నేరుగా గుడికి వెళ్తాడు. అక్కడ ఆలయ సిబ్బందిని ప్రశ్నించగా, ఇటీవల ఓ వ్యక్తి స్వామి వేషంలో వచ్చి అన్నదానం, యజ్ఞాలు చేస్తానంటూ భక్తుల నుంచి విరాళాలు వసూలు చేశాడని చెబుతారు. ఆలయ పెద్దలు అనుమానం వ్యక్తం చేయగానే పారిపోవడానికి ప్రయత్నించాడని, ఈ క్రమంలో అక్కడివారు అతడిని చితకబాదినట్టు వివరించారు. దాడి సమయంలో తీసిన వీడియోలను బాలుకు చూపిస్తారు. వీడియోలో కనిపించిన వ్యక్తిని చూసి బాలు షాక్ అవుతాడు. ఇదే వ్యక్తి గతంలో ఓ యాక్సిడెంట్ కేసులో కూడా కనిపించాడని గుర్తు చేస్తూ, ఇకముందు అతడు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆలయ సిబ్బందిని కోరుతాడు. అంతేకాదు, ఆ వీడియోను తన స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేసి ఆ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాలని నిర్ణయిస్తాడు.
ఇక మరోవైపు రోహిణి ప్లాన్ ప్రకారం దివ్య రంగంలోకి దిగుతుంది. బాలు కారును బుక్ చేసి, కారులో ఎక్కిన వెంటనే అతడితో మాటలు కలుపుతూ ఫోన్ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బాలు దివ్యను చూసిన వెంటనే రోహిణి గురించి ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తాడు. దీంతో దివ్యకు టెన్షన్ మొదలవుతుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పి ఒకసారి ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. తెలిసిన వ్యక్తి కదా అని బాలు ఫోన్ ఇస్తాడు. అయితే ఫోన్ చేయకుండా ఫోన్‌లో ఏదో వెతుకుతున్నట్టు కనిపించడంతో బాలు అనుమానపడతాడు. 'ఫోన్ చేస్తావా? లేక ఇంకేదైనా చేస్తున్నావా?' అని నిలదీయగా, నెంబర్ గుర్తు రావడం లేదని మాటల్లో పడుతుంది దివ్య. కీలకమైన శివ వీడియో దొరికే సమయానికి మీనా నుంచి కాల్ రావడంతో పరిస్థితి మారిపోతుంది. ఫోన్ ఇవ్వమని దివ్య ఒత్తిడి చేసినా, బాలు ముందుగా మీనాతో మాట్లాడుతానని ఫోన్ తీసుకుంటాడు.
మీనాతో మాట్లాడుతున్న బాలు 'మనోజ్‌కు లెటర్లు రాసిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. వాడిని పట్టుకుని అసలు విషయం తెలుసుకుంటా' అని చెబుతాడు. ఈ మాటలు విన్న దివ్య మరింత కంగారు పడుతుంది. తన గమ్యస్థానం రాగానే త్వరగా దిగిపోతుంది. వెంటనే రోహిణికి ఫోన్ చేసి ప్లాన్ ఫెయిల్ అయిందని, శివ వీడియోను డిలీట్ చేయలేకపోయానని చెబుతుంది. అంతేకాదు, బాలకు దినేష్ విషయం తెలిసిపోయినట్టే ఉందని చెప్పడంతో రోహిణి గుండె ఝల్లుమనిపోతుంది. మొత్తానికి బాలు దర్యాప్తు వేగం పెంచగా, రోహిణి ప్లాన్ పూర్తిగా ఫెయిల్ కావడంతో కథ మరో కీలక మలుపు తిరిగింది.
మరోవైపు.. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనానికి కూర్చుంటారు. అదే సమయంలో మనోజ్ వచ్చి కూర్చోగానే మీనా అతడికి వడ్డించకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో మనోజ్ 'కండ్లు కనిపించడం లేదా? అందరూ మహారాణులు అయిపోయారా?'అంటూ మాట జారేస్తాడు. దీనికి మీనా గట్టిగా స్పందిస్తూ 'నేను అత్తమామలకు, నా మొగుడికి మాత్రమే సేవలు చేస్తాను... మీలాంటి వారికి కాదు'అంటూ ఘాటుగా చెప్పేస్తుంది. ఈ సమయంలో ప్రభావతి కలగజేసుకుని మీనాను ప్రశ్నించగా, మీనా మరింత ధైర్యంగా ఎదురు సమాధానం ఇవ్వడంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇంతలో బాలు వచ్చి ఏం జరుగుతోందని అడిగినా, మీనా మాట చెప్పకుండా చేతిలో ఉన్న గ్లాసును నీళ్లలో గట్టిగా కొడుతుంది. దీంతో బాలు కూడా మౌనంగా మారిపోతాడు.
అయితే బాలు వెంటనే కీలక విషయం బయటపెడుతూ మనోజ్‌కు లెటర్లు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలిసిపోయిందని, మరో నాలుగు రోజుల్లో వాడిని పట్టుకుని అసలు నిజం బయటకు తీస్తానని ప్రకటిస్తాడు. సత్యం వెంటనే పోలీస్ కేసు పెట్టమని సలహా ఇస్తాడు. కానీ రోహిణి మాత్రం పోలీసులు వస్తూ పోతే బిజినెస్ దెబ్బతింటుందని చెప్పి కేసు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. దీనిపై బాలు గట్టిగా స్పందిస్తూ 'ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టను. వాడు ఎందుకు నా వెంట పడుతున్నాడు? మనోజ్‌కు ఎందుకు లెటర్లు రాశాడు? ఈ ఇంట్లో ఎవరికైనా వాడితో సంబంధం ఉందా?' అన్నీ పూర్తిగా తేలుస్తానంటూ ఇన్‌డైరెక్ట్‌గా రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో రోహిణి ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది.
మరోవైపు శృతి, రవి బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యంలో రవి బాస్ నీతూ కారు చెడిపోయి లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. శృతి వద్దనుకున్నా, బాస్ కదా అని రవి బైక్ ఆపేస్తాడు. క్యాబ్ బుక్ కావడం లేదని నీతూ చెప్పడంతో శృతిని బైక్ దింపించి ఆమెను ఎక్కించుకుంటాడు. అర్జెంట్‌గా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటూ నీతూ రవితో కావాలనే అతి చేస్తుంది. ఇది చూసిన శృతికి కోపం మండిపోతుంది.
ఈ పరిస్థితిని గమనించిన రవి కూడా లోలోపల భయపడుతున్నట్టుగా కనిపిస్తాడు. ఈ రాత్రి తనకు "కాలరాత్రే" అనిపిస్తుందన్న భావన అతడిలో మొదలవుతుంది. మొత్తానికి నేటి ఎపిసోడ్‌లో మీనా ఆగ్రహం, బాలు దర్యాప్తు నిర్ణయం, రోహిణి భయం, నీతూ లిఫ్ట్ డ్రామాతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎపిసోడ్లలో లెటర్ల వెనుక నిజం బయటపడుతుందా? రోహిణి పాత్ర వెలుగులోకి వస్తుందా? శృతి-రవి మధ్య అపార్థాలు పెరుగుతాయా? అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగింది.


Click it and Unblock the Notifications











