Gunde Ninda Gudi Gantalu March 2nd Episode: నీలకంఠంకి ఫ్యూజులు ఔట్..రోహిణి ఫ్లాన్ ఫెయిల్.. మౌనికపై సంజూ నిందా.
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కామెడీ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా సాగింది. పూజా పనుల్లో మునిగిపోయిన బాలు తన ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి మర్చిపోతాడు. ఆ ఫోన్‌లో శివకు సంబంధించిన కీలక వీడియో ఉందని తెలుసుకున్న రోహిణి దాన్ని దొంగిలించి డిలీట్ చేయాలని ప్లాన్ వేస్తుంది. కానీ గందరగోళంలో ఫోన్‌ను దాచిన చోటు నుంచి ఒక చిన్నారి తీసుకెళ్లడంతో ఆమె ప్లాన్ తారుమారవుతుంది. ఆ పిల్ల ఫోన్ ఇవ్వకుండా హంగామా చేయడం కామెడీని పండిస్తుంది. చివరికి ఐస్‌క్రీమ్ ఆశ చూపించి బాలు ఫోన్ తిరిగి తెచ్చుకుంటాడు. రోహిణి ఆశలు అడియాశలవుతాయి.
ఇక పూజకు వచ్చిన సంజును బాలు ఎంతో గౌరవంగా ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 'విషం కాదు బావా... నా ప్రేమ కలిపాను' అంటూ జ్యూస్ ఇచ్చిన సీన్ నవ్వులు పూయిస్తుంది. ప్రభావతి పాట పాడే ఎపిసోడ్‌లో కామాక్షి, సుశీలమ్మ సెటైర్లు ఎపిసోడ్‌కి హైలైట్ అయ్యాయి. మీనా పాడిన భక్తి గీతం మాత్రం ఇల్లంతా ప్రశాంతత నింపుతుంది.ఎపిసోడ్‌కు అసలైన ట్విస్ట్ మౌనిక గర్భవతి అని తెలిసిన సందర్భం. సుశీలమ్మ ప్రకటించగానే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. బాలు సంబరపడిపోతూ సంజును హత్తుకుని థ్యాంక్స్ చెబుతాడు. సంజు మనసులోనూ మార్పు సంకేతాలు కనిపిస్తాయి. చివరగా బాలు-మీనా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఎపిసోడ్ ముగియడం భావోద్వేగానికి తాకింది.

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ఆనందాలు, అవమానాలు కలగలిపిన రసవత్తరంగా సాగింది. మౌనిక ప్రెగ్నెంట్ అనే శుభవార్త ఇంట్లో తెలిసిన క్షణం నుంచే కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ముఖ్యంగా బాలు, మీనా ఆనందానికి అవధులు ఉండవు. ఇంటంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. మౌనిక గర్భవతి అనే విషయం తెలియగానే అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. బాలు తన బావను పిలిచి, "నా చెల్లిని బాగా చూసుకో" అంటూ మనస్ఫూర్తిగా కోరుతాడు. అయితే సంజీవ్ మాత్రం లోలోపల షాక్‌లో ఉంటాడు. మౌనికపై ఉన్న అనుమానాలను బయటపెట్టకుండా, బయటికి సంతోషంగా నటిస్తూ ఇంటికి వెళ్తాడు. అతని మనసులో మాత్రం అనేక ప్రశ్నలు తచ్చాడుతుంటాయి.
మరోవైపు నీలకంఠ తన ప్లాన్ ప్రకారం మౌలిక రిపోర్టులు డాక్టర్ నుంచి తెప్పించుకుంటాడు. రిపోర్టులు చూసి తాను అనుకున్నట్టే జరిగిందని అనుకుంటూ తెగ సంబరపడతాడు. "మౌనిక తల్లి కాలేదు.. ఇక ఇంటి నుంచి వెళ్లగొట్టి నా కొడుకుకు మరో పెళ్లి చేస్తా" అంటూ మనసులో కుట్రల పన్నాగాలు వేస్తాడు. వెంటనే తన భార్య సువర్ణను పిలిచి స్వీట్ చేయమంటాడు. అయితే ఆ సమయానికే సంజయ్, మౌనిక ఎంట్రీ ఇస్తారు. మౌనిక తన అత్తయ్య సువర్ణతో మాట్లాడుతూ, "మీరు నానమ్మ కాబోతున్నారు" అంటూ శుభవార్త చెబుతుంది. ఆ మాట విన్న నీలకంఠ ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి. అతని కలలు ఒక్కసారిగా కూలిపోతాయి. కానీ సువర్ణ మాత్రం అమితానందంతో మౌనికను ఆలింగనం చేసుకుని, ఆమె కష్టాలు ఇక తీరుతాయని ఆశిస్తుంది. వెంటనే స్వీట్ చేసి అందరితో సంతోషాన్ని పంచుకుంటుంది.
ఇక పూజా కార్యక్రమం సందర్భంగా రోహిణి తన అత్తయ్య కోసం మలేషియా నుంచి ప్రత్యేకంగా చీర తెప్పించానంటూ బిల్డప్ ఇస్తుంది. ఆ చీరను చూసిన ప్రభావతి గతంలో ఇలాంటి చీర ఎప్పుడూ కట్టలేదని మురిసిపోతుంది. రోహిణి తన అత్తను ఇంప్రెస్ చేయడానికి చేసిన ఈ ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సన్నివేశంలో బాలు, ప్రభావతి రియాక్షన్‌ను ఇమిటేట్ చేయడం ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది.
పూజలో భాగంగా మీనా తన బస్తీ వారిని కూడా ఆహ్వానిస్తుంది. అయితే వారిని చూసిన ప్రభావతి మండిపడుతూ, "ఇవ్వాళ్లెవరు? ఎందుకు వచ్చారు?" అంటూ కించపరుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన సుశీలమ్మ, "వారిని మీనా పిలిచింది.. నాకు తెలుసు" అంటూ సమర్థిస్తుంది.
మీనా వారికీ వాయనం ఇవ్వడానికి ప్రయత్నించగా, ప్రభావతి హేళనగా మాట్లాడుతుంది. "ఇక పూజ కాలేదు.. ఇంకా చాలామంది రావాలి.. మీకు తర్వాత ఇస్తాం" అంటూ వారిని చిన్నబుచ్చుతుంది. వారంతా సోఫాలో కూర్చోవడానికి ప్రయత్నించగా, "కింద కూర్చోండి" అంటూ మరోసారి అవమానిస్తుంది. ఈ వ్యవహారాన్ని గమనించిన సుశీలమ్మ బంధువు, డాక్టర్ ఇక సహించలేక గట్టిగా క్లాస్ పీకుతుంది. ముందుగా మిమ్మల్ని డాక్టర్‌కి చూపించాలి. మీ మెదడు సరిగా ఉందా? గుండె పని చేస్తుందా? సాటి మనిషిని గౌరవించలేని మీరు మనిషేనా? మానవత్వం ఉందా?" అంటూ తీవ్రంగా నిలదీస్తుంది. ఆమె మాటలకు అక్కడున్నవారు చప్పట్లు కొడతారు. అవమానంగా భావించిన ప్రభావతి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇదిలా ఉంటే.. బాలు ఫోన్‌లో శివకు సంబంధించిన కీలక వీడియో ఉందని తెలుసుకున్న రోహిణి, దాన్ని ఎలా కైవసం చేసుకోవాలా అని ఆలోచనల్లో పడుతుంది. ఇదే సమయంలో గుణ ఎంట్రీ ఇస్తాడు. తాను ఫామ్ హౌస్ బయటే ఉన్నానని, "ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ వీడియో పంపించు" అంటూ ఆర్డర్ వేస్తాడు. గుణ టోన్ చూస్తే విషయం ఎంత సీరియస్‌గానో అర్థమవుతుంది. అప్పుడే రోహిణి ఫ్రెండ్ విద్య బాలు ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. రోహిణికి వెతుకుతున్న తీగ దొరికినట్టే అనిపిస్తుంది. కానీ ఫోన్ ఓపెన్ చేయగానే అనేక వీడియోలు కనిపిస్తాయి. ఏది శివకు సంబంధించినదో అర్థం కాక ఒక్కో వీడియోను చెక్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో శివ దొంగతనం చేస్తున్న వీడియో కూడా కంటపడుతుంది. అది చూసి రోహిణి తెగ సంబరపడుతుంది. 'ఇప్పుడే బాలు-మీనాల సంతోషానికి చెక్' అంటూ తనలో తాను హర్షం వ్యక్తం చేస్తుంది. అయితే ఆ సంబరంలో అసలు వీడియో ఏదో సరిగా సెలెక్ట్ చేయకుండా మరో వీడియోను సెలెక్ట్ చేసి తన ఫోన్‌కు పంపించుకుంటుంది. వెంటనే గుణకు కాల్ చేసి, "శివ వీడియో పంపించాను" అని చెబుతుంది. కానీ గుణ వీడియో ఓపెన్ చేసి షాక్ అవుతాడు. అందులో మనోజ్ గుడి దగ్గర అడుక్కుంటూ కనిపిస్తాడు! వెంటనే రోహిణిని కాల్ చేసి, "ఇదేనా శివ వీడియో? మరోసారి చెక్ చేసుకో" అంటూ క్లాస్ పీకుతాడు. ఇలా ఉంటే దినేష్ విషయంలో తాను సహాయం చేయలేనని హెచ్చరిస్తాడు. అక్కడితో ఆగకుండా, ఇక నీ ఇష్టం.. నేను డైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తా అంటూ గుణ కఠినంగా చెబుతాడు. దీంతో రోహిణి ఆశలు అడుగంటిపోతాయి.
ఈ సమయంలో విద్య, 'బాలు-మీనాల విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావ్' అంటూ రోహిణికి సలహా ఇస్తుంది. కానీ రోహిణి వినదు. 'నేను వెళ్లే దారిలో ఎన్నో రాళ్లు, రప్పలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ వెళ్లాలి. నా సంతోషం కోసం ఏదైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా' అంటూ తన కన్నింగ్ మెంటాలిటీ బయటపెడుతుంది. 'నీ కర్మను దేవుడే మార్చలేడు. చూశావు కదా, మంచి చేసే వారికి మంచే జరుగుతోంది. నువ్వు బాలు-మీనాలకు చెడు చేయాలని చూసావ్.. కానీ దేవుడు వారి పక్షంలో ఉన్నాడు' అంటూ హెచ్చరిస్తుంది.
ఇంతలో బాలు, మీనాలు సరదాగా మాట్లాడుకుంటూ అక్కడికి వస్తారు. రోహిణి చేతిలో తన ఫోన్ కనిపించగానే బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు.
'ఈ ఫోన్ నీ చేతికి ఎలా వచ్చింది?'అని ప్రశ్నిస్తాడు. రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. వెంటనే మీనా, 'నేనే విద్యకు ఫోన్ ఇచ్చాను" అంటూ పరిస్థితిని సమర్థించేందుకు ప్రయత్నిస్తుంది. విద్య కూడా 'నేనే రోహిణికి ఇచ్చాను'అంటూ గందరగోళంగా సమాధానం చెబుతుంది. 'నా ఫోన్ నాకు ఇవ్వకుండా ఇందులో మీరేం చేస్తున్నారు?' అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నతో రోహిణి గుండెల్లో గుబులు మొదలవుతుంది. విషయం బయటపడుతుందా? తాను చేసిన తప్పు బయటకు వస్తుందా? అనే భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.
మరోవైపు. తాను త్వరలో తల్లి కాబోతున్నాననే ఆనందంతో మౌనిక పుట్టబోయే బిడ్డ కోసం కలలు కంటుంది. ఆ బిడ్డ ఎలా ఉండాలి, తన జీవితంలో ఎలా మార్పులు వస్తాయి అన్న ఆలోచనలతో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తుంది. ఇంతలో అత్తయ్య సువర్ణ వచ్చి ఆమె యోగక్షేమాలు అడుగుతుంది. 'తిన్నావా? ఇప్పుడు నువ్వు ఒంటరి మనిషివి కాదు' అంటూ ప్రేమగా పలుకరిస్తుంది. మౌనిక మాత్రం 'నాకు ఆకలిగా లేదు అత్తయ్య' అంటుంది. సువర్ణ కోడలితో 'ఇకపై ప్రతి విషయంలో సంతోషంగా ఉండు. కష్టమైనా, ఇబ్బందైనా మనసు దాకా తీసుకోకు. ఏ సమస్య ఉన్నా నాతో పంచుకో. పుట్టబోయే బిడ్డ బాగుండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి. బలమైన ఆహారం తీసుకోవాలి'అంటూ తల్లిలా జాగ్రత్తలు చెబుతుంది. ఆ మాటలు మౌనికకు ధైర్యాన్ని ఇస్తాయి. ఇంట్లో కనీసం అత్త తనకు అండగా ఉందన్న నమ్మకం కలుగుతుంది.
అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవదు. అచ్చం ఆ సమయంలో సంజు అక్కడికి వచ్చి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తాడు. మౌనికపై అనుమానం వ్యక్తం చేస్తూ, "పుట్టబోయే బిడ్డకు తండ్రి నేను కాదేమో" అన్నట్టుగా షాకింగ్ కామెంట్ చేస్తాడు. ఆ మాట విన్న మౌనిక ఒక్కసారిగా కుంగిపోతుంది. సువర్ణ కూడా షాక్ అవుతుంది. 'నీకు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?' అంటూ సువర్ణ ఆగ్రహంతో సంజు చెంపపై కొడుతుంది. 'మౌనిక లాంటి భార్య దొరకడం నీ అదృష్టం. నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఈరోజు కూడా నీ గురించి తన పుట్టింటి వారికి చెప్పలేదు. నీ గురించి గానీ, నువ్వు పెడుతున్న ఇబ్బందుల గురించి గానీ తన అన్నయ్య బాలు తెలుసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు'అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. 'నీలాంటి వాడిని నేను ఎలా కన్నాను? నాకే అవమానంగా ఉంది' అంటూ భావోద్వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అత్త వెళ్ళిన తర్వాత మౌనిక కూడా సంజును నిలదీస్తుంది. 'మీకు కూడా అర్థం అవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారో? ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? మీరు తండ్రి కాబోతున్న విషయం ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? మీ మనస్సాక్షికి తెలియదా?'అంటూ కన్నీటి పర్యంతమవుతుంది. సంజీవ్ మాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భర్త అనుమానం, అవమానకరమైన మాటలు తట్టుకోలేక మౌనిక గదిలోకి వెళ్లి కన్నీళ్లతో పడుకుంటుంది. తల్లి కాబోతున్న ఆనందం కన్నీటి బొట్లలో కలిసిపోతుంది.
మరోవైపు.. బొమ్మల కొలువు సందర్భంగా ఇంట్లో పూజా ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా, బాలు ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. రోహిణి తల్లి సుగుణమ్మకు స్వయంగా ఫోన్ చేసి పూజకు ఆహ్వానించాలనుకుంటాడు. అయితే ఫోన్ మొదట చింటూ లిఫ్ట్ చేస్తాడు. బాలు మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన సుగుణమ్మ వెంటనే వచ్చి ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. 'రాలేను'అన్న.. బాలు ఎంతో ఆత్మీయంగా, 'మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకున్నాం.. పూజకు తప్పకుండా రావాలి' అంటూ ఆహ్వానిస్తాడు. కానీ సుగుణమ్మ మాత్రం "నేను రాలేను" అంటూ సంకోచంగా సమాధానం చెబుతుంది. ఆమె స్వరంలో స్పష్టమైన ఆందోళన కనిపిస్తుంది.
'కచ్చితంగా రావాలి. కారు పంపిస్తున్నాను' అంటూ పట్టుబడతాడు. ఈ మాటలు విన్న సుగుణమ్మ మరింత సందేహంలో పడుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచనల్లో పడుతుంది. బాలు ఫోన్ కట్ చేసిన వెంటనే సుగుణమ్మ తన కూతురు రోహిణికి కాల్ చేస్తుంది. జరిగిన విషయాన్ని చెబుతుంది. ఈ విషయం విన్న రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. 'అమ్మ ఇక్కడికి వస్తే... నా అసలు విషయాలు బయటపడతాయా?' అనే భయం ఆమెను పట్టిపీడిస్తుంది. ఇప్పటికే బాలు ఫోన్ విషయంలో అనుమానం పెంచుకున్న పరిస్థితిలో, ఇప్పుడు తన తల్లి రావడం వల్ల నిజాలు బయటపడే ప్రమాదం ఉందని రోహిణి ఆలోచనలో పడుతుంది. ఇలా నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగి, రాబోయే భాగాలపై మరింత ఆసక్తి పెంచింది.


Click it and Unblock the Notifications










