Gunde Ninda Gudi Gantalu March 3rd Episode: బాలు, మీనాలకు అవమానం.. సుగుణమ్మ శాపనార్థాలు..రోహిణి ప్లాన్ సక్సెస్
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఆనందాలు, అవమానాలతో ఉత్కంఠభరితంగా సాగింది. మౌనిక గర్భవతి అనే శుభవార్త తెలిసిన క్షణం నుంచి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బాలు, మీనా ఆనందానికి అవధులు లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అయితే సంజు మాత్రం లోలోపల అనుమానాలతో మౌనంగా ఉంటాడు. ఇదే సమయంలో నీలకంఠ రిపోర్టులు తెప్పించుకుని మౌనిక తల్లి కాలేదని భావించి కుట్రలు పన్నుతాడు. కానీ మౌనిక స్వయంగా "మీరు నానమ్మ కాబోతున్నారు" అని చెప్పడంతో అతని ఆశలు చెదిరిపోతాయి. సువర్ణ మాత్రం కోడలిని ఆలింగనం చేసుకుని సంతోషం పంచుకుంటుంది.
పూజా కార్యక్రమంలో మీనా బస్తీ వారిని ఆహ్వానించగా ప్రభావతి వారిని అవమానిస్తుంది. దీనికి డాక్టర్ గట్టిగా నిలదీసి మానవత్వంపై ప్రశ్నిస్తాడు. మరోవైపు రోహిణి, శివ వీడియో కోసం బాలు ఫోన్‌లో వెతుకుతూ పొరపాటున వేరే వీడియో గుణకు పంపి చిక్కుల్లో పడుతుంది. గుణ హెచ్చరికతో ఆమె ఆందోళన పెరుగుతుంది. ఇదే సమయంలో బాలు తన ఫోన్ గురించి ప్రశ్నించడంతో రోహిణి భయపడుతుంది. మౌనిక ఆనందాన్ని సంజు అనుమానంతో చెదరగొడతాడు. "పుట్టబోయే బిడ్డకు తండ్రి నేనేనా?" అన్న వ్యాఖ్యతో ఇంట్లో ఉద్రిక్తత చెలరేగుతుంది. సువర్ణ కొడుకును గట్టిగా మందలిస్తుంది. చివర్లో బాలు రోహిణి తల్లి సుగుణమ్మను పూజకు ఆహ్వానించడం కొత్త ట్విస్ట్‌కు దారితీస్తుంది. రాబోయే ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

Photo courtesy: Jio Hotstar
గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ ఉత్కంఠతో పాటు భావోద్వేగాల మేళవింపుగా సాగింది. బొమ్మల కొలువు పూజకు రమ్మని బాలు స్వయంగా రోహిణి తల్లి సుగుణమ్మకు ఫోన్ చేస్తాడు. 'రాలేము' అని ఆమె చెప్పినా, మరుసటి రోజు కారు పంపిస్తానంటూ పట్టుబడతాడు. దీంతో సుగుణమ్మ గందరగోళంలో పడుతుంది. వెంటనే రోహిణికి ఫోన్ చేయగా, ఆమె కోపంతో 'ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశారు?' అంటూ మండిపడుతుంది. అదే సమయంలో ఓ ప్లాన్ వేసి, తాను చెప్పినట్టు ప్రవర్తిస్తేనే పూజకు రావాలని సుగుణమ్మకు షరతు పెడుతుంది. చివరకు ఇష్టంలేకున్నా కూతురు మాట విని పూజకు రావడానికి ఒప్పుకుంటుంది.
మరుసటి రోజు బాలు, చింటూ సుగుణమ్మ కోసం కారు పంపిస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. చింటూని కృష్ణుడి వేషంలో తీసుకురావడం ఎపిసోడ్‌కు హైలెట్‌గా నిలుస్తుంది. అతని అల్లరి, అమాయకపు నవ్వులు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రభావతి శిష్యురాలు మిన్ను గోపిక వేషంలో సందడి చేస్తూ పూజా వాతావరణాన్ని మరింత రంజింపజేస్తుంది. రోహిణి తన కొడుకుని ఆ రూపంలో చూసి మురిసిపోతుంది. కానీ ఎక్కడ తానే తల్లి అన్న విషయం బయటపడుతుందోనన్న భయంతో దూరంగా ఉంటూ భావోద్వేగాలను అణచుకుంటుంది.
ఈ సంతోష క్షణాల్లో బాలు, మీనా చింటూ మీద మమకారం పెంచుకుంటారు. 'వాడిని దత్తత తీసుకుంటే భవిష్యత్తులో వాటికి కుటుంబం లభిస్తుంది' అని భావించి సుగుణమ్మను దత్తత గురించి అడుగుతారు. ఇదే సమయంలో రోహిణి ప్లాన్ ప్రకారం సుగుణమ్మ ఊహించని విధంగా స్పందించడం కథలో భారీ ట్విస్ట్‌కు దారితీస్తుంది. ఆమె రియాక్షన్‌తో ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చింటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాలు-మీనాలు సుగుణమ్మను దత్తత అంశంపై ప్రశ్నించగానే ఆమె ఊహించని రీతిలో మండిపడ్డారు.
"నేను ఎప్పుడైనా చింటూని దత్తత ఇస్తానని చెప్పానా? ఎందుకు నా మనవడిని నా దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నారు? దత్తత కావాలంటే బయట అనాధ పిల్లలు ఉన్నారు... వారిని తీసుకోండి. ఇకపై ఈ విషయం మాట్లాడొద్దు," అంటూ సుగుణమ్మ కఠినంగా స్పందించింది. ఆమె మాటలకు బాలు, మీనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గతంలో చింటూ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం గుర్తు చేస్తూ బాలు ప్రశ్నించగా, "అవును బాధపడ్డాను... కానీ దత్తత ఇస్తానని చెప్పలేదు. మాకు మీతో ఏ బంధం ఉంది?" అంటూ సుగుణమ్మ మరింత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ మాటలు మీనాకు తీవ్రంగా తగిలి కన్నీళ్లు తెప్పించాయి.
ఈ సమయంలో సుశీలమ్మ జోక్యం చేసుకుని, "ఇష్టం లేదని సున్నితంగా చెప్పొచ్చు... నలుగురి ముందు ఇలా అవమానించడం సరికాదు," అంటూ మందలించింది. కానీ మీనాక్షి మాత్రం మరింత ఘాటుగా, "దారిన పోయే వారికి జాలి చూపితే ఇలానే అవుతుంది. చింటూ తన కన్న తల్లిదగ్గరే ఉండాలి," అంటూ వ్యాఖ్యానించింది. చర్చను ముగించాలని సుశీలమ్మ సూచించినా, బాలు మాత్రం "ఒక్కసారి చింటూ అభిప్రాయం కూడా అడగండి" అన్నాడు. ప్రశ్న చింటూకు వెళ్లగా, అతడు అమాయకంగా "నేను నా తల్లితోనే ఉండాలి" అని చెప్పాడు. ఆ సమాధానం బాలు-మీనాలకు గుండెకు గుచ్చినట్లైంది. రోహిణి మనసులోనూ ఆ మాటలు లోతుగా తాకి భావోద్వేగ కలకలం రేపాయి.
విషయం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించిన సుగుణమ్మ, చింటూని వెంట తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయిస్తుంది. మీనా "కనీసం తిని వెళ్లండి" అని వేడుకున్నా, "మా గురించి ఇకపై పట్టించుకోకండి... మమ్మల్ని విడిచిపెట్టండి" అంటూ కఠినంగా చెప్పి వెళ్లిపోతుంది. బయటకు రోహిణి చెప్పినట్టే ప్రవర్తించినా, లోపల మాత్రం బాలు-మీనాలను అవమానించాల్సి వచ్చిందన్న బాధ సుగుణమ్మను వెంటాడుతుంది.
ఇదే సందర్భాన్ని ప్రభావతి వదలకుండా, "దారిన పోయే వారిపై జాలి పెడితే ఇలానే అవుతుంది" అంటూ మీనాను మాటలతో గుచ్చుతుంది. దీనికి సుశీలమ్మ గట్టిగా స్పందిస్తూ, "ఇప్పటికే వాళ్లు బాధలో ఉన్నారు... నీ పద్ధతి మార్చుకో" అంటూ చురకలు అంటిస్తుంది. మీనాక్షి కూడా తన స్టైల్‌లో సుగుణమ్మ, చింటూ తల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తే, రోహిణి వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఇంటికి చేరుకున్న తర్వాత సుగుణమ్మలో పశ్చాత్తాపం ఉప్పొంగుతుంది. బయట నలుగురి ముందు గట్టిగా మాట్లాడి వచ్చిన సుగుణమ్మ, ఇంటి గడప దాటిన వెంటనే మౌనంగా కూర్చుంది. బాలు-మీనాలను అవమానించిన మాటలు ఆమె చెవుల్లో మోగుతూనే ఉంటాయి. "ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాళ్లను నేనే అవమానించాను... ఇది క్షమించరాని నేరం" అంటూ ఆమె గుండెల్లో మంట పడుతుంది. తన చేతుల్తోనే మంచి మనుషుల మనసు నొప్పించానన్న బాధ ఆమెను కుంగదీస్తుంది.
ఇంతలో రోహిణి అక్కడికి చేరుతుంది. తల్లి ముఖంలో ఆవేదన కనిపించినా, విషయం మార్చాలన్న ఉద్దేశంతో చింటూ గురించి అడుగుతుంది. ఆ మాట విన్న వెంటనే సుగుణమ్మ ఆగ్రహంతో పేలిపోతుంది. "నాతో పాపం చేయించావు కదా! నేను కష్టాల్లో ఉన్నప్పుడు బాలు-మీనాలు నాకు అండగా నిలిచారు. నా మంచి చెడు చూసుకున్నారు. అలాంటి వారిని నీ వల్ల ఈరోజు అవమానించాల్సి వచ్చింది," అంటూ గట్టిగా నిలదీస్తుంది. రోహిణి మాత్రం తేలికగా తీసుకుంటూ, "అమ్మా, వారితో నీకేం సంబంధం?" అని ప్రశ్నిస్తుంది. ఈ మాట సుగుణమ్మ గుండెను మరింత గుచ్చుతుంది. "ఈరోజు నేను చేసిన తప్పుకు క్షమాపణలు లేవు. నాలోని అమ్మతనం చచ్చిపోయింది," అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రోహిణి మరింత కఠినంగా, "నా గురించి, నా కొడుకు గురించి వాళ్లు ఎందుకు పట్టించుకోవాలి?" అని ప్రశ్నించగానే, సుగుణమ్మ ఆగ్రహం శిఖరానికి చేరుతుంది. "నీకు ఏ హక్కు ఉంది అడగడానికి? ఈరోజైనా మా బాగోగులు అడిగావా? నేను చిన్నతనంలో నీకు పెళ్లి చేయడం నా తప్పు కావచ్చు. కానీ నువ్వు మాత్రం క్షమించరాని తప్పులు చేస్తున్నావు," అంటూ గట్టిగా చెబుతుంది. "ఉన్న తల్లిని చంపేసావు... లేని తండ్రిని దుబాయ్‌లో ఉన్నట్లు అబద్ధాలు చెబుతున్నావు. కన్న కొడుకు చేత 'అమ్మ' అని పిలిపించుకోవడానికి కూడా భయపడుతున్నావు. అబద్ధాల పునాదుల మీద ఇల్లు కట్టాలని చూస్తున్నావు. నువ్వు చేసేది సంసారం కాదు... కత్తి మీద సాము. ఒకరోజు అది నీ మెడకే పడుతుంది," అంటూ శాపనార్థాలు పెడుతుంది. "బాలు-మీనాలకు చేస్తున్న అన్యాయం ఊరికే పోదు. వారి ఉసురు తప్పకుండా నీకు తగులుతుంది," అని హెచ్చరిస్తుంది. ఈ మాటలకు రోహిణి ఒక్కసారిగా మాట రాక సోఫాలో నిస్సహాయంగా కూర్చుంది.
మరోవైపు మీనా, "మంచి చేయాలనుకోవడం కూడా తప్పేనా?" అంటూ కన్నీళ్లు పెట్టుకోగా, బాలు మాత్రం "సుగుణమ్మ ఇలా మాట్లాడడం వెనక ఆమె కూతురు ఉండొచ్చు" అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. "ఆమె నెంబర్ దొరికితే చుక్కలు చూపిస్తా" అన్న అతని మాటలు కొత్త ట్విస్ట్‌కు సంకేతమిస్తాయి. గోడచాటు నిలబడి ఇవన్నీ విన్న రోహిణి, ఇంకా పెద్ద ప్లాన్‌తో వారిపై మరో 'పనిష్మెంట్' సిద్ధం చేస్తూ కథను మరింత ఉత్కంఠభరిత దిశగా నడిపిస్తుంది.
మరుసటి రోజు కుటుంబ సభ్యులంతా కలిసి గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే అదే సమయంలో మీనాకు పువ్వుల ఆర్డర్ రావడంతో ఆమె ముందుగా అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో గుడికి రాకపోవడం ప్రభావతికి మరో అవకాశంగా మారుతుంది. "పనులు తప్పించుకోవడమే అలవాటు" అంటూ మీనాపై ఆమె విమర్శలు గుప్పిస్తుంది. "గుడికి వెళ్తున్నామన్న విషయం తెలియదా? పూజా సామాగ్రి తెచ్చిందా?" అంటూ రోహిణిని ప్రశ్నించగా, "నాకు ఏమీ చెప్పలేదు" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది. దీంతో ప్రభావతి మరింత మండిపడి, మీనానే తప్పుబడుతూ నోరు పారేసుకుంటుంది.
అయితే నిజం బయటపడటానికి ఎక్కువ సమయం పట్టదు. కొద్దిసేపటికి మీనా స్నేహితురాలు గుడికి చేరుకుని పూజకు సంబంధించిన దండలు, కొబ్బరికాయలు, ఇతర సామాగ్రిని అందిస్తుంది. "ఇవి మీనానే ఆర్డర్ చేసి పంపించింది... మీకు ఇవ్వమని ప్రత్యేకంగా ఫోన్ చేసింది" అని చెప్పడంతో అక్కడున్నవారు షాక్ అవుతారు. ప్రభావతికి ఒక్కసారిగా చెంపపై కొట్టినట్టవుతుంది. ఇంకా అక్కడితో ఆగకుండా, ప్రభావతి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించగా, మీనా స్నేహితురాలు ఘాటుగా స్పందిస్తుంది. "ఇది మీనా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం... దీనికి డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు" అంటూ స్పష్టంగా చెప్పి వెళ్లిపోతుంది.


Click it and Unblock the Notifications











