Gunde Ninda Gudi Gantalu March 4th Episode: మీనా పనులకు ప్రభావతి షాక్.. మౌనిక కన్నీరు.. రోహిణి పై బాలు కన్ను..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠతో నిండిపోయింది. బొమ్మల కొలువు పూజకు రావాలని బాలు స్వయంగా రోహిణి తల్లి సుగుణమ్మకు ఫోన్ చేయడంతో కథ మలుపు తిరిగింది. రాలేమని చెప్పినా బాలు పట్టుబడటంతో, రోహిణి ప్లాన్ ప్రకారం సుగుణమ్మ ఇష్టంలేకుండానే పూజకు రావాల్సి వచ్చింది. పూజా వేడుకలో చింటూ కృష్ణుడి వేషంలో అందరినీ అలరించగా, అతడిని చూసి బాలు-మీనాల మమకారం మరింత పెరిగింది. దత్తత విషయాన్ని ప్రస్తావించగానే సుగుణమ్మ కఠినంగా స్పందించి, "నా మనవడిని ఎందుకు దూరం చేస్తారు?" అంటూ గట్టిగా మాట్లాడింది. చింటూ "నేను నా తల్లితోనే ఉంటాను" అన్న మాట బాలు-మీనాల గుండెల్ని తాకింది.
ఇంటికి వెళ్లిన తర్వాత సుగుణమ్మలో పశ్చాత్తాపం ఉప్పొంగుతుంది. బాలు-మీనాలపై చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుని తల్లిగా తాను తప్పు చేశానని భావోద్వేగానికి లోనవుతుంది. అదే సమయంలో రోహిణిపై ఆమె విరుచుకుపడటం ఎపిసోడ్‌కు మరింత తీవ్రతను జోడించింది. అబద్ధాల పునాదిపై జీవితం నిర్మించవద్దని హెచ్చరించిన సుగుణమ్మ మాటలు రోహిణిని కుదిపేశాయి. మరోవైపు గుడి సన్నివేశంలో ప్రభావతి మీనాను తప్పుబట్టినా, పూజా సామాగ్రి మీనానే ముందుగా పంపించిందని బయటపడటంతో ఆమె విమర్శలు తారుమారయ్యాయి. మీనా స్నేహితురాలి సమాధానం ప్రభావతికి గట్టి సమాధానంగా నిలిచింది.

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ కలహాలు, సెటైర్లు కలగలిపిన ఆసక్తికర మలుపులతో సాగింది. మౌనిక ప్రెగ్నెంట్ అయితే గుడిలో అమ్మవారికి సారే పెట్టి, అన్నదానం చేయిస్తానని ప్రభావతి మొక్కుకుంది. ఆ మొక్కు నెరవేర్చే రోజు వచ్చేసరికి మీనాకు పెద్ద పూల ఆర్డర్ రావడంతో ఆమె గుడికి వెళ్లలేకపోయింది. ఇదే మంచి అవకాశం అని భావించిన ప్రభావతి, మీనాపై విరుచుకుపడింది. కావాలనే పని తప్పించుకుందని నోరు పారేసుకుంది. ఇంట్లో అందరి ముందూ మీనాను తక్కువ చేసి మాట్లాడింది. అయితే గుడికి రాకపోయినా మీనా మాత్రం తన బాధ్యతను మరచిపోలేదు. పూజా సామగ్రి, దండలు, అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే చూసుకుని తన స్నేహితురాలి ద్వారా గుడికి పంపించింది. ఇంట్లో వాళ్లు గుడికి చేరుకునేసరికి పంతులు గారు కూడా మీనా ముందుగానే ఫోన్ చేసి చెప్పిందని, మౌనిక పేరుమీద అర్చన చేశానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాలు వెంటనే "చూసావా... మీనా అంటే అది! ఇక్కడ లేకున్నా పని మాత్రం దగ్గరుండి చూసుకున్నట్టు చేసింది" అంటూ భార్యను పొగిడాడు.
ప్రభావతి మాత్రం తగ్గలేదు. 'పూలమ్ముకునే దానికి ఇంకో పూలమ్ముకునేదానికి తెలియడంలో ఆశ్చర్యం ఏముంది?' అంటూ మళ్లీ మీనాను తక్కువ చేసి మాట్లాడింది. ఈ సమయంలో శృతి సెటైర్లు వేస్తూ 'అత్తయ్య... మీ మీద గౌరవం రోజురోజుకు పెరుగుతోంది' అని కౌంటర్ ఇచ్చింది. సత్యం పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నంలో 'సరే సరేలే... టైమ్ అయింది, గుడిలోకి వెళ్దాం'అంటూ టాపిక్ మార్చాడు. గుడిలో ముఖ్య ఘట్టమైన అమ్మవారికి సారే పెట్టే సమయం వచ్చింది. 'సారే' అనే ఆచారం గురించి రోహిణికి తెలియకపోవడంతో సత్యం, బాలు ఇద్దరూ చురకలు వేశారు. 'నీ కోడళ్లకు కనీసం సారే అంటే కూడా తెలియదు' అంటూ సత్యం ప్రభావతిని గుచ్చాడు. బాలు కూడా తనదైన స్టైల్లో పంచులు వేసాడు. దీంతో ప్రభావతి అయోమయంలో పడిపోయింది.
ఇదే సమయంలో మరో మహిళ వచ్చి మౌనికకు సారే ఇచ్చింది. ఆమె చెప్పిన మాటలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. 'మీనా ఫోన్ చేసి ముందే చెప్పింది. పూజా కార్యక్రమాలు నేను చూసుకోవాలని బాధ్యత ఇచ్చింది' అని చెప్పడంతో బాలు గర్వంగా 'నా మీనా అంటే అది... ఎక్కడ ఉన్నా ప్రతి పని దగ్గరుండి చూసుకుంటుంది' అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రభావతి మాటలు రాక నిశ్శబ్దంగా నిలిచిపోయింది. ఇక అన్నదానం ఏర్పాట్ల విషయంలో కూడా మీనా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టడం కుటుంబ సభ్యులను మరోసారి ఆశ్చర్యపరిచింది. కానీ ప్రభావతి మాత్రం తన స్వభావం మార్చుకోలేదు. మళ్లీ మీనాను తక్కువ చేసి మాట్లాడింది. శృతి మరోసారి సెటైర్ వేయగా, రోహిణి అత్తకు సపోర్ట్‌గా నిలిచింది. 'నేను చిన్నప్పటి నుంచి మలేషియాలో పెరిగాను. ఇవి నాకు తెలియవు. ఏమైనా ఉంటే మా పని వాళ్లు చూసుకునేవాళ్లు' అంటూ బిల్డప్ ఇచ్చింది. వెంటనే బాలు 'అప్పుడు నువ్వు ముఖానికి సున్నం రాసుకునేదానివా?'అంటూ ఇచ్చిపడేశాడు. దీంతో రోహిణి మాట దొరకక సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక గుడిలో పూజలు, అన్నదానం ఏర్పాట్లతో ఒకవైపు కుటుంబ సభ్యులు బిజీగా ఉంటే... మరోవైపు ఇంటి అంతర్గత రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేలా సూచనలు కనిపిస్తాయి. అన్నదానం ప్రారంభానికి ఇంకా సమయం ఉందని భావించిన మనోజ్, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని విద్య దగ్గరికి వెళ్లి వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని వస్తానని హడావుడిగా బయలుదేరాడు. అతని నిర్ణయం విన్న వెంటనే రోహిణి కంగారుపడింది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి 'నేను వెళ్తాను... వడ్డీ డబ్బులు తీసుకుని వస్తాను'అంటూ ముందుకొచ్చింది. కానీ మనోజ్ మాత్రం అంగీకరించలేదు. 'ఇక్కడ పూజ ఉంది. నువ్వు లేకపోతే మాట వస్తుంది. మా అమ్మకు ఇలాంటి విషయాల్లో పట్టింపు ఎక్కువ. నేనే వెళ్తాను' అని చెప్పాడు.
అయితే రోహిణి మాట మార్చకుండా, 'ఇక్కడ నేను లేకపోయినా పెద్దగా చేసేదేమీ లేదు. విద్య వాళ్ల అమ్మ కూడా వచ్చిందట... ఆమెను కలిసి వస్తాను. మీరు వెళ్తే మాట మాత్రమే వస్తుంది... నేను వెళ్తే మూట కూడా వస్తుంది' అంటూ చురక వేసింది. ఆమె ధైర్యంగా చెప్పడంతో మనోజ్ చివరకు డ్రాప్ అయ్యాడు. వెంటనే రోహిణి హడావుడిగా అక్కడి నుంచి బయలుదేరింది. ఈ మొత్తం సన్నివేశాన్ని బాలు ఫ్రెండ్ రాజేష్ గమనించాడు. అనుమానం కలిగిన రాజేష్ వెంటనే బాలు కి ఫోన్ చేసి, ' నిన్న సుగుణమ్మ చింటూ కనిపించారు. అదే వీధిలోకి ఇప్పుడు రోహిణి కూడా అక్కడే కనిపించింది' అని చెప్పాడు. ఈ మాటలు బాలుని మనసులో సందేహాలు వ్యక్తం అవుతుంది. రోహిణికి సుగుణమ్మకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇలా కంగారుగా వెళుతోంది? అన్న ప్రశ్నలు అతన్ని వెంటాడాయి. వెంటనే బాలు కూడా హడావుడిగా బయలుదేరాడు. ప్రభావతి అడ్డుకునే ప్రయత్నం చేసినా, "నాకు పని ఉంది" అంటూ వెళ్లిపోయాడు.
ఇక గుడిలో మరోవైపు భావోద్వేగ సన్నివేశం నడిచింది. మౌనిక ఓ మూలన కూర్చొని సంజు తన శీలంపై నిందలు వేసిన విషయాన్ని తలుచుకుంటూ లోలోపల కుమిలిపోయింది. ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కంటతడి పెట్టుకుంది. ఈ సమయంలో సత్యం తన కూతురు దగ్గరకు వచ్చి కూర్చొన్నాడు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. సత్యం మాటల్లో అనుమానం స్పష్టంగా కనిపించింది. 'ఇంతకీ నువ్వు తల్లి కాబోతున్నావంటే సంజీవ్‌కి నిజంగా సంతోషమేనా? అతని ముఖంలో ఆ ఆనందం కనిపించలేదు. నువ్వు కూడా అంత సంతోషంగా కనిపించడం లేదు. ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా? సంజు నిన్ను బాగా చూసుకుంటున్నాడా?' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలు విన్న మౌనిక ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తన బాధను ఎలా చెప్పాలో అర్థం కాక ఏడ్చింది. కానీ తండ్రి బాధపడకూడదనే భావనతో నిజం చెప్పకుండా మాట మార్చే ప్రయత్నం చేసింది.
అయితే సత్యం తేలికగా వదల్లేదు. 'ఏమైనా కష్టం ఉందా? చివరి శ్వాస వరకు మొగుడితో సంసారం చేయమని చెప్పే మనసు నాకుండదు. నీకు ఇబ్బంది ఉంటే చెప్పు... నేను అండగా ఉంటా' అంటూ తండ్రిగా తన మనసును విప్పాడు. ఆ ప్రేమ చూసి మౌనిక మరింత కదిలిపోయింది. కానీ సంజు నిజస్వరూపం చెప్పితే ఇంట్లో కలత కలుగుతుందని భావించి, "మేమిద్దరం ఇంకో సంవత్సరం తర్వాత పిల్లలు అనుకున్నాం. కానీ మా అత్తమామలకు పిల్ల కావాలని ఉంది. అందుకే సంజు తన సంతోషాన్ని బయటకు చూపించలేకపోయాడు" అంటూ సర్దిచెప్పింది. ఇదే సమయంలో ప్రభావతి అక్కడికి వచ్చి అసలు విషయం తెలియక గొప్పలు చెప్పడం ప్రారంభించింది. 'నా కూతురు కోటేశ్వరురాలు... నా అల్లుడు కోట్లకు అధిపతి. వాళ్లింట్లో మన ఇల్లు లాగా ప్రతి విషయానికి గొడవలు ఉండవు. వాళ్లు చిన్న చిన్న విషయాలకు కూడా బయటకు సంతోషం వ్యక్తం చేయరు' అంటూ తన అల్లుడి కుటుంబాన్ని పొగిడింది. ఈ మాటలు విన్న మౌనిక ఆవేదనతో స్పందించింది.'"మా ఇంట్లో జరిగే విషయాలన్నీ కిటికీ లోంచి చూసినట్టుగా చెబుతున్నావు అమ్మ'అంటూ సెటైరికల్‌గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు.. సుగుణమ్మ, చింటూ కోసం బాలు వెతుకులాట ప్రారంభించాడు. రాజేష్ ఇచ్చిన సమాచారంతో అతనిలో ఇప్పటికే అనుమానం మొదలై ఉంది. ఇదే సమయంలో బాలు కారు వెళ్తుండగా అకస్మాత్తుగా విద్య అడ్డుగా వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై నిర్లక్ష్యంగా నడుస్తున్న విద్యపై బాలు తీవ్రంగా కోపగించాడు. 'ఇంత పెద్ద కారు వస్తుంటే కనిపించడం లేదా?' అంటూ కారులో నుంచి దిగిపోయి ప్రశ్నించాడు. విద్య కూడా తక్కువేమీ కాకుండా సమాధానం ఇవ్వడంతో కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఆ మధ్యలోనే బాలు అసలు విషయానికి వచ్చి, 'ఈ వైపు సుగుణమ్మ, చింటూ కనిపించారా?'అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే విద్య కంగారుపడింది. 'నాకు పని ఉంది' అంటూ అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ విద్య ప్రవర్తన బాలు అనుమానాన్ని మరింత పెంచింది. 'నువ్వు పనికి వెళ్తున్నట్టు లేదు... నాకు విషయం చెప్పకుండా జారుకున్నట్టు ఉంది' అని బాలు గమనించాడు. విద్య హడావుడిగా వెళ్లిపోవడం అతని సందేహాలను మరింత బలపరిచింది.
ఇక మరోవైపు రోహిణి వడ్డీ డబ్బులు తీసుకువస్తానని చెప్పి, నిజానికి తన కొడుకు చింటూ దగ్గరకు చేరుకుంది. అక్కడ సుగుణమ్మ తన మనసులోని ఆవేదన బయటపెట్టింది. 'నా చేత బాలు, మీనాలను దూరం చేసావు' అంటూ రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ సమయంలో చింటూ మాట్లాడిన మాటలు రోహిణికి గుండెకు గుచ్చినట్టయ్యాయి. 'బాలు, మీనా ఆంటీ చాలా మంచివారు. వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు?' అని అమాయకంగా అడిగాడు. ఇంకా, 'వాళ్లు నన్ను దత్తత తీసుకుంటే నాకు ఇద్దరు అమ్మలు ఉంటారు. అందరి ముందు ఆంటీ అని పిలుస్తాను... ఎవరూ లేనప్పుడు అమ్మ అని పిలుస్తాను' అని చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించేలా మార్చాయి. ఆ మాటలు విన్న రోహిణి ఒక్కసారిగా కుంగిపోయింది. 'ఇదంతా నా కర్మ... నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను' అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి ప్రేమ, తప్పు చేసిన పశ్చాత్తాపం - రెండూ కలిసి ఆమెను లోలోపల కుదిపేశాయి.
గుడిలో మటన్ కొట్టు మాణిక్యం కామెడీ ట్విస్ట్
ఇక మరోవైపు గుడిలో మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజు మొత్తం అబద్ధాలు చెప్పకుండా ఉంటానని దేవుడి ముందు ప్రతిజ్ఞ చేశాడు. అయితే వెంటనే అతనికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి అక్కడికి చేరుకుని, 'నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు?' అని నిలదీశాడు. తన ప్రతిజ్ఞ గుర్తొచ్చి, 'వచ్చే నెల ఒకటో తారీకు ఇస్తాను' అని నిజం చెప్పాల్సి వచ్చింది. ఆ వ్యక్తి కూడా 'ఈరోజు నువ్వు అబద్ధాలు ఆడవని తెలుసు... అందుకే నిజం చెప్పించుకోవడానికి వెయిట్ చేశా' అని చెప్పడంతో మాణిక్యం షాక్ అయ్యాడు. వెంటనే దేవుడి వైపు చూసి 'స్వామీ... ఈరోజు నా నోట నిజం చెప్పించే ప్రయత్నాలు చేయకు'అని మొరపెట్టుకున్నాడు. అంతలోనే ప్రభావతి గుడిలోకి ఎంట్రీ ఇచ్చింది. మాణిక్యం అప్పటికే బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ప్రభావతి అతన్ని గమనించలేదు. అయితే గుడిలో ప్రభావతి కుటుంబంలో ఎవరికైనా అతను కనిపిస్తాడేమో అన్న సందేహం మాత్రం కథకు మరో ఆసక్తికర మలుపు ఇచ్చింది.
మరోవైపు.. విద్య రోహిణికి ఫోన్ చేసి, 'బాలు ఆ వైపు వస్తున్నాడు... జాగ్రత్త' అని హెచ్చరించింది. రోహిణి ఒక్కసారిగా షాక్ అయింది. అంతలోనే బాలు సుగుణమ్మ ఉన్న ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు. ఆ తలుపు తెరవడానికి చింటూ ముందుకు వెళ్లడం... ఇదే సన్నివేశంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. రోహిణి బాగోతం బయటపడుతుందా? లేక చివరి క్షణంలో ఏదైనా మలుపు తిరుగుతుందా? అన్న ఆసక్తి పెరిగింది. ఇలా నేటి ఎపిసోడ్ రోహిణి రహస్యం బయటపడే అంచున ఆగిపోయింది. బాలు తలుపు తట్టిన ఇంట్లో ఏం జరుగుతుంది? చింటూ తలుపు తీస్తే నిజం బట్టబయలవుతుందా? సుగుణమ్మ నాటకం బయటపడుతుందా? అన్న ప్రశ్నలతో సీరియల్ ముగిసింది.


Click it and Unblock the Notifications











