Gunde Ninda Gudi Gantalu March 9th Episode: జైలులో బాలు.. మీనాపై సత్యం ఆగ్రహం.. గుణపై దాడి..
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన మలుపులతో ఆకట్టుకుంది. ఇంట్లో శృతి పేరుతో వచ్చిన ఒక పార్సిల్ చుట్టూ మొదట చిన్న వివాదం ప్రారంభమైంది. ఆ పార్సిల్‌ను చూసిన ప్రభావతికి ఆసక్తి కలగడంతో వెంటనే బాక్స్ తెరవాలని ప్రయత్నించింది. అయితే మీనా ఆమెను ఆపేందుకు ప్రయత్నిస్తూ, 'అత్తయ్య.. అది శృతి వస్తువు. ఆమె ఇంట్లో లేనప్పుడు తెరవడం సరైంది కాదు'అని చెప్పినా ప్రభావతి పట్టించుకోలేదు. చివరకు బాక్స్ తెరిచి అందులో ఉన్న హెడ్‌ఫోన్స్ తీసుకుని చూడటంతో అక్కడికి వచ్చిన శృతి తీవ్రంగా కోపగించింది. తన అనుమతి లేకుండా వస్తువులను తాకారని ప్రభావతిపై మండిపడింది. ఈ సంఘటన ఇంట్లో ఉద్రిక్తతను పెంచింది. ఆ తర్వాత ప్రభావతి తన కొడుకు రవిని పక్కకు పిలిచి శృతి గురించి ఫిర్యాదు చేస్తూ, ఆమెను అదుపులో పెట్టాలని చెప్పింది. కానీ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మీనా మధ్యలోకి వచ్చి, శృతి కోపం వెనుక ఉద్దేశం లేదని రవికి చెప్పి పరిస్థితిని సర్దిచెప్పింది.
ఇక మరోవైపు శివ సస్పెన్షన్ సమస్యను పరిష్కరించేందుకు బాలు ప్రయత్నాలు ప్రారంభించాడు. గుణ అనే వ్యక్తి కావాలనే శివ బ్యాగులో మద్యం బాటిల్ పెట్టి అతన్ని కాలేజీ నుంచి డీబార్ చేయించాడని తెలుసుకున్న బాలు ప్రిన్సిపాల్‌ను కలవాలని నిర్ణయించాడు. కానీ ప్రిన్సిపాల్ వారిని పట్టించుకోలేదు. దీంతో బాలు ఒక తెలివైన ప్లాన్ వేసాడు. మీనాతో కలిసి ప్రిన్సిపాల్ ఇంటి ముందు తాగుబోతులా నటిస్తూ గొడవ చేయడంతో ప్రిన్సిపాల్‌కు నిజం అర్థమైంది. శివపై పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన నిర్ణయించాడు. అయితే బాలు వేసిన ఈ నాటకం అనూహ్య మలుపు తీసుకుంది. రోడ్డుపై తాగి గొడవ చేస్తున్నాడని భావించిన పోలీసులు అక్కడికి వచ్చి బాలును అరెస్ట్ చేశారు. మీనా ఎంత చెప్పినా వినకుండా అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న శివ తన కోసం బాలు చేసిన త్యాగం తెలుసుకుని తీవ్రంగా పశ్చాత్తాపానికి గురయ్యాడు. ఇక బాలును ఎలా విడుదల చేస్తారో అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

Photo courtesy: Jio Hotstar
సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన భవిష్యత్తు కోసం అక్క, బావ బాలు నాటకం ఆడారని తెలుసుకున్న శివ తీవ్ర పశ్చాత్తాపంలో పడతాడు. తన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించి, ఎలాగైనా బావను జైలు నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తన అక్క మీనాతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటాడు.ఇక జైలులో ఉన్న బాలు మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులకు పదే పదే చెబుతూనే ఉంటాడు. తనను అన్యాయంగా పట్టుకున్నారని చెప్పి వేడుకుంటాడు. అయితే అక్కడ ఉన్న పోలీసులు అతని మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోతారు. బాలు ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోకపోవడంతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారుతుంది.
అంతలోనే శివ, మీనా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలును చూసి భావోద్వేగానికి గురవుతారు. అయితే వారిని చూసిన బాలు మాత్రం మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు. 'అనవసరంగా ఇక్కడికి రాకండి... వాళ్లే నన్ను విడిచిపెడతారు... మీరు వెళ్లిపోండి'అని చెప్పి వారిని పంపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో శివ మాత్రం "ఇదంతా నా వల్లే జరిగింది బావ... సారీ" అంటూ బాధపడతాడు. ఆ మాటలు విన్న బాలు 'ఎన్ని రోజులు అయింది ఈ పిలుపు వినకుండా'అంటూ ఎమోషనల్ అవుతాడు. ఇదే సమయంలో మీనా హెడ్ కానిస్టేబుల్‌ను కలిసి జరిగిన అసలు విషయాన్ని వివరంగా చెబుతుంది. బాలు ఎలాంటి తప్పు చేయలేదని, ఎవ్వరినీ కొట్టలేదని, ఇది అంతా ఒక నాటకమేనని పూసగుచ్చినట్లు వివరిస్తుంది.
కానీ ఆ కథ మొత్తం విన్న కానిస్టేబుల్ మాత్రం ఇందులో తాను ఏం చేయలేనని చెబుతాడు. 'ఎస్‌ఐ మేడం వచ్చిన తర్వాత ఆమెకు చెప్పండి' అంటూ సమాధానం ఇస్తాడు. మీనా ఎంత రిక్వెస్ట్ చేసినా, బాలను వెంటనే విడిచిపెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేస్తాడు. అంతేకాదు, పోలీస్ స్టేషన్‌లో ఉండవద్దని వారిని హెచ్చరిస్తాడు. దీంతో నిరాశతో బయటికి వచ్చిన మీనా, ఎలాగైనా తన భర్తను విడిపించుకోవాలని సంకల్పిస్తుంది. బయటికి వచ్చాక బాలు, శివతో మాట్లాడుతూ తన బాధను వ్యక్తం చేస్తాడు. 'చూసావా రా... నీకోసం నేను ఎంత చేశానో. నీ తప్పులను కూడా నీ అక్కకి చెప్పకుండా దాచిపెట్టాను. ఇకనైనా మారిపో'అంటూ బాలు చెప్పడంతో శివ మరింత పశ్చాత్తాపంతో ఎమోషనల్ అవుతాడు.
ఇక మరోవైపు మీనా బాలును విడిపించుకోవడానికి సహాయం కోసం శృతికి ఫోన్ చేస్తుంది. అయితే ఆ సమయంలో శృతి డబ్బింగ్‌లో బిజీగా ఉండడంతో మొదట ఫోన్ లిఫ్ట్ చేయదు. కొద్దిసేపటి తర్వాత కాల్ తీసుకుని ఏమైంది అని అడుగుతుంది. మీనా జరిగిన విషయం మొత్తం వివరించి, బాలును విడిపించడానికి సహాయం చేయమని వేడుకుంటుంది. ఈ విషయం విన్న శృతి వెంటనే తన తల్లి శోభకు ఫోన్ చేసి పరిస్థితి చెబుతుంది. బాలు జైలులో ఉన్నాడని, అతన్ని బయటకు తీసుకురావడానికి సహాయం చేయాలని కోరుతుంది.
అయితే ఇదే మంచి అవకాశంగా భావించిన శృతి తండ్రి మాత్రం తీవ్రంగా స్పందిస్తాడు. 'నన్ను ఎన్నోసార్లు కొట్టిన ఆ వెధవకు నేను సహాయం చేయాలా?' అంటూ కోపంతో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇకపై ఇలాంటి విషయాలతో తనకు ఫోన్ చేయవద్దని శృతికి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తండ్రి ఆగ్రహం చూసిన శృతి సైలెంట్ అయిపోతుంది. చివరకు తాను ఎలాంటి సహాయం చేయలేనని మీనాకు చెబుతుంది. దీంతో మీనా ఆశలు క్షణాల్లోనే ఆవిరైపోతాయి. తన భర్తను ఎలా బయటకు తీసుకురావాలి అన్న ఆందోళనలో మరింత కంగారు పడుతుంది.
ఇక మరోవైపు శృతి ఇంట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. శృతి తల్లి శోభ తన భర్తతో మాట్లాడుతూ బాలును విడిపించేందుకు సహాయం చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తుంది. 'ఇలా చేసినా మన కూతురు మన మాట వినేది కదా' అంటూ ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే శృతి తండ్రి మాత్రం తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తాడు. 'నాపై దాడి చేసిన వాడికి నేను ఎలా సహాయం చేస్తాను అనుకున్నావ్?' అంటూ కోపంగా ప్రశ్నిస్తాడు.
అంతేకాకుండా ఇదే సరైన సమయం అంటూ మరో ప్లాన్ కూడా చెబుతాడు. ' సత్యంకు ఫోన్ చేసి... ఇలాంటి పరువు లేని వాళ్ల ఇంటికి మేము పిల్లను ఇచ్చినందుకు బాధపడుతున్నాం అని చెప్పు. ఆ సత్యం ప్రశాంతంగా ఉండడం నాకు ఇష్టం లేదు' అంటూ కండిషన్ పెట్టి శోభకు ఐడియా ఇస్తాడు. భర్త మాటలు విన్న శోభ వెంటనే ఫోన్ తీసుకుని ప్రభావతికి కాల్ చేస్తుంది. జరిగిన విషయాన్ని మొత్తం చెబుతూ వారి ఇంట్లో మరోసారి కలకలం రేపేలా మాట్లాడుతుంది. ఇలా బాలుకు సహాయం చేయకుండా, పైగా మరో ఇంట్లో చిచ్చు పెట్టేలా శోభ వ్యవహరించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.
ఇదిలా ఉంటే, పోలీస్ స్టేషన్ వద్ద మీనా మరోసారి బాలు దగ్గరకు వెళ్తుంది. శృతి ద్వారా ఆమె తల్లి సహాయం తీసుకోవాలని ప్రయత్నించానని, కానీ వాళ్లు సహాయం చేయడానికి ఒప్పుకోలేదని చెబుతుంది. దీంతో బాలు జరిగిన విషయాన్ని ప్రశాంతంగా విశ్లేషిస్తూ మాట్లాడుతాడు. "నేను నీ నాన్నను ఎన్నోసార్లు కొట్టాను. అలాంటి పరిస్థితిలో ఆయన నాకు సహాయం చేస్తారని ఎలా అనుకున్నావ్? అంతేకాదు, ఇలా చేస్తే మళ్లీ గొడవకు అవకాశం వస్తుంది" అంటూ ముందుగానే హెచ్చరిస్తాడు. అయితే ఈ కేసు పెద్దది కాదని కూడా బాలు మీనాకు ధైర్యం చెబుతాడు. "ఇది చిన్న కేసే... ఇప్పుడు ఎవరు చెప్పినా పోలీసులు మనల్ని విడిచిపెట్టరు. కానీ రేపు ఉదయం ఎస్‌ఐ మేడం వస్తుంది. ఆమెకు నిజం చెబితే కచ్చితంగా నన్ను విడుదల చేస్తుంది" అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తాడు.
కానీ మీనా మాత్రం బాలును అక్కడే వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండదు. తాను ఇక్కడే ఉంటానని మొండిగా చెబుతుంది. అయితే బాలు మాత్రం ప్రశాంతంగా ఆమెను సముదాయిస్తూ ఇంటికి వెళ్లమని అంటాడు. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపు ఉదయం పరిస్థితి మారిపోతుందని ధైర్యం చెబుతాడు. అయినప్పటికీ మీనా మనసులో మాత్రం భర్తపై ఉన్న ఆందోళన, భయం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారుతుంది.
ఇక మరోవైపు ఇంట్లో ప్రభావతి మాత్రం మీనా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మీనా ఎప్పుడు ఇంట్లోకి అడుగుపెడుతుందా... ఆమెపై విరుచుకుపడాలని ఆత్రుతగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మీనా ఇంటికి చేరుకోగానే ప్రభావతి ఆగ్రహంగా ప్రశ్నిస్తుంది. "ఎక్కడికి వెళ్లావు ఇంతసేపు? ఏం చేస్తూ వచ్చావు?" అని నిలదీస్తుంది. దీంతో మీనా మాత్రం పరిస్థితిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ పూల కొట్టు దగ్గర పని ఎక్కువైందని, ఆర్డర్లు రావడంతో ఆలస్యమైందని సమాధానం ఇస్తుంది.అంతలోనే సత్యం ఇంటికి వచ్చి బాలు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తాడు. దీంతో మీనా తడబడుతూ "ఆయన ట్రిప్‌కి వెళ్లారు... రేపు ఉదయం వస్తారు" అంటూ అబద్ధం చెబుతుంది.
అయితే వెంటనే ప్రభావతి 'నైట్ జైల్లోనే ఉంటాడా?'అని ప్రశ్నించడంతో మీనాకు అసలు విషయం బయటపడిపోయిందని అర్థమవుతుంది. ఈ విషయం శృతి తల్లి తనకు ఫోన్ చేసి చెప్పిందని, 'ఇలాంటి వాళ్ల ఇంటికి పిల్లను ఇచ్చామా?' అంటూ తమను అవమానించిందని ప్రభావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలు విన్న సత్యం కూడా కోపంతో స్పందిస్తాడు. 'ఇలాంటి విషయాలు జరిగితే నాకు చెప్పొచ్చు కదా... నేను ఈ ఇంటి పెద్దను కదా'అంటూ కాస్త కఠినంగా మాట్లాడతాడు. దీనికి మీనా సమాధానం ఇస్తూ... మీరు తెలిసితే బాధపడతారని భావించి బాలు చెప్పొద్దని చెప్పాడని వివరిస్తుంది. అయినప్పటికీ సత్యం ఆగ్రహం తగ్గదు. 'అయినా ఇలాంటి విషయాలు నాకు చెప్పాల్సిందే కదా. ఇంతకీ వాడు పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఉన్నాడు?'అంటూ ప్రశ్నిస్తాడు.
దీంతో మీనా జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తుంది. ఇది విన్న సత్యం కొంత అసహనం వ్యక్తం చేస్తూ... 'చూశారా, ఇది చిన్న సమస్యే. డైరెక్ట్‌గా వెళ్లి ప్రిన్సిపాల్‌తో మాట్లాడితే ఇక్కడిదాకా వచ్చేది కాదు. వాడు ముక్కుసూటిగా వెళ్లే వాడు అన్న విషయం నీకు కూడా తెలుసు. నువ్వెలా వాడికి సపోర్ట్ ఇచ్చావు?' అంటూ ప్రశ్నిస్తాడు. ఇది ఇంటి సమస్య మాత్రమే కాదు, ఇంటి పరువు సమస్య అని, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని ఇంటి పరువును తగ్గించవద్దని కఠినంగా హెచ్చరిస్తాడు.
ఇదే అవకాశంగా భావించిన మనోజ్, రోహిణి కూడా మీనాపై విమర్శలు చేస్తూ విరుచుకుపడతారు. అయితే ఈ సమయంలో శృతి, రవి మాత్రం మీనాకు మద్దతుగా నిలుస్తారు. "ఇక్కడ మాటల విషయం పక్కన పెట్టండి... ఇంట్లో ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు. కనీసం మీరు బాధపడడం కూడా లేదు" అంటూ ప్రభావతిని శృతి ప్రశ్నిస్తుంది. అయితే ఇంట్లోవారు మాత్రం మీనాపై ఆరోపణలు చేయడం ఆపరు. దీంతో తీవ్రంగా బాధపడిన మీనా ఏడుస్తూ దాబా పైకి వెళ్లిపోతుంది.
మరుసటి రోజు ఉదయం మీనా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలును విడిపించేందుకు ప్రయత్నిస్తుంది. అక్కడ ఎస్‌ఐతో మాట్లాడి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరిస్తుంది. ఇది మొత్తం ఒక డ్రామా అని తెలిసిన ఎస్‌ఐ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "పోలీసులను ఫూల్స్ చేస్తున్నారా?" అంటూ మందలిస్తుంది. ఈ సమయంలో శివ కూడా భావోద్వేగానికి గురై... తన కోసం తన అక్క, బావ ఇలా చేశారని చెప్పి క్షమాపణ కోరుతాడు. మీనా కూడా బాలు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడంతో ఎస్‌ఐకి అసలు విషయం అర్థమవుతుంది. వెంటనే బాలును విడుదల చేయాలని ఆదేశిస్తుంది.
ఈ సందర్భంగా శివను చూసి ఎస్‌ఐ చెప్పిన మాటలు అక్కడున్న వారిని ఆలోచింపజేస్తాయి. "బావ కోసం కష్టపడే బామ్మర్దిలను చూశాను... కానీ బామ్మర్ది భవిష్యత్తు కోసం ఇలా పోలీస్ స్టేషన్‌దాకా వచ్చే వారిని నేను చూడలేదు. ఇకనైనా బుద్ధిగా ఉండి మంచిగా చదువు... వాళ్లకు పేరు తీసుకురా" అంటూ సలహా ఇస్తుంది. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత శివ తీవ్ర పశ్చాత్తాపంతో బావ కాళ్లపై పడిపోతాడు. వెంటనే బాలు అతన్ని లేపి హగ్ చేసుకుంటాడు. "ఇకనైనా చెడు సవాసాలకు దూరంగా ఉండి మంచిగా చదువు... ఆ ఇంటి పరువు ఇప్పుడు నీ మీదే ఉంది" అంటూ ప్రేమగా బుద్ధి చెబుతాడు. దీంతో శివ కూడా తన తప్పును గుర్తించి మారాలని నిర్ణయించుకుంటాడు.
ఇదిలా ఉంటే మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. రాజేష్ బాలుకి ఫోన్ చేసి గుణ ఎక్కడ ఉన్నాడో తనకు ఆచూకీ తెలిసిందని చెబుతాడు. ఈ సమాచారం విన్న బాలు వెంటనే అక్కడికి వస్తానని చెప్పి రాజేష్ దగ్గరకు చేరుకుంటాడు. ఇద్దరూ కలిసి గుణను పట్టుకునేందుకు ఒక ప్లాన్ వేస్తారు. ప్లాన్ ప్రకారం రాజేష్ గుణకు ఫోన్ చేసి తనకు అత్యవసరంగా డబ్బు కావాలని, ఎంత వడ్డీ అయినా ఇస్తానని చెబుతాడు. దీంతో గుణ కూడా ఆశపడుతూ రాజేష్ చెప్పిన చోటుకు రావడానికి ఒప్పుకుంటాడు. కొద్దిసేపటికే గుణ కారు ఆపి బయటికి దిగుతాడు. అదే సమయంలో అక్కడే వేచి ఉన్న బాలు మెరుపు వేగంతో అతని దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా దాడి చేస్తాడు. గుణను బలంగా కొట్టడమే కాకుండా మరోసారి అతని చేతులను విరిచేస్తాడు. దీంతో గుణ తీవ్రంగా గాయపడతాడు. ఇకనైనా బుద్ధిగా ఉండాలని, మళ్లీ ఇలాంటి వేషాలు వేస్తే ప్రాణాలతో వదలనని బాలు తీవ్రంగా హెచ్చరిస్తాడు.
ఈ ఘటన తర్వాత బాలు, మీనా ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అయితే ఇంట్లో ప్రభావతి మాత్రం వారిని చూసి మరోసారి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. తన మాటలతో వారిద్దరినీ హేళన చేస్తూ అవమానించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ మాటలను పట్టించుకోకుండా మీనా మాత్రం భర్తకు హారతి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇది ప్రభావతికి మరింత కోపం తెప్పిస్తుంది. వెంటనే మీనాపై ఆగ్రహంగా విరుచుకుపడుతూ "ఇలా మోసాలు చేసి పోలీస్ స్టేషన్‌లకు వెళ్లి వచ్చే వాళ్లు నా ఇంట్లో ఉండకూడదు" అంటూ తీవ్రంగా మాట్లాడుతుంది. ఈ మాటలు విన్న మీనా కూడా ఒక్కసారిగా రెచ్చిపోతుంది. "నీ కొడుకు 40 లక్షలు తీసుకుని పారిపోయినప్పుడు మీరు ఏం చేశారు? మీనా పత్రాలను తాకట్టు పెట్టినప్పుడు ఇలానే మాట్లాడారా?" అంటూ గట్టిగా ప్రశ్నిస్తుంది.
అంతేకాకుండా బాలు ఎవరినీ మోసం చేయలేదని, మంచి చేయడానికి వెళ్లి సమస్యల్లో చిక్కుకున్నాడని మీనా బలంగా సమాధానం ఇస్తుంది. అయితే ఈ మొత్తం పరిస్థితిని చూసిన సత్యం మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకుండా బాలును పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సత్యం ఈ విధంగా స్పందించడం ఇంట్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇక ఈ పరిణామాల తర్వాత ఇంట్లో పరిస్థితి ఎలా మారుతుంది? సత్యం వైఖరి వెనుక అసలు కారణం ఏమిటి? గుణపై దాడి చేసిన విషయం బయటపడితే ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. తదుపరి ఎపిసోడ్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications










