Gunde Ninda Gudi Gantalu March 10th Episode: మీనా ఉగ్రతాండవం.. మనోజ్,ప్రభావతిలపై దాడి.. శృతి,రవి మధ్య కలహాలు.
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ భావోద్వేగభరిత సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగింది. తన భవిష్యత్తు కోసం అక్క మీనా, బావ బాలు నాటకం ఆడారని తెలుసుకున్న శివ తీవ్ర పశ్చాత్తాపంలో పడతాడు. తన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావించి, మీనాతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలును చూసి క్షమాపణ కోరుతాడు. బాలు మాత్రం శివను సముదాయిస్తూ ఇకనైనా చెడు సవాసాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టమని సలహా ఇస్తాడు. మీనా జరిగిన నిజాన్ని పోలీసులకు వివరించినా, ఎస్‌ఐ వచ్చేవరకు ఏమీ చేయలేమని వారు చెబుతారు. సహాయం కోసం మీనా శృతికి ఫోన్ చేస్తుంది. కానీ శృతి తండ్రి బాలుకు సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. దీంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది.
ఇదే సమయంలో శృతి తల్లి శోభ మరోవైపు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పడంతో మీనా ఇంట్లో కూడా కలకలం రేగుతుంది.ఇంటికి వచ్చిన మీనాను ప్రభావతి తీవ్రంగా ప్రశ్నిస్తుంది. సత్యం కూడా కోపంగా స్పందిస్తూ ఇలాంటి విషయాలు తనకు ముందే చెప్పాల్సిందని అంటాడు. ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మీనా తీవ్రంగా బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఎస్‌ఐ ముందుకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించడంతో అసలు నిజం బయటపడుతుంది. దీంతో ఎస్‌ఐ బాలును విడుదల చేయమని ఆదేశిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత శివ బాలు కాళ్లపై పడిపోతాడు. బాలు అతన్ని లేపి ప్రేమగా బుద్ధి చెబుతాడు. ఇక చివర్లో రాజేష్ ఇచ్చిన సమాచారంతో గుణను పట్టుకునేందుకు బాలు ప్లాన్ వేస్తాడు. గుణను బలంగా కొట్టి హెచ్చరించడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా, భావోద్వేగాలతో నిండిన సన్నివేశాలతో సాగింది. మొదటగా బాలు చేసిన చర్యపై సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. 'ప్రతి పనికీ ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు చేసిన పని తప్పు కాకపోయినా, చేసిన విధానం మాత్రం సరైంది కాదు'అంటూ బాలను గట్టిగా మందలిస్తాడు. సమస్యలను ఆవేశంతో కాకుండా ఆలోచించి పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఇకపై ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని హెచ్చరిస్తాడు. అంతేకాదు, బాలు చేసే ప్రతి నిర్ణయం మీనా జీవితంపై కూడా ప్రభావం చూపుతుందని గుర్తు చేస్తూ బాధ్యతతో వ్యవహరించమని చెబుతాడు. తండ్రి మాటలు విన్న బాలు నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటానని సత్యానికి హామీ ఇస్తాడు.
ఇదిలా ఉండగా, మరోవైపు శృతి-రవి కాపురంలో కలహాలు మొదలవుతాయి. శృతికి తీవ్ర జ్వరం రావడంతో భర్త తన పక్కనే ఉండాలని ఆమె కోరుకుంటుంది. కానీ అదే సమయంలో రవికి రెస్టారెంట్‌లో ఒక పెద్ద స్పెషల్ ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ చాలా ముఖ్యమని, ఇందులో రవి తప్పనిసరిగా ఉండాల్సిందేనని అతని బాస్ నీతు స్పష్టంగా చెబుతుంది. "నీ రెసిపీ టేస్ట్ బాగుందని ఈ ఆర్డర్ ఇచ్చారు. నువ్వు లేకపోతే హోటల్‌కు చెడ్డ పేరు వస్తుంది" అంటూ పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. దీంతో రవి తీవ్ర సందిగ్ధంలో పడిపోతాడు.
రవి పరిస్థితి అర్థం చేసుకున్నప్పటికీ శృతి మాత్రం భావోద్వేగంగా స్పందిస్తుంది. తనకు జ్వరం ఉన్నప్పుడు భర్త తనతో ఉండాలని పట్టుబడుతుంది. రవి హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తే వదిన మీనాతో వెళ్లమని సూచిస్తాడు. ఇదే సమయంలో నీతు నుంచి మరోసారి ఫోన్ రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. 'నా మాటలు లెక్క చేయకుండా నీ బాస్ మాటలు మాత్రమే వినిపిస్తున్నావ్... నన్ను కేర్ చేయడం లేదు'అంటూ శృతి రవిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని కూడా స్పష్టంగా చెప్పేస్తుంది.
అయితే రవి మాత్రం తన పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాడు. ఈరోజు లీవ్ పెట్టడం అసాధ్యమని, హోటల్‌కు వచ్చిన పెద్ద ఆర్డర్ కారణంగా తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుందని చెబుతాడు. కానీ శృతి మాత్రం వినిపించుకోకుండా మరింత కోపంగా స్పందిస్తుంది. ఒకవేళ ఈరోజు కూడా తనను వదిలి వెళ్తే వారి మధ్య దూరం పెరుగుతుందని హెచ్చరిస్తుంది. అయినప్పటికీ పరిస్థితులు అలా ఉండటంతో రవి "సారీ" చెబుతూ హోటల్‌కు వెళ్లిపోతాడు.
భర్త వెళ్లిపోవడంతో శృతి తీవ్ర ఆవేశానికి గురవుతుంది. రవికి తనపై ప్రేమ తగ్గిపోయిందని భావించి వెంటనే తన బట్టలు సర్దుకోవడం ప్రారంభిస్తుంది. తాను ఇక ఇక్కడ ఉండనని నిర్ణయించుకుని తన పుట్టింటికి వెళ్లిపోవాలని సిద్ధమవుతుంది. ఇదంతా గమనించిన మీనా వెంటనే ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది. "ఏమైంది? ఇలా ఎటు వెళ్తున్నావ్?" అని ప్రశ్నిస్తుంది. దీనికి శృతి "నేను శాశ్వతంగా మా ఇంటికే వెళ్తున్నాను" అంటూ భావోద్వేగంగా సమాధానం ఇస్తుంది.
మీనా మాత్రం ఆమెను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. రవి వెళ్లేటప్పుడు తనను చూసుకోవాలని చెప్పి వెళ్లాడని, ఆవేశంగా నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని, తన కోసం ప్రత్యేకంగా టీ తీసుకువస్తానని కూడా అంటుంది. కానీ శృతి మాత్రం వినిపించుకోదు. రవికి తనపై ప్రేమ తగ్గిపోయిందని, తనను పట్టించుకోవడం లేదని బాధపడుతుంది. మీనా ఎంత చెప్పినా ఆమె మనసు మార్చుకోదు. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. శృతి ఇలా ఎటు వెళ్తోందని ప్రశ్నిస్తుంది. శృతి మాత్రం రవి తనను పట్టించుకోవడం లేదని, ఎవరూ తనను ఆపాల్సిన అవసరం లేదని చెప్పేస్తుంది. ప్రభావతి కూడా కొంతసేపు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా శృతి తన నిర్ణయం మార్చుకోదు. చివరికి అందరి మాటలు పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
శృతి తన మాట వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిన ప్రభావతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే తన కొడుకు రవికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. ఈ సందర్భంలో ఆమె రవికి కాస్త కఠినంగా ఉండాలని సూచిస్తుంది. "ఇలా ప్రతి విషయానికి వంగిపోతే భార్య ముందు నీ విలువ తగ్గిపోతుంది" అంటూ రవిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అంతేకాదు, ఇప్పుడే శృతితో మాట్లాడకూడదని కూడా ఆదేశిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యను సర్దుబాటు చేయాల్సిన స్థితిలో ఉన్న ప్రభావతి, వారిద్దరి మధ్య మరింత చిచ్చు పెట్టేలా మాట్లాడడం చూసి మీనా ఆందోళన చెందుతుంది.
ఈ పరిస్థితిని బాలెన్స్ చేయాలని భావించిన మీనా వెంటనే రవికి ఫోన్ చేస్తుంది. 'నీ అమ్మ మాట్లాడిన మాటలు నేను విన్నాను. నువ్వు అనవసరంగా ఆవేశపడకూడదు. శృతి అనారోగ్యంతో ఉంది కాబట్టి తన భర్త పక్కనే ఉండాలని కోరుకోవడం సహజం'అంటూ నచ్చజెప్పుతుంది. శృతి ఇంకా చిన్నపిల్లలాగే ఆలోచిస్తోందని, కాస్త సహనం పాటించాలని సూచిస్తుంది. ముందుగా నీ పని ఏకాగ్రతతో పూర్తి చేసుకుని, తర్వాత శృతి పుట్టింటికి వెళ్లి నిదానంగా మాట్లాడి ఇంటికి తీసుకురావాలని సలహా ఇస్తుంది. మీనా చెప్పిన మాటలు విన్న రవి కూడా కాస్త శాంతించి తన పని మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంటాడు.
ఇదిలా ఉండగా మరోవైపు మీనా బంధువులు శుభలేఖ ఇవ్వడానికి ఇంటికి వస్తారు. ఆ సమయంలో బాలు ఇంట్లో లేకపోవడంతో మీనా అతనికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. తన పిన్ని, బాబాయి, మామయ్య, అత్తయ్య వచ్చారని, వీలైతే ఇంటికి రావాలని అంటుంది. అయితే బాలు పనిలో ఉండటంతో తాను రావడానికి ఆలస్యం అవుతుందని చెబుతాడు. వచ్చిన వారిని గౌరవంగా భోజనం పెట్టి పంపించమని మీనాకు సూచిస్తాడు. దీంతో మీనా బాలు చెప్పినట్లే వారిని సత్కరించి భోజనం పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
అయితే ఇదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ప్రభావతి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కోపంతో మండిపడుతుంది. వెంటనే మీనాను తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలిస్తుంది. 'నీ బాబు సొమ్ము అయినట్టు వచ్చిన వాళ్లకు భోజనాలు పెడుతున్నావా? రోడ్డున వెళ్లే వాళ్లందరినీ ఇంటికి పిలుస్తావా?'అంటూ అవమానకరంగా తిడుతుంది. ప్రభావతి మాటలు విన్న మీనా బంధువులు తీవ్రంగా బాధపడతారు. పరిస్థితి అసౌకర్యంగా మారడంతో వారు భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.
వారిని ఆపడానికి మీనా ఎంతో ప్రయత్నించినా వారు ఆగరు. 'ఇలాంటి ఇంట్లో నువ్వెలా ఉంటున్నావో మాకు అర్థం కావడం లేదు'అంటారు. ఈ సంఘటనతో మీనా తీవ్రంగా బాధపడుతుంది. కానీ ప్రభావతి మాత్రం తాను తప్పేం చేయలేదన్నట్లుగా ప్రవర్తిస్తుంది. 'ఇప్పుడు నేను ఏమన్నాను?'అంటూ తన చర్యను సమర్థించుకునేలా మాట్లాడుతుంది. ఈ సమయంలో రోహిణి కూడా ప్రభావతికి మద్దతుగా నిలుస్తుంది. 'అత్తయ్యను ఒక్క మాట అడిగి భోజనం పెట్టొచ్చుకదా' అంటూ మీనానే తప్పు చేసినట్టు మాట్లాడుతుంది.ఈ మాటలు విన్న మీనా మరింత బాధపడుతుంది. కుటుంబ సభ్యుల ముందు అవమానానికి గురైన మీనా ఆవేదనతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు మనోజ్ జలుబు, జర్వంతో ఇంటికి చేరుకుంటాడు. అతను తుమ్ముతూ ఉండటాన్ని గమనించిన ప్రభావతి వెంటనే ఏమైందని అడుగుతుంది. దీనికి మనోజ్ బయట పానీపూరి తిన్నానని, అందుకే జలుబు వచ్చిందని చెబుతాడు. వెంటనే ప్రభావతి 'ఇది చిన్న విషయం. చికెన్ సూప్ తాగితే వెంటనే జలుబు తగ్గిపోతుంది' అంటూ సలహా ఇస్తుంది. అదే సమయంలో మీనా ఇంటికి వస్తుంది. ఆమెను చూసిన ప్రభావతి వెంటనే 'ఎక్కడికి వెళ్లావు? ఎక్కడి నుంచి వస్తున్నావు?' అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి మీనా వ్యంగ్యంగా 'ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇప్పుడే వచ్చాను' అంటూ కౌంటర్ ఇస్తుంది.
ఈ సమయంలో మనోజ్ కూడా తనకు చికెన్ సూప్ కావాలని, బయటకు వెళ్లి చికెన్ తీసుకురమ్మని మీనాను ఆదేశిస్తాడు. ఇప్పటికే ఇంట్లో జరిగిన అవమానాల వల్ల బాధలో ఉన్న మీనాకు ఇది మరింత కోపం తెప్పిస్తుంది. వెంటనే తాను వెళ్లనని స్పష్టంగా చెబుతుంది. 'ఇంట్లో రోహిణి ఉంది కదా... ఆమెతో తెప్పించుకోండి. అవసరమైతే బిర్యానీ కూడా చేయించుకోండి'అంటూ ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఈ మాటలు విన్న ప్రభావతి కోపంతో 'ఎందుకు ఇలా ఎదురు మాట్లాడుతున్నావు? చిన్న పెద్ద తేడా లేదా?' అంటూ మందలిస్తుంది.
దానికి మీనా మరింత కఠినంగా 'వయసు పెరిగినంత మాత్రాన బుద్ధి కూడా పెరగాలి కదా'అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఈ మాటలు విన్న మనోజ్ కూడా ఆగ్రహంతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. 'ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? రోహిణితో నీకు పోలికే లేదు. రోహిణి మలేషియాలో గొప్పింట్లో పుట్టింది. నువ్వేమో బస్తీలో పూలు అమ్ముకుంటూ పెరిగిన దానివి'అంటూ మీనాను తీవ్రంగా అవమానకరంగా మాట్లాడుతాడు.
ఈ మాటలు విన్న మీనాకు సహనం కోల్పోతుంది. వెంటనే 'నువ్వు ఎప్పుడైనా నీ అత్తగారి ఇంటికి వెళ్లావా? నీ అత్తమామలు ఎవరో తెలుసా?'అంటూ చురకలు వేస్తుంది. దీంతో మనోజ్ మరింత కోపంతో 'నువ్వెంత... నీ స్థాయి ఎంత? వెళ్లి చికెన్ సూప్ చేసి పెట్టు... బిల్లుతో పాటు టిప్పు కూడా ఇస్తాను'అంటూ అవహేళనగా మాట్లాడతాడు. ఈ మాటలు మీనాను ఆగ్రహానికి గురి చేస్తాయి. గదిలోకి వెళ్లి మీనా చేతిలో బెల్ట్ పట్టుకుని తిరిగి వస్తుంది. మీనా ఉగ్రరూపం చూసిన ప్రభావతి ఏదో పెద్ద గొడవ జరుగబోతుందని గమనించి భయపడుతుంది. కానీ ఆలోచించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా మీనా మెరుపు వేగంతో వచ్చి మనోజ్‌పై బెల్టుతో దాడి చేస్తుంది. 'మరోసారి తమ్ముడు భార్యతో అమర్యాదగా మాట్లాడతావా?' అంటూ బెల్టుతో ఊరికించుకుంటూ కొడుతుంది.
బెల్ట్ దెబ్బలు తట్టుకోలేక మనోజ్ అరిచేస్తూ తల్లడిల్లిపోతాడు. ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. ఈ దృశ్యం చూసిన ప్రభావతి భయంతో గజగజ వణికిపోతుంది. తనకూ దెబ్బలు పడతాయేమో అన్న భయంతో వెంటనే పరుగెత్తుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టుగా కనిపిస్తుంది. ఇలా మీనా కోపం తారాస్థాయికి చేరిన ఈ సంఘటనతో ఎపిసోడ్ హైడ్రామాతో ముగిసింది. ఇక ఈ ఘటన తర్వాత ఇంట్లో పరిస్థితి ఎలా మారుతుంది? మనోజ్ దీనికి ఎలా స్పందిస్తాడు? ప్రభావతి తదుపరి ఏం చేస్తుంది? అనే ఉత్కంఠతో ప్రేక్షకులు వచ్చే ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications










