Gundeninda Gudigantalu March 27th Episode: రోహిణి మరో కుట్ర, శివ సూసైడ్, మీనా సంసారం ముక్కలు, అండగా బాలు
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్‌లో ప్రభావతి కుటుంబంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుని కథ ఉత్కంఠభరితంగా మారింది. ప్రారంభంలో డాన్స్ క్లాస్‌లో ప్రేమ్ కుమార్ ప్రవర్తన నచ్చక ప్రభావతి అతనిని గట్టిగా మందలించి, శిక్షగా 100 గుంజులు తీయమని ఆదేశించడం ఆసక్తిని రేకెత్తించింది.ఇక రోహిణి ప్లాన్ ప్రకారం ప్రభావతిని డాన్స్ స్కూల్‌కు పిలిచి, శివ లక్ష రూపాయలు దొంగతనం చేస్తున్న వీడియో చూపిస్తుంది. అది చూసిన ప్రభావతి షాక్‌కు గురై తీవ్ర ఆగ్రహంతో మీనా కుటుంబాన్ని అవమానిస్తూ, వారిపై తీవ్ర విమర్శలు చేస్తుంది. గతంలో అదే డబ్బు కారణంగా తాను ఎదుర్కొన్న అవమానం గుర్తుకు తెచ్చుకుని, ఇప్పుడు వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయిస్తుంది.
రోహిణి కూడా 'పోలీసులకు అప్పగిద్దాం' అంటూ మరింత రెచ్చగొడుతుంది.మరోవైపు గుణ, శివను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తూ వీడియో వైరల్ అవుతోందని చూపించి, బాలు మీద నింద వేసి తనవైపు తిప్పుకోవాలని చూస్తాడు. కానీ శివ మాత్రం భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లో అయితే శివ కుటుంబం సంవత్సరికం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా, ప్రభావతి అక్కడికి చేరుకుని శివపై దాడి చేస్తుంది. చేతులతో పాటు చెప్పుతో కూడా కొట్టడం షాకింగ్‌గా మారుతుంది. మీనా అడ్డుపడి కుటుంబ గౌరవం కోసం ఎదురు నిలుస్తుంది. అదే సమయంలో రోహిణి వీడియో చూపించడంతో అందరూ షాక్‌కు గురవుతారు. ఈ ఘటనతో మీనా తల్లి పార్వతి తీవ్రంగా కుంగిపోగా, మీనా కూడా శివపై ఆవేశంతో విరుచుకుపడుతుంది. అయినా ప్రభావతి కోపం చల్లారక శివను బయటకు లాగడం ఎపిసోడ్‌ను హై వోల్టేజ్ క్లైమాక్స్‌తో ముగించింది.

Photo courtesy: Jio Hotstar
శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా మారింది. శివ దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది. ఈ అవకాశాన్ని ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్‌గా చూసుకున్న ప్రభావతి, నేరుగా మీనా పుట్టింటికి చేరుకుని హంగామా సృష్టిస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మీనా కుటుంబాన్ని 'దొంగల కుటుంబం' అంటూ తీవ్రంగా దూషిస్తూ, ఒక్కసారిగా వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చేస్తుంది. మీనాను టార్గెట్ చేస్తూ, ఈ దొంగతనానికి ఆమెకూ సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేస్తుంది. 'నువ్వే క్లూ ఇచ్చావ్ కాబట్టే శివ నా దగ్గర డబ్బు ఉన్న టైమ్ చూసుకుని దొంగతనం చేశాడు' అంటూ మీనాపై నేరుగా నిందలు మోపుతుంది. ఈ పరిస్థితిని మరింత రెచ్చగొట్టేందుకు రోహిణి కూడా మీనాపై ఆరోపణలు చేస్తూ అత్తకు మద్దతుగా నిలుస్తుంది.
ఇదే సమయంలో శివ తన తప్పును ఒప్పుకుని తల్లి, అక్క కాళ్లపై పడుతూ క్షమాపణలు కోరుతాడు. తాను నిజంగా డబ్బు కోసం కాకుండా, అవమానం ఎదుర్కొన్నందుకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అలా చేశానని చెబుతూ అసలు నిజాన్ని బయటపెడతాడు. అయినప్పటికీ ప్రభావతి మాత్రం ఏ మాత్రం కరగదు. మీనా కుటుంబం మొత్తం క్షమాపణలు చెప్పినా, 'ఈ దొంగ వెధవను పోలీసులకు అప్పగించకుండా వదలను' అంటూ శివ కాలర్ పట్టుకుని బయటికి లాగుతుంది. ఈ క్రమంలో మీనా, సుమతి ఎంత వేడుకున్నా వినకుండా ప్రభావతి ఆగ్రహంతో ముందుకు సాగుతుంది. అయితే అక్కడి కాలనీ వాసులు అడ్డుకుని, "ఆ పిల్లవాడు తన తప్పు ఒప్పుకున్నాడు, ఇక చాలదు?" అంటూ ప్రభావతిని ప్రశ్నిస్తారు. 'ఇంకా ఇలాంటి గొడవలు చేయొద్దు, వెంటనే వెళ్లిపో' అంటూ గట్టిగా హెచ్చరిస్తారు.
అయినా ప్రభావతి తగ్గకుండా, శివ దొంగిలించిన డబ్బుతో కుటుంబం జల్సాలు చేస్తున్నారని, సుమతి పెళ్లి కూడా ఆ డబ్బుతో చేయాలని చూస్తున్నారని, మీనాను ఇకపై తన ఇంట్లో కాలుపెట్టనివ్వను అంటూ మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తుంది. దీంతో కాలనీ ప్రజలు మీనా కుటుంబం పట్ల మద్దతుగా నిలిచి, ప్రభావతి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో రోహిణి జోక్యం చేసుకుని, 'ఇప్పుడు వెనక్కి తగ్గకపోతే మనపై అందరూ తిరగబడతారు' అంటూ అత్తను శాంతింపజేస్తుంది. చివరికి ప్రభావతి శివను వదిలేసి, ఇంకా మీనా కుటుంబాన్ని దూషిస్తూ,మీనా ను తన ఇంట్లో కాలుపెట్టనివ్వను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ప్రభావతి చేసిన ఆరోపణలు, కాలనీ ముందు జరిగిన అవమానంతో మీనా తల్లి పార్వతి తీవ్ర మనోవేదనకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుని, 'ఒక్కసారి దొంగ అనే ముద్ర పడినప్పుడు నీ తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు... ఇప్పుడు నువ్వు అదే మచ్చను మళ్లీ మా ఇంటికి తెచ్చావు'అంటూ శివపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గతంలో జరిగిన విషాదాన్ని గుర్తుచేసుకుంటూ, 'నీవల్ల మీనా సంసారం ముక్కలైంది... ఎందుకురా నువ్వు పుట్టి?'అంటూ బోరున విలపించడం హృదయ విదారకంగా మారుతుంది.
ఈ భావోద్వేగ పరిస్థితిలో శివ తన తప్పుకు గల అసలు కారణాన్ని బయటపెడతాడు. 'నాకు దొంగతనం చేయాలనే ఉద్దేశం లేదు... ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నన్ను తీవ్రంగా అవమానించారు. ఆ అవమానానికి ప్రతీకారంగా గుణ ప్రోద్బలంతోనే నేను ఆ పని చేశాను' అంటూ నిజం చెబుతాడు. అంతేకాకుండా ఈ విషయం బాలు బావకు ముందే తెలిసినదని, అదే కారణంగా తన చేతిని విరగొట్టాడని ఫ్లాష్‌బ్యాక్ ద్వారా వివరిస్తాడు. 'ఆ వీడియోను చూపించి... ఇది బయటపెడితే నీ అక్క నీతో మాట్లాడదు, నీ అమ్మ ప్రాణాలు ఉండవు అని చెప్పి, ఎవరికి చెప్పనని మాట ఇచ్చాడు'అంటూ బాలు గొప్పతనాన్ని గుర్తు చేస్తాడు.
ఈ నిజం విన్న మీనా తీవ్రంగా ఎమోషనల్ అవుతుంది. 'చూసావా బాలు ఎంత గొప్ప మనిషో... ప్రతి కష్టంలో మనల్ని కాపాడాడు' అంటూ ఎమోషనల్ అవుతుంది. పార్వతి కూడా అదే బాధతో, 'అలాంటి మనిషిని నేను అర్థం చేసుకోలేకపోయా... ఇప్పుడు ఆయన ముఖం ఎలా చూడాలి?'అంటూ మరింత కుంగిపోతుంది. ఈ క్రమంలో సుమతి మరో నిజాన్ని బయటపెడుతూ, 'శివ ఎగ్జామ్స్ రాయడానికి బాలు బావ జైలుకి కూడా వెళ్లాడు'అని చెప్పడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. దీంతో పార్వతి మరింత విచారంతో, 'మీ కోసం బాలు ఎన్ని నిందలు భరించాడో చూశావా... తండ్రిలా కాపాడిన అతన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నా'అంటుంది.
అదే సమయంలో శివపై తీవ్రంగా మండిపడుతూ, 'నీవల్ల ఈ ఇంటిపై దొంగ ముద్ర పడింది... మీనా జీవితం పాడైంది... సుమతి పెళ్లి కూడా ప్రమాదంలో పడింది'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మాటలు తట్టుకోలేక శివ తీవ్ర మనస్తాపంతో ఇంటిని వదిలి వెళ్లిపోతాడు.
మరోవైపు.. ప్రభావతి ఇంట్లో శివ దొంగతనం వీడియోపై తీవ్ర చర్చలు జరుగుతుండగా, ఇంటి వాతావరణం పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంలో ప్రభావతి, మీనా మరియు శివపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, కుటుంబ గౌరవాన్ని దిగజార్చారని మండిపడుతుంది. ఇదే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిణి, తన ప్లాన్‌లో భాగంగా మీనాపై మరింత విషం కక్కుతుంది. 'నేను అబద్ధాలు చెప్పడానికి భయపడతాను... కానీ మీనా, బాలు ఇద్దరూ లక్ష రూపాయల దొంగతనం విషయం తెలిసినా దాచిపెట్టి అందరినీ మోసం చేశారు'అంటూ ఇంట్లో అనుమానాలను మరింత పెంచుతుంది. ఇక మనోజ్ కూడా ఇదే అవకాశంగా తీసుకుని, 'నాపై ఆరోజు ఎంత అనుమానం పెట్టారు... నేను శివ బ్యాగ్ దొంగతనం చేశానని కూడా అనుకున్నారు'అంటూ పాత విషయాలను లేవనెత్తి పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తాడు.
ఇంట్లో జరుగుతున్న ఈ మాటలన్నింటిని విన్న సత్యం తీవ్ర ఆలోచనలో పడిపోతాడు. ఎవరి మాట నమ్మాలో అర్థంకాని పరిస్థితి నెలకొంటుంది. ఇంతలో తిరుపతి టూర్ ముగించుకుని బాలు ఇంటికి చేరుకుంటాడు. కానీ ఇంట్లో నెలకొన్న ఉద్రిక్తత గురించి అతనికి ఏమాత్రం తెలియదు. తండ్రి సత్యానికి ప్రసాదం ఇస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అయితే సత్యం ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా నిరాకరించడం బాలుకు షాక్ ఇస్తుంది. 'మీనా ఎక్కడ?'అని అడిగితే, 'ఇకపై ఈ ఇంటికి రాదు' అంటూ ప్రభావతి చెప్పడంతో బాలు కంగారుపడతాడు. ఇంట్లో ఏదో పెద్ద విషయం జరిగిందని గ్రహించి, అసలు ఏం జరిగిందని నిలదీస్తాడు.
ఈ సమయంలో మనోజ్, 'నటిస్తున్నావా? ఆ వీడియో నువ్వు చూడలేదా?'అంటూ వ్యంగ్యంగా మాట్లాడతాడు. బాలు ఆశ్చర్యపోతూ 'ఏ వీడియో?'అని అడగగా, 'నీ బామ్మర్ది శివ దొంగతనం చేసిన వీడియో ఇదిగో చూడు' అంటూ వీడియోను చూపిస్తాడు. అయితే వీడియో సగం చూసిన వెంటనే బాలు, 'ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది?'అంటూ మనోజ్‌ను ప్రశ్నిస్తాడు. దీంతో మనోజ్, 'అంటే నీకు ఈ విషయం ముందే తెలుసా?'అంటూ ఎదురుదాడి చేస్తాడు. ఈ ప్రశ్నతో ఎపిసోడ్ సస్పెన్స్‌గా ముగుస్తుంది.
ఇక రాబోయే ఎపిసోడ్లలో కథ మరింత ఆసక్తికరంగా మారనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో జరిగిన ఆరోపణల నేపథ్యంలో బాలు తన అత్తగారింటికి వెళ్లి మీనా పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడ మీనా కుటుంబ సభ్యులు బాలుకు క్షమాపణలు చెప్పడం భావోద్వేగాన్ని పెంచుతుంది. అదే సమయంలో పోలీసులు శివను అరెస్ట్ చేయడానికి రావడం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తుంది. దొంగతనం వీడియో వైరల్ కావడంతో ఒత్తిడిని తట్టుకోలేక శివ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అయితే సమయానికి అక్కడికి చేరుకున్న బాలు, 'నేను నీకు అండగా ఉంటాను'అంటూ అతన్ని ఆపి, ఆత్మహత్య నుంచి కాపాడతాడు. 'నేను జైలుకి వెళ్తాను'అంటూ భయపడుతున్న శివకు ధైర్యం చెబుతూ, తనతో ఉన్నానని హామీ ఇస్తాడు. ఈ పరిణామాలు కథను మరింత ఎమోషనల్‌గా, ఉత్కంఠభరితంగా మార్చేలా కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల్లో తదుపరి ఎపిసోడ్‌పై భారీ ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











