Gundeninda Gudigantalu March 30th Episode: శివను దాచిన బాలు, రోహిణి అక్కసు, ఇదంతా ప్రభావతి కుట్రనా?
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కథ ఉత్కంఠభరితంగా సాగింది. శివ దొంగతనం వీడియో బయటకు రావడంతో ప్రభావతి చేతికి బలమైన ఆయుధం దొరికినట్లైంది. వెంటనే మీనా పుట్టింటికి వెళ్లిన ఆమె అక్కడ పెద్ద హంగామా సృష్టించింది. మీనా తమ్ముడిని చెప్పుతో కొట్టడం, కుటుంబాన్ని 'దొంగల కుటుంబం' అంటూ అవమానించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. ప్రభావతి ఆరోపణలకు మీనా షాక్ అవుతుంది. "నువ్వే క్లూ ఇచ్చావు" అంటూ నేరుగా మీనాపై ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తత పెరుగుతుంది. కాలనీ వాసులు కూడా కొంతమంది ప్రభావతికి మద్దతు ఇవ్వడంతో మీనా కుటుంబం ఒత్తిడిలో పడుతుంది.
ఇదే సమయంలో శివ ముందుకు వచ్చి తన తప్పును ఒప్పుకుంటాడు. కోపంతో చేసిన పని ఇంత పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదని చెబుతాడు. అయినా ప్రభావతి కోపం తగ్గదు. పోలీసులకు అప్పగించాలంటూ శివను లాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ కాలనీ వాసులు అడ్డుకుని పరిస్థితిని కంట్రోల్ చేస్తారు. రోహిణి జోక్యం చేసుకుని ప్రభావతిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. వెళ్లేటప్పుడు మీనా ఇక తన ఇంట్లోకి రాదని హెచ్చరిస్తుంది. తర్వాత పార్వతి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇదే సమయంలో శివ మరో షాకింగ్ నిజం చెబుతాడు - ఈ విషయం బాలు ముందే తెలుసుకుని తనను కాపాడాడని వెల్లడిస్తాడు. దీంతో మీనా కుటుంబం షాక్‌కు గురవుతుంది. మరోవైపు ఇంట్లో రోహిణి, మనోజ్ మాటలతో పరిస్థితి మరింత విషమిస్తుంది. చివర్లో బాలు ఇంటికి రావడం, కానీ అందరి అనుమానాలతో కథ మరింత టెన్షన్‌గా మారుతుంది.

Photo courtesy: Jio Hotstar
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. బాలు ఇంటికి చేరుకున్న వెంటనే పరిస్థితి వేడెక్కింది. అతనిపై కోపంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మనోజ్, బాలు ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హేళనగా మాట్లాడాడు. 'మీనా ఎక్కడ?'అని బాలు ప్రశ్నించగా, 'ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నావా?'అంటూ మనోజ్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో వాతావరణం మరింత టెన్షన్‌గా మారింది. ఈ సమయంలో మనోజ్ కీలకమైన ట్విస్ట్ ఇచ్చాడు. శివ దొంగతనం చేసిన వీడియోను బాలు ముందు పెట్టాడు. వీడియో చూసిన వెంటనే బాలు ఆగ్రహంతో రియాక్ట్ అయ్యాడు.
'ఈ వీడియో నీకు ఎక్కడిది?'అని ప్రశ్నించగా... మనోజ్ వెంటనే, 'అంటే ఈ వీడియో గురించి ముందే నీకు తెలుసా?' అంటూ బాలును నిలదీశాడు. బాలు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న ప్రభావతి, బాలు,మీనా మీద తీవ్ర ఆరోపణలు చేసింది. బాలు కూడా ఈ దొంగతనంలో భాగమనేలా మాట్లాడడంతో ఇంట్లో పరిస్థితి పూర్తిగా అతలాకుతలమైంది. సత్యం మాత్రం ఏం చేయాలో అర్థం కాక మౌనం పాటించాడు. 'మీన ఇక ఈ ఇంటికి రాదు... కాలు పెట్టనివ్వను' అంటూ ప్రభావతి గట్టిగా హెచ్చరించింది. అయినా బాలు వెనక్కి తగ్గకుండా, 'మీనాను తిరిగి ఈ ఇంటికి తీసుకొస్తా' అంటూ సవాల్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా, శివ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి మరింత సీరియస్ అయ్యింది. నెటిజెన్లు భారీగా స్పందిస్తూ... వెంటనే నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్, పోలీసులపై ఒత్తిడి పెరగడం కేసును త్వరగా పరిష్కరించాలని పిలుపు దీంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. శివ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు బాలు మీనా పుట్టింటికి వెళ్లడం కథలో కీలక మలుపుగా మారింది. శివ దొంగతనం వీడియో వైరల్ కావడంతో మీనా ఇంట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటిల్లిపాది భయంతో, బాధతో కుంగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆందోళనలో మునిగిపోయారు. అలాంటి సమయంలో బాలు అక్కడికి చేరుకోవడం పరిస్థితిని మరింత భావోద్వేగంగా మార్చింది. బాలు కనిపించగానే మీనా అదుపుతప్పి ఏడుస్తూ అతని దగ్గరకు పరుగెత్తి వెళ్లి పడిపోతుంది. ఆ క్షణం మొత్తం ఇంటిని కదిలించేంత ఎమోషనల్‌గా మారుతుంది. తన బాధను అదుపు చేసుకోలేకపోయిన మీనాను బాలు ఓదార్చే ప్రయత్నం చేస్తూ, "ఏం జరగదు... నేను ఉన్నాను" అంటూ ధైర్యం చెబుతాడు. ఈ సీన్ ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా సాగుతుంది.
ఇక పార్వతి తన తప్పు తెలుసుకుని బాలు ముందు తలవంచుతుంది. "వాడు చిన్నపిల్లాడు... ఏం తెలియదు... చెడిపోయాడు అంతే" అంటూ శివ తప్పును సమర్థించే ప్రయత్నం చేస్తుంది. అయితే బాలు కోపం చూపకుండా శాంతంగా స్పందిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటాడు. ఈ సన్నివేశం బాలు వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చూపిస్తుంది. ఈ సమయంలో మీనా మరింత ఎమోషనల్ అయి బాలు కాళ్లపై పడుతూ క్షమాపణలు కోరుతుంది. "నా తమ్ముడి విషయం లో నేను తప్పు మాట్లాడాను... నిజం తెలియక నిన్న బాధ పెట్టాను" అంటూ కన్నీళ్లతో కూలిపోతుంది. ఈ సీన్ కుటుంబ బంధాల విలువను స్పష్టంగా చూపిస్తూ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది.
ఈ నేపథ్యంలో బాలు అసలు విషయాన్ని బయటపెడతాడు. శివ మనస్తత్వం తనకు బాగా తెలుసని, తల్లి మీద కోపంతోనే ఆ దొంగతనం చేశాడని చెబుతాడు. అంతేకాకుండా ఈ పరిస్థితికి అసలు కారణం గుణ అని వెల్లడిస్తూ కథలో కొత్త ట్విస్ట్ ఇస్తాడు. "గుణ వల్లే శివ ఇలా మారాడు... నేను ముందే హెచ్చరించాను" అంటూ చెప్పడం పరిస్థితిని మరింత సీరియస్‌గా మారుస్తుంది. చివరగా బాలు కుటుంబ సభ్యులను ఓదార్చుతూ, "శివకు ఏం కాకుండా నేను చూసుకుంటా" అని హామీ ఇస్తాడు. ఈ మాటలతో మీనా కుటుంబానికి కొంత ధైర్యం, నమ్మకం కలిగినట్లు అవుతుంది.
ఇంతలోనే.. శివ కోసం గాలిస్తున్న పోలీసులు చివరకు మీనా పుట్టింటికి చేరుకుంటారు. అక్కడి పరిస్థితులను గమనించిన వారు నేరుగా కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తూ, 'శివ ఇక్కడే ఉంటాడు... ఇప్పుడతను ఎక్కడ?' అంటూ నిలదీస్తారు. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, వీడియో వైరల్ అయినందున వెంటనే శివను అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయని కానిస్టేబుల్స్ స్పష్టం చేస్తారు. దీంతో ఇంట్లో ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.
ఈ సమయంలో బాలు ముందుకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. 'ఇది మా ఇంటి సమస్య... ఆ డబ్బులు కూడా మా అమ్మవే... శివ తిరిగి ఇచ్చేశాడు' అంటూ వివరించడానికి ప్రయత్నిస్తాడు. అయితే పోలీసులు మాత్రం కఠినంగా స్పందిస్తూ, 'వీడియో బయటికి రాకముందు అది మీ సమస్య... కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఇది మా కేసు' అంటూ క్లియర్‌గా చెబుతారు. 'ఏం చెప్పాలనుకుంటే స్టేషన్‌లో చెప్పండి' అంటూ బాలును గట్టిగా హెచ్చరిస్తారు.
శివ ఎక్కడున్నాడని పోలీసులు పదేపదే అడగగా, 'వీడియో వైరల్ అయినప్పటి నుంచి వాడు ఇంట్లో లేడు... మేము కూడా వెతుకుతున్నాం... వచ్చాక నేనే తీసుకువస్తాను" అని బాలు హామీ ఇస్తాడు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరుగుతారు. కానీ ఇంట్లో ఆందోళన మాత్రం తగ్గదు. ఇంతలో శివ కనిపించడం లేదని మీనా చెప్పడంతో బాలకు అనుమానం వస్తుంది. ఏదైనా ఆవేశపూరిత నిర్ణయం తీసుకుంటాడేమో అన్న భయం అతడిని వెంటాడుతుంది. వెంటనే బాలు గుర్తుకు తెచ్చుకుంటాడు. వస్తూ ఉండగా వీధి చివర ఉన్న మూడు అంతస్తుల భవనం వద్ద శివ బైక్ కనిపించిందని. వెంటనే అక్కడికి పరుగెత్తుతాడు. అతని వెంట కుటుంబ సభ్యులంతా వెళ్తారు.
బాలు ఊహించినట్టుగానే అక్కడ షాకింగ్ సీన్ కనిపిస్తుంది. భవనం పై అంతస్తులో నిలబడి ఉన్న శివ ఆత్మహత్యకు సిద్ధమవుతాడు. 'దగ్గరకు వస్తే దూకేస్తాను' అంటూ అందరినీ బెదిరిస్తాడు. ఈ దృశ్యం చూసి కుటుంబ సభ్యులు కంగారుపడి శివను కాపాడేందుకు ప్రయత్నిస్తారు. శివ తీవ్ర భావోద్వేగంతో తన మనసులోని బాధను బయటపెడతాడు. 'నా వల్ల కుటుంబ పరువు పోయింది... అక్క పెళ్లి ఆగిపోయింది... నాకు ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది' అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన జీవితానికి ఇక విలువ లేదని భావిస్తూ, 'నన్ను వదిలేయండి'అంటూ చివరి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతాడు.
ఈ సమయంలో బాలు అసలు హీరోలా ముందుకు వస్తాడు. శివను మాటల్లో పెట్టి, అతని దృష్టిని మళ్లిస్తూ క్రమంగా దగ్గరికి వెళ్లి, ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. బాలు ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పుతుంది. శివ ఆవేదనతో, 'నన్ను దొంగ అన్నందుకే నేను అలా చేశాను... కానీ నిజంగా నేను తప్పు చేయలేదు... డబ్బులు తిరిగి ఇచ్చేశాను'అంటూ తన బాధను చెప్పుకుంటాడు. దీనికి బాలు ఓదార్పు ఇస్తూ, 'నాకు నిజం తెలుసు... నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు' అంటూ ధైర్యం చెబుతాడు. 'నేను జైలుకెళ్తానా? నా జీవితం ఇక్కడితో అయిపోయిందా?' అంటూ శివ అడగగా, బాలు అతడికి అండగా నిలుస్తూ, 'నేనుండగా నీకు ఏమీ కాదు... నిన్ను కాపాడే బాధ్యత నాది' అంటూ గట్టి హామీ ఇస్తాడు.
శివ పరిస్థితి ఇంకా స్థిరంగా లేకపోవడంతో, బాలు అతడిని నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా తన స్నేహితుడు రాజేష్ దగ్గరకు తీసుకెళ్తాడు. పోలీసుల కన్నుగప్పి, శివను సురక్షితంగా ఉంచాలనే ఉద్దేశంతో అతడిని రాజేష్ ఇంట్లో దాచిపెడతాడు. ఈ సమయంలో బాలు పరిస్థితిని వివరంగా చెప్పుతూ, "వాడు ఇప్పుడే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు... కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకో" అంటూ రాజేష్‌కు గట్టిగా చెబుతాడు. దీనికి రాజేష్ ధైర్యం ఇస్తూ స్పందిస్తాడు. "నువ్వేం టెన్షన్ పడకు... శివను నేను జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు చేయాల్సింది ఏదైతే ఉందో అది పూర్తి చేయి. పోలీసుల కంట పడకుండా జాగ్రత్తగా ఉండు" అంటూ బాలను సపోర్ట్ చేస్తాడు. ఈ సన్నివేశం బాలు-రాజేష్ మధ్య ఉన్న స్నేహాన్ని హైలైట్ చేస్తుంది.
ఇక మరోవైపు, బాలు మీనాను తిరిగి ఇంటికి తీసుకువెళ్తాడు. కారులో వెళ్తూ ఇద్దరి మధ్య భావోద్వేగ సంభాషణ జరుగుతుంది. ఈ సమయంలో మీనా, బాలు చేతిలోకి కొత్త మొబైల్ ఫోన్ ఇస్తూ, "నీ ఫోన్ పోయిందని నేనే కొత్తది కొనుగోలు చేశాను... కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇస్తానని అనుకోలేదు" అంటూ బాధతో చెబుతుంది. ఈ చిన్న సీన్‌లోనే మీనా ప్రేమ, ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బాలు మాత్రం ఆలోచనల్లో మునిగిపోతాడు. "నా ఫోన్ ఎలా పోయింది? ఎవరు తీసుకున్నారు?" అనే అనుమానాలు అతడిని వెంటాడుతాయి. ఇప్పటి పరిణామాలను పరిశీలిస్తూ, ఇది సాధారణ విషయం కాదని, ఎవరో ముందే ప్లాన్ చేసి ఈ వీడియోను బయటపెట్టారని అతడు అంచనా వేస్తాడు.
ఇక ఇంటికి చేరుకున్న తర్వాత మీనా అడుగు ముందుకు వేయడానికి కూడా భయపడుతుంది. "నేను ఈ ఇంట్లోకి రావచ్చా లేదా?" అనే సందేహంతో బాలను చూస్తుంది. ఈ సమయంలో బాలు అండగా నిలబడి, "అనవసరంగా టెన్షన్ పడకు... ఏం జరిగినా నేను ఉన్నాను... ధైర్యంగా లోపలికి రా" అంటూ ఆమెకు ధైర్యం చెబుతాడు. దీంతో మీనా కాస్త ధైర్యం తెచ్చుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే మీనాను చూసిన ప్రభావతి ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోతుంది. "ఈ ఇంట్లోకి నీకు ఎలాంటి హక్కు లేదు... వెంటనే బయటకు వెళ్లిపో" అంటూ గట్టిగా అరుస్తుంది. ముందే హెచ్చరించానని, ఈ ఇంట్లోకి మళ్లీ అడుగు పెట్టకూడదని తీవ్రంగా మండిపడుతుంది.
దీనికి బాలు గట్టిగా ఎదురు నిలుస్తాడు. "నాకెంత హక్కు ఉందో మీనాకూ అంతే హక్కు ఉంది... శివ చేసిన తప్పుకు ఆమెను ఎందుకు శిక్షిస్తున్నావ్?" అంటూ ప్రశ్నిస్తాడు. అయితే మనోజ్ మాత్రం వీడియో వైరల్ కావడంతో కుటుంబ పరువు పోయిందని చెప్పి బాలును కౌంటర్ చేస్తాడు. ఈ సమయంలో ప్రభావతి మరింత కఠినంగా స్పందిస్తూ, "దొంగతనం చేసిన వాళ్ల ఇంటి వాళ్లకు ఇక్కడ స్థానం లేదు" అని తేల్చి చెబుతుంది. ఇదే అవకాశంగా భావించిన మనోజ్, రోహిణి కూడా తమ అసహనాన్ని బయటపెడుతూ, "ఈ వీడియో వల్ల మేము బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నాం" అంటూ ప్రభావతికి మద్దతుగా నిలుస్తారు. "ఇది అమ్మ ఇల్లు... ఇక్కడ ఎవరు ఉండాలో అమ్మే నిర్ణయిస్తుంది" అని స్పష్టం చేస్తారు.
ఇక్కడ బాలు ఒక్కసారిగా ఫైర్ అవుతాడు. 'దొంగతనాల గురించి మీరు మాట్లాడుతున్నారా?' అంటూ గత విషయాలను బయటపెడతాడు.'40 లక్షలు ఇంటి నుంచి తీసుకుని ఓ అమ్మాయికి ఇచ్చినప్పుడు ఎక్కడ పోయింది పరువు?, హనీమూన్ టికెట్ల కోసం లక్ష రూపాయలు దొంగతనం చేసినప్పుడు ఏమైంది? నా భార్య నగలు అమ్మినప్పుడు మీ గౌరవం ఎక్కడికి పోయింది?' మీనాది దొంగల కుటుంబం అయితే.. ఇది కూడా దొంగల కుటుంబమే 'అంటూ బాలు ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటపెట్టడంతో ఇంట్లో ఉన్నవాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు.
అయినా ప్రభావతి మాత్రం తన నిర్ణయం మార్చుకోకుండా, 'మీన ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు' అంటూ గట్టిగా చెబుతుంది. దీంతో బాలు, 'నేను ఎవరితో మాట్లాడను... నాన్నతోనే మాట్లాడుతా'అంటూ నేరుగా సత్యం దగ్గరకు వెళ్తాడు. సత్యం ముందు బాలు అసలు నిజాన్ని బయటపెడతాడు. 'శివ తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి ఇంటికి వచ్చాడు. కానీ ముందే అతనిపై దొంగతనం నింద వేసి అవమానించారు. ఆ అవమానం వల్లే వాడు ఆ రోజు లక్ష రూపాయలు తీసుకున్నాడు. తర్వాత నేను వాడిని పట్టుకుని ఆ డబ్బులు తిరిగి అమ్మకు ఇచ్చేశాను. అక్కడితో విషయం ముగిసింది. కానీ ఈరోజు ఆ విషయాన్ని పెద్దది చేసింది అమ్మే'అంటూ చెప్పాడు.
ఇక బాలు చెప్పిన మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. 'శివ ఈరోజు ఆత్మహత్యకు ప్రయత్నించాడు... నేను కాపాడాను' ఈ మాట విన్న వెంటనే సత్యం షాక్‌కు గురవుతూ ప్రభావతిపై కన్నెర్ర చేస్తాడు. దీంతో ఇంట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగియగా, కథ మరింత ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











