Gundeninda Gudigantalu April 13th Episode: రంగంలోకి బాలు.. మీనా సేఫ్ .. దీనేష్, గుణ పరార్.. ప్రభావతికి షాక్
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభం నుంచే రోహిణి చేసిన దొంగతనం బయటపడుతుందనే భయంతో టెన్షన్‌లో కనిపిస్తుంది. గుణను సంప్రదించి సహాయం కోరినా, అతడు నిర్లక్ష్యంగా స్పందిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాడు. ఇదే సమయంలో మీనా తనపై పడిన నిందను తట్టుకోలేక నిజం బయటపెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే దినేష్ ఆమెను అడ్డగించి కిడ్నాప్ చేయడం కథలో కీలక మలుపుగా మారింది. ఇంట్లో మీనా కనిపించకపోవడంతో ఉద్రిక్తత పెరుగుతుంది. మనోజ్ చేసిన వ్యాఖ్యలతో శృతి, సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రభావతి కూడా మీనాపై ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కుతుంది.
ఇదే సమయంలో వైజాగ్ నుంచి వచ్చిన బాలు ఈ పరిణామాలను చూసి షాక్ అవుతాడు. తన భార్యపై నిందలు వేయడాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీనాను వెతకడానికి బయలుదేరుతాడు. మరోవైపు గుణ-దినేష్ మీనాను ఒక గదిలో బంధించి బాలును మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఫోన్ కాల్స్ ద్వారా అతడిని తప్పుదారి పట్టిస్తూ చివరకు ప్రాణహాని ఉందని బెదిరిస్తారు. దీంతో బాలు అనుమానం గుణపై పడుతుంది. చివరగా, మీనా బంధించబడిన పరిస్థితిలో దేవుణ్ణి ప్రార్థిస్తుండగా, బాలు కూడా ఆమె కోసం ఆవేదనతో ప్రార్థించడం భావోద్వేగంగా చూపించారు. ఇలా ఎపిసోడ్ క్లైమాక్స్ మరింత ఉత్కంఠ పెంచింది.

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా అలరించింది. కథ పూర్తిగా టెన్షన్ మోడ్‌లోకి వెళ్లి, ప్రతి సన్నివేశం ఆసక్తిని పెంచుతూ సాగింది. ముఖ్యంగా మీనా కిడ్నాప్ ట్రాక్ ఈ ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. మొదటగా మీనా పరిస్థితి చాలా భావోద్వేగంగా చూపించారు. దుండగుల చేతిలో చిక్కుకున్న ఆమె తీవ్ర భయంతో, అసహాయ స్థితిలో దేవుణ్ని ప్రార్థిస్తూ కనిపించింది. ' ఎలాగైనా బాలుకి నా జాడ తెలియాలి' అని కోరుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కదిలించింది. ఇక మరోవైపు బాలు.. మీనా కోసం అతను ప్రతి గల్లీ, ప్రతి మూల వెతుకుతూ కనిపించాడు. తెలిసిన వాళ్లను, తెలియని వాళ్లను అడుగుతూ తన ఆందోళనను వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో అతనికి ఓ కీలక క్లూ దొరుకుతుంది. వృద్ధ దంపతులు చెప్పిన వివరాలు కథను మలుపు తిప్పాయి. కొందరు దుండగులు మీనాను కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని వారు చెబుతారు. అంతేకాదు, ఆ కార్ వెనకాల నాగుపాము పడగ కింద దేవుడి స్టిక్కర్ ఉందని చెప్పడంతో బాలు కళ్లలో ఆశ మెరిసింది. ఈ చిన్న క్లూనే పెద్ద ఆధారంగా తీసుకుని మీనాను వెతుక్కోవాలని అతను నిర్ణయించుకోవడం కథను మరింత ఉత్కంఠగా మార్చింది. తర్వాత బాలు తన డ్రైవర్ గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టడం కూడా కథలో కీలక మలుపు. ఈ సమయంలో రాజేష్ అతనికి సపోర్ట్‌గా నిలవడం, కలిసి మీనా కోసం ప్రయత్నించడం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చూపించారు. "ఎలాగైనా మీనాను కాపాడాలి" అనే బాలులోని ఆవేశం ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపించింది.
ఇక కిడ్నాప్ చేసిన ప్రదేశంలో మీనా ధైర్యం మరో హైలైట్. దాహంగా ఉందని నీళ్లు అడిగిన ఆమెను దినేష్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ మీనా తన ధైర్యాన్ని కోల్పోకుండా అతనికి ఎదురు నిలుస్తుంది. చివరకు నీళ్లు తీసుకువచ్చిన దినేష్‌పై ఆమె వాటిని ఉమ్మేస్తుంది. అక్కడితో ఆగకుండా మీనా, దినేష్‌ను ప్రశ్నిస్తూ అతని అసలు ఉద్దేశ్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో, మీనా మరింత ధైర్యంగా మాట్లాడుతుంది. "నన్ను కిడ్నాప్ చేసి నీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు... బాలు వస్తే నీకు చుక్కలు చూపిస్తాడు" అంటూ ఆమె ఇచ్చిన వార్నింగ్ సన్నివేశానికి హై వోల్టేజ్ ఇచ్చింది. దీంతో దినేష్ లోపల మాత్రం భయపడుతున్నట్లు చూపించారు. చివరికి అతను మీనాకు ఒక గంట టైం ఇస్తూ, "అంతలో బాలు వచ్చి నిన్ను కాపాడకపోతే నీ ప్రాణాలకు ముప్పు" అంటూ హెచ్చరిస్తాడు.
మరోవైపు.. మీనా కోసం వెతుకుతూ అలసిపోయిన బాలు ఒక్కసారిగా నిరాశలోకి జారిపోతాడు. డ్రైవర్ గ్రూపులో పెట్టిన మెసేజ్‌కు ఎవరూ స్పందించకపోవడంతో అతను బాధపడుతూ కనిపిస్తాడు. "ఇంతకీ ఎక్కడ వెతకాలి?" అనే ఆందోళనతో అతని పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అయితే ఈ సమయంలో కథలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక్కసారిగా వందలాది మంది డ్రైవర్లు అక్కడికి చేరుకుని బాలుకి అండగా నిలుస్తారు. "మేమున్నాం... మీనాను కనుక్కుంటాం" అంటూ ధైర్యం చెబుతారు. ఈ సీన్ ఎమోషనల్‌గా హైలైట్‌గా నిలిచింది. తర్వాత బాలు చెప్పిన క్లూల ఆధారంగా అందరూ విడివిడిగా గాలింపు ప్రారంభిస్తారు. నాగుపాము పడగ గుర్తు ఉన్న కారును వెతుకుతుంటారు.ఈ క్రమంలో బాలు స్నేహితుల్లో ఒకరికి ఆ అనుమానాస్పద కారు కనిపించడం కథను మరో మలుపు తిప్పుతుంది. వెంటనే బాలుకి ఫోన్ చేసి 'నువ్వు చెప్పిన గుర్తు ఉన్న కారు రామాలయం ప్రాంతంలో కనిపించింది' అని సమాచారం ఇస్తాడు.
దీంతో బాలు, రాజేష్ ఇద్దరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతారు. వెంటనే రామాలయం దగ్గరకు చేరుకుంటారు. అక్కడికి వెళ్లిన బాలు ఆతురంగా "మీన... మీనా..." అంటూ గట్టిగా పిలుస్తూ వెతుకుతాడు. ఆ సన్నివేశంలో అతని ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో అక్కడ మీనా చీర కొంగు ఆనవాళ్లు కనిపించడం సన్నివేశాన్ని మరింత టెన్షన్‌గా మార్చింది. ఆ చీరను చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. "మీనాకు ఏమైనా జరిగిందా?" అంటూ భయంతో కంగారు పడతాడు. మీనా పరిస్థితి ఎలా ఉందో తెలియక అతను తీవ్ర ఆందోళనకు గురవుతాడు. ఈ సమయంలో రాజేష్ అతనికి మానసికంగా బలంగా నిలుస్తాడు. "అనవసరంగా భయపడకు... మీనా కచ్చితంగా దొరుకుతుంది" అంటూ అతన్ని ఓదారుస్తాడు.
ఇదే సమయంలో రాజేష్ మరో గల్లీ వైపు వెతుకుతూ వెళ్లడం కథలో కీలక మలుపు. అక్కడ అతని కంట నాగుపాము పడగ గుర్తు ఉన్న అదే కారు పడుతుంది. వెంటనే అతను అప్రమత్తమై ఆ కారును ఫాలో అవడం ప్రారంభిస్తాడు. ఈ సన్నివేశం సస్పెన్స్‌ను పెంచింది. అంతలోనే రాజేష్ బాలుకి ఫోన్ చేసి "కారు కనిపించింది... నేను ఫాలో అవుతున్నాను" అని చెబుతాడు. వెంటనే బాలు తెలివిగా స్పందించి, "నీ లైవ్ లొకేషన్‌ను మన డ్రైవర్ గ్రూపులో షేర్ చేయి" అని సూచిస్తాడు. రాజేష్ కూడా వెంటనే తన లొకేషన్‌ను గ్రూప్‌లో షేర్ చేస్తాడు. లైవ్ లొకేషన్ ఆధారంగా వందలాది మంది డ్రైవర్లు ఒక్కసారిగా ఆ ప్రాంతానికి చేరుకుంటారు. అందరూ కలిసి ఆ కారును ట్రాక్ చేస్తూ, మీనాను కాపాడేందుకు సిద్ధమవుతారు. ఈ కలెక్టివ్ యాక్షన్ సీన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుంది.
ఒకవైపు మీనా ప్రాణాల కోసం పోరాడుతుంటే, మరోవైపు బాలు ఆమెను కాపాడేందుకు ప్రాణాలనే పణంగా పెట్టే పరిస్థితి కనిపించింది. దినేష్ మీనా దగ్గరకు వచ్చి తాను ఇచ్చిన గడువు ముగిసిందని ఎగతాళి చేయడం కథలో టెన్షన్‌ను పెంచింది. "నీ భర్త వస్తాడని చెప్పావు... ఎక్కడ ఉన్నాడు?" అంటూ ఆమెను రెచ్చగొడతాడు. మీనా మాత్రం భయపడకుండా బాలుపై నమ్మకం ఉంచి ధైర్యంగా నిలబడుతుంది. ఇదే సమయంలో దినేష్ మరింత క్రూరంగా మారి, "నీ వేలును కట్ చేసి పంపితే వస్తాడు కావచ్చు" అంటూ దారుణ నిర్ణయం తీసుకుంటాడు. అతని చేతిలో కత్తి పడగానే సన్నివేశం మరింత ఉత్కంఠగా మారుతుంది.
అయితే సరిగ్గా అదే సమయంలో కథలో మాస్ ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. మీనా కిడ్నాప్ చేసిన ప్రదేశానికి ఒక్కసారిగా వందలాది కార్లు చేరుకుంటాయి. ఆ శబ్దం, ఆ హడావిడి చూసి దినేష్ మనుషులు షాక్ అవుతారు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి "బాలు వందల మందితో వచ్చాడు" అని చెప్పడంతో దినేష్ ఒక్కసారిగా కంగారు పడతాడు. "ఈ ప్లేస్ ఎలా ట్రేస్ చేశారు?" అంటూ ఆగ్రహంతో ఉలిక్కిపడతాడు. పరిస్థితి తన చేతుల్లో లేదని గ్రహించిన దినేష్ వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. కంగారుగా గుణకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెబుతాడు. "బాలు వందల మందితో వచ్చాడు... తేడా అయితే మనల్ని కట్ చేసేలా ఉన్నాడు" అని చెప్పడం అతని భయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. గుణ కూడా "జాగ్రత్తగా ఉండు... నేను వస్తున్నా" అంటూ ఫోన్ కట్ చేయడం తర్వాతి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.
ఇదే సమయంలో బాలు తన స్నేహితుల సహాయంతో మీనాను రక్షించడం ఎపిసోడ్‌లో ఎమోషనల్ హైలైట్‌గా నిలిచింది. ఎంతో ఆందోళనలో ఉన్న బాలు, మీనా సేఫ్‌గా కనిపించగానే ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే "నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? వాళ్లు ఏమైనా మాట్లాడారా?" అని ఆత్రంగా అడుగుతాడు. దానికి మీనా కీలక విషయాన్ని బయటపెడుతుంది. "గతంలో దీపావళి రోజున నన్ను కిడ్నాప్ చేసిన వాడే మళ్లీ వచ్చాడు" అని చెబుతుంది. అతనికి తమపై ఎందుకు ఇంత కోపం ఉందో అర్థం కావడం లేదని చెప్పడం కథలో మిస్టరీని మరింత పెంచింది. దీంతో బాలు ఆగ్రహంతో రగిలిపోతాడు. "వాడు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటాడు... పట్టుకుంటా" అంటూ బయటికి వెళ్లి వెతుకుతాడు. కానీ దినేష్ అప్పటికే అక్కడి నుంచి తప్పించుకోవడంతో బాలు చేతిలోకి వచ్చి జారిపోయినట్టు అవుతుంది.
తర్వాత మీనా జరిగిన విషయాన్ని వివరంగా చెబుతుంది. "మీరు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చి ఉంటే నా వేలు కట్ చేసేవాడు" అని చెప్పడంతో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థమవుతుంది. ఇది విన్న బాలు మరింత కోపంతో ఉడికిపోతాడు. ఇక చివరగా మీనా, బాలుకు అండగా నిలిచిన అతని స్నేహితులకు కృతజ్ఞతలు చెబుతుంది. ఈ సన్నివేశం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నిజంగా చూస్తే... సీత కోసం రాముడు వెళ్లినప్పుడు అతనికి తోడుగా వచ్చిన "రామదండు"లా, ఇక్కడ బాలు కోసం వందలాది డ్రైవర్లు రావడం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుంది.
ఈ ఎపిసోడ్‌లో కథ మరో కీలక మలుపు తిరిగింది. కిడ్నాప్ డ్రామా నుంచి బయటపడిన వెంటనే, ఇప్పుడు కుటుంబంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడటం కథను మరింత ఇంటెన్స్‌గా మార్చింది. మీనాను కాపాడుకున్న తర్వాత బాలు "ఇంటికి వెళ్దాం" అని చెప్పినా, మీనా మాత్రం ఇంటికి వెళ్లడానికి నిరాకరిస్తుంది. తనపై దొంగతనం ఆరోపణలు చేసిన ఇంట్లోకి తిరిగి వెళ్లలేనని భావోద్వేగంగా చెబుతుంది. "నన్ను నమ్మకుండా దొంగగా ముద్ర వేసిన చోట నేను ఉండలేను" అంటూ బాధపడుతుంది. ఈ సమయంలో బాలు ఆమెను ధైర్యం చెబుతూ, "ముందు అసలు నిజం తెలుసుకుందాం" అంటూ నేరుగా మీనాక్షి ఇంటికి తీసుకెళ్తాడు.
అక్కడికి వెళ్లగానే బాలు తనదైన స్టైల్లో మీనాక్షిని గట్టిగా నిలదీస్తాడు. "ఇదేనా నీ కందిపప్పు డబ్బా? రెండు లక్షలు మీనా తీసిందా? లేక ఇంకెవరైనా?" అంటూ సూటిగా ప్రశ్నలు వేస్తాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఇంత సైలెంట్‌గా ఉండటం వెనక అసలు కారణం ఏమిటని అడుగుతాడు. దీంతో మీనాక్షి ఒక్కసారిగా మాటలు రాక ఇబ్బందిపడుతుంది. ఇక మీనా కూడా ఈసారి వెనక్కి తగ్గదు. "నేను కాపీ పెట్టి ఇవ్వడం తప్పు... కానీ దొంగతనం చేశానని మీరు చూశారా?" అంటూ కౌంటర్ ఇస్తుంది. అంతేకాదు, ఇంట్లో జరుగుతున్న అనుమానాస్పద విషయాలను బయటపెడుతూ "డాన్స్ పేరుతో జరిగే నాటకాలు నాకు తెలియవా?" అంటూ అత్తను గట్టిగా ప్రశ్నిస్తుంది.
ఇక్కడ బాలు మరింత సీరియస్ అవుతూ "నువ్వు మీనాపై దొంగతనం నింద వేసావు కదా... సరే పోలీస్ స్టేషన్‌కు వెళ్లేద్దాం. అక్కడ నిజం బయటపడుతుంది" అంటూ ప్రెజర్ పెడతాడు. దీంతో మీనాక్షి కంగారు పడిపోతుంది. మొదట తప్పించుకునే ప్రయత్నం చేస్తూ "డబ్బులు పోయాయి నిజమే... కానీ మీనాపై నింద వేసింది నేను కాదు, మీ అమ్మ చేసింది" అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. ఈ మాటలు విన్న బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. "మా అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది?" అంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తాడు. అలాగే "డబ్బులు పోయాయంటే పోలీసులకు చెప్పకుండా ఎందుకు కూర్చున్నారు? ఆ డబ్బు మీది కాదా?" అంటూ లాజిక్‌తో కొడుతాడు.
ఇక తప్పించుకోలేనని గ్రహించిన మీనాక్షి అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఆ రెండు లక్షలు తనవి కావని, అవి బాలు తల్లి ప్రభావతి దాచిన డబ్బులని చెబుతుంది. అంతేకాదు, మీనా తమ్ముడు శివపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసేందుకు లాయర్ ద్వారా తీసుకున్న డబ్బులని చెప్పడంతో అసలు కథ బయటపడుతుంది. ఈ నిజం విన్న బాలు, మీనా ఇద్దరూ షాక్ అవుతారు. పైకి శివను క్షమించినట్టు నటిస్తూ, లోపల ఇలా డబ్బులు తీసుకోవడం జరిగిందా? అని మీనా ఆగ్రహానికి లోనవుతుంది. "నా తమ్ముడిపై కేసు తీసేయడానికి కూడా డబ్బులు డిమాండ్ చేశారా?" అంటూ బాధతో ప్రశ్నిస్తుంది.
ఇక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీనాక్షి తన పేరు బయట పెట్టొద్దని బాలును వేడుకుంటుంది. కానీ బాలు మాత్రం ఈసారి కఠినంగా స్పందిస్తాడు. "ఇది పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిన విషయం... అంతేకాదు రంగారావు మామయ్యకు కూడా చెబుతా" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో మీనాక్షి పూర్తిగా భయపడిపోతుంది. ప్రభావతిని కాపాడాలని ప్రయత్నించి, ఇప్పుడు తన కుటుంబమే ప్రమాదంలో పడిందని గ్రహిస్తుంది. అయితే అంతలోనే మరో ప్లాన్ ఆలోచిస్తూ... "నా విషయం బయటపెడితే ప్రభావతి రహస్యాలన్నీ బయటపెడతా" అనే ఆలోచనలో పడుతుంది. కిడ్నాప్ డ్రామా ముగిసిన వెంటనే ఇంట్లో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం సీరియల్‌లో ఉత్కంఠ పెరిగింది.
బాలు, మీనా ఇంటికి చేరుకున్న వెంటనే ప్రభావతి ఆగ్రహంతో రెచ్చిపోతుంది. "ఎక్కడికి వెళ్లావ్? ఏం జరిగింది?" అంటూ మీనాను గట్టిగా ప్రశ్నిస్తుంది. అయితే ఈసారి మీనా మునుపటి లా మౌనంగా ఉండదు. ఆమె కోపం ఒక్కసారిగా ఎగిసిపడుతుంది. "ఏం మాట్లాడుతున్నావ్ లక్షావతి... నీ అసలు గుట్టు బయట పెట్టమంటావా? నీ పాపాల చిట్టా విప్పమంటావా?" అంటూ నేరుగా సవాల్ చేస్తుంది. ఈ డైలాగ్‌తో సీన్ ఒక్కసారిగా హై వోల్టేజ్‌కు చేరుతుంది. ఇంతలో సత్యం అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంతకాలం సహనం పాటించిన మీనా, ఈసారి తన ఆత్మగౌరవం కోసం నిలబడాలని నిర్ణయించుకుంటుంది. "ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను మామయ్య... కానీ ఇక కాదు. కొన్ని ప్రశ్నలు అడగాలి... మీ అనుమతి కావాలి" అంటూ స్పష్టంగా చెబుతుంది.
దీనికి సత్యం పూర్తి మద్దతు ఇస్తూ "నా సపోర్ట్ నీకే ఉంది... అడుగు" అని చెప్పడం కథలో కీలక మలుపు. దీంతో మీనా వరుస ప్రశ్నలతో ప్రభావతిని మూలకు నెట్టేస్తుంది. "ఆ డబ్బు నేను దొంగతనం చేశానంటారా? మీరు చూశారా? మీనాక్షి చూసిందా? అసలు ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది?" అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆమె అడిగే ప్రతి ప్రశ్న ప్రభావతిని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇక్కడ సత్యం కూడా మీనాకు అండగా నిలుస్తాడు. "నేను అంత డబ్బు ఇవ్వలేదు... బాలు దగ్గర కూడా అంత డబ్బు ఉండదు... మరి ఆ రెండు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి?" అంటూ ప్రభావతిని గట్టిగా నిలదీస్తాడు. ఈ ప్రశ్నలతో ప్రభావతి పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ఇక మీనా మరోసారి గట్టిగా అడుగుతుంది. "మీరు చెప్తారా? లేక నేను చెప్పనా?" అంటూ రెండు లక్షల వ్యవహారాన్ని నేరుగా బయటపెట్టడానికి సిద్ధమవుతుంది. దీంతో సీన్ క్లైమాక్స్ మూడ్‌లోకి వెళ్తుంది. ప్రభావతి నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇక్కడే కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆ డబ్బు లాయర్ నుంచి వచ్చిందని చెప్పితే సత్యం ఎలా స్పందిస్తాడు? బాలు తన తల్లిపై ఎలా రియాక్ట్ అవుతాడు? మీనా ఆగ్రహం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఇక మరోవైపు రోహిణి పరిస్థితి కూడా సందిగ్ధంలో పడినట్టే కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె పాత్ర బయటపడే అవకాశం ఉండటంతో, కథలో మరో ట్విస్ట్ రావడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇక రాబోయే ఎపిసోడ్‌లో అసలు నిజం బయటపడుతుందా? లేక మరో ట్విస్ట్ వస్తుందా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











