Gundeninda Gudigantalu April 21st Episode: మీనా కంట మేకమామ, రోహిణికి బిగ్ షాక్, ప్రభావతి, మనోజ్ పస్తులు
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా మనోజ్ జీవితంలో కొత్త టెన్షన్ మొదలైనట్టు చూపించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. షాప్ ఎదుట కోడిగుడ్లు కనిపించడంతో భయపడిన మనోజ్, స్వామీజీని కలిసి విషయం చెబుతాడు. అవి సాధారణ గుడ్లు కావని, ఎవరో చేతబడి చేశారని స్వామీజీ చెప్పడంతో మనోజ్ షాక్ అవుతాడు. త్వరలో పేరు ప్రతిష్టలు పోతాయని, కష్టాలు ఎదురవుతాయని హెచ్చరిస్తాడు. పరిహారంగా కులదైవానికి ఉపవాసంతో పూజ చేయాలని, తల్లి ప్రభావతితో కలిసి నిష్టగా ఉండాలని చెబుతాడు. దీంతో మనోజ్ మరింత ఆందోళనకు గురవుతాడు. ఇంటికి చేరుకున్న మనోజ్, తల్లి ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలేనంటూ తిరస్కరిస్తుంది. కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అదే సమయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ప్రభావతి హాల్లోకి వెళ్లగానే సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి ఆమె కాళ్ల ముందే పడుతుంది. ప్రమాదం తృటిలో తప్పడంతో మనోజ్ భయంతో ఇది హెచ్చరిక మాత్రమేనంటూ మరలా పూజ చేయమని వేడుకుంటాడు. అయినా ప్రభావతి మాత్రం పట్టించుకోదు. ఈ సన్నివేశాలు కథలో మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు బాలు ట్రాక్ పూర్తిగా వినోదభరితంగా సాగింది. ప్రేమలో పడిన ఫ్రెండ్ తమ్ముడికి బాలు లవ్ గురువుగా మారి అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో టిప్స్ ఇస్తాడు. తరువాత ఇంట్లో నీళ్ల మోటార్ చెడిపోవడంతో గందరగోళం మొదలవుతుంది. అందరూ నీళ్లు మోస్తూ కామెడీ సృష్టిస్తారు. చివరికి మోటార్ రిపేర్ సమయంలో మనోజ్ మెయిన్ స్విచ్ ఆన్ చేయడంతో ఇంట్లో అందరికీ కరెంట్ షాక్ తగులుతుంది. మీనా తెలివిగా కర్రతో ఒక్కొక్కరిని విడదీసి అందరినీ కాపాడుతుంది. అసలు విషయం తెలిసిన ప్రభావతి, మనోజ్‌ను పట్టుకొని చితకబాదడంతో ఎపిసోడ్ నవ్వుల్లో ముగిసింది.

photo courtesy jiohotstar
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ కూడా చాలా రసవత్తరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత ఎపిసోడ్‌లో జరిగిన కరెంట్ షాక్ ఘటన ప్రభావం ఇంకా ఇంట్లో కొనసాగుతూనే కనిపించింది. మనోజ్ చేసిన అజాగ్రత్త వల్ల ఇంటిల్లిపాదీ ప్రమాదంలో పడగా, చివరి క్షణంలో మీనా సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరినీ కాపాడిన విషయం కుటుంబ సభ్యులందరినీ ఇంకా షాక్‌లోనే ఉంచింది. ముఖ్యంగా ప్రభావతి ఆ సంఘటన నుంచి ఇంకా కోలుకోలేక తన చేతి నొప్పితో బాధపడుతూ కనిపించింది. ఆమె చెయ్యి పట్టేసిందంటూ బాధపడుతుండగా రోహిణి దగ్గరకు వచ్చి మసాజ్ చేస్తూ సానుభూతి చూపిస్తుంది. ఇదే సమయంలో మీనాక్షి అక్కడికి వచ్చి, "ఈరోజు దేవుడిలా మీనా వచ్చి మనల్ని కాపాడింది కాబట్టే బ్రతికి బయటపడ్డాం.. లేకపోతే ఇప్పటికి గోడలకు ఫోటోలు పెట్టి దండలు వేసేవారు" అంటూ భయపెడుతుంది. ఈ మాటలతో ప్రభావతి మరింత కంగారుపడుతుంది.
ఇదే సరైన సమయమని భావించిన మనోజ్ వెంటనే రంగంలోకి దిగుతాడు. "ఇదంతా నా షాప్ దగ్గర దొరికిన కోడిగుడ్ల ప్రభావమే.. ఎవరో మన మీద చేతబడి చేశారు. స్వామీజీ చెప్పినట్లు పూజలు చేయకపోతే నా ప్రాణాలకే ముప్పు" అంటూ నాటకీయంగా మాట్లాడుతాడు. అతనికి రోహిణి కూడా తోడై, "అత్తయ్యా.. జరుగుతున్న ప్రతి విషయం చూస్తుంటే ఏదో కీడు జరుగుతున్నట్టు ఉంది. ఒక్కరోజు నిష్టగా పూజ చేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి" అంటూ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. చివరికి చేసేదేమీ లేక ప్రభావతి కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. దీంతో మనోజ్, రోహిణి ఇద్దరూ సంతోషంతో వెంటనే పూజ ఏర్పాట్ల కోసం బయలుదేరుతారు.
మరోవైపు మీనా జీవితంలో మరో సంతోషకర ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల ప్రారంభించిన తన డెకరేషన్ బిజినెస్‌కు తొలి ఆర్డర్ రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ ఫంక్షన్ హాల్ యజమాని ఫోన్ చేసి, చిన్న ఫంక్షన్ కోసం డెకరేషన్ చేయగలరా అని అడగగా మీనా వెంటనే అంగీకరిస్తుంది. వెంటనే హాల్‌కు వెళ్లి పనికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటుంది. అక్కడ ఓనర్ మాట్లాడుతూ, "మీ మాటలు చూస్తుంటే మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. పని మీద మీకున్న నిబద్ధత కనిపిస్తోంది" అంటూ ప్రశంసిస్తాడు. ఈ పని పెద్ద లాభం ఇవ్వకపోయినా జాగ్రత్తగా చేయమని సూచిస్తాడు. దీనికి మీనా, "నాకు డబ్బులకంటే మంచి పేరు ముఖ్యం. నలుగురిలో గుర్తింపు రావాలి" అంటూ చెప్పడంతో ఓనర్ మరింత ఇంప్రెస్ అవుతాడు. వెంటనే అడ్వాన్స్‌గా రూ.10,000 ఇస్తాడు. దీంతో మీనా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై, ఈ శుభవార్తను బాలుతో పంచుకోవాలని స్వీట్లు కొనుగోలు చేసి ఇంటికి బయలుదేరుతుంది.
ఇంట్లోకి స్వీట్లు తీసుకొని వచ్చిన మీనా, ముందుగా తన మామయ్య సత్యంకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. "నాకు తండ్రి లేరు అనే లోటు ఎప్పుడూ అనిపించకుండా మీరు ప్రతి సందర్భంలో మాకు అండగా నిలబడ్డారు. నా కొత్త బిజినెస్ తొలి అడుగు సందర్భంగా ఈ స్వీట్ తీసుకోండి మామయ్య" అంటూ భావోద్వేగంగా స్వీట్ అందించబోతుంది. అయితే అక్కడికి వచ్చిన ప్రభావతి వెంటనే అడ్డుపడి, "అయ్యో.. ఆయనకు ముందే షుగర్ ఉంది. ఇవి ఎందుకు ఇస్తున్నావ్?" అంటూ ఆపుతుంది. దీంతో సత్యం "ఒక స్వీట్ తింటే ఏం కాదు" అంటూ నవ్వేస్తాడు. ఇక ప్రభావతి అసలు ఎందుకు స్వీట్లు తెచ్చావని అడగగా, మీనా తనకు డెకరేషన్ బిజినెస్‌లో తొలి ఆర్డర్ వచ్చిందని ఆనందంగా చెబుతుంది. కానీ అభినందించాల్సింది పోయి, "ఏదో ప్రపంచ రికార్డు కొట్టినట్టు మాట్లాడుతున్నావ్" అంటూ హేళన చేస్తుంది. దీంతో సత్యం వెంటనే స్పందించి, "గాడిదకు ఏం తెలుసు గంధపు పూల వాసన" అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రభావతిపై సెటైర్ వేస్తాడు.
ఆ మాటలకు ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇదే సమయంలో రోహిణి వచ్చి విషయం తెలుసుకొని కంగ్రాట్స్ చెబుతుంది. వెంటనే మనోజ్ కూడా వచ్చి, "ఏ షాపులో తీసుకున్న ఆర్డర్?" అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతాడు. దీనిపై సత్యం మరింత ఘాటుగా స్పందిస్తూ, "నీ అమ్మకు చదువు లేదు, ఇంగితం తెలియదు. నీకైనా ఈ రోజుల్లో ఒకరిని మెచ్చుకోవడం రావాలిగా!" అంటూ చురకలు వేస్తాడు. ఇంతలో శృతి, రవి కూడా వచ్చి మీనాకు అభినందనలు చెబుతారు. ముఖ్యంగా రవి, "వదిన మీరు జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలి. మా రెస్టారెంట్‌కు వచ్చే ఆర్డర్లు కూడా మీకే ఇస్తాను" అంటూ ప్రోత్సాహం ఇస్తాడు. దీంతో సత్యం, "చూశావా ఎంత మధురంగా మాట్లాడాడు. అందుకే శుభవార్త చెప్పేటప్పుడు స్వీట్లు ఇస్తారు. ఆ చక్కెరలోని మధురం మాటల్లో కూడా కనిపిస్తుంది" అంటూ ఇంట్లో వారందరికీ క్లాస్ తీస్తాడు.
ఇదే సమయంలో బాలు ఇంటికి వచ్చి స్వీట్లు పంచడం చూసి, "ఏంటి మీనా.. తల్లి కాబోతున్నావా?" అంటూ సరదాగా కంగ్రాట్స్ చెబుతాడు. మీనా వెంటనే, "అది కాదు, నాకు కొత్త బిజినెస్ ఆర్డర్ వచ్చింది" అని చెప్పడంతో బాలు ఆనందపడిపోతాడు. "ఇది నిజంగానే సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఈరోజు మటన్ బిర్యానీ కావాలి" అంటూ డబ్బులు కూడా ఇస్తాడు. మీనా కూడా తనకు అడ్వాన్స్‌గా వచ్చిన రూ.10,000 చూపించడంతో ప్రభావతి లోలోపల కుళ్లిపోతుంది. బాలు మాత్రం "ఈరోజు ఇంట్లో బిర్యానీ గుమగుమలు రావాలి" అంటూ మీనాను మటన్ తీసుకురమ్మని పంపిస్తాడు.
మటన్ కోసం వెళ్లిన మీనా తన ఫ్రెండ్ సహాయం తీసుకుంటుంది. ఆమె ఒక మంచి మటన్ షాప్‌కి తీసుకెళ్తుంది. అక్కడే కథలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. షాప్ యజమాని మటన్ కొట్టు మాణిక్యం మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన అసలు బాగోతం బయటపడితే రోహిణి ప్రమాదంలో పడుతుందని భయపడి, వెంటనే షాప్‌లో ఉన్న ఫోటోలు తీసేసి ముఖానికి టవల్ కట్టుకుంటాడు. మీనా దగ్గరకు వచ్చి, "నాకు బిర్యానీకి మటన్ కావాలి.. మీరు ఎందుకు కైమా కొడుతున్నారు?" అని అడగగా, మాణిక్యం సైగలతో సరిపెట్టేస్తాడు.
ఇక మీనా మాత్రం అతడిని అనుమానంగా చూస్తూ, "మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. చాలా దగ్గరి వ్యక్తిలా అనిపిస్తున్నారు. ఒక్కసారి ముఖం చూపించరా?" అని అడుగుతుంది. అంతే, తన రహస్యం బయటపడుతుందనే భయంతో మాణిక్యం వెంటనే మటన్ ఇచ్చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అతడి ఈ ప్రవర్తన మీనాలో మరింత సందేహాన్ని పెంచింది. మరోవైపు ప్రేక్షకుల్లో కూడా ఈ ట్రాక్‌పై ఉత్కంఠ పెరిగింది. రాబోయే ఎపిసోడ్‌లో మాణిక్యం అసలు నిజం బయటపడుతుందా? రోహిణి గతం ఏమిటి? అనే ఆసక్తి నెలకొంది.
ఒకవైపు ఇంట్లో బిర్యానీ యుద్ధం.. బాలు బిర్యానీ కోసం టెంట్ హౌస్ నుంచి పెద్ద గిన్నెలు తీసుకొచ్చి ఇంటి వద్ద ఏర్పాట్లు చేస్తాడు. ఇదే సమయంలో మీనా కూడా మటన్ తీసుకొని ఇంటికి చేరుతుంది. అయితే ప్రభావతి మాత్రం ఇంట్లో బిర్యానీ చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. "మనం ఈరోజు వ్రతం చేస్తున్నాం.. ఇంట్లో బిర్యానీ వండటానికి వీల్లేదు" అంటూ గట్టిగా అడ్డుకుంటుంది. దీనికి బాలు వెంటనే కౌంటర్ ఇస్తూ, "సరే.. మేము బయట వండుకుంటాం" అంటాడు. కానీ ప్రభావతి అక్కడ కూడా అడ్డుపడి, "బయట వండినా వాసన ఇంట్లోకి వస్తుంది.. మాకు ఇబ్బంది" అంటూ మొండికేస్తుంది. దీంతో బాలు కోపంతో, "వాసన రాకుండా ముక్కుల్లో దూది పెట్టుకోండి" అంటూ సెటైర్ వేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది.
ఇదే సమయంలో రవి ముందుకు వచ్చి, "వదిన.. నేను కూడా సహాయం చేస్తాను" అంటాడు. వెంటనే శృతి కూడా, "నేను కూడా ఉంటా" అంటూ జాయిన్ అవుతుంది. దీంతో బాలు, మీనా, రవి, శృతి నలుగురూ కలిసి ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తయారీలో బిజీ అవుతారు. వారి సరదా మాటలు, నవ్వులు ఎపిసోడ్‌కు ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. ఇక బిర్యానీ గుమగుమలు ఇంటంతా వ్యాపించడంతో మనోజ్‌కు నోరూరిపోతుంది. "ఇంత మంచి వాసన వస్తుందంటే ఎంత నెయ్యి, మసాలాలు వేసి వండుతున్నారో!" అంటూ ఊహల్లో తేలిపోతాడు. దీంతో పక్కనే ఉన్న రోహిణి కూడా నవ్వుతూ, "నిజంగా థ్యాంక్స్ మనోజ్.. నువ్వు నా పేరు చెప్పి ఉంటే నేనూ ఉపవాసం ఉండాల్సి వచ్చేది. ఈ వాసనకు బిర్యానీ తినకుండా ఉండలేను" అంటూ చెప్పేస్తుంది.
ఈ మాటలు విన్న ప్రభావతి కోపంతో మనోజ్‌పై విరుచుకుపడుతుంది. "దుర్మార్గుడా.. నువ్వు ఉపవాసం పేరుతో నా నోటికీ అడ్డు వేసావు కదా!" అంటూ మండిపడుతుంది. ఇదే సమయంలో సత్యం అక్కడికి వచ్చి, "ఏమిటీ ఈ ఉపవాసాలు? ఈరోజు కాకపోతే ఇంకో రోజు చేసుకుందాం.. రండి అందరం కలిసి బిర్యానీ తిందాం" అంటూ పిలుస్తాడు. కానీ ప్రభావతి మాత్రం మొండిగా "నేను రాను" అంటుంది. దీంతో సత్యం రోహిణిని చూసి, "అమ్మా.. నీకేమైనా ఒక పొద్దుందా? నిజంగా ఉపవాసమా?" అని అడుగుతాడు. వెంటనే రోహిణి పార్టీ మారిపోయి, "నాకు అలాంటిదేం లేదు మామయ్య.. నేనూ మీతో జాయిన్ అవుతా" అంటుంది. దీంతో ప్రభావతి మరింత షాక్ అవుతుంది. చివరికి ఇంట్లో అందరూ కలిసి బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తింటారు. కానీ ప్రభావతి, మనోజ్ మాత్రం ఉపవాసం పేరుతో పస్తులు ఉండాల్సి వస్తుంది. ఈ ట్రాక్ నవ్వులు పూయించింది.
మరోవైపు.. మేక మామ విద్య ఇంటికి వెళ్లి రోహిణి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రోహిణి రాగానే, "మీ ఇంట్లో ఈరోజు బిర్యానీ కదా?" అని అడుగుతాడు. దీంతో రోహిణి ఆశ్చర్యంగా, "నీకు ఎలా తెలుసు?" అని ప్రశ్నిస్తుంది. దీనికి మేక మామ నవ్వుతూ, "ఆ బిర్యానీకి కావాల్సిన మటన్ మా షాప్ నుంచే తీసుకెళ్లారు. అది కూడా మీ నాన్నే తీసుకొచ్చాడు" అని చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే, "అయితే నిన్ను మీనా చూసిందా?" అని టెన్షన్‌గా అడుగుతుంది. దీనికి అతడు, "లేదులే.. ముందే అప్రమత్తమై ముఖం కనిపించకుండా టవల్ కట్టుకున్నా" అని చెప్పడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. అంతటితో ఆగకుండా మేక మామ బాధగా, "మాది హరిశ్చంద్రుల వంశం. మా నాన్న అసలు అబద్ధాలు ఆడొద్దని మాట తీసుకున్నాడు. కానీ మీ వల్ల మాత్రం రోజూ అబద్ధాలు ఆడాల్సి వస్తోంది" అంటూ తన బాధను వ్యక్తం చేస్తాడు. ఈ డైలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇలా నవ్వులు, కుటుంబ గొడవలు, రోహిణి రహస్యాల మలుపులతో నేటి ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్‌లో మేక మామ నిజం బయటపడుతుందా? రోహిణి గతం బయటకు వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications










