Gundeninda Gudigantalu April 23th Episode: ప్రభావతి దిష్టిబొమ్మ వైరల్.. మీనాకు పెళ్లి ప్రపోజల్..3 కోట్ల ట్రాప్
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, కామెడీ, ఎమోషన్ మేళవింపుగా సాగింది. రోహిణి దాచిపెట్టిన గతం బయటపడే సూచనలు కనిపించగా, మటన్ కొట్టు మాణిక్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీనా తన షాప్‌కు వచ్చి వెళ్లడంతో తాను ప్రమాదంలో పడిపోయానని, ఇకపై అబద్ధాలు చెప్పనని తేల్చి చెప్పాడు. రోహిణి షాప్ మార్చేయమని చెప్పగా, అది తమ తాతల కాలం నాటి వ్యాపారమని తిరస్కరించి, మళ్లీ మీనా వస్తే నిజం చెబుతానని హెచ్చరించాడు. దీంతో రోహిణి షాక్‌కు గురైంది.మరోవైపు మీనా బిజినెస్ ఎదగాలని బాలు చేసిన ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి. ఆమె కోసం ప్రత్యేకంగా విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించి, కస్టమర్లకు పంచుతానని చెప్పాడు. భార్య విజయాన్ని తన విజయంగా భావించిన బాలు మాటలకు మీనా భావోద్వేగానికి లోనైంది.
ఇక మనోజ్ తనపై చేతబడి చేశారనే అనుమానంతో ప్రభావతిని తీసుకుని గుడిలో వింత పూజలు చేయించాడు. వేపాకులు కట్టుకుని, నిప్పుల కుంపటితో ప్రదక్షిణలు చేస్తూ ఇద్దరూ నానా అవస్థలు పడ్డారు. అదే సమయంలో గుడికి వచ్చిన బాలు, మీనా వారిని చూసి షాక్ అయ్యారు. బాలు ఆ దృశ్యాలను వీడియో తీసి ఇంట్లో ప్లే చేయడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. చివరగా కోడిగుడ్ల రహస్యం బయటపడింది. అవి చేతబడి కోసం పెట్టినవి కాదని, ఓ చిన్నారి బొమ్మలు గీసి అక్కడే మరిచిపోయాడని తెలిసి ప్రభావతి మనోజ్‌పై మండిపడింది. ఇక ఎపిసోడ్ చివర్లో మీనాను ఓ యువకుడు ఫాలో అవుతూ అసభ్యంగా మాట్లాడడంతో ఆమె బాలుకు ఫోన్ చేసింది. దీంతో కొత్త ట్రాక్‌పై ఆసక్తి పెరిగింది.

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో రసవత్తరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో మీనా తీవ్ర భయంతో బాలుకు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి కొంతకాలంగా తన వెంబడి పడుతున్నాడని, ఇప్పుడు మరింత దగ్గరై మాట్లాడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది విన్న బాలు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. "ఇన్ని రోజులుగా ఎందుకు చెప్పలేదు?" అంటూ మీనాపై కోపం వ్యక్తం చేశాడు. దీనికి మీనా, "మీకు చెబితే పెద్ద గొడవ అవుతుందని భయపడి చెప్పలేదు" అంటూ సమాధానం ఇచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు స్నేహితుడు ప్రింట్ రాజేష్, విషయం తెలుసుకుని సీరియస్ అయ్యాడు. "చెల్లి వెంబడి పడే వాడు ఎవడు?" అంటూ మండిపడ్డాడు. పెళ్లైన మహిళలను కూడా వదలకుండా వేధించే ఘటనలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే బాలు మీనాకు ధైర్యం చెబుతూ, "టెన్షన్ పడకు.. నేను చూసుకుంటా. ముందు జాగ్రత్తగా పెప్పర్ స్ప్రే కొనుక్కొని దగ్గర పెట్టుకో. మళ్లీ నీ దగ్గరకు వస్తే కళ్లలో కొట్టు.. భయంతో మళ్లీ రాడు" అంటూ సలహా ఇచ్చాడు. దీంతో మీనా కొంత ధైర్యం తెచ్చుకుని పెప్పర్ స్ప్రే తీసుకుని దగ్గర పెట్టుకుంది.
మరోవైపు మనోజ్ తన షాప్ పనుల్లో బిజీగా కనిపించాడు. రోహిణి కూడా అతడికి సహాయం చేస్తూ ఉండగా, అక్కడికి ఓ వ్యక్తి వచ్చి "మీ షాప్‌కు నరపీడ ఎక్కువగా ఉంది. త్వరలో భారీ నష్టాలు వస్తాయి" అంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. దీనికి మనోజ్ కోపంగా స్పందించగా, ఆ వ్యక్తి తన అనుభవం ప్రకారం చెబుతున్నానని చెప్పి, దృష్టి దోషం పోవాలంటే తన దగ్గర ఉన్న ప్రత్యేక దిష్టిబొమ్మ కొనాలని సూచించాడు. ఆ బొమ్మను చూసిన మనోజ్, రోహిణి మొదట ఆశ్చర్యపోయారు. దగ్గరగా చూసిన రోహిణి అది దిష్టిబొమ్మ కాదని, ప్రభావతి ఫోటోను మార్చి తయారు చేసినదని గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు. "ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి?" అని ప్రశ్నించగా, ఆ వ్యక్తి తమిళనాడు నుంచి వస్తున్నాయని, సౌత్ మాత్రమే కాదు నార్త్‌లో కూడా ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పాడు. దీంతో మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. "ఇంకోసారి ఈ ఫోటోతో కనిపిస్తే పోలీస్ కేసు పెడతా. ఉన్న ఫోటోలన్నీ ఇక్కడే ఇచ్చి వెళ్లిపో" అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
మరోవైపు.. మరోసారి మురళి మీనా వెంబడి తిరుగుతూ కనిపించాడు. కొంతకాలంగా తనను ఫాలో అవుతూ ఇబ్బంది పెడుతున్న అతడిని చూసిన మీనా కంగారుపడింది. అయితే ఈసారి భయపడకుండా బాలు చెప్పిన సలహా గుర్తు చేసుకుంది. ముందుగానే కొనుక్కున్న పెప్పర్ స్ప్రేను తీసుకుని దగ్గర పెట్టుకుంది. "ఈసారి అయినా వాడికి బుద్ధి చెప్పాలి" అని నిర్ణయించుకుని ధైర్యంగా అతడి వైపు నడిచింది. కానీ మీనా చేతిలో పెప్పర్ స్ప్రే చూసిన మురళి ఒక్కసారిగా అప్రమత్తమయ్యాడు. ఏదో ప్రమాదం జరగబోతుందని గ్రహించి అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అయ్యాడు. దీంతో మీనా కోపంతో "ఈసారి తప్పించుకున్నావ్.. మరోసారి దొరికితే చుక్కలు చూపిస్తా" అంటూ మండిపడింది. ఇంతలో అక్కడికి మీనా చెల్లి రావడంతో విషయం మొత్తం చెప్పింది. "గత వారం రోజులుగా ఓ వ్యక్తి నా వెంటపడుతున్నాడు. చాలా ఇరిటేటింగ్‌గా ఉంది.. మరోవైపు భయంగా కూడా ఉంది" అంటూ తన బాధను వెల్లడించింది. దీనికి చెల్లి, "ఈ విషయం బావకు చెప్పలేదా?" అని అడిగింది. మీనా మాత్రం "మీ బావే పెప్పర్ స్ప్రే కొనమన్నాడు" అంటూ చెప్పింది.
అక్కడితో ఆగని మీనా, "నీ వెంట ఎవరైనా పడితే నువ్వు ఎలా స్పందిస్తావు?" అని చెల్లిని ప్రశ్నించింది. దీనికి ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చింది. "నేనైతే నేరుగా అడుగుతా.. ఎందుకు నా వెంట తిరుగుతున్నావ్? నీకు ఏం కావాలి? నాకు ఇలాంటి చేష్టలు నచ్చవు అని ముఖంపైనే చెబుతా" అంటూ ధైర్యంగా మాట్లాడింది. వెంటనే మీనాకు కూడా "నువ్వు కూడా ఒకసారి డైరెక్ట్‌గా వాడితో మాట్లాడి చూడు" అని సలహా ఇచ్చింది. దీంతో మీనా "సరే.. నువ్వు చెప్పినట్టే ఒకసారి మాట్లాడుతా" అంటూ నిర్ణయం తీసుకుంది.
ఇక మరోవైపు కథలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మీనా వెంటపడుతున్న మురళి, నేరుగా బాలు దగ్గరకు వెళ్లి తన ప్రేమ సమస్య చెప్పాడు. తాను ఇష్టపడుతున్న అమ్మాయి తనను పట్టించుకోవడం లేదని, సారీ చెప్పినా స్పందించడం లేదని బాధపడిపోయాడు. అంతేకాదు బాలును "లవ్ గురు" అంటూ పిలుస్తూ ఏదైనా సలహా ఇవ్వమని కోరాడు. అసలు అతడు మీనా వెంటపడుతున్న వ్యక్తి అని తెలియని బాలు, తనదైన స్టైల్లో సలహా ఇచ్చాడు. "ఈసారి పిల్ల వర్కౌట్ కాలేదంటే డైరెక్ట్‌గా పిల్ల ఇంటికి వెళ్లు. పూలు, పండ్లు తీసుకెళ్లు. వాళ్ల నాన్న కాళ్లపై పడిపో. అప్పుడు వాళ్లే పిల్లను నీకు ఇస్తారు" అంటూ చెప్పాడు. బాలు మాటలు విన్న మురళి ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయాడు. "హలో గురు.. మీ సలహా సూపర్. మీరు చెప్పినట్టే అమ్మాయి ఇంటికి వెళ్లి వాళ్ల నాన్న కాళ్లపై పడతా" అంటూ ఉత్సాహంగా వెళ్లిపోయాడు.
మరోవైపు.. బాలు ఇంటికి చేరుకున్న వెంటనే "మీనా.. మీనా.." అంటూ గట్టిగా పిలుస్తూ హడావిడి చేశాడు. కిచెన్‌లో ఉన్న మీనా బయటకు వచ్చి, "ఏంటండీ అలా అరుస్తున్నారు.. నేను కిచెన్‌లోనే ఉన్నాను కదా" అంటూ ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ప్రభావతికి కాఫీ ఇవ్వబోతున్న మీనాను చూసిన బాలు, "ఇంట్లో పని లేకుండా కూర్చుని ఉన్నవాళ్లకు ఇవ్వడం కంటే నాకు ఇస్తే బాగుండేది" అంటూ సెటైరికల్‌గా మాట్లాడాడు. దీంతో ప్రభావతి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఏం మాట్లాడుతున్నావ్ రా?" అంటూ బాలుపై మండిపడింది. అంతేకాదు "నా కాఫీని నువ్వే తాగేస్తున్నావ్" అంటూ కోపంగా మాట్లాడింది. దీనికి బాలు కూడా తగ్గకుండా "నాకు దిష్టి పెట్టకమ్మా" అంటూ మరోసారి పంచ్ వేశాడు.
ఇంతలో మనోజ్ చేతిలో ఓ దిష్టిబొమ్మ ఫోటోతో ఇంటికి వచ్చాడు. మొదట దాన్ని చూసిన ఇంట్లోవాళ్లంతా ఆశ్చర్యపోయారు. "ఏంట్రా ఈ ఫోటో?" అని బాలు అడగగా, మనోజ్ "ఈమధ్య ఈ ఫోటో చాలా ట్రెండింగ్‌లో ఉంది. సౌత్ నుంచి నార్త్ వరకు బాగా అమ్ముడవుతోంది" అని చెప్పాడు. బాలు ఆ ఫోటోను జాగ్రత్తగా చూసి, "ఇది మా అమ్మ దిష్టావతి ఫోటో కదా!" అంటూ పేల్చిన డైలాగ్‌తో ఇంట్లో నవ్వులు పూశాయి. తన ఫోటోను ఇలా మార్చి అమ్ముతున్నారని తెలుసుకున్న ప్రభావతి షాక్‌కు గురైంది. "ఎవర్రా నా ఫోటోను ఇలా చేసి అమ్మేది?" అంటూ కోపంతో మండిపోయింది. మనోజ్ మాత్రం "ఇది ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగా అమ్ముడవుతోంది" అంటూ చెప్పడంతో ప్రభావతి మరింత ఆగ్రహానికి గురైంది.
ఈ సందర్భాన్ని బాలు ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. "ఇలాంటి దిష్టిబొమ్మలు చాలా బాగున్నాయి" అంటూ ఆట పట్టించాడు. వెంటనే శృతి, "నాకు రెండు ఫోటోలు కావాలి. ఒకటి రెస్టారెంట్‌లో, ఇంకొకటి నా బ్యూటీ స్టూడియోలో పెడతా" అంటూ జోక్ వేసింది. దీంతో బాలు కూడా రెచ్చిపోయి, "నాకు మూడు కావాలి. ఒకటి మీనా వాళ్లింట్లో, ఒకటి కారులో, ఇంకొకటి మీనా బండిపై పెడతా. ఇక మాపై ఎవరి దిష్టి పడదు" అంటూ నవ్వించాడు. ఇక సత్యం కూడా ఈ కామెడీలో జాయిన్ అయ్యాడు. ఫోటోను చూసి "ఎవడ్రా ఈ కళాకారుడు.. ఫోటో చాలా బాగుంది" అంటూ ప్రభావతిని పోల్చి సెటైర్లు వేశాడు. అయితే ప్రభావతి మాత్రం ఈ ఘటనకు కారణం మీనానే అంటూ నిందలు వేసింది.
దీనిపై శృతి అసలు విషయం బయటపెట్టింది. "ఆ రోజు మీరు కింద పడబోతుంటే బాలు పట్టుకున్నాడు. మీ మీద పిండి డబ్బా పడింది. అప్పుడు నేను తీసిన ఫోటోను స్టేటస్ పెట్టాను. అక్కడి నుంచి ఎవరో తీసుకుని ఇలా దిష్టిబొమ్మలుగా అమ్ముతున్నారు" అని చెప్పింది. ఇంతలో బాలు మరో బిజినెస్ ఐడియా ఇచ్చాడు. "ఈ ఫోటోలకు ఇంత పవర్ ఉందంటే లాకెట్లుగా కూడా అమ్మొచ్చు" అంటూ పంచ్ వేశాడు. శృతి వెంటనే "ఏపీ రైట్స్ నాకు.. తెలంగాణ రైట్స్ నీకు.. మలేషియా రైట్స్ మామకు" అంటూ నవ్వించింది. చివరికి ప్రభావతి కోపంతో గట్టిగా అరవడంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయారు. ఈ ట్రాక్ ప్రేక్షకులకు ఫుల్ కామెడీ ట్రీట్ ఇచ్చింది.
మరోవైపు.. మనోజ్ షాప్‌కు చేరుకోగానే ఆశ్చర్యకర దృశ్యం కనిపించింది. షాప్ కీపర్ ప్రభావతి ఫోటోతో తయారైన దిష్టిబొమ్మను షాప్‌లో పెట్టి పూలతో అలంకరించి పూజలు చేస్తూ కనిపించాడు. అది చూసిన మనోజ్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. "అరేయ్.. ఎవర్రా నీకు ఇది పెట్టమన్నది? ఇక్కడ ఫోటో పెట్టుకుని పూజలేంటి?" అంటూ సీరియస్ అయ్యాడు దీనికి షాప్ కీపర్ అమాయకంగా సమాధానం ఇచ్చాడు. "నిన్న మీరే కదా సార్ ఫోటో తీసుకెళ్లింది. అందుకే ఇది పవర్‌ఫుల్ అనుకుని ఈరోజు పూజ చేస్తున్నా. 500 రూపాయలు ఇస్తే పూలదండ కూడా తీసుకొచ్చి వేస్తా" అని చెప్పడంతో మనోజ్ మరింత చిర్రెత్తిపోయాడు. వెంటనే "ముందు ఆ ఫోటో తీసి పక్కన పెట్టు.. అది మా అమ్మ ఫోటో. అనవసర ఎక్స్‌ట్రాలు చేయకు" అంటూ హెచ్చరించాడు.
ఇంతలో కథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మనోజ్‌కు ముఖేష్ నుంచి ఫోన్ వచ్చింది. తమ బిజినెస్‌కు మంచి లాభాలు వస్తున్నాయని, డీల్ ప్రకారం వాటాలో భాగంగా 10 లక్షల రూపాయలు త్వరలో పంపిస్తున్నామని చెప్పాడు. ఈ వార్త విన్న మనోజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే రోహిణికి ఈ విషయం చెప్పాడు. మనోజ్ మాటలు విన్న రోహిణి కూడా సంబరపడిపోయింది. "మన బిజినెస్ రోజురోజుకూ డెవలప్ అవుతోంది. త్వరలోనే నువ్వు పెద్ద బిజినెస్ మాగ్నెట్ అవుతావు" అంటూ అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. రోహిణి మాటలకు ఫుల్ జోష్‌లోకి వెళ్లిన మనోజ్, కొద్దిసేపటి క్రితం తీసేయమన్న ప్రభావతి ఫోటోను మళ్లీ షాప్‌లో పెట్టమని షాప్ కీపర్‌కు ఆదేశించాడు. లాభం వచ్చిందనే వార్తతో అదే ఫోటోను అదృష్ట చిహ్నంగా భావించడం ఎపిసోడ్‌లో వినోదాన్ని పెంచింది.
ఇక ఇదే సమయంలో మనోజ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి మరో బంపర్ ఆఫర్ చెప్పాడు. "ఒక ఫ్రెండ్ ద్వారా భారీ డీల్ వచ్చింది. ఐదు కోట్ల విలువ చేసే విల్లాను కేవలం మూడు కోట్లకే ఇస్తున్నారు. నీకు చెప్పాలనిపించి వచ్చా" అని చెప్పాడు. ఈ మాటలు విన్న మనోజ్ కళ్లలో ఆశలు మెరిశాయి. "ఏంటి నిజమా? ఐదు కోట్ల విలువ చేసే విల్లా మూడు కోట్లకా? ఎలాగైనా తీసుకోవాలి" అంటూ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. అయితే రోహిణి మాత్రం కాస్త ఆచితూచి ఆలోచించింది. "మూడు కోట్లు అంటే చిన్న విషయం కాదు. అంత డబ్బు ఎలా?" అంటూ సందేహం వ్యక్తం చేసింది. దీనికి మనోజ్ తనదైన ధైర్యంతో "టెన్షన్ పడకు.. మన బిజినెస్ ఇంకాస్త పెరుగుతుంది. ఎలాగైనా విల్లా తీసుకుంటాం" అంటూ చెప్పాడు. అంతేకాదు, ఆ విల్లా ఓనర్‌కు తాము త్వరలో వచ్చి చూసేస్తామని చెప్పమని తన ఫ్రెండ్‌కు సూచించాడు.
మీనా వెంటపడుతున్న మురళి, బాలు చెప్పిన సలహా ప్రకారం నేరుగా ఆమె ఇంటికే రావడం కథలో భారీ ట్విస్ట్‌గా మారింది. పూలు, పండ్లు, చీరతో ఇంట్లోకి అడుగుపెట్టిన మురళి ప్రవర్తన చూసి ఇంట్లో వారంతా ఆశ్చర్యపోగా, చివర్లో అసలు ఉద్దేశం బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఎపిసోడ్‌లో మురళి పూర్తి సన్నాహాలతో మీనా ఇంటికి చేరుకున్నాడు. చేతిలో పూల బుట్ట, పండ్లు, చీర తీసుకుని మర్యాదగా లోపలికి అడుగుపెట్టాడు. ఇంట్లో ఉన్న సత్యం దగ్గరకు వెళ్లి కాళ్లపై పడుతూ ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా రవి, శృతిలను పలకరించి, పూజ గదిలోకి వెళ్లి దేవుళ్లకు నమస్కరించాడు. అతడి ఈ విచిత్ర ప్రవర్తన చూసి ఇంట్లో వారంతా కన్ఫ్యూజ్ అయ్యారు.
ఇంతలో సత్యం, "ఏంటి బాబు.. అసలు నువ్వెవరు? ఎందుకు వచ్చావు?" అంటూ ప్రశ్నించాడు. దీనికి మురళి ఎంతో కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చాడు. "నాకు పెద్దల పట్ల గౌరవం, చిన్నల పట్ల ఆప్యాయత ఎక్కువ. నా పేరు మురళి. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. నాకు నెలకు 50 వేల జీతం వస్తుంది" అంటూ తన వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. మురళి మాటలు విన్న సత్యం మరింత అయోమయంలో పడ్డాడు. "సరే.. ఈ వివరాలు ఎందుకు చెబుతున్నావు? అసలు విషయం చెప్పు" అని అడిగాడు. అప్పుడు మురళి, "ఏ ఆడపిల్ల తండ్రికైనా తన కాబోయే అల్లుడు గురించి తెలుసుకోవాలని ఉంటుంది కదా.. అందుకే చెబుతున్నా" అని చెప్పాడు. దీంతో సత్యం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. "మా అమ్మాయికి ఎప్పుడో పెళ్లయింది.. నాకు ఒక్క కూతురే ఉంది" అని చెప్పాడు.
అయితే మురళి మాత్రం వెనక్కి తగ్గలేదు. "అంకుల్.. నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను అమ్మాయిని చూసాను. నేరుగా ఆమెను అడగడం బాగోదని ముందుగా మిమ్మల్ని అడగడానికి వచ్చాను" అని అన్నాడు. దీనికి రవి కూడా, "ఇక్కడ పెళ్లి కావాల్సిన అమ్మాయిలే లేరు. నువ్వు రాంగ్ అడ్రస్‌కు వచ్చినట్టున్నావు" అంటూ చెప్పాడు. ఇంతలో మీనా కిందికి రావడంతో కథ అసలు మలుపు తిరిగింది. ఆమెను చూసిన మురళి, "చూశారా అంకుల్.. అచ్చు మీ పోలికే. ముక్కు, కళ్లు అన్నీ మీలానే ఉన్నాయి" అంటూ విచిత్రంగా మాట్లాడాడు. దీంతో సత్యం కూడా షాక్ అయ్యాడు. కానీ మురళిని చూసిన మీనా మాత్రం కోపంతో మండిపోయింది. "ఇవ్వరా నిన్ను ఇంట్లోకి రానిచ్చింది? ఎందుకు వచ్చావు?" అంటూ గట్టిగా అరచింది.
అప్పుడు సత్యం, "ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా?" అని అడగగా, మీనా అసలు విషయం బయటపెట్టింది. "గత వారం రోజులుగా నా వెంటపడుతున్నాడు. మీ కొడుక్కి చెప్పితే గొడవ జరుగుతుందనుకుని చెప్పలేదు" అని తెలిపింది. దీంతో ఇంట్లో వారంతా షాక్ అయ్యారు. చివరగా రవి అసలు బాంబ్ పేల్చాడు. "వదినను నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాడు" అంటూ నిజం చెప్పడంతో మీనా షాక్‌కు గురైంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగియడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. రాబోయే ఎపిసోడ్‌లో బాలు వచ్చాక ఎలా స్పందిస్తాడు? మురళికి ఎలా బుద్ధి చెప్తాడు? మీనా ట్రాక్ ఎలా ముగుస్తుంది? అన్న ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు.. లాభాల మత్తులో మనోజ్ త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా? మూడు కోట్ల విల్లా డీల్ వెనుక మోసం ఉందా? లేక నిజంగానే అదృష్టం కలిసొచ్చిందా? అన్న ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


Click it and Unblock the Notifications







