Gundeninda Gudigantalu April 24th Episode: బాలుకి బిగ్ షాక్.. ప్రభావతికి మనోజ్ సర్ప్రైజ్.. సత్యం కీలక నిర్ణయం
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ ఉత్కంఠ, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకుంది. ఎపిసోడ్ ప్రారంభంలో మీనా తీవ్ర భయంతో బాలుకు ఫోన్ చేసి, ఓ వ్యక్తి కొంతకాలంగా తన వెంటపడుతున్నాడని చెప్పింది. దీంతో బాలు ఆగ్రహంతో ఆమెకు ధైర్యం చెప్పి, ముందు జాగ్రత్తగా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోమని సూచించాడు. అదే సమయంలో మురళి మళ్లీ మీనా దగ్గరకు రావడంతో, ఆమె ధైర్యంగా పెప్పర్ స్ప్రే చూపించగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు మనోజ్ షాప్‌లో సరదా సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఓ వ్యక్తి ప్రభావతి ఫోటోతో తయారు చేసిన దిష్టిబొమ్మను అమ్మడానికి రావడంతో మనోజ్ షాక్ అయ్యాడు. ఆ ఫోటో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉందని చెప్పడంతో ఇంట్లో వారంతా ఆశ్చర్యపోయారు. బాలు, శృతి, సత్యం కలిసి ప్రభావతిపై పంచులు వేయడంతో కామెడీ ట్రాక్ హైలైట్‌గా నిలిచింది.
ఇదే సమయంలో మనోజ్‌కు ముఖేష్ నుంచి ఫోన్ వచ్చి, బిజినెస్‌లో లాభాలు వస్తున్నాయని, త్వరలో 10 లక్షలు పంపిస్తామని చెప్పడంతో అతడు ఆనందంతో మురిసిపోయాడు. రోహిణి కూడా అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. వెంటనే 5 కోట్ల విలువైన విల్లాను 3 కోట్లకే ఇస్తున్నారని విని, ఎలాగైనా కొనాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు. ఎపిసోడ్ చివర్లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలు ఇచ్చిన సలహా ప్రకారం మురళి పూలు, పండ్లు, చీరతో నేరుగా మీనా ఇంటికి వచ్చాడు. సత్యం కాళ్లపై పడుతూ, తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని, నెలకు 50 వేల జీతం వస్తుందని చెప్పి అల్లుడిగా పరిచయం చేసుకున్నాడు. ఇంతలో మీనా కిందికి రావడంతో అతడే తన వెంటపడుతున్న వ్యక్తి అని బయటపడింది. రవి "వదినను నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాడు" అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగియగా, తర్వాత ఏమవుతుందో అన్న ఆసక్తి పెరిగింది.

photo courtesy jiohotstar
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఆరంభం నుంచి ముగింపు వరకు రసవత్తరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మురళి పూలు, పండ్లు, చీరతో సత్యం ఇంటికి వచ్చి మర్యాదగా కాళ్లపై పడుతూ ఆశీర్వాదం తీసుకున్నాడు. తనను తాను మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిగా పరిచయం చేసుకుని, నెలకు మంచి జీతం వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయం బయటపెడుతూ మీనాను పెళ్లి చేసుకోవాలని సత్యంకు చెప్పడంతో ఇంట్లో ఉన్న వారంతా షాక్ అయ్యారు. ఈ మాటలు విన్న మీనా కోపంతో ఊగిపోయింది. వెంటనే మురళి తెచ్చిన పూలు, పండ్ల బుట్టను నేలకేసి కొట్టి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో బాలు ఇంటికి ఎంట్రీ ఇచ్చాడు. కింద పడిన పూలు, పండ్లు చూసి "ఏమైంది? ఇవన్నీ ఎవరు పడేశారు?" అని అడిగాడు. అదే సమయంలో మురళి బాలును చూసి "అన్నయ్య" అని పిలవడంతో అందరూ మరింత షాక్ అయ్యారు. బాలు కూడా ఆశ్చర్యపోయి "నువ్వెందుకు మా ఇంటికి వచ్చావ్?" అని ప్రశ్నించాడు. అయితే మురళి ఇంకా ముందుకెళ్లి "ఇకనుంచి నువ్వు నాకు అన్నయ్య కాదు... బావవు. మీ చెల్లి అని నాకు తెలియదు" అంటూ అమాయకంగా చెప్పాడు.
మురళి మాటలకు బాలు పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. "ఏంట్రా ఇది? అన్నయ్య ఎలా బావ అయ్యాడు?" అని అడగగా, రవి అసలు విషయం బయటపెట్టాడు. "మీనాను వాడికి ఇచ్చి పెళ్లి చేయమంటూ వచ్చాడు" అని చెప్పడంతో బాలు షాక్‌కు గురయ్యాడు. వెంటనే "ఒరేయ్ నా కొంప ముంచావురా! నా భార్యకు ఇప్పటికే పెళ్లయింది... నేనే దాని మొగుడిని" అంటూ తల పట్టుకున్నాడు. అక్కడితో ఆగని బాలు, "పెళ్లైందా లేదా అన్న విషయం తెలుసుకోకుండా ఇలా వచ్చేస్తావా?" అంటూ మురళిపై మండిపడ్డాడు. దానికి మురళి అమాయకంగా "సోషల్ మీడియాలో ఫోటో చూసాను. అందులో తాళి కనిపించలేదు. అందుకే పెళ్లి కాలేదనుకున్నా" అని చెప్పడంతో ఇంట్లో వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే... మురళి మీనా వెంటపడటానికి బాలు దగ్గరే సలహాలు తీసుకున్నాడని బయటపడింది. దీంతో బాలు సిగ్గుతో "నా పెళ్లానికి లైన్ వేయడానికి నా దగ్గరే సలహాలు తీసుకున్నావురా!" అంటూ తల పట్టుకున్నాడు. రవి కూడా ఈ అవకాశాన్ని వదలకుండా "అన్నయ్య లవ్ గురువయ్యావా?" అంటూ వెటకారం చేశాడు.
చివరికి బాలు మురళిని గట్టిగా హెచ్చరించి "ఇకనుంచి మా ఇంటి దగ్గరకు కూడా రాకూడదు... వెంటనే వెళ్లిపో" అన్నాడు. దీంతో మురళి మీనా, బాలు ఇద్దరికీ క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనతో సత్యం కూడా బాలుపై కోపం వ్యక్తం చేశాడు. "నువ్వు చేసే పనులు ముందు ఆలోచించాలి కదా... నీ పెళ్లాం కోసమే నువ్వే సంబంధం తీసుకొచ్చావా?" అంటూ మండిపడి వెళ్లిపోయాడు. తర్వాత మీనా, శృతిని ప్రశ్నిస్తూ "ఆ ఫోటో ఏంటి? ఎందుకు పెట్టావ్?" అని అడిగింది. అప్పుడు శృతి సోషల్ మీడియాలో వైరల్ అయిన మీనా ఫోటోలు చూపించి, చాలామంది పెళ్లి చేసుకుంటామని ప్రపోజ్ చేస్తున్నారని చెప్పింది. దీంతో మీనా వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయమని ఆదేశించింది.
ఇంతలో ప్రభావతి వచ్చి మీనా, శృతి మాట్లాడుకుంటుండటం చూసి ఆశ్చర్యపోయింది. "మీరిద్దరూ ఎప్పటి నుంచి కలిసిపోయారు?" అని అడగగా, శృతి "మేమెప్పుడో కాంప్రమైజ్ అయ్యాం" అని చెప్పింది. దీంతో ప్రభావతి కూడా "మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మురళి వ్యవహారం ముగిసిన వెంటనే మీనా నేరుగా బాలు దగ్గరకు వెళ్లి గట్టిగా నిలదీసింది. "ఏంటి కొత్త కొత్త అవతారాలు? నీ పెళ్లానికి నువ్వే లైన్ వేయడానికి సలహాలు ఇస్తున్నావా?" అంటూ మండిపడింది. ఏ విషయం అయినా సలహా ఇచ్చే ముందు దాని మంచి చెడు ఆలోచించాలంటూ బాలుకు క్లాస్ పీకింది. "వాడు మన ఇంటిదాకా వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఫీలవుతున్నాం. అదే ఇంకా పెద్ద సమస్య అయి ఉంటే?" అంటూ మీనా ప్రశ్నించడంతో బాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు.
బాలు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండగా, మీనా "ఏంటి ఇప్పుడు మాట్లాడరా?" అని మళ్లీ అడిగింది. అప్పుడు బాలు తెలివిగా మాట తిప్పే ప్రయత్నం చేశాడు. "అంతా ఆ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో వల్లే జరిగింది. వాడు నిన్ను చూసి కాలేజ్ అమ్మాయిలా ఉందనుకున్నాడట. అందుకే పెళ్లి కాలేదనుకున్నాడు" అని చెప్పాడు. ఈ మాటలు విన్న మీనా కోపం తగ్గి కాస్త ఇంప్రెస్ అయినట్లు కనిపించింది. అది గమనించిన బాలు మళ్లీ సరదాగా మాట్లాడుతూ "నేను కూడా సూట్ బూట్ వేసుకుని ఓ ఫోటో పెడతా... అప్పుడు నా వెంట ఎంతమంది పడతారో చూడు" అని ఆట పట్టించాడు. దీంతో మీనా మళ్లీ కోపంతో "నీతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే బాగోదు... చుక్కలు చూపిస్తా" అంటూ బాలును కొట్టడానికి వెంటపడింది. ఈ ట్రాక్ ప్రేక్షకులకు నవ్వులు పూయించింది.
ఇక మరోవైపు మనోజ్, రోహిణి కలిసి ఇంట్లో అందరినీ హాల్లోకి పిలిచారు. ఇదే సమయంలో మీనా బాలును తరుముకుంటూ హాల్లోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బాలు మాత్రం "ఏంట్రా మళ్లీ కొత్త ప్లాన్ వేశావా? ఈసారి ఎంత స్కామ్ చేశావు?" అంటూ మనోజ్‌పై వ్యంగ్యంగా మాట్లాడాడు. దానికి మనోజ్ కూడా తగ్గకుండా "ఏనుగు వెళ్తుంటే వీధిలో కుక్కలు మొరుగుతాయి" అంటూ సెటైర్ వేశాడు. వెంటనే బాలు "అవునురా నిజమే... నా వెంట కూడా చాలా కుక్కలు మొరుగుతున్నాయి" అంటూ రివర్స్ పంచ్ ఇచ్చాడు. దీంతో ఇంట్లో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఆ తర్వాత మనోజ్ తన గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. "నాకు బిజినెస్‌లో 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది. ముఖేష్‌తో త్వరలో మరో కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలుపెడుతున్నా. ఇక నా స్టేజ్ మొత్తం మారిపోతుంది" అంటూ అహంకారంగా మాట్లాడాడు. ఈ మాటలు విన్న ప్రభావతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. "నా కొడుకు చూసారా... ఈ వంశానికి పేరు తెచ్చేది మనోజ్ మాత్రమే" అంటూ పొగడ్తలతో ముంచెత్తింది.
అయితే బాలు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూ "ఇది నిజమేనా? లేక మళ్లీ కొత్త డ్రామా?" అని అడిగాడు. దీంతో రోహిణి కోపంగా "మేము డెవలప్ కావడం నీకు ఇష్టం లేదా? కష్టం మాత్రమే కాదు... కాస్త స్మార్ట్ వర్క్ కూడా చేయాలి" అంటూ బాలు, మీనాలకు ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసింది. దానికి వెంటనే రవి స్పందిస్తూ "స్మార్ట్ వర్క్ కొన్నిసార్లు మాత్రమే పనిచేస్తుంది... ఎప్పుడైనా ఎక్కడైనా హార్డ్ వర్క్ నిలుస్తుంది" అంటూ రోహిణికి కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలతో ప్రభావతి మళ్లీ తన కోడలిని సమర్థిస్తూ "ఇదిగో చూశావా... మీ డెవలప్‌మెంట్ చూసి అందరికీ అసూయ పెరిగింది" అంటూ మరోసారి గొప్పలు చెప్పింది. ఇక అసలు హైలైట్ మాత్రం తర్వాత వచ్చింది. మనోజ్ తన తల్లి కోసం బంగారు గాజులు తెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాటిని చూసిన ప్రభావతి ఆనందంతో ఎగిరి గంతేసింది. ఇంట్లో అందరికీ చూపిస్తూ "నా కొడుకు నాకోసం బంగారు గాజులు తెచ్చాడు" అంటూ గర్వపడింది. బాలును చూసి కూడా పంచ్ వేసింది.
అయితే బాలు కూడా తగ్గలేదు. "వాడి ముఖం గుట్టను దోచుకెళ్లి... పిడికెడు మట్టి పెట్టినట్టు, ఇంట్లో 40 లక్షలు దోచుకెళ్లి నాలుగు గాజులు తెచ్చాడు. అది ముందు గుర్తుపెట్టుకోండి" అంటూ చెంపపెట్టు లాంటి డైలాగ్ వేశాడు. ఈ మాటలకు అందరూ షాక్ అయ్యారు. రోహిణి మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా "అత్తయ్య... నేను గాజులు వేస్తా" అంటూ స్వయంగా ప్రభావతికి గాజులు తొడిగింది. ఇలా ఆమెను పూర్తిగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. చివరగా మనోజ్ మరో బాంబ్ పేల్చాడు. "ఇదే కాదు... త్వరలోనే ఓ ఇల్లు కొంటున్నా. అది ఇల్లు కాదు... విల్లా!" అంటూ తన ఫ్యూచర్ ప్లానింగ్ కూడా బయటపెట్టాడు. దీంతో ప్రభావతి మరోసారి ఊహల్లో విహరించింది. "నా కొడుకు ఎవరు ఏమనుకున్నా నా కొడుకే" అంటూ ఆనందంలో తేలిపోయింది.
మనోజ్ ఇల్లు కొనబోతున్నానని ప్రకటించిన తర్వాత ఇంట్లో అందరూ ఒక్కోలా స్పందించినా, మీనా మాత్రం లోలోపల ఆలోచనల్లో పడిపోయింది. బయటకు ఎలాంటి మాటలు చెప్పకపోయినా, ఆమె ముఖంలో కనిపించిన ఆలోచనను బాలు వెంటనే గమనించాడు. దీంతో ఆమె దగ్గరకు వెళ్లి తనదైన స్టైల్లో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. "ఏంటి ఇలా ఆలోచిస్తున్నావ్? మనం నాలుగు ఇటుకలు తెచ్చుకుని కొత్త ఇల్లు కట్టాలని అనుకున్నాం... ఇప్పుడు వాడు ఏకంగా ఇల్లు కొనేస్తున్నాడని ఫీల్ అవుతున్నావా?" అంటూ సరదాగా అడిగాడు. బాలు మాటలకు మీనా వెంటనే స్పందిస్తూ, "నాకు వాళ్ల మీద ఎలాంటి అసూయ లేదు. వాళ్లు ఇల్లు కొంటే నాకు బాధపడాల్సిన పని లేదు" అని స్పష్టం చేసింది. అంతేకాదు, "మన పరిస్థితి చూస్తే మనం ఇప్పటికి మనకోసం ఇల్లు కట్టుకునే వాళ్లం. కానీ జీవితం ఎలా తిరిగిందో అలా అయింది" అంటూ కొంత భావోద్వేగంగా మాట్లాడింది. మీనా మాటలు విన్న బాలు మళ్లీ తన సరదా కోణంలోనే స్పందించాడు. "అనవసరంగా టెన్షన్ పడకు. వాడు ఇల్లు కొనుక్కొని బయటకు వెళ్తే మనకు ఒక రూమ్ ఖాళీ అవుతుంది కదా. చక్కగా మనం అదే రూమ్‌లో ఉండొచ్చు. కొత్త ఇల్లు, కొత్త అప్పులు, కొత్త కష్టాలు మనకు అవసరం లేదు" అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు.
అయితే మీనా మాత్రం తాను బాధపడుతున్న విషయం అది కాదని చెప్పింది. "నేను ఫీల్ అవుతున్నది డబ్బు విషయం కాదు... ఇల్లు విషయం కాదు... మీ నాన్న కోరిక గురించి" అంటూ అసలు మనసులో మాట బయటపెట్టింది. "ఆయన ఎప్పుడూ తన కొడుకులందరూ ఒకే ఇంట్లో, తన కళ్లముందు, ఉమ్మడి కుటుంబంగా ఉండాలని కోరుకుంటారు. అదే ఆయన ఆనందం. ఇప్పుడు మనోజ్ ఇల్లు కొనుక్కొని బయటకు వెళ్లిపోతే ఈ ఉమ్మడి కుటుంబం విడిపోతుంది. అదే నన్ను బాధ పెడుతోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మీనా మాటలు విన్న బాలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. ఇంతవరకు తాను ఆ కోణంలో ఆలోచించలేదని గ్రహించాడు. "అవునుకదా... నేను ఈ విషయం ఎందుకు ఆలోచించలేదు?" అంటూ తల పట్టుకున్నాడు. వెంటనే కోపంతో "ఇప్పుడే వెళ్లి మనోజ్ గాడికి చెబుతా... ఇల్లు కొనొద్దని హెచ్చరిస్తా" అంటూ లేచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే మీనా వెంటనే అతడిని ఆపేసింది. "ఇప్పుడు వెళ్లి నువ్వు అలా చెబితే, నువ్వు అసూయతో మాట్లాడుతున్నావని అనుకుంటారు. నీ మాటలకు విలువ ఇవ్వరు. పైగా గొడవే పెరుగుతుంది" అంటూ అర్థం చేసుకుంది. "సమయం వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడుదాం. అప్పుడే చెప్పాలి" అంటూ బాలును కూల్ చేసింది.
ఇక మరుసటి రోజు రిటైర్మెంట్ తర్వాత సత్యం మళ్లీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకోవడం కథకు కొత్త మలుపు తీసుకొచ్చింది. కుటుంబ పెద్ద అయిన సత్యం మరోసారి బయటకు వెళ్లి పని చేయడానికి సిద్ధపడటం ఇంట్లో అందరినీ ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. సత్యం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావడానికి రెడీ అయ్యి బయలుదేరుతాడు. సాధారణంగా ఇంట్లో ప్రశాంతంగా ఉండే ఆయన ఇలా సిద్ధమై బయటకు రావడం చూసి బాలు వెంటనే అడ్డుపడతాడు. "ఇప్పుడైనా ఆలోచించండి నాన్నా... ఈ వయసులో మీకు ఎందుకు ఈ రిస్క్? ఇంట్లో హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోకుండా మళ్లీ ఉద్యోగం చేయడం అవసరమా?" అంటూ ఆప్యాయంగా ప్రశ్నిస్తాడు. అయితే సత్యం మాత్రం తన నిర్ణయంలో స్థిరంగా కనిపిస్తాడు. "నేను కష్టపడాల్సినంత పని ఏమీ కాదు రా... నా స్థాయికి తగ్గట్టు చిన్న ఉద్యోగం. నాకు టైమ్ పాస్ కూడా అవుతుంది, ఉపయోగం కూడా ఉంటుంది" అంటూ బాలును నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ బాలు మాత్రం తండ్రి కష్టపడటం చూడలేక మనసులో బాధపడుతుంటాడు.
ఇదే సమయంలో మనోజ్ మధ్యలో కలగజేసుకుని వ్యంగ్యంగా మాట్లాడటం ఇంట్లో వాతావరణాన్ని వేడెక్కించింది. "మా నాన్న చదువుకు ఏదో వాచ్‌మన్ పని గానీ, బిల్లు కొట్టే అటెండర్ పని గానీ ఇస్తారు లే" అంటూ తక్కువ చేసి మాట్లాడాడు. ఈ మాటలు విన్న బాలు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. "నీకు, నీ పెళ్లానికి మీ ఇద్దరే గొప్పగా కనిపిస్తున్నారా? చుట్టూ ఉన్న వాళ్లంతా తక్కువగా కనిపిస్తారా? మనిషిని మనిషిలా ట్రీట్ చేయాలని అనిపించదా?" అంటూ మండిపడ్డాడు. ఈ పరిస్థితిని చల్లార్చేందుకు సత్యం ముందుకొచ్చాడు. "వదిలేయ్ రా... వాడికి బుద్ధి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు" అంటూ మనోజ్‌పై నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మాటలతో మనోజ్ కాస్త సైలెంట్ అయ్యాడు. ఇంతలో శృతి వచ్చి సత్యంకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. "మామయ్య... ఏ పని చేస్తున్నారు?" అని అడగగా, సత్యం ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. "అకౌంటెంట్ పని... ప్రస్తుతం వారానికి ఒకరోజు మాత్రమే. ఆఫీస్‌లో నీడలో కూర్చొని, నా శక్తికి తగ్గట్టు పని. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించొచ్చు, తర్వాత అలవాటు అయిపోతుంది" అన్నాడు.
ఇంట్లో అందరూ సత్యం నిర్ణయాన్ని గౌరవించినా, బాలు మాత్రం ఇంకా అంగీకరించలేకపోయాడు. దీంతో సత్యం తన మనసులోని బాధను బయటపెట్టాడు. "ఈ విషయంలో మాత్రం నీతో ఏకీభవించను రా... నా భార్య చేసిన తప్పులను సరిదిద్దడానికి ఈ వయసులో నేను ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇప్పుడు వెళ్తున్నది సత్యంగా కాదు... ప్రభావతి భర్తగా మాత్రమే" అంటూ చెప్పాడు. ఈ మాటలు విన్న ప్రభావతి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఆమె చేసిన పనుల వల్ల కుటుంబం ఈ స్థితికి వచ్చిందనే భావన బలంగా తాకింది. ఇంతలో మీనా తన మామయ్య కోసం టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. దాన్ని చూసిన సత్యం కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. "నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది" అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మాటలు విన్న ప్రభావతి వెంటనే సెటైర్ వేసింది. "నేను తప్ప అందరూ గుర్తొస్తారంట" అని అనగా, సత్యం కూడా తగ్గకుండా "నేను జాబ్‌కి వెళ్తున్నానని తెలుసు కదా... మరి నువ్వెందుకు టిఫిన్ చేసి ఇవ్వలేదు? బద్ధకమా? మతిమరుపా? అందుకే మీనాను చూసి మా అమ్మ గుర్తొచ్చింది" అంటూ కౌంటర్ ఇచ్చాడు.
మరోవైపు రోహిణి కూడా సత్యంకు కంగ్రాట్స్ చెప్పి, త్వరగా బయటికి వెళ్లిపోయింది. తన కొడుకు చింటూను స్కూల్లో జాయిన్ చేయించాలనే పనితో వెళ్తున్నానని చెప్పింది. అయితే ప్రేక్షకులకు తెలియని సస్పెన్స్ ఏమిటంటే... రోహిణి తన కొడుకును జాయిన్ చేయించే స్కూల్, సత్యం ఉద్యోగం చేయబోయే చోటే కావడం కథలో ఆసక్తిని పెంచింది. సత్యం ఉద్యోగానికి బయలుదేరుతుండగా ఇంట్లో అందరూ గేటు వరకు వచ్చి సాగనంపారు. ప్రభావతి శకునం చూసి పంపించడం కూడా సన్నివేశానికి ప్రత్యేకత ఇచ్చింది. చివరగా బాలు తన తండ్రిని స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లడానికి ముందుకొచ్చాడు. మరోవైపు రోహిణి చింటూతో అదే స్కూల్‌కి బయలుదేరింది. ఇలా ఇద్దరూ ఒకే చోటుకు వెళ్తుండటంతో ఎపిసోడ్ సస్పెన్స్‌గా ముగిసింది. రానున్న ఎపిసోడ్‌లో సత్యం, రోహిణి అక్కడ ఎదురెదురవుతారా? కొత్త నిజాలు బయటపడతాయా? లేక మరో ట్విస్ట్ ఎదురవుతుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగి పోయింది.


Click it and Unblock the Notifications