Gundeninda Gudigantalu April 28th Episode: ప్రభావతి చిచ్చు.. మీనా మాటలకు షాక్.. ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలు !

photo courtesy jiohotstar

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరిత మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవైపు బాలు తన తండ్రి సత్యంను స్కూల్‌కు తీసుకెళ్లగా, మరోవైపు రోహిణి తన కొడుకు చింటూతో అదే స్కూల్‌కు రావడం కథలో టెన్షన్ పెంచింది. చింటూ స్కూల్‌లో కొత్త ఫ్రెండ్స్ అయ్యారని, బెస్ట్ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లాలని కోరగా రోహిణి మాత్రం ఇతరులతో ఎక్కువగా కలవొద్దని కఠినంగా చెప్పింది. స్కూల్ వద్దకు చేరుకున్న చింటూ, బాలు మరియు సత్యంను గుర్తుపట్టబోతుండగా రోహిణి భయంతో అతని నోరు మూసి దాక్కుంది. తర్వాత వాచ్‌మెన్ ద్వారా సత్యం కొత్త అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యాడని తెలుసుకుని షాక్‌కు గురైంది. తన గతం బయటపడుతుందనే భయంతో చింటూని స్కూల్‌కు పంపకుండా ఇంటికి తీసుకెళ్లింది. దీంతో చింటూ కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి తన తల్లి సుగుణమ్మతో బాధ పంచుకుంది. కానీ నిజం చెప్పమన్న తల్లి మాటలను తిరస్కరించిన రోహిణి, సత్యంను ఆ ఉద్యోగం నుంచి తీసేయాలని ప్లాన్ చేస్తున్నానని సంచలనంగా చెప్పింది.

ఇదే సమయంలో మనోజ్ తన ఫ్రెండ్ మణికంఠతో కలిసి ఓ విల్లా చూడటానికి వెళ్తాడు. రోహిణి వచ్చేంతవరకు ఇల్లు చూడనని చెప్పి భార్యపై ప్రేమను చూపిస్తాడు. రోహిణి వచ్చాక ఇద్దరూ కలిసి ఆ విలాసవంతమైన ఇంటిని చూసి మంత్రముగ్ధులవుతారు. మార్కెట్ విలువ ఐదు కోట్లు అయినా, మూడు కోట్లకే ఇస్తామని చెప్పడంతో మనోజ్ వెంటనే అడ్వాన్స్ ఇస్తానని ఒప్పుకుంటాడు. అయితే వారు వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడుతుంది. ఇంటి యజమానులుగా నటించిన వారు మోసగాళ్లు అని తెలుస్తుంది. దీంతో మనోజ్-రోహిణి భారీ మోసంలో పడినట్టుగా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు మీనా చేసిన పూల డెకరేషన్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఫంక్షన్ హాల్ మేనేజర్ ఆమె ప్రతిభను కొనియాడి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే ఈ రంగంలో నెంబర్ వన్‌గా ఉన్న చింతామణి అనే మహిళ మీనాకు కొత్త ప్రమాదంగా పరిచయమైంది. మీనా ఎదుగుదలను అడ్డుకోవాలని ఆమె హెచ్చరించడంతో రాబోయే ఎపిసోడ్‌లపై ఆసక్తి పెరిగింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 671 April 28th 2026 here is full story

photo courtesy jiohotstar

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ విభేదాలు, భార్యాభర్తల మధ్య సరదాగా మొదలైన మాటల యుద్ధంతో ఆసక్తికరంగా సాగింది. మీనా తన మొదటి పూల డెకరేషన్ ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేయడంతో ఎంతో ఆనందంగా ఇంటికి చేరుతుంది. కస్టమర్ల నుంచి మంచి ప్రశంసలు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆ సంతోషాన్ని ఇంట్లో వారితో పంచుకోవాలని భావించిన మీనా స్వీట్లు తీసుకువచ్చి ముందుగా తన మామయ్య సత్యంకు ఇస్తుంది. కోడలు ఎదుగుదల చూసి సత్యం కూడా ఆనందపడతాడు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన ప్రభావతి మరోసారి తన స్వభావాన్ని బయటపెడుతుంది. షుగర్ ఉన్న వ్యక్తికి ఎందుకు మాటిమాటికి స్వీట్లు పెడుతున్నావ్.. అతనికి ఏం చేయాలనుకుంటున్నావ్ అంటూ మీనాపై మండిపడుతుంది. దీంతో సత్యం కూడా ఆగ్రహంగా స్పందిస్తూ ఒక స్వీట్ తింటే ఏమీ కాదులే.. అనవసరంగా నోరు నెత్తిన పెట్టుకోకు అంటూ చురక వేస్తాడు. అంతేకాదు కావాలంటే నువ్వూ తిను అంటూ ప్రభావతికే స్వీట్ పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆమె వద్దని తప్పించుకోవాలని చూసినా సత్యం సరదాగా ఆమె నోట్లో పెట్టేయడం నవ్వులు పూయించింది.

ఇంతలో బాలు ఇంటికి చేరుకుని అందరూ సంతోషంగా కనిపించడంతో ఏం స్పెషల్ అని అడుగుతాడు. వెంటనే సత్యం మీనా తొలి ఆర్డర్ సక్సెస్ అయిందని చెబుతాడు. అది విన్న బాలు కూడా ఆనందంతో మీనాను అభినందిస్తాడు. భార్య ఎదుగుదలపై బాలు గర్వపడటం ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపించింది. కానీ ఈ ఆనంద వాతావరణాన్ని కూడా ప్రభావతి చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. మీనా బయటికి వెళ్లి పూల డెకరేషన్ పనులు చేస్తుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు.. రోడ్ల మీద తిరుగుతూ ఆర్డర్లు తీసుకోవడం ఏమిటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీంతో బాలు మొదటిసారి గట్టిగా తల్లిని ప్రశ్నిస్తాడు. పెద్ద కోడలు పార్లర్ బిజినెస్ చేస్తే పర్వాలేదు.. చిన్న కోడలు డబ్బింగ్ చెబితే పర్వాలేదు.. కానీ మీనా మాత్రం బయట పని చేస్తే ఎందుకు నచ్చడం లేదు అంటూ నిలదీస్తాడు.

బాలు మాటలకు మీనా కూడా ధైర్యంగా స్పందిస్తుంది. నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని వెళ్లుతున్నాను కదా.. మరి ఇంకా సమస్య ఏమిటి అని ప్రశ్నిస్తుంది. పరిస్థితి పెద్ద గొడవగా మారుతుందని భావించిన సత్యం మధ్యలో వచ్చి ప్రభావతిని అక్కడి నుంచి తీసుకెళ్లమని చెబుతాడు. దీంతో మరోసారి సత్యం మీనాకు అండగా నిలిచినట్లు చూపించారు. ఆ తర్వాత బాలు, మీనా ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకుంటారు. మీనా విజయంపై బాలు ఆనందం వ్యక్తం చేస్తాడు. ఈ సమయంలో మీనా కూడా తన కలలను బయటపెడుతుంది. ఇలాగే సంపాదిస్తే త్వరలోనే మన సొంత ఇల్లు కట్టుకుంటాం.. మన ఇల్లు అనే కల త్వరలో నిజమవుతుంది అంటూ ఉత్సాహంగా చెబుతుంది. ఈ మాటలు విన్న బాలు కూడా సంతోషంగా కనిపిస్తాడు. అయితే సరదాగా మాట్లాడుతున్న క్రమంలో మీనా ఒక ఛాలెంజ్ విసురుతుంది. చూడండి.. మీకంటే నేను ఎక్కువ సంపాదించి చూపిస్తా అంటూ నవ్వుతూ అంటుంది. కానీ ఆ మాట బాలు మనసుకు తాకుతుంది. తనను తక్కువ చేసి మాట్లాడినట్లుగా భావించిన బాలు ఒక్కసారిగా అసౌకర్యంగా ఫీల్ అవుతాడు.

మరుసటి రోజు ఉదయం ఇంటికి ఓ కస్టమర్ వచ్చి మీనా మేడం ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న బాలు, మీనా బయటికి వెళ్లిందని.. నేను ఆమె భర్తని, ఏం కావాలో చెప్పండి అని మర్యాదగా సమాధానం ఇస్తాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం కొంచెం పొగరుగా స్పందిస్తూ.. నేను డెకరేషన్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను, మీకు ఆ పని గురించి ఏం తెలుసు? ఆమె వచ్చిన తర్వాత మాట్లాడుతా అని చెబుతాడు. ఈ మాటలు బాలుకు గట్టిగా తాకుతాయి. ఇప్పటికే తన భార్య సంపాదన గురించి లోలోపల ఆలోచిస్తున్న బాలుకు, ఇలా ఒక పరాయి వ్యక్తి ఎదుట తక్కువ చేసి మాట్లాడటం అవమానంగా అనిపిస్తుంది. పైగా పక్కనే ఉన్న ప్రభావతి ఈ సన్నివేశాన్ని చూసి వెటకారంగా నవ్వుతుంది. ఆ నవ్వు కూడా బాలుకు మరింత బాధ కలిగిస్తుంది.

అక్కడితో ఆగకుండా వచ్చిన వ్యక్తి, బాలుని పనివాడిలా చూసి నీళ్లు తీసుకురమ్మని చెప్పడం, కూర్చోడానికి చోటు సర్దమని ఆదేశించడం బాలును మరింత అసహనానికి గురి చేస్తుంది. తాను ఇంటి యజమాని అయినా, తనకే విలువ లేకుండా పోయిందనే భావన అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రభావతి మరోసారి చురకలు వేస్తుంది. చూశావా నీది కూడా ఒక బతుకేనా.. పెళ్లాం చేతుల్లో బతుకుతున్నావు. ఇంకో నాలుగు రోజులు అయితే నిన్ను కుక్కని చేసి ఆడిస్తుంది అంటూ తీవ్రంగా అవమానిస్తుంది. కానీ బాలు మాత్రం గట్టిగా స్పందిస్తూ.. మీనా ఎలాంటి వ్యక్తో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు అంటూ తల్లిని హెచ్చరిస్తాడు.

ఇంతలో మీనా ఇంటికి చేరుకుంటుంది. వచ్చిన కస్టమర్‌కు కావలసిన డెకరేషన్ డిజైన్లు చూపిస్తూ చక్కగా మాట్లాడి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. తన పనిలో మీనా చూపించిన నైపుణ్యం చూసి కస్టమర్ కూడా సంతోషపడతాడు. అయితే అదే సమయంలో ప్రభావతి కావాలని మీనాను పిలిచి కాఫీ పెట్టమని అంటుంది. బిజీగా ఉన్నా, కోపాన్ని అదుపులో పెట్టుకుని మీనా కాఫీ పెట్టడానికి వెళుతుంది. ఈలోపు కస్టమర్ అడ్వాన్స్ డబ్బులు తీసి చేతిలో పట్టుకుంటాడు. అప్పుడు బాలు, డబ్బులు తనకు ఇచ్చినా పర్వాలేదు అని అంటాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం నేను మీనాకే ఇస్తాను.. ఆమె ఏమైనా డిస్కౌంట్ ఇస్తుంది, మీకు ఎంత అవుతుందో ఏమి తెలుసు అన్నట్లుగా మాట్లాడతాడు. ఈ మాటలు బాలుకు మరింత అవమానంగా అనిపిస్తాయి.

ఇంతలో మీనా తిరిగి వచ్చి కస్టమర్‌తో మాట్లాడుతుంది. అతడు డిస్కౌంట్ అడగగా, ఇప్పటికే తక్కువ రేటు చెప్పానని.. కేవలం పది శాతం మాత్రమే తగ్గించగలనని చెబుతుంది. మీనా మాట తీరు, ధైర్యం చూసి కస్టమర్ వెంటనే ఆర్డర్ ఖరారు చేసి పది వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి వెళ్తాడు. ఆర్డర్ వచ్చిన ఆనందంలో మీనా కాస్త అతిగా స్పందిస్తుంది. చూశారా అండి.. ఈరోజే పది వేల అడ్వాన్స్ వచ్చింది. అంటే మీకంటే నేను ఎక్కువ సంపాదించాను. ఇకపై జాగ్రత్త.. నన్ను మీనా మేడం అని పిలవాల్సి వస్తుంది అంటూ నవ్వుతూ అంటుంది. కానీ ఆ సరదా మాట బాలుకు గుచ్చుకుంటుంది. మొదటిసారి డబ్బు సంపాదిస్తున్నాననే పొగరుతో మీనా మాట్లాడుతోందని బాలు భావిస్తాడు. తన పురుష అహంకారం గాయపడినట్లుగా ఫీల్ అవుతాడు. పైగా పక్కనే ప్రభావతి వెటకారపు చూపులు, మాటలు కూడా బాలులో అసహనాన్ని పెంచేస్తాయి. మీనా డబ్బులు చేతికి ఇస్తే కూడా బాలు తీసుకోకుండా.. నీ దగ్గరే పెట్టుకోమని అంటాడు.

ఆ తర్వాత మీనా ఆ డబ్బులను బీరువాలో పెట్టడానికి లోపలికి వెళుతుంది. అదే సమయంలో బాలు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. తిరిగి వచ్చిన మీనా, బాలు కోసం అతనికి ఇష్టమైన పూరి కుర్మా చేశానని చెబుతూ.. బాలు ఎక్కడికి వెళ్లాడు అని ప్రభావతిని అడుగుతుంది. అయితే ప్రభావతి మాత్రం తాను అనుకున్నట్టే జరిగిందన్న ఆనందంతో వెటకారంగా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ నవ్వు చూసి మీనా గుండెల్లో కలవరం మొదలవుతుంది. వెంటనే బాలకు ఫోన్ చేస్తుంది. కానీ బాలు మాత్రం జరిగిన అవమానాల్ని గుర్తు చేసుకుంటూ కాల్ కట్ చేస్తూనే ఉంటాడు. దీంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. అదే సమయంలో ప్రభావతి మళ్లీ గొడవకు కారణమవుతుంది. ఏదైనా టిఫిన్ చేశావా అని అడిగి, పూరి కుర్మా చేశానని చెప్పగానే.. బాలుకి నచ్చినవి మాత్రమే చేస్తావా? మాకు నచ్చవా? మేమెలా తినాలి అంటూ గొడవ పెడుతుంది.

ఇప్పటికే కోపంతో ఉన్న మీనా ఒక్కసారిగా పేలిపోతుంది. ఆపు.. ఏంటి వాగుతున్నారు? నేను చెప్పేది వినరా అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో సత్యం కూడా షాక్ అవుతాడు. బాలు కోసం పూరి కుర్మా చేస్తే, మీకోసం ఇడ్లీ సాంబార్ చేశాను.. అది చెప్పే వరకు కూడా ఆగలేరా అంటూ మీనా ధీటుగా సమాధానం ఇస్తుంది. అంతేకాదు, నేను బాలు ఎక్కడ అని అడిగితే మీరు అహహ అని నవ్వి వెళ్లిపోతారా అంటూ ప్రభావతిని నిలదీస్తుంది. బాలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. పదేపదే బాలకు ఫోన్ చేస్తూ ఎక్కడున్నావు అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ బాలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా కాల్ కట్ చేస్తూనే ఉంటాడు. తనపై జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుతం మీనాతో మాట్లాడాలనిపించక దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది.

బాలు ఇలా స్పందించడంతో మీనా మరింత కంగారు పడుతుంది. అతను ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో తెలియక ఆందోళన చెందుతుంది. వెంటనే బాలు స్నేహితుడు రాజేష్‌కు ఫోన్ చేస్తుంది. రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందమ్మా, ఎలా ఫోన్ చేశావు అని ఆత్మీయంగా అడుగుతాడు. దీనికి మీనా, బాలు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. మీకు ఏమైనా కనిపించాడా అని ఆత్రంగా ప్రశ్నిస్తుంది. వెంటనే రాజేష్, అరగంట క్రితమే బాలు తనతో మాట్లాడాడని చెబుతాడు. ఏదో ట్రిప్‌లో ఉన్నట్టున్నాడు.. అనవసరంగా కంగారు పడకు, వస్తాడులే అని మీనాకు ధైర్యం చెబుతాడు. అంతేకాదు, కస్టమర్లు పక్కన ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరదు.. కూల్‌గా ఉండు అని చెప్పి కాల్ ముగిస్తాడు. రాజేష్ బయటకు మాత్రం సర్దిచెప్పినా, లోలోపల బాలుకు ఏదో జరిగింది.. అందుకే మీనా ఫోన్ ఎత్తడం లేదని అనుమానపడతాడు.

ఇక మరోవైపు ప్రభావతి మీనాక్షి ఇంటికి వెళ్లడం కథలో వినోదాన్ని తెచ్చింది. అక్కడికి వెళ్లిన ప్రభావతి, మీనాక్షి ఇంట్లో తన ఫోటోకు పూజలు చేస్తూ ఉండటాన్ని చూసి షాక్ అవుతుంది. వెంటనే కోపంతో ఏం చేస్తున్నావ్ అంటూ ఆగ్రహంతో ఊగిపోతుంది. ప్రభావతి ఆ ఫోటో వెంటనే తీసి పడేయమని ఆదేశిస్తుంది. కానీ మీనాక్షి మాత్రం అమాయకంగా స్పందిస్తూ.. ఈ ఫోటో చాలా పవర్ఫుల్. మార్కెట్లో ఇవి చాలా అమ్ముడుపోతున్నాయి. అందుకే చాలా ఖరీదైన ధరకు కొనుక్కున్నాను అని చెబుతుంది. దీనికి ప్రభావతి, ఆ ఫోటో ఎవరిదో తెలుసా అని కోపంగా అడుగుతుంది. మీనాక్షి మాత్రం నాకేం తెలియదు.. అది నీ ఫోటోనే కదా అని అమాయకంగా సమాధానం ఇస్తుంది. ఈ మాటలకు ప్రభావతి కోపం మరింత పెరిగిపోతుంది.

వెంటనే ఆ ఫోటోను తీసుకుని రోడ్డుమీద పడేస్తుంది. కానీ తిరిగి ఎవరైనా తీసుకెళ్లి మళ్లీ వాడుకుంటారేమోనని భావించి మళ్లీ తెచ్చి మీనాక్షి ఇంట్లోని స్టోర్‌రూమ్‌లో పడేస్తుంది. మరోసారి ఈ ఫోటో కనిపిస్తే బాగోదు అంటూ మీనాక్షిని గట్టిగా హెచ్చరిస్తుంది. అయితే మీనాక్షి మాత్రం అందరిలాగా నేనూ డెవలప్ అవ్వకూడదా? అందుకే నీ ఫోటో తీసుకువచ్చా అని అమాయకంగా చెబుతుంది. దీంతో ప్రభావతి విసిగిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు.. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా, నా మూడ్ మొత్తం చెడగొట్టావ్ అంటూ మండిపడుతుంది. దీనికి మీనాక్షి, సర్లే.. ఏదో చెప్పాలనుకుని వచ్చావు కదా, ఇప్పుడైనా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ప్రభావతి గర్వంగా తన కలలను బయటపెడుతుంది. మనోజ్, రోహిణిలు త్వరలో పెద్ద విల్లాకు వెళ్తున్నారు.. ఆ ఇంటి విలువ మూడు కోట్లు. వాళ్లు ఉండే ఏరియా చాలా రిచ్ అని చెబుతుంది.

అంతేకాదు, నేనూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతాను. ఇకనుంచి ప్రభావతి డాన్స్ స్కూల్ కాదు.. ప్రభావతి డాన్స్ అకాడమీ అవుతుంది. అక్కడ పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తా.. నా స్కూల్ కూడా త్వరలోనే ఫేమస్ అవుతుంది అంటూ తన భవిష్యత్ ప్రణాళికలను గొప్పగా చెప్పుకుంటుంది. ఇంతలో ప్రభావతి స్టూడెంట్స్ అయిన ప్రేమ్ కుమార్, రాధిక అక్కడికి వస్తారు. ప్రభావతి మాటలు విని ఇద్దరూ ఒక్కసారిగా టెన్షన్ పడతారు. ఇకపై మనిద్దరం కలవలేమా? ఏదైనా చెయ్ ప్రేమ్ కుమార్ అని రాధిక ఆందోళనగా అడుగుతుంది. దీనికి ప్రేమ్ కుమార్, ఏం కంగారు పడకు.. అవన్నీ జరిగినప్పుడు మనం చూసుకుందాం అని సమాధానం ఇస్తాడు. కానీ రాధిక మాత్రం వెంటనే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ షాకింగ్ నిర్ణయం చెబుతుంది. ప్రేమ్ కుమార్ కూడా సరే అన్నట్లుగా స్పందించి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ పరిణామం చూస్తే ఆ ప్రేమ జంట త్వరలోనే ప్రభావతికి కొత్త చిక్కులు తీసుకొచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

మరో వైపు రాత్రి అయినా బాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో మీనా మనసులో కలవరం మొదలవుతుంది. ఉదయం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా బాలు ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయడు. ప్రతి సారి కాల్ కట్ చేస్తూనే ఉండటంతో మీనా మరింత ఆందోళన చెందుతుంది. అసలు తన మాటల వల్ల బాలు బాధపడ్డాడా, లేక ఇంకేదైనా సమస్య ఎదురైందా అన్న సందేహాలు ఆమెను వెంటాడుతుంటాయి. ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చున్న మీనా, బాలు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. భర్త ఎక్కడ ఉన్నాడో తెలియక, ఫోన్ కూడా ఎత్తకపోవడంతో ఆమె మనసు గందరగోళంలో పడుతుంది.

ఇంతలో సత్యం అక్కడికి వచ్చి ఇంకా బాలు రాలేదా అని అడుగుతాడు. దానికి మీనా, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని చెబుతుంది. ఈ మాట విన్న సత్యం కూడా కాస్త ఆందోళన చెందుతాడు. సాధారణంగా బాలు ఇలా చేయడని భావించి, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అనుమానపడతాడు. సత్యం మీనా ముఖం గమనిస్తూ ఏదైనా జరిగింది అంటే చెప్పమ్మా అని అడగాలని అనుకుంటాడు. కానీ మీనా మాత్రం మౌనంగా ఉండిపోవడంతో, పెద్దగా గొడవ జరిగినట్లు కనిపించకపోయినా ఏదో విషయం దాచిపెడుతోందేమోనని భావిస్తాడు. ఆ తర్వాత సత్యం, సర్లే వాడు వస్తాడులే.. నువ్వు వెళ్లి భోజనం చేయమ్మా అని మీనాకు ధైర్యం చెబుతాడు. కానీ మీనా మాత్రం తనకు ఆకలి లేదని, బాలు వచ్చాక ఇద్దరం కలిసి తింటామని అంటుంది. భర్తపై ఉన్న ప్రేమ, ఆందోళన ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

మీనా పరిస్థితి చూసి సత్యం హృదయం కదిలిపోతుంది. కోడలు ఎంత బాధపడుతోందో అర్థం చేసుకుని, నేను కూడా వెయిట్ చేస్తా.. బాలు వచ్చాకే పడుకుంటా అని అంటాడు. అయితే ప్రభావతి మరోసారి తన విషపు మాటలతో పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. బాలుకి కోపం ఎక్కువ.. అహం ఎక్కువ.. ఎక్కడ ఎవరితో గొడవపడ్డాడో, లేక ఎక్కడ తాగి పడ్డాడో ఎవరికి తెలుసు అంటూ చెడ్డగా మాట్లాడుతుంది. అంతేకాదు, వాడికి ఇలాంటివి మామూలే కదా అంటూ తన కొడుకుపై కూడా తక్కువ చేసి మాట్లాడుతుంది. మీనా ముందే ఇలా మాట్లాడటంతో ఆమె మనసు మరింత ముక్కలవుతుంది. ఇప్పటికే ఆందోళనలో ఉన్న మీనాకు ఈ మాటలు ఇంకా గుచ్చుకుంటాయి.

ప్రభావతి మాటలు విన్న సత్యం ఒక్కసారిగా ఆగ్రహానికి లోనవుతాడు. నీకు ఎలాగో బాధపడడం రాదు.. కనీసం మీనాకు ధైర్యం చెప్పడం పోయి, ఇంకా బాధపడేలా మాట్లాడుతున్నావా అంటూ తీవ్రంగా మందలిస్తాడు. ఇంకా ఆగకుండా, నువ్వు అసలు మనిషివేనా అంటూ ప్రభావతిపై సత్యం ఫైర్ అవుతాడు. ఒకవైపు మీనా ఆందోళన, మరోవైపు సత్యం కోపం, ప్రభావతి వ్యాఖ్యలు కలిసి ఇంట్లో వాతావరణాన్ని ఉత్కంఠభరితంగా మార్చాయి. అయితే బాలు ఎక్కడున్నాడు? ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు? అతను ఇంటికి తిరిగి వస్తాడా? అనే ప్రశ్నలతో నేటి ఎపిసోడ్‌ను సస్పెన్స్‌లో ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X