Gundeninda Gudigantalu April 30th Episode: మీనా-చింతామణి వార్ స్టార్ట్.. ఉచ్చులో మనోజ్-రోహిణి.. బాలుకు అనుమానం
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడి గంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కుటుంబ విభేదాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలు ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మీనా తీవ్ర ఆందోళనకు గురవడం హైలైట్‌గా నిలిచింది. ఉదయం నుంచి కాల్స్ చేసినా స్పందన లేకపోవడంతో ఆమె గుండెల్లో భయం పెరిగిపోతుంది. ఈ సమయంలో ఆమెకు తోడుగా నిలవాల్సిన ప్రభావతి మాత్రం వ్యంగ్యంగా మాట్లాడి పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుంది. దీంతో సత్యం కోపంతో ప్రభావతిని మందలిస్తూ, కోడలికి ధైర్యం చెప్పాలని గట్టిగా హెచ్చరిస్తాడు. ఇంతలో బాలు ఇంటికి చేరుకోగా, అతడిని సత్యం ప్రశ్నిస్తాడు. కానీ బాలు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తర్వాత మీనా దగ్గరకు వెళ్లిన బాలు, తన అహంకారంతో ఆమెను బాధపెట్టేలా మాట్లాడుతాడు. "నీకంటే నేను ఎక్కువ సంపాదించాను" అంటూ డబ్బు ఇవ్వడం మీనాను షాక్‌కు గురిచేస్తుంది.
తన ఎదుగుదలపై భర్త ఇలా స్పందించడంతో ఆమె మనసు దెబ్బతింటుంది. చివరకు బాలు తన తప్పును గ్రహించి క్షమాపణ చెప్పడం, మీనా అతడిని క్షమించడం భావోద్వేగంగా చూపించారు. ఇద్దరూ కలిసి భోజనం చేసే సన్నివేశం వారి బంధాన్ని మరింత బలంగా చూపించింది. మరోవైపు మనోజ్ ట్రాక్ ఆసక్తికరంగా మారింది. అకస్మాత్తుగా పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అతడు రాజమండ్రి వద్ద విల్లా కొనాలని చెప్పడం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. తక్కువ ధరకు పెద్ద డీల్ అని చెప్పడంతో సత్యం, బాలు అనుమానం వ్యక్తం చేస్తారు. చివర్లో తుమ్ముల సన్నివేశం హాస్యాన్ని తెచ్చినా, అదే సమయంలో రాబోయే ప్రమాదానికి సంకేతంలా అనిపించింది. తదుపరి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.

గురువారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా మనోజ్ విల్లా ట్రాక్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ప్రేక్షకుల్లో సస్పెన్స్‌ను పెంచాయి. తన కలల విల్లా కొనడానికి బయలుదేరిన మనోజ్‌కు మొదటి నుంచే అపశకునాల సూచనలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అందరూ వరుసగా తుమ్మడం, తండ్రి మరో రోజు వెళ్దామని చెప్పడం వంటి సంఘటనలు అతని మనసులో అనుమానాలు కలిగిస్తాయి. అయినప్పటికీ రోహిణి మాత్రం ఇవన్నీ అర్థం లేని భయాలు అని చెప్పి, అడ్వాన్స్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తుంది.
విల్లా వద్దకు చేరుకున్న తర్వాత కూడా మనోజ్‌కు ఆ అనుమానం తగ్గదు. గుమ్మం దగ్గర తూలిపడబోతుండటం అతడిలో మరింత భయం పెంచుతుంది. కానీ రోహిణి మాత్రం ఐదు కోట్ల విల్లా మూడు కోట్లకే వస్తోందని, ఇది జీవితంలో అరుదైన అవకాశం అని చెప్పి అతడిని ప్రోత్సహిస్తుంది. ఇదే సమయంలో విల్లా అమ్మకానికి సిద్ధంగా ఉన్న కేటుగాళ్లు తమ అసలు ఆట మొదలుపెడతారు. మనోజ్‌ను అతని అదృష్టాన్ని పొగిడుతూ, ఈ డీల్‌తో అతని బిజినెస్ కూడా పెరుగుతుందని చెప్పి మాయమాటలు మాట్లాడతారు.
అయితే మనోజ్ డబ్బు ఇవ్వడానికి వెనుకడుగు వేయడంతో, మోసగాళ్లు సైకాలజికల్ ప్రెషర్ సృష్టిస్తారు. "ఇప్పుడే మరొకరు 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ అతడిని మరింత గందరగోళానికి గురిచేస్తారు. "మీరు భయపడితే మేము అమ్మం" అని చెప్పి వెళ్లిపోవాలని చెప్పడంతో మనోజ్, రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే రోహిణి మనోజ్‌ను మందలిస్తూ, ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోవద్దని ఒత్తిడి చేస్తుంది. చివరికి ఆమె మాటలకు లొంగిన మనోజ్ ఐదు లక్షల అడ్వాన్స్ ఇస్తాడు.
అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మోసగాళ్లు ఒక నకిలీ ప్రామిసరీ నోట్ ఇచ్చి తమను నిజాయితీ గల వాళ్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, పూర్తి డబ్బు చెల్లించకముందే కుటుంబంతో కలిసి రెండు రోజులు అక్కడే ఉండమని ఆఫర్ ఇవ్వడం ద్వారా మరింత నమ్మకం కలిగిస్తారు. ఈ ఆఫర్‌తో మనోజ్, రోహిణి ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోతారు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, ఇది సాధారణ డీల్ కాదనే అనుమానం బలపడుతోంది.
ఇక మోసగాళ్లు ఇచ్చిన నకిలీ ప్రామిసరీ నోటు చేతిలో పట్టుకుని ఇంటికి చేరుకున్న మనోజ్ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. అతడిని చూసిన వెంటనే ప్రభావతి ఉత్సాహంగా "మనోజ్!" అంటూ గట్టిగా అరవడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా కంగారు పడతారు. సత్యం ఏమైందని ప్రశ్నించగా, ప్రభావతి గర్వంగా "నా కొడుకు కల నెరవేరింది... త్వరలోనే పెద్ద విల్లాలో ఉండబోతున్నాడు" అంటూ చెప్పడం సన్నివేశానికి హైలైట్‌గా నిలుస్తుంది. అయితే ఈ ఆనందాన్ని బాలు వెంటనే ప్రశ్నార్థకంగా మారుస్తాడు. ఐదు కోట్ల విలువైన విల్లాను మూడు కోట్లకే ఇస్తున్నారంటే ఇందులో తప్పకుండా ఏదో మోసం ఉంటుందని హెచ్చరిస్తాడు. కానీ రోహిణి మాత్రం "మేము ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు" అంటూ బాలుపై తిరుగుబాటు చేస్తుంది. ప్రభావతి కూడా అదే వైఖరితో బాలుని మాటలను పట్టించుకోకుండా, తన కొడుకు అదృష్టాన్ని పొగిడుతూ మురిసిపోతుంది.
మనోజ్ కూడా మోసగాళ్లపై నమ్మకంతో, "వాళ్లు ఎంత మంచి వాళ్లు... ప్రామిసరీ నోట్ కూడా రాసిచ్చారు" అంటూ ఆ నోటును చూపిస్తాడు. దాన్ని చూసిన బాలు వ్యంగ్యంగా స్పందిస్తూ, "ఇలాంటి ప్రామిసరీ నోట్లు ఇప్పుడు పనికిరావు" అని మరోసారి హెచ్చరిస్తాడు. రవి, శృతి కూడా బాలుకి మద్దతుగా మాట్లాడటం పరిస్థితిని మరింత టెన్షన్‌గా మారుస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఆ నకిలీ నోట్ చూసి సంతోషంతో తబ్బిబ్బైపోతూ, వెంటనే విల్లా చూడాలని ఆసక్తి వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో మనోజ్ మరింత ఎగ్జైటింగ్ ఆఫర్‌ను బయటపెడతాడు. పూర్తి డబ్బు చెల్లించకముందే కుటుంబంతో కలిసి రెండు రోజులు ఆ విల్లాలో ఉండొచ్చని ఓనర్స్ చెప్పారని వెల్లడిస్తాడు. దీంతో ప్రభావతి మరింత ఆనందపడగా, బాలు వ్యంగ్యంగా "ఐదు లక్షలు ఇచ్చి రెండు రోజులు ఎంజాయ్ చేయొచ్చు కదా" అంటూ వ్యాఖ్యానిస్తాడు.
అయితే రవి, శృతి మొదట ఈ ట్రిప్‌కు రావడానికి నిరాకరిస్తారు. దాంతో మనోజ్ బాధపడుతూ, తన సంతోషాన్ని ఎవరూ పంచుకోవడం లేదని ఫీలవుతాడు. ఇదే సమయంలో బాలు రవిని పక్కకు తీసుకెళ్లి, "మనోజ్‌ను ఎవరో ట్రాప్ చేస్తున్నారు... ఇందులో పెద్ద మోసం ఉంది" అని అనుమానం వ్యక్తం చేస్తాడు. నిజం బయటపెట్టాలంటే అందరం కలిసి అక్కడికి వెళ్లాల్సిందే అని అతడిని ఒప్పిస్తాడు. మరోవైపు మీనా కూడా శృతిని కన్విన్స్ చేస్తుంది. చివరికి అందరూ కలిసి విల్లా చూడడానికి వెళ్లాలని నిర్ణయించుకోవడం కథలో కీలక మలుపుగా మారింది.
ఇక మరోవైపు బాలు మొదటి నుంచే మనోజ్ విల్లా డీల్‌పై అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. ఈ విషయాన్ని లోలోపల తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తాడు. "ఎవరో కావాలనే తక్కువ ధరకు ప్రాపర్టీ ఇస్తున్నామని చెప్పి మనోజ్‌ను ట్రాప్ చేస్తున్నారు" అనే అనుమానం అతడిని వెంటాడుతుంది. ఇందులో ఏదో పెద్ద మోసం ఉందని భావిస్తూ ఆలోచనల్లో మునిగిపోయిన సమయంలో మీనా అక్కడికి చేరుతుంది. బాలు పరిస్థితిని గమనించిన మీనా, "ఏమైంది?" అని అడగగా, అతడు విల్లా డీల్‌పై తన అనుమానాలను ఆమెతో పంచుకుంటాడు. దీనికి స్పందించిన మీనా, బాలును ప్రశంసిస్తూ "మీరు చాలా మంచివారు... మీ అన్నయ్య గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు" అంటూ అతడి మనసును హత్తుకుంటుంది. కుటుంబం పట్ల బాలు చూపిస్తున్న శ్రద్ధ ఆమెను మరింత ఆకట్టుకుంటుంది.
ఇదే సమయంలో మీనాకు ఓ ఫంక్షన్ హాల్ మేనేజర్ నుంచి ఫోన్ రావడం కథలో కొత్త మలుపు తీసుకొస్తుంది. గతంలో చేసిన డెకరేషన్ ఆర్డర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, మరో పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పడం మీనాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని బాలు అడగగా, తన బిజినెస్ పెరుగుతోందని మీనా సంతోషంగా చెబుతుంది. బాలు కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఆనందపడతాడు. అయితే మీనా తనతో రావాలని కోరినప్పటికీ, బాలు "నాకు ట్రిప్ ఉంది" అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు. అదే సమయంలో "నీ బిజినెస్ ఇంకా పెద్దది అవుతుంది... మనం కూడా ఒక రోజు విల్లా కొనుగోలు చేస్తాం" అని చెప్పడం వారి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ను చూపిస్తుంది.
ఇక మీనా ఫంక్షన్ హాల్‌కు వెళ్లి కొత్త డీల్ కోసం కస్టమర్లతో మాట్లాడుతుండగా అనూహ్య పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి, "ఇక్కడ బయట వాళ్లకు డెకరేషన్ చేయడానికి అనుమతి లేదు... మా ఫిక్స్డ్ ఏజెన్సీ మాత్రమే పని చేస్తుంది" అని చెప్పడంతో మీనా షాక్‌కు గురవుతుంది. కస్టమర్లు కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "డబ్బులు మేమే ఇస్తాం... మాకు నచ్చిన వారికే పని ఇస్తాం" అని నిలదీస్తారు. అయితే ఆ వ్యక్తి తన నిర్ణయాన్ని మార్చకుండా, "మీకు నచ్చితే ఆ ఏజెన్సీతోనే మాట్లాడండి" అంటూ స్పష్టం చేస్తాడు. దీంతో మీనా ఎదుర్కొంటున్న బిజినెస్ ఛాలెంజ్ మారింది.
ఇక ఫంక్షన్ హాల్‌లో కస్టమర్లతో డీల్ ఫైనల్ చేసే సమయంలో చింతామణి ఎంట్రీ ఇవ్వడం సన్నివేశాన్ని హీట్‌లోకి తీసుకెళ్లింది. తనకు ఈ ఫీల్డ్‌లో భారీ పేరుందని, "నన్ను తెలియనివారు ఉండరు" అన్నట్టుగా మాట్లాడుతూ మీనాను ఎగతాళి చేయడం ద్వారా ఆమె అహంకారం బయటపడింది. "ఇక్కడ డెకరేషన్ చేసేది నేనే" అంటూ కస్టమర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే కస్టమర్లు ఇప్పటికే మీనాతో మాట్లాడుకున్నామని చెప్పడంతో పరిస్థితి మారింది. వెంటనే చింతామణి మీనాను టార్గెట్ చేస్తూ, "ఎన్ని రోజుల నుంచి పని చేశావు? ఎన్ని ఆర్డర్లు చేశావు?" అంటూ ఆమె అనుభవాన్ని ప్రశ్నించింది. మీనా నిజాయితీగా తాను కొత్తగా ఈ ఫీల్డ్‌లోకి వచ్చానని, ఒక్క ఆర్డర్ మాత్రమే చేసినట్టు చెబుతుంది. దీంతో చింతామణి 'ఇది నీ వల్ల కాదు'అంటూ ఆమెను నేరుగా హెచ్చరించడం ద్వారా మీనాను వెనక్కు తగ్గించే ప్రయత్నం చేసింది.
కానీ మీనా వెనక్కి తగ్గలేదు. "నేను కొత్తగా వచ్చినా... పూల వ్యాపారంలోనే పెరిగాను. మార్కెట్ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు" అంటూ ధైర్యంగా నిలబడింది. దీంతో చింతామణి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ "ఎవరు తక్కువ కొటేషన్ ఇస్తే వాళ్లకే డీల్" అని ప్రకటించింది. మీనా కూడా ఆ ఛాలెంజ్‌ను అంగీకరించడం సన్నివేశానికి మరింత ఉత్కంఠను తెచ్చింది. మీనా తన ఐడియాలను కస్టమర్లకు వివరించి రీజనబుల్ కొటేషన్ ఇచ్చినా, చింతామణి ప్లాన్ మరో లెవల్‌లో సాగింది. ఆమె అసిస్టెంట్ ద్వారా మీనా చెప్పిన ప్రతి డీటైల్‌ను తెలుసుకుని, దానికంటే తక్కువ ధరను కోట్ చేసి కస్టమర్లను కన్ఫ్యూజ్ చేసింది.
దీంతో కస్టమర్లు మీనాను ప్రశ్నిస్తూ, "మీ కొటేషన్ చాలా ఎక్కువగా ఉంది" అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనికి మీనా సమాధానం ఇస్తూ, "ఇది పెళ్లి సీజన్... మీరు అనుకున్న క్వాలిటీ కావాలంటే ఖర్చు అవుతుంది. అంత తక్కువ ధరలో చేయడం సాధ్యం కాదు" అని స్పష్టం చేసింది. కానీ చింతామణి "నాకు మార్కెట్ నెట్‌వర్క్ ఉంది... తక్కువ ధరలో బెస్ట్ ఇస్తాను" అంటూ తన స్ట్రాటజీని కొనసాగించింది.
ఈ వాదోపవాదాల మధ్య కస్టమర్లు "మేము ఆలోచించి చెబుతాం" అంటూ వెళ్లిపోవడంతో సీన్ క్లైమాక్స్‌కు చేరింది. ఈ ఎపిసోడ్‌తో మీనా-చింతామణి మధ్య బిజినెస్ రైవల్రీ అధికారికంగా ప్రారంభమైంది. ఒకవైపు అనుభవం, నెట్‌వర్క్ ఉన్న చింతామణి... మరోవైపు నమ్మకం, పట్టుదలతో ఉన్న మీనా ఈ పోటీ రాబోయే ఎపిసోడ్‌లలో ఎలా మలుపులు తిరుగుతుందో ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో మనోజ్ విల్లా డీల్‌లో జరుగుతున్న అనుమానాస్పద పరిణామాలపై బాలు ఎలా స్పందిస్తాడు అన్నది కూడా కథలో కీలకంగా మారుతోంది.


Click it and Unblock the Notifications