Gundeninda Gudigantalu May 5th Episode: మనోజ్‌కు రవి-శృతి షాక్.. రోహిణి బాగోతం బయటపడిందా? ప్రభావతి రియాక్షన్ ?
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో వినోదం, ఉద్రిక్తత, భావోద్వేగం అన్నీ కలిసిపోయాయి. ఇంట్లోకి వచ్చిన న్యూమరాలజిస్ట్ "రోమతి" అనే పేరుకు ₹20,000 ఛార్జ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మనోజ్ భయంతో డబ్బులు ఇవ్వడం సన్నివేశాన్ని హాస్యాస్పదంగా మార్చింది. వెంటనే వచ్చిన గోస్ట్ హంటర్ దెయ్యాల కథతో మరింత గందరగోళం సృష్టించగా, బాలు తన స్టైల్‌లో ఆమెను బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించడం నవ్వులు పంచింది. కానీ మనోజ్ మళ్లీ డబ్బులు ఇవ్వడం అతని అమాయకత్వాన్ని చూపించింది. ఇక ప్రభావతి ఆకలి విషయాన్ని "ఎలుకలు పరిగెడుతున్నాయి" అని చెప్పడం, దానికి బాలు ఇచ్చిన రిప్లై కామెడీ హైలైట్‌గా నిలిచింది.
అదే సమయంలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి, పెద్ద మొత్తంలో లోన్ రాదని చెప్పడంతో కథ సీరియస్ మలుపు తీసుకుంది. డబ్బుల కోసం మనోజ్ ఇంటిని అమ్మాలని చెప్పడం కుటుంబంలో పెద్ద కలహానికి దారితీసింది. బాలు తీవ్రంగా వ్యతిరేకించగా, రవి భావోద్వేగంతో స్పందించాడు. చివరికి ప్రభావతి "ఈ ఇల్లు నా తండ్రి జ్ఞాపకం, అమ్మను" అంటూ గట్టి నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మనోజ్ ప్లాన్ దెబ్బతింది. అయితే రోహిణి మాత్రం వెనక్కి తగ్గకుండా అబద్ధాలతో డబ్బులు తెచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఫోన్ డ్రామాపై మీనా అనుమానం వ్యక్తం చేయడంతో కొత్త సస్పెన్స్ మొదలైంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ కుటుంబ విలువలు, మూఢనమ్మకాలు, మోసం మధ్య జరిగే సంఘర్షణలను ఆసక్తికరంగా చూపించింది.

photo courtesy jiohotstar
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. కథ ప్రారంభంలోనే మీనా-బాలు మధ్య జరిగిన సంభాషణ కథకు కీలక మలుపు ఇచ్చింది. రోహిణి ఫోన్ కాల్ వ్యవహారం పై మీనా అనుమానం వ్యక్తం చేస్తుంది. "ఆమె నిజంగా ఫోన్ చేసిందా.. లేక నటించిందా?" అంటూ సందేహం వ్యక్తం చేసింది. రోహిణి తానే ప్రశ్నలు అడిగి తానే సమాధానాలు చెప్పిందని గుర్తు చేస్తుంది. దీనిపై బాలు కూడా సీరియస్‌గా స్పందిస్తూ, "నువ్వు గమనించినది చిన్న విషయం కాదు... అసలు విషయం త్వరలో బయటపడుతుంది" అని చెప్పి ఆమె అనుమానాన్ని బలపరుస్తాడు. దీంతో రోహిణి వ్యవహారం పై సస్పెన్స్ మరింత పెరుగుతుంది.
ఇక మరోవైపు రవి-శృతి మధ్య జరిగిన సంభాషణ కుటుంబ పరిస్థితులను మరింత స్పష్టంగా చూపించింది. మనోజ్ ప్రవర్తనపై రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "అతన్ని నా అన్నయ్య అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది" అని అంటాడు. తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించని మనోజ్ తీరును శృతి కూడా ఖండిస్తూ, కనీసం రోహిణి అయినా ఆలోచించాలి కదా అని వ్యాఖ్యానిస్తుంది.
ఇదే సమయంలో మనోజ్-రోహిణి అక్కడికి రావడం కథలో ఉద్రిక్తతను పెంచింది. ముందుగానే పరిస్థితిని అర్థం చేసుకున్న శృతి, రవిని అప్రమత్తం చేస్తూ "ఎలాంటి సహాయం అడిగినా తిరస్కరించు" అని హెచ్చరిస్తుంది. శృతి ముందుగానే ఊహించినట్లుగానే మనోజ్ నేరుగా రవిని సంప్రదించి ఆర్థిక సహాయం కోరుతాడు. అయితే రవి చాలా స్పష్టంగా తన పరిస్థితిని వివరించేస్తాడు. "వెయ్యిల్లో అయితే సహాయం చేస్తాను... కానీ లక్షల్లో డబ్బులు ఇవ్వడం నా వల్ల కాదు. నేను రెస్టారెంట్‌లో పని చేస్తున్న సాధారణ వ్యక్తిని" అని చెప్పి తన పరిమితులను తెలియజేస్తాడు. ఈ మాటలు వినగానే మనోజ్ అసలు ప్లాన్‌ను బయటపెడతాడు.
శృతి కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించుకోవాలని చూస్తూ, "మీ మామయ్య కోటీశ్వరుడు కదా... వాళ్లను అడిగి మాకు డబ్బులు తెప్పించండి" అని చెప్పడం సన్నివేశాన్ని ఒక్కసారిగా టెన్షన్‌లోకి నెట్టేస్తుంది. ఈ మాటలకు రవి తీవ్రంగా స్పందిస్తాడు. అతని కళ్లలో స్పష్టమైన ఆగ్రహం కనిపిస్తుంది. శృతి కూడా వెంటనే స్పందిస్తూ, "మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం... మా ఇంటివాళ్లకు అది నచ్చలేదు. అలాంటప్పుడు వాళ్లను డబ్బులు అడగడం ఎలా అనుకుంటున్నారు?" అంటూ ప్రశ్నిస్తుంది.
అయితే రోహిణి కూడా తగ్గకుండా, "మీ అమ్మానాన్నల ఆస్తి అంతా నీకే కదా... ఇప్పుడైనా వెళ్లి అడుగు" అని ఒత్తిడి చేయడంతో శృతి ఆగ్రహం మరింత పెరుగుతుంది. ఆమె గట్టిగా, "ఆస్తి వాళ్లది... ఇవ్వాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. కానీ నేను వెళ్లి డబ్బులు అడిగే వ్యక్తిని కాదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపండి" అంటూ తేల్చి చెబుతుంది.
ఇంతకీ పరిస్థితి చేతిలో లేకపోతున్నదని భావించిన మనోజ్, సెంటిమెంట్ కార్డ్ ఆడేందుకు ప్రయత్నిస్తాడు. "నేను మధ్యలో ఇరుక్కున్నాను... మీరు సహాయం చేస్తారని అనుకున్నా. బాలు కూడా సహాయం చేయడం తన స్వార్థం కోసమే" అంటూ బాధతో మాట్లాడతాడు. కానీ ఈ మాటలు రవిని మరింత కోపానికి గురి చేస్తాయి. రవి నేరుగా మనోజ్‌ను ప్రశ్నిస్తూ, "నువ్వెప్పుడైనా ఎవరికైనా సహాయం చేశావా? కనీసం నాకు ఒక్క డ్రెస్ అయినా కొనిచ్చావా?" అంటూ కఠినంగా అడుగుతాడు.కానీ, బాలు అన్న "నేను చదువుకుంటున్నప్పుడు ఎన్నోసార్లు సహాయం చేశాడు. నన్ను తన కొడుకులా చూసుకున్నాడు. అది ప్రేమ... బాధ్యత. నిన్ను కూడా ఎన్నోసార్లు ఆదుకున్నాడు. ఆ విషయాలు మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదు" అంటూ మనోజ్‌కు గట్టి సమాధానం ఇస్తాడు.
రవి-శృతి వద్ద జరిగిన ఘర్షణ తర్వాత తీవ్ర ఆగ్రహంతో బయటకు వచ్చిన మనోజ్, తన అసంతృప్తిని రోహిణి ముందు బయటపెడతాడు. "నేను ఎదుగుతుంటే వాళ్లు ఓర్వలేకపోతున్నారు... సహాయం అడిగినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇకనుంచి నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచించను" అంటూ కఠినంగా ప్రకటిస్తాడు. అతని మాటల్లో కనిపించిన ఆవేశం, స్వార్థపూరిత ఆలోచనలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి.
ఇక రోహిణి "ఇప్పుడు ఏం చేద్దాం?" అని అడగగా, మనోజ్ మళ్లీ ఆమె కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, "నీ డాడీకి ఫోన్ చేసి డబ్బులు అడుగు" అని ఒత్తిడి తీసుకొస్తాడు. అయితే రోహిణి తన అబద్ధాన్ని కొనసాగిస్తూ, "మా నాన్న జైలులో ఉన్నాడు... సహాయం చేయలేడు. మా మామయ్య కూడా విల్లా కొని డబ్బులు ఇరుక్కుపోయాయి" అంటూ మరోసారి కథ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మనోజ్ కాసేపు ఆలోచనలో పడతాడు.
తర్వాత వెంటనే కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తూ, "ఇప్పుడు మనకు సహాయం చేసే ఒక్కరే ఉన్నాడు... ముంబై ముఖేష్. అతన్ని కన్విన్స్ చేస్తే ఎంతైనా పెట్టుబడి ఇస్తాడు. అతన్ని ఇంప్రెస్ చేసి బిజినెస్ ఎక్స్‌పాండ్ చేద్దాం" అంటూ ఛాలెంజ్‌గా మాట్లాడతాడు. రోహిణి కూడా అతనికి పూర్తిగా సపోర్ట్ ఇస్తానని చెప్పుతూ, తన అబద్ధాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సన్నివేశం మనోజ్ ఆశలు, రోహిణి మోసం రెండింటినీ స్పష్టంగా చూపిస్తుంది.
ఇక మరోవైపు బాలు-మీనా మధ్య జరిగిన సంభాషణ కుటుంబ విలువలను హైలైట్ చేసింది. మనోజ్ మాటలు తనకు అస్సలు నచ్చలేదని మీనా చెప్పగా, బాలు కూడా అతని తీరును తప్పుబడుతూ "వాడికి కుటుంబం, భావోద్వేగాలు అన్న భావనే లేదు" అని అంటాడు. "ఆ ఇల్లు మా అమ్మానాన్నల జీవితం... ప్రతి సంతోషం, ప్రతి బాధ ఆ ఇంట్లోనే ఉంది" అంటూ అతను భావోద్వేగంగా చెప్పడం సన్నివేశాన్ని బలంగా నిలబెడుతుంది. దీనికి మీనా కూడా తన అభిరుచిని వెల్లడిస్తూ, "పెంకుటిల్లు అయినా సరే అందరూ కలిసి ఉండే ఇల్లు కావాలి... పండుగలప్పుడు అందరూ కలిసి పిండి వంటలు చేసుకునే ఆనందం కావాలి" అని చెప్పడం కుటుంబ బంధాలపై ఆమెకు ఉన్న విలువలను చూపిస్తుంది. ఈ మాటలు బాలును ఆకట్టుకుంటాయి. ఇంతలోనే బాలు ఓల్డ్ కస్టమర్ నుంచి కాల్ రావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. "నేను ఇండియాకు వస్తున్నాను... రాజమండ్రి నుంచి పికప్ చేయాలి" అని ఆర్డర్ ఇవ్వడంతో బాలు అంగీకరిస్తాడు. మీనా త్వరగా పడుకోవాలని చెప్పినా, బాలు మాత్రం కాసేపు గార్డెన్‌లో మాట్లాడుకుందామని చెప్పి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తాడు.
ఒకవైపు రవి-శృతి మనోజ్ ప్రవర్తనపై మాట్లాడుకుంటారు. అయితే రవి, "ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటం అవసరం లేదు" అంటూ సంభాషణను మళ్లించడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో శృతి బయటకు వెళ్లాలని సూచించగా, రవి జాగ్రత్తగా స్పందిస్తూ "ఇప్పుడీ టైంలో, తెలియని ప్రదేశంలో బయటికి వెళ్లడం రిస్క్... నేను అలా చేయలేను" అని చెబుతాడు. దీనికి శృతి సరదాగా "ఇంత పిరికి అబ్బాయిని పెళ్లి చేసుకున్నానా?" అని అడిగినా, రవి కూల్‌గా "రిస్క్ తీసుకోవడం నాకిష్టం లేదు" అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటాడు.
ఇక సంభాషణను హాయిగా మార్చేందుకు రవి, శృతిని "నీకు ఎలాంటి ఇల్లు ఇష్టం?" అని అడుగుతాడు. దీనికి శృతి తన అభిరుచిని చెప్పుతూ, "గేటెడ్ కమ్యూనిటీ కావాలి... అందరూ కలిసి ఉండే వాతావరణం, ఒక చిన్న గల్లీలా అందరితో కలిసిపోవడం... అలాంటి జీవితం మంచి ఫీలింగ్ ఇస్తుంది" అని చెప్పడం ద్వారా కుటుంబం, సమాజం మధ్య అనుబంధాన్ని కోరుకునే తన మనసును బయటపెడుతుంది. రవి కూడా ఆమె అభిప్రాయంతో ఏకీభవించడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని బలపరుస్తుంది.
ఇక అసలు హైలెట్‌గా నిలిచింది ప్రభావతి-రోహిణి సన్నివేశం. రాత్రి సమయంలో రోహిణి గదికి వచ్చిన ప్రభావతి, ఆమెను ప్రశ్నలతో నిలదీస్తుంది. "నీ గురించి ఓ నిజం తెలిసింది... నిజంగా నీ నాన్న జైలులో ఉన్నాడా? నీ మామయ్య కోటీశ్వరుడా? నువ్వు నిజంగానే డబ్బున్న అమ్మాయివా?" అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది. అంతేకాదు, "మామయ్యకు ఫోన్ చేస్తున్నట్లు నాటకం చేసి, నిజానికి విద్యకు కాల్ చేశావు కదా?" అని ఆరోపిస్తుంది. ఈ ప్రశ్నలకు రోహిణి తొలుత తప్పించుకోవడానికి ప్రయత్నించినా, ప్రభావతి తీవ్రంగా స్పందిస్తూ "ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పావు? ఎందుకు మమ్మల్ని మోసం చేశావు?" అంటూ ఆగ్రహంతో ఆమెపై విరుచుకుపడుతుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, రోహిణి భయంతో అసలు నిజం చెబుతుంది. "నాకు నాన్న లేడు... మామయ్య కూడా లేడు... నేను పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని. నిజం చెబితే పెళ్లి జరగదనుకుని అబద్ధాలు చెప్పాను" అంటూ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది.
ఈ నిజం విన్న ప్రభావతి కోపంతో ఉప్పొంగిపోతూ, "ఇంత పెద్ద మోసం చేసిన నిన్ను నా ఇంట్లో ఉండనివ్వను" అంటూ ఆమెను బయటకు తోసేస్తుంది. సన్నివేశం మరింత తీవ్రమవుతూ, రోహిణిని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసి, ఆమె "కాపాడండి" అంటూ అరుస్తుండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. అయితే ఈ మొత్తం సన్నివేశం రోహిణి పీడకల. రోహిణి అరుపులకు మనోజ్ నిద్రలేచి ఏమైందని అడగగా, "పీడకల వచ్చింది" అని చెప్పి విషయాన్ని తప్పించుకుంటుంది. ఈ ట్విస్ట్ ద్వారా రోహిణి మనసులో ఉన్న భయం, తన అబద్ధాలు బయటపడితే ఏమవుతుందో అన్న ఆందోళన స్పష్టమవుతుంది.
మరోవైపు.. బాలు తన పాత కస్టమర్‌ను ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చేయడానికి వెళ్లడం ఈ భాగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమెతో సరదాగా మాట్లాడుతున్న బాలు తన ప్రత్యేక కామెడీ స్టైల్‌తో నవ్వులు పంచుతాడు. "నువ్వు అసలు మారలేదురా బాలు... అప్పుడెలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావ్" అని కస్టమర్ చెప్పగా, "ఇంకో 40 ఏళ్లైనా నేను ఇలానే ఉంటా" అని బాలు చెప్పడం ఆ సన్నివేశానికి హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె ఇండియాకు తిరిగి రావడానికి గల కారణాన్ని అడగగా, కొత్తగా ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చానని చెప్పింది. అయితే గతంలో ఒక విల్లా కొనుగోలు సమయంలో మధ్యవర్తి చేతిలో ₹45 లక్షలు మోసపోయానని చెప్పడంతో కథలో సీరియస్ టోన్ కనిపించింది. దీనిపై బాలు తనదైన స్టైల్‌లో స్పందిస్తూ "వాడెవడో చెప్పండి మేడం... వాడిని వదిలిపెట్టను" అని అంటాడు.
కానీ కస్టమర్ పాత విషయాలు మర్చిపోవాలని, ఇప్పుడు కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ మీదే దృష్టి పెట్టాలని చెప్పడం ద్వారా ఆ అంశాన్ని అక్కడితో ముగించింది. తర్వాత వారు చెప్పిన లొకేషన్‌కు చేరుకోగా, "ఐదు నిమిషాలు ఆగు... డాక్యుమెంట్స్ తీసుకుని వస్తా" అని చెప్పి కస్టమర్ లోపలికి వెళ్తుంది. బాలు కారులో వేచి ఉండగా, ఇదే సమయంలో మరో ట్రాక్‌లో ప్రభావతి-సత్యం బయటకు వచ్చి ఆ ప్రాంతాన్ని చూస్తారు. చుట్టూ ఉన్న వాతావరణం, ఇళ్ల అందం చూసి ప్రభావతి ఆశ్చర్యపోతూ "ఎంత బాగుంది ఈ ఏరియా" అని ఆనందపడడం సన్నివేశానికి హాయిగా ముగింపు ఇచ్చింది. అయితే ఈ సింపుల్‌గా కనిపించిన సీన్‌లోనే పెద్ద ట్విస్ట్‌కు బీజం పడింది. బాలు తీసుకువచ్చిన ఆ కస్టమర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇల్లు... అదే మనోజ్ డీల్ చేస్తున్న ఇంటితో ఏమైనా సంబంధం ఉందా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచింది. గతంలో జరిగిన ₹45 లక్షల మోసం కూడా ఈ కథలో కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











