Gundeninda Gudigantalu May 7th Episode: కల్పనపై బాలు ఫైర్, మనోజ్-రోహిణి గుట్టురట్టు, ఇంట్లో రణరంగం
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రారంభంలో ప్రభావతి-సత్యం మధ్య జరిగిన సంభాషణ భావోద్వేగంగా సాగింది. కొత్త ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన ఇళ్లను చూసిన ప్రభావతి, "మనమూ ఇలా రిచ్‌గా ఉండాలి" అంటూ పెద్ద ఆశలు వ్యక్తం చేయగా, సత్యం మాత్రం పాత ఇంటి జ్ఞాపకాలు, కుటుంబ విలువలను గుర్తుచేస్తూ ఆమెను హెచ్చరించాడు. అయినా ప్రభావతి తన కొడుకు మనోజ్ వల్ల తమ జీవితం మారిపోతుందని నమ్మకంగా చెప్పడం కథలో అత్యాశను ప్రతిబింబించింది. మరోవైపు బాలు, కల్పనను రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు తీసుకెళ్లగా అక్కడే మనోజ్-రోహిణి కనిపించడం కథలో ట్విస్ట్ తీసుకొచ్చింది. మనోజ్ తన అహంకారంతో కొత్త బిల్డింగ్ కొనుగోలు చేశామని గొప్పలు చెప్పగా, బాలు తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చాడు.
ఇదే సమయంలో మనోజ్ వాయిస్ విన్న కల్పన ఒక్కసారిగా టెన్షన్‌కు గురై అక్కడి నుంచి వెళ్లిపోవడం, ఆమెకు మనోజ్‌తో గతంలో ఏదో సంబంధం ఉందన్న అనుమానాలను పెంచింది. ఇక అసలు హైలైట్ విల్లా మోసం బయటపడటమే. "రోమతి" పేరుతో నేమ్ బోర్డ్ పెట్టించేందుకు సిద్ధమైన మనోజ్ కుటుంబానికి అసలు యజమాని ఎంట్రీతో షాక్ తగిలింది. తాము 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కొనుగోలు చేశామని చెప్పినా, ఆ ఇంటిని అమ్మిన వ్యక్తి కేవలం అద్దెదారుడే అని బయటపడింది. పోలీసులు వచ్చి మనోజ్‌ను తీవ్రంగా మందలించగా, కుటుంబం అవమానంతో పాత ఇంటికి తిరిగి వచ్చింది. చివర్లో సత్యం "అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాం" అంటూ బాధపడటం ఎపిసోడ్‌కు ఎమోషనల్ ముగింపుగా నిలిచింది.

photo courtesy jiohotstar
గురువారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా మనోజ్ 30 లక్షలు విల్లా పేరుతో మోసపోవడం ఇంట్లో పెద్ద కలకలం రేపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎన్నో ఆశలతో పెట్టుబడి పెట్టిన డబ్బులు క్షణాల్లో మాయం కావడంతో సత్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుల విలువ తెలియకుండా అత్యాశకు పోయి ఇలా మోసపోయావా అంటూ మనోజ్‌పై మండిపడ్డాడు. "ఇది చిన్న విషయం కాదు.. నాలాంటి ఉద్యోగి జీవితకాల సంపాదన" అంటూ సత్యం చెప్పిన మాటలు ఎపిసోడ్‌కు మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చాయి.
అయితే ఈ సమయంలో ప్రభావతి మాత్రం మనోజ్‌కు అండగా నిలుస్తూ సత్యం మాట్లాడిన తీరు సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. "మోసపోయిన వాడిని ఓదార్చాలి కానీ ఇలా అవమానిస్తారా" అంటూ సెంటిమెంట్ డైలాగులు చెప్పింది. అంతేకాదు ఈ విషయంలో బాలుపై కూడా పరోక్షంగా నిందలు వేయడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. దీంతో సత్యం ఆగ్రహానికి లోనై, "నీవల్లనే మనోజ్ పనికిరాని వాడిలా మారిపోయాడు. వాడు చేసే ప్రతి తప్పును వెనకేసుకొచ్చి సమర్థించడమే ఈ పరిస్థితికి కారణం" అంటూ ప్రభావతిని గట్టిగా మందలించాడు.
ఇక బాలు కూడా ఈసారి అస్సలు తగ్గకుండా మనోజ్‌కు క్లాస్ పీకాడు. "అప్పుడు 40 లక్షలు, ఇప్పుడు 30 లక్షలు.. ఇలా ఎప్పుడూ మోసపోతుంటే సంపాదించేది ఎప్పుడు? జీవితంలో బాగుపడేది ఎప్పుడు?" అంటూ నేరుగా ప్రశ్నించాడు. బాలు మాటలకు రోహిణి తీవ్రంగా స్పందిస్తూ "నేను బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా?" అంటూ అవమానకరంగా మాట్లాడింది. ఈ సమయంలో మీనా ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని పూర్తిగా మలుపుతిప్పింది. మొదటి నుంచే విల్లా డీల్‌పై బాలు అనుమానం వ్యక్తం చేశాడని, ఐదు కోట్ల ప్రాపర్టీని మూడు కోట్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించాడని గుర్తుచేసింది. కానీ మీరు మాత్రం అసూయతో బాలునే తప్పుబట్టారని రోహిణిని నిలదీసింది. దీంతో రోహిణి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
ఇక పరిస్థితి పూర్తిగా తన చేతుల్లోనుంచి జారిపోతుందని గ్రహించిన మనోజ్ చివరకు తన తప్పును ఒప్పుకున్నాడు. అయితే బాలు అక్కడితో ఆగకుండా మరో కీలక విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. "నాన్నకు ఇవ్వాల్సిన 40 లక్షలు ఎప్పుడు ఇస్తావు?" అంటూ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో మనోజ్ వెంటనే రోహిణిని పిలిచి, "నీ నాన్నకు ఫోన్ చేసి మలేషియా నుంచి డబ్బులు పంపమని చెప్పు" అంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. కానీ రోహిణి మాత్రం తీవ్ర ఎమోషన్‌తో "మా నాన్న జైలులో ఉన్నాడు.. ఇప్పుడు డబ్బులు పంపించడం సాధ్యం కాదు" అంటూ చెప్పడంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రోహిణి సమాధానంతో బాలు అనుమానం మరింత పెంచుకున్నాడు. "ఎప్పుడూ మీ నాన్న విషయం వస్తే ఏదో ఒక కారణం చెబుతూనే ఉంటావు. నిజంగా ఆయన జైలులో ఉన్నాడా? అసలు ఉన్నాడా లేదా?" అంటూ నేరుగా ప్రశ్నించాడు. ఈ డైలాగ్‌తో ఎపిసోడ్ ఒక్కసారిగా కొత్త మిస్టరీ వైపు మళ్లింది. రోహిణి దాచిపెడుతున్న రహస్యం ఏమిటన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. అదే సమయంలో మనోజ్‌ను కూడా బాలు ఉతికి ఆరేయడంతో అతడు పూర్తిగా మాటరాని స్థితిలోకి వెళ్లిపోయాడు.
చివర్లో సత్యం అసలు సమస్యపై దృష్టి పెట్టాడు. "ఇప్పుడు వాడిని తిడితే ప్రయోజనం ఏముంది? పోలీస్ కేసు పరిస్థితి ఏంటి?" అంటూ ప్రశ్నించగా, మనోజ్ నిర్లక్ష్యంగా "విచారణ జరుగుతోంది.. టైమ్ పడుతుంది" అని సమాధానం ఇచ్చాడు. దీంతో బాలు మరోసారి రంగంలోకి దిగుతూ, "వాడితో పని కాదులే.. నేనే మణికంఠను తీసుకొని ఆ ఇల్లు అమ్మిన వాడెవడో తెలుసుకుంటా" అంటూ గట్టిగా చెప్పాడు. దీంతో ఇకపై కథలో బాలు స్వయంగా మోసగాళ్లను వెతికే ట్రాక్ ప్రారంభమవుతుందనే ఆసక్తి నెలకొంది.
విల్లా మోసం కేసులో అసలు నిందితులను బయటకు తీయాలని బాలు గట్టిగా నిర్ణయించుకున్న తర్వాత కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఎవరిని వదలకుండా ఒక్కో లింక్‌ను పట్టుకుని ముందుకు వెళ్తున్న బాలు, మొదట మణికంఠను దొరకబట్టి గట్టిగా నిలదీశాడు. "ఇంతకీ ఆ ఇల్లు అమ్మిన వాళ్లు నీకు ఎన్ని రోజుల నుంచి పరిచయం? వాళ్లతో నీకు ఏంటి సంబంధం?" అంటూ సీరియస్‌గా ప్రశ్నించాడు. బాలు ఆగ్రహం చూసి భయపడిపోయిన మణికంఠ చివరకు అసలు నిజం బయటపెట్టాడు. "బ్రో.. వాళ్లు నాకు కేవలం నెల రోజుల పరిచయం మాత్రమే. వాళ్లు మంచి వాళ్లు అనుకున్నా.. ఇలా మోసం చేస్తారని ఊహించలేదు" అంటూ భయంతో చెప్పాడు.
అయితే మణికంఠ సమాధానంతో బాలు మరింత మండిపడ్డాడు. "నెల రోజుల పరిచయానికే ఇంత పెద్ద డీల్ నమ్మేస్తావా? ఐదు కోట్ల విల్లాను మూడు కోట్లకు ఇస్తామంటే మీరెలా నమ్మారు రా? అంతా కలిసి మనోజ్ గాడిని బకరా చేశారు కదా" అంటూ గట్టిగా క్లాస్ పీకాడు. అంతేకాదు "మనోజ్ గురించి నీకు తెలుసు కదా.. అమాయకులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. ఎవడైనా ఈజీగా మోసం చేయగలడు. కనీసం నాకు ఒక్క మాట చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు" అంటూ మణికంఠపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సన్నివేశంలో బాలు డైలాగులు ఎమోషన్‌తో పాటు ఫైర్‌తో నిండిపోయాయి.
ఇక డబ్బుల విషయం గుర్తుకు రావడంతో బాలు మరింత సీరియస్ అయ్యాడు. "ఆ డబ్బులు తిరిగి రాకపోతే వాడిని నేనే చంపి పాతేస్తా" అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాలు కోపం చూసి మణికంఠ పూర్తిగా షాక్‌కు గురయ్యాడు. ఇక్కడి నుంచే ఎపిసోడ్ పూర్తిగా థ్రిల్లింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఎంక్వయిరీలో భాగంగా బాలు, మణికంఠను వెంట తీసుకుని ఆ విల్లా ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కొబ్బరి బోండాలు అమ్ముతున్న వ్యక్తిని సంప్రదించి నకిలీ ఓనర్స్ గురించి విచారిస్తాడు. ఈ సమయంలో ఆ వ్యాపారి చెప్పిన విషయాలు కథకు కీలక మలుపు తిప్పాయి. "వాళ్లు కేవలం ఆరు నెలలుగానే ఆ ఇంట్లో ఉంటున్నారు. చాలా మంది వచ్చి వెళ్లేవారు. నాకు ఏదో అనుమానం వచ్చినా పని బిజీలో అసలు ఓనర్‌కు చెప్పలేకపోయా" అంటూ చెబుతాడు. అంతేకాదు "ఒక సీరియల్ యాక్టర్ కూడా తరచూ ఆ ఇంటికి వస్తూ వెళ్లేవాడు" అంటూ మరో షాకింగ్ క్లూ ఇస్తాడు.
ఈ విషయం విన్న బాలు వెంటనే అలర్ట్ అవుతాడు. "ఇంకెవరైనా వాళ్ల గురించి తెలుసా?" అని అడగగా, ఆ కొబ్బరి బోండాల వ్యాపారి మరో కీలక సమాచారం అందిస్తాడు. "ఆ ఇంట్లో పని చేసే ఓ పనిమనిషి ఉంది. ఆమెకు వాళ్ల గురించి బాగా తెలుసు" అంటూ ఆ పనిమనిషి అడ్రస్‌ను బాలుకు చెబుతాడు. దీంతో అసలు మోసగాళ్లను పట్టుకునే దారిలో బాలు కీలక ఆధారాన్ని సంపాదించినట్టవుతుంది. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో సంతోషించిన బాలు, అతడి చేతిలో డబ్బులు పెట్టి "ఇంకా ఏమైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి" అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతాడు.
ఇక కారులో వెళ్తున్న సమయంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కార్లో కూర్చున్న మణికంఠ, కల్పన ఇచ్చిన అద్దాలను పెట్టుకోవడంతో బాలుకి ఒక్కసారిగా కోపం వస్తుంది. "ముందు ఆ అద్దాలు తీసేయ్.. నా వస్తువులను ఇతరులు ముట్టుకుంటే నాకు అస్సలు నచ్చదు" అంటూ సీరియస్‌గా హెచ్చరిస్తాడు. ఈ సమయంలో బాలుకు మీనా గుర్తుకొస్తుంది. వెంటనే ఆమెకు ఫోన్ చేసి "ఎక్కడున్నావ్?" అని అడుగుతాడు. మీనా తాను తన అమ్మ వాళ్ల పూల కొట్టు దగ్గర ఉన్నానని చెప్పడంతో, "నేను వస్తున్నా.. అక్కడే ఉండు" అంటూ బాలు త్వరగా అక్కడికి బయలుదేరుతాడు.
మరోవైపు ఇంట్లో జరిగిన భారీ గొడవలు, మనోజ్ మోసం వ్యవహారం గురించి మీనా తన చెల్లి సుమతి, తల్లికి వివరిస్తూ కనిపించింది. కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెబుతూ మీనా భావోద్వేగానికి లోనవుతుంది. అయితే ఈ విషయాలు విన్న సుమతి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "వాళ్లు తప్పులు చేస్తూ వస్తారు.. మీరు మాత్రం వాటిని సరిదిద్దుతూ వస్తారు. పైగా మిమ్మల్నే నిందిస్తూ బాధ పెడతారు. అలాంటి వాళ్లకు మళ్లీ సహాయం చేయడం ఎందుకు అక్క?" అంటూ అసహనం వ్యక్తం చేసింది. సుమతి మాటల్లో కుటుంబంపై ఉన్న బాధ స్పష్టంగా కనిపించింది.
ఇక అదే సమయంలో మీనా తల్లి కూడా ఇదే విషయంపై ప్రశ్నిస్తాడు. "ఇన్ని అవమానాలు పడుతున్నా ఇంకా వాళ్ల కోసం ఎందుకు ఆలోచిస్తున్నావ్?" అని అడగగా, మీనా ఎంతో హుందాగా సమాధానం ఇచ్చింది. "మనం ఇతరులకు సహాయం చేయకపోయినా పర్లేదు.. కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎంతైనా వాళ్లు మా ఇంటి వాళ్లే కదా. ఆపద వచ్చినా, సంపద వచ్చినా అండగా ఉండాలి. అందుకే బాలు ఈ మోసం వెనుక నిజాలు తెలుసుకోవడానికి వెళ్లాడు" అంటూ కుటుంబ విలువలను గుర్తుచేసింది. మీనా మాటలు అక్కడున్న వారిని కాసేపు ఆలోచింపజేశాయి.
ఇంతలోనే బాలు అక్కడికి చేరుకుంటాడు. అయితే ఈసారి బాలు ఎంట్రీ పూర్తిగా స్టైలిష్‌గా ఉండటంతో సన్నివేశం ఒక్కసారిగా సరదా మూడ్‌లోకి మారిపోయింది. కారులో నుంచి దిగుతూ కల్పన ఇచ్చిన కళ్లద్దాలు పెట్టుకుని హీరో లెవెల్లో స్టైల్‌గా నడుచుకుంటూ వస్తాడు. బాలు కొత్త లుక్ చూసిన సుమతి ఆశ్చర్యపోతూ "బావా.. అచ్చు హీరోలాగే ఉన్నావ్. స్టైల్ పూర్తిగా మార్చేశావ్ కదా" అంటూ కాంప్లిమెంట్ ఇస్తుంది. దీంతో బాలు కూడా నవ్వుతూ "నాకే కాదు.. మీ అక్కకి కూడా తీసుకొచ్చా. ఒక కస్టమర్ ఇచ్చింది" అంటూ చెప్పాడు.
అయితే "ఎవరు ఆ కస్టమర్?" అని సుమతి ఆసక్తిగా అడగడంతో బాలు అసలు విషయం చెబుతాడు. "ఫారెన్ నుంచి వచ్చిన ఓ లేడీ కస్టమర్.. నాకు, మీ అక్కకి ఈ అద్దాలు గిఫ్ట్ ఇచ్చింది" అని చెబుతాడు. దీంతో సుమతి సరదాగా "మీ ఇద్దరూ అద్దాలు పెట్టుకుంటే అచ్చు హీరో హీరోయిన్‌లా ఉన్నారు" అంటూ ఆటపట్టిస్తుంది. సుమతి మాటలకు బాలు ఇంప్రెస్ అయి "అయితే అందరం కలిసి ఓ సెల్ఫీ దిగుదాం" అని చెప్పడంతో అందరూ కలిసి సెల్ఫీలు దిగుతారు. ఈ సన్నివేశం కుటుంబంలో కాసేపు నవ్వులు పూయించింది.
అయితే ఆ సరదా క్షణాల మధ్యే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సెల్ఫీలు చూసేందుకు సుమతి బాలు ఫోన్ తీసుకుంటుంది. ఫోటోలు స్క్రోల్ చేస్తుండగా ఒక్కసారిగా ఓ అమ్మాయి ఫోటో కనిపించడంతో షాక్ అవుతుంది. వెంటనే ఆ ఫోటోను మీనాకు చూపిస్తూ "అక్కా.. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశావా?" అని ప్రశ్నిస్తుంది. ఆ ఫోటో చూసిన మీనాకు వెంటనే గతం గుర్తుకొస్తుంది. "అవును.. ఆరోజు మనోజ్ రిసెప్షన్‌లో కనిపించింది ఈ అమ్మాయే" అంటూ గుర్తు చేస్తుంది. ఇక్కడే బాలు ఒక్కసారిగా అసలు విషయాన్ని పసిగడతాడు. "అంటే.. ఆరోజు మనోజ్‌ను మోసం చేసిన వాళ్లలో ఈమె కూడా ఉందా? ఈరోజు నాకు కళ్లద్దాలు ఇచ్చిన అమ్మాయి, అప్పటి కల్పనా ఒకరే అన్నమాట!" అంటూ షాక్ అవుతాడు. ఇప్పటివరకు క్లూల కోసం తిరిగిన బాలు చేతికి ఇప్పుడు నేరుగా కీలక ఆధారం చిక్కినట్టవుతుంది. వెంటనే అతడి కోపం ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది. "40 లక్షలు కాజేసి మమ్మల్ని రోడ్డున పడేసిన ఆ కల్పనాను అస్సలు వదలను" అంటూ ఆగ్రహంతో రగిలిపోతాడు.
అంతేకాదు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కల్పనా అపార్ట్మెంట్‌కి బయలుదేరుతాడు. ఇప్పటివరకు కల్పననే అసలు మోసగత్తె అనుకుని ఆమెను వెతుకుతూ వచ్చిన బాలు, చివరకు ఆమె అపార్ట్‌మెంట్‌కి చేరుకుంటాడు. అయితే అసలు విషయం తెలియని కల్పన సాధారణంగానే "ఏంటి బాలు ఇలా వచ్చావ్?" అంటూ పలకరించగా, బాలు మాత్రం పూర్తిగా మారిపోయిన తీరు చూపించాడు. "ఏంటి కల్పనా..." అంటూ కోపంగా మాట్లాడడంతో కల్పన ఒక్కసారిగా షాక్ అవుతుంది. "బాలు.. ఏంటి మాట తీరు ఇలా మారిపోయింది?" అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంది.
అయితే అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న బాలు, "40 లక్షలు మోసం చేసిన వారిని ఇలా పిలవకపోతే ఇంకెలా పిలవాలి?" అంటూ గట్టిగా నిలదీస్తాడు. దీంతో కల్పనకు అసలు విషయం అర్థం కాక కాస్త సీరియస్ అవుతుంది. "ఏం మాట్లాడుతున్నావ్ బాలు?" అంటూ తిరిగి ప్రశ్నిస్తుంది. కానీ బాలు మాత్రం ఒక్క క్షణం కూడా తగ్గకుండా, "నువ్వు ఒక కుటుంబాన్ని మోసం చేసి 40 లక్షలు తీసుకెళ్లావ్. ఇప్పటికీ మా ఇంట్లో వాళ్లు ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నారు. అలాంటి నిన్ను నేను అస్సలు క్షమించలేను" అంటూ ఆగ్రహంతో మండిపడతాడు.
ఇక్కడే కథలో ఊహించని మలుపు తిరిగింది. కల్పన మాత్రం ఏమీ తెలియనట్టు "ఇంతకీ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్?" అంటూ తిరిగి ప్రశ్నించడంతో, బాలు మనోజ్ గురించి మొత్తం చెబుతాడు. "వాడు మా అన్నయ్య.. నువ్వు చేసిన మోసం వల్ల నేను, నా తమ్ముడు చాలీచాలని బ్రతుకులు బ్రతుకుతున్నాం. నిజంగా నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. అయినా ఆ డబ్బులు ఏం చేసావ్?" అంటూ నిలదీస్తాడు. ఈ సమయంలో కల్పన చెప్పిన మాటలు బాలుకి భారీ షాక్ ఇస్తాయి.
"ఏంటి బాలు? ఆ డబ్బులు నేను ఎప్పుడో ఇచ్చేశాను కదా!" అంటూ కల్పన సమాధానం ఇవ్వడంతో బాలు ఒక్కసారిగా అవాక్కవుతాడు. వెంటనే "అబద్ధం చెప్పడం లేదు కదా? నా గురించి తెలిసే ఉంటుంది.. అబద్ధం చెబితే మాత్రం బాగోదు" అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో కల్పన అసలు నిజాన్ని బయటపెడుతుంది. "లాస్ట్ టైం నేను ఇండియాకు వచ్చినప్పుడు.. మీ అన్నయ్య, మీ వదిన నన్ను బంధించి టార్చర్ చేశారు. ఆ సమయంలోనే వడ్డీతో కలిపి మొత్తం 45 లక్షలు ఇచ్చేశాను" అంటూ సంచలన విషయం చెబుతుంది.
ఈ మాటలు విన్న బాలు పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోతాడు. "నేను ఎలా నమ్మాలి?" అని ప్రశ్నించగా, కల్పన మరో కీలక ఆధారాన్ని బయటపెడుతుంది. "ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో నువ్వే సాక్షిగా సంతకం పెట్టావ్ గుర్తుందా? నీ నాన్న, నీ వదినకు డబ్బులు ఇచ్చిన తర్వాతే నీ చేత సాక్షి సంతకం పెట్టించాం" అంటూ అసలు బాంబ్ పేలుస్తుంది. దీంతో బాలు ఒక్కసారిగా గతాన్ని గుర్తు చేసుకుంటూ కన్ఫ్యూజన్‌లో పడిపోతాడు.
అయితే కల్పన అక్కడితో ఆగకుండా మనోజ్, రోహిణిల అసలు స్వరూపాన్ని కూడా బయటపెడుతుంది. "మీ అన్నయ్య కంటే మీ వదిన చాలా ఖతర్నాక్. నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయించింది ఆమెనే. ఆమెను తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పటికైనా అర్థమైందా? మీ ఇంటి మొత్తాన్ని మోసం చేసింది మీ అన్నయ్యే. నేను మొత్తం 45 లక్షలు ఇచ్చేశాను" అంటూ రోహిణి పాత్రపై సంచలన ఆరోపణలు చేస్తుంది. ఈ మాటలతో ఇప్పటివరకు విలన్‌గా కనిపించిన కల్పన ఒక్కసారిగా బాధితురాలిగా మారిపోగా, మనోజ్-రోహిణిలపై భారీ అనుమానాలు మొదలయ్యాయి.
ఇక ఈ నిజం బయటపడడంతో బాలు కూడా వెంటనే కీలక నిర్ణయం తీసుకుంటాడు. "ఈ విషయాన్ని మా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్తావా? ముందుగా పోలీస్ స్టేషన్ స్టేట్మెంట్ కాపీ, బ్యాంక్ స్టేట్మెంట్ కాపీలు తీసుకుని మా ఇంటికి రావాలి" అంటూ కల్పనను అడుగుతాడు. దీనికి కల్పన కూడా వెంటనే ఓకే చెబుతుంది. "నన్ను పోలీస్ స్టేషన్‌లో అవమానించిన మీ అన్న, వదినలపై కక్ష తీర్చుకోవడానికి ఇంత మంచి అవకాశం వస్తే వదులుకుంటానా? నీ కోసమైనా కచ్చితంగా వస్తా. అన్ని సాక్ష్యాలతో వాళ్ల బాగోతం బయటపెడతా" అంటూ సవాల్ విసురుతుంది.
ఇక బాలు నేరుగా ఇంటికి చేరుకుంటాడు. అయితే ఈసారి అతడు సాధారణంగా రాకుండా పూర్తి వీర లెవెల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే అందరినీ ఒక్కచోటికి పిలిచి, "ఇప్పుడీ ఇల్లు కోర్ట్‌గా మారబోతోంది" అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ నిలిచిపోయారు. ఇక బాలు ఇంట్లోనే ఓ ఫ్యామిలీ కోర్ట్ సెట్ చేసి అందరికీ పాత్రలు కూడా ఫిక్స్ చేస్తాడు. ప్రభావతిని న్యాయమూర్తిగా కూర్చోబెట్టి, తన తండ్రి సత్యంను బాధితుడిగా నిలబెడతాడు. తానే న్యాయవాదిగా వ్యవహరిస్తూ అసలు కేసును ఓపెన్ చేస్తాడు. ఇక ముద్దాయిలుగా మనోజ్, రోహిణిలను నిలబెట్టడంతో ఇంట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. "ఏంట్రా ఈ కథంతా?" అంటూ సత్యం ఆశ్చర్యంగా ప్రశ్నించగా, బాలు ఒక్కో విషయం బయటపెట్టడం ప్రారంభిస్తాడు.
"ఒక బస్ కండక్టర్.. ఎండనక వాననక.. ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బును ఒక కొడుకు అప్పనంగా తీసుకెళ్లి తన ప్రియురాలి చేతిలో మోసపోయాడు" అంటూ బాలు ఎమోషనల్‌గా కేసును వివరించడం ప్రారంభిస్తాడు. బాలు చెప్పిన మాటలు వినగానే ఇంట్లో ఉన్నవాళ్లు సైలెంట్ అయిపోతారు. అయితే రవి మాత్రం "ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు కదా.. మళ్లీ కొత్తగా ఎందుకు చెప్తున్నావ్?" అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి బాలు ఇచ్చిన సమాధానం ఇంట్లో మరోసారి బాంబ్ పేల్చినట్టైంది. "ఇప్పటివరకు మనకు తెలిసింది నాణానికి ఒక వైపు మాత్రమే. కానీ రెండో వైపు మనోజ్ గాడి లీలలు ఇంకా చాలా ఉన్నాయి" అంటూ బాలు అసలు నిజాన్ని బయటపెట్టడానికి సిద్ధమవుతాడు. ఈ మాటలు విన్న మనోజ్ ఒక్కసారిగా టెన్షన్‌కు గురవుతాడు. వెంటనే "నాకు టైమ్ అవుతోంది.. షాప్‌కు వెళ్లాలి" అంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ బాలు అస్సలు వదలకుండా మనోజ్‌ను పట్టుకుని బలవంతంగా బోనులో నిలబెడతాడు.
"నువ్వు షాప్‌కు వెళ్తావా.. కోర్టుకు వెళ్తావా అన్నది తర్వాత విషయం. ముందుగా నీ బాగోతం బయటకు రావాలి" అంటూ బాలు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అసలు బాంబ్ పేలుస్తూ "వీడు తక్కువోడేం కాదు.. రెండోసారి కూడా లక్షలు మింగేశాడు. ఆ అమ్మాయి దగ్గర నుంచి 40 లక్షలు రాబట్టారు. ఇందులో రోహిణి కూడా ఉంది. ఇద్దరూ కలిసి మొత్తం 45 లక్షలు తీసుకున్నారు. వీరిద్దరూ తోడు దొంగలు" అంటూ సంచలన ఆరోపణలు చేస్తాడు. ఈ మాటలు విన్న ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.
ఇక రోహిణి పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఒక్కసారిగా కంగారు పడిపోయినా బయటకు మాత్రం తెలివిగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. "నిజానిజాలు తెలియకుండా మా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. నీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదా" అంటూ బాలును ఎదుర్కొంటుంది. అయితే బాలు కూడా ఈసారి పూర్తిగా రెడీ అయ్యి వచ్చినట్టుగా కనిపించాడు. "టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సాక్ష్యం చెప్పడానికి మనోజ్ గాడి మాజీ లవర్ కల్పనా వస్తుంది. మీరు చేసిన ద్రోహం మొత్తం చెబుతుంది. పక్కా సాక్ష్యాలతో అందరి ముందు మీ బాగోతం బయటపెడుతుంది" అంటూ మరో భారీ షాక్ ఇస్తాడు.
ఈ ఒక్క మాటతో ఇంట్లో ఉన్నవాళ్లంతా పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోతారు. ఇప్పటివరకు మనోజ్-రోహిణిలను బాధితులుగా భావించిన వాళ్లకు ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలవుతాయి. సత్యం, ప్రభావతి, రవి, మీనా అందరూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచనలో పడిపోతారు. ఇక మనోజ్, రోహిణి పరిస్థితి అయితే మరింత టెన్షన్‌గా మారుతుంది. తమ అసలు బాగోతం బయటపడిపోతుందేమోనన్న భయంతో ఇద్దరూ గజగజ వణికిపోతూ కనిపించారు.ఎపిసోడ్ చివర్లో "కల్పనా వస్తోంది" అనే డైలాగ్‌తో సీరియల్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇక వచ్చే ఎపిసోడ్‌లో కల్పనా నిజంగానే ఇంటికి వచ్చి సాక్ష్యాలు బయటపెడుతుందా? మనోజ్-రోహిణిల అసలు ముఖం కుటుంబ సభ్యుల ముందే బయటపడుతుందా? సత్యం తన కొడుకుపై ఎలా స్పందిస్తాడు? అనే సస్పెన్స్‌తో నేటి ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











