Gundeninda Gudigantalu May 8th Episode: పగ తీర్చుకోనున్న కల్పన, మనోజ్-రోహిణి గుట్టురట్టు, ప్రభావతి ఉగ్ర తాండవం
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగింది. మనోజ్ విల్లా పేరుతో 30 లక్షలు మోసపోవడం కుటుంబాన్ని షాక్‌కు గురిచేసింది. సత్యం తన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మనోజ్‌పై మండిపడ్డాడు. అయితే ప్రభావతి మాత్రం మనోజ్‌కు అండగా నిలిచి, మోసపోయిన వాడిని ఓదార్చాలే తప్ప అవమానించకూడదని సత్యంతో వాదించింది. బాలు మాత్రం ఈసారి అస్సలు తగ్గకుండా మనోజ్‌ను నిలదీశాడు. గతంలో 40 లక్షలు, ఇప్పుడు 30 లక్షలు పోగొట్టుకోవడంపై తీవ్రంగా ప్రశ్నించాడు. ఈ క్రమంలో రోహిణి తండ్రి జైలులో ఉన్నాడని చెప్పడంతో బాలుకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
ఇక మోసగాళ్లను పట్టుకోవాలని నిర్ణయించిన బాలు, మణికంఠతో కలిసి విచారణ ప్రారంభించాడు. విల్లా దగ్గర విచారణలో ఓ సీరియల్ నటి తరచూ అక్కడికి వచ్చేదని తెలిసి కథలో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇదే సమయంలో మీనా, సుమతి సహాయంతో బాలు ఫోన్‌లో కనిపించిన ఫోటో ద్వారా కల్పన అనే అమ్మాయి ఈ మోసం వెనుక ఉందని గుర్తించాడు. కోపంతో కల్పనను నిలదీసిన బాలు, అక్కడ అసలు నిజం తెలుసుకుని షాక్ అయ్యాడు. కల్పన ఇప్పటికే 45 లక్షలు మనోజ్, రోహిణిలకు తిరిగి ఇచ్చేశానని, పోలీస్ స్టేషన్‌లో బాలు సాక్షిగా సంతకం కూడా పెట్టాడని చెప్పింది. దీంతో అసలు మోసం మనోజ్-రోహిణిలదేనని తేలింది. వెంటనే బాలు ఇంట్లోనే ఫ్యామిలీ కోర్ట్ ఏర్పాటు చేసి, కల్పనను సాక్ష్యాలతో రప్పిస్తానని ప్రకటించడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.

photo courtesy jiohotstar
శుక్రవారం ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పటివరకు అనుమానాలకే పరిమితమైన విషయాలను బాలు ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఇంట్లో అందరికీ షాక్ ఇచ్చాడు. 40 లక్షల గురించి బాలు నేరుగా మనోజ్‌ను నిలదీయడంతో అతడు తడబడిపోయాడు. "ఆ డబ్బులుఏం చేశావ్?" అని బాలు ప్రశ్నించగా మనోజ్‌కు చెమటలు పట్టాయి. అంతేకాదు, ఆ డబ్బులను నీ మాజీ ప్రియురాలు కల్పనే తిరిగి ఇచ్చిందని బాలు చెప్పడంతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. రోహిణి మాత్రం వెంటనే రంగంలోకి దిగి, "మా మీద అబద్ధాలు చెప్పకు.. నీ దగ్గర సాక్ష్యం ఏంటి?" అంటూ బాలును ఎదిరించే ప్రయత్నం చేసింది. అయితే బాలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "సాక్ష్యం మాత్రమే కాదు.. సాక్ష్యం చెప్పేవాళ్లు కూడా వస్తారు" అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. "మనోజ్ మాజీ లవర్ కల్పన వస్తుంది" అని చెప్పగానే అందరూ షాక్‌కు గురయ్యారు. కల్పన కెనడాకు పారిపోయిందని మనోజ్ చెప్పినా, బాలు మాత్రం ఆమె ఇండియాకు వచ్చిందని, నిజాలు బయటపెట్టడానికి ఇక్కడికే వస్తుందని చెప్పడంతో టెన్షన్ మరింత పెరిగింది. అదే సమయంలో బాలు "కల్పన.. కల్పన" అని పిలవగా, ఆమె ఇంట్లోకి అడుగుపెట్టడం సీన్‌ను మరింత ఎమోషనల్‌గా మార్చింది.
కల్పనను చూసిన వెంటనే మనోజ్, రోహిణిల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపించింది. తమ అసలు నిజాలు బయటపడతాయేమోనని ఇద్దరూ ఆందోళన చెందారు. ఇంట్లోకి వచ్చిన కల్పన ముందుగా సత్యం, ప్రభావతి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరింది. "మీ డబ్బులు తీసుకెళ్లినందుకు నన్ను క్షమించండి" అంటూ బాధపడింది. అయితే సత్యం తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తూ, "అది నా జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు.. ఒక్కసారి సారీ చెప్పేసి తప్పు పోతుందా?" అంటూ మండిపడ్డాడు. ప్రభావతి కూడా కల్పనపై విరుచుకుపడింది. "నా కొడుకుని మోసం చేసి 40 లక్షలు తీసుకెళ్లావ్.. నీకు సిగ్గులేదా?" అంటూ తిడుతూ అవమానించింది. కానీ అక్కడే కథలో అసలు ట్విస్ట్ బయటపడింది. కల్పన ప్రశాంతంగా మాట్లాడుతూ, "దీనికంతటికీ కారణం మీ కొడుకే. తల్లిదండ్రులను మోసం చేసి తన ప్రియురాలికి డబ్బులు ఇచ్చిన మనోజ్ తప్పు చేయలేదా?" అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో ఇంట్లో వాళ్లు ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు.
అంతటితో ఆగకుండా కల్పన మరో బాంబ్ పేల్చింది. "నేను తీసుకెళ్లిన డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశాను. 40 లక్షలు కాదు.. 45 లక్షలు ఇచ్చాను" అంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది. అది విన్న ఇంట్లో వాళ్లందరూ షాక్ అయ్యారు. "ఎవరికి ఇచ్చావ్?" అని ప్రభావతి అడగగా, "నీ కొడుకు మనోజ్, నీ కోడలు రోహిణికే ఇచ్చాను. పైగా రోహిణి వడ్డీ పేరుతో మరో 5 లక్షలు అదనంగా తీసుకుంది" అని చెప్పడంతో రోహిణి కంగుతిన్నది. తన నిజం బయటపడుతుందని గ్రహించిన రోహిణి, ఇదంతా బాలు ఆడుతున్న నాటకమని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కల్పన దగ్గర పక్కా సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో జరిగిన సెటిల్మెంట్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చూపిస్తూ, "45 లక్షలు ఇచ్చినట్లు ఇందులో రికార్డు ఉంది. బాలు తెలియకుండా సంతకం కూడా చేశాడు" అని చెప్పింది. రవి ఆ డాక్యుమెంట్స్ చూసి అవి నిజమేనని చెప్పడంతో మనోజ్, రోహిణిలకు షాక్ మీద షాక్ తగిలింది.
ఇక మనోజ్ మాత్రం చివరి వరకు అబద్ధాలతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. "ఇవి ఫేక్ డాక్యుమెంట్స్.. నన్ను ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నారు" అంటూ మాటలు మార్చాడు. దీంతో కల్పన కూడా గట్టిగానే స్పందిస్తూ, "పోలీసులను పిలవమంటావా? నీ అసలు బాగోతం మొత్తం బయటపెడతా" అంటూ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో బాలు, "బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకురాలేదా?" అని అడగగా, కల్పన వెంటనే మనోజ్‌కు 45 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్ చూపించింది. ఆ సాక్ష్యాలన్నీ చూసిన ప్రభావతి కోపంతో ఊగిపోయింది. తన కొడుకు, కోడలు ఇంత పెద్ద మోసం చేశారనే విషయం ఆమెకు జీర్ణం కాలేదు. ఇదే సమయంలో కల్పన మరో సంచలన విషయం బయటపెట్టింది. "రోహిణి చాలా పెద్ద కిలాడీ. నేను పొరపాటున ఆమె పార్లర్‌కు వెళ్తే నన్ను బంధించి పోలీసులకు అప్పగించింది. ఈ నిజాలన్నింటినీ దాచిపెట్టింది కూడా ఆమెనే" అంటూ రోహిణిపై షాకింగ్ ఆరోపణలు చేసింది. చివరగా కల్పన ఎమోషనల్‌గా మాట్లాడుతూ, "మనోజ్‌కు చదువు ఉంది కానీ కుటుంబంపై ప్రేమ లేదు. కానీ బాలు మాత్రం నిజాయితీగల మనిషి. అతడు చేసిన మేలును మర్చిపోలేకనే ఇక్కడికి వచ్చి నిజాలు బయటపెట్టాను" అంటూ చెప్పింది. తన తప్పుకు క్షమాపణలు కోరుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కల్పన ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గలేదు. ఇంతకాలం సైలెంట్‌గా కనిపించిన రవి కూడా చివరకు తన కోపాన్ని బయటపెట్టాడు. మనోజ్ చేసిన మోసం ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ముఖ్యంగా 45 లక్షల విషయం బయటకు రావడంతో ఇంట్లో ప్రతి ఒక్కరి మనసులో మనోజ్, రోహిణిలపై అసహ్యం పెరిగిపోయింది. ఇప్పటివరకు నిజాన్ని దాచిపెట్టి అందరినీ మోసం చేసిన ఈ జంటపై ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులు విరుచుకుపడ్డారు. మొదటగా రవి మనోజ్‌ను నిలదీస్తూ, "45 లక్షలు ఏం చేశావురా? ఎందుకు అమ్మా నాన్నలను, అన్నదమ్ములను మోసం చేశావ్?" అంటూ తీవ్రంగా ప్రశ్నించాడు. ఎప్పుడూ నెమ్మదిగా మాట్లాడే రవి కూడా ఈసారి తన సహనాన్ని కోల్పోయాడు. తండ్రి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా మోసం చేసి తీసుకోవడం అతనికి అస్సలు నచ్చలేదు. మనోజ్‌పై రవికి ఉన్న నమ్మకం పూర్తిగా పోయినట్టు అతని మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇక శృతి కూడా తన స్టైల్లో రోహిణిపై మండిపడింది. "ఆలుమగల్లో ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు సరిదిద్దాలి. కానీ మీరు మాత్రం తోడుదొంగల్లా మారిపోయారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు ఇంకా పెద్ద తప్పు చేశారు. నిజం బయటపడితే కుటుంబం ఎంతగా బాధపడుతుందో ఒక్కరోజైనా ఆలోచించలేదా?" అంటూ రోహిణిని నిలదీసింది. శృతి మాటలు విన్న తర్వాత రోహిణి ఒక్కసారిగా మౌనంగా మారిపోయింది. ఇప్పటివరకు ధైర్యంగా మాట్లాడిన ఆమెకు ఇప్పుడు సమాధానం చెప్పడానికి మాటలు కూడా రాలేదు.
అయితే అసలు షాక్ మాత్రం మీనా ఇచ్చింది. ఇంతకాలం తనను చిన్నచూపు చూసిన ప్రభావతిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. "అత్తగారు.. మరి ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో అడగరా? అప్పట్లో రోహిణి వాళ్ల నాన్న షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడని నన్ను ఎంత హేళన చేశారో గుర్తుందా? ఇప్పుడు ఆ డబ్బుల అసలు కథ బయటపడింది కదా" అంటూ ప్రభావతిని నేరుగా ప్రశ్నించింది. మీనా మాటలు వినగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇప్పటివరకు నిజమని నమ్మిన ప్రతిదీ అబద్ధమని తెలిసి ఆమెకు కోపం మరింత పెరిగింది. ఈ సమయంలో సత్యం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మనోజ్‌ను దగ్గరకు పిలిచి, "ఏరా... కన్న తండ్రిని మోసం చేయాలనిపించిందా నీకు? తోడబుట్టిన వారినీ మోసం చేశావు. చేసిన తప్పు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు అంటే నువ్వు నిజంగా నా కొడుకనే చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తోంది" అంటూ ఎమోషనల్ అయ్యాడు. సత్యం కళ్లలో కనిపించిన బాధ చూసి ఇంట్లో అందరూ కంగుతిన్నారు. "నువ్వు ఉన్నా ఒకటే.. లేకపోయినా ఒకటే" అంటూ అతడు చెప్పిన మాటలు మనోజ్‌ను కుదిపేశాయి.
ఆ తర్వాత సత్యం రోహిణివైపు తిరిగి ఎంతో బాధతో మాట్లాడాడు. "నిన్ను కన్న కూతురికంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ నువ్వు కూడా నా గురించి ఆలోచించలేదా? అది నా కష్టార్జితం. వాడు తప్పు చేస్తే నువ్వు ఎందుకు సహకరించావ్?" అంటూ దీనంగా ప్రశ్నించాడు. సత్యం మాటలు విన్న రోహిణి తలదించుకుంది. "ఇంతకీ ఆ డబ్బుతో ఏం చేశారు? ఫర్నిచర్ షాప్ కూడా ఆ డబ్బుతోనే పెట్టారా?" అని ప్రశ్నించగా, రోహిణి చివరకు నిజం ఒప్పుకుంది. "అవును" అని సమాధానం చెప్పడంతో ఇంట్లో మరోసారి బాంబ్ పేలినట్టైంది. రోహిణి నోట నిజం వినగానే ప్రభావతి ఉగ్రరూపం దాల్చింది. వెంటనే మనోజ్ కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీసింది. "నేను నలుగురిని కన్నా.. నిన్నే ఎక్కువ ప్రేమగా చూసాను. అలాంటి నన్నే ఎలా మోసం చేయాలనిపించింది? ఆ డబ్బులు తీసుకున్నప్పుడు నీ తండ్రి గుర్తు రాలేదా? నీ అన్నదమ్ములు గుర్తుకు రాలేదా?" అంటూ మనోజ్‌ను కొట్టింది.
ప్రభావతి ఆవేదన చూసి ఇంట్లో అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక తప్పించుకునే దారి లేకపోవడంతో మనోజ్ అసలు నిజాన్ని బయటపెట్టాడు. "ఇదంతా రోహిణి ప్లాన్. డబ్బుల విషయం ఇంట్లో చెబితే తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, తన తండ్రి పంపించిన డబ్బుల్లా చెప్పమని ఆమెనే చెప్పింది. ఫర్నిచర్ షాప్ పెట్టాలనే ఐడియా కూడా రోహిణిదే" అంటూ షాకింగ్ నిజం బయటపెట్టాడు. మనోజ్ మాటలు విన్న వెంటనే అందరి చూపులు రోహిణిపై పడ్డాయి. ఇంతకాలం అమాయకంగా నటించిన రోహిణి అసలు మాస్టర్‌మైండ్ అని తెలిసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా రోహిణి చెప్పిన అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ప్రభావతి పూర్తిగా షాక్‌కు గురైంది. ఇంతకాలం తనపై ప్రేమగా, గౌరవంగా నటించిన కోడలు ఇలా మోసం చేసిందనే నిజం ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఆవేదన, కోపం, బాధ అన్నీ కలిసిపోయి ప్రభావతి తన ఉగ్రరూపాన్ని చూపించింది. రోహిణి గతంలో చెప్పిన మాటలు ప్రభావతికి ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. "మా నాన్న మనోజ్ కోసం, నా కోసం 25 లక్షలు పంపించాడు. ఆ డబ్బులతోనే ఫర్నిచర్ షాప్ పెడుతున్నాం" అంటూ ఎంతో నమ్మకంగా చెప్పిన సందర్భం ఆమె కళ్లముందు మెదిలింది. అప్పట్లో ఆ మాటలు విని కోడలిపై గర్వపడిన ప్రభావతి, ఇప్పుడు అదే అబద్ధమని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. తాను ఎంత నమ్మకంగా చూసుకున్నా, చివరకు తననే మోసం చేసిందనే విషయం ఆమెకు భరించలేనిదిగా మారింది.
దీంతో ప్రభావతి ఒక్కసారిగా రోహిణిపై విరుచుకుపడింది. "45 లక్షలు తీసుకుని 25 లక్షలు అని ఎందుకు చెప్పావు? ఆ డబ్బు ఎవరిది అనుకున్నావు? నా భర్త జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును వాడుకోవడానికి నీకు సిగ్గులేదా? నువ్వు అసలు ఆడదానివేనా?" అంటూ కోపంతో రోహిణిని నిలదీసింది. అంతేకాదు, "నీ తండ్రి ఇచ్చిన డబ్బుల్లా ఎందుకు అబద్ధం చెప్పావు? అందరికంటే ఎక్కువగా నిన్ను ఆప్యాయంగా చూసుకున్న నన్నే మోసం చేస్తావా?" అంటూ చెంపలు వాయించింది. ప్రభావతి ఆవేశం చూసి ఇంట్లో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇక రోహిణి మాత్రం చివరి వరకు తప్పించుకునే ప్రయత్నం చేసింది. "షాప్ పెట్టాక అసలు నిజం చెబుదామని అనుకున్నాను. అప్పటివరకు మా నాన్న ఇస్తాడని భావించాను" అంటూ కొత్త కథ అల్లే ప్రయత్నం చేసింది. కానీ ప్రభావతి మాత్రం ఏమాత్రం నమ్మలేదు. "ఇక చాలు నీ అబద్ధాలు. ఇప్పటికీ నన్ను మోసం చేస్తూనే ఉన్నావు. నీ తప్పును నేను అసలు సమర్థించలేను. ఇక్కడిక్కడే గొంతు పిసికి చంపేయాలని అనిపిస్తోంది" అంటూ కోపంతో ఊగిపోయింది. ఆమె మాటల్లో కనిపించిన ఆవేదన ఇంట్లో ప్రతి ఒక్కరినీ కదిలించింది.
అయితే అక్కడితో ఆగకుండా రోహిణి మరోసారి పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. "నేను ఆ షాప్ పెట్టించకపోతే నీ కొడుకు గుడి ముందు అడుక్కునే వాడు. ఆ డబ్బులు కూడా నా వల్లే వచ్చాయి. నీ కొడుకు వల్ల ఏ పని కాదు" అంటూ మనోజ్‌ను తక్కువ చేసి మాట్లాడింది. ఈ మాటలు విన్న ప్రభావతికి కోపం మరింత పెరిగిపోయింది. "నా భర్త డబ్బులను నీ తండ్రి కష్టార్జితంగా చెబుతావా? నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా? నిన్ను చంపినా తప్పులేదు" అంటూ రోహిణి గొంతు పట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభావతి ఒక్కసారిగా విశ్వరూపం చూపించడంతో ఇంట్లో భయానక వాతావరణం నెలకొంది. ఆమెను ఆపడానికి ఇంట్లో వాళ్లు ప్రయత్నించినా, ఆమె మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోహిణిపై ఉన్న కోపంతో వణికిపోయింది. ఇంతకాలం ప్రేమగా చూసుకున్న కోడలు ఇలా కుటుంబాన్ని మోసం చేయడాన్ని ప్రభావతి జీర్ణించుకోలేకపోయింది. ఆమె కళ్లలో కనిపించిన బాధ, కోపం ప్రేక్షకులను కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది.
ఈ సమయంలో సత్యం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. "ఇక చాలు ఆపు. అమ్మా రోహిణి.. నువ్వు గదిలోకి వెళ్ళు" అంటూ రోహిణిని అక్కడి నుంచి పంపించాడు. కానీ ఇంట్లో ఉద్రిక్తత మాత్రం తగ్గలేదు. అదే సమయంలో మీనా మరోసారి ప్రశ్నిస్తూ, "చేసిన తప్పులో నీ కొడుకు మనోజ్ తప్పు కూడా ఉంది కదా. మరి అతడిని ఎందుకు నిలదీయరు?" అంటూ ప్రభావతిని నిలదీసింది. దీంతో మనోజ్ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రభావతి వెంటనే మనోజ్ కాలర్ పట్టుకుని వెనక్కి లాగింది. "ఇంకోసారి చేతకాని వాడిలా నీ పెళ్లాం మాటలు వింటే నిన్ను కూడా చంపేస్తా. నీ తల్లి గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు కావచ్చు" అంటూ భారీ వార్నింగ్ ఇచ్చింది. ప్రభావతి ఆగ్రహం చూసి మనోజ్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు. ఇప్పటివరకు ఇంట్లో అందరిని తన మాటలతో మోసం చేసిన ఈ జంటకు, ఇప్పుడు కుటుంబ సభ్యుల కోపం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమైంది.
ఇలా కోడలిపై ఉన్న ప్రేమ ఒక్కసారిగా ద్వేషంగా మారడం, తన భర్త కష్టార్జితం దోచుకున్నారని తెలుసుకుని ప్రభావతి చూపించిన ఆవేశం ప్రేక్షకులను కదిలించింది. ముఖ్యంగా రోహిణికి ఎదురుదెబ్బ తగిలిన తీరు, మనోజ్‌కు ప్రభావతి ఇచ్చిన వార్నింగ్, సత్యం ఆవేదన - ఇవన్నీ కలిసి ఎపిసోడ్‌ను అత్యంత భావోద్వేగభరితంగా మార్చాయి. ఇంతసేపు ఇంట్లో జరిగిన భారీ రచ్చ, నిజాల బట్టబయలు, ప్రభావతి ఆగ్రహం తర్వాత ఒక్కసారిగా ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత ఎలా ప్రశాంతత వస్తుందో.. అలాగే ఇంట్లో కూడా అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక మాత్రం తీవ్ర ఉద్రిక్తత దాగి ఉన్నట్లు కనిపించింది.
ఈ సమయంలో బాలు తన స్టైల్లో సెటైర్లు వేస్తూ పరిస్థితిని కాస్త లైట్ చేయడానికి ప్రయత్నించాడు. "ఇది నిజంగా ఒక చారిత్రక ఘట్టం" అంటూ నవ్వుతూ చెప్పాడు. వెంటనే శృతి కూడా స్పందిస్తూ, "అవును.. ఇలా ఒక కుటుంబం మొత్తం ఒకేసారి కొట్టుకొని నిజాలు బయటపెట్టుకోవడం ఏ సీరియల్‌లో కూడా చూసి ఉండం" అంటూ కామెంట్ చేసింది. దీంతో అక్కడి వాతావరణం కొద్దిసేపు సరదాగా మారింది. అయితే బాలు మాత్రం తన కామెడీ ఆపలేదు. "ఇదంతా నిజంగానే జరిగిందా? లేక నేను కల చూస్తున్నానా?" అంటూ సెటైర్లు వేశాడు. అదే సమయంలో మీనా బాలును గిల్లడంతో, "ఓకే ఓకే.. ఇది నిజమే" అంటూ నవ్వించాడు. ఈ చిన్న చిన్న సంభాషణలు ఎపిసోడ్‌లో కొద్దిసేపు రిలీఫ్ ఇచ్చినా, ఇంట్లో జరిగిన ఘర్షణల ప్రభావం మాత్రం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించింది.
ఈ సమయంలో శ్రుతి బాలును మెచ్చుకుంది. "నువ్వు చేసిన పని నిజంగా ఇంప్రెస్సివ్. ఇంటినే కోర్ట్‌రూమ్‌లా మార్చి, అందరి ముందూ మనోజ్‌ను నిలబెట్టి నిజాలు బయటపెట్టావు. అది చాలా బాగా అనిపించింది" అంటూ ప్రశంసించింది. బాలు ప్లాన్ వల్లే ఇంట్లో ఇంతకాలం దాచిన నిజాలు బయటకు వచ్చాయని కుటుంబ సభ్యులందరికీ అర్థమైంది. అయితే శృతి మాత్రం మరో కోణంలో ప్రశ్నించింది. "ప్రతి తప్పు చేసిన వాళ్లు చివరికి నీకే ఎందుకు దొరికిపోతారు?" అంటూ బాలును వింతగా అడిగింది. దీంతో బాలు కూడా నవ్వుతూ స్పందించాడు. కానీ మీనా మాత్రం సీరియస్‌గా మాట్లాడుతూ, "నిజానికి మొదటి నుంచే బాలుకు రోహిణిపై అనుమానం ఉంది. ఆమె ఎప్పుడూ తప్పు చేసి దొరకకుండా తప్పించుకోవాలని చూస్తూ ఉండేది" అని చెప్పింది. అయితే అదే సమయంలో మనోజ్ గురించి అంతగా తక్కువగా మాట్లాడటం సరికాదని కూడా మీనా అభిప్రాయపడింది.
ఇక శృతి మాత్రం మనోజ్‌ను వదిలిపెట్టలేదు. "మనోజ్ కూడా ఏం తక్కువ తినలేదు. ఇంట్లో వాళ్లందరినీ మోసం చేశాడు కదా" అంటూ అతడి గాలి తీసేసింది. అయితే ఈ మాటలన్నీ మనోజ్ దొంగచాటుగా వింటూ ఉండటం కథలో మరో ఆసక్తికర మలుపుగా మారింది. కుటుంబ సభ్యులు తన గురించి మాట్లాడుతున్న ప్రతి మాట అతని మనసును గాయపరిచింది. తాను చేసిన తప్పు ఎంత పెద్దదో ఇప్పుడు ఒక్కొక్కరిగా అతడికి అర్థమవుతున్నట్టు కనిపించింది. ఇక వెంటనే మనోజ్ తన గదిలోకి వెళ్లి రోహిణితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ప్రభావతి కొట్టిన అవమానం, ఇంట్లో జరిగిన సంఘటనలతో రోహిణి తీవ్ర కోపంలో ఉంది. మనోజ్ దగ్గరకు వెళ్లి ఆమెను టచ్ చేయగానే, వెంటనే కోపంగా చేయి తొలగించింది. "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కనీసం నీ అమ్మ నన్ను కొట్టినప్పుడు నువ్వు నాకు సపోర్ట్‌గా కూడా నిలబడలేదు. ఒక్క మాటైనా మాట్లాడలేదుగా" అంటూ మనోజ్‌పై మండిపడింది.
దీంతో మనోజ్ కూడా తన వైపు నుంచి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. "నువ్వు చేసింది తప్పు కాబట్టే నేను ఏం మాట్లాడలేకపోయా" అంటూ అనుకోకుండా నిజం బయటపెట్టేశాడు. అయితే ఈ మాటలు విన్న రోహిణి మరింత ఆగ్రహంతో రగిలిపోయింది. "అంటే తప్పు నాదేనా? నువ్వు ఏం చేయలేదా? నేను చేసిన ప్రతిదీ ఎవరికోసం? నీకోసం కాదా?" అంటూ కన్నీళ్లతో ప్రశ్నించింది. రోహిణి అక్కడితో ఆగకుండా, "నిజంగా మీ అమ్మ కొడుకులు మామూలు వాళ్లు కాదు. ఆ క్షణంలో నువ్వు నాకు సపోర్ట్‌గా లేకపోవడంతో నా గుండె పగిలిపోయింది. ఇకపై నాతో మాట్లాడకు" అంటూ మనోజ్‌ను దూరం చేసేందుకు ప్రయత్నించింది. ఈ మాటలు విన్న మనోజ్ కూడా బాధతో స్పందించాడు. "నువ్వు కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడావు. అందరి ముందు నన్ను చేతకాని వాడిలా చూపించావు" అంటూ తన బాధను బయటపెట్టాడు.
ఇలా భార్యాభర్తల మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. ఇంతకాలం కలిసి అందరినీ మోసం చేసిన మనోజ్, రోహిణిల మధ్య ఇప్పుడు విభేదాలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సన్నివేశాలతో నేటి ఎపిసోడ్ ముగియగా, రాబోయే రోజుల్లో ఈ దంపతుల మధ్య దూరం ఇంకా పెరుగుతుందా? కుటుంబం వారిని క్షమిస్తుందా? లేక కొత్త ట్విస్టులు కథను మరింత మలుపు తిప్పుతాయా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగిపోయింది.


Click it and Unblock the Notifications











