Gundeninda Gudigantalu May 13th Episode: మీనాపై నిందా, సీక్రెట్ చెప్పిన శివ, రోహిణి-గుణాలపై బాలు నిఘా
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. ప్రారంభంలోనే ప్రభావతి గట్టిగా రోహిణిని పిలవడం ఇంట్లో కొత్త తుఫాన్‌కు నాంది పలికింది. మనోజ్ తడబడుతూ మాట్లాడడంతో ప్రభావతి మరింత కోపంగా స్పందించి రోహిణిని ఎదిరించింది. శృతి తల్లి వద్ద అమర్యాదగా మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ రోహిణిని గట్టిగా మందలించింది. రోహిణి తన వాదన వినిపించినా ప్రభావతి వినకపోవడంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ఇదిలా ఉండగా, శృతి-మీనా మధ్య జరిగిన సంభాషణలో రోహిణి ఎంట్రీ ఇచ్చి గొడవను మరింత పెంచింది. శృతి తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ "నిజం చెప్పాను" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా.. మీనా కూడా రోహిణిని గట్టిగా నిలదీసింది. దీంతో రోహిణి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక మరోవైపు మనోజ్‌పై ప్రభావతి పూర్తి కంట్రోల్ చూపించింది. రోహిణి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవద్దని, ఇంటికి కూడా రాకూడదని ఆదేశించింది. తల్లి మాటకు లోబడిన మనోజ్ షాప్‌లోనే ఉండిపోవడం కథలో కీలక మలుపు. తర్వాత రోహిణితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా నిజాన్ని దాచడంతో ఆమెకు అనుమానం పెరిగింది. ఇంట్లో మీనా మానవత్వం చూపిస్తూ రోహిణికి భోజనం పెట్టగా.. ఆమె మాత్రం వ్యంగ్యంగా మాట్లాడటం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. చివరకు మీనా తన సహనాన్ని కోల్పోయి రోహిణిపై ఘాటుగా విరుచుకుపడింది. అబద్ధాలు, మోసాలు, డబ్బుల వ్యవహారం అన్నింటినీ బయటపెడుతూ ఆమెకు షాక్ ఇచ్చింది. ఈ ఘర్షణతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.

photo courtesy jiohotstar
బుధవారం ఎపిసోడ్ ప్రారంభంలో మీనా.. రోహిణి ఆకలిగా ఉందని భావించి భోజనం తీసుకెళ్లి పెడుతుంది. అయితే రోహిణి మాత్రం కృతజ్ఞత చూపకుండా వ్యంగ్యంగా స్పందిస్తుంది. "అత్తయ్య నన్ను తిడుతుంటే నీ కడుపు చల్లబడిందా?" అంటూ మాట్లాడటంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతవరకు ఓపికగా ఉన్న మీనా ఇక ఆగ్రహంతో విరుచుకుపడుతుంది. "నీలాగా ఇతరులను మోసం చేసి బతకడం నాకు రాదు.. నీతిగా, నిజాయితీగా ఉండడమే నాకు తెలుసు" అంటూ గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అంతేకాదు, "నీ మీద నాకు అసహ్యం వేస్తోంది.. నీ ఎంగిలి ప్లేట్ నేను ముట్టుకోను" అంటూ రోహిణిని తీవ్రంగా అవమానిస్తుంది. ఈ మాటలు రోహిణికి గట్టి షాక్ ఇచ్చాయి.
ఇక ఈ సన్నివేశం తర్వాత మీనాపై ప్రభావతి అనుమానం పెరుగుతుంది. వెంటనే ఆమెను పిలిచి ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తూ.. "ఇంట్లో పార్టీలు పెడుతున్నావా? రోహిణిని నీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావా?" అంటూ ఆరోపణలు చేస్తుంది. శృతి తర్వాత ఇప్పుడు పెద్ద కోడలు మీనాను కూడా తనకు వ్యతిరేకంగా మారుస్తోందని భావించి ప్రభావతి ఆగ్రహంగా మాట్లాడుతుంది. కానీ మీనా మాత్రం వెనక్కి తగ్గదు. "నాకు బంధాలను కలపడం మాత్రమే తెలుసు.. పుల్లలు పెట్టడం కాదు" అంటూ దిమ్మతిరిగే పంచ్ ఇస్తుంది. "ఇంట్లో ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే భోజనం పెట్టాను" అని స్పష్టం చేస్తుంది. మీనా ధైర్యంగా మాట్లాడటంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.
మరోవైపు బాలు ఇంటికి చేరుకుని తన అవమానాన్ని బయటపెడతాడు. అన్న మనోజ్‌కు ప్రేమతో బిర్యానీ తీసుకెళ్లగా.. "షాపు లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నావా?" అంటూ అనుమానించడం తనను బాధపెట్టిందని చెబుతాడు. దీనికి మీనా కూడా తన అనుభవాన్ని పంచుకుంటూ.. "మనమే తప్పు చేశాం.. వాళ్ల జోలికి వెళ్లకూడదు" అంటూ బాధ వ్యక్తం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు - ఇకపై ఇంట్లో ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా, తమ పని తాము చూసుకోవాలని నిర్ణయించుకుంటారు.
ఇక మరుసటి రోజు మీనా తన తల్లి పూల షాపుకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అక్కడ తన తల్లి, సుమతికి ఇంట్లో జరిగిన అన్ని విషయాలు చెప్పింది. ముఖ్యంగా రోహిణి-మనోజ్ కలిసి చేసిన మోసం బయటపడిన విషయాన్ని చెప్పడంతో సుమతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. "ఆ రోజు నన్ను ఎంత మాట అనిందో... దాని అంతు చూడాలి" అంటూ రోహిణిపై మండిపడింది. వెంటనే ఫోన్ చేసి తిడతానని కూడా చెప్పింది. అయితే మీనా మాత్రం పరిస్థితిని మరింత విషమం చేయకూడదని భావించి సుమతిని శాంతింపజేసింది.
ఇదే సమయంలో కథలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. శివ అనూహ్యంగా ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. "రోహిణి మీద నాకు మొదటి నుంచే అనుమానం. ఆమె తరచూ గుణ దగ్గరకు వెళ్లి లక్షల్లో డబ్బులు తీసుకెళ్తుండేది" అంటూ చెప్పడంతో మీనా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అంతేకాదు, "చాలాసార్లు వాళ్ల మధ్య ట్రాన్సాక్షన్ జరిగిందని నేను గమనించాను. ఒక్కసారి కాదు... పలుమార్లు భారీ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లింది" అంటూ శివ చెప్పిన మాటలు పరిస్థితిని మరింత సీరియస్ చేశాయి. దీంతో మీనా మనసులో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. "అసలు రోహిణి ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?" అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఇక మరోవైపు ఇంట్లో పరిస్థితి ఇంకా టెన్షన్‌గా మారింది. మనోజ్ ఇంటికి వచ్చి తన గది తలుపు తట్టినా.. రోహిణి గాఢనిద్రలో ఉండడంతో స్పందించదు. దీంతో ప్రభావతి వచ్చి వరుసగా తలుపు కొడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ విషయం గమనించిన మీనా అడిగితే.. "నీకు అవసరమా?" అంటూ ప్రభావతి కసురుకుంటుంది. చివరకు రోహిణి తలుపు తీయగానే ప్రభావతి మండిపడుతుంది. "ఇంతవరకు నిద్రపోతావా? మనోజ్ వచ్చి ఎంతసేపయ్యిందో తెలుసా?" అంటూ ప్రశ్నిస్తుంది. రోహిణి "నైట్ లేట్‌గా పడుకున్నాను" అని చెప్పినా ప్రభావతి వినదు. వెంటనే మనోజ్‌ను రోహిణితో మాట్లాడొద్దని హెచ్చరిస్తూ తన ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఇక్కడితో ఆగకుండా ప్రభావతి మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. "ఇక నుంచి ఈ ఇంట్లో తలుపులు మూసి పెట్టకూడదు. నాకు తెలియకుండా ఏం జరగకూడదు" అంటూ ఆదేశించింది. అంతేకాదు, "నా కొడుకును నీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి" అంటూ రోహిణిని గట్టిగా హెచ్చరించింది.
ఇంట్లో జరుగుతున్న పరిణామాలు రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా కూర్చున్న మీనా తీవ్ర ఆలోచనల్లో మునిగిపోతుంది. బాలు పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో అతను ఆశ్చర్యపోతాడు. "ఏమైంది?" అని ప్రశ్నించగా.. మీనా ఒక షాకింగ్ విషయం బయటపెడుతుంది. "రోహిణి మనకు తెలియకుండా ఏదో పెద్ద పని చేస్తోంది.. గుణ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటోంది" అని చెబుతుంది. ఇది విన్న బాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. "ఈ విషయం నిజమా? నీకు ఎలా తెలిసింది?" అని ప్రశ్నించగా.. శివ చెప్పిన విషయాలను మీనా వివరిస్తుంది. గుణ ఆఫీసులో రోహిణిని పలుమార్లు చూసినట్లు, భారీ మొత్తంలో డబ్బుల లావాదేవీలు జరిగినట్లు శివ చెప్పాడని తెలిపింది. దీంతో బాలు మనసులో అనుమానాలు మరింత పెరుగుతాయి. "మనోజ్‌కు ఇప్పటికే ఆదాయం ఉంది. అయితే ఈ డబ్బులు ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నాయి?" అంటూ ఆలోచనలో పడతాడు. "ఇది చిన్న విషయం కాదు.. అసలు నిజం బయటకు తేవాలి" అంటూ నిర్ణయానికి వస్తాడు.
రోహిణి ప్రయత్నం.. సత్యం ఆగ్రహం
ఇక మరోవైపు రోహిణి పరిస్థితిని మార్చుకునేందుకు తన మామ సత్యం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. "మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అని మొదలు పెట్టగా.. సత్యం ప్రశాంతంగా "చెప్పమ్మా" అంటాడు. రోహిణి తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నంలో "మనోజ్ జీవితాన్ని సెట్ చేయాలని.. అతడు ఎదగాలని అనుకున్నాను. అందుకే చెప్పకుండా చేశాను" అంటూ వివరణ ఇస్తుంది. అయితే సత్యం మాత్రం ఆమె మాటలను అంగీకరించడు. "ఇది ఉమ్మడి కుటుంబం.. ఏ నిర్ణయం తీసుకునే ముందు అందరితో మాట్లాడాల్సిందే. నమ్మకాన్ని ద్రోహం చేయడం సరైంది కాదు" అంటూ గట్టిగా నిలదీస్తాడు. దీనికి రోహిణి మరో కథ చెబుతుంది. "డబ్బుల విషయం తెలిస్తే అందరూ వాటాలు అడుగుతారు.. అప్పుడు మనోజ్ షాప్ పెట్టుకోలేడు. అందుకే ఇలా చేశాను.. తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వాలని అనుకున్నాం" అని చెప్పుతుంది.
కానీ సత్యం మాత్రం కఠినంగా స్పందిస్తాడు. "నువ్వు ఎంత చెప్పినా మోసం మోసమే. మా నమ్మకాన్ని ద్రోహం చేశావు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రోహిణి మాత్రం వెనక్కి తగ్గకుండా "నేను మనోజ్ కోసం మాత్రమే చేశాను" అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా సత్యం తన నిర్ణయాన్ని మార్చుకోడు. "ఈ తప్పు క్షమించలేను" అని స్పష్టం చేస్తాడు. ఈ మాటలు విన్న రోహిణి తీవ్రంగా ఎమోషనల్ అవుతుంది. కానీ సత్యం మాత్రం తన పనికి వెళ్లాల్సి ఉందని చెప్పి గదిని వదిలి వెళ్లిపోతాడు. ఇలా ఒకవైపు రోహిణిపై అనుమానాలు పెరుగుతుండగా.. మరోవైపు ఆమె చేసిన పనిని ఎవరూ సమర్థించకపోవడంతో ఆమె ఒంటరిగా మారుతోంది.
మరోవైపు.. బాలు, మీనా వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి "ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అంటూ బాలుని ప్రశ్నిస్తుంది. దీనికి బాలు తన స్టైల్లో ఇన్‌డైరెక్ట్ పంచ్ వేస్తూ "నా పెళ్లాన్ని బాధ పెట్టేవాళ్ల మెడలు విరవాలని చూస్తున్నా" అని అంటాడు. దీంతో ప్రభావతి "నన్నా?" అని కౌంటర్ వేయగా.. బాలు వెంటనే "దోమ సిస్టర్, ఈగ బ్రదర్" అంటూ మాట మార్చి పరిస్థితిని హాస్యంగా మార్చేస్తాడు. మీనా సిద్ధం చేసిన టిఫిన్‌ను ప్రభావతికి ఇస్తుంది. ఈ సమయంలో బాలు మళ్లీ కామెడీ మోడ్‌లోకి వెళ్లి "అమ్మా.. ఈ వయసులో ఉద్యోగం చేస్తున్నావంటే చాలా గర్వంగా ఉంది" అంటూ సెటైర్లు వేస్తాడు. రోడ్లు ఊడ్చే పని, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే ఉద్యోగం అంటూ సరదాగా మాట్లాడటం ఇంట్లో నవ్వులు పూయిస్తుంది.
అయితే ప్రభావతి "ఇది నాకు కాదు.. మీ నాన్నకు" అని చెప్పడంతో సీన్ మలుపు తిరుగుతుంది. వెంటనే బాలు టిఫిన్ తీసుకుని సత్యం దగ్గరకు వెళ్లి "ఇది మీకు అవసరమా? ఈ వయసులో పని చేయాల్సిన పరిస్థితి ఎందుకు?" అంటూ ప్రశ్నిస్తాడు. బాలు ప్రశ్నకు సత్యం గంభీరంగా స్పందిస్తాడు. "ఇంట్లో జరిగిన తప్పులను సరిచేయాలంటే నేను పని చేయాల్సిందే" అంటూ తన బాధ్యతను వెల్లడిస్తాడు. "ముగ్గురు కొడుకులు ఉన్నా.. నేను పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది" అన్న మాటతో ఇంట్లో పరిస్థితి ఎంత దిగజారిందో చూపిస్తారు. తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ తింటూ ఉంటారు. ఈ సమయంలో మనోజ్ రావడంతో బాలు సరదాగా పేరడీ సాంగ్ పాడుతూ సీన్‌ను లైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. రోహిణి కూడా అక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంటే.. ప్రభావతి ఒక్కసారి గట్టిగా చూసిన వెంటనే ఆమె అడుగులు ఆగిపోతాయి. ఆ చూపులోనే ఎన్నో హెచ్చరికలు, అనుమానాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశంతో ఎపిసోడ్ ఒక్కసారిగా సీరియస్ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. రోహిణి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటుందా? ప్రభావతి ఆమెపై మరింతగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లేక ఇక్కడే ఏదైనా కొత్త నిజం బయటపడుతుందా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్లపై ఆసక్తిని మరింత పెంచేశారు.


Click it and Unblock the Notifications