Gundeninda Gudigantalu May 15th Episode: పెదరాయుడిగా మారిన బాలు, మనోజ్- రోహిణికి షాక్, సత్యంకు పగ్గాలు
photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్‌లో కుటుంబం, బిజినెస్ ట్రాక్‌లతో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. ఉదయం టిఫిన్ సమయంలో రోహిణి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోవడంతో ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను అవమానకరంగా వెళ్లిపోవమంది. శృతి, మనోజ్ సపోర్ట్ చేసినా ప్రభావతి వినకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మనోజ్ సైలెంట్‌గా ఉండటం రోహిణిని బాధపెట్టగా, ఆమె ఇంటిని వదిలి మీనాక్షి వద్దకు వెళ్లి తన బాధను పంచుకుంది. అక్కడ రోహిణి తన తప్పును సమర్థించుకుంటూ, ప్రభావతిని తిరిగి ఒప్పించేందుకు ప్లాన్ వేస్తుంది. మీనాక్షి మొదట హెచ్చరించినా చివరకు ఆమెకు సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది.
ఇక బాలు-మీనా బిజినెస్ ట్రాక్‌లో, మీనా తన డెకరేషన్ మోడల్స్‌తో ఆర్డర్ దక్కించుకునే దశలో చింతామణి ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని తారుమారు చేస్తుంది. తన ఏరియాలో బిజినెస్ చేయొద్దని వార్నింగ్ ఇస్తూ, గుండాలతో మీనా డిజైన్స్‌ను ధ్వంసం చేయిస్తుంది. అయినా వెనక్కి తగ్గని మీనా ధైర్యంగా నిలబడి, తన ప్రతిభతో ఎదిగి సమాధానం ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ప్రభావతి-మీనాక్షి మధ్య సంభాషణలో రోహిణి చేసిన మోసం బయటపడుతుంది. మీనాక్షి రోహిణిని క్షమించమని ఒప్పించే ప్రయత్నంలో ఆస్తి అంశాన్ని ప్రస్తావించడంతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఇదే సమయంలో సత్యం కూడా జోక్యం చేసుకుని, రోహిణి-మనోజ్ ఇద్దరికీ సమానంగా చూడాలని హెచ్చరిస్తాడు. దీంతో ప్రభావతి గందరగోళానికి గురవుతుంది. కుటుంబం మళ్లీ కలుస్తుందా లేదా అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

photo courtesy jiohotstar
శుక్రవారం ఎపిసోడ్ కుటుంబ భావోద్వేగాలు, సంబంధాల మధ్య ఉన్న అంతర్గత సంఘర్షణలతో మరింత రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా డబ్బుల విషయంలో ప్రభావతి చూపుతున్న వైఖరి ఇంట్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. మనోజ్ చేసిన తప్పుపై పెద్దగా స్పందించకుండా, రోహిణిపైనే కోపం చూపించడం సత్యాన్ని ఆగ్రహానికి గురి చేసింది. సత్యం స్పష్టంగా స్పందిస్తూ, "రోహిణి తప్పు ఎంత ఉందో, మనోజ్ తప్పు కూడా అంతే ఉంది. ప్రేమతో కొడుకుని కాపాడుతూ కోడలిని మాత్రమే శిక్షించడం కరెక్ట్ కాదు" అని చెప్పాడు. దంపతులను విడదీయడం సరైంది కాదని, వారిద్దరినీ క్షమించి మళ్లీ కలపాలని ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రభావతి మాత్రం తన కోపాన్ని తగ్గించుకోలేకపోయింది.
"రోహిణిని నేను నా కూతురిలా చూసుకున్నా. ఇంట్లో అందరికంటే ఎక్కువ ప్రేమ ఇచ్చా. కానీ ఆమె నన్ను మోసం చేసింది" అంటూ తన బాధను వ్యక్తం చేసింది. ఈ సమయంలో మీనా కూడా మధ్యలోకి వచ్చి, "ఇలా కుటుంబం మొత్తం బాధపడటం సరికాదు. మీరు పెద్దవాళ్లుగా వారిని కలపాలి" అని సలహా ఇచ్చింది. అంతేకాదు, "రోహిణి కోపంతో మలేషియాకు వెళ్లిపోతే పరిస్థితి మరింత చేదుగా మారుతుంది. సమాజంలో కూడా తప్పుగా మాట్లాడే అవకాశముంది" అంటూ ప్రభావతికి రియాలిటీ చెక్ ఇచ్చింది.
బయటకు కఠినంగా కనిపించినా, లోపల మాత్రం ప్రభావతి భయంతో, సందేహాలతో తల్లడిల్లుతోంది. తన నిర్ణయం వల్ల కుటుంబం చీలిపోతుందేమో అన్న ఆందోళన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. చివరగా భావోద్వేగానికి లోనైన ప్రభావతి, "నా ఇష్టం వచ్చిన కోడలే రోహిణి. అందరూ తమకు నచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ నేను ఎంచుకున్న కోడలు నన్నే మోసం చేసింది. ఈ విషయం మీద ఇక ఎవరూ నన్ను ప్రశ్నించకండి" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక ఇంట్లో జరిగిన అవమానాలు, అత్తమామలు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ రోహిణి దివ్య ఇంటికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. "అన్నీ సర్దుకుంటున్నాయనుకున్న సమయంలో నా కలలన్నీ కూలిపోతున్నాయి... నా భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు" అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక ఈ పరిస్థితికి కారణం బాలు అని ఆరోపిస్తూ రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "సమయం చూసి నాపై పగ తీర్చుకున్నాడు... కావాలనే కల్పనను ఇంటికి తీసుకువచ్చి నిజం బయటపెట్టించాడు" అంటూ అతనిపై మండిపడుతుంది. అయితే దివ్య మాత్రం రోహిణి మాటలను అంగీకరించకుండా కఠినంగా రియాలిటీ చెక్ ఇస్తుంది. "నువ్వే మొదటినుంచి మోసం చేస్తూ వచ్చావు... ఇప్పటివరకు అదృష్టం కలిసొచ్చింది. కానీ కల్పన అకస్మాత్తుగా రావడంతో నీ ప్లాన్ ఫెయిల్ అయింది" అంటూ ఆమె తప్పులను నేరుగా ఎత్తిచూపుతుంది.
అంతేకాదు, మనోజ్ ప్రవర్తనపై కూడా దివ్య ప్రశ్నలు లేవనెత్తుతుంది. "నీ అత్తయ్య నిన్ను కొడుతుంటే కూడా మనోజ్ అడ్డుకోలేదు... ఇదేనా ప్రేమ?" అని అడుగుతుంది. ఈ మాటలు రోహిణిని ఆలోచనలో పడేస్తాయి. తాను కష్టాల్లో ఉన్న సమయంలో మనోజ్ నుంచి సపోర్ట్ రాకపోవడం ఆమెను మరింత కుంగదీస్తుంది. ఇక్కడితో ఆగకుండా దివ్య మరో షాకింగ్ వార్నింగ్ ఇస్తుంది. "ఇప్పుడే చిన్న విషయం బయటపడితే ఇంత జరుగుతోంది... రేపు మలేషియా, చింటూ విషయం బయటపడితే పరిస్థితి ఊహించలేం" అంటూ హెచ్చరిస్తుంది. ఈ మాటలు విన్న రోహిణి పూర్తిగా కంగారు పడిపోతుంది. తన జీవితం ఎటు దారితీస్తుందో అర్థం కాక తీవ్ర ఆందోళనకు గురవుతుంది.
మరోవైపు.. బాలు ఇంటికి చేరుకున్న తర్వాత మీనాతో మాట్లాడుతాడు. "నాన్నతో రోహిణి విషయం మాట్లాడావా?" అని అడగగా, మీనా జరిగిన విషయాలన్నింటిని వివరంగా చెబుతుంది. సత్యం ఈ విషయాన్ని కూల్‌గా ప్రభావతితో మాట్లాడతానని చెప్పాడని తెలియజేస్తుంది. ఇదే సమయంలో మీనాక్షి చెప్పిన మాటలు ప్రభావతి మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ రోహిణి నిజంగానే మలేషియాకు వెళ్లిపోతే పరిస్థితి ఏంటో అన్న భయం ఆమెను వెంటాడుతుంది. ఆ ఆందోళనలోనే ప్రభావతి మనోజ్‌ను పిలిచి "రోహిణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు" అని ఆదేశిస్తుంది. ఈ మాట విన్న మనోజ్ ఆనందంతో "అమ్మ క్షమించిందా?" అని అడగగా, "క్షమించడం పక్కన పెట్టు... ముందుగా ఇంటికి రమ్మని చెప్పు" అంటూ కఠినంగా సమాధానం ఇస్తుంది. దీంతో మనోజ్ వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాడు.
అయితే రోహిణి మాత్రం కోపంతో ఫోన్ ఎత్తదు. మనోజ్ వరుసగా కాల్ చేస్తున్నా, ఆమె ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టి పట్టించుకోదు. ఈ సమయంలో దివ్య "ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు?" అని అడగగా, "నేను ఎంత బాధపడ్డానో అతనికి కూడా తెలిసి ఉండాలి... ఇప్పుడైనా నా విలువ తెలుస్తుంది" అంటూ రోహిణి తన మనసులోని బాధను బయటపెడుతుంది. ఇదిలా ఉండగా, రోహిణి ఫోన్ ఎత్తకపోవడంతో మనోజ్ ఆందోళన చెందుతాడు. ఈ విషయం గమనించిన బాలు, "ఆమె స్నేహితురాలు విద్య దగ్గర ఉండొచ్చు" అని సూచిస్తాడు. వెంటనే మనోజ్ విద్యకు ఫోన్ చేస్తాడు. అయితే రోహిణి ఆ ఫోన్ ఎత్తొద్దని చెప్పడంతో, మొదట విద్య తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మాటల్లో జారి "రోహిణి ఇక్కడ లేదు" అని చెప్పి అనుమానం రేకెత్తిస్తుంది. వెంటనే కవరింగ్ చేస్తూ విషయం సర్దుబాటు చేస్తుంది.
మనోజ్ మాత్రం అమాయకంగా "అమ్మ క్షమించింది... ఇంటికి రమ్మంటుంది" అని చెప్పడంతో, రోహిణి ఆ మాటలు విని మరింత ఆందోళన చెందుతుంది. ఫోన్ కట్ అయిన తర్వాత దివ్య కఠినంగా స్పందిస్తూ "నీ మనోజ్ స్వతంత్రంగా ఆలోచించడు... అమ్మ చెప్పిందే వేదం. అతను హీరో కాదు, జీరో" అంటూ హెచ్చరిస్తుంది. భవిష్యత్తులో కూడా అతనిపై ఆధారపడితే సమస్యలు వస్తాయని చెప్పి జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. చివరగా పరిస్థితిని అర్థం చేసుకున్న రోహిణి, ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అయితే దివ్య సూచించినట్లుగా జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తూ బయలుదేరుతుంది.
ఇక హాల్లో కుటుంబ సభ్యులంతా రోహిణి విషయం మీద చర్చించుకుంటున్న సమయంలో, ఒక్కసారిగా రోహిణి ఇంటి గడప వద్ద ప్రత్యక్షమవుతుంది. "అత్తయ్య..." అంటూ పిలుస్తూ లోపలికి రావడానికి ప్రయత్నించగా, ప్రభావతి కోపంతో "ఎవరు నువ్వు?" అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి రోహిణి "నేను రోహిణి... మనోజ్ భార్య... మీ పెద్ద కోడలు" అని చెప్పినా, ప్రభావతి వెంటనే లోపలికి అనుమతించదు. "ఇది రైల్వే స్టేషన్ కాదు... ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేందుకు" అంటూ కఠినంగా మాట్లాడుతుంది. ఈ సమయంలో రోహిణి ఒక్కసారిగా ప్రభావతి కాళ్లపై పడిపడి క్షమాపణ కోరుతుంది. ఆ క్షణంలో మీనాక్షి, సత్యం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన ప్రభావతి చివరకు మనసు మార్చుకుని రోహిణిని క్షమిస్తుంది. అయితే "ఇది డబ్బుల విషయం కాదు... ఇంటి గౌరవం విషయం. ఇకపై ఏది చేసినా ముందుగా చెప్పాలి" అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. దీనికి మనోజ్, రోహిణి ఇద్దరూ అంగీకరిస్తారు.
ఇక్కడితో సమస్య ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో, బాలు ముందుకు వచ్చి "ఇంకా అసలు విషయం మిగిలే ఉంది" అంటూ ట్విస్ట్ ఇస్తాడు. వెంటనే ప్రభావతి "మీకు డబ్బుల వాటా కావాలా?" అని ప్రశ్నించగా, బాలు స్పష్టంగా "మాకు ఆ డబ్బులపై ఆశ లేదు" అని చెబుతాడు. రవి కూడా అదే మాట చెప్పడంతో ఇద్దరు అన్నదమ్ములు తమకు వాటా అవసరం లేదని ప్రకటిస్తారు. అంతటితో ఆగకుండా బాలు 'పెద్దరాయుడు తీర్పు' అంటూ కీలక నిర్ణయం ప్రకటిస్తాడు. "ఆ 45 లక్షలు నాన్న కష్టార్జితం... కాబట్టి ఆ డబ్బుపై పూర్తి హక్కు నాన్నదే. ఇకపై షాప్ ఓనర్ నాన్నే" అని స్పష్టం చేస్తాడు. అలాగే మనోజ్‌ను మేనేజర్‌గా నియమిస్తూ, ప్రతి వారం లెక్కలు సత్యానికి చూపించాలని ఆదేశిస్తాడు. ఈ తీర్పుతో మీనా, శృతి ఆనందంలో మునిగిపోతే... రోహిణి, మనోజ్ మాత్రం షాక్‌కు గురై కోపంతో గదిలోకి వెళ్లిపోతారు.
ఇక మనోజ్-రోహిణి హాల్‌లో జరిగిన 'పెద్దరాయుడు తీర్పు'తో షాక్‌లో ఉన్న ఈ జంట మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రూమ్‌లోకి వెళ్లిన వెంటనే మనోజ్ తన అసహనాన్ని బయటపెడుతూ "ఈ సమస్య అంతా నీ వల్లే వచ్చింది" అన్నట్టుగా మాట్లాడడం రోహిణిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటూ "నేను చేసిన ప్రతి పని నీ కోసమే... నీ భవిష్యత్తు బాగుండాలని చేశా. కానీ నువ్వు మాత్రం ఒక్కసారైనా నన్ను సపోర్ట్ చేయలేదు. నీ అమ్మ నన్ను కొడుతుంటే కూడా అడ్డుకోలేదు" అంటూ గుండె నొప్పిని బయటపెట్టింది.
దీనికి మనోజ్ ఇచ్చిన సమాధానం మరింత వివాదానికి దారితీసింది. "నేను మధ్యలో అడ్డు వస్తే పరిస్థితి మరింత చెడిపోయేది... అందుకే సైలెంట్‌గా ఉన్నాను" అంటూ తన వైఖరిని సమర్థించుకోవడం, రోహిణిని మరింత కుంగదీసింది. అంతేకాదు, "నాన్నను షాప్ ఓనర్‌గా కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు" అని చెప్పిన మనోజ్ మాటలు రోహిణిని షాక్‌కు గురి చేశాయి. వెంటనే ఆమె కఠినంగా స్పందిస్తూ "ఆ షాప్ కోసం డబ్బులు తెచ్చింది నేను... ప్రతి విషయంలో నీ కోసం నిలబడ్డాను. కానీ నువ్వు మాత్రం నన్నే తప్పు చేసినట్టు చూస్తున్నావ్" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక కుటుంబ సభ్యుల ప్రవర్తనపై కూడా రోహిణి ప్రశ్నలు లేవనెత్తింది. "నిన్ను ఎవరైనా పట్టించుకున్నారా? నీ అమ్మ నీకు నిజంగా మేలు చేస్తుందా?" అంటూ మనోజ్‌ను రియాలిటీ చెక్ చేసింది. "నేను లేకపోతే నువ్వు లేవు... అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు" అంటూ తీవ్రంగా బాధపడింది. చివరగా "సరే... నువ్వు సంతోషంగా ఉండు" అంటూ భావోద్వేగంగా రూమ్ నుంచి బయటకు వెళ్లిపోవడం సన్నివేశాన్ని మరింత హృదయ విదారకంగా మార్చింది. ఈ సంఘటనతో మనోజ్ పూర్తిగా గందరగోళానికి గురై ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటాడు. ఇలా దంపతుల మధ్య పెరుగుతున్న దూరం, అపార్థాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇక రోహిణి-మనోజ్ సంబంధం ఎటు దారితీస్తుంది? ఇద్దరూ మళ్లీ కలుస్తారా? లేక విభేదాలు మరింత పెరుగుతాయా? అనే ఆసక్తికర ప్రశ్నలతో ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications