Gundeninda Gudigantalu May 25th Episode: గుణ ప్లాన్ ఫెయిల్, మలేషియా గెస్టుల ఎంట్రీ, రోహిణికి బాలు చెక్
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ కథను మరింత ఉత్కంఠభరితంగా మలిచింది. ఫేక్ విల్లా ఓనర్‌ను పట్టుకునేందుకు బాలు చేసిన ప్రయత్నం విఫలమవడంతో టెన్షన్ పెరిగింది. అతడు దొరికినట్టే దొరికి మళ్లీ తప్పించుకోవడంతో బాలు నిరాశ చెందగా, చేపలను ఫ్రీగా పంచిపెట్టి ఇంటికి రావడం కొంత సరదాగా కనిపించింది. అయితే ఇంట్లో మాత్రం వాతావరణం వేడెక్కింది. మీనా వంట చేయలేదని ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేయడం, మనోజ్ తన ఫ్రెండ్‌ను తీసుకురావడం పరిస్థితిని అసౌకర్యంగా మార్చింది.30 లక్షల మోసం విషయం బయటపడడంతో ఇంట్లో ఉద్రిక్తత పెరిగింది. మనోజ్ సమాధానాలు ఎవరికీ నమ్మశక్యంగా లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఈ సమయంలో సత్యం ఎంట్రీ ఇచ్చి ప్రభావతికి కౌంటర్ ఇవ్వడం సీన్‌కు బలం చేకూర్చింది.బాలు-మీనాలు జరిగిన విషయాలు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. 30 రూపాయల కోసం మనోజ్ చేసిన ఫోన్ కాల్స్ కారణంగా మోసగాడు తప్పించుకున్నాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు. రోహిణి ప్రవర్తన మాత్రం అనుమానాలకు తావిచ్చింది. "మా డబ్బులు మేమే చూసుకుంటాం" అన్న ఆమె మాటలు బాలుకు అనుమానం కలిగించాయి. మరోవైపు విద్య-గిరి సన్నివేశాలు కాస్త వినోదాన్ని అందించాయి. చివరగా రోహిణి గుణను కలవడం, తక్కువ కమిషన్‌తో డీల్ చేయడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉందనే సస్పెన్స్‌తో ఎపిసోడ్ ముగిసింది.

photo courtesy jiohotstar
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఆసక్తిగా కట్టిపడేసింది. రాజమండ్రి నేపథ్యంలో కథ మొదలవుతుంది. బాలు తన కారులో ప్రయాణిస్తుండగా మలేషియా నుండి వచ్చిన ఓ దంపతులు ఎక్కుతారు. చాలా సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చిన వారు ఇక్కడి వాతావరణం,నగర అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారు. "ఇప్పటికీ, అప్పటికీ చాలా తేడా ఉంది... ఊహించని విధంగా ఇండియా డెవలప్ అయింది" అని వారు భావోద్వేగంగా చెప్పడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా బాలు కూడా రాజమండ్రి అభివృద్ధిని గర్వంగా వివరిస్తాడు. "ఇప్పుడు ఇక్కడ ఏం కావాలన్నా దొరుకుతుంది సార్... రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది" అంటూ మాట్లాడుతాడు.దీంతో ఆ దంపతులు తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ, తాము మలేషియాలో పుట్టి పెరిగినా తమ మూలాలు ఇక్కడే ఉన్నాయని చెబుతారు.
"మా పెళ్లి సమయంలో చివరిసారి ఇక్కడికి వచ్చాం... ఇప్పటికి 25 ఏళ్లు అయ్యింది. ఈసారి మా పెళ్లిరోజును ఇండియాలో జరుపుకోవాలని వచ్చాం" అని చెప్పడం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. వారి మాటలకు ఆకర్షితుడైన బాలు, "భారతదేశంపై మీకు ఉన్న ప్రేమ నిజంగా గొప్పది సార్" అని అభినందిస్తాడు. అదే సమయంలో వారు దగ్గరలో ఉన్న మంచి దేవాలయానికి తీసుకెళ్లమని కోరగా, బాలు వెంటనే ఒప్పుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని చెబుతాడు. వెంటనే మీనాకు ఫోన్ చేసి పూజ ఏర్పాట్లు చేయమని చెబుతాడు. మీనా కూడా సమయానికి గుడికి చేరుకుని ఏర్పాట్లను చూసుకుంటుంది. ఇలా బాలు ఆ దంపతులకు గైడ్‌గా మారి రాజమండ్రి పరిసర ప్రాంతాల ఆధ్యాత్మిక ప్రదేశాలను చూపించాలని నిర్ణయించుకుంటాడు.
ఇక మరోవైపు కథలో టెన్షన్ పెరుగుతుంది. గుణ తన ప్లాన్ ప్రకారం గుడికి చేరుకుంటాడు. అతనిని చూసిన పార్వతి ఒక్కసారిగా భయపడుతుంది. తన కుమారుడు శివకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆందోళన చెందుతుంది. అయితే శివ మాత్రం ఆమెను ధైర్యం చెబుతూ, "అమ్మా నువ్వేం టెన్షన్ పడకు... వాడు గుడిలో ఏమీ చేయలేడు" అని చెప్పడం గమనార్హం. గుణ మాత్రం తన అసలు లక్ష్యంపై దృష్టి పెట్టి ఆలయ అధికారులను సంప్రదిస్తాడు. "ఇక్కడ జరిగిన ఒక మోసం గురించి సీసీటీవీ ఫుటేజ్ కావాలి" అని అడుగుతాడు. కానీ ఆలయ అధికారులు కఠినంగా స్పందిస్తూ, "కోర్ట్ ఆర్డర్ లేకుండా మేము ఎవరికి కూడా ఫుటేజ్ ఇవ్వలేం" అని స్పష్టం చేస్తారు. గుణ తనను తెలిసినవాడిగా చెప్పినా, "మీరు లాయర్ లేదా పోలీసా?" అని ప్రశ్నిస్తూ అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటారు. దీంతో గుణ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. నిరాశతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ ఈ సంఘటనతో కథలో కొత్త సందేహాలు, కొత్త మలుపులకు బాటలు పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇక గుడి సన్నివేశాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మలేషియా దంపతుల కోసం మీనా ప్రత్యేక పూజా ఏర్పాట్లు చేస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఆలయ అధికారులు వచ్చి ఒక షాకింగ్ విషయం చెబుతారు. "ఇంతకు ముందు నువ్వు సీసీ ఫుటేజ్ గురించి అడిగావు కదా... ఇప్పుడే ఇంకొక వ్యక్తి కూడా అదే ఫుటేజ్ కోసం వచ్చాడు" అని చెప్పడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే ఎవరు వచ్చారో అనుమానం మొదలవుతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న శివ స్పందిస్తూ, "అతని పేరు గుణనా?" అని అడుగుతాడు. ఆలయ అధికారి "అవును" అని చెప్పడంతో మీనా, శివ అనుమానాలు మరింత బలపడతాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక రోహిణి ఉందని మీనా భావిస్తుంది. గుండాలతో డబ్బులు వెతికించే పనిలో రోహిణి భాగస్వామిగా ఉందన్న కోణంలో ఆలోచిస్తూ, ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో కథలో రోహిణి పాత్ర మరింత సస్పెన్స్‌గా మారింది.
ఇంతలోనే బాలు మలేషియా దంపతులను తీసుకొని గుడికి చేరుకుంటాడు. వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి, సంప్రదాయబద్ధంగా వారి పెళ్లిరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తాడు. ఈ ఏర్పాట్లతో ఆ దంపతులు ఎంతో సంతోషపడతారు. భారతీయ సంస్కృతిని దగ్గరగా అనుభవిస్తూ ఆనందంలో మునిగిపోతారు. ఈ సందర్భంలో మీనా ఆ దంపతులను మరింత ఆత్మీయంగా ఆహ్వానిస్తూ, "ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి" అని కోరుతుంది. మొదట కొంచెం సందేహించిన వారు, బాలు రిక్వెస్ట్ చేయడంతో చివరకు అంగీకరిస్తారు. దీంతో కథలో ఒక పాజిటివ్, ఫ్యామిలీ ఎమోషన్ ట్రాక్ కనిపిస్తుంది.
ఇక మీనా వంట ఏర్పాట్లు చేసేలోగా.. బాలు ఆ దంపతులను సమీప ప్రాంతాలు చూపించడానికి తీసుకెళ్తాడు. ఈ సమయంలో మీనా, గుణ సీసీ ఫుటేజ్ కోసం వచ్చాడని బాలుకు చెబుతుంది. అయితే బాలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, "ఆ విషయం తర్వాత చూసుకుందాం... నువ్వు ముందుగా వంట చూసుకో" అని చెప్పడం గమనార్హం.
మరోవైపు ప్రభావతి ట్రాక్‌లో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. డాన్స్ క్లాస్‌లో ఆమె బిజీగా ఉండగా, రాధిక-ప్రేమ్ కుమార్ లవర్ జంట ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతుంది. "మీ లాంటి టీచర్ దొరకడం మా అదృష్టం... మిమ్మల్ని మిస్ అవుతాం" అని చెప్పడంతో ప్రభావతి భావోద్వేగంగా స్పందిస్తూ, "నేను ఎక్కడికీ వెళ్లను... మీలాంటి శిష్యులు ఉండటం నా అదృష్టం" అంటూ కవరింగ్ చేస్తుంది. ఈ మాటలతో ఆ జంట సంతోషపడుతుంది. ముఖ్యంగా ప్రేమ్ కుమార్.. ప్రభావతిని మరింతగా పొగడడంతో ఆమె ఊహల్లో విహరిస్తుంది.
కానీ క్లాస్ ముగిసిన తర్వాత అసలు నిజం బయటపడుతుంది. రాధిక, ప్రేమ్ కుమార్‌తో మాట్లాడుతూ, "మేడం వెళ్లడం లేదు అనేది కేవలం కవరింగ్ మాత్రమే... వాళ్ల అబ్బాయి మోసపోయి దాదాపు 30 లక్షలు నష్టపోయాడట. ఆ విషయం చెప్పకుండా ఇక్కడే ఉండాలని చూస్తుంది" అని అసలు విషయం బయటపెడుతుంది. దీంతో ప్రభావతి పరిస్థితి కూడా సందేహాస్పదంగా మారుతుంది. ఇక ప్రేమ్ కుమార్ మాత్రం "ఏదైనా మన మంచికే జరిగింది... ఇంకొన్ని రోజులు ఇలానే ఉండొచ్చు. త్వరలో జాబ్ చూసుకుని మనం పెళ్లి చేసుకుందాం" అంటూ భవిష్యత్ ప్లాన్ చేస్తాడు. దీంతో ఈ జంట ట్రాక్‌లో కూడా కొత్త మలుపు.
మరోవైపు.. ప్రభావతి-మీనాక్షి మధ్య జరిగిన సంభాషణ కుటుంబ పరిస్థితులపై లోతైన చర్చగా మారింది. మనోజ్ పరిస్థితిని గుర్తుచేసుకుంటూ ప్రభావతి తీవ్రంగా బాధపడుతుంది. "మనోజ్ జాతకంలోనే ఏదో దోషం ఉంది... అందుకే అతనికి ఇలా వరుసగా సమస్యలు వస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే మీనాక్షి మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా భిన్నంగా చూస్తుంది. "ఒకసారి, రెండుసార్లు జరిగితే అదృష్టం అనుకోవచ్చు... కానీ ప్రతిసారి తప్పులు జరుగుతుంటే అది మనోజ్ అసమర్థతే" అని స్పష్టంగా, కాస్త కఠినంగా కామెంట్ చేస్తుంది. ఈ మాటలు ప్రభావతికి షాక్ ఇస్తాయి.
అయితే ప్రభావతి వెంటనే బాధ్యతను రోహిణిపై నెట్టేస్తుంది. "ఇదంతా రోహిణి అత్యాశ వల్లే... ఆమె వల్లనే మనోజ్ ఇలా మారిపోయాడు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ ఇక్కడ మీనాక్షి మరో ట్విస్ట్ ఇస్తుంది. ఆమె రోహిణికి సపోర్ట్ చేస్తూ, "నీ ఇంట్లో నిన్ను నిజంగా పట్టించుకునేది రోహిణి మాత్రమే... ఆమె నిన్ను ప్రేమిస్తుంది. పైగా ఆమె కోటేశ్వరరావు కూతురు... కోట్లకు అధినేత. అలాంటి వ్యక్తిని అనవసరంగా ఇబ్బంది పెడితే భవిష్యత్తులో నువ్వే నష్టపోతావు" అని హెచ్చరిస్తుంది. ఈ మాటలతో ప్రభావతి ఆలోచనలో పడిపోతుంది. రోహిణిపై తన అభిప్రాయం మారుతుందా అన్న సందేహం ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఇక మరోవైపు కథలో కీలక మలుపు.. రోహిణి, గుణ మధ్య జరిగిన మీటింగ్. రోహిణి నేరుగా విషయానికి వచ్చి, "సీసీటీవీ ఫుటేజ్ తీసుకువచ్చావా?" అని అడుగుతుంది. గుణ మాత్రం నిరాశపరిచే సమాధానం ఇస్తాడు. "ఆలయ అధికారులు ఇవ్వలేదు... పోలీస్ కంప్లైంట్ లేదా కోర్ట్ ఆర్డర్ ఉంటేనే ఇస్తామని చెప్పారు" అని చెబుతాడు. అంతేకాదు, మీనా కూడా అదే ఫుటేజ్ కోసం ప్రయత్నించిందని, కానీ ఆమెకూ నిరాకరణే ఎదురైందని వెల్లడిస్తాడు. ఇంకా ఒక షాకింగ్ విషయం చెబుతాడు "అక్కడ మీనా ఫ్యామిలీ నన్ను చూసింది." ఈ మాటతో రోహిణి ఒక్కసారిగా టెన్షన్‌లో పడుతుంది. తన ప్లాన్ బయటపడుతుందేమో అన్న భయం ఆమెను వెంటాడుతుంది. అయినప్పటికీ, తక్షణమే నిర్ణయం తీసుకుని, "ఆ విషయం నేను చూసుకుంటాను" అంటూ కంట్రోల్‌లోకి వస్తుంది.
దీనితో వెంటనే మనోజ్‌కు ఫోన్ చేసి, "పోలీస్ స్టేషన్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ తెప్పించు" అని ఆదేశిస్తుంది. రోహిణి చెప్పినట్టే మనోజ్ కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతాడు. దీంతో రోహిణి ప్లాన్ మరింత యాక్టివ్ అయ్యిందని స్పష్టమవుతుంది. ఇక మరోవైపు మీనా ఇంట్లో ఫ్యామిలీ ట్రాక్ సాగుతుంది. మలేషియా దంపతుల కోసం మీనా ఎంతో స్పెషల్‌గా వంటలు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో శృతి వచ్చి, "ఏంటి ఇంత ప్రిపరేషన్?" అని అడుగుతుంది. మీనా ఆనందంగా, "మలేషియా నుండి గెస్ట్‌లు వస్తున్నారు... బాలు చెప్పాడు కాబట్టి స్పెషల్‌గా చేస్తున్నా" అని చెబుతుంది. అయితే శృతి ఒక కీలక ప్రశ్న వేస్తుంది-"అత్తయ్య ఒప్పుకుంటుందా?"
దానికి మీనా చాలా ధైర్యంగా, "దానికి సమాధానం నా దగ్గర ఉంది... బాలు చూసుకుంటాడు" అంటూ నమ్మకంగా సమాధానం ఇస్తుంది. ఈ మాటలతో మీనా క్యారెక్టర్‌లోని కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అదే సమయంలో క్లైమాక్స్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రభావతి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి, "ఏంటి... ఏం చేస్తున్నావ్?" అంటూ ఘాటుగా ప్రశ్నిస్తుంది. ఆమె ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా టెన్షన్‌తో నిండిపోతుంది. మీనా సిద్ధం చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేక ప్రభావతి అడ్డుకుంటుందా? అన్న ఆసక్తికరమైన పరిస్థితిలో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications