Gunde Ninda Gudi Gantalu june 3rd Episode: మీనా హత్యకు రోహిణి ప్లాన్, పోలీసుపై బాలు దాడి, చింతామణి క్రుట
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కామెడీ, ఉత్కంఠభరిత ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎపిసోడ్ ప్రారంభంలో శృతి తన భర్త రవిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంట్లో మిగతా భర్తలు తమ భార్యలతో ఎక్కువ సమయం గడుపుతున్నారని, రవి మాత్రం తనను పట్టించుకోవడం లేదని వాపోయింది. ఈ సందర్భంగా మలేషియా ట్రిప్‌కు తాము కూడా వస్తామని పట్టుబట్టడంతో చివరకు రవి అంగీకరించాడు. మరోవైపు మలేషియా ట్రిప్ కారణంగా తన అబద్ధాలన్నీ బయటపడతాయనే భయంతో రోహిణి తీవ్ర ఆందోళనకు గురైంది. విద్యను కలిసి తన సమస్య చెప్పగా, ఆమె చేసిన తప్పులను విద్య గుర్తు చేసింది. దీంతో రోహిణి కొత్త ప్లాన్ వేసి మటన్ కొట్టు మాణిక్యాన్ని రంగంలోకి దింపింది. మొదట భయపడిన మాణిక్యం, చివరకు ఆమె మాటలకు లొంగిపోయాడు.
ఇదే సమయంలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీసు కానిస్టేబుల్ ఇంటికి రావడంతో మనోజ్, ప్రభావతి కంగారుపడ్డారు. అయితే అది కేవలం పాస్‌పోర్ట్ ఎంక్వయిరీ మాత్రమేనని తెలిసి అందరూ ఊరట చెందారు. అనంతరం మలేషియా మామగా వచ్చిన మాణిక్యం, రోహిణి తండ్రి జైలులో హత్యకు గురయ్యాడని, అతని అస్తికలను తీసుకొచ్చానని చెప్పడంతో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోహిణి కూడా స్పృహ తప్పినట్లు నటించి అందరి సానుభూతి పొందింది. ఈ ఘటనలతో సత్యం మలేషియా ట్రిప్‌ను రద్దు చేయగా, రోహిణి ప్లాన్ సక్సెస్ అయింది. అయితే బాలు మాత్రం ఈ కథలో ఏదో మోసం ఉందని అనుమానిస్తూ, రోహిణి అసలు నిజాన్ని బయటపెడతానని నిర్ణయించుకోవడంతో కథ మరింత ఉత్కంఠగా మారింది.

Courtesy: Jio hotstar
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుట్రలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా మీనాను టార్గెట్ చేస్తూ చింతామణి వేసిన కొత్త ఎత్తుగడ, మరోవైపు రోహిణిని వెంటాడుతున్న భయాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే చింతామణి తన అసలు ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రభావతి దగ్గరకు చేరుకుంది. ప్రభావతి గురించి ఎంతో గొప్పగా విన్నానని, ఈ వయసులో కూడా ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందని చెబుతూ పొగడ్తలతో ముంచెత్తింది. అంతేకాదు, తాను కూడా చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నానని, కానీ వ్యాపార పనుల్లో బిజీ కావడంతో ప్రాక్టీస్ మానేశానని చెప్పింది. తన టాలెంట్‌ను చూపించేందుకు కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చేసి ప్రభావతిని పూర్తిగా ఇంప్రెస్ చేసింది.
ఈ సమయంలో మీనాక్షి అనుకోకుండా మీనా టాపిక్ తీసుకురావడంతో కథలో కీలక మలుపు చోటుచేసుకుంది. డెకరేషన్ వ్యాపారం చేసే మీనా కూడా ప్రభావతి కోడలేనని చెప్పడంతో చింతామణి ఆశ్చర్యపోయినట్లు నటించింది. తర్వాత మీనా కుటుంబ పరిస్థితులు, పూల వ్యాపారం, ఆమె తండ్రి మరణం వంటి విషయాలను అడిగి తెలుసుకుంది.ఈ సందర్భంగా ప్రభావతి కూడా మీనాపై తనకున్న అసంతృప్తిని బయటపెట్టింది. "మా ఆయన ఇష్టంతోనే ఆ పెళ్లి జరిగింది. నాకు అంతగా ఇష్టం లేదు" అంటూ కోడలిపై ఉన్న వ్యతిరేకతను వెల్లడించింది. అంతే... చింతామణికి కావాల్సిన సమాచారం మొత్తం దొరికిపోయింది. మీనాను ఎలా దెబ్బతీయాలనే దానిపై ఆమె మనసులో కొత్త ప్రణాళికలు మొదలయ్యాయి. "నాతో పోటీకి వచ్చిన మీనాకు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం చెబుతాను" అంటూ లోలోపల నిర్ణయించుకుంది. చివరకు పట్టువస్త్రాలు, తాంబూలం, కానుకలు ఇచ్చి ప్రభావతి శిష్యురాలిగా మారడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది.
మరోవైపు రోహిణి, విద్య, మటన్ కొట్టు మాణిక్యం కలిసి తమ తాజా మోసంపై మాట్లాడుకుంటూ కనిపించారు. లేని తండ్రిని చనిపోయినట్లు నమ్మించడంలో తాము సక్సెస్ అయ్యామని, ముఖ్యంగా మాణిక్యం అద్భుతంగా నటించాడని ఒకరినొకరు పొగిడుకున్నారు. ఇదే సమయంలో మీనా అక్కడికి వచ్చి వారి మాటలన్నీ విన్నట్లుగా చూపించారు. దీంతో రోహిణి, విద్య, మాణిక్యం ముగ్గురూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మీనాకు నిజం తెలిసిపోయిందని భావించిన రోహిణి భయంతో వణికిపోయింది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఇలా అబద్ధాలు చెప్పానని వేడుకున్నా, మీనా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. "నువ్వు కేవలం అత్తయ్యనే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ మోసం చేశావు. నీ నిజస్వరూపం బయటపెడతాను" అంటూ గట్టిగా హెచ్చరించింది.
మాణిక్యం తప్పించుకోవాలని ప్రయత్నించగా, అతడిని కూడా నిలదీసింది. విద్యను సైతం ఈ మోసంలో భాగస్వామినిగా తప్పుబట్టింది. ఇంతటితో ఆగకుండా రోహిణి, మాణిక్యంతో కలిసి మీనాను చంపేయాలని కూడా ఆలోచించినట్లు చూపించారు. అయితే చివర్లో భారీ ట్విస్ట్ ఇచ్చారు. మీనా వచ్చి వారిని నిలదీయడం, నిజం బయటపడటం, గొడవలు జరగడం అన్నీ రోహిణి చూసిన పీడకల మాత్రమే అని తేలింది. కలలో కూడా మీనా తనను వదలకపోవడంతో రోహిణి భయంతో కేకలు వేస్తూ నిద్రలేచింది. ఆమె పక్కనే ఉన్న మనోజ్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. రోహిణి ప్రవర్తన చూసి భయపడిన మనోజ్, ఇంట్లో ఏదో ఆత్మ తిరుగుతోందేమో అని అనుమానం వ్యక్తం చేయడం నవ్వులు పూయించింది. కానీ రోహిణి మాత్రం కలలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, "ఒకవేళ నిజంగానే మీనాకు నా రహస్యాలు తెలిసిపోతే నా జీవితం నాశనం అవుతుంది" అంటూ తీవ్ర ఆందోళనకు గురైంది.
ఇక మరుసటి రోజు రోహిణి తన స్నేహితురాలు విద్య ఇంటికి వెళ్లి, తనకు పడిన భయంకరమైన కల గురించి చెబుతుంది. ఆ కలలో మీనా తన మోసాలన్నింటినీ బయటపెట్టినట్లు, ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోయినట్లు చూసి భయపడిపోయానని వివరిస్తుంది. దీనిపై స్పందించిన విద్య, "కలలో కూడా మీనా నిన్ను వదిలిపెట్టడం లేదు. ఒకవేళ నిజంగానే నీ అబద్ధాలు బయటపడితే నువ్వే కాదు, నేను కూడా ఇబ్బందుల్లో పడతాను. ఇకనైనా జాగ్రత్తగా ఉండు" అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. అయితే విద్య మాటలను రోహిణి ఏమాత్రం పట్టించుకోదు. తన మోసాన్ని మరింత బలంగా నమ్మించేలా మరో కొత్త ప్లాన్ సిద్ధం చేస్తుంది. వెంటనే తన తల్లి సుగుణమ్మను పిలిచి, తండ్రి ఫొటో తీసుకురమ్మని అడుగుతుంది. సుగుణమ్మ ఆశ్చర్యపోయినా, భర్త ఫొటోను తీసుకొచ్చి కూతురికి ఇస్తుంది.
ఆ ఫొటోను చూసిన విద్య, "ఇప్పుడు ఈ ఫొటో ఎందుకు?" అని ప్రశ్నించగా, రోహిణి తన అసలు ప్లాన్‌ను బయటపెడుతుంది. "కొన్ని విషయాలు నిజమని నమ్మించాలంటే ఆధారాలు కూడా ఉండాలి. ఇప్పటివరకు మలేషియాలో ఉన్న మా నాన్న గురించి మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఈ ఫొటోను ఇంటికి తీసుకెళ్లి ఇతడే నా తండ్రి అని చూపిస్తాను. అప్పుడు అందరూ మరింత నమ్ముతారు. పైగా నాకు సానుభూతి కూడా వస్తుంది" అంటూ తన కపట ఆలోచనలను వెల్లడిస్తుంది. రోహిణి మాటలు విన్న సుగుణమ్మ ఒక్కసారిగా ఆందోళన చెందుతుంది. "అబద్ధాల మీద అబద్ధాలు కట్టుకుంటూ పోతున్నావు. ఇవి ఒకరోజు నీ జీవితాన్నే ప్రమాదంలో పడేస్తాయి. ఇప్పటికైనా నిజం చెప్పి క్షమాపణ అడుగు. వాళ్లు నిన్ను క్షమించే అవకాశం ఉంది" అంటూ తల్లిగా హితవు పలుకుతుంది.
కానీ రోహిణి మాత్రం తన వైఖరి మార్చుకోదు. "నేను నా జీవితానికి పోరాటం చేస్తున్నాను" అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. వెంటనే విద్య స్పందిస్తూ, "ఇది పోరాటం కాదు, నాటకం. ప్రతి రోజు కొత్త అబద్ధం చెబుతూ నువ్వే నీ జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకుంటున్నావు. ఈరోజో రేపో నీ నాటకం బయటపడటం ఖాయం" అంటూ హెచ్చరిస్తుంది. ఇక సుగుణమ్మ మరోసారి కూతురికి సలహా ఇస్తూ, "పిల్లలు పుడితే నీకు కుటుంబంలో మరింత భద్రత ఉంటుంది.
అంతేకాదు, బాలు, మీనాలకు అయినా నిజం చెప్పు. వాళ్లు నీ సమస్యను అర్థం చేసుకుని ఇంట్లో పెద్దలకు చెప్పి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు" అంటుంది. అయితే ఈ మాటలకు రోహిణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "వాళ్లే నా జీవితానికి సమస్య. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. వాళ్లకు నిజం చెప్పాలనే ఆలోచనే లేదు" అంటూ మండిపడుతుంది.
దీంతో విద్య కూడా సహనం కోల్పోయి, "నువ్వు సమస్యల్లో పడటం కాదు... నువ్వే అందరికీ సమస్యగా మారుతున్నావు. నీ మోసాలకు హద్దులే లేకుండా పోతున్నాయి" అని ఘాటుగా సమాధానం ఇస్తుంది. ఇంతలో రోహిణి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఆమె ఏడుపు చూసి విద్య షాక్‌కు గురవుతుంది. "నేను అంత పెద్దగా ఏమన్నాను? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతుంది. అప్పుడు రోహిణి చెప్పిన సమాధానం చూసి విద్య, సుగుణమ్మ ఇద్దరూ అవాక్కవుతారు."నువ్వు నిజంగానే నేను బాధపడుతున్నానని నమ్మావా? ఇంటికి వెళ్లాక ఎలా ఏడవాలో ముందే ప్రాక్టీస్ చేస్తున్నాను" అంటూ నవ్వుతూ చెబుతుంది. ఈ మాట విన్న విద్య, "అమ్మా సుగుణమ్మా... నిజంగా భలే కూతుర్ని కన్నావు. ఇంత పెద్ద నాటకరాణి నేను ఎప్పుడూ చూడలేదు" అంటూ వ్యంగ్యంగా స్పందిస్తుంది.
మరోవైపు.. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ వృద్ధ దంపతుల చిన్న గుడిసెను కూడా కూల్చివేయడానికి ప్రయత్నించారు. తమ జీవనాధారం అదే అని, కనీసం కొంత సమయం ఇవ్వాలని ఆ వృద్ధ దంపతులు ఎంత వేడుకున్నా పోలీసులు మాత్రం ఏమాత్రం కనికరం చూపించలేదు. అంతేకాకుండా వయసు మీద పడిన ఆ దంపతులను గౌరవించకుండా తోసిపుచ్చడం మరింత బాధాకరంగా మారింది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన బాలు పరిస్థితిని గమనించి వెంటనే జోక్యం చేసుకున్నాడు. కిందపడిపోతున్న వృద్ధుడిని పట్టుకుని కాపాడిన బాలు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. "నిజంగా మీరు పోలీసులు కాదు రౌడీలు. వృద్ధులపై మీ ప్రతాపం చూపించడం గొప్పతనమా? ఇదేనా ప్రజలకు సేవ చేయాల్సిన మీ విధి?" అంటూ నిలదీశాడు.
అయితే పోలీసు కానిస్టేబుల్ కూడా వెనక్కి తగ్గకుండా బాలుపై విరుచుకుపడ్డాడు. ఈ సమయంలో మీనా కూడా బాలుకు మద్దతుగా నిలిచింది. "కోట్ల రూపాయలు దోచుకునే వాళ్లను వదిలేసి, కష్టపడి పొట్టకూటి కోసం పనిచేసే పేదలపై మీ ప్రతాపం చూపించడం ఏ న్యాయం?" అంటూ ప్రశ్నించింది. అయినా పోలీసులు తమ చర్యలను ఆపలేదు. వృద్ధ దంపతుల సామాన్లు కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వృద్ధురాలు అడ్డుపడగా, కానిస్టేబుల్ ఆమెను బలంగా నెట్టివేయడంతో పక్కనే ఉన్న రాయిపై పడిన ఆమెకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనతో బాలు కోపం అదుపు తప్పింది. వెంటనే కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని నిలదీయగా, పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో మరో కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నాడు.
"చుట్టూ అందరూ వీడియోలు తీస్తున్నారు. గొడవ పెరిగితే ఉద్యోగానికే ప్రమాదం" అంటూ తన సహచరుడిని శాంతింపజేశాడు. ఇదే సమయంలో గాయపడిన వృద్ధురాలిని చూసిన మీనా, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలు తన ఆగ్రహాన్ని పక్కనపెట్టి, వృద్ధురాలిని కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించాడు. వెళ్లే సమయంలో కూడా కానిస్టేబుల్ బాలును బెదిరిస్తూ, "నీ సంగతి తర్వాత చూస్తా" అని హెచ్చరించాడు. అయితే బాలు మాత్రం ఏమాత్రం భయపడకుండా, "పేదల కోసం పోరాడితే వెనక్కి తగ్గేది లేదు" అన్నట్లుగా గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి.
ఆస్పత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు వృద్ధురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో రక్తస్రావం ఎక్కువైందని, వెంటనే రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారింది. వృద్ధ దంపతులకు తోడుగా ఉండేందుకు మీనా తన చెల్లెలు సుమతిని అక్కడే ఉంచి, ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంట్లో మాత్రం మీనా ఇంకా రాకపోవడంతో ప్రభావతి అసహనం వ్యక్తం చేస్తూ కనిపించింది. ఇలాంటి సమయంలోనే రోహిణి తన కొత్త నాటకానికి శ్రీకారం చుట్టింది. తన తండ్రి ఫొటోను తీసుకొచ్చి ఇంట్లో అందరికీ చూపిస్తూ, "ఇదే మా నాన్న" అంటూ భావోద్వేగ డ్రామా మొదలుపెట్టింది.
తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లు నటిస్తూ, మనోజ్‌పై వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె నటనను చూసి ఇంట్లో అందరూ జాలిపడగా, ప్రభావతి మాత్రం మరో కోణంలో ఆలోచించింది. "ఇప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముంది? బతికుండగానే చూసుకోవాల్సింది. ఇప్పుడు మిగిలింది బూడిద మాత్రమే" అంటూ తన మనసులో ఉన్న ఆస్తి ఆలోచనలను పరోక్షంగా బయటపెట్టింది. ఇలా ప్రభావతి ఆశలు-నిరాశల మధ్య నేటి ఎపిసోడ్ ముగిసింది. ఇక రోహిణి కొత్త డ్రామా ఎంతకాలం కొనసాగుతుంది? బాలు, మీనా ఆమె అసలు బాగోతాన్ని బయటపెడతారా? ఆస్పత్రిలో ఉన్న వృద్ధురాలి పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలతో తదుపరి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.


Click it and Unblock the Notifications