Gundeninda Gudigantalu June 8th Episode: పీడకలతో వణికిపోయిన రోహిణి.. బడిత పూజతో చితక్కొట్టిన స్వామీజీ..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. పోలీస్ స్టేషన్‌లో మనోజ్ చేసిన తప్పు గురించి తెలుసుకున్న బాలు షాక్‌కు గురవుతాడు. మీనా కూడా మనోజ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అనంతరం బాలు, మీనా హాస్పిటల్‌కు వెళ్లి ప్రమాదంలో గాయపడిన వృద్ధ దంపతులను కలుస్తారు. బాలు సోషల్ మీడియాలో చేసిన పోస్టు వల్ల తమ మనవడు ప్రకాష్ తిరిగి తమను గుర్తించాడని వృద్ధురాలు చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. అక్కడే కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. వృద్ధుడు తన వద్ద ఉన్న ఒక మొబైల్ ఫోన్‌ను బాలుకు అప్పగిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది గతంలో పోయిన బాలు ఫోన్ అని మీనా గుర్తిస్తుంది.
దీంతో బాలు అనుమానాలు మరింత బలపడతాయి. శివకు సంబంధించిన వీడియో ఈ ఫోన్ నుంచే బయటకు వెళ్లిందని గుర్తు చేసిన సత్యం, ఇందులోని వివరాలు అసలు నిజాలను బయటపెట్టవచ్చని చెబుతాడు. ఇదంతా విన్న రోహిణి భయాందోళనలకు గురవుతుంది. ఫోన్ తిరిగి దొరకడంతో తన రహస్యాలు బయటపడతాయేమోనని ఆందోళన చెందుతుంది. మరోవైపు రోహిణి, విద్య మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని వారి స్నేహం ముగుస్తుంది. ఇదే సమయంలో విద్య ఫోటోలను సేకరించిన మీనా వాటిని బాలుకు అందిస్తుంది. బాలు ఆ ఫోటోలను ప్రకాష్‌కు పంపించి వృద్ధ దంపతులకు చూపించాలని చెబుతాడు. దీంతో తదుపరి ఎపిసోడ్‌లో అసలు నిజం బయటపడుతుందా లేదా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.

Courtesy: Jio hotstar
సోమవారం ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఆకట్టుకుంది. బాలు తన ఫోన్ దొంగతనం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టేందుకు అడుగులు వేస్తుండగా, మరోవైపు రోహిణి మాత్రం భయంతో కుదేలైపోయింది. ఆమెకు వచ్చిన పీడకల కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. ముందుగా బాలు తన ప్లాన్‌లో భాగంగా విద్యా, రోహిణి ఫోటోలను ప్రకాష్‌కు పంపిస్తాడు. ఆ ఫోటోలను తన తాతయ్యకు చూపించి అందులో ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో గుర్తించమని కోరుతాడు. అయితే ప్రస్తుతం తాను ఊరిలో లేనని, మరో రెండు రోజుల తర్వాత ఇంటికి వెళ్లాక ఆ పని చేస్తానని ప్రకాష్ చెప్పడంతో బాలు కాస్త నిరాశ చెందుతాడు. అయినప్పటికీ తప్పకుండా ఫోటోలు చూపించాలని మరోసారి గుర్తు చేస్తాడు. ప్రకాష్ కూడా అందుకు అంగీకరిస్తాడు.
ఈ విషయాన్ని బాలు వెంటనే మీనాకు చెబుతాడు. మరో రెండు రోజులు వేచి చూడాల్సి వస్తుందని చెప్పగా, మీనా కూడా ఇప్పటివరకు ఎన్నో రోజులు ఎదురుచూశామని, ఇంకో రెండు రోజులు కూడా ఆగగలమని అంటుంది. అయితే బాలు మాత్రం తన అనుమానాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. తన ఫోన్ దొంగతనం వెనుక రోహిణి పాత్ర తప్పకుండా ఉండి ఉంటుందని, ఆమెపై తనకు వందశాతం అనుమానం ఉందని నిక్కచ్చిగా చెబుతాడు. కానీ మీనా మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఒకవేళ రోహిణి నిర్దోషి అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తుంది. దీనికి బాలు, అప్పుడు మరో కోణంలో దర్యాప్తు కొనసాగిస్తానని చెబుతాడు.
ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి తీవ్ర భయానక పీడకలను ఎదుర్కొంటుంది. ఆమె కలలో మీనా దయ్యంలా కనిపించి భయపెడుతుంది. "నిజం చెప్పు... బాలు ఫోన్ ఎందుకు దొంగిలించావు? శివ వీడియో బయటకు రావడానికి కారణం ఏమిటి?" అంటూ నిలదీస్తుంది. అంతేకాదు, నిజం చెప్పకపోతే నిన్ను వదిలిపెట్టనని హెచ్చరిస్తుంది. మీనా ఆగ్రహంతో రోహిణి గొంతు పట్టుకుని ప్రశ్నిస్తున్నట్లు కనిపించడంతో రోహిణి భయంతో వణికిపోతుంది.
కలలోనే మీనా మరోసారి శివ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని ప్రయత్నించావని ప్రశ్నిస్తూ రోహిణిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మనోజ్‌ను కూడా లాగిపడేయడంతో అతడు ఒక్కసారిగా భయపడిపోతాడు. వెంటనే తన తల్లి ప్రభావతికి ఫోన్ చేసి సహాయం కోరుతాడు. మనోజ్ ఫోన్ అందుకున్న ప్రభావతి కంగారుగా వారి గదికి పరుగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే రోహిణి నిద్రలోనే "నన్ను కాపాడండి... నన్ను కొట్టొద్దు" అంటూ అరుస్తూ ఉంటుంది. దీంతో ప్రభావతి ఆమెను నిద్రలేపుతుంది. ఒక్కసారిగా మెలకువ వచ్చిన రోహిణి, తనకు పీడకల వచ్చిందని అర్థం చేసుకుంటుంది. అయితే కలలో మీనా తనను వేధించిందన్న విషయాన్ని మాత్రం దాచిపెడుతుంది. ఎవరో తనను చంపడానికి వచ్చారని, కొట్టారని చెప్పి పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది.
దీంతో ప్రభావతి ఆశ్చర్యపోతూ, "నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్లు ఎవరు? ఎందుకు కొడుతున్నారు?" అని ప్రశ్నిస్తుంది. అయితే రోహిణి వారి ముఖాలు కనిపించలేదని, కానీ తనను చంపేందుకు ప్రయత్నించారని చెబుతుంది. ప్రభావతి మాత్రం అది కేవలం చెడు కలేనని చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. వెంటనే పూజ గదికి వెళ్లి విభూది తీసుకురావడానికి వెళ్తుంది. అయితే మనోజ్ మాత్రం భయాన్ని దాచుకోలేకపోతాడు. తన తండ్రి మరణించినప్పటి నుంచి రోహిణి వింతగా ప్రవర్తిస్తోందని, నిద్రలో తనను తన్నడం, కొట్టడం చేస్తోందని తల్లికి చెబుతాడు. ఈ మాటలు విన్న ప్రభావతి కూడా కాస్త ఆలోచనలో పడుతుంది. తన భర్త ఆత్మే రోహిణిని వెంటాడుతుందేమోనని అనుమానపడుతుంది. దీంతో ఈ వ్యవహారాన్ని ఆమె సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభిస్తుంది.
మరోవైపు మనోజ్ మాత్రం భయంతో గదిలోనే ఉండలేకపోతాడు. రోహిణి మరోసారి తనపై దాడి చేస్తుందేమోనన్న ఆందోళనతో గది మొత్తం విభూది చల్లి జాగ్రత్త పడతాడు. కానీ రోహిణి మాత్రం తన కలలో మీనా కనిపించి నిజాన్ని బయటపెట్టమని హెచ్చరించిందన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గుండెల్లోనే దాచుకుంటుంది.
ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ ట్రాక్‌తో కూడా ప్రేక్షకులను అలరించింది. రోహిణి భయాలు, బాలు దర్యాప్తు వంటి సీరియస్ సన్నివేశాల మధ్య శృతి, రవి, మీనా, బాలు మధ్య జరిగిన సరదా సంభాషణలు ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా శృతి, రవి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ప్రేక్షకులను బాగా నవ్వించింది. రవి ఎంతో అమాయకంగా శృతి దగ్గరకు వచ్చి ఇద్దరం కలిసి యోగాకు వెళ్దామని సూచిస్తాడు. అయితే అప్పటికే సరదా మూడ్‌లో ఉన్న శృతి, రవిని ఆట పట్టించాలని నిర్ణయించుకుంటుంది.
రవి అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా, "కింద పడితే మీద... మీద పడితే కింద" అన్నట్టుగా తిక్కతిక్క సమాధానాలు చెబుతుంది. శృతి చెప్పే మాటలు వింటూ రవి పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఆమె ఏమి మాట్లాడుతోంది, అసలు సమాధానం ఏమిటి అన్నది అతడికి అర్థం కాకపోవడంతో తల పట్టుకుంటాడు. ఎంత ప్రయత్నించినా శృతి మాటల వెనుక అర్థం దొరకకపోవడంతో చివరకు అక్కడి నుంచి తప్పించుకోవడమే మంచిదని భావించి నెమ్మదిగా జారుకుంటాడు. రవి పరిస్థితిని చూసిన ప్రేక్షకులు కూడా నవ్వులు పూయించుకున్నారు.
ఈ సన్నివేశాన్ని గమనించిన మీనా, రవి అంత కంగారుగా ఎందుకు వెళ్లిపోయాడని శృతిని ప్రశ్నిస్తుంది. దీనికి శృతి నవ్వుతూ అసలు విషయం చెబుతుంది. తనకు బోర్ కొట్టిందని, అందుకే రవితో కాస్త సరదాగా ఆడుకున్నానని వెల్లడిస్తుంది. తాను చెప్పిన తిక్కతిక్క సమాధానాలకు పాపం రవి పూర్తిగా భయపడి గందరగోళానికి గురయ్యాడని నవ్వుకుంటుంది. అక్కడితో ఆగకుండా శృతి మరో కొత్త ఐడియా మీనాకు చెబుతుంది. తాను చేసినట్టే ఒకసారి బాలుతో కూడా ఇలా మాట్లాడి చూడమని సలహా ఇస్తుంది. మొదట మీనా కాస్త సంకోచించినా, శృతి చెప్పిన తర్వాత అది సరదాగా ఉంటుందని భావిస్తుంది. దీంతో బాలును కూడా ఆట పట్టించాలని నిర్ణయించుకుంటుంది.
కొద్దిసేపటి తర్వాత బాలు దగ్గరకు వచ్చిన మీనా, శృతి స్టైల్లోనే తిక్కతిక్క సమాధానాలు చెప్పడం ప్రారంభిస్తుంది. బాలు ఏదైనా అడిగితే దానికి సంబంధం లేకుండా, "కింద పడితే మీద... మీద పడితే కింద" అన్నట్టుగా అర్థం కాని మాటలు చెబుతుంది. మొదట బాలు ఆమె ఏమి చెబుతోందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మీనా వరుసగా అలాంటి సమాధానాలే ఇవ్వడంతో అతడికి కూడా పూర్తిగా గందరగోళం ఏర్పడుతుంది. ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియక బాలు తల పట్టుకుంటాడు. మీనా మాటలతో పూర్తిగా అయోమయానికి గురైన అతడి పరిస్థితిని పక్కనే ఉన్న శృతి చూసి నవ్వులు ఆపుకోలేకపోతుంది. మీనా కూడా తన ప్లాన్ సక్సెస్ అయ్యిందన్న ఆనందంలో నవ్వుకుంటుంది.
అయితే కాసేపటికే బాలు అసలు విషయం గ్రహిస్తాడు. ఇది మొత్తం శృతి వేసిన ప్లాన్ అని అర్థం చేసుకుని ఇద్దరినీ చూసి నవ్వుతాడు. "అర్థమైంది... ఇదంతా మీ ఇద్దరి డబ్బుడమ్మ ప్లాన్" అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తాడు. అంతేకాదు, ప్రస్తుతం మీరు నన్ను ఆట పట్టించారు కానీ నాకు కూడా ఒక రోజు అవకాశం వస్తుందని, అప్పుడు మీలాగే తిక్కతిక్కగా మాట్లాడి మీకు చుక్కలు చూపిస్తానని హెచ్చరిస్తాడు. బాలు మాటలు విన్న మీనా, శృతి మరింతగా నవ్వుకుంటారు.
మరోవైపు.. మనోజ్ చెప్పిన మాటలు, రోహిణి రాత్రివేళల్లో ప్రవర్తిస్తున్న తీరు చూసిన ప్రభావతి ఒక నిర్ణయానికి వస్తుంది. తన భర్త మరణించిన తర్వాత రోహిణి పూర్తిగా మారిపోయిందని, ఆమెను ఏదో ఆత్మ ఆవహించిందని గట్టిగా నమ్ముతుంది. ఎలాగైనా ఆ దుష్టశక్తిని తరిమేయాలని నిర్ణయించుకున్న ప్రభావతి, మీనాక్షి ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ విషయాన్ని మాత్రం రోహిణికి తెలియనివ్వదు. ఏమీ తెలియని రోహిణిని ఒక సాకుతో మీనాక్షి ఇంటికి తీసుకువస్తుంది. అక్కడి వాతావరణం, జరుగుతున్న ఏర్పాట్లు చూసిన రోహిణికి అనుమానం మొదలవుతుంది. "ఇదంతా ఏంటి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏం జరుగుతోంది?" అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది. అయితే ప్రభావతి మాత్రం ఆమె మాటలను పట్టించుకోదు.
"నీ నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వు సరిగ్గా లేవు. వింతగా ప్రవర్తిస్తున్నావు. నీ నాన్న ఆత్మే నిన్ను ఆవహించిందేమో అనిపిస్తోంది. అందుకే ఈ ఏర్పాట్లు చేశాం" అంటూ ప్రభావతి తన అనుమానాన్ని బయటపెడుతుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది.తనకు ఎలాంటి సమస్య లేదని, తాను పూర్తిగా బాగానే ఉన్నానని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఆమె మాట వినకుండా, "నోరు మూసుకుని నేను చెప్పినట్లు చేయి" అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది.
దీంతో రోహిణి మౌనంగా ఉండిపోతుంది. ఇంతలోనే స్వామీజీ ఘనంగా ఎంట్రీ ఇస్తాడు.ఇంట్లోకి అడుగుపెట్టగానే తనకు ఏదో అసాధారణ శక్తి కనిపిస్తోందని, ఈ ఇంట్లో ఒక దయ్యం తిరుగుతోందని చెబుతాడు. అంతేకాదు, ఆ దయ్యం ఇప్పటికే ఒకరి శరీరాన్ని ఆవహించిందని ప్రకటిస్తాడు. స్వామీజీ మాటలు విన్న ప్రభావతి, మీనాక్షి మరింత భయపడిపోతారు.
ఆ తర్వాత రోహిణిని తన ముందుకు కూర్చోబెట్టిన స్వామీజీ ప్రశ్నలు మొదలుపెడతాడు. "నువ్వెవరు? ఎందుకు వచ్చావు? నీ అసలు పేరు ఏమిటి?" అంటూ దయ్యంతో మాట్లాడుతున్నట్లుగా విచారణ మొదలుపెడతాడు. అయితే స్వామీజీ అసలు స్వరూపం అర్థమైన రోహిణి కూడా తగ్గదు. అతడు చేస్తున్న డ్రామాను గుర్తించి, ఉద్దేశపూర్వకంగానే తిక్కతిక్క సమాధానాలు చెబుతూ అతడిని ఇబ్బంది పెడుతుంది. రోహిణి ఇచ్చే విచిత్ర సమాధానాలతో స్వామీజీకి కూడా చిరాకు వస్తుంది. ఇలా ప్రశ్నలు అడిగి ఉపయోగం లేదని భావించిన అతడు చివరకు మరో మార్గాన్ని ఎంచుకుంటాడు. "ఇలాంటి మొండి దయ్యాలు మాటలకు లొంగవు. ప్రత్యేక పూజ చేయాలి" అంటూ కొత్త డ్రామా మొదలుపెడతాడు.
అందరూ చూస్తుండగానే "బడిత పూజ" పేరుతో చేతిలో ఉన్న కర్రతో రోహిణిని కొట్టడం ప్రారంభిస్తాడు. ఊహించని ఈ పరిణామంతో రోహిణి ఒక్కసారిగా భయంతో అరుస్తుంది. తనకు దయ్యం పట్టలేదని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఇంట్లో ఉన్నవారంతా కూడా ఇది దయ్యాన్ని తరిమే ప్రక్రియలో భాగమేనని నమ్ముతూ చూస్తుంటారు. అక్కడితో ఆగని స్వామీజీ, తన దగ్గర ఉన్న ప్రత్యేక కర్రలను మనోజ్ చేతికి ఇస్తాడు. "రోజుకు మూడుసార్లు ఈ కర్రలతో కొట్టు. ఇలా వారం రోజుల పాటు చేస్తే దయ్యం పూర్తిగా బయటకు వెళ్లిపోతుంది" అంటూ సూచనలు ఇస్తాడు. స్వామీజీ మాటలు విన్న మనోజ్ ఆశ్చర్యపోయినా, ప్రభావతి మాత్రం వాటిని పూర్తిగా నమ్మేస్తుంది.
రోహిణి మాత్రం ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక ఆందోళన చెందుతుంది. తనకు దయ్యం పట్టలేదని చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో ఆమె మరింత ఇబ్బందుల్లో పడుతుంది. మరోవైపు స్వామీజీ చెప్పిన చికిత్స నిజంగా కొనసాగుతుందా? రోహిణి ఈ డ్రామా నుంచి బయటపడగలదా? లేక ఆమె దాచిపెడుతున్న రహస్యాలే ఇప్పుడు ఆమెకు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయా? అనే ఉత్కంఠ మధ్య నేటి ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications