Gundeninda Gudigantalu June 10th Episode: విద్యకు బాలు వార్నింగ్.. మనోజ్‌, ప్రభావతిని చితక్కొట్టిన రోహిణి..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోహిణికి దయ్యం పట్టిందని నమ్మిన ప్రభావతి, స్వామీజీ చెప్పినట్లుగా ఆమెను కర్రతో కొట్టించాలని నిర్ణయిస్తుంది. ఇప్పటికే దెబ్బలతో బాధపడుతున్న రోహిణి, తన అబద్ధాలు బయటపడతాయనే భయంతో నిజం చెప్పలేక తీవ్ర ఆవేదన చెందుతుంది. మనోజ్ భయపడుతూనే రోహిణిని కొట్టగా, ఆమె నొప్పితో అరవడం చూసి ప్రభావతి దయ్యం ప్రభావమేనని మరింత నమ్ముతుంది. దీంతో రోహిణి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది.

మరోవైపు, కస్టమర్‌ను రైల్వే స్టేషన్‌కు చేర్చేందుకు నో-ఎంట్రీలో వెళ్లిన బాలు కారును ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ సీజ్ చేస్తాడు. అయితే మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ జోక్యం చేసుకుని అరుణ్ వ్యక్తిగత కక్షతో వ్యవహరించాడని మందలిస్తాడు. వెంటనే కారు విడుదల చేయాలని ఆదేశించి, బాలుకు కోపాన్ని తగ్గించుకోవాలని విలువైన సలహా ఇస్తాడు. మీనా సహాయంతోనే ఈ సమస్య పరిష్కారమైందని తెలుసుకున్న బాలు, ఇంటికి వెళ్లి తన భార్యకు క్షమాపణ చెబుతూ ప్రేమగా కౌగిలించుకుంటాడు.ఇక శృతి తన పెళ్లి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, హనీమూన్‌కు వెళ్లాలని కోరగా రవి ఆమె కోరికలు నెరవేర్చేందుకు మాట ఇస్తాడు. ఒకవైపు రోహిణి దయ్యం డ్రామా ఉత్కంఠను పెంచగా, మరోవైపు బాలు-మీనా మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 702 june 10th 2026 here is full story

Courtesy: Jio hotstar

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మీనా చేసిన సహాయం వల్ల తన కారు తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న బాలు, భార్యపై మరింత గౌరవం పెంచుకోవడం ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ చెప్పిన మాటల ద్వారా తన కారు విడుదల కావడానికి అసలు కారణం మీనానే అని తెలుసుకున్న బాలు ఇంటికి వచ్చిన వెంటనే ఆమె వద్దకు వెళ్తాడు. ఉదయం కోపంలో మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెబుతూ, తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాడు. అయితే మీనా మాత్రం వెంటనే కరిగిపోకుండా కాస్త సీరియస్‌గా వ్యవహరిస్తుంది. దీంతో ఆమెను నవ్వించేందుకు, ఇంప్రెస్ చేయడానికి బాలు ప్రయత్నిస్తాడు.

మీనా పరిచయాలు, మనుషులను కలుపుకుపోయే తీరు చూసి బాలు ఆశ్చర్యపోతాడు. "ఇలాగే నీ సర్కిల్ పెంచుకుంటూ పోతే త్వరలోనే నువ్వు పెద్ద లీడర్ అయిపోతావేమో" అంటూ సరదాగా పొగిడేస్తాడు. దీనికి మీనా కూడా తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తికి అందరితో మంచిగా ఉండటం అవసరమని, కస్టమర్లను గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతుంది. మీనా ఆలోచనా విధానం చూసి బాలు మరింత ఆశ్చర్యపోతాడు. అయితే అక్కడితో ఆగకుండా మీనా బాలుకు ఒక ముఖ్యమైన సూచన కూడా చేస్తుంది. బయట జరిగే గొడవలను ఇంటికి తీసుకురావద్దని, బయటవారిపై ఉన్న కోపాన్ని కుటుంబ సభ్యులపై చూపించడం సరికాదని గట్టిగా హెచ్చరిస్తుంది. తన కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంది. మీనా మాటల్లోని నిజాన్ని గుర్తించిన బాలు ఇకపై జాగ్రత్తగా ఉంటానని హామీ ఇస్తాడు.

ఇక మరోవైపు రవి, శృతి తమ పెళ్లి వార్షికోత్సవాన్ని ఈసారి చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలను ఇంట్లోని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. ఒక్కసారిగా ఇన్విటేషన్ కార్డులు చూసిన ఇంటి సభ్యులంతా ఆశ్చర్యానికి గురవుతారు. అనివర్సరీ వేడుకలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు రవి వెల్లడిస్తాడు. ముఖ్యంగా ప్రభావతి డాన్స్ ప్రదర్శన కూడా ఉండబోతుందని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు ఉండవు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ కార్యక్రమం ద్వారా తన ప్రతిభను అందరికీ చూపించే అవకాశం వచ్చిందని ఉత్సాహంగా చెబుతుంది.

వేడుకల ఏర్పాట్లలో కూడా అందరికీ బాధ్యతలు అప్పగిస్తారు. పూల అలంకరణ బాధ్యతను మీనా తీసుకుంటుంది. తన అనుభవంతో అద్భుతమైన ఫ్లవర్ డెకరేషన్ చేస్తానని మాట ఇస్తుంది. బాలు కూడా తన కార్లను వేడుకల కోసం ఉపయోగించుకోవచ్చని చెబుతూ సహకారం అందిస్తాడు. పార్లర్ అక్క శృతి, రవిలకు ప్రత్యేకంగా మేకప్ చేస్తానని చెప్పడంతో వేడుకలపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ ఆనంద వాతావరణంలో మనోజ్ మాత్రం కాస్త మౌనంగా కనిపిస్తాడు. దీనిని గమనించిన బాలు, శృతి-రవిలకు షోరూమ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని సూచిస్తాడు. ఆ మాట వినగానే మనోజ్ ఒక్కసారిగా తడబడిపోతాడు. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. చివర్లో రవి, అనివర్సరీ ఆహ్వాన పత్రికలను ఇంకెవరికెవరికీ ఇవ్వాలో తన తండ్రిని అడుగుతాడు. దీంతో ఇంట్లో అనివర్సరీ వేడుకల సందడి మొదలవుతుంది.

ఇక పిసోడ్‌లో కథ ఊహించని మలుపు తిరిగింది. ఇంటికి చేరుకున్న ప్రకాష్, తాతయ్యకు తాను తీసుకొచ్చిన ఫోటోలను చూపిస్తాడు. వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తాతయ్య, వెంటనే బాలుతో మాట్లాడాలని కోరుతాడు. ఫోన్‌లో మాట్లాడిన తాతయ్య, ఫోటోల్లో కనిపించిన ఒక అమ్మాయి గురించి కీలక సమాచారం చెబుతాడు. "ఆ అమ్మాయే ఆ ఫోన్ అక్కడ వదిలేసి వెళ్లింది" అని స్పష్టంగా చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు. వెంటనే ఆ ఫోటోను తనకు పంపించాలని ప్రకాష్‌ను కోరుతాడు. కొద్దిసేపటికే ప్రకాష్ పంపిన ఫోటోను చూసిన బాలు ఆశ్చర్యంతో నిలిచిపోతాడు. ఫోటోలో ఉన్నది విద్య అని గుర్తిస్తాడు. ఒకసారి కాదు, రెండుసార్లు చూసి మరీ కన్ఫామ్ చేసుకుంటాడు. అయితే తన అనుమానాన్ని పూర్తిగా నివృత్తి చేసుకోవడానికి తాతయ్యను మరోసారి అడుగుతాడు. దీనికి తాతయ్య, "నేను మాత్రమే కాదు, నీ అమ్మ కూడా చూసింది. ఆ అమ్మాయే అని ఇద్దరం గుర్తించాం" అని చెప్పడంతో బాలు అనుమానాలు నిజమయ్యాయని భావిస్తాడు.

వెంటనే గతంలో జరిగిన సంఘటనలన్నీ బాలు కళ్లముందు మెదులుతాయి. తన ఫోన్ పోవడం, రోహిణి ప్రవర్తన, పార్టీలో జరిగిన ఘటనలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. ఈ వ్యవహారంలో రోహిణి, విద్య ఇద్దరూ కలిసి ఏదో పెద్ద డ్రామా ఆడినట్లు అనిపిస్తుందని ఆలోచిస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మీనా, బాలు ఆందోళనగా ఉండటాన్ని గమనించి ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. అప్పుడు బాలు అసలు విషయం చెబుతాడు. "నా ఫోన్ దొంగిలించింది విద్య. రోహిణి, విద్య ఇద్దరూ కలిసి నాటకం ఆడినట్లు ఉంది" అని చెప్పడంతో మీనా కూడా ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. తన తమ్ముడు జీవితాన్ని నాశనం చేసిన ఘటన వెనుక కూడా వీళ్లిద్దరి హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తుంది.

"గుణకు ఆ వీడియో పంపింది కూడా వీళ్లే అయి ఉంటారు. ఇన్ని రోజులు మనల్ని మోసం చేశారు" అంటూ మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే వెళ్లి నిజం తేల్చుకుంటానంటూ బయలుదేరేందుకు ప్రయత్నిస్తుంది. అయితే బాలు ఆమెను అడ్డుకుంటాడు. ఈ విషయం ఆవేశంతో కాకుండా తెలివిగా డీల్ చేయాలని, నిజాన్ని బయటకు తీయడానికి సరైన సమయం కోసం వేచి చూడాలని చెబుతాడు. తానే వెళ్లి విద్యను ప్రశ్నిస్తానని చెప్పి ఆమె ఇంటికి బయలుదేరుతాడు.

ఇక విద్య ఇంటికి చేరుకున్న బాలు అనూహ్యంగా అక్కడ కనిపించడంతో ఆమె ఒక్కసారిగా కంగారుపడుతుంది. "ఇలా అకస్మాత్తుగా ఎందుకు వచ్చావు?" అని అడగగా, "కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నేరుగా రావాల్సిందే" అంటూ బాలు తన ఫోన్‌లో ఉన్న ఫోటోలను చూపిస్తాడు. ఆ ఫోన్‌ను గుర్తుపట్టావా అని ప్రశ్నిస్తాడు. మొదట విద్య ఏమీ తెలియనట్టుగా నటిస్తుంది. కానీ బాలు వరుసగా ప్రశ్నలు వేయడంతో కథను మరో దారి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. తన ఫోన్ పాడైపోవడంతో ఆ ఫోన్‌ను రెండు వేల రూపాయలకు కొనుగోలు చేశానని చెబుతుంది. అయితే బాలు మాత్రం ఆమె మాటలను నమ్మడు. "అందులో నా ఫోటోలు ఉన్నాయి. అవి చూడలేదా?" అని ప్రశ్నిస్తాడు.

దీనికి విద్య కొత్త కథ చెబుతుంది. ఫోన్‌లో చార్జింగ్ లేకపోవడంతో ఒక రోజు మొత్తం అలాగే పెట్టానని, మరుసటి రోజు బయటికి వెళ్లినప్పుడు ఫోన్ పోయిందని చెబుతుంది. ఆమె మాటల్లోని తడబాటు, అస్పష్టతను గమనించిన బాలు మరింత అనుమానపడతాడు. అయినప్పటికీ విద్య తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అనవసరంగా నిందలు వేయొద్దని అంటుంది. చివరకు సహనం కోల్పోయిన బాలు విద్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. "నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఈ రోజు నువ్వు అబద్ధాలతో తప్పించుకోవచ్చు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఆ రోజు నిన్ను కాపాడేందుకు ఎవరూ రారు. తప్పు చేసిన వాళ్లకు సహాయం చేస్తున్నావని నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు నీ అసలు రూపం అందరికీ తెలుస్తుంది" అంటూ హెచ్చరిస్తాడు. బాలు మాటలు విన్న విద్య బయటకు ధైర్యంగా కనిపించినా, లోపల మాత్రం భయంతో వణికిపోతుంది. మరోవైపు బాలు కూడా నిజం బయటకు తీసుకురావాలనే పట్టుదలతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక విద్య ఇంటి నుంచి తిరిగి వచ్చిన బాలు తీవ్ర అసహనం, కోపంతో కనిపిస్తాడు. అతడి ముఖంలో ఆవేదనను గమనించిన మీనా వెంటనే ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. దీంతో బాలు జరిగిన విషయాలన్నీ వివరంగా చెబుతాడు. విద్య చాలా తెలివిగా వ్యవహరించి తన అనుమానాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని, ప్రతి ప్రశ్నకు కొత్త అబద్ధం చెప్పి తప్పించుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "నా ఫోన్‌ను రెండు వేల రూపాయలకు కొనుగోలు చేశానని చెబుతోంది. అందులో ఉన్న ఫోటోలు కూడా చూడలేదట. నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు వెంటనే కొత్త కథ చెప్పింది. అసలు విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసింది" అంటూ బాలు మండిపడతాడు. రోహిణి స్నేహం వల్లే విద్య కూడా అదే తరహాలో అబద్ధాలు చెప్పడం నేర్చుకుందని విమర్శిస్తాడు. ఏదో ఒక రోజు రోహిణి, విద్య ఇద్దరి అసలు రూపాన్ని అందరి ముందు బయటపెడతానని శపథం చేస్తాడు.

బాలు మాటలు విన్న మీనా కూడా తీవ్రంగా బాధపడుతుంది. ఇన్నాళ్లు తనతో ఎంతో స్నేహంగా ఉన్న విద్య ఇలా మోసం చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా రోహిణి కూడా తమ కుటుంబ జీవితాలతో ఆటలాడేందుకు ప్రయత్నించిందనే అనుమానం రావడంతో మరింత ఆగ్రహానికి గురవుతుంది. తన తమ్ముడి జీవితాన్ని నాశనం చేసిన కుట్ర వెనుక వీరిద్దరూ ఉండొచ్చనే అనుమానంతో భావోద్వేగానికి లోనవుతుంది. అయితే ఈ సంభాషణ మొత్తం రోహిణి దొంగచాటుగా వింటుంది. బాలు విద్యను కలిసినా, ఆమె తమ రహస్యాలను బయటపెట్టలేదని తెలుసుకుని ఊపిరిపీల్చుకుంటుంది. వెంటనే విద్యను కలవాలని నిర్ణయించుకుని ఆమె దగ్గరకు వెళ్తుంది. అక్కడికి చేరుకున్న వెంటనే విద్యకు క్షమాపణలు చెబుతుంది. తనను తప్పుగా అర్థం చేసుకుని కఠినంగా మాట్లాడినందుకు బాధపడుతున్నానని అంటుంది.

దీంతో విద్య కూడా భావోద్వేగానికి గురవుతుంది. "నువ్వు నన్ను యూజ్‌లెస్ అన్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ నీ కోసం నేను ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు. నువ్వు కోరుకున్న జీవితం కోసం నేను కూడా పోరాడుతున్నాను" అంటూ తన మనసులోని బాధను బయటపెడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్లీ స్నేహబంధాన్ని బలపరుచుకుంటారు. అయితే ఆ తర్వాత విద్య ఒక కీలక హెచ్చరిక చేస్తుంది. బాలు చాలా తెలివిగా నిజాలను బయటకు రాబట్టే ప్రయత్నం చేశాడని, ఈసారి ఎలాగో అబద్ధాలతో తప్పించుకున్నానని, కానీ భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారొచ్చని చెబుతుంది. "ఏదో ఒక రోజు బాలు మన వెనుక ఉన్న అసలు నిజాన్ని కనిపెడతాడు. ఆ రోజు మనం ఎలా తప్పించుకుంటామో తెలియడం లేదు" అంటూ తన భయాన్ని వ్యక్తం చేస్తుంది.

విద్య మాటలు విన్న రోహిణి కూడా కంగారుపడుతుంది. వెంటనే ఈ విషయాన్ని గుణకు చెప్పి అప్రమత్తం చేయాలని నిర్ణయిస్తుంది. ఇకపై ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉందని చెబుతుంది. ఇదే సమయంలో మరుసటి రోజు తమ ఇంట్లో జరగబోయే రవి-శృతి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకకు తప్పకుండా రావాలని విద్యను ఆహ్వానిస్తుంది. ఇక రాత్రి సమయంలో కథ మరో ఆసక్తికర మలుపు తిరుగుతుంది. స్వామీజీ సూచించిన "బడిత పూజ"ను కొనసాగించాలని నిర్ణయించిన మనోజ్, భయపడుతూనే రోహిణి గదిలోకి వెళ్తాడు. రోహిణి తనలో ఎలాంటి దయ్యం లేదని, ఇప్పటికే మానసికంగా చాలా కృంగిపోయానని వేడుకున్నా అతడు వినిపించుకోడు. స్వామీజీ మాటలను నమ్మిన మనోజ్ మళ్లీ కర్రతో కొట్టేందుకు సిద్ధమవుతాడు.

అప్పటికే విసిగిపోయిన రోహిణి ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయిస్తుంది. ఈసారి నిజంగానే దయ్యం పట్టినట్లు నటిస్తూ మనోజ్‌ను భయపెట్టాలని ప్లాన్ చేస్తుంది. అతడు కర్రతో కొట్టగానే ఒక్కసారిగా ఆ కర్రను లాక్కొని మనోజ్‌పై తిరగబడుతుంది. వరుసగా దెబ్బలు కొడుతూ దయ్యంలా ప్రవర్తించడంతో మనోజ్ భయంతో వణికిపోతాడు. దెబ్బలు తట్టుకోలేక మనోజ్ గది నుంచి పరుగెత్తుకుంటూ కిందికి వస్తాడు. అప్పటికే ప్రభావతి మీనాక్షితో ఫోన్‌లో మాట్లాడుతూ రోహిణి తండ్రి దాచిన డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనోజ్ వచ్చి రోహిణిలో నిజంగానే తన తండ్రి ఆత్మ ప్రవేశించిందని చెబుతాడు. అంతేకాకుండా మలేషియా భాషలో కూడా మాట్లాడుతోందని చెప్పడంతో ప్రభావతి మరింత భయపడిపోతుంది.

ఈ అవకాశాన్ని కూడా రోహిణి పూర్తిగా ఉపయోగించుకుంటుంది. దయ్యం పట్టిన వ్యక్తిలా నటిస్తూ ప్రభావతి దగ్గరకు వచ్చి ఆమెను కూడా భయపెడుతుంది. తన తండ్రి ఆస్తుల గురించి పదే పదే మాట్లాడొద్దని హెచ్చరిస్తూ కర్రతో వెంటపడుతుంది. దీంతో ప్రభావతి, మనోజ్ ఇద్దరూ ప్రాణభయంతో పరుగులు పెడతారు. కొంతసేపు అందరినీ భయపెట్టిన తర్వాత రోహిణి ఒక్కసారిగా కింద పడిపోతుంది. దీంతో ప్రభావతి నిజంగానే ఆత్మ బయటకు వెళ్లిపోయిందని నమ్ముతుంది. కొద్దిసేపటి తర్వాత లేచిన రోహిణి, తనకు ఏమీ గుర్తులేదన్నట్లు నటిస్తూ అమాయకంగా ప్రశ్నలు అడుగుతుంది. దీంతో ప్రభావతి పూర్తిగా నమ్మేసి, ఆత్మ వెళ్లిపోయే ముందు ఆస్తుల రహస్యం చెప్పకపోవడంపై బాధపడుతుంది.

మరోవైపు మరుసటి రోజు రవి తన వెడ్డింగ్ యానివర్సరీ రోజు కూడా రెస్టారెంట్ పనుల్లో బిజీగా కనిపిస్తాడు. ప్రత్యేక ఆర్డర్ రావడంతో విధులకు హాజరవుతాడు. అక్కడికి వచ్చిన బాస్ నీతూ, "ఈరోజు నీ యానివర్సరీ కదా, ఇంట్లో ఏర్పాట్లు చూసుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చావు?" అని అడుగుతుంది. పని పట్ల బాధ్యతతో వచ్చానని చెప్పడంతో రవి అంకితభావాన్ని ఆమె ప్రశంసిస్తుంది. అయితే అదే సమయంలో ఓ సహోద్యోగి ఫుడ్ సర్వ్ చేస్తూ జారి కిందపడిపోతాడు. ఖరీదైన ఆర్డర్ మొత్తం నేలపై పడిపోవడంతో నీతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ పరిస్థితిలో రవి ఎలా స్పందిస్తాడు? తన సహోద్యోగిని కాపాడతాడా? లేక బాస్ నిర్ణయానికి మద్దతు ఇస్తాడా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

Read more about: gunde ninda gudi gantalu balu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X