Gundeninda Gudigantalu June 11th Episode: శృతి మిస్సింగ్, యానివర్సరీ ఫంక్షన్‌లో రవి టెన్షన్, బాలు-మీనా గాలింపు
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కుటుంబ అనుబంధాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీనా చేసిన సహాయం వల్ల తన కారు తిరిగి వచ్చిందని తెలుసుకున్న బాలు, ఆమెకు క్షమాపణలు చెబుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అయితే మీనా బయట సమస్యలను ఇంటికి తీసుకురావొద్దని, కోపాన్ని కుటుంబ సభ్యులపై చూపొద్దని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు రవి, శృతి తమ వెడ్డింగ్ యానివర్సరీని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించి ఇంట్లో వారందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ప్రభావతి డాన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని సంబరపడగా, మీనా ఫ్లవర్ డెకరేషన్ బాధ్యతలు తీసుకుంది.
ఇక కథలో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రకాష్ పంపిన ఫోటోలో విద్యను గుర్తించిన బాలు, తన ఫోన్ మిస్సింగ్ వెనుక ఆమె హస్తం ఉందని అనుమానిస్తాడు. వెంటనే విద్య ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, ఆమె అబద్ధాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో బాలు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని మీనాతో పంచుకోగా, ఆమె కూడా రోహిణి-విద్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ సంభాషణను రోహిణి దొంగచాటుగా విని ఊపిరి పీల్చుకుంటుంది. విద్య తన రహస్యాన్ని బయటపెట్టలేదని తెలుసుకుని ఆమెకు క్షమాపణలు చెబుతుంది. ఇదే సమయంలో బాలు తమ నిజాలు ఎప్పటికైనా బయటపెడతాడని ఇద్దరూ భయపడతారు. మరోవైపు స్వామీజీ చెప్పిన బడిత పూజ పేరుతో మనోజ్ మళ్లీ రోహిణిని కొట్టేందుకు ప్రయత్నించగా, ఈసారి రోహిణి దయ్యం పట్టినట్లు నటించి మనోజ్‌ను, ప్రభావతిని భయపెడుతుంది. చివరకు అందరూ నిజంగానే ఆత్మ వెళ్లిపోయిందని నమ్మడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఎపిసోడ్ చివర్లో రవి రెస్టారెంట్‌లో ఎదురైన సమస్యతో కొత్త ఉత్కంఠకు తెరలేచింది.

Courtesy: Jio hotstar
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, భావోద్వేగాలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రవి-శృతి మధ్య ఏర్పడిన అపార్థం కథను కొత్త మలుపు తిప్పింది. అదే సమయంలో వారి పెళ్లిరోజు వేడుకలు ప్రారంభం కావడంతో ఇంట్లో ఆనందం, మరోవైపు రవి మనసులో టెన్షన్ కలిసి ఆసక్తికరమైన పరిస్థితిని సృష్టించాయి.. ఎపిసోడ్ ప్రారంభంలో రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన కథకు కీలక మలుపుగా మారింది. ఓ ఉద్యోగి చేసిన పొరపాటుపై బాస్ నీతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, రవి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తాడు. తన పెళ్లిరోజు అయినప్పటికీ ఒక ముఖ్యమైన ఆర్డర్ పూర్తి చేసి వెళ్తానని చెబుతాడు. ఇదే సమయంలో కిచెన్‌లోకి వెళ్తున్న నీతూ కింద పడిన నూనెను గమనించకుండా జారి పడిపోతుంది. కాలి నొప్పితో బాధపడుతున్న ఆమెను రవి వెంటనే ఎత్తుకుని బయటకు తీసుకొస్తాడు.
అయితే విధి వింతగా అదే సమయంలో అక్కడికి శృతి చేరుకుంటుంది. రవి తన బాస్‌ను చేతుల్లో ఎత్తుకుని రావడం చూసిన శృతి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. అసలు విషయం తెలుసుకోకుండా అపార్థం చేసుకుని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రవి ఎంతగా పిలిచినా, వివరణ ఇవ్వాలని ప్రయత్నించినా వినకుండా వెళ్లిపోవడం అతడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన నీతూ వెంటనే శృతికి ఫోన్ చేసి నిజం చెప్పాలని సూచిస్తుంది. కానీ శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో రవి మరింత కంగారుపడతాడు.
మరోవైపు ఇంట్లో రవి-శృతి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల కోసం అందరూ సిద్ధమవుతుంటారు. ప్రత్యేకంగా రెడీ అయిన మీనా హాల్లోకి రావడంతో బాలు ఆమె అందాన్ని చూసి మైమరచిపోతాడు. "రోజురోజుకీ నీ వయసు తగ్గిపోతోంది" అంటూ భార్యను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దీనికి మీనా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ, "ఈరోజు పార్టీ కదా.. మందు తాగడానికి పర్మిషన్ కోసం ఇలా పొగడ్తలు కురిపిస్తున్నారా?" అంటూ ఆటపట్టిస్తుంది. దీంతో బాలు అమాయకంగా ఫీలవ్వడం ప్రేక్షకులకు నవ్వులు పంచింది.
ఇదిలా ఉండగా, ఫంక్షన్‌కు వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతుంది. ఇంట్లో అందరూ శృతి, రవి కోసం ఎదురుచూస్తుంటారు. కానీ రవి మాత్రం ఫోన్ చేతిలో పట్టుకుని శృతిని సంప్రదించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరకు ఇంటికి చేరుకుని, "శృతి డబ్బింగ్ పనిమీద వెళ్లింది. అక్కడి నుంచి నేరుగా ఫంక్షన్ హాల్‌కి వస్తుంది" అంటూ పరిస్థితిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతడి ముఖంలో కనిపించిన ఆందోళనను బాలు, మీనా వెంటనే గుర్తిస్తారు. ఇంట్లోని వారందరినీ ముందుగా ఫంక్షన్ హాల్‌కు పంపించిన తర్వాత బాలు, మీనా రవిని కూర్చోబెట్టి అసలు విషయం అడుగుతారు. దీంతో రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన మొత్తం రవి వారికి వివరిస్తాడు. శృతి అపార్థం చేసుకుని వెళ్లిపోయిందని, ఫోన్ కూడా ఎత్తడం లేదని బాధపడతాడు. ఈ సమయంలో మీనా స్పందిస్తూ, "శృతి ఫోన్ ఎత్తి ఉంటే నేను మాట్లాడి పరిస్థితిని సర్దుబాటు చేసేదాన్ని" అని అంటుంది.
అయితే బాలు రవికి ధైర్యం చెబుతాడు. "ఇందులో నీ తప్పు ఏమీ లేదు. శృతి కొంచెం త్వరగా రియాక్ట్ అవుతుంది. కానీ నిజం తెలుసుకున్నాక తప్పకుండా వస్తుంది. నువ్వు ఫంక్షన్ హాల్‌కి వెళ్లి ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. మేమిద్దరం శృతిని వెతికి తీసుకొస్తాం" అంటూ భరోసా ఇస్తాడు. వారి మాటలతో కాస్త ఊరట పొందిన రవి ఫంక్షన్ హాల్‌కు బయలుదేరుతాడు. ఫంక్షన్ హాల్‌లో పెళ్లిరోజు వేడుకలు ఘనంగా ప్రారంభమవుతాయి. బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా వస్తుండగా, అందరూ శృతి గురించి ప్రశ్నిస్తుంటారు. కానీ రవి మాత్రం తన మనసులో ఉన్న ఆందోళనను బయటపడనీయకుండా "ఆన్ ది వేలో ఉంది.. ఇంకొంచెంలో వస్తుంది" అంటూ అందరినీ మేనేజ్ చేస్తాడు. అతిథులను ఆహ్వానిస్తూ, కార్యక్రమం సజావుగా సాగేందుకు ప్రయత్నిస్తాడు.
ఇక ఫంక్షన్ ప్రారంభమయ్యే సమయానికి శృతి తల్లిదండ్రులు శోభ, సత్యం కూడా హాల్‌కు చేరుకుంటారు. అయితే ఈ వేడుకలకు రావడం శ్రుతి తండ్రిసురేంద్రకి అంతగా ఇష్టం ఉండదు. అయినప్పటికీ భార్య శోభ ఒత్తిడి చేయడంతో ఆయన ఫంక్షన్‌కు వస్తాడు. వారిని చూసిన రవి ఒక్కసారిగా కంగారుపడతాడు. శృతి గురించి అడిగితే ఏమి చెప్పాలా అనే టెన్షన్‌తో ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ వారి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే శోభ మాత్రం పరిస్థితిని సాధారణంగా తీసుకుంటుంది. "శృతి ఏదైనా పనిలో బిజీగా ఉండి ఉండొచ్చు. దానిని పట్టించుకుని బాధపడకండి" అంటూ తన భర్తకు ధైర్యం చెబుతూ లోపలికి తీసుకువెళుతుంది. హాల్‌లోకి వెళ్లగానే ప్రభావతి వారికి ఘనంగా స్వాగతం పలుకుతుంది.
ఈ సమయంలో సత్యం తన పాత అలవాటు ప్రకారం ప్రభావతిని "సార్" అంటూ సంబోధించడం ఆసక్తికరంగా మారుతుంది. పక్కనే ఉన్న మీనాక్షి "ఇంకా సార్ అంటారా? ఇప్పుడు బావగారు అని పిలవొచ్చు కదా" అని సరదాగా అనగా, సత్యం మాత్రం "ఆయన నాకు మొదటి నుంచి అధికారి. ఆ గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది" అని హుందాగా సమాధానం చెబుతాడు. ఇంతలో శోభ తమ కూతురు శృతి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తుంది. దానికి ప్రభావతి "డబ్బింగ్ పనిమీద వెళ్లింది. అక్కడి నుంచి నేరుగా వస్తుంది" అని సమాధానం ఇస్తుంది. అయితే ఈ మాటలు విన్న శోభ, సత్యం ఇద్దరూ కొంత ఆశ్చర్యానికి గురవుతారు. "రవి మీకు చెప్పలేదా?" అని ప్రభావతి అడగగా, "లేదు.. అతడు ఏదో పనిలో బిజీగా కనిపించాడు" అని సమాధానం ఇస్తారు.
ఈ విషయం ప్రభావతిలో కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది. వెంటనే ఆమె రవి దగ్గరకు వెళ్లి శృతి విషయం గురించి అడుగుతుంది. అయితే రవి మాత్రం తన టెన్షన్‌ను దాచిపెట్టి "అత్తయ్య, అనవసరంగా ఆందోళన పడకండి. శృతి వస్తోంది. దారిలోనే ఉంది" అంటూ మేనేజ్ చేస్తాడు. అనంతరం తన అత్తామామలతో మాట్లాడి అదే సమాధానం చెబుతాడు. అయినప్పటికీ శ్రుతి తండ్రి సురేంద్రకు ఏదో తేడాగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని భార్య శోభతో చెప్పగా, ఆమె వెంటనే "అనవసరంగా అనుమానాలు పెట్టుకోకండి. వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు. అందుకే శృతి మన ఇంటికి రావడం లేదు. ప్రశాంతంగా ఉండండి" అంటూ భర్త నోరు మూయిస్తుంది.
ఇక ఫంక్షన్‌లో శృతి గురించి ఎవరూ అడగకుండా ఉండేందుకు రవి కొత్త ప్లాన్ వేస్తాడు. ప్రభావతిని ఆమె డాన్స్ స్కూల్ పిల్లలతో కలిసి స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వమని కోరుతాడు. దీంతో అందరి దృష్టి కొంతసేపు వినోద కార్యక్రమాలపైకి మళ్లుతుంది. ఇదే సమయంలో బాలు స్నేహితుడు రాజేష్ కూడా రవికి ధైర్యం చెబుతాడు. "అనవసరంగా టెన్షన్ పడకు. శృతి కోసం బాలు, మీనా వెళ్లారు. వాళ్లు తప్పకుండా ఆమెను తీసుకొస్తారు. నువ్వు మాత్రం నవ్వుతూ అందరినీ మేనేజ్ చేయి" అని సలహా ఇస్తాడు. దీంతో రవికి కొంత ధైర్యం వస్తుంది.
అయితే సమయం గడుస్తున్న కొద్దీ శృతి కనిపించకపోవడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుంది. మరోవైపు ప్రభావతి, మీనాక్షి, శోభలను స్టేజ్‌పైకి తీసుకెళ్లి డాన్స్ చేయించడంతో ఫంక్షన్‌లో సరదా వాతావరణం కొనసాగుతుంది. కానీ మనోజ్ మాత్రం రవిని పక్కకు తీసుకెళ్లి "ఏమైందిరా? శృతి ఇంకా ఎందుకు రాలేదు? త్వరగా ఫంక్షన్ ముగిస్తే భోజనం చేసి వెళ్లిపోతాం కదా" అని అడగడంతో రవి ఒక్కసారిగా అసహనానికి గురవుతాడు. "ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా?" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సంఘటనను గమనించిన రోహిణికి అనుమానం మొదలవుతుంది. "శృతి-రవిల మధ్య ఏదో పెద్ద గొడవ జరిగి ఉంటుంది. అందుకే శృతి ఫంక్షన్‌కు రాలేదు" అని తనలో తాను అనుకుంటుంది. దీంతో కథలో కొత్త ఉత్కంఠ మొదలవుతుంది.
మరోవైపు బాలు, మీనా శృతి కోసం వెతుకులాట కొనసాగిస్తుంటారు. మొదట ఆమె డబ్బింగ్ స్టూడియోకు వెళ్లి ఆరా తీస్తారు. కానీ అక్కడ కూడా శృతి కనిపించకపోవడంతో మీనా మరింత టెన్షన్ పడుతుంది. "శృతి ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే బాలు మాత్రం ధైర్యంగా "నువ్వు కంగారు పడకు. ఎక్కడ ఉన్నా శృతిని కనిపెట్టి ఫంక్షన్ హాల్‌కు తీసుకువస్తాం" అని భరోసా ఇస్తాడు. ఇలా ఒకవైపు ఫంక్షన్ హాల్‌లో నవ్వులు, డ్యాన్స్‌లు, సంబరాలు కొనసాగుతుండగా.. మరోవైపు శృతి ఆచూకీ కోసం బాలు, మీనా చేస్తున్న ప్రయత్నాలు కథను ఉత్కంఠభరితంగా మార్చాయి. అసలు శృతి ఎక్కడికి వెళ్లింది? రవి అపార్థాన్ని ఆమె తొలగించుకుంటుందా? బాలు, మీనా ఆమెను వెతికి ఫంక్షన్‌కు తీసుకురాగలరా? లేక ఈ అపార్థం మరింత పెద్ద సమస్యగా మారుతుందా? అనే ప్రశ్నలతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.


Click it and Unblock the Notifications