Gundeninda Gudigantalu June 12th Episode: లాయర్ దగ్గర శృతికి షాక్, సురేంద్రకు సత్యం కౌంటర్, బాలు మీనా వల్లే..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, భావోద్వేగాలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రెస్టారెంట్‌లో తన బాస్ నీతూ జారి పడడంతో రవి ఆమెకు సహాయం చేస్తాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన శృతి, రవి నీతూను ఎత్తుకుని రావడం చూసి అపార్థం చేసుకుని కోపంగా వెళ్లిపోతుంది. రవి ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మరింత ఆందోళన చెందుతాడు. ఇక మరోవైపు ఇంట్లో రవి-శృతి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతాయి. బాలు, మీనా మధ్య జరిగిన సరదా సంభాషణలు నవ్వులు పంచుతాయి. శృతి కనిపించకపోవడంతో రవి పరిస్థితిని కవర్ చేస్తూ ఆమె డబ్బింగ్ పనిలో ఉందని చెబుతాడు.
అయితే అతడి టెన్షన్‌ను గుర్తించిన బాలు, మీనా అసలు విషయం తెలుసుకుని శృతిని వెతకడానికి బయలుదేరుతారు. ఫంక్షన్ హాల్‌లో అతిథులు, బంధువులు శృతి గురించి అడుగుతుండగా రవి అందరినీ మేనేజ్ చేస్తాడు. శృతి తల్లిదండ్రులు కూడా రావడంతో అతడి ఆందోళన మరింత పెరుగుతుంది. అనుమానాలు రాకుండా ప్రభావతి డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయగా వేడుకలు సందడిగా సాగుతాయి. అయితే శృతి ఇంకా రాకపోవడంతో రోహిణికి అనుమానం మొదలవుతుంది. మరోవైపు బాలు, మీనా శృతి కోసం వెతుకుతూనే ఉంటారు. శృతి ఎక్కడ ఉంది? ఆమె అపార్థం తొలగి ఫంక్షన్‌కు వస్తుందా? అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

Courtesy: Jio hotstar
'గుండె నిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కట్టిపడేసింది. యానివర్సరీ ఫంక్షన్ హాల్‌కు అతిథులు ఒక్కొక్కరుగా చేరుకుంటుండగా అందరి నోట ఒకటే ప్రశ్న వినిపిస్తుంది. "శృతి ఎక్కడ?", "ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?" అంటూ వరుస ప్రశ్నలు వేయడంతో రవి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. శృతి కనిపించకపోయినా అసలు విషయం ఎవరికీ తెలియనివ్వకుండా నవ్వుతూ, మేనేజ్ చేస్తూ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతిథుల దృష్టిని మరల్చేందుకు రవి మరో ప్లాన్ వేస్తాడు. తన తల్లి ప్రభావతి, మీనాక్షి అత్తయ్య, శోభలను స్టేజ్‌పైకి పంపించి డాన్స్ చేయిస్తాడు. దీంతో ఫంక్షన్ హాల్‌లో కొంతసేపు సందడి నెలకొంటుంది. ఇదే సమయంలో సత్యం, సురేంద్ర మధ్య కూడా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంటుంది. గతంలో తనను అవమానించిన సురేంద్రకు సత్యం సెటైరికల్‌గా సమాధానం ఇస్తూ, "మీరు కూడా మీ ఆవిడకు డాన్స్ నేర్పించి ఉంటే మీకూ మంచి పేరు వచ్చేది" అని చెప్పడంతో సురేంద్ర నిశ్శబ్దంగా మారిపోతాడు.
శృతి కనిపించకపోవడంతో రవి ఆందోళన మరింత పెరుగుతుంది. వెంటనే బాలు ఫోన్ చేసి శృతి గురించి అడుగుతాడు. "అన్నయ్య, శృతి దొరికిందా? ఎక్కడ ఉంది? త్వరగా తీసుకురా" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అయితే పక్కనే ఉన్న రాజేష్ మాత్రం పరిస్థితిని సరదాగా మార్చేందుకు ప్రయత్నిస్తాడు. "ఇక్కడ మీ అమ్మ, మీనాక్షి అత్తయ్య డ్యాన్సులతో స్టేజ్ మొత్తం ఊగిపోతోంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాను" అని చెప్పడంతో బాలు కూడా తనదైన శైలిలో స్పందిస్తాడు. "ముందే చెప్పి ఉంటే వాళ్ల డ్యాన్సులు చూసాక శృతిని వెతికేవాడిని" అంటూ సరదాగా మాట్లాడతాడు. అయినప్పటికీ చివరికి రవికి ధైర్యం చెబుతూ, "ఏం టెన్షన్ పడకు. శృతిని కచ్చితంగా తీసుకొస్తాం" అని భరోసా ఇస్తాడు. మీనా కూడా అదే మాట చెబుతూ రవికి మానసిక ధైర్యాన్ని అందిస్తుంది.
మరోవైపు బాలు, మీనా శృతి కోసం మరో డబ్బింగ్ స్టూడియోకు వెళ్తారు. అక్కడ శృతి గురించి అడగగా వారికి ఊహించని సమాచారం తెలుస్తుంది. "శృతి కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చింది. ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, లాయర్‌ను కలవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది" అని అక్కడి వారు చెబుతారు. ఈ మాటలు విన్న వెంటనే బాలు, మీనా ఇద్దరూ షాక్‌కు గురవుతారు. ముఖ్యంగా మీనా తీవ్ర ఆందోళన చెందుతుంది. "అసలు శృతి ఏమి ఆలోచిస్తోంది? నిజంగానే లాయర్ దగ్గరకు వెళ్లిందా?" అంటూ కంగారు పడుతుంది. అయితే బాలు మాత్రం పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. "శృతికి కాస్త తొందర ఎక్కువ. కోపంలో ఏదైనా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ముందుగా వెళ్లి అసలు విషయం తెలుసుకుందాం" అంటూ మీనాకు ధైర్యం చెబుతాడు. దీంతో ఇద్దరూ వెంటనే లాయర్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు.
మరోవైపు.. ఫంక్షన్ హాల్‌లో శృతి ఇంకా రాకపోవడంతో రవి పరిస్థితిని మేనేజ్ చేయడానికి నానా తంటాలు పడతాడు. అతిథుల దృష్టిని మరల్చేందుకు ప్రభావతి, మీనాక్షి, శోభలను పదేపదే స్టేజ్‌పైకి పంపించి డాన్స్ చేయిస్తాడు. కొంతసేపటి తర్వాత అలసిపోయిన ప్రభావతి, మీనాక్షి ఇద్దరూ రవిని నిలదీస్తారు. "ఏంట్రా... ఇంకా ఎంతసేపు డాన్స్ చేయాలి? మేమేమైనా గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నామా? ఎందుకింత సాగదీత?" అంటూ ప్రశ్నిస్తారు. అయితే రవి మాత్రం తన ఆందోళనను బయటపడనీయకుండా, "శృతి దారిలోనే ఉంది. ఇంకొద్దిసేపట్లో వస్తుంది. మీరు టెన్షన్ పడొద్దు" అంటూ వారిని సముదాయిస్తాడు. ఇంతటితో ఆగకుండా మరోసారి ప్రోగ్రామ్‌ను కొనసాగించేందుకు తన తండ్రిని స్టేజ్‌పైకి పంపి మాట్లాడిస్తాడు. ఆ తర్వాత మళ్లీ ప్రభావతి, మీనాక్షిలతో డాన్స్ చేయిస్తూ వచ్చిన అతిథులకు వినోదాన్ని అందిస్తాడు. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా కార్యక్రమాన్ని నడిపించేందుకు రవి చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
అయితే శృతి తల్లిదండ్రులు సురేంద్ర, శోభలకు మాత్రం మొదటి నుంచే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఫంక్షన్ ప్రారంభమైనప్పటి నుంచి శృతి కనిపించకపోవడంతో వారి అనుమానాలు మరింత పెరుగుతాయి. వెంటనే రవి దగ్గరకు వెళ్లిన వారు, "అసలు శృతి ఎక్కడ ఉంది? వస్తుందా లేదా? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? చిన్నప్పటి నుంచి శృతి స్వభావం మాకు తెలుసు. నిజం చెప్పు బాబు, మేమేమీ తప్పుగా అనుకోము" అంటూ అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే రవి మాత్రం తన మనసులో ఎంత ఆందోళన ఉన్నా బయటకు తెలియనివ్వకుండా, "అదేం లేదు. శృతి వస్తుంది. దారిలోనే ఉంది" అంటూ మరోసారి అబద్ధంతో పరిస్థితిని కవర్ చేస్తాడు. అయినప్పటికీ సురేంద్ర, శోభలు పూర్తిగా నమ్మలేకపోతారు. "ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పు" అంటూ ఒత్తిడి చేస్తారు. దీంతో రవి, "మరో పది నిమిషాల్లో శృతి వస్తుంది. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి" అంటూ అక్కడి నుంచి తప్పించుకుంటాడు.
మరోవైపు శృతి కోసం వెతుకుతున్న బాలు, మీనా చివరకు ఆమె లాయర్‌ను కలవడానికి వెళ్లినట్లు తెలుసుకుంటారు. వెంటనే అక్కడికి చేరుకుంటారు. అప్పటికే శృతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రెస్టారెంట్‌లో జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ, రవి తనను మోసం చేస్తున్నాడని, నీతూతో సన్నిహితంగా ఉంటున్నాడని భావిస్తుంది. అలాంటి సమయంలో అక్కడికి బాలు, మీనా చేరుకోవడంతో శృతి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. "ఏంటి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?" అని ప్రశ్నిస్తుంది. దీనికి బాలు తనదైన శైలిలో, "మాకు కారు ఉంది కదా... కారులోనే వచ్చాం" అని చెప్పడంతో కాసేపు నవ్వులు పూస్తాయి. ఆ తర్వాత మీనా చాలా ఓపికగా జరిగిన విషయాన్ని శృతికి వివరిస్తుంది. "నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. నీతూ కింద పడిపోవడంతో రవి ఆమెకు సహాయం చేశాడు. అంతే కానీ నువ్వు ఊహించుకున్నట్లు ఏమీ లేదు. అసలు విషయం చెప్పడానికి రవి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. కానీ నువ్వే ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసావు" అని చెబుతుంది.
మీనా మాటలు విన్న తర్వాత శృతి తన తప్పు తెలుసుకుంటుంది. "అవును... నిజమే. రవి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. కానీ కోపంలో నేను వినలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే రవి ఎంత కంగారు పడి ఉంటాడో అర్థమవుతోంది. నిజంగా తప్పు చేశాను" అంటూ బాధపడుతుంది. అయితే శృతి ఇంకా కొద్దిసేపు ఆలస్యం చేయాలని అనుకుంటుంది. "వాడు నా కోసం కాస్త ఎదురుచూడాలి. ఇంకొంచెం సేపు ఉండి వెళ్దాం" అంటుంది. దీంతో బాలు వెంటనే స్పందిస్తూ, "నువ్వు ఇంకొంతసేపు ఆలస్యం చేస్తే వాడి గుండె జారి పడిపోతుంది. ఇప్పటికే వాడు అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చుక్కలు చూస్తున్నాడు. త్వరగా వెళ్దాం" అని అంటాడు. ఇదే సమయంలో శృతి మరో షాక్ ఇస్తుంది. "నేను ఫంక్షన్‌కు వేసుకునే బట్టలు తీసుకోవడం మర్చిపోయాను. ముందు టైలర్ దగ్గరకు వెళ్లాలి" అంటుంది. దీంతో బాలు సరదాగా, "ఏంటి డబ్బుడమ్మా! ఈరోజు నీ పెళ్లిరోజు అని గుర్తుందా లేదా? ఇంకొంచెం ఆలస్యం అయితే రవిని కూడా మరిచిపోయేలా ఉన్నావు" అంటూ సెటైర్ వేస్తాడు.
ఫంక్షన్ ప్రారంభమై చాలా సమయం గడిచినా శృతి కనిపించకపోవడంతో అందరిలోనూ అనుమానాలు మొదలవుతాయి. ముఖ్యంగా శృతి తల్లిదండ్రులు సురేంద్ర, శోభ ఆందోళనకు గురవుతారు. ఇదే సమయంలో ప్రభావతి, సత్యం కూడా రవి దగ్గరకు వెళ్లి అసలు విషయం ఏమిటని ప్రశ్నిస్తారు. అయితే ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న రవి పరిస్థితిని మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ సురేంద్ర మాత్రం కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతాడు. "నా కూతురికి ఏమైంది? ఎక్కడ ఉంది? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది? అసలు నువ్వేం చేశావు?" అంటూ రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మాటల తీరులో కూడా కొంత అవమానకరంగా మాట్లాడటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతుంది.
సురేంద్ర మాటలకు సత్యం కూడా స్పందించబోతుండగా, మరిక్షణంలో పెద్ద గొడవ జరిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే సమయంలో బాలు, మీనా ఫంక్షన్ హాల్‌లోకి అడుగుపెడతారు. వారితో పాటు శృతి కూడా అందంగా రెడీ అయి హాల్‌లోకి రావడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ముఖ్యంగా రవి ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు పడిన టెన్షన్, ఆందోళన ఒక్క క్షణంలో మాయమైపోతాయి. శృతిని చూడగానే అతడి కళ్లలో కనిపించిన రిలీఫ్ ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేస్తుంది. శృతి సురక్షితంగా వచ్చిందని తెలుసుకున్న తర్వాత సత్యం తన ఆగ్రహాన్ని బయటపెడతాడు. సురేంద్ర వైపు తిరిగి, "ఇప్పుడైనా నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడినందుకు అర్థమైందా? ముందు నిజం తెలుసుకోకుండా నిందలు వేయడం మంచిది కాదు" అని అంటాడు. అంతేకాకుండా తనదైన శైలిలో, "ముందే మా బాలుకి నువ్వంటే పడదు. నోట్లో ఉన్న 32 పళ్లతో ఇంటికి వెళ్లాలంటే కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది" అంటూ చురకలు వేస్తాడు. దీంతో సురేంద్ర సైలెంట్ అయిపోతాడు.
అన్ని అపార్థాలు తొలగిపోవడంతో రవి, శృతి యానివర్సరీ వేడుకలను ప్రారంభిస్తారు. ఆలస్యమైనందుకు అందరికీ క్షమాపణలు చెప్పిన తర్వాత కేక్ కట్ చేస్తారు. అయితే ఈ సమయంలో కూడా సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. శృతి, రవి ముందుగా బాలు, మీనాలకు కేక్ తినిపించడంతో ప్రభావతి కొద్దిగా అసంతృప్తిగా కనిపిస్తుంది. మనోజ్ కూడా సరదాగా, "ఉన్న కేక్ మొత్తం వాళ్లకే పెట్టేయండి" అని అనడంతో అక్కడ నవ్వులు పూస్తాయి. వెంటనే రవి, "అయితే మొత్తం కేక్ నువ్వే తీసుకో" అంటూ మనోజ్‌కు కేక్ ఇవ్వబోతాడు. ఈ సందర్భంగా మాట్లాడిన శృతి అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుంది. "ఈరోజు మేమిద్దరం ఇంత సంతోషంగా కలిసి ఉండడానికి ప్రధాన కారణం బాలు, మీనా. మా జీవితంలో వాళ్ల పాత్ర చాలా గొప్పది" అని చెబుతుంది.
తాను చిన్న కుటుంబంలో పెరిగానని, కానీ అత్తింట్లో పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఎలా కలిసిమెలిసి ఉండాలో మీనా నేర్పించిందని చెబుతుంది. "మీనా నాకు వదిన మాత్రమే కాదు, అక్కలా ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకుంటుంది. నా తప్పులను ప్రేమగా చెప్పి సరిదిద్దుతుంది" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంది. తనలో తండ్రి సురేంద్రలాగే కొంత గర్వం, ప్రభావతిలాగే కొంత పెత్తనం ఉంటాయని సరదాగా చెప్పిన శృతి, అలాంటి సందర్భాల్లో మీనా తనను సరైన దారిలో నడిపిస్తుందని పేర్కొంటుంది.
బాలు గురించి కూడా శృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. "మొదట్లో బాలు అంటే నాకు రౌడీలా అనిపించేవాడు. కానీ మీనా పట్ల అతడు చూపించే ప్రేమ, గౌరవం చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది" అంటుంది. "నా దృష్టిలో బెస్ట్ కపుల్ అంటే బాలు-మీనా. వారి దాంపత్యం అందరికీ ఆదర్శం" అని చెప్పడంతో హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోతుంది. ఇక ప్రభావతి గురించి మాట్లాడుతూ, "మా అత్తయ్య ఇంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అందుకే మా ఇంట్లో టీవీ అవసరం లేదు" అంటూ సరదాగా చురక వేస్తుంది. అలాగే తన మామయ్య సత్యం గురించి మాట్లాడుతూ, "మా నాన్న కంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకుంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవిస్తారు. ఆయనంటే నాకు ఎంతో గౌరవం" అని చెబుతుంది.
శృతి తర్వాత రవి కూడా మైక్ తీసుకుని మాట్లాడుతాడు. "ఈరోజు మా పెళ్లి జరగడానికి, మేమిద్దరం కలిసి ఉండడానికి కారణం మా వదిన మీనా. ఆమె లేకపోతే మా జీవితం ఇలా ఉండేది కాదు" అని అంటాడు. అంతేకాకుండా బాలు-మీనా దాంపత్యం తమకు మార్గదర్శకమని, వాళ్లను చూసే తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెబుతాడు. దీంతో బాలు, మీనా ఇద్దరూ భావోద్వేగానికి గురవుతారు. చివరగా కుటుంబ సభ్యులంతా కలిసి డ్యాన్స్‌లు చేస్తూ, నవ్వులు పంచుకుంటూ వేడుకను ఆనందంగా కొనసాగిస్తారు. ఎన్నో అపార్థాలు, టెన్షన్లు, అనుమానాల మధ్య సాగిన యానివర్సరీ వేడుక చివరికి సంతోషకరమైన ముగింపుకు చేరుకోవడంతో ప్రేక్షకులు కూడా ఊరట పొందారు. ఇలా భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, సరదా సన్నివేశాలతో నిండిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications