Gundeninda Gudigantalu June 15th Episode:కానిస్టేబుల్‌తో బాలు గొడవ, రోహిణికి ప్రమాదం, మీనాకు శ్రుతి సర్పైజ్..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో రవి-శృతి వివాహ వార్షికోత్సవం నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు, అపార్థాలు, ఆనందాలు కలగలిసిన ఆసక్తికరమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. యానివర్సరీ వేడుకల కోసం ఫంక్షన్ హాల్‌కు అతిథులు చేరుకుంటుండగా, శృతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా రవిని ప్రశ్నిస్తూ సురేంద్ర, శోభలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. అయితే అసలు విషయం బయటకు రాకుండా ఉండేందుకు రవి తెలివిగా వ్యవహరిస్తూ ప్రభావతి, మీనాక్షి, శోభలతో డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించి అతిథుల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాడు.

మరోవైపు శృతి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు బాలు, మీనా వెతకగా, ఆమె ఒక లాయర్‌ను కలవడానికి వెళ్లినట్లు తెలుస్తుంది. నీతూతో రవికి సంబంధం ఉందని అపార్థం చేసుకున్న శృతి తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. అయితే బాలు, మీనా అసలు నిజాన్ని వివరించి, రవి కేవలం సహాయం మాత్రమే చేశాడని చెబుతారు. దీంతో తన పొరపాటును గ్రహించిన శృతి వెంటనే ఫంక్షన్‌కు రావడానికి అంగీకరిస్తుంది. అచ్చం అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో శృతి హాల్‌లోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటారు. అనంతరం రవి-శృతి కేక్ కట్ చేసి యానివర్సరీ వేడుకలను ఘనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా శృతి భావోద్వేగంగా మాట్లాడుతూ తమ జీవితాల్లో బాలు, మీనాల పాత్ర ఎంతో గొప్పదని చెబుతుంది. ఉమ్మడి కుటుంబ విలువలు, బంధాల గొప్పతనం మీనా వల్లే తెలుసుకున్నామని ప్రశంసిస్తుంది. రవి కూడా తమ ప్రేమ వివాహం జరగడానికి మీనానే ప్రధాన కారణమని వెల్లడిస్తాడు. చివరగా కుటుంబ సభ్యులందరూ కలిసి డ్యాన్స్‌లు చేస్తూ సంబరాల్లో మునిగిపోవడంతో ఎపిసోడ్ ఆనందంగా ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 705 june 15th 2026 here is full story
Courtesy: Jio hotstar

సోమవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ముందుగా రవి-శృతి వివాహ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆటలు, పాటలు, డ్యాన్స్‌లతో వేడుక సందడిగా సాగుతుంది. ఈ సందర్భంగా మనోజ్ తన తమ్ముడు రవికి బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తాడు. అయితే బాలు, మీనా ఏ గిఫ్ట్ ఇస్తారో చూడాలని వ్యంగ్యంగా మాట్లాడుతాడు. దీనికి బాలు గట్టిగానే సమాధానం చెబుతూ, "మేము డబ్బులతో కాదు.. ప్రేమతో బహుమతులు ఇస్తాం" అంటాడు. వెంటనే మీనా స్వయంగా తయారు చేసిన అందమైన ఫ్లవర్ బొకేను రవి-శృతికి అందిస్తారు. ఆ బహుమతి చూసి శృతి ఎంతో సంతోషపడుతుంది. అంతలో రవి బాస్ నీతు కూడా ఫంక్షన్‌కు హాజరవుతుంది. కాలికి గాయం ఉన్నా ప్రత్యేకంగా వచ్చి శుభాకాంక్షలు తెలపడంతో రవి ఆశ్చర్యపోతాడు.

ఈ సందర్భంగా నీతు సరదాగా శృతిని ఆటపట్టిస్తూ, "నా టేస్ట్ అంత బ్యాడ్ కాదు" అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూస్తాయి. శృతి కూడా బుంగమూతి పెట్టి స్పందించడంతో ఆ సన్నివేశం సరదాగా మారుతుంది. మరోవైపు బాలు, మీనా ఇద్దరూ తమ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఈ రోజు తమకు కూడా ప్రత్యేకమేనని బాలు చెబుతాడు. అయితే మీనా మాత్రం ఇదే రోజు తనపై బాలు యుద్ధం ప్రకటించాడని, గతంలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుని బాధపడుతుంది. దీంతో బాలు క్షమాపణలు చెప్పి ఆమెను సముదాయిస్తాడు. ఇక ఎప్పటిలాగే సురేంద్ర, శోభలు బాలును రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ బాలు ఎంతో పరిణితితో స్పందిస్తూ, "మీరు గొడవ కోసం చూస్తున్నారు. కానీ నాకు ఇప్పుడు గొడవలకు సమయం లేదు" అంటూ వారిని షాక్‌కు గురిచేస్తాడు. దీంతో సురేంద్ర, శోభలకు గట్టి కౌంటర్ పడినట్లవుతుంది.

ఫంక్షన్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్రభావతి కాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంది. మీనా ఆమెకు సహాయం చేయాలని ప్రయత్నిస్తే, ప్రభావతి చిరాకుగా మాట్లాడుతుంది. అయితే మీనా తన స్వభావానికి తగ్గట్టుగానే వేడి పాలు తీసుకువచ్చి ఇవ్వడంతో ప్రభావతి, సత్యం మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. మీనా మాటలకు ప్రభావతి కాస్త సైలెంట్ అవుతుంది. ఇంతలో రవి, శృతి ఇంటికి వచ్చి అందరినీ ఒకచోటకు పిలుస్తారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మీనాకు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా అందజేస్తారు. దీంతో ప్రభావతి, మనోజ్, రోహిణి అసూయతో రగిలిపోతారు. రోహిణి వెంటనే మీనాకు అంత ప్రత్యేక గిఫ్ట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తుంది.

అయితే అసలు నిజం బయటపెట్టకుండా, యానివర్సరీ ఫంక్షన్‌ను విజయవంతం చేసినందుకు, అందమైన ఫ్లవర్ డెకరేషన్ చేసినందుకు ఈ బహుమతి ఇస్తున్నామని రవి-శృతి చెబుతారు. ప్రభావతి మళ్లీ మీనాను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయగా, సత్యం ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దీంతో అక్కడి నుంచి ప్రభావతి, మనోజ్, రోహిణి వెళ్లిపోతారు. చివరగా రవి, శృతి మరోసారి బాలు-మీనాలకు కృతజ్ఞతలు తెలుపుతారు. తమ జీవితంలో వారి స్థానం ఎంతో ప్రత్యేకమని చెబుతారు. దీంతో ఎపిసోడ్ కుటుంబ బంధాల విలువను చాటుతూ హృదయానికి హత్తుకునేలా ముగుస్తుంది.

మరోవైపు కథలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తన తల్లి రాజేశ్వరిని హాస్పిటల్‌కు తీసుకువెళ్తాడు. గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె తీవ్ర నీరసంతో కనిపిస్తుంది. హాస్పిటల్‌కు వచ్చినప్పటి నుంచే అరుణ్‌కు పోలీస్ స్టేషన్ నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఒకవైపు డ్యూటీ బాధ్యతలు, మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతను తీవ్ర ఆందోళనకు గురవుతాడు. రాజేశ్వరిని పరీక్షించిన డాక్టర్ పరిస్థితి అంత మంచిగా లేదని చెబుతుంది. "మీ అమ్మ చాలా బలహీనంగా ఉన్నారు. ఇంతకాలం ఎందుకు అశ్రద్ధ చేశారు? ముందే హాస్పిటల్‌కు తీసుకురావాల్సింది" అంటూ అరుణ్‌ను మందలిస్తుంది. దానికి అరుణ్ ఇంట్లోనే మందులు వేసానని, తగ్గుతుందని భావించానని చెబుతాడు.

అయితే డాక్టర్ మరింత సీరియస్‌గా స్పందిస్తూ, "ఏ మందు పడితే ఆ మందు వేయడం చాలా ప్రమాదం. సరైన పరీక్షలు చేయించకుండా ఇలా చేయడం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది" అని హెచ్చరిస్తుంది. అనంతరం కొన్ని అత్యవసర పరీక్షలు చేయించాలని సూచిస్తూ, రాజేశ్వరి పల్స్ చాలా తక్కువగా ఉందని, కనీసం ఒకరోజు హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సిందేనని స్పష్టం చేస్తుంది. అయితే అరుణ్ మాత్రం తన డ్యూటీ కారణంగా ఆందోళన చెందుతాడు. "నాకు అర్జెంట్ డ్యూటీ ఉంది. హాస్పిటల్‌లో ఉండే పరిస్థితి లేదు. ఏమైనా మందులు ఇస్తే ఇంట్లోనే చూసుకుంటాం" అని చెబుతాడు. కానీ డాక్టర్ మాత్రం పరిస్థితిని వివరించి, అడ్మిషన్ తప్పనిసరి అని చెబుతుంది. ఇదే సమయంలో అక్కడికి మీనా చెల్లెలు సుమతి వస్తుంది. రాజేశ్వరి పరిస్థితిని చూసి ఆమె కూడా ఆందోళన చెందుతుంది. డాక్టర్ చెప్పిన పరీక్షలు వెంటనే చేయించాలని అరుణ్‌కు సూచిస్తుంది.

అయితే అరుణ్ తనకు సమయం లేదని, పోలీస్ స్టేషన్ నుంచి పదేపదే ఫోన్‌లు వస్తున్నాయని చెబుతాడు. దీంతో సుమతి ముందుకొచ్చి, "మీరు ఎలాంటి టెన్షన్ పడొద్దు. మీ అమ్మను నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా డ్యూటీకి వెళ్లండి" అని ధైర్యం చెబుతుంది. సుమతి మాటలు విన్న అరుణ్ కాస్త ఊరట చెందుతాడు. టెస్టులు, ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వబోతాడు. కానీ సుమతి వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తూ, "ముందు ఆరోగ్యం ముఖ్యం. డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు" అని అంటుంది. ఆమె మంచితనానికి అరుణ్ ఆశ్చర్యపోతాడు. రాజేశ్వరి కూడా సుమతిని చూసి ఎంతో మురిసిపోతుంది. "ఇప్పటి రోజుల్లో ఇలాంటి మనసున్న వాళ్లు చాలా అరుదు" అని మనసులో అనుకుంటుంది. చివరకు తల్లిని సుమతి చేతుల్లో భద్రంగా వదిలి అరుణ్ తన డ్యూటీకి బయలుదేరుతాడు. ఇక హాస్పిటల్‌లో రాజేశ్వరికి అవసరమైన ప్రతి పనిని సుమతి దగ్గరుండి చూసుకుంటుంది. మందులు ఇవ్వడం నుంచి పరీక్షలకు తీసుకెళ్లడం వరకు అన్నీ బాధ్యతగా నిర్వహిస్తుంది.

మరోవైపు విద్య, రోహిణి ఇద్దరూ బైక్‌పై వెళ్తూ సరదాగా గడుపుతుంటారు. అయితే మార్గమధ్యంలో విద్య అకస్మాత్తుగా "అయ్యో... బ్రేకులు పడటం లేదు" అంటూ గట్టిగా అరవడంతో రోహిణి భయంతో వణికిపోతుంది. ఏమి చేయాలో అర్థం కాక బైక్ నడుస్తుండగానే దిగి పక్కకు పరుగెత్తుతుంది. అది చూసిన విద్య పెద్దగా నవ్వేస్తూ, "ఏదో సరదాగా ఆటపట్టించాలని అనుకున్నా... నువ్వు నిజంగానే దూకేస్తావనుకోలేదు" అంటుంది. దీంతో రోహిణి కోపంగా, "నన్నే ఆటపట్టిస్తావా? నాకు గుండె ఆగిపోయేలా చేశావ్" అంటూ మందలిస్తుంది.

అంతలో అక్కడికి మీనా రావడంతో విద్య ఆనందంగా ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. ఈ సందర్భంగా విద్య తన ప్రేమ విషయం గురించి మీనాతో మాట్లాడుతుంది. "ఆ అబ్బాయి మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు" అని తన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. దీనికి మీనా ఓ మంచి సలహా ఇస్తూ, "ఈసారి అతను మీ ఇంటికి వస్తే నేరుగా అడిగేయ్. ఎందుకు వస్తున్నావు? నా గురించి నీ అభిప్రాయం ఏంటి? అని గట్టిగా ప్రశ్నించు. అప్పుడు నిజం చెబుతాడు" అంటుంది. అంతేకాకుండా, "అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే ఒకరోజు ఫోన్లు మార్చుకుని చూడండి. ఎలాంటి భయం లేకుండా తన ఫోన్ నీకు ఇస్తే అతనికి నీపై నమ్మకం, ప్రేమ ఉన్నట్టే" అని చెబుతుంది. మీనా చెప్పిన మాటలకు విద్య బాగా ఇంప్రెస్ అవుతుంది.

అయితే ఈ సంభాషణను దూరం నుంచి గమనించిన రోహిణి కాస్త అసహనానికి గురవుతుంది. మీనా వెళ్లిపోయిన తర్వాత విద్యను పక్కకు తీసుకెళ్లి, "ఏంటే... నేను ఉన్నా కూడా నన్ను పట్టించుకోకుండా మీనా దగ్గరకు పరిగెత్తావు. నాకంటే మీనా ఎక్కువైపోయిందా?" అని ప్రశ్నిస్తుంది. దీనికి విద్య నవ్వుతూ, "అది మా ఇద్దరి మధ్య సీక్రెట్. తర్వాత చెబుతాను. అనవసరంగా కుళ్ళుకోకు" అని చెప్పడంతో రోహిణి మనసులో మరింత అసంతృప్తి పెరుగుతుంది.

మరోవైపు బాలు, రాజేష్ ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు భోజనం చేయడానికి వెళ్తారు. అక్కడే మరో టేబుల్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ కూర్చుని భోజనం ఆర్డర్ చేస్తాడు. అరుణ్‌ను చూసిన క్షణం నుంచే బాలు ముఖంలో కోపం కనిపిస్తుంది. గతంలో అతను చేసిన అన్యాయాలు గుర్తుకొచ్చి అతడిని ఎలాగైనా రెచ్చగొట్టాలని నిర్ణయించుకుంటాడు. రాజేష్‌తో మాట్లాడుతున్నట్లు నటిస్తూ, "కొంతమంది పెద్దలను కొట్టి, బలహీనులను వేధించి కూడా ఎంతో హాయిగా భోజనం చేస్తుంటారు. వాళ్లు అన్నం తింటారా? లేక పాపాలు తింటారా?" అంటూ గట్టిగా మాట్లాడతాడు.

అంతేకాకుండా, "రికమండేషన్‌తో ఉద్యోగాలు సంపాదించిన వాళ్లు ఇలాగే అహంకారంగా ఉంటారు" అని కూడా వ్యాఖ్యానిస్తాడు. బాలు మాటలు నేరుగా తనకే వినిపిస్తున్నాయని గ్రహించిన అరుణ్ కోపంతో రగిలిపోతాడు. వెంటనే లేచి వచ్చి బాలు కాలర్ పట్టుకుని, "ఏంట్రా... కావాలనే నన్ను రెచ్చగొడుతున్నావా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే బాలు చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.

వెంటనే రాజేష్‌కు వీడియో తీయమని చెప్పడంతో పాటు హోటల్‌లో ఉన్న వారిని కూడా వీడియోలు తీయమని ప్రోత్సహిస్తాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. అందరి ముందు గొడవ పెరిగితే తనకే నష్టం జరుగుతుందని గ్రహించిన అరుణ్ కాస్త వెనక్కి తగ్గుతాడు. అయినా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక, "ఈరోజు తప్పించుకున్నావు. కానీ ఎప్పటికీ తప్పించుకోలేవు. మళ్లీ నా చేతికి చిక్కితే నా తడాఖా ఏంటో చూపిస్తా" అంటూ బాలును హెచ్చరిస్తాడు.

అంతేకాకుండా, "ఇప్పటి నుంచి నువ్వే నా ఏకైక శత్రువు" అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అరుణ్ వెళ్లిపోయిన తర్వాత రాజేష్, "ఇంత అవసరమా? అనవసరంగా కొత్త శత్రుత్వం ఎందుకు?" అని బాలును ప్రశ్నిస్తాడు. అయితే బాలు మాత్రం తన నిర్ణయంపై కట్టుబడి ఉంటాడు. "వాడు వృద్ధులపై దాడి చేశాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. అలాంటి వాడిని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను. వాడికి తగిన బుద్ధి చెప్పే వరకు ఆగను" అని అంటాడు. దీంతో బాలు, అరుణ్ మధ్య ఉన్న విభేదాలు మరింత ముదిరిపోతాయి.

మరోవైపు మీనా తన తల్లి పార్వతి పూల కొట్టు దగ్గరకు వెళ్తుంది. అక్కడ సుమతి కూడా ఉండటంతో ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతుంది. ఈ సందర్భంగా సుమతి, శివ వీడియో వైరల్ చేసిన వారి గురించి ఏమైనా సమాచారం దొరికిందా అని మీనాను ప్రశ్నిస్తుంది. దీనికి మీనా, "ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. కానీ ఈ కుట్ర వెనుక గుణ హస్తం కూడా ఉన్నాడని అనుమానం కలుగుతోంది.

మన కుటుంబ పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు" అని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే పార్వతి మాత్రం పాత విషయాలను వదిలేయాలని సూచిస్తుంది. కానీ మీనా అంగీకరించదు. "ఆరోజు బాలు బావ సమయానికి స్పందించకపోయి ఉంటే శివ జీవితమే నాశనం అయ్యేది. అలాంటి వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు" అంటూ తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తుంది.

ఇక సుమతి హాస్పిటల్‌కు వెళ్లాల్సిన సమయం కావడంతో అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతుంది. దీంతో మీనా ఆశ్చర్యంగా, "ఇంత త్వరగా ఎందుకు వెళ్తున్నావ్?" అని అడుగుతుంది. అప్పుడు సుమతి .. అరుణ్ వాళ్ల అమ్మ గురించి చెబుతుంది. "ఒక అమ్మగారు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆమె కొడుకు ట్రాఫిక్ కానిస్టేబుల్. డ్యూటీ వల్ల ఆయన ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. అందుకే ఆమెను చూసుకోవడానికి నేనే వెళ్తున్నాను. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా మన బాధ్యతే కదా" అని చెబుతుంది. చెల్లెలి మంచితనాన్ని చూసిన మీనా ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది. "నిన్ను చూస్తుంటే నాకు నాన్న గుర్తొస్తున్నాను" అంటూ ప్రేమగా అభినందిస్తుంది.

ఇదిలా ఉండగా, ఇంట్లో శివ ఆనందంగా వచ్చి మీనాకు ఓ శుభవార్త చెబుతాడు. తన కాలేజీ ప్రొఫెసర్ ఇంట్లో జరగబోయే పెద్ద కార్యక్రమానికి సంబంధించిన క్యాటరింగ్ ఆర్డర్ మీనాకు వచ్చేలా మాట్లాడినట్లు చెబుతాడు. వెంటనే ప్రొఫెసర్‌తో ఫోన్‌లో మాట్లాడిస్తాడు. వివరాలు విన్న మీనా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అది చిన్న ఆర్డర్ కాదు. ఏకంగా ఐదు లక్షల రూపాయల విలువ చేసే భారీ ఆర్డర్. ప్రొఫెసర్ కూడా మీనా పనితనం గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తూ అడ్వాన్స్ మొత్తాన్ని వెంటనే పంపిస్తారు. అయినప్పటికీ మీనా మనసులో కాస్త అనుమానం ఉంటుంది. "ఇంత పెద్ద ఆర్డర్‌ను మనం సక్రమంగా పూర్తి చేయగలమా?" అని ఆలోచిస్తుంది. అయితే శివ మాత్రం తన అక్కకు ధైర్యం చెబుతూ, "నువ్వు చేసిన ప్రతి పని సక్సెస్ అయ్యింది. ఇది కూడా ఖచ్చితంగా అవుతుంది" అని ప్రోత్సహిస్తాడు.

ఆనందంతో ఇంటికి వచ్చిన మీనా వెంటనే ఆర్డర్‌కు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవుతుంది. సరుకుల లిస్ట్ తయారు చేయడం, కార్మికుల గురించి ఆలోచించడం, ఖర్చుల లెక్కలు చూసుకోవడం వంటి పనుల్లో బిజీ అయిపోతుంది. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన బాలు, "నాకు ఆకలేస్తోంది. నన్ను పూర్తిగా మర్చిపోయావా?" అంటూ సరదాగా అంటాడు. అప్పుడు మీనా తేరుకుని, "అయ్యో... పనిలో పడి మిమ్మల్ని పట్టించుకోవడం మర్చిపోయాను" అంటూ నవ్వుతుంది. మీనా ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని గమనించిన బాలు అసలు విషయం అడుగుతాడు. అప్పుడు మీనా పెద్ద ఆర్డర్ వచ్చిన విషయాన్ని చెబుతుంది. అయితే ఒక సమస్య కూడా ఉందని వివరిస్తుంది.

'ఈ ఆర్డర్ పూర్తి చేయాలంటే కనీసం రూ.70 వేల వరకు పెట్టుబడి అవసరం. కానీ వాళ్లు అడ్వాన్స్‌గా కేవలం రూ.20 వేలే ఇచ్చారు. మిగతా డబ్బు ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదు'అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి బాలు బయట నుంచి అప్పు తీసుకురావాలని సూచిస్తాడు. కానీ మీనా మాత్రం వడ్డీలు కట్టడం ఇష్టం లేదని చెబుతుంది.

"ఒక్కసారి శృతి లేదా రవిని అడిగి చూస్తాను. వాళ్లు సహాయం చేయొచ్చు. లేకపోతే మరో మార్గం ఆలోచిద్దాం" అంటుంది. అయితే బాలు అనవసరంగా మాటలు వస్తాయని సందేహం వ్యక్తం చేస్తాడు. అయినప్పటికీ మీనా, "వాళ్లు అలాంటి వారు కాదు. అవసరమైతే సహాయం చేస్తారు" అని నమ్మకంగా చెబుతుంది. ఈ భారీ ఆర్డర్‌ను మీనా విజయవంతంగా పూర్తి చేస్తుందా? అవసరమైన పెట్టుబడిని ఎలా సమకూర్చుకుంటుంది? అనేది రాబోయే ఎపిసోడ్‌లలో ఆసక్తికరంగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X