Gundeninda Gudigantalu June 22th Episode: మనోజ్‌పై కుక్కల దాడి, మీనాకు ప్రభావతి క్షమాపణ, సుందరీతో బాలు..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కుటుంబంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మీనా చేసిన త్యాగాలు, కష్టాలను ఎవరూ గుర్తించకపోవడంపై బాలు తీవ్రంగా స్పందించాడు. కుటుంబ సభ్యులంతా మీనాపై ఆధారపడుతున్నారని, ఆమె విలువ తెలుసుకోవాలంటే ఒక్కరోజైనా వంట చేయకూడదని చెప్పి "వంటింటి సమ్మె"కు శ్రీకారం చుట్టాడు. బాలు ప్రోత్సాహంతో మీనా కూడా వంటగదికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇంట్లో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ నిర్ణయానికి ప్రభావతి తీవ్రంగా వ్యతిరేకించినా, సత్యం మాత్రం మీనాకు అండగా నిలిచాడు.

మీనా తన కలలను వదిలి ఇంటి పనుల్లోనే మగ్గిపోకూడదని, ఇకపై తన డెకరేషన్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని బాలు స్పష్టం చేశాడు. మరోవైపు ప్రభావతి వంట చేయాలని ప్రయత్నించగా గ్యాస్ సిలిండర్ లేకపోవడం కొత్త సమస్యగా మారింది. ఇంట్లో భోజనం లేక ఆకలితో ఇబ్బందిపడుతున్న మనోజ్, రోహిణిలు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినా, బాలు వాటిని తిరిగి పంపించి మీనా విలువను అందరికీ తెలియజేయాలని ప్రయత్నించాడు. ఎపిసోడ్ చివర్లో తల్లి ప్రభావతిని బాలు భావోద్వేగంగా ప్రశ్నిస్తూ, తనపై చూపిన వివక్షను గుర్తుచేశాడు. మీనా కోసం బాలు చేస్తున్న ఈ పోరాటం కుటుంబంలో పెద్ద మార్పుకు దారితీస్తుందా? ప్రభావతి తన తప్పును ఒప్పుకుంటుందా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 710 june 22th 2026 here is full story

Courtesy: Jio hotstar

సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, కామెడీ, కుటుంబ గొడవలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా మీనా విలువను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనే ఉద్దేశంతో బాలు చేపట్టిన 'వంటింటి సమ్మె' డ్రామా ఈ ఎపిసోడ్‌లో కీలక మలుపు తిరిగింది. ముఖ్యంగా ప్రభావతి చేసిన తప్పును ఆమె నోటితోనే ఒప్పించడంలో బాలు విజయం సాధించడం ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. ఇంట్లో అందరూ ఆకలితో ఇబ్బంది పడుతుండగా సత్యం కూడా ఒక దశలో బాలు, మీనాలను తప్పుగా అర్థం చేసుకుంటాడు. అయితే వారిపై ఎలాంటి కోపం వ్యక్తం చేయకుండా మౌనంగా తన గదికి వెళ్లిపోతాడు. ఈ విషయం గమనించిన మీనా వెంటనే మామయ్య గదికి వెళ్లి భోజనం అందిస్తుంది.

దీంతో ఆశ్చర్యపోయిన సత్యం, "నా భార్య ఆకలితో ఉంటే నేను తింటానని అనుకున్నావా?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీనా అసలు విషయాన్ని వివరించి, బాలు తనను కించపరిచిన వారికి గుణపాఠం చెప్పడానికే ఇలా చేస్తున్నాడని, కానీ తాను మాత్రం ఇంటి కోడలిగా తన బాధ్యతలను ఎప్పటికీ మర్చిపోనని చెబుతుంది. మీనా మంచితనాన్ని చూసి సత్యం కదిలిపోతాడు. ఒక క్షణం ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణలు కూడా చెబుతాడు.

మరోవైపు హాల్లో ప్రభావతి, రోహిణి ఆకలితో అలమటిస్తూ కనిపిస్తారు. ఈ సమయంలో బాలు వారిని ఆటపట్టిస్తూ పాటలు పాడుతుంటాడు. బిర్యానీ తీసుకురావడానికి వెళ్లిన మనోజ్ కోసం ఎదురు చూస్తున్న రోహిణి, తన కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని బాధపడుతుంది. ఇంతలో మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. అయితే అతని పరిస్థితి చూసి అందరూ షాక్ అవుతారు. బిర్యానీ తీసుకుని వస్తుండగా వీధి కుక్కలు అతనిపై దాడి చేయడంతో బట్టలు చినిగిపోయి పూర్తిగా దయనీయ స్థితిలో ఇంటికి చేరుకుంటాడు. మనోజ్‌ను చూసిన బాలు మాత్రం అతడిని మరింత ఆటపట్టిస్తాడు. పోలీస్ స్టేషన్‌లో ఎన్ని చెంపదెబ్బలు తిన్నావో గుర్తుందా అని ప్రశ్నిస్తూ, గతంలో చేసిన మోసాలు, తప్పిదాలన్నింటినీ గుర్తు చేస్తాడు. దీంతో మనోజ్ చిరాకు పడినా బాలు తనదైన శైలిలో చురకలు వేస్తూనే ఉంటాడు. కుక్కల దాడి గురించి చెప్పిన మనోజ్‌కు శృతి కూడా సెటైర్ వేస్తూ, బిర్యానీ వదిలేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని అంటుంది.

ఇక ఆకలి బాధ భరించలేని స్థితికి చేరుకున్న కుటుంబ సభ్యులకు బాలు ఒక షరతు పెడతాడు. మీనాకు క్షమాపణ చెబితేనే వంట చేయిస్తానని స్పష్టం చేస్తాడు. మొదట మనోజ్, తర్వాత రోహిణి మీనాకు సారీ చెబుతారు. కానీ ప్రభావతి మాత్రం తన మొండితనాన్ని వీడకుండా మొదట నిరాకరిస్తుంది. అయితే ఆకలి బాధ పెరగడంతో పాటు మనోజ్, రోహిణి ఒత్తిడి చేయడంతో చివరకు క్షమాపణ చెప్పడానికి అంగీకరిస్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. మీనాను ఉద్దేశించి మాట్లాడిన ప్రభావతి, "నేను కావాలనే నీ నాన్న ఇంటి నుంచి వెళ్లకుండా చేశాను. నేను చేసింది తప్పే" అంటూ తన తప్పును స్వయంగా ఒప్పుకుంటుంది. ఈ కీలక సంభాషణ మొత్తాన్ని బాలు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేస్తాడు. దీంతో ఇంతకాలం మీనాపై జరిగిన అన్యాయం అందరికీ స్పష్టమవుతుంది.

ఆ తర్వాత మీనా మరోసారి తన మంచితనాన్ని నిరూపిస్తుంది. "మేము వంటగదిని మూసేశామని చెప్పాం కానీ వంట చేయలేదని ఎక్కడా చెప్పలేదు. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎప్పుడో అందరికీ వండి పెట్టాను" అని చెబుతుంది. దీంతో ఆకలితో అలమటిస్తున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు పరుగులు తీసి భోజనం చేయడం ప్రారంభిస్తారు. ఇలా మీనాకు క్షమాపణ చెప్పించడంలో బాలు సక్సెస్ కావడంతో పాటు, ప్రభావతి చేసిన తప్పును ఆమె నోటితోనే ఒప్పించగలిగాడు. కుటుంబంలో మీనా స్థానం, ఆమె విలువ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేసిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరుసటి రోజు ప్రభావతి కాఫీ తాగేందుకు కిందికి వస్తుంది. అయితే నిన్నటి సంఘటనల కారణంగా మీనాను నేరుగా కాఫీ అడగడానికి కొంత మొహమాటపడుతుంది. ఈ విషయాన్ని గమనించిన మీనా, "ఏంటి అత్తయ్య.. కాఫీ కావాలా?" అని ప్రశ్నిస్తుంది. ప్రభావతి మాటలు చెప్పకుండా సైగలతో అవునని సమాధానం ఇస్తుంది. ఇదే సమయంలో మీనా చమత్కారంగా, "నిన్న సారీ చెప్పిన తర్వాత నేను వంట చేయనేమో అని భయపడ్డారా?" అని ప్రశ్నిస్తుంది.

అయితే ప్రభావతి తన మొండితనాన్ని ఏమాత్రం వదలదు. "నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదు. మనోజ్, రోహిణి బలవంతం చేయడంతో చెప్పాను" అంటూ తన అసలు బుద్ధిని బయటపెడుతుంది. దీంతో మీనా కూడా తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంది. "అవునా అత్తయ్య.. మీరు సారీ చెప్పిన వీడియో బాలు దగ్గర ఉంది. దాన్ని తన ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయాలని అనుకుంటున్నాడు" అని చెబుతుంది. వెంటనే చిరాకు పడిన ప్రభావతి, "వాడు తన ఫ్రెండ్స్‌కి పంపితే నువ్వు నీ కస్టమర్లకు పంపించు" అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇస్తుంది. దానికి మీనా, "అయ్యో అత్తయ్య.. నాకు ఆ ఐడియా అసలు రాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇకపై అలాగే చేస్తాను" అని చెప్పడంతో ప్రభావతి మరింత చిరాకు పడుతుంది. "అందరూ కలిసి నా పరువు తీసేందుకు సిద్ధమయ్యారు" అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇదే సమయంలో ఇంట్లోకి కొత్త పాత్ర సుందరి ఎంట్రీ ఇస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే తన అల్లరి, చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంటుంది. బాలు కనిపించకముందే "బాలు బావ.. బాలు బావ" అంటూ ప్రేమగా పిలుస్తూ ఇంట్లో హంగామా సృష్టిస్తుంది. అంతేకాదు, మనోజ్‌ను "చీమిడి ముక్కు బావ" అని, రవిని "పొట్టి బుడంకాయ్" అని సరదాగా ఆట పట్టిస్తుంది. ఆమె మాటలు, అల్లరి చూసి ఇంట్లో వారంతా నవ్వుల్లో మునిగిపోతారు. అయితే సుందరి ప్రవర్తన మీనాకు ఏమాత్రం నచ్చదు. ముఖ్యంగా తన భర్త బాలును పదేపదే "బావ" అని పిలవడం ఆమెకు అసహనాన్ని కలిగిస్తుంది. దీంతో నేరుగా సుందరిని ప్రశ్నిస్తూ, "నువ్వెవరు? ఎందుకు వచ్చావు?" అని నిలదీస్తుంది. అప్పుడు సత్యం అసలు విషయాన్ని చెబుతాడు. "ఈ అమ్మాయి పేరు సుందరి. మా తమ్ముడు రంగా దగ్గర పెరిగింది. రంగాకు పిల్లలు లేకపోవడంతో ఈమెను తన కూతురిలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాడు" అని వివరిస్తాడు.

ఇంతలో బాలు ఎంట్రీ ఇవ్వడంతో సుందరి మరింత ఉత్సాహంగా మారుతుంది. "బావా.. బావా" అంటూ బాలును చుట్టుముడుతుంది. ఆశ్చర్యకరంగా బాలు కూడా సుందరితో చాలా చనువుగా మాట్లాడతాడు. "మన చిన్నప్పుడు కలిసి ఎన్నో ఆటలు ఆడుకున్నాం. ఎన్నో పార్కులు తిరిగాం. ఎంత సరదాగా ఉండేదో గుర్తుందా?" అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. బాలు మాటలు విన్న మీనా ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి ఆమె మనసులో అసూయ మొదలవుతుంది. సుందరి కూడా కావాలనే మీనాను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంది. బాలు చుట్టూనే తిరుగుతూ, అతనితో సరదాగా మాట్లాడుతూ మీనాను మరింత ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బాలు కూడా ఇదంతా గమనిస్తూ సరదాగా వ్యవహరించడంతో మీనా లోలోపల ఉడికిపోతుంది. తన భర్తపై ఇంత హక్కుగా మాట్లాడుతున్న సుందరిని చూసి అసహనానికి గురవుతుంది.

ఈ క్రమంలో సుందరి బాలును ఉద్దేశించి, "బావా.. నువ్వు నాతో వస్తావా?" అని అడుగుతుంది. వెంటనే బాలు కూడా, "నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాను. పద వెళ్దాం" అంటూ ఆమెతో బయలుదేరేందుకు సిద్ధమవుతాడు. ఈ సన్నివేశం మీనాను మరింత బాధకు గురి చేస్తుంది. బాలు తనను పట్టించుకోకుండా సుందరితో వెళ్లిపోతుండటాన్ని చూసి ఆమె మనసులో అనేక అనుమానాలు మొదలవుతాయి. అయితే మీనాకు తెలియని మరో నిజం ఉంది. సుందరిని ఇంటర్వ్యూకు తీసుకెళ్లాలని ముందుగానే రంగా బాలుకు ఫోన్ చేసి చెప్పి ఉంటాడు. అదే కారణంతో బాలు ఆమెతో బయటకు వెళ్తున్నాడు. కానీ ఈ విషయం మీనాకు తెలియదు. దీంతో బాలు, సుందరి కలిసి వెళ్లడాన్ని చూసి ఆమె మరింత బాధపడుతుంది.

మరోవవైపు బాలు సహాయంతో ఇంటర్వ్యూకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన సుందరి, అసలు ఇంటర్వ్యూకు కాకుండా తన ప్రియుడు కిషోర్‌ను కలవడానికి వెళ్లడం కథలో ఊహించని ట్విస్ట్‌గా మారింది. రంగా చెప్పిన మాట ప్రకారం సుందరిని ఇంటర్వ్యూకు తీసుకెళ్లిన బాలు, ఆమె చెప్పిన లొకేషన్ దగ్గర కారును ఆపుతాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత సుందరి, "మీరు ఇంటికి వెళ్లండి బావా.. నేను ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని వస్తాను" అని చెప్పినా, బాలు మాత్రం అంగీకరించడు. ఇంటర్వ్యూ అయ్యే వరకు అక్కడే వెయిట్ చేస్తానని చెబుతాడు. దీంతో కాస్త టెన్షన్‌కు గురైన సుందరి, బాలును అక్కడే ఉంచి తన ప్రియుడు కిషోర్‌ను కలవడానికి వెళ్లిపోతుంది.

కిషోర్‌ను కలిసిన సుందరి తన మనసులోని భయాన్ని బయటపెడుతుంది. ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఇక ఆలస్యం చేయకుండా వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కిషోర్‌పై ఒత్తిడి తీసుకువస్తుంది. "నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ మన పెళ్లి మాత్రం జరగాల్సిందే. లేకపోతే పరిస్థితులు వేరేలా మారిపోతాయి" అంటూ హెచ్చరిస్తుంది. దీంతో వారి ప్రేమ వ్యవహారం ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతుంది. అయితే ఈ సమయంలో మరో సంచలన ట్విస్ట్ బయటపడుతుంది. సుందరి ప్రేమిస్తున్న కిషోర్ ఎవరో కాదు.. మటన్ కొట్టు మాణిక్యం మేనల్లుడు.

ఇదే సమయంలో మాణిక్యం కిషోర్‌కు ఫోన్ చేసి అతని కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ తీసుకొస్తున్నానని చెబుతాడు. తన మామయ్య గురించి మాట్లాడిన కిషోర్, "మా మామయ్య నాకు చాలా ఇష్టం. నా విషయాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు నా పెళ్లి బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు" అని సుందరికి వివరిస్తాడు. ఇక సుందరి తన ప్రేమ వ్యవహారం బయటపడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కిషోర్‌తో మాట్లాడిన తర్వాత తిరిగి కారు దగ్గరకు వస్తుంది. ఆమెను చూసిన బాలు, "ఏంటి ఇంత త్వరగా వచ్చేశావు? ఇంటర్వ్యూ అయిపోయిందా?" అని ప్రశ్నిస్తాడు. దీంతో వెంటనే అబద్ధం చెప్పిన సుందరి, "ఈరోజు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. అందుకే తిరిగి వచ్చాను" అని సమాధానం ఇస్తుంది. ఆమె మాటలను నమ్మిన బాలు మరోసారి ఇంటర్వ్యూకు వెళ్దామని చెబుతాడు.

కానీ ఇక్కడే బాలు మనసులో అనుమానం మొదలవుతుంది. అక్కడే ఉన్న కిషోర్‌ను గమనించిన బాలు, "వాడెవడు? ఆరోజు హాస్టల్ దగ్గర కూడా చూశాను. ఇప్పుడు మళ్లీ ఇక్కడ కనిపిస్తున్నాడు. నిన్ను ఫాలో అవుతున్నాడా?" అంటూ సుందరిని ప్రశ్నిస్తాడు. దీంతో ఒక్కసారిగా కంగారుపడిన సుందరి, తనకు అతడెవరో తెలియదని, యాదృచ్ఛికంగా కనిపించి ఉండొచ్చని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే బాలు అనుమానం పెరగడంతో ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని సుందరి నిర్ణయించుకుంటుంది. ఇదే సమయంలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంటుంది. కిషోర్ తన మామయ్య మాణిక్యంతో ఫోన్‌లో మాట్లాడుతుండగా, బాలు కారు అదే దారిలో వెళ్తుంది. ఒక దశలో మటన్ కొట్టు మాణిక్యం ఎదుటే బాలు వెళ్లినా, డ్రైవింగ్‌పై దృష్టి పెట్టడంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. దీంతో కిషోర్-సుందరి ప్రేమ వ్యవహారం మరోసారి బయటపడకుండా తప్పించుకుంటుంది.

ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీనా, బాలును సరదాగా ఆట పట్టించడం ఎపిసోడ్‌లో మరో హైలైట్‌గా నిలిచింది. సుందరి రోజంతా "బావా.. బావా" అంటూ పిలవడంపై మీనా సెటైర్లు వేస్తుంది. "నీకు కొత్త పేరు వచ్చేసింది కదా బావా" అంటూ ఆటపట్టిస్తుంది. దీంతో బాలు కూడా నవ్వుతూ స్పందిస్తాడు. "ఎవడైనా తన మొగుడిని పట్టుకుని బావ అని పిలుస్తారా? ఇదేం పద్ధతి?" అంటూ అంటాడు. అయితే మీనా కూడా తగ్గకుండా, "నా మొగుడా? దొంగ మొగుడు.. తాగుబోతు మొగుడు.. కారు డ్రైవర్ మొగుడు" అంటూ వరుసగా పేర్లు పెట్టి బాలును ఆట పట్టిస్తుంది. దీంతో బాలు అసలు విషయం ఒప్పుకుంటాడు. "నిన్ను ఆటపట్టించాలని ఉద్దేశపూర్వకంగానే సుందరితో చనువుగా మాట్లాడాను. నువ్వు ఫీల్ అయ్యుంటే సారీ" అని చెబుతాడు. వెంటనే మీనా కూడా, "నేను కూడా సరదాగా మాట్లాడాను. మీ గురించి నాకు తెలియదా?" అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తుంది.

ఇక మరుసటి రోజు ఉదయం మరో సస్పెన్స్‌కు తెరలేస్తారు. హాల్లో బాలు అటూ ఇటూ తిరుగుతూ చాలా టెన్షన్‌గా కనిపిస్తాడు. కుటుంబ సభ్యులు ఎవరైనా అడిగినా సరైన సమాధానం చెప్పడు. ఈ సమయంలో ప్రభావతి వచ్చి, "ఏంట్రా ఇలా తిరుగుతున్నావు? ఏదైనా పని లేదా?" అని ప్రశ్నిస్తుంది. దానికి బాలు, "మీరు మీనాపై ఎన్నో నిందలు వేశారు కదా. అందుకే మీ కళ్లలో నిప్పులు పోయడానికి మూడు ప్లేట్ల నిప్పులను ఆర్డర్ చేశాను" అంటూ మిస్టరీగా సమాధానం ఇస్తాడు. అతని మాటలు విని ఇంట్లో వారంతా షాక్ అవుతారు.

రోహిణి వెటకారంగా మాట్లాడితే, బాలు పక్కనే ఉన్న మనోజ్‌ను గిల్లి, "నీ భార్యకు కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు" అంటూ మరోసారి చురకలు వేస్తాడు. సత్యం కూడా ఏం జరుగుతుందో అర్థం కాక, "ఏంట్రా అసలు విషయం?" అని అడుగుతాడు. కానీ బాలు మాత్రం "కాసేపు ఆగండి.. మీకే తెలుస్తుంది" అంటూ సస్పెన్స్ కొనసాగిస్తాడు. అయితే ప్రభావతి మాత్రం తన ధోరణిని మార్చుకోదు. "పెళ్లాం సంపాదిస్తుంది కాబట్టి వాడు హాయిగా కూర్చుని తింటున్నాడు" అంటూ మరోసారి బాలును అవమానించేలా మాట్లాడుతుంది. బాలు ఎదురుచూస్తున్న విషయం ఏమిటి? అనే ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X