Gundeninda Gudigantalu June 24th Episode: మనోజ్‌ని కాపాడిన రోహిణి.. బాలు కొత్త బిజినెస్, ప్రభావతి కడుపు మంట
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: బాలు ప్రవర్తనలో ఏదో తేడా కనిపించడంతో కొడుకుని ప్రశ్నిస్తుంది ప్రభావతి. ఇంటిని తాకట్టు పెట్టే పరిస్ధితి వచ్చిందని బాలు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇంతలో బ్యాంక్ అధికారి వచ్చి మీనా పేరుతో కరెంట్ అకౌంట్ ప్రారంభించడానికి బాలు లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. అందరూ భార్యలు సంపాదించిన డబ్బును తమదిగా చెప్పుకుంటారని, కానీ బాలు మాత్రం మీనా టాలెంట్‌ను గుర్తించి ఆమె ఎదుగుదలకు తోడ్పడుతున్నాడని ప్రశంసిస్తుంది శృతి. అయితే మనోజ్ మాత్రం బాలుని హేళన చేయడంతో కోపంతో అన్నని కొడతాడు ముళ్లకంప.
మీనా సాధిస్తున్న విజయాన్ని చూసి మనోజ్, ప్రభావతి లోపల రగిలిపోతారు. అటు మనోజ్‌కి జీఎస్టీ అధికారులు పంపిన నోటీసు గురించి గుర్తుచేసిన రోహిణి.. ముందు వ్యాపారం సంగతి చూసుకో లేదంటే భారీ నష్టాలు తప్పవని వార్నింగ్ ఇస్తుంది. అయితే అనూహ్యంగా జీఎస్టీ అధికారులు వచ్చి బాలు షాప్‌ని క్లోజ్ చేస్తారు. మూడు గంటల్లో 3 లక్షల రూపాయలు కట్టకుంటే శాశ్వతంగా షాప్‌ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తారు అధికారులు. స్కూల్ దగ్గర బాలుని చూసిన రోహిణి కొడుకు చింటూని, ఆమె తల్లి సుగుణమ్మని కలుస్తాడు. మనోజ్‌ని కాపాడటానికి సుగుణమ్మని నగలు తీసుకురమ్మని చెబుతుంది రోహిణి. ఆ నగలను తన పేరుతో కాకుండా విద్య పేరుతో తాకట్టు పెట్టాలని ప్లాన్ చేస్తుంది రోహిణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జూన్ 24వ తేదీ ఎపిసోడ్ 712లో ఏం జరిగిందంటే?

Courtesy: Jio hotstar
జీఎస్టీ ఆఫీసర్స్‌కి ఇవ్వాల్సిన డబ్బును ఎలా ఏర్పాటు చేయాలో తెలియక టెన్షన్ పడతాడు మనోజ్. రోహిణికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంతలో జీఎస్టీ ఆఫీసర్స్ వచ్చి మేం ఇచ్చిన టైం అయిపోయింది, డబ్బులు ఎక్కడ అని అడుగుతారు. మా వైఫ్ డబ్బుల కోసమే వెళ్లింది.. దారిలో ఉందని, కాస్త వెయిట్ చేయమని చెబుతాడు మనోజ్. క్యాష్ కట్టడం మరిచిపోయారు కదా ఇది కూడా మరిచిపో అంటూ సెటైర్లు వేస్తారు జీఎస్టీ ఆఫీసర్లు. షోరూంకి సీల్ వేస్తున్నట్లు తెలుసుకున్న స్టాఫ్ కంగారుపడతారు. ఇంతలో రోహిణి వచ్చి డబ్బులు రెడీగా అయ్యాయి.. చెక్ రాసి ఇచ్చేయమని చెబుతుంది. దాంతో చెక్ రాసి జీఎస్టీ ఆఫీసర్లకు ఇచ్చేస్తాడు మనోజ్.
బిజినెస్ చేయడమంటే డబ్బులు సంపాదించుకోవడమే కాదు.. రూల్స్ కూడా ఫాలో అవ్వాలి ఇదే లాస్ట్ వార్నింగ్ అని జీఎస్టీ ఆఫీసర్లు మనోజ్‌కి వార్నింగ్ ఇస్తారు. నువ్వు రాకపోయుంటే ఈరోజు షోరూంకి సీల్ పడేదని రోహిణికి థ్యాంక్స్ చెబుతాడు మనోజ్. నువ్వు చచ్చిపోతావని ఈ డబ్బులు తీసుకురాలేదు.. ఈ షాప్ పోతే నువ్వు గుడి ముందు అడుక్కుంటావని తీసుకొచ్చానని చెబుతుంది రోహిణి. ఇంతకీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మనోజ్ అడగ్గా.. నగలు తాకట్టు పెట్టిన విషయం దాచి నా ఫ్రెండ్ దగ్గర అప్పు చేశానని చెబుతుంది రోహిణి. ముందు ఈ అప్పు తీర్చడం గురించి ఆలోచించమని చెబుతుంది రోహిణి.
షాపులో జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు.. బాలుకి మాత్రం అస్సలు చెప్పొద్దని మనోజ్‌కి వార్నింగ్ ఇస్తుంది రోహిణి. వాడికి తెలిస్తే వచ్చే మూడు సంవత్సరాలు జీఎస్టీ మనోజ్ అని నన్ను ఆడుకుంటాడు. అత్తయ్యకి కూడా చెప్పొద్దు.. రోహిణి చూసుకోలేదా అని మండిపడుతుందని చెబుతుంది రోహిణి. మూడు లక్షల అప్పు ఎలా కట్టాలని మనోజ్ టెన్షన్ పడతాడు. బాలు ఇంటికొచ్చి సత్యాన్ని స్కూల్ ఆయన, పెద్దాయన అంటూ హడావుడి చేస్తాడు. ఇదంతా విన్న మీనా... స్కూల్‌లో జాయిన్ అయ్యారని మావయ్య గారిని అలా పిలుస్తారా అని మండిపడుతుంది.
నాకే పేరు పెట్టిన ఆయనకి నేనే పేరు పెడతానా? అని అంటాడు బాలు.
నాన్నని స్కూల్ దగ్గర దించడానికి వెళ్లానా? అక్కడ చింటూని చూశానని మీనాతో చెబుతాడు బాలు. ఆ మాటలు విన్న రోహిణికి ముచ్చెమటలు పడతాయి. ఎక్కడో పల్లెటూరిలో ఉండాల్సిన చింటూ ఇక్కడ స్కూల్‌లో చేరడం ఏంటని మీనా అడుగుతుంది. చింటూనే కాదు, సుగుణమ్మని కూడా చూశానని బాలు చెప్పడంతో రోహిణి ఇంకా టెన్షన్ పడుతుంది. వాళ్లని వాళ్ల అమ్మాయి ఇక్కడే పెట్టిందని బాలు చెప్పడంతో మా అమ్మ అన్ని చెప్పేస్తుందని రగిలిపోతుంది రోహిణి. మనం ఒకసారి వాళ్లింటికి వెళ్దామని బాలు చెప్పగా.. నీకు సిగ్గు, శరం ఏం లేవా? ఎన్నిసార్లు చీ కొట్టినా వాళ్లు కనిపిస్తే చాలు మానవత్వం పొంగిపోర్లుతుందని సెటైర్లు వేస్తుంది మీనా.
వాళ్లు ఎలా ఉన్నా.. మనం మనలాగే ఉందాం, ఒకసారి వెళ్లి కష్టం సుఖం తెలుసుకుని వద్దామని మీనాతో అంటాడు బాలు. వెళ్లండి అన్ని తెలుసుకోండి, దుబాయ్‌లో ఉన్న కూతురిని దుమ్మెత్తి పోయండి అంటూ రగిలిపోతుంది రోహిణి. స్కూల్ నుంచి లేటుగా వచ్చిన తండ్రిని ఎందుకు లేటుగా వచ్చావని అడుగుతాడు బాలు. పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఉందని చెబుతాడు సత్యం. ఇంతలో శృతి - రవి ఇంటికొస్తారు. అన్నయ్యకి వచ్చిన లెటర్ ఇచ్చావా అని మీనాని అడుగుతాడు రవి. అది చూసిన బాలు సంతోషిస్తాడు. నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని బాలు చెప్పడంతో అంతా సంతోషిస్తారు.
ఆఫీస్ అడ్రస్‌గా ఈ ఇంటి అడ్రస్ ఇచ్చానని బాలు చెప్పడంతో ఎవరిని అడిగి ఇచ్చావని బాలు మీద ఫైర్ అవుతుంది ప్రభావతి. ఇంతకుముందు దీని పూలకొట్టుకుని ఎప్పుడు పడితే అప్పుడు జనాలొచ్చి నన్ను పూలు అమ్ముకునే దానిలా చేశారు. వీరు ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ పెట్టడంతో దారినపోయే వాళ్లంతా ఇక్కడికే వస్తారు, నేను సమాధానం చెప్పలేను అంటుంది ప్రభావతి. కొడుకు కోడలు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే సంతోషపడాలి, అడ్డుపడకూడదు. నువ్వు సవతి తల్లివి కాదని చెబుతాడు సత్యం. వాడికున్న సంపాదన సరిపోదా? ఇంకా అత్యాశ ఎందుకు అని అడుగుతుంది ప్రభావతి. 30 లక్షలు చేతిలో పెట్టుకుని 3 కోట్ల రూపాయల విల్లా కొనాలని అనుకోవడం అత్యాశ, నాన్న డబ్బంతా ఎవరికీ చెప్పకుండా వాళ్లే దోచేయాలని అనుకోవడం అత్యాశ అని రవి తగులుకుంటాడు.
ఈ మాటలు విన్న రోహిణి కిందకొచ్చి ఏం జరుగుతుందని అడుగుతుంది. బాలు డ్రైవింగ్ స్కూల్ పెడుతున్నాడని శృతి చెబుతుంది. ఇది గుడ్‌న్యూస్ కాదు.. బ్యాడ్ న్యూస్. బాలు మన ఇంటి ముందు డ్రైవింగ్ స్కూల్ బోర్డ్ పెడితే మున్సిపాలిటీ వాళ్లు దీనిని కమర్షియల్ బిల్డింగ్‌లా పరిగణించి ట్యాక్స్, కరెంట్ బిల్లు పెంచేస్తారని చెబుతుంది రోహిణి. నా ఇంటి ముందు కారు స్కూల్ పెట్టి నన్ను బయటికి గెంటేస్తారా అని ప్రభావతి శోకండాలు పెడుతుంది. మీరు ఎలాగూ బాగుపడరు, మమ్మల్ని కూడా బాగు పడనివ్వరా? నిజంగా కళ్లలో నిప్పులు పోసుకోవడం అంటే ఇదేనంటూ రోహిణిపై ఫైర్ అవుతుంది మీనా. కన్న కొడుకు బాగుపడుతుంటే రగిలిపోయే తల్లిని ఈ లోకంలో ఈవిడే, పెద్దాబ్బాయి లక్షలు ఎత్తుకెళ్లిపోయినా ఆయన వంశోద్ధారకుడు అనే అంటారంటూ మండిపడుతుంది మీనా.
వాడు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి గవర్నమెంటే అనుమతి ఇచ్చింది.. బోడీ నువ్వు ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత అని సత్యం సెటైర్లు వేస్తాడు. నేను రవి పనిచేసే రెస్టారెంట్‌లో జాయిన్ అయ్యానని శృతి చెబుతుంది. నువ్వు వంట చేయడానికి వెళ్తే ఆ రెస్టారెంట్ మూతపడిపోతుంది. పనివాళ్లంతా రోడ్డున పడతారు అంటూ బాలు పంచ్‌లు వేస్తాడు. నేను కుకింగ్ చేయను, రవితో కాసేపు ఉండొచ్చని పార్ట్‌టైం జాబ్ చేస్తున్నానని చెబుతుంది శృతి. మనోజ్ గాడి షాపులో పార్లరమ్మ.. నీ రెస్టారెంట్‌లో డబ్బుడమ్మా జాయిన్ అయ్యిందని అంటాడు బాలు. అయితే నువ్వు కూడా వదినని ఎందులో అయినా జాయిన్ చేయమని చెబుతాడు రవి. డ్రైవింగ్ స్కూల్‌లో మీనా పార్ట్‌నర్ అని అంటాడు బాలు. ఇంతమంది పనిచేస్తున్నా ఇంట్లో పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదని శృతి అంటుంది.
రాత్రి భోజనం చేసి ప్రభావతి చీర కొంగుకి బాలు చేయి తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో సుందరి, కామాక్షి వస్తారు.. మనోజ్‌ది చీముడు ముక్కు అందుకే అత్త వాడి ముక్కు తుడిచేదని చెబుతుంది సుందరి. మేం చేయి తుడుచుకుంటే, మూతి తుడుచుకుంటే తప్పు.. కానీ వీడి ముక్కు మాత్రం తుడుస్తావా అని ప్రభావతిపై సెటైర్లు వేస్తాడు బాలు. మనోజ్ బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ప్రభావతి తోడు ఉండాలి, పాటలు పాడాల్సిందేనని కామాక్షి చెప్పడంతో అంతా నవ్వుకుంటూ ఉంటారు. మీనాకి అన్నిసార్లు సారీ ఎందుకు చెప్పావని కామాక్షి అడగటంతో నీకెలా తెలుసు అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. బాలుగాడు వీడియో అందరికీ పంపాడని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.
సుందరికి మంచి సంబంధం వచ్చింది, ఎల్లుండి పెళ్లిచూపులకి వస్తారని కామాక్షి చెప్పడంతో సుందరి టెన్షన్ పడుతుంది. పెళ్లిచూపుల రోజు నీ దగ్గరికి పంపిస్తాను బాగా రెడీ చేయమని రోహిణిని అడుగుతుంది కామాక్షి. ఇంటిముందు డ్రైవింగ్ స్కూల్ పెట్టి నాతో కారు నడిపించొద్దని బాలుపై మండిపడుతుంది ప్రభావతి. ఇంటి ముందు డ్రైవింగ్ స్కూల్ పెట్టొద్దని చెప్పింది కాబట్టి ఇంటి పక్కన పెట్టానని అంటాడు బాలు. సత్యం డ్రైవింగ్ స్కూల్ అని బాలు పేరు పెట్టడంతో సత్యం సంతోషిస్తాడు. ఇంతసేపు నేను ఇక్కడ ఉండనని మనోజ్ మారాం చేయడంతో నువ్వు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల చెవిలో ఏం చెప్పావో అందరికి చెబుతానని బాలు బ్లాక్‌మెయిల్ చేయడంతో ప్రభావతి ఏం జరిగిందని అడుగుతుంది. అది వింటే నువ్వు తట్టుకోలేవని అంటాడు బాలు.
అనంతరం కార్లకి పూజ చేసి బాలు, మీనాలని ఆశీర్వదిస్తారు సత్యం, ప్రభావతి. మీనా అందరికీ స్వీట్స్ పంచుతుండగా మాకు వద్దు అంటాడు మనోజ్. అడుక్కునే వారికి 66 కూరలు.. మాకు ఒక్కటే కూరని సెటైర్లు వేస్తుంది మీనా. రెండు కార్లకు ఓనర్‌వి అయ్యావు.. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టావు, మీనాకి స్కూటీ కూడా కొనిపెట్టావు, ఫంక్షన్‌లకి డెకరేషన్ కూడా చేస్తున్నావు. భార్యాభర్తలిద్దరూ పరస్పర సహాయ సహకారాలు ఉంటే ఏదైనా సాధించొచ్చని బాలు, మీనాలను మెచ్చుకుంటాడు సత్యం. బాలు, మీనాలు ఎదగడం చూసిన ప్రభావతి అసూయ రగిలిపోతుంది. ఈ శుభవార్త మీ నానమ్మకి ఫోన్ చేసి చెప్పమని సత్యం చెప్పగా.. నన్ను ఇంతటివాడిని చేసింది బామ్మే ఆమెకు చెప్పకుండా ఉంటానా అని అంటాడు బాలు.
ఇంతలో బాలు ఫ్రెండ్ రాజేష్ వచ్చి. మనోజ్ ఏం చేశాడు? పోలీసులు ఎందుకు చెంప దెబ్బ కొట్టారని అడుగుతాడు. నీకు తెలియదు కదా చెవిలో చెబుతానని బాలు వెళ్లబోతుండగా మనోజ్ పక్కకి లాక్కెళ్తాడు. ఇంత వరకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక్కడు కూడా రాలేదని ప్రభావతి అనడంతో నేను నేర్చుకుంటానని మీనా ముందుకు వస్తుంది. ఆ మాట వినగానే ప్రభావతి, మనోజ్, రోహిణిలు షాక్ అవుతారు. కోడలు మొదట్లో సైకిల్ నడిపేది, తర్వాత స్కూటీ నడుపుతోంది.. రేపు కారు కూడా నడుపుతుందని అంటాడు సత్యం. కారు నడపాలంటే ఫీజు కట్టాలని బాలు చెప్పగా.. ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది చెక్ రాసిస్తానని చెక్ బుక్ తెస్తుంది మీనా. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications