Gundeninda Gudigantalu June 29th Episode: మీనాపై ప్రభావతి, చింతామణి కుట్ర, కానిస్టేబుల్‌తో బాలు గొడవ,
Courtesy: Jio hotstar
Gundeninda Gudigantalu: 'గుండె నిండా గుడిగంటలు' శుక్రవారం ఎపిసోడ్‌లో సుందరి కిషోర్‌తో క్షేమంగా ఉందని తెలుసుకున్న బాలు, మీనా ఇద్దరూ వారి కుటుంబాలను కలిసి ఒప్పించి ప్రేమ జంటకు పెద్దల ఆశీర్వాదం దక్కేలా చేశారు. పిల్లల ఆనందాన్ని అర్థం చేసుకుని వారికి తోడుగా నిలవాలని బాలు చెప్పిన మాటలు కిషోర్ తల్లిదండ్రుల మనసును కదిలించగా, మీనా కుటుంబ బంధాల గొప్పతనాన్ని వివరించడంతో వారు పెళ్లికి అంగీకరించారు. సుందరి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రంగారావు ఆమెను ప్రేమగా క్షమించి, ముందే విషయం చెప్పి ఉంటే తానే పెళ్లి చేసేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు.
అయితే మీనాక్షి మాత్రం సుందరి క్షేమం గురించి అడగకుండా ముందుగా నగల గురించే ప్రశ్నించి తన స్వార్థపూరిత వైఖరిని మరోసారి బయటపెట్టింది. ఈ సమస్యను తెలివిగా పరిష్కరించినందుకు బాలు, మీనాలను రంగారావు ప్రత్యేకంగా అభినందించాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రభావతి బాలు, మీనాలను విమర్శించినా, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మనిషితనమని ఇద్దరూ ధైర్యంగా సమాధానం ఇచ్చారు. సత్యం కూడా వారిని ప్రశంసించడంతో ప్రభావతి అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు మనోజ్‌కు జీఎస్టీ క్లియరెన్స్ రావడంతో రోహిణి ఊపిరి పీల్చుకున్నా, బాలు-మీనాల వల్ల తమ రహస్యాలు బయటపడతాయేమోనని ఆందోళన చెందింది. చివర్లో చింతామణి, ప్రభావతి చేతులు కలిపి బాలు-మీనాలపై కొత్త కుట్రకు తెరలేపడంతో ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగిసింది.

Courtesy: Jio hotstar
సోమవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే చింతామణి, ప్రభావతి మనసులో మీనాపై మరింత విషం నింపే ప్రయత్నం చేసింది. "ఈ ఇంట్లో మీదే చివరి మాట అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే మీ మాటకు విలువే లేదనిపిస్తోంది. మీరు చెప్పినా ఎవరూ వినడం లేదు" అంటూ ప్రభావతి అహాన్ని రెచ్చగొట్టింది. వెంటనే ప్రభావతి, "నువ్వు మీనా గురించే మాట్లాడుతున్నావు కదా. అది కేవలం పూలు అమ్ముకునే అమ్మాయి. దాని గురించి మాట్లాడటం కూడా అవసరం లేదు" అంటూ విషయం మార్చే ప్రయత్నం చేసింది.
అయితే చింతామణి అక్కడితో ఆగలేదు. "మీరు మీనాను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ ఆమె అడుగుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తోంది. చేయలేమనుకున్న పనులు కూడా చేసి చూపిస్తోంది. ఆమెకు ధైర్యం చాలా ఎక్కువ. ఎంతకైనా తెగిస్తుంది" అంటూ కావాలనే ప్రభావతిని మరింత రెచ్చగొట్టింది. ఈ మాటలు విన్న ప్రభావతి ఆగ్రహంతో ఊగిపోయి, "చూస్తూ ఉండండి... మీనా పూలు కూడా అమ్మకుండా చేస్తా. డ్రైవింగ్ స్కూల్ నుంచి కూడా తీసేయిస్తా. ఇంటి గడప దాటకుండా చేస్తా" అంటూ సవాల్ విసిరింది.
ఈ సంభాషణ మొత్తాన్ని మీనాక్షి దూరం నుంచి వింటుంది. చింతామణి ఉద్దేశపూర్వకంగానే ప్రభావతిని రెచ్చగొడుతోందని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఆ సమయంలో ప్రభావతి ఏ మాటా వినే పరిస్థితిలో లేదని గ్రహించి మౌనంగా ఉండిపోతుంది. పైగా చింతామణి, "ఇది మీ పరువు, మీ గౌరవం విషయం. మీ మాటకు విలువ ఉందో లేదో ఇప్పుడు నిరూపించుకోవాలి" అంటూ మరోసారి రెచ్చగొట్టడంతో ప్రభావతి మరింత కోపంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది.
మరోవైపు బాలు, మీనా జలుబుతో బాధపడుతూ హాల్లో కూర్చుని ఆవిరి పట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రభావతి, అసలు విషయం తెలుసుకోకుండా వారిపై మండిపడుతుంది. "హాల్లో కూర్చుని ఇలాంటి పనులు చేస్తారా?" అంటూ తిడుతుంది. దీనికి బాలు కూడా ఏమాత్రం తగ్గకుండా, "నీలాగా కుళ్లు, కుట్రలు మాకు రావు. మేము కేవలం ఆవిరి పట్టుకుంటున్నాం" అంటూ గట్టిగా సమాధానం ఇస్తాడు. "హాల్లో ఇలా చేయొద్దు" అని ప్రభావతి హెచ్చరించగా, "మాకు ప్రత్యేక గది లేదు కదా... అందుకే ఇక్కడ చేస్తున్నాం" అని బాలు చెప్పడంతో ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ప్రభావతి వెళ్లిన వెంటనే మనోజ్ గమనించకుండా వేడి నీటి గిన్నెలో కాలు వేయడంతో గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇదంతా బాలు, మీనాల తప్పేనని ప్రభావతి మళ్లీ వారినే నిందిస్తుంది. అయితే ఈసారి శృతి ముందుకొచ్చి, "వాళ్లకు ప్రత్యేక రూమ్ లేదు. హాల్లోనే ఉండాలి, హాల్లోనే పడుకోవాలి. మరి ఇంకెక్కడ ఆవిరి పట్టుకోవాలి? అందరిలాగే వాళ్లకూ ఒక గది ఇవ్వండి" అంటూ ప్రభావతికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా నోరు మూసుకోవాల్సి వస్తుంది. చివరికి వెళ్లే ముందు, "మీ కలల రూమ్ కట్టుకున్నాక అక్కడ ఏమైనా చేసుకోండి" అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది.
మరుసటి రోజు కథ డ్రైవింగ్ స్కూల్‌కు మారుతుంది. మీనా కారు డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రారంభిస్తుంది. బాలు గురువుగా మారి ఎంతో ఓపికగా ప్రతి విషయాన్ని వివరించడంతో మీనా కూడా ధైర్యంగా స్టీరింగ్ పట్టి మెల్లగా కారు నడపడం నేర్చుకుంటుంది. భార్యపై బాలు చూపించే నమ్మకం, ప్రోత్సాహం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతుంది.
ఇక మరోవైపు శృతి, రవి రెస్టారెంట్‌లో పనులతో బిజీగా ఉంటారు. ఆ సమయంలో వారి బాస్ నీతూ వచ్చి శృతి పనితీరును ప్రశంసిస్తుంది. "రెండు రోజుల్లోనే వెళ్లిపోతుందనుకున్నా... కానీ పనిని చాలా త్వరగా అర్థం చేసుకుని అద్భుతంగా చేస్తోంది" అంటూ మెచ్చుకుంటుంది. అయితే సర్వింగ్ విషయంలో రవి, శృతి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. ఇంట్లో ఒక రకం, ఉద్యోగంలో మరో రకం పరిస్థితులు ఎదురవుతుండటంతో రవి "ఏం కర్మ రా బాబు" అంటూ తనలోతానే బాధపడటం ఎపిసోడ్‌లో కామెడీ టచ్‌ను తీసుకొచ్చింది.
మరోవైపు సీరియల్‌లో ఎవరూ ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. ఇప్పటివరకు కుటుంబ సమస్యలతో సాగిన కథ ఒక్కసారిగా బాలు, కానిస్టేబుల్ అరవింద్ మధ్య జరిగిన ఘర్షణతో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ సంఘటన రాబోయే ఎపిసోడ్‌లకు మరింత ఉత్కంఠను తీసుకురానున్నట్లు కనిపిస్తోంది. టీ షాప్ దగ్గర బాలు, రాజేష్ ఇద్దరూ ఏదో విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో కానిస్టేబుల్ అరవింద్ హెల్మెట్ లేకుండానే బైక్ నడుపుతూ, ఒక చేత్తో ఫోన్‌లో మాట్లాడుతూ వేగంగా అక్కడికి వస్తాడు. అంతేకాదు, నో పార్కింగ్ జోన్‌లోనే తన బైక్‌ను నిర్లక్ష్యంగా పార్క్ చేసి లోపలికి వెళ్లిపోతాడు.
అరవింద్ చేసిన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను గమనించిన బాలు వెంటనే తన మొబైల్‌లో మొత్తం ఘటనను వీడియో తీస్తాడు. అంతటితో ఆగకుండా అరవింద్ లోపలికి వెళ్లిన వెంటనే అతని బైక్‌కు వీల్ లాక్ వేస్తాడు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన అరవింద్ తన బైక్ లాక్ అయి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. "ఎవర్రా నా బైక్‌కు లాక్ వేసింది?" అంటూ కోపంగా అరవడంతో అక్కడే ఉన్న బాలు ముందుకొచ్చి, "లాక్ వేసింది నేనే... ఎందుకంత అరిస్తున్నావ్?" అంటూ గట్టిగా సమాధానం ఇస్తాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాలుస్తుంది.
ఈ సందర్భంగా బాలు పాత విషయాన్ని గుర్తు చేస్తూ అరవింద్‌ను నిలదీస్తాడు. "ఆ రోజు నేను కూడా ఎమర్జెన్సీ పని మీద వెళ్తుంటే నా కారును నువ్వు సీజ్ చేశావు. ఇప్పుడు నువ్వే హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసి, నో పార్కింగ్‌లో బండి పెట్టావు. నువ్వు చేస్తే ఒక చట్టం... మేము చేస్తే మరో చట్టమా? ఇది ఎక్కడి న్యాయం?" అంటూ అక్కడున్న వారందరికీ వినిపించేలా ప్రశ్నిస్తాడు. అంతేకాదు, "చూడండి... చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు" అంటూ అక్కడ ఉన్నవారితో వీడియో తీయిస్తూ అరవింద్ ప్రవర్తనను బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో అక్కడ చిన్నపాటి గుంపు చేరి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది.
పరిస్థితి మరింత విషమిస్తున్నట్లు గమనించిన రాజేష్ వెంటనే జోక్యం చేసుకుంటాడు. "అనవసరంగా గొడవ పెంచుకోవద్దు" అంటూ బాలును సముదాయించి, బైక్‌కు వేసిన లాక్‌ను తొలగించేలా చేస్తాడు. దీంతో అరవింద్ ఎలాంటి గొడవ చేయకుండా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోతాడు. అయితే బాలు మాత్రం అక్కడితో ఆగడు. అరవింద్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వీడియోతో పాటు జరిగిన వాగ్వాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ కావడంతో అరవింద్ ఇమేజ్‌కు దెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఘటనతో బాలు-అరవింద్ మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతాయి.
మరోవైపు. సుందరి-కిషోర్ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో పెళ్లి పనులు ప్రారంభమవుతాయి. ముందుగా రంగారావు, తన ప్రాణ స్నేహితుడు సత్యంకు మొదటి పెళ్లి శుభలేఖను అందిస్తాడు. భార్యాభర్తలు కలిసి సత్యం కుటుంబాన్ని మొత్తం పెళ్లికి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలు ఒకేచోట చేరడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ సందర్భంగా రంగారావు.. బాలు, మీనాల వైపు తిరిగి భావోద్వేగానికి గురవుతాడు. "మీరిద్దరూ లేకపోయి ఉంటే ఈ పెళ్లి జరిగేదే కాదు. నా పరువు, మా కుటుంబ గౌరవం మొత్తం నాశనం అయ్యేది. మీరిద్దరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావడం లేదు" అంటూ బాలును హత్తుకుని కృతజ్ఞతలు తెలియజేస్తాడు.
అయితే రంగారావు బాలు-మీనాలను పొగుడుతుండడం ప్రభావతి, మనోజ్‌కు ఏమాత్రం నచ్చదు. వారి ముఖాల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. అది గమనించిన బాలు సరదాగా, "మామయ్య... మరీ అంతగా పొగడకండి. ఇక్కడ కొంతమందికి తట్టుకోవడం కష్టంగా ఉంది" అంటూ సెటైర్ వేయడంతో అక్కడ నవ్వులు పూస్తాయి. అదే సమయంలో మీనా కూడా తన మనసులోని మాట చెబుతుంది. "మా ఇద్దరికీ కుటుంబాలను కలపడం మాత్రమే తెలుసు. అందరూ సంతోషంగా ఉండాలనేదే మా కోరిక" అంటూ చెప్పడంతో అక్కడున్నవారు హర్షం వ్యక్తం చేస్తారు.
అయితే మీనాక్షి మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోదు. ప్రభావతిని ఉద్దేశిస్తూ పరోక్షంగా, "కొంతమంది కావాలనే కుటుంబాలను విడదీయాలని చూస్తారు. అలాంటి వాళ్లకు బతికుండగానే దేవుడు నరకం చూపిస్తాడు. వాళ్ల జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. ఈ మాటలు విన్న ప్రభావతి ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఇదంతా గమనించిన రోహిణి వెంటనే విషయం తనవైపు తిరుగుతుందేమోనని భయపడుతుంది. వెంటనే, "శుభకార్యంలో ఇలాంటి మాటలు ఎందుకు?" అంటూ టాపిక్ మార్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణుగుతుంది.
ఇక రంగారావు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతుండగా, "ఈ పెళ్లి మీ అందరి సహకారంతోనే జరగాలి" అంటూ సత్యం కుటుంబాన్ని కోరుతాడు. వెంటనే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను స్వీకరిస్తారు. ముందుగా మీనా, "పెళ్లి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ బాధ్యత నేనే తీసుకుంటాను" అని చెబుతుంది. వెంటనే మీనాక్షి మరోసారి హెచ్చరిస్తూ, "నువ్వు డెకరేషన్ ఎంత బాగా చేస్తావో నాకు తెలుసు. కానీ నీ వెనకాల గోతులు తీసేవాళ్లు ఉన్నారు. జాగ్రత్తగా ఉండు" అని సూచిస్తుంది. ఆ మాటలు విన్న మీనా ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది.
అటు బాలు కూడా ముందుకొచ్చి, "మామయ్య... ట్రాన్స్‌పోర్ట్ మొత్తం నేనే చూసుకుంటాను. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు" అని హామీ ఇస్తాడు. అలాగే రవి, "మా హోటల్ నుంచి చాలా తక్కువ ఖర్చుతో క్యాటరింగ్ ఏర్పాటు చేస్తాను. భోజనాల గురించి మీరు అస్సలు ఆందోళన పడొద్దు" అని మాట ఇస్తాడు. ఇక పెళ్లి మేకప్ గురించి చర్చ మొదలవుతుండగా శృతి ఒక మంచి ఐడియా చెబుతుంది. "బయట వాళ్లను వెతకడం ఎందుకు? మన ఇంట్లోనే రోహిణి ఉంది కదా. బ్రైడల్ మేకప్ చాలా బాగా చేస్తుంది" అని చెప్పడంతో అందరూ అంగీకరిస్తారు. అయితే రోహిణి మాత్రం ఇష్టం లేకపోయినా పరిస్థితుల దృష్ట్యా ఒప్పుకోవాల్సి వస్తుంది.
ఇలా కుటుంబ సభ్యులంతా ఒక్కో బాధ్యత తీసుకోవడంతో రంగారావు ఆనందానికి అవధులు ఉండవు. "ఇంత మంచి కుటుంబం నాకు దొరికిందంటే నా అదృష్టం" అంటూ భావోద్వేగానికి గురవుతాడు. అయితే ఎపిసోడ్ చివర్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. సత్యం, "అబ్బాయి వాళ్ల తరఫున ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? వాళ్ల కుటుంబం ఎలా ఉంది?" అని ప్రశ్నించగా, రంగారావు ఆసక్తికరమైన విషయం చెబుతాడు. "అబ్బాయి మేనమామ అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అతనికి ఒక గల్లీలో మటన్ కొట్టు ఉందట" అని చెప్పగానే బాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు.


Click it and Unblock the Notifications