Gundeninda Gudigantalu June 30th Episode: బాలు వల్ల కానిస్టేబుల్ సస్పెండ్..మీనా ఆగ్రహం, చింతామణి మరో కుట్ర
Courtesy: Jio hotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్‌లో వరుస ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చింతామణి రెచ్చగొట్టడంతో ప్రభావతి మీనాపై మరింత కోపంతో రగిలిపోతూ, ఆమె పూల వ్యాపారం, డ్రైవింగ్ స్కూల్‌ను కూడా మూసివేయిస్తానని సవాల్ చేస్తుంది. ఇదే సమయంలో బాలు, మీనా హాల్లో ఆవిరి పట్టుకుంటుండగా ప్రభావతి గొడవ పెట్టుకోవడం, శృతి వారికి ప్రత్యేక గది ఇవ్వాలని గట్టిగా నిలదీయడం హైలైట్‌గా నిలిచింది. మరోవైపు డ్రైవింగ్ స్కూల్‌లో బాలు గురువుగా మారి మీనాకు కారు నడపడం నేర్పడం వారి బంధాన్ని మరింత బలంగా చూపించింది. రెస్టారెంట్‌లో శృతి పనితీరును బాస్ ప్రశంసించగా, రవితో జరిగిన చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
ఇక ఎపిసోడ్‌కు అసలు ట్విస్ట్ కానిస్టేబుల్ అరవింద్ ఎంట్రీతో వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అరవింద్ బైక్‌కు బాలు వీల్ లాక్ వేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరవింద్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సుందరి-కిషోర్ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభం కాగా, రంగారావు బాలు-మీనాలకు కృతజ్ఞతలు తెలిపి పెళ్లి బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించాడు. మీనా ఫ్లవర్ డెకరేషన్, బాలు ట్రాన్స్‌పోర్ట్, రవి క్యాటరింగ్, రోహిణి బ్రైడల్ మేకప్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే చివర్లో వరుడి మేనమామకు మటన్ షాప్ ఉందని రంగారావు చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్‌కు గురవడం రాబోయే ఎపిసోడ్‌లపై ఉత్కంఠ పెంచింది.

Courtesy: Jio hotstar
మంగళవారం ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్టులు, భావోద్వేగాలతో సాగింది. ఒకవైపు సుందరి పెళ్లి ఏర్పాట్లు సందడిగా సాగుతుండగా, మరోవైపు బాలు చేసిన ఒక్క పని కానిస్టేబుల్ అరవింద్ జీవితాన్నే మలుపుతిప్పింది. సుందరి పెళ్లి ఏర్పాట్ల గురించి రంగారావు కుటుంబ సభ్యులతో చర్చిస్తుంటాడు. ప్రతి ఒక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తూ పెళ్లిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయిస్తాడు. ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్ట్ బాధ్యతను బాలు చూసుకోవాలని చెబుతాడు. అబ్బాయి తరఫు ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ, "వాళ్ల మేనమామే అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఆయనకు మటన్ షాప్ ఉంది" అని చెప్పడంతో బాలు ఒక్కసారిగా ఆసక్తిగా స్పందిస్తాడు.
వెంటనే సరదాగా, "అంటే రోహిణికి మేక మామ ఉన్నట్టు... కిషోర్‌కు మటన్ కొట్టు మామ ఉన్నాడన్నమాట. ఆయన గురించి చాలాసార్లు విన్నా, ఇప్పటివరకు కలిసే అవకాశం రాలేదు. ఒకసారి తప్పకుండా కలవాలి" అని అంటాడు. దానికి రంగారావు నవ్వుతూ, "పెళ్లిలో ఎలాగూ వస్తాడు. అప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోండి" అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూస్తాయి.
ఇక మరోవైపు మనోజ్ తాను ఇచ్చిన ఫిర్యాదు ఏమైందో తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. కానీ అక్కడ కూడా తన అహంకారమే అతడిని అవమానానికి గురిచేస్తుంది. స్టేషన్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, "నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్‌ని. నా కంప్లైంట్‌ను కూడా పట్టించుకోవడం లేదు. అవసరమైతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను. నేనెవరో మీకు తెలియదు" అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అతడి మాటలు విన్న పోలీసులు కూడా ఏమాత్రం తగ్గరు. "ఒక వెధవ చేతిలో మరో వెధవ మోసపోయాడు. నువ్విచ్చిన కంప్లైంట్‌పై మేము దర్యాప్తు చేస్తున్నాం. అవసరం లేని హంగామా చేయకు" అంటూ గట్టిగానే కౌంటర్ ఇస్తారు. దీంతో మనోజ్ మరింత కోపంతో, "మీ అందరిపై కంప్లైంట్ ఇస్తా" అంటూ బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు.
అయితే అప్పుడే అక్కడున్న ఓ కానిస్టేబుల్ అతడిని గుర్తుపట్టి ఆపేస్తాడు. "ఆ రోజు మా వాడి చెవిలో ఏదో చెప్పింది నువ్వే కదా?" అని ప్రశ్నించగా, మనోజ్ భయపడుతూ "అయ్యో... ఆరోజు నన్ను కొట్టారు కదా" అని సమాధానం చెబుతాడు. దానికి ఆ కానిస్టేబుల్ మరింత సీరియస్‌గా, "ఆ రోజు నేను డ్యూటీలో లేను. ఉండి ఉంటే చెంప మాత్రమే కాదు... నాలుక కూడా కోసేవాడిని. ఇంకోసారి ఈ స్టేషన్ వైపు కనిపిస్తే ప్రాణాలతో బయటకు వెళ్లవు" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్న మనోజ్ భయంతో అక్కడి నుంచి పరుగులు పెడతాడు.
ఇదిలా ఉండగా, బాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ఫోన్ మాట్లాడడం, నో పార్కింగ్‌లో వాహనం నిలపడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన కానిస్టేబుల్ అరవింద్ వీడియో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతుంది. స్టేషన్‌కు వచ్చిన అరవింద్‌ను చూసిన సహచరులు, "అసలు నువ్వేం చేసావో తెలుసా? మొత్తం డిపార్ట్‌మెంట్ నీ గురించే మాట్లాడుకుంటోంది" అంటూ ప్రశ్నిస్తారు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో ఉన్న అరవింద్‌ను ఎస్‌ఐ తన గదికి పిలుస్తాడు.
అక్కడ వైరల్ అవుతున్న వీడియోను చూపిస్తూ, "మనమే ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు చెబుతాం. కానీ వాటిని ముందుగా మనమే పాటించాలి. నీ నిర్లక్ష్యం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు పోయింది" అంటూ తీవ్రంగా మందలిస్తాడు. అప్పుడు అరవింద్ తన వాదన వినిపిస్తూ, "మా అమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. హాస్పిటల్‌కు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది. అందుకే హడావుడిలో హెల్మెట్ పెట్టుకోలేకపోయాను. రిపోర్టులు తీసుకురావాల్సి ఉండటంతో అలా జరిగింది" అంటూ వివరణ ఇస్తాడు.
అయితే పై అధికారులు అతడి వివరణను పట్టించుకోరు. కమిషనర్ ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారని, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘించడం అంగీకరించలేమని స్పష్టం చేస్తారు. చివరకు అరవింద్‌పై మూడు రోజుల సస్పెన్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నిర్ణయంతో అరవింద్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. "ఇదంతా బాలు వల్లే జరిగింది. కావాలనే నాపై కక్ష పెట్టి వీడియో తీసి వైరల్ చేశాడు. నా ఉద్యోగానికే మచ్చ తెచ్చాడు. ఇక నుంచి వాడిని నేను వదిలిపెట్టను. భవిష్యత్తులో ఒక్క అవకాశం దొరికినా బాలు అంతు చూస్తా" అంటూ ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు. చివర్లో అరవింద్ చేసిన ఈ ప్రతిజ్ఞతో బాలు-అరవింద్ మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారింది.
మరోవైపు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యకు ఎదురుగా మీనా కనిపిస్తుంది. ఇద్దరూ పలకరించుకోగా, మీనా సరదాగా "ఏంటి విద్యా.. ఈ మధ్య రోడ్ల మీదే ఎక్కువ కనిపిస్తున్నావ్. ఏమైనా స్పెషల్ సంగతులున్నాయా?" అని నవ్వుతూ ప్రశ్నిస్తుంది. దానికి విద్య చిరునవ్వుతో స్పందిస్తూ,"అదేం లేదు. ఇంటికి వెళ్తున్నాను. నిజానికి నీ గురించే ఆలోచిస్తున్నాను. నీకు ఫోన్ చేసి ఒక విషయం అడగాలనుకున్నాను. అంతలోనే నువ్వే ఎదురుపడ్డావు" అని చెబుతుంది. వెంటనే మీనా, "అయితే చెప్పు.. ఎక్కడివరకు వచ్చింది నీ ప్రేమకథ?'అని ఆసక్తిగా అడుగుతుంది.
దాంతో విద్య "నేను అతని ఫోన్ కూడా చూసాను. కానీ అందులో దాచిపెట్టిన రహస్యాలేమీ లేవు. ఫొటోలు, పాటలు, సాధారణ కాంటాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. కనీసం అమ్మాయిల నంబర్లు కూడా లేవు. అందుకే అతను చాలా మంచివాడేమో అనిపిస్తోంది. కానీ మంచి వ్యక్తి కావడం ఒక్కటే సరిపోదు కదా... జీవితాంతం కలిసి ఉండాలంటే మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కలవాలి. అదే విషయం ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు'అంటూ తన కన్ఫ్యూజన్‌ను వ్యక్తం చేస్తుంది.
విద్య మాటలు విన్న మీనా కాసేపు ఆలోచించి అద్భుతమైన సలహా ఇస్తుంది. 'ఒక పని చేయి. పది ముఖ్యమైన ప్రశ్నలతో ఒక పేపర్ తయారు చేయి. జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడుగు. నువ్వు నీ సమాధానాలు రాయి. అతనితో కూడా అదే ప్రశ్నలకు సమాధానాలు రాయించు. ఇద్దరి ఆలోచనలు, విలువలు, అభిప్రాయాలు ఎంతవరకు కలుస్తాయో చూసుకో. ఒకే విధంగా ఉంటే నమ్మకంగా ముందుకు వెళ్లొచ్చు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇలాంటి చిన్న పరీక్ష చాలా ఉపయోగపడుతుంది'అని చెబుతుంది. మీనా చెప్పిన ఐడియా విద్యకు బాగా నచ్చుతుంది. "వావ్... ఇది నిజంగా మంచి ఆలోచన. నాకు ఈ ఐడియా అసలు రాలేదు. థ్యాంక్యూ మీనా" అంటూ ఆనందపడుతుంది.
అయితే ఈ సంభాషణ మొత్తాన్ని దూరం నుంచి రోహిణి గమనిస్తూ ఉంటుంది. విద్య తనతో కాకుండా మీనాతో ఇంత ఓపెన్‌గా మాట్లాడడం ఆమెకు అస్సలు నచ్చదు. మనసులో అసూయ పెంచుకున్న రోహిణి వెంటనే అక్కడికి వచ్చి, "ఏంటి... ఇప్పుడు మీనా దగ్గరే అన్ని సలహాలా? నేను ఎక్కువా... మీనా ఎక్కువా?" అంటూ కాస్త వ్యంగ్యంగా ప్రశ్నిస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న విద్య తెలివిగా సమాధానం ఇస్తుంది. "నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్. మీనా మాత్రం నాకు మంచి అడ్వైజర్. ఇద్దరూ నాకు ముఖ్యమే" అని చెప్పడంతో రోహిణి బయటకు నవ్వినప్పటికీ, మనసులో మాత్రం అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు కథ అరుణ్ ఇంటికి మారుతుంది. సుమతి స్వయంగా మందుల సంచి తీసుకుని అరుణ్ ఇంటికి వస్తుంది. ఆమెను చూసిన రాజేశ్వరి ఎంతో సంతోషపడుతుంది."అమ్మా... ఇంత దూరం వచ్చి టాబ్లెట్లు ఇవ్వాలా? అరుణ్‌కు ఒక్క ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లేవాడు కదా"అని ప్రేమగా అడుగుతుంది. దానికి సుమతి, "మందులు ఇవ్వడానికే కాదు.. మిమ్మల్ని కూడా చూసి వెళ్లాలనిపించింది. అందుకే నేనే వచ్చాను"అని ఆప్యాయంగా సమాధానం చెబుతుంది. తర్వాత "మందులు వేసుకుని భోజనం చేశారా?"అని అడగగా, రాజేశ్వరి బాధగా,"ఈరోజు అరుణ్ ఉదయం నుంచి చాలా డల్‌గా ఉన్నాడు. రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. వాడు తినకపోతే నేను ఎలా తింటాను?"అని చెబుతుంది.
అది విన్న సుమతి వెంటనే అరుణ్ గది దగ్గరకు వెళ్లి పిలుస్తుంది. కొద్దిసేపటికి అరుణ్ నిరుత్సాహంగా బయటకు వస్తాడు. అతని ముఖంలో స్పష్టమైన బాధను గమనించిన సుమతి, "ఏమైంది? ఎందుకు ఇంత డల్‌గా ఉన్నారు?"అని ఆరా తీస్తుంది. అప్పుడు అరుణ్ తన మనసులోని బాధను బయటపెడుతూ, "ఒక పోకిరి కావాలనే నాపై కక్ష పెట్టాడు. నేను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించానని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. పై అధికారులకు అసలు విషయం చెప్పినా వినలేదు. నన్ను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు"అని బాధపడతాడు.
సుమతి ఆశ్చర్యపోతూ,"మీ మీద అంత కక్ష ఎందుకు పెట్టాడు?"అని అడుగుతుంది. దానికి అరుణ్, 'గతంలో రెండుసార్లు అతనిపై చర్యలు తీసుకున్నాను. అప్పటి నుంచే నాపై పగ పెంచుకున్నాడు. ఆ రోజు మా అమ్మ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌కు అర్జెంట్‌గా వెళ్తున్నాను. అదే సమయంలో వీడియో తీసి నన్ను కావాలనే ఇరికించాడు. నేను చెప్పిన వివరణను కూడా అధికారులు పట్టించుకోలేదు'అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. అప్పుడు సుమతి ఎంతో హుందాగా, ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది.
"ఇందులో ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం మూడు రోజుల సస్పెన్షన్ మాత్రమే కదా. దీన్ని శిక్షగా కాకుండా చిన్న విరామంగా తీసుకోండి. ఉద్యోగం అంటూ ఇన్ని రోజులు మీ అమ్మతో కూడా సరిగ్గా గడపలేకపోయారు. ఈ మూడు రోజులు ఆమెతో సంతోషంగా ఉండండి. ఆమెకు కావాల్సిన తోడుగా ఉండండి. మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది'అని ఓదారుస్తుంది. సుమతి మాటలు అరుణ్ మనసును బాగా తాకుతాయి. ఇప్పటివరకు కోపం, బాధతో ఉన్న అతను కాస్త శాంతించి, ఆమె మాటల్లో నిజం ఉందని భావిస్తాడు. మరోవైపు రాజేశ్వరి కూడా సుమతి చూపించిన ఆప్యాయత చూసి ఆనందపడుతుంది. దీంతో సుమతి-అరుణ్ మధ్య అనుబంధం మరింత బలపడినట్లు అయింది.
ఒకవైపు బాలు ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే మీనాను పిలిచి, తన ఆనందాన్ని పంచుకుంటాడు. "ఈరోజు నేను పెద్ద విజయం సాధించాను. నన్ను ఇబ్బంది పెట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అరవింద్‌కు సరైన గుణపాఠం చెప్పాను. నా వల్ల ఇప్పుడు అతని ఉద్యోగానికే ముప్పు వచ్చింది. మూడు రోజుల పాటు సస్పెండ్ కూడా అయ్యాడు"అని గర్వంగా చెబుతాడు. బాలు తనను తాను హీరోగా భావిస్తూ మాట్లాడుతుండగా, మీనా మాత్రం ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. బాలు చేసిన పనిని అభినందించాల్సిన చోట మీనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
"మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమవుతుందా? ఒకరి ఉద్యోగానికి ఇబ్బంది రావడం చూసి ఇలా సంతోషపడటం సరైంది కాదు. ట్రాఫిక్ రూల్స్‌ను ఎప్పుడూ కచ్చితంగా పాటించే వ్యక్తి ఒకరోజు నిబంధనలు ఉల్లంఘించాడంటే దానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అతను ఎమర్జెన్సీగా హాస్పిటల్‌కు వెళ్తున్నాడేమో, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చేమో అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా?"అంటూ నిలదీస్తుంది.
అక్కడితో ఆగకుండా మీనా "ఎదుటివాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకోకుండా తీర్పు చెప్పడం చాలా పెద్ద తప్పు. మీరు చేసిన పని వల్ల ఒకరి జీవనాధారం ప్రమాదంలో పడింది. ఉద్యోగం పోయే పరిస్థితి తీసుకురావడం పాపం. అలాంటి పనిని గొప్పగా చెప్పుకుంటూ నన్ను కూడా మీ ఆనందంలో భాగం కావాలని అడగడం ఇంకా పెద్ద తప్పు"అని చెబుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీనా మాటలు బాలు మనసును బాగా తాకుతాయి. ఇప్పటివరకు తాను చేసింది కరెక్ట్ అనే భావనలో ఉన్న బాలు ఒక్కసారిగా మౌనంగా మారిపోతాడు. "నేను నిజంగానే తప్పు చేశానా? కోపంలో హద్దు దాటానా?" అంటూ తనను తాను ప్రశ్నించుకుంటూ ఆలోచనలో పడిపోతాడు.
మరుసటి రోజు డ్రైవింగ్ స్కూల్‌లో బాలు ఎంతో ఓపికగా మీనాకు డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. మీనా కూడా ధైర్యంగా స్టీరింగ్ పట్టి కారు నడుపుతుండగా, అక్కడికి వచ్చిన శృతి వారిద్దరినీ చూసి ఆనందపడుతుంది. "మీనా చాలా బాగా డ్రైవింగ్ చేస్తోంది. మీ ఇద్దరి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మన డ్రైవింగ్ స్కూల్‌కు మంచి ప్రమోషన్ వస్తుంది"అని చెబుతుంది. అయితే మీనా మొదట నిరాకరిస్తుంది. వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెట్టడం తనకు ఇష్టం లేదని చెబుతుంది. కానీ శృతి మాత్రం ప్రమోషన్ కోసం ఇదంతా అవసరమే అంటూ వారి అనుమతి లేకుండానే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. వీడియో పోస్ట్ చేసిన విషయం తెలుసుకున్న బాలు, మీనా ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. శృతితో పాటు వారిద్దరి మధ్య కూడా చిన్నపాటి వాగ్వాదం జరుగుతుంది. అయితే ఆ గొడవ ఎక్కువసేపు కొనసాగదు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకుని వెంటనే ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి ఎంత బలంగా ఉందో ఎపిసోడ్ చూపించింది.
ఇక కథ డాన్స్ అకాడమీకి మారుతుంది. ప్రభావతి క్లాస్ నిర్వహిస్తుండగా ప్రేమ్‌కుమార్, రాధిక ఆలస్యంగా వస్తారు. వారిని చూసిన ప్రభావతి "ఇంత లేట్ ఎందుకు? డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నారా? లేక కాలక్షేపం చేయడానికి వస్తున్నారా?" అంటూ ప్రశ్నిస్తుంది. దానికి ప్రేమ్‌కుమార్ తెలివిగా సమాధానం చెబుతూ, "మేడమ్... మీ కోసమే వెయిట్ మిషన్ తీసుకురావాల్సి వచ్చింది. ఇకపై క్లాస్‌లో అందరూ బరువు చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయాలి" అని చెప్పడంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది.
అందరూ ఒక్కొక్కరుగా వెయిట్ చెక్ చేసుకుంటుండగా, ప్రభావతి మిషన్‌పై నిలబడగానే అది పనిచేయకుండా ఆగిపోతుంది. ఈ దృశ్యం చూసిన మీనాక్షి వెంటనే "నీ బరువుకు వెయిట్ మిషన్ కూడా భయపడిపోయింది. అది కూడా పనిచేయడం మానేసింది" అంటూ సెటైర్ వేస్తుంది. అవమానంగా ఫీల్ అయిన ప్రభావతి, "నేను కూడా ఇకపై బరువు తగ్గుతాను" అని అంటుంది. అదే సమయంలో చింతామణి తన అసలు ఆట మొదలుపెడుతుంది."బరువు తగ్గడం తర్వాత చూద్దాం మేడమ్. ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్లను కంట్రోల్ చేయండి. ఇంట్లో టెన్షన్ తగ్గితే బరువూ తగ్గుతుంది"అంటూ పరోక్షంగా మీనాను టార్గెట్ చేస్తుంది.
ఆ మాటలతో ప్రభావతి అహాన్ని మళ్లీ రెచ్చగొట్టిన చింతామణి, 'నిజంగా మీ ఇంట్లో మీ మాటకు విలువ ఉందా? మీనా మీరు చెప్పింది వింటుందా? మీరు వద్దంటే ఏ పని అయినా మానేస్తుందా?"అంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది. దాంతో ప్రభావతి తన అహంతో, "నా ఇంట్లో నేను చెప్పిందే శాసనం. అందరూ నా మాటే వింటారు. నేను చెప్పినదే జరుగుతుంది" అంటూ రాజమాతలా బిల్డప్ ఇస్తుంది. అయితే చింతామణి మాత్రం ఆగకుండా, మీనా ద్వారా ప్రభావతి మాటకు విలువ లేదని నిరూపించాలనే ఉద్దేశంతో మరో కుట్రకు తెరతీసేలా కనిపిస్తుంది. ఎపిసోడ్ చివర్లో చింతామణి రెచ్చగొట్టే మాటలు, ప్రభావతి అహం, మీనాపై పెరుగుతున్న కోపం... రాబోయే ఎపిసోడ్‌ల్లో కుటుంబ ఘర్షణకు దారితీసేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications