Gundeninda Gudigantalu july 2nd Episode: చింటూ కోసం రోహిణి కొత్త అవతారం. మనోజ్‌పై మీనాకు అనుమానం..

Courtesy: Jio hotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. డాన్స్ అకాడమీలో చింతామణి మాటలకు రెచ్చిపోయిన ప్రభావతి, మూడు నెలల్లో బరువు తగ్గి చూపిస్తానని సవాల్ విసురుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత డైటీషియన్ నంబర్ కోసం మనోజ్‌కు ఫోన్ చేస్తుంది. మరోవైపు చింటూ స్కూల్ పేరెంట్స్ మీటింగ్‌కు రావాలని సుగుణమ్మ కోరగా, బాలు, మీనా కనిపిస్తారనే భయంతో రోహిణి తీవ్ర ఆందోళన చెందుతుంది. ఆవేశంలో "చింటూ అమ్మ చనిపోయిందని చెప్పేయ్" అనడంతో సుగుణమ్మ షాక్ అవుతుంది. ఇక బాలు మీనాకు డ్రైవింగ్ నేర్పిస్తుండగా, ఆమె స్నేహితులు డ్రైవింగ్‌ను ప్రశంసిస్తారు.

తర్వాత మార్కెట్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరవింద్‌తో బాలుకు ఘర్షణ జరుగుతుంది.మాటామాటా పెరిగి అరవింద్ షర్ట్ చిరిగిపోవడంతో అతడు బాలుపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు.ఇంట్లో ప్రభావతి డైట్ చేస్తున్నానని ప్రకటించినా, మీనా చేసిన గారెలు, చికెన్ వాసనకు ఆగలేక దొంగచాటుగా తింటూ మనోజ్‌కు చిక్కిపోతుంది. అయినా తాను డైట్ ఫాలో అవుతున్నానంటూ కవర్ చేస్తుంది. చివర్లో చింటూని స్కూల్‌కు తీసుకెళ్తున్న సుగుణమ్మకు ఆటో దొరకకపోవడంతో, రోడ్డుపైకి పరిగెత్తిన చింటూని మనోజ్ కారు ఢీకొట్టే ప్రమాదం తృటిలో తప్పుతుంది. మనోజ్ వారిని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు ముందుకు రావడంతో, అక్కడ రోహిణి నిజం బయటపడుతుందేమోనన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Gunde Ninda Gudi Gantalu serial episode 718 july 2nd 2026 here is full story

Courtesy: Jio hotstar

గురువారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో మనోజ్ తన కారులో చింటూ, సుగుణమ్మలను స్కూల్ దగ్గర దింపుతాడు. అదే సమయంలో బాలు, మీనా కూడా అక్కడికి చేరుకుంటారు. మనోజ్ కారులో నుంచి చింటూ దిగడం చూసిన బాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. "మనోజ్‌కు చింటూ ఎలా తెలుసు? వీళ్లిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా?" అనే సందేహం అతని మనసులో మొదలవుతుంది. అప్పటికే చింటూ బాలను చూసి ఆనందంగా "అంకుల్..." అంటూ పరుగెత్తుకుంటూ వస్తాడు. అయితే ఈ దృశ్యం చూసిన సుగుణమ్మ ఒక్కసారిగా టెన్షన్‌కు గురవుతుంది. బాలు, చింటూ ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండాలని ఆమె ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ బాలు ప్రేమగా చింటూని పలకరిస్తూ, "ఏరా... నీ అమ్మ రాలేదా? పేరెంట్స్ మీటింగ్‌కు ఎందుకు కనిపించడం లేదు?" అని అడుగుతాడు.

దానికి అమాయకంగా స్పందించిన చింటూ, "మా అమ్మ విదేశాల్లో ఉంది అంకుల్. వీడియో కాల్‌లో మాట్లాడుతుంది" అని చెప్పేస్తాడు. చింటూ మాటలు విన్న వెంటనే సుగుణమ్మ పరిస్థితిని చాకచక్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. "అవును బాబూ... తనకు అర్జెంట్ పని రావడంతో వెంటనే వెళ్లాల్సి వచ్చింది" అంటూ మాట దాటవేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండకుండా, "మాకు ఆలస్యం అవుతోంది" అంటూ చింటూని తీసుకుని తొందరగా వెళ్లిపోతుంది. సుగుణమ్మ ప్రవర్తనను గమనించిన బాలు, మీనా ఇద్దరికీ కొత్త అనుమానాలు మొదలవుతాయి. గతంలో తమతో మాట్లాడినప్పుడు చింటూని తన కూతురే ఈ స్కూల్‌లో జాయిన్ చేయించిందని చెప్పిన సుగుణమ్మ, ఇప్పుడు మాత్రం ఆమె విదేశాల్లో ఉందని చెప్పడం బాలుకు ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించదు.

బాలు మీనాతో మాట్లాడుతూ, "ఈమె మన దగ్గర ఏదో దాస్తోంది. మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతోంది కానీ... ఆమె కళ్లల్లో మాత్రం భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో పెద్ద నిజాన్ని మనకు చెప్పకుండా దాచిపెడుతోంది" అని తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. మీనా కూడా బాలుతో ఏకీభవిస్తూ, "నాకూ అలాగే అనిపిస్తోంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి" అని అంటుంది.

మరోవైపు స్కూల్‌కు రావాల్సిన రోహిణి మాత్రం ఎవరికీ గుర్తుపడకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేస్తుంది. ఇంట్లోనే విగ్, పెద్ద కళ్లద్దాలు, ఫేస్ మాస్క్ ధరించి పూర్తిగా కొత్త లుక్‌లో తయారవుతుంది. ఆమెను చూసిన విద్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, "ఏంటి ఇలా తయారయ్యావు? నిన్ను నువ్వే గుర్తుపట్టలేని విధంగా ఉన్నావ్" అని అడుగుతుంది. దానికి రోహిణి, "మా మామయ్య, బాలు అక్కడ ఉంటారు. వాళ్లు నన్ను చూస్తే వెంటనే గుర్తుపడతారు. అందుకే ఇలా డిస్గైజ్ అయ్యాను. కానీ ఇంకా ఒక సమస్య ఉంది. నా గొంతు వింటే కూడా గుర్తుపడే అవకాశం ఉంది. అందుకే నువ్వు నా తరఫున మాట్లాడాలి" అంటూ విద్యను వేడుకుంటుంది.

మొదట విద్య కాస్త సందేహపడినా, చివరకు రోహిణి పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. అంతేకాకుండా స్కూల్‌లో ఎవరైనా ఏ ప్రశ్న అడిగినా ఎలా సమాధానం చెప్పాలి, తన గురించి ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు అనే విషయాలను రోహిణి ముందుగానే విద్యకు వివరంగా చెబుతుంది. విద్య కూడా వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని రోహిణికి అండగా నిలవాలని నిర్ణయించుకుంటుంది.

ఇక చింటూని తీసుకుని స్కూల్‌కు వచ్చిన సుగుణమ్మ నేరుగా ఆఫీస్ గదిలోకి వెళ్తుంది. అక్కడ సత్యం విద్యార్థుల పేర్లను నమోదు చేస్తూ కనిపించడంతో ఒక్కసారిగా కంగారుపడుతుంది. అతడికి కనిపించకుండా వెనక్కి వెళ్లిపోవాలని ప్రయత్నించినా, సత్యం ఆమెను గుర్తించి పిలుస్తాడు. "బాలు ముందే చెప్పాడు... చింటూ ఇదే స్కూల్‌లో చదువుతున్నాడని. మరి పేరెంట్స్ మీటింగ్‌కు చింటూ అమ్మ రాలేదా?" అని సత్యం ప్రశ్నిస్తాడు. వెంటనే తేరుకున్న సుగుణమ్మ, "చింటూ అమ్మ విదేశాల్లో ఉంది. వీడియో కాల్ ద్వారా మీటింగ్‌కు కనెక్ట్ అవుతుంది" అని సమాధానం ఇస్తుంది. అయితే ఆమె మాటల్లో కనిపించిన తడబాటు, ముఖంలో కనిపించిన ఆందోళనను సత్యం వెంటనే గమనిస్తాడు. "ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు?" అని అడగగా, "ఇలా మొదటిసారి పేరెంట్స్ మీటింగ్‌కు వచ్చాను. అందుకే టెన్షన్‌గా ఉంది" అంటూ సుగుణమ్మ పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది.

ఇక మరోవైపు రోహిణి తన అసలు గుర్తింపును దాచుకునేందుకు పక్కా ప్లాన్ తో రెడీ అవుతోంది. విగ్, పెద్ద కళ్లద్దాలు, ఫేస్ మాస్క్ ధరించి వీడియో కాల్ ద్వారా పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవుతుంది. ఆమె తరఫున మాట్లాడేందుకు విద్య ముందుగానే సిద్ధంగా ఉంటుంది. టీచర్ అడిగిన ప్రతి ప్రశ్నకు రోహిణి కేవలం నటిస్తుండగా, అసలు సమాధానాలన్నీ విద్య తన గొంతుతో చెబుతుంది. ఇద్దరూ కలిసి ఎంతో జాగ్రత్తగా ఈ డ్రామాను నడిపిస్తారు. అయితే ఈ నాటకంలో ఊహించని ట్విస్ట్ చింటూ రూపంలో వస్తుంది. వీడియో కాల్‌లో తన తల్లిని చూసిన చింటూ అమాయకంగా... "అమ్మ... నువ్వు మా అమ్మలా లేవు. మాస్క్ పెట్టుకున్నావు... కళ్లద్దాలు పెట్టుకున్నావు... జుట్టు కూడా కత్తిరించుకున్నావు..." అంటూ సందేహం వ్యక్తం చేస్తాడు.

చింటూ మాటలు విన్న సుగుణమ్మ వెంటనే అతడిని ఆపేస్తూ, "అలా మాట్లాడకూడదు. అదే నీ అమ్మ" అంటూ నోరు మూయించే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో వీడియో కాల్‌లో మాస్క్ ధరించడం చూసిన సత్యం కూడా ఆశ్చర్యపోతాడు. "వీడియో కాల్‌లో కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?" అంటూ తన మనసులో అనుమానం వ్యక్తం చేస్తాడు. అయినప్పటికీ రోహిణి, విద్య కలిసి ఎలాగోలా పేరెంట్స్ మీటింగ్‌ను పూర్తి చేస్తారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్న రోహిణి, "ఒక పెద్ద గండం గట్టెక్కింది" అంటూ విద్యకు కృతజ్ఞతలు చెబుతుంది.

పేరెంట్స్ మీటింగ్ ముగిసిన తర్వాత సుగుణమ్మ చింటూని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అదే సమయంలో బయట బాలు, మీనా కనిపించడంతో చింటూ మళ్లీ వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్తాడు. "ఏరా... మీ అమ్మ మీటింగ్‌కు వచ్చిందా?" అని బాలు అడగగా, చింటూ అమాయకంగా... "ఈరోజు మా అమ్మ మా అమ్మలా లేదు. జుట్టు కత్తిరించుకుంది... కళ్లద్దాలు పెట్టుకుంది... మాస్క్ కూడా వేసుకుంది. అసలు గుర్తుపట్టలేకపోయా.. " అంటూ చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న బాలు, మీనా ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. బాలు చింటూని ఓదారుస్తూ, "ఏం బాధపడకు. మేమున్నాం కదా. పద... నీకు ఇష్టమైనవి తినిపిస్తాను" అని అంటాడు. కానీ సుగుణమ్మ వెంటనే అడ్డుకుని, "అమ్మకు తెలిస్తే కోప్పడుతుంది" అంటూ చింటూని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.

ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత బాలు, మీనా ఇద్దరూ సుగుణమ్మపై మరింత అనుమానం వ్యక్తం చేస్తారు. "ఆవిడ మన దగ్గర ఏదో నిజం దాచిపెడుతోంది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతోంది కానీ, ఏదో భయంతో మాట్లాడుతోంది" అని బాలు అంటాడు. అయితే ఇదే సమయంలో మీనా మరో సంచలన అనుమానాన్ని బయటపెడుతుంది."ఒకవేళ... చింటూ తండ్రి మనోజేనా? చింటూ అమ్మ విదేశాల్లో ఉందంటున్నారు కదా... ఒకవేళ ఆమె కల్పన అయి ఉండొచ్చా?" అంటూ ఆశ్చర్యకరమైన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. మీనా మాటలు విన్న బాలు వెంటనే ఆ అనుమానాన్ని కొట్టిపారేస్తాడు. "మనోజ్‌కు అంత సీన్ లేదు. ఒకవేళ చింటూ తల్లి నిజంగానే కల్పన అయితే... అప్పట్లో డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చింది? అది అస్సలు లాజిక్ కాదు" అంటూ తన అభిప్రాయాన్ని చెబుతాడు. అయినా మీనా మాత్రం మనోజ్ వ్యవహారంపై తన అనుమానాన్ని వదిలిపెట్టదు.

ఇక కథ ఇంటికి సిప్ట్ అవుతుంది. శృతి ఫోన్ చూస్తూ వస్తూ అనుకోకుండా ప్రభావతిని ఢీకొంటుంది. ఆ దెబ్బకు శృతి గిరగిరా తిరిగి కుర్చీలో పడిపోవడంతో గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపులు విన్న ఇంట్లోని వారంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకుంటారు. ఏమైందని బాలు అడగగా, జరిగిన విషయం మొత్తం శృతి వివరిస్తుంది. వెంటనే బాలు తనదైన శైలిలో సరదాగా సెటైర్ వేస్తూ.. "ఇప్పటికైనా అర్థమైందా? ముల్లు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముల్లు మీద పడినా నష్టమయ్యేది ఆకుకే. అలాగే మా అమ్మను ఎవరు ఢీకొన్నా, మా అమ్మ ఎవరిని ఢీకొన్నా ప్రమాదం మాత్రం ఎదుటివాళ్లకే" అని అంటాడు. బాలు కామెంట్స్ నవ్వులు పూస్తాయి. అయితే రవి మాత్రం సరదాగా తీసుకోకుండా శృతిని మందలిస్తూ.. "ఫోన్ చూస్తూ నడవడం అలవాటైపోయింది. ఈ రోజుల్లో చేతిలో మొబైల్ ఉంటే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు తప్పవు" అని హెచ్చరిస్తాడు. శృతి మాత్రం ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆ తర్వాత సత్యం స్కూల్‌లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ గురించి ఇంట్లో ప్రస్తావిస్తాడు. "ఈరోజు చింటూ వాళ్ల అమ్మ వీడియో కాల్ ద్వారా మీటింగ్‌కు హాజరైంది. ఆమెను సరిగా చూడాలని ప్రయత్నించాను. కానీ ముఖానికి మాస్క్, కళ్లకు అద్దాలు పెట్టుకుని పూర్తిగా కవర్ చేసుకుంది. వీడియో కాల్‌లో కూడా అంత జాగ్రత్త ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు" అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు. సత్యం మాటలు పూర్తవకముందే మనోజ్ వెంటనే స్పందిస్తూ.. "కరోనా తర్వాత కొన్ని దేశాల్లో ఇప్పటికీ మాస్క్ తప్పనిసరి. విదేశాల్లో చాలా మంది ఇంకా కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. అందుకే ఆమె అలా చేసి ఉండొచ్చు" అని సమాధానం ఇస్తాడు. మనోజ్ ఇంత త్వరగా సమాధానం ఇవ్వడం బాలు, మీనాల దృష్టిని ఆకర్షిస్తుంది.

మనోజ్ మాటలు విన్న బాలు వెంటనే ప్రశ్నిస్తూ.. "ఈ విషయానికి నీకెందుకురా అంత తొందరగా సమాధానం చెప్పాలనిపించింది? సంబంధం లేకుండా ఆమెను ఎందుకు సమర్థిస్తున్నావు?" అని అడుగుతాడు. ఆ ప్రశ్నతో ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంటుంది. వెంటనే ప్రభావతి కలగజేసుకుని.. "వాడి తండ్రి ఎవరైనా, తల్లి ఎక్కడ ఉన్నా మనకెందుకు? అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చడం మానేయండి" అంటూ ఆ చర్చను ముగించే ప్రయత్నం చేస్తుంది. కానీ సత్యం మాత్రం తన సందేహాన్ని వదలకుండా.. "నాకు మాత్రం ఒకటే అర్థం కావడం లేదు. ఒక తల్లి తన ముఖాన్ని కూడా చూపించకుండా ఎందుకు దాచుకుంటుంది? బయట ప్రపంచానికి తల్లినని చెప్పుకోవడం ఇష్టం లేకపోవడం వెనుక ఏదో కారణం ఉండాలి" అని అంటాడు.

సత్యం మాటలకు ప్రభావతి మరింత ఘాటుగా స్పందిస్తుంది. "వాడి తల్లి ఎవడినో పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. పిల్లాడు అడ్డుగా ఉన్నాడని తన అమ్మ దగ్గర వదిలేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ల గురించి ఇంత ఆలోచించడం ఎందుకు?" అని అంటుంది. ప్రభావతి మాటలు విన్న రోహిణి లోలోపల తీవ్రంగా కుంగిపోతుంది. నిజం తనకే తెలిసినా బయటపెట్టలేని పరిస్థితిలో ఆమె తన బాధను, కోపాన్ని అదుపులో పెట్టుకుని మౌనంగా నిలబడిపోతుంది.

ఈ సమయంలో బాలు సరదాగా.. "అయితే మనోజ్‌నే చింటూ తండ్రి అనుకుందామా?" అని జోక్ చేస్తాడు. కానీ, మనోజ్ ఊహించని విధంగా "ఆ ఊహ ఎంత బాగుందో" అని నవ్వుతూ స్పందిస్తాడు. ఆ మాట విన్న ప్రభావతి ఒక్కసారిగా కోపంతో.. "ఛీ... ఛీ... వాడు నీ కొడుకు ఏంటి?" అంటూ మందలిస్తుంది. దానికి బాలు కూడా తనదైన శైలిలో "కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు అంటారుగా!" అంటూ మరో పంచ్ వేస్తాడు. అయితే.. మనోజ్ స్పందన మాత్రం బాలు, మీనాల అనుమానాలను మరింత పెంచుతుంది.

అందరూ తమ తమ గదుల్లోకి వెళ్లిన తర్వాత బాలు, మీనా ఈ విషయంపై సీరియస్‌గా మాట్లాడుకుంటారు. మీనా తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. "నాకు మాత్రం మనోజ్‌నే చింటూ తండ్రి అనిపిస్తోంది. చింటూ తల్లి కల్పన అయ్యి ఉండొచ్చు. ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన కూడా అదే విషయాన్ని సూచిస్తోంది" అని అంటుంది. అయితే బాలు మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెబుతాడు. "అనుమానాల ఆధారంగా ఎవరినీ తప్పుపట్టకూడదు. చింటూ గురించి పూర్తి నిజం తెలుసుకోవాలి. అసలు రహస్యం బయటపడితేనే ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు అన్నది తెలుస్తుంది" అని మీనాకు వివరిస్తాడు. ఇలా ఉత్కంఠను మరింత పెంచుతూ గురువారం ఎపిసోడ్ ముగిసింది. వచ్చే ఎపిసోడ్‌లో ఈ మిస్టరీకి సంబంధించిన కీలక క్లూలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X