Gundeninda Gudigantalu july 3rd Episode: చింతామణి,ప్రభావతి గుట్టురట్టు.. మీనా వార్నింగ్.. శ్రుతి రివెంజ్..
Courtesy: Jio hotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ లో స్కూల్‌లో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో చింటూని మనోజ్ కారులో తీసుకురావడం చూసిన బాలు అనుమానపడతాడు. చింటూ తన తల్లి విదేశాల్లో ఉందని చెప్పడంతో సుగుణమ్మ వెంటనే మాట మార్చి పరిస్థితిని కవర్ చేస్తుంది. ఇదే సమయంలో రోహిణి విగ్, మాస్క్, కళ్లద్దాలతో వీడియో కాల్ ద్వారా పేరెంట్స్ మీటింగ్‌కు హాజరవుతుంది. ఆమె తరఫున విద్య మాట్లాడి పరిస్థితిని చాకచక్యంగా చక్కదిద్దుతుంది. అయితే వీడియో కాల్‌లో తన తల్లి రూపం మారిపోయిందని చింటూ అమాయకంగా చెప్పడం అందరిలో కొత్త అనుమానాలకు దారితీస్తుంది. మీటింగ్ ముగిసిన తర్వాత కూడా చింటూ అదే విషయాన్ని బాలు, మీనాలకు చెప్పడంతో సుగుణమ్మపై వారి అనుమానాలు మరింత బలపడతాయి.
మీనా ఒకవేళ చింటూ తండ్రి మనోజే అయి ఉంటాడేమోనని సందేహం వ్యక్తం చేస్తే, బాలు మాత్రం ఆధారాలు లేకుండా నిర్ణయానికి రావద్దని చెబుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత సత్యం కూడా వీడియో కాల్‌లో చింటూ తల్లి మాస్క్ ధరించడంపై అనుమానం వ్యక్తం చేస్తాడు. వెంటనే మనోజ్ ఆమెను సమర్థిస్తూ మాట్లాడటం బాలు, మీనాలకు మరింత అనుమానం కలిగిస్తుంది. సరదాగా బాలు "మనోజ్‌నే చింటూ తండ్రి అనుకుందామా?" అని అనగా, మనోజ్ ఊహించని విధంగా స్పందించడం కథలో కొత్త ట్విస్ట్‌కు దారితీస్తుంది. చివర్లో మీనా తన అనుమానాన్ని మరింత బలంగా వ్యక్తం చేయగా, అసలు నిజం త్వరలోనే బయటపడబోతుందనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Courtesy: Jio hotstar
శుక్రవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలు, మీనా చింటూ గురించి మాట్లాడుకుంటూ కనిపిస్తారు. స్కూల్‌లో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చింటూ తల్లిదండ్రుల గురించి చర్చిస్తారు. ఈ సమయంలో మీనా తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెడుతుంది. "నాకు మాత్రం చింటూ మనోజ్ కొడుకే అనిపిస్తోంది. అతని తల్లి కల్పన అయి ఉండొచ్చు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది.
మీనా మాటలు విన్న బాలు వెంటనే ఆమెను ఆపేస్తాడు. "ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఇలాంటి ఆరోపణలు చేయొద్దు. నిజం ఏంటో తెలియక ముందే నిర్ణయానికి రావడం సరికాదు" అని చెబుతాడు. కానీ మీనా మాత్రం తన అనుమానాన్ని వదిలిపెట్టదు. "మీరు అనుకున్నంత అమాయకుడు మీ అన్నయ్య కాదు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బులు తీసుకెళ్లి కల్పనకు ఇచ్చినప్పుడే అతని గురించి నాకు అర్థమైంది. ఒకవేళ ఇదే నిజమైతే రోహిణికి ఎంత అన్యాయం జరుగుతుంది?" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. బాలు మాత్రం "నిజం త్వరలోనే బయటపడుతుంది. అప్పటి వరకు ఓపికగా ఉండాలి" అంటూ మీనాను శాంతింపజేస్తాడు.
ఇక మరోవైపు ప్రభావతి తన బరువు తగ్గాలనే పట్టుదలతో మనోజ్‌ను డైటీషియన్ తీసుకురమ్మని అడుగుతుంది. వెంటనే మనోజ్ డైటీషియన్ సునీతను ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో అందరూ చేరిన తర్వాత సునీత ప్రభావతి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడగగా, బాలు తనదైన శైలిలో "మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇల్లు తాకట్టు పెట్టింది, నా భార్యను రోజూ ఇబ్బంది పెడుతుంది" అంటూ అసలు విషయాన్ని వదిలేసి కుటుంబ గొడవలనే చెప్పడం మొదలుపెడతాడు.
వెంటనే మీనా కలగజేసుకుని, "ఆమె అడిగింది ఒంటి గురించి... ఇంటి గురించి కాదు" అంటూ బాలును ఆపేస్తుంది. అయినా బాలు తగ్గకుండా, "రోజుకు నాలుగుసార్లు టీ తాగుతుంది. బిర్యానీ అయితే పీకలదాకా తింటుంది. చికెన్ ఉంటే పావుకిలోకు ఎక్కువ, అరకిలోకు తక్కువ తినదు" అంటూ ప్రభావతి ఫుడ్ హ్యాబిట్స్‌ను బయటపెడతాడు. దీంతో ఇంట్లో వారంతా నవ్వుకుంటారు.
ఆ తర్వాత డైటీషియన్ ప్రభావతి ఫొటో తీసి, ఏఐ టెక్నాలజీ సహాయంతో మూడు నెలల తర్వాత ఆమె ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. సన్నగా, స్టైలిష్‌గా మారిన తన ఫొటోను చూసిన ప్రభావతి మురిసిపోతుంది. "నేను కూడా ఇలా మారిపోతానా?" అంటూ ఆనందంలో తేలిపోతుంది. అయితే వెంటనే డైటీషియన్ అసలు షాక్ ఇస్తుంది. డైట్ ప్లాన్‌తో పాటు ప్రత్యేక ఆహారం అందించేందుకు వారానికి రూ.8,000 ఫీజు ఉంటుందని చెప్పడంతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ప్రభావతి మాత్రం "ఎంత ఖర్చయినా పర్వాలేదు... నేను సన్నబడాలి" అంటూ వెంటనే మనోజ్ చేత డబ్బులు ఇప్పించేస్తుంది.
ఈ సమయంలో మీనా మరో ట్విస్ట్ ఇస్తుంది. "మీరు ఇచ్చే డైట్‌ను నేనే ఇంట్లో తయారు చేస్తే ఎంత ఇస్తారు?" అని డైటీషియన్‌ను అడుగుతుంది. దానికి ఆమె, "రోజుకు సుమారు రూ.500 వరకు ఇస్తాం. క్లయింట్‌ను బట్టి మారుతుంది" అని సమాధానం చెబుతుంది. వెంటనే మీనా, "అయితే ఇకపై డైట్ ఫుడ్ నేనే తయారు చేస్తాను. రోజుకు రూ.500 ఇస్తే చేస్తాను, లేదంటే చేయను" అని స్పష్టం చేస్తుంది. మీనా మాటలకు ప్రభావతి షాక్ అవుతుంది. "ఇంట్లో వాళ్లకే డబ్బులు అడుగుతావా?" అని ప్రశ్నించగా, మీనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "నా పని నేను చేస్తాను. అదనంగా ఈ పని చేయాలంటే విలువ ఇవ్వాలి" అని గట్టిగా సమాధానం చెబుతుంది.
ఈ సమయంలో సత్యం కూడా మీనాకు అండగా నిలుస్తాడు. "మీనాకు ఇప్పటికే ఇంటి పనులు, బిజినెస్ పనులు చాలా ఉన్నాయి. అంత పని మధ్య డైట్ కూడా తయారు చేయాలంటే ఆమె సమయానికి విలువ ఇవ్వాలి. డబ్బులు ఇస్తే చేస్తుంది, లేకపోతే వద్దు" అంటూ మీనా నిర్ణయానికి మద్దతు పలుకుతాడు. చివరికి ఇంట్లో అందరూ చర్చించి రోజుకు రూ.300 ఇవ్వాలని నిర్ణయిస్తారు. దానికి మీనా కూడా అంగీకరిస్తుంది. మరోవైపు ప్రభావతి మాత్రం మూడు నెలల్లో తాను సన్నగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తానని ఊహల్లో విహరిస్తూ కనిపిస్తుంది.
మరోవైపు ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తన చినిగిపోయిన షర్ట్‌ను చూస్తూ బాలుపై తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తాడు. తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎలాగైనా బాలుకు బుద్ధి చెప్పాలని మనసులో నిర్ణయించుకుంటాడు. అప్పుడే సుమతి అరుణ్ ఇంటికి వస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే రాజేశ్వరికి పూలు ఇచ్చి క్షేమ సమాచారాలు అడుగుతుంది. అప్పటికే గది నుంచి బయటకు వచ్చిన అరుణ్‌ను చూసిన రాజేశ్వరి, "సుమతి పూజ కోసం ఫోన్ తీసుకొచ్చింది" అని చెబుతుంది. వెంటనే అరుణ్ ఆ ఫోన్‌కు ఎంత డబ్బు అయ్యిందని అడుగుతాడు. సుమతి మాత్రం "డబ్బులు అవసరం లేదు" అని చెప్పినా.. "మీకు కూడా ఖర్చులు ఉంటాయి కదా" అంటూ బలవంతంగా ఆమె చేతిలో డబ్బులు పెడతాడు.
ఈ సందర్భంగా రాజేశ్వరి తన కొడుకును చూసి, "ఉతకడానికి ఏమైనా బట్టలు ఉన్నాయా?" అని అడుగుతుంది. దానికి అరుణ్, "ఆ చినిగిపోయిన షర్ట్ తప్ప మిగతావన్నీ ఉతుకు" అని చెబుతాడు. దీంతో సుమతికి అనుమానం వచ్చి, "షర్ట్ ఎందుకు చినిగింది?" అని ప్రశ్నిస్తుంది. దానికి రాజేశ్వరి బాధగా స్పందిస్తూ, "మా వాడిని ఒక వెధవ ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాడు. వాడి వల్లే ఉద్యోగం కూడా పోయింది. ఇటీవల గొడవలో షర్ట్ కూడా చింపేశాడు" అని వివరిస్తుంది.
ఈ విషయం విన్న సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. "అలాంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయించొచ్చు కదా.. ఎందుకు వదిలేశారు?" అని సుమతి ప్రశ్నిస్తుంది. కానీ అరుణ్ మాత్రం, "టైం వస్తుంది... అప్పటి వరకు వెయిట్ చేస్తా" అంటూ ప్రతీకారం తీర్చుకునే సంకేతాలు ఇస్తాడు. రాజేశ్వరి మాత్రం గొడవలు వద్దని, అలాంటి వారిని పట్టించుకోవద్దని కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. సుమతి కూడా అదే మాట చెబుతూ అనవసర గొడవల్లో పడొద్దని సూచిస్తుంది. అయినప్పటికీ అరుణ్ మనసులో మాత్రం బాలుపై కోపం ఏమాత్రం తగ్గదు.
మరోవైపు డాన్స్ క్లాస్‌లో ప్రభావతి శిష్యులకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. చింతామణి సరిగా డాన్స్ చేయకపోవడంతో ప్రభావతి, "ఒళ్లు దగ్గర పెట్టుకుని డాన్స్ చేయి" అంటూ మందలిస్తుంది. కానీ చింతామణి మాత్రం మనసులో, "నాకు డాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి లేదు. మీనాపై రివెంజ్ తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను" అని అనుకుంటుంది. బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు అమాయకంగా ప్రవర్తిస్తుంది. కొద్దిసేపటి తర్వాత క్లాస్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభావతి.. చింతామణితో ప్రత్యేకంగా మాట్లాడడం మొదలుపెడుతుంది.
ఇదే సమయంలో మీనా తన అత్తయ్య మీనాక్షికి టిఫిన్ తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంట్లోకి వచ్చిన వెంటనే కొంతమంది స్టూడెంట్స్ ప్రవర్తన చూసి అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. గతంలో ఇదే విషయం గురించి చెప్పినప్పుడు మీనాక్షి స్పందించిన తీరు గుర్తుకు రావడంతో మౌనంగా లోపలికి వెళ్తుంది. అక్కడ హాల్‌లో ప్రభావతి, చింతామణి ఇద్దరూ గతంలో కలిసి చేసిన కుట్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పటికే మీనాక్షి వచ్చి, "ఇప్పుడైనా రావడం గుర్తొచ్చిందా?" అని అడుగుతుంది.
మీనాక్షి చింతామణిని పరిచయం చేస్తూ మాట్లాడగా.. మీనా వెంటనే, "ఆమె గురించి నాకు చాలా బాగా తెలుసు" అని అర్థవంతంగా సమాధానం ఇస్తుంది. దీనికి ప్రభావతి వెటకారంగా స్పందిస్తూ, "పరిచయం చేసేంత గొప్ప వ్యక్తి నువ్వు కాదు" అన్నట్లుగా మీనాను అవమానించేలా మాట్లాడుతుంది. అంతేకాదు, "నా శిష్యురాలు చింతామణిని నువ్వు ఏమీ చేయలేవు. ఆమె తన రంగంలో నంబర్ వన్. ఆమె ముందు నువ్వు గడ్డి పోచలాంటి దానివి" అంటూ సొంత కోడలినే తక్కువ చేసి మాట్లాడుతుంది.
ప్రభావతి మాటలకు మీనా కూడా ఘాటుగానే స్పందిస్తుంది. "ఇప్పుడే అర్థమైంది... మీది గురు-శిష్యుల బంధం కాదు, కుట్రల బంధం. ఎవరు గురువు, ఎవరు శిష్యురాలో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది" అని చెబుతుంది. ఆ తర్వాత మీనాక్షిని హెచ్చరిస్తూ, "పిన్ని... జాగ్రత్త. చీమలు వస్తే పాములు కూడా ఇంట్లోకి వస్తాయి అంటారు. మీ ఇంట్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది" అని అంటుంది. దానికి ప్రభావతి ఆగ్రహంతో, "నన్ను పాముతో పోలుస్తావా?" అని ప్రశ్నించగా.. మీనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "పాముతో పోల్చడం కూడా పాముకే అవమానం... మీరు వానపాములు" అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది.
చింతామణిని పొగుడుతూ ప్రభావతి మరోసారి మీనాను రెచ్చగొడుతుంది. "ఆమె తన రంగంలో ఎదురు లేని వ్యక్తి. నీకు ఆమెతో పోలికే లేదు" అని అంటుంది. దీంతో మీనా చివరగా, "గాడిద వెనకాల తన్నించుకున్న తర్వాతే నిజం తెలుస్తుంది. బయటి వాళ్లు మోసం చేస్తే జాగ్రత్తపడతాం. కానీ ఇంట్లో వాళ్లే మోసం చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటాను. నేను వెనక్కి తగ్గేది లేదు. కాలమే మీ ఇద్దరికీ సమాధానం చెబుతుంది" అంటూ ప్రభావతి, చింతామణికి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు.. బాలు తన భార్య మీనాకు తెలియకుండా ఓ చిట్టి వేస్తాడు. ఆ చిట్టి ద్వారా వచ్చే డబ్బులతో మీనాకు బంగారు గొలుసు కొనివ్వాలని మనసులో నిర్ణయించుకుంటాడు. ఎప్పటి నుంచో భార్యకు ఒక మంచి బహుమతి ఇవ్వాలనుకున్న బాలు, ఈసారి ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తాడు. తన ప్లాన్‌ను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా కొనసాగిస్తాడు. మరోవైపు కథ ఇంటికి మారుతుంది. వంటగదిలో ఒంటరిగా ఉన్న మీనా, ప్రభావతి చేసిన ద్రోహాన్ని గుర్తుచేసుకుని తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. తన వ్యాపారాన్ని దెబ్బతీయడానికి చింతామణితో కలిసి అత్తయ్య వేసిన ప్లాన్‌ను తలుచుకుంటూ బాధపడుతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన శృతి కాఫీ కావాలని అడుగుతుంది. కానీ మీనా ఆలోచనల్లో ఉండటంతో స్పందించదు. ఆమె ముఖంలో కనిపిస్తున్న బాధను గమనించిన శృతి, "ఏమైంది మీనా? ఎందుకు ఇలా ఉన్నావు?" అని ఆప్యాయంగా అడుగుతుంది. దాంతో మీనా మనసులోని బాధను బయటపెడుతుంది. "చింతామణితో కలిసి మన అత్తయ్య నన్ను, నా వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తోంది. మొన్న వచ్చిన పెద్ద ఆర్డర్ నేను పూర్తి చేయకుండా కావాలనే డ్రామా ఆడింది. ఈ విషయం బాలుకు చెబితే ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. కానీ మన ఇంట్లో వాళ్లే మనకు వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతోంది" అంటూ కన్నీటి పర్యంతమవుతుంది.
మీనా మాటలు విన్న శృతి తీవ్ర ఆగ్రహానికి గురవుతుంది. "అత్తయ్య చేసిన పనికి తప్పకుండా బుద్ధి చెప్పాలి. ఆమెకు ఒకసారి గుణపాఠం చెప్పకపోతే ఇలాగే కొనసాగుతుంది" అని అంటుంది. అయితే మీనా మాత్రం శాంతంగా స్పందిస్తూ, "కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఇప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. గొడవలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు" అని చెబుతుంది. పైకి మీనా మాటకు అంగీకరించిన శృతి మాత్రం మనసులో, "అవకాశం దొరికితే మాత్రం అత్తయ్యకు తగిన బుద్ధి చెబుతాను" అని నిర్ణయించుకుంటుంది.
కొద్దిసేపటి తర్వాత ప్రభావతి, మనోజ్ ఇంటికి వస్తారు. డైటీషియన్ సూచించిన స్పెషల్ డైట్‌ను వెంటనే సిద్ధం చేయాలని మీనాకు ఆదేశిస్తారు. అప్పుడు మీనా ప్రశాంతంగానే, "రోజుకు 500 రూపాయలు ఇస్తేనే డైట్ తయారు చేస్తాను" అని స్పష్టం చేస్తుంది. దాంతో ప్రభావతి కోపంగా, "నాకూ డబ్బులు తీసుకుంటావా?" అని ప్రశ్నిస్తుంది. అందుకు మీనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "నన్ను మోసం చేయాలనుకున్న తర్వాత మీ మీద నాకు జాలి, దయ ఏమీ లేవు. పని చేస్తే దానికి విలువ ఇవ్వాలి" అంటూ గట్టిగా సమాధానం ఇస్తుంది.
ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే శృతి నిశ్శబ్దంగా ఓ ప్లాన్ అమలు చేస్తుంది. ఇదే సరైన అవకాశం అని భావించి, ప్రభావతి కోసం సిద్ధం చేస్తున్న స్పెషల్ డైట్‌లో ఎవరికీ తెలియకుండా కొద్దిగా ఆముదం కలుపుతుంది. ఈ విషయం మీనాకు కూడా తెలియదు. ఇంతలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మనోజ్ ముందుకొచ్చి, "500 రూపాయలు నేను ఇస్తాను. డైట్ తీసుకురా" అని చెబుతాడు. డబ్బులు తీసుకున్న మీనా వెంటనే డైట్ సిద్ధం చేసి ప్రభావతి, మనోజ్‌లకు అందిస్తుంది.
డైట్‌లో ఆముదం కలిసిన విషయం తెలియని ప్రభావతి, "స్పెషల్ డైట్ అంటే ఇలాగే ఉంటుందేమో" అనుకుంటూ ఎలాంటి అనుమానం లేకుండా తినడం ప్రారంభిస్తుంది. మనోజ్ కూడా అదే డైట్ తింటాడు. అయితే ఆ డైట్‌లో శృతి కలిపిన ఆముదం ప్రభావం ఎలా ఉండబోతోంది? ప్రభావతి, మనోజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? శృతి చేసిన పని బయటపడుతుందా? లేక అది మీనా చేసినట్టుగా అపార్థం చేసుకుంటారా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది. తదుపరి ఎపిసోడ్‌లో ఈ ట్విస్ట్ కథను మరింత ఆసక్తికరంగా మలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications