Gundeninda Gudigantalu july 6th Episode: సుమతికి అరుణ్ ప్రపోజ్.. బాలు-మీనాలతో గొడవ.. శృతి రివేంజ్ ప్రాణాలపైకి!

Courtesy: Jio hotstar

Gundeninda Gudigantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. గత ఎపిసోడ్‌లో ప్రభావతి, మనోజ్ తనపై, మీనాపై చేసిన కుట్రలకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న శృతి.. వాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన డైట్ ఫుడ్‌లో ఆముదం కలిపిన విషయం తెలిసిందే. అదే ఈ ఎపిసోడ్‌లో భారీ కలకలానికి దారితీసింది. శృతి వేసిన ప్లాన్‌తో ప్రభావతి, మనోజ్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒకవైపు నవ్వులు పూయిస్తే.. చివర్లో జరిగిన పరిణామాలు కథను మరో ఆసక్తికర మలుపు తిప్పాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే ఆముదం ప్రభావం మొదలవుతుంది. డైట్ తిన్న కొద్దిసేపటికే ప్రభావతి, మనోజ్ ఇద్దరికీ వరుసగా విరోచనాలు మొదలవుతాయి. ఒకసారి కాదు.. పదేపదే వాష్‌రూమ్‌కు పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతసేపూ అటూ ఇటూ తిరుగుతుండటంతో ఇద్దరూ పూర్తిగా నీరసించి చివరికి హాల్‌లోనే కూర్చోలేని పరిస్థితికి చేరుకుంటారు.

ఈ సమయంలో హాల్లో వారిని చూసిన బాలు.. మొదట దొంగలు ఇంట్లోకి వచ్చారేమో అనుకుని పెద్దగా కేకలు వేస్తూ అందరినీ పిలుస్తాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే నేలపై కూర్చున్నది ప్రభావతి, మనోజ్ అని తెలిసి షాక్ అవుతాడు. "ఏమైంది? ఇక్కడ ఇలా ఎందుకు కూర్చున్నారు?" అని అడగగా.. "డైట్ తిన్నప్పటి నుంచి గండిపేట చెరువుకు గండి పడినట్టుంది. వరుసగా వాష్‌రూమ్‌కే వెళ్లాల్సి వస్తోంది" అంటూ తమ బాధను ఇద్దరూ చెప్పుకుంటారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి కామెడీని పంచుతాయి.

Gunde Ninda Gudi Gantalu serial episode 720 july 6th 2026 here is full story

Courtesy: Jio hotstar

ఇద్దరూ అంతసార్లు వాష్‌రూమ్‌కు వెళ్లడంతో ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో నీళ్లు కూడా అయిపోతాయి. ఆ పరిస్థితిని చూసిన బాలు వారిని మరింత ఆటపట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే సత్యం మాత్రం బాలను ఆపేస్తూ, "ఇలాంటి సమయంలో ఎగతాళి చేయడం సరైంది కాదు" అని హెచ్చరిస్తాడు. దీంతో బాలు కూడా సైలెంట్ అయిపోతాడు. ఇక ప్రభావతి, మనోజ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శృతి భయపడుతుంది. తాను కోపంతో చేసిన పని ఇంత పెద్ద సమస్యగా మారుతుందని ఊహించలేదని ఆందోళన చెందుతుంది. "వాళ్లకు ఏమైనా అయితే నాపైనే నింద పడుతుంది" అంటూ టెన్షన్‌లో పడిపోతుంది.

ఇదే సమయంలో మీనా పరిస్థితిని చక్కదిద్దేందుకు ముందుకొస్తుంది. తన తల్లికి ఫోన్ చేసి ఇంటి చిట్కా అడుగుతుంది. ఆ సమయంలో శృతి కూడా వంటగదిలోకి వెళ్లి మీనాకు అసలు నిజం చెబుతుంది. "అత్తయ్య చింతామణితో చేతులు కలిపి నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. కోపంతోనే వాళ్ల డైట్‌లో ఆముదం కలిపాను" అని ఒప్పుకుంటుంది. శృతి చెప్పిన విషయం విని మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. "అలా ఎందుకు చేశావు?" అని ప్రశ్నిస్తుంది. దానికి శృతి, "నిన్ను కాపాడాలనే కోపంతో చేశాను" అని చెబుతుంది. అయితే పరిస్థితి మరింత పెద్దది కాకుండా చూసిన మీనా, "ఈ విషయం ఇక్కడితో ముగిసిపోవాలి. నువ్వు నాకు ఏమీ చెప్పలేదు.. నేను ఏమీ వినలేదు. ఇది మనిద్దరి మధ్యే ఉండాలి" అంటూ శృతిని హెచ్చరిస్తుంది.

తన తల్లి చెప్పిన ఇంటి వైద్యం ప్రకారం మీనా వెంటనే కషాయం తయారు చేసి ప్రభావతి, మనోజ్‌కు తాగిస్తుంది. కొంతసేపటికి ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ పరిస్థితి కుదుటపడిన వెంటనే ప్రభావతి తన అసలు స్వభావాన్ని బయటపెడుతుంది. "ఇదంతా మీనా చేసిన పనే. మాకు లూజ్ మోషన్స్ రావడానికి కారణం కూడా ఆమెనే" అంటూ మరోసారి మీనాపై ఆరోపణలు చేస్తుంది. అది విన్న శృతి ఇక ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోలేకపోతుంది. "మీకు అసలు బుద్ధుందా? ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వెంటనే మీనాపై నిందలు వేయడమేనా? మీలాంటి వాళ్లు ఎలా పోతే మాకేం?" అంటూ ప్రభావతిపై తీవ్రంగా విరుచుకుపడుతుంది.

అక్కడితో ఆగని మనోజ్ కూడా, "డైట్‌లో ఏదో కలిపినట్టుంది" అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. దీంతో శృతి మరోసారి ఫైర్ అవుతుంది. "మీకు బుద్ధుందా? బుర్ర ఉందా? మిమ్మల్ని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలి" అంటూ గట్టిగా నిలదీస్తుంది. ఇంట్లో జరుగుతున్న ఈ గొడవను గమనించిన సత్యం చివరికి కీలక నిర్ణయం తీసుకుంటాడు. "ఇక నుంచి ఇంట్లో ప్రత్యేక డైట్‌లు, వేరే వేరే వంటలు ఏమీ ఉండవు. అందరూ ఒకటే భోజనం తింటారు. అనవసరంగా మీనాను ఇబ్బంది పెట్టడం ఇకపై నేను సహించను" అంటూ ఇంట్లో అందరికీ కఠిన ఆదేశాలు జారీ చేస్తాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో శృతి తన అత్త ప్రభావతి, మనోజ్‌పై కోపంతో వేసిన ప్లాన్ మొదట వారికి చుక్కలు చూపించినా.. చివరికి అదే వ్యవహారం ఇంట్లో మరో పెద్ద గొడవకు దారి తీసింది.

మరోవైపు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తన తల్లి రాజేశ్వరితో కలిసి గుడికి వస్తాడు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత దేవుడికి మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఆలయానికి వచ్చిన వారికి అనుకోకుండా అక్కడ సుమతి కనిపిస్తుంది. పూల దుకాణంలో పని చేస్తున్న సుమతిని చూసి అరుణ్ ఆశ్చర్యపోతాడు. "మీరు ఇక్కడేనా?" అని అడగగా.. "ఇదే మా పూల కొట్టు.. మా అమ్మతో కలిసి ఇక్కడే పని చేస్తుంటాను" అంటూ సుమతి పరిచయం చేస్తుంది. ఈ సందర్భంగా అరుణ్, తన తల్లి త్వరగా కోలుకోవడానికి కారణమైన శృతికి కృతజ్ఞతలు తెలుపుతాడు. ఆరోగ్యం బాగైతే గుడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తామని మొక్కుకున్నామని చెబుతాడు. వెంటనే సుమతి పూల దండలు ఇచ్చి పూజ చేయించుకోవాలని సూచిస్తుంది. డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించగా, వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తుంది. సుమతి మనసును చూసి రాజేశ్వరి ఎంతో మురిసిపోతుంది.

రాజేశ్వరి, సుమతి తల్లి పార్వతితో మాట్లాడుతూ.. "మీ కూతురు ఎందుకు ఇంత మంచిగా అందరినీ చూసుకుంటుందో ఇప్పుడు అర్థమైంది. ఆమె మంచి మనసుకు మీ పెంపకమే కారణం. నిజంగా మీలాంటి తల్లి ఉండటం అదృష్టం" అంటూ ప్రశంసలు కురిపిస్తుంది. ఆ మాటలు విన్న పార్వతి కూడా ఆనందంతో పొంగిపోతుంది. అనంతరం సుమతి స్వయంగా వారిద్దరినీ గుడిలోకి తీసుకెళ్లి అర్చనలు చేయిస్తుంది.

అదే సమయంలో బాలు, మీనా కూడా గుడికి వస్తారు. తన తల్లి పార్వతితో మాట్లాడుతున్న మీనా.. ఇటీవల పూల డెకరేషన్ ఆర్డర్లు బాగా పెరిగాయని, అందువల్ల రోజువారీ పూల వ్యాపారాన్ని చూసుకోవడం కష్టమవుతోందని చెబుతుంది. అందుకే ఇక నుంచి పూల వ్యాపారాన్ని పూర్తిగా అమ్మే చూసుకోవాలని కోరినట్లు వివరిస్తుంది. కూతురు వ్యాపారంలో ఎదుగుతున్న తీరు చూసి పార్వతి ఎంతో సంతోషిస్తుంది. ఈ విజయానికి కారణమైన బాలు కుటుంబానికి అండగా నిలిచాడని, తన ఇద్దరు పిల్లలు జీవితంలో నిలదొక్కుకోవడం ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురవుతుంది. ఇదే సమయంలో పార్వతి.. సుమతికి మంచి సంబంధం చూడాలని బాలును కోరుతుంది. దానికి బాలు నవ్వుతూ.. "నాకంటే మంచి మనసున్న, బాగా చదువుకున్న అబ్బాయిని తీసుకొస్తాను" అని మాట ఇస్తాడు. ఆ తర్వాత బాలు, మీనా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు.

ఇక కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. పూజ ముగిసిన తర్వాత ప్రసాదం తీసుకురావడానికి సుమతి వెళ్తుంది. ఆమె వెంటనే తాను కూడా వస్తానని అరుణ్ చెబుతాడు. ఇద్దరూ ఒంటరిగా ఉన్న సమయంలో అరుణ్ తన మనసులోని ప్రేమను బయటపెడతాడు. "మీరు మా అమ్మను చూసుకున్న తీరు నాకు చాలా నచ్చింది. మీ మంచితనం, మనసు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మీపై నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. జీవిత భాగస్వామిగా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను. తొందరపడి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. మీ సమాధానం కోసం నేను ఎదురుచూస్తాను" అంటూ ప్రేమను వ్యక్తం చేస్తాడు.

అనుకోని ఈ ప్రేమ ప్రతిపాదనతో సుమతి పూర్తిగా షాక్‌కు గురవుతుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది. అదే సమయంలో అరుణ్‌కు ఆఫీస్ నుంచి అత్యవసర కాల్ రావడంతో అక్కడి నుంచి కాసేపు వెళ్లాల్సి వస్తుంది. దీంతో సుమతికి ఆలోచించడానికి మరింత సమయం లభిస్తుంది. ఆ తర్వాత రాజేశ్వరి కూడా సుమతికి కృతజ్ఞతలు చెబుతుంది. "నా ఆరోగ్యం బాగుపడటానికి నువ్వు చేసిన సేవ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు కూడా సొంత కూతురిలా దగ్గరుండి పూజ చేయించావు" అంటూ ఆమెను ఆశీర్వదిస్తుంది. ఇదే సమయంలో అరుణ్ తిరిగి వచ్చి ఆఫీస్‌కు వెంటనే వెళ్లాల్సి ఉందని చెబుతాడు. రాజేశ్వరిని ఇంటికి పంపిస్తానని సుమతి చెప్పడంతో, ఆమె కూడా గుడిలో కాసేపు ఉండి వెళ్తానని చెబుతుంది. దీంతో అరుణ్ అక్కడి నుంచి బయలుదేరిపోతాడు.

కొద్దిసేపటికే సుమతికి బాలు, మీనా ఎదురవుతారు. చిన్న పూల గంపతో కనిపించిన సుమతిని చూసి బాలు సరదాగా మాట్లాడతాడు. గుడికి తనకు తెలిసిన వాళ్లు వచ్చారని, వారికోసం పూజ చేయించానని సుమతి వివరిస్తుంది. వారిని పరిచయం చేస్తానని చెప్పినా, తమకు అర్జెంట్ పని ఉందని చెప్పి బాలు, మీనా వెళ్లడానికి సిద్ధమవుతారు. అయితే అక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. బాలు తన కారును వెనక్కి తీసే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ బైక్‌కు దగ్గరగా వెళ్లిపోతుంది. వెంటనే అరుణ్ కోపంతో అరుస్తాడు. దీంతో వెంటనే కారు దిగి వస్తాడు. చూసే సరికి అరుణ్.. బాలు కూడా ఏమాత్రం తగ్గకుండా స్పందిస్తూ.. "యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన అందరిపై అధికారంగా మాట్లాడొద్దు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే నీకు మంచిది కాదు" అంటూ హెచ్చరిస్తాడు.

దానికి అరుణ్ కూడా గట్టిగానే బదులిస్తాడు. "నీపై ఇప్పటికే నా దృష్టి ఉంది. మరోసారి తప్పు చేస్తే కనీసం ఆరు నెలలు జైల్లో ఉండేలా చేస్తాను" అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో మీనా వెంటనే జోక్యం చేసుకుని బాలును అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కానీ అరుణ్ మాత్రం బాలుపై మరింత కక్ష పెంచుకుని, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇక ఈ ఎపిసోడ్‌తో కథ మరింత ఆసక్తికరంగా మారింది. అరుణ్ ప్రేమను సుమతి అంగీకరిస్తుందా? ఈ విషయం బాలు, మీనాలకు తెలిసితే వారి స్పందన ఎలా ఉంటుంది? ఇప్పటికే బాలుపై కక్ష పెంచుకున్న అరుణ్.. భవిష్యత్తులో సుమతి ప్రేమ కారణంగా ఆ కుటుంబంతో మరింత పెద్ద గొడవకు దిగుతాడా? ఈ ప్రేమకథ కుటుంబాల మధ్య కొత్త వివాదాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న ఎపిసోడ్లలో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X