Gundeninda Gudigantalu july 7th Episode:మనోజ్‌కు యాక్సిడెంట్..కండ్లకు ఆపరేషన్.. బాలు శాపనార్థాలు నిజమయ్యాయా?
Gundeninda Gudigantalu: 'గుండె నిండా గుడిగంటలు' మంగళవారం ఊహించని మలుపులతో సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో మనోజ్ తన పేరు ఉన్న నేమ్ బోర్డును మళ్లీ ఇంటి ముందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎంతో గర్వంగా నేమ్‌ప్లేట్‌ను బిగించే ప్రయత్నం చేస్తుండగా, పార్క్‌లో తనతో కలిసి ఉండే స్నేహితుడు అక్కడికి వస్తాడు. "సహాయం చేస్తాను" అంటూ నేమ్‌ప్లేట్ పట్టుకోబోతాడు. అయితే గమనించని మనోజ్ అతని చేతిపైనే బలంగా కొట్టేస్తాడు. దాంతో నొప్పిని తట్టుకోలేక అతడు పెద్దగా కేకలు వేస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలు పరిస్థితిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. "పార్క్‌లో పడుకోవడానికి మా వాడే దొరికాడా? ఇప్పుడు ఇక్కడికీ వచ్చేశావేంటి?" అంటూ సెటైర్లు వేస్తాడు.
దీనికి ఆ వ్యక్తి కూడా తనదైన శైలిలో సమాధానం ఇస్తాడు. "మా చెల్లి ఈ మధ్యనే ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత ఏమి చదివించాలో తెలుసుకోవాలని మనోజ్ దగ్గరకు వచ్చాను" అని చెబుతాడు. వెంటనే బాలు, "అంటే మా వాడు చదివిన చదువులే చదివించాలని అనుకుంటున్నావా?" అని ప్రశ్నిస్తాడు. దానికి అతడు నవ్వుతూ, "అయ్యో కాదు. మీ వాడు చదివిన చదువులకు ప్రయోజనం ఏముంది? అంత చదివి చివరకు పార్క్‌లోనే పడుకుంటున్నాడు. మా చెల్లికి అలాంటి పరిస్థితి రాకూడదని వేరే మంచి కోర్సులు చదివిస్తాను" అని చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అవుతారు. అంతేకాదు, "ఎన్ని డిగ్రీలు చదివినా చివరకు నాతోపాటే పార్క్‌లో పడుకున్నాడు కదా" అంటూ మరోసారి మనోజ్‌ను అవమానిస్తాడు. అతని మాటలకు మనోజ్ ఒక్కసారిగా అవాక్కవుతాడు.

Courtesy: Jio hotstar
అయితే ఈ అవమానాన్ని జీర్ణించుకోలేని మనోజ్, "నేను కష్టపడి చదివాను. నా చదువు నా కష్టార్జితం. ఎవరి దయతోనూ నేను ఈ స్థాయికి రాలేదు" అంటూ తనను తాను గొప్పగా చెప్పుకోవడం మొదలుపెడతాడు. వెంటనే బాలు స్పందిస్తూ, "నిన్ను ప్రేమతో పెంచి, కష్టపడి చదివించింది నీ నాన్న. ఆయన కష్టమే నీ చదువుకు కారణం" అని గుర్తు చేస్తాడు. కానీ మనోజ్ మాత్రం ఆ మాటలను పూర్తిగా తిరస్కరిస్తూ, "నాన్న గొప్పతనం ఏముంది? ఆయనకు చదువు లేదు. డ్రైవింగ్ మాత్రమే వచ్చు కాబట్టి డ్రైవర్‌గా పనిచేశాడు. నేను మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు చదివాను. అది పూర్తిగా నా కష్టంతో సాధించుకున్నది" అంటూ తన తండ్రినే కించపరిచేలా మాట్లాడతాడు.
తండ్రి గురించి అంత చులకనగా మాట్లాడటాన్ని బాలు ఏమాత్రం సహించలేకపోతాడు. తీవ్ర ఆగ్రహంతో చేతిలో ఉన్న నేమ్‌ప్లేట్‌ను తీసుకుని మనోజ్‌పై విరుచుకుపడతాడు. వరుసగా కొడుతూ తన కోపాన్ని బయటపెడతాడు. మనోజ్ పెద్దగా అరవడంతో ఇంట్లో ఉన్న ప్రభావతి, మీనా, రవి, శృతి, రోహిణి, సత్యం అందరూ బయటకు వస్తారు. "ఏమైంది? ఎందుకు ఇలా కొడుతున్నావు?" అని ప్రశ్నిస్తారు.
ఈ సమయంలో మీనా ముందుకు వచ్చి, "మీ పెద్ద కొడుకు మాట్లాడిన మాటలు వింటే అసహ్యం వేస్తోంది. కన్న తండ్రిని ఇంతగా అవమానించడం చాలా దారుణం" అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ ప్రభావతి మాత్రం మీనాపై కోపపడుతూ, "అగ్గి మీద గుగ్గిలం వేయకు. అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం" అంటూ మనోజ్‌ను అడుగుతుంది. అయితే మనోజ్ తన తప్పును ఒప్పుకోవడం బదులు, "నేను చదవడానికి నాన్న ఏం చేశాడు? నా బదులు పరీక్షలు రాశాడా? నేను కష్టపడి చదివాను. అంతే" అంటూ మరోసారి తన తండ్రి విలువను తగ్గించేలా మాట్లాడతాడు.
మనోజ్ మాటలు విన్న బాలు మరోసారి సహనం కోల్పోయి అతనిపై దాడి చేస్తాడు. రవి, శృతి కూడా మనోజ్ వైఖరిని తీవ్రంగా తప్పుబడతారు. "నిజంగానే మనిషివేనా? కన్న తండ్రిని ఇలా అవమానిస్తావా? చదువు మనిషికి వినయం నేర్పాలి కానీ అహంకారం కాదు" అంటూ గట్టిగా మందలిస్తారు. అయినప్పటికీ ప్రభావతి మాత్రం తన పెద్ద కొడుకుకే మద్దతుగా నిలుస్తూ, బాలు తప్పు చేస్తున్నాడనేలా మాట్లాడుతుంది.
ప్రభావతి వైఖరితో బాలు మరింత ఆవేదనకు గురవుతాడు. "నా నాన్నను అవమానించినందుకు నీ కళ్లే పోతాయి" అంటూ మనోజ్‌పై తీవ్ర ఆగ్రహంతో శాపనార్థాలు పెడతాడు. వెంటనే ప్రభావతి, "నువ్వేమైనా మునివా? ఇలా శాపాలు పెడుతున్నావా?" అంటూ బాలునే తిడుతుంది. దానికి బాలు కూడా ఏమాత్రం తగ్గకుండా, "మీ తల్లి కొడుకులు నాన్నను అవమానించారు. అందుకే మీరు చేసిన తప్పుకు తగిన ఫలితం అనుభవిస్తారు. సర్వనాశనం అవుతారు" అంటూ ఆవేదనతో మాట్లాడతాడు. బాలు మాటలు విన్న మనోజ్, రోహిణి తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇంట్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సత్యం గొడవను ముగించే ప్రయత్నం చేస్తాడు. "ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. సుందరి పెళ్లి లాంఛనాల కోసం బీరువా కొనాలి. మార్కెట్‌కు వెళ్లదాం" అని బాలుతో చెబుతాడు. అయితే బాలు, "మనకు సొంతంగా ఫర్నిచర్ షాప్ ఉంది కదా. అక్కడికే వెళ్లి తీసుకుందాం" అని సూచిస్తాడు. ఈ మాట విన్న ప్రభావతి వెంటనే, "ఆ షాప్‌కు ఎందుకు వెళ్లాలి? బయటే కొనండి" అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రభావతి మాటలకు సత్యం తొలిసారి గట్టిగా స్పందిస్తాడు. "అది నా షాప్. నేను ఎప్పుడు వెళ్లాలో, ఏం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. ప్రతి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకు" అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇస్తాడు.
ఇక మరోవైపు.. ఇంట్లో జరిగిన అవమానం గురించి మనోజ్ రోహిణితో మాట్లాడుతాడు. బాలు తనను అందరి ముందు కొట్టి అవమానించాడని మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాడు. అయితే ఈసారి రోహిణి మాత్రం అతడికి మద్దతు ఇవ్వకుండా, జరిగిన దాంట్లో తప్పు పూర్తిగా నీదేనని స్పష్టం చేస్తుంది. "నువ్వు ఎంత పెద్ద పెద్ద డిగ్రీలు చదివినా ఆ చదువుకు కారణం మీ నాన్నే. ఆయన కష్టపడకపోతే నువ్వు ఈ స్థాయికి వచ్చేవాడివి కాదు. ఆ విషయం మర్చిపోయి అజ్ఞానంతో మాట్లాడావు. అందుకే బాలు అంత కోపం తెచ్చుకున్నాడు" అని మనోజ్‌కు గట్టిగా చెబుతుంది. రోహిణి కూడా తనను తప్పుబట్టడంతో మనోజ్ మరింత కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు.
మనోజ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి తలకు హెల్మెట్ పెట్టుకుని నిశ్శబ్దంగా ఫర్నిచర్ షాప్‌లోకి అడుగుపెడతాడు. అతడిని చూసిన రోహిణి ఒక్కసారిగా కంగారుపడి, "ఎవరు మీరు? ఇలా హెల్మెట్ పెట్టుకుని ఎందుకు వచ్చారు?" అని ప్రశ్నిస్తుంది. దానికి ఆ వ్యక్తి గంభీరంగా "మనోజ్ లేడా?" అని అడుగుతాడు. "ఇప్పుడే బయటికి వెళ్లాడు. మీకు ఏం కావాలి?" అని రోహిణి అడగగానే, ఆ వ్యక్తి నెమ్మదిగా హెల్మెట్ తీసేస్తాడు. అతడిని చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. ఎందుకంటే అతడు మరెవరో కాదు, మటన్ కొట్టు మాణిక్యం.
మాణిక్యాన్ని చూసిన రోహిణి ఆశ్చర్యంతో, "నువ్వా? ఇలా ఎందుకు వచ్చావు?" అని అడుగుతుంది. దానికి మాణిక్యం, "మా మేనల్లుడి పెళ్లి ఉంది. వాడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని మీ షాప్‌కు వచ్చాను" అని చెబుతాడు. వెంటనే రోహిణి, "నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? ఒక్క ఫోన్ చేస్తే నేనే పంపించేదాన్ని కదా" అని అంటుంది. కానీ మాణిక్యం మాత్రం, "అది వేరే విషయం. నేనే చూసుకుని తీసుకెళ్తే నాకు నమ్మకం ఉంటుంది" అంటూ డబుల్ డోర్ బీరువాను ఎంపిక చేసుకుంటాడు. అనంతరం ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి డెలివరీ చేయాలని చెబుతాడు. రోహిణి కూడా ఎలాంటి అనుమానం రాకుండా సరేనని అంగీకరిస్తుంది.
షాపింగ్ పూర్తయ్యాక మాణిక్యం బయటకు వెళ్లబోతున్న సమయంలో అనుకోకుండా సత్యం, బాలు ఇద్దరూ షాప్‌లోకి వస్తారు. వారిని చూసిన మాణిక్యం ఒక్కసారిగా టెన్షన్‌కు గురవుతాడు. హెల్మెట్ పెట్టుకుని వారి కంటపడకుండా బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. అయితే బాలు అతడి వైపు అనుమానంగా చూస్తాడు. "వీడెందుకు ఇలా హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు?" అని మనసులో అనుకుంటాడు. అదే సమయంలో మాణిక్యం తన మొబైల్ ఫోన్‌ను కౌంటర్‌పై మర్చిపోయి వెళ్లిపోతాడు. దాన్ని గమనించిన బాలు వెంటనే "అయ్యా... ఒకసారి రండి" అని పిలుస్తాడు.
బాలు పిలవగానే మాణిక్యం గుండె ఒక్కసారిగా గుబేలు కొడుతుంది. తన అసలు విషయం బయటపడిందేమోనని భయంతో గజగజ వణుకుతూ తిరిగి వస్తాడు. కానీ బాలు మాత్రం ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకుండా, "మీ ఫోన్ కౌంటర్ మీద మర్చిపోయారు. తీసుకోండి" అని చెబుతాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న మాణిక్యం వెంటనే ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినప్పటికీ బాలు తనను ఎక్కడైనా గుర్తుపట్టాడేమోనన్న భయం మాణిక్యంలో ఉంటుంది. రోహిణి కూడా కంగారుపడుతుంది. .
మాణిక్యం వెళ్లిన తర్వాత బాలు రోహిణిని ప్రశ్నిస్తాడు. "పార్లరమ్మా.. ఆ వ్యక్తి ఎందుకు ఇలా హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు?" అని అడుగుతాడు. దానికి రోహిణి ఏమాత్రం తడబడకుండా, "నాకేం తెలుసు. అతడి ఇష్టం. వచ్చాడు... షాపింగ్ చేశాడు... వెళ్లిపోయాడు" అంటూ తనకు ఏమీ తెలియనట్లుగా సమాధానం ఇస్తుంది. పరిస్థితిని గమనించిన సత్యం వెంటనే మధ్యలోకి వచ్చి, "బాలు... నువ్వు బయటికి వెళ్లు. ఇక్కడ నేను చూసుకుంటాను" అని చెప్పడంతో బాలు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు. అనంతరం సత్యం బీరువా కొనుగోలు పనులు పూర్తి చేస్తాడు.
ఇదిలా ఉండగా, ఇంట్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక మనోజ్ తీవ్ర ఆవేదనతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. బాలు అందరి ముందు తనను కొట్టడం, రోహిణి కూడా తనను తప్పుబట్టడం గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. అదే సమయంలో కంగారులో ఎదురుగా వస్తున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొంటాడు. మొదట అతడిని గుర్తుపట్టకుండా "సారీ" అని చెప్పబోతాడు. కానీ క్షణం తర్వాత అతడి ముఖం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అతడు మరెవరో కాదు... తనను రూ.30 లక్షలు మోసం చేసి పరారైన విల్లా సుభాష్.
సుభాష్‌ను చూసిన మనోజ్ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతాడు. "అరేయ్... నా 30 లక్షలు ఎక్కడ? నా డబ్బులు ఇచ్చి వెళ్లి!" అంటూ అతడి కాలర్ పట్టుకుంటాడు. అయితే సుభాష్ చాకచక్యంగా మనోజ్ చేతిలో నుంచి తప్పించుకుని పరుగులు తీస్తాడు. తన డబ్బులు తిరిగి దొరుకుతాయన్న ఆశతో మనోజ్ కూడా అతడి వెంట పరిగెడతాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వారిని తోసుకుంటూ, వాహనాల మధ్యలో ప్రమాదకరంగా పరుగులు తీస్తాడు. అయితే వేగంగా పరిగెడుతున్న మనోజ్‌కు ఎదురుగా వస్తున్న భారీ ట్రక్కు కనిపించదు. క్షణాల్లోనే ట్రక్కును బలంగా ఢీకొంటాడు. ఢీకొన్న ప్రభావంతో అతడు తీవ్రంగా గాయపడతాడు. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి మనోజ్‌ను ఆస్పత్రికి తరలిస్తారు.
మనోజ్ ప్రమాదానికి గురయ్యాడన్న విషయం తెలిసిన రోహిణి కన్నీళ్లతో ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తిన ప్రభావతి, "ఏమైంది అమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని ఆందోళనగా అడుగుతుంది. రోహిణి ఏడుపు ఆపలేక మాట్లాడలేకపోవడంతో పక్కనే ఉన్న రవి ఫోన్ తీసుకుని విషయం అడుగుతాడు. అప్పుడు రోహిణి, "మనోజ్‌కు యాక్సిడెంట్ అయింది. ఐసీయూలో ఉన్నాడు" అని ఏడుస్తూ చెబుతుంది. వెంటనే మీనా స్పందిస్తూ, "ఏ హాస్పిటల్? మేము ఇప్పుడే వస్తున్నాం. భయపడకు" అంటూ ధైర్యం చెబుతుంది.
కానీ ప్రభావతి మాత్రం జరిగిన ప్రమాదానికి కూడా బాలునే కారణమని నిందిస్తుంది. "ఉదయం బాలు వాడిని అంతగా కొట్టి పంపించాడు. ఆ బాధతోనే ఇలా జరిగింది. నా కొడుక్కి ఏమైనా అయితే ఈ జన్మలో నీతో మాట్లాడను" అంటూ బాలుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే సత్యం, "ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదు. ముందు హాస్పిటల్‌కు వెళ్లదాం" అంటూ అందరినీ తీసుకుని బయలుదేరుతాడు.
ఆస్పత్రికి చేరుకున్న తర్వాత రోహిణి కన్నీళ్లతో, "ఇప్పుడే ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు" అని ఏడుస్తుంది. అది విన్న ప్రభావతి పూర్తిగా కుంగిపోతుంది. "నా కొడుకు నాకు ప్రాణం. వాడికి ఏమైనా అయితే నేను బతకలేను. నా ఆస్తి మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చినా చేస్తాను. కానీ నా కొడుకుని కాపాడండి" అంటూ విలపిస్తుంది. ప్రభావతి మాటలు విన్న సత్యం కూడా భావోద్వేగానికి లోనవుతాడు. "మనోజ్ ఎన్ని తప్పులు చేసినా... నన్ను మొదటిసారి 'నాన్న' అని పిలిచింది వాడే. వాడు ఇలాంటి పరిస్థితిలో ఉంటాడని ఎన్నడూ ఊహించలేదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్యం ఆవేదన చూసి కుటుంబ సభ్యులంతా మరింత ఎమోషనల్ అవుతారు.
ఇంతలో ఆపరేషన్ పూర్తిచేసిన డాక్టర్లు మనోజ్‌ను బయటకు తీసుకొస్తారు. అతడి కళ్లకు పెద్ద కట్లు ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా కంగారుపడతారు. "డాక్టర్... మా మనోజ్‌కు ఏమైంది?" అని ఆత్రంగా అడుగుతారు. దానికి డాక్టర్, "యాక్సిడెంట్ సమయంలో గాజు పెంకులు కళ్లలోకి బలంగా గుచ్చుకున్నాయి. వాటిని ఆపరేషన్ చేసి తొలగించాం. ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే కంటి చూపు విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేం. కొంత సమయం వేచి చూడాలి" అని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురవుతారు.
ఉదయం కోపంతో బాలు "నీ కళ్లే పోతాయి" అంటూ పెట్టిన శాపనార్థాలు గుర్తుకొచ్చి అందరూ దిగ్భ్రాంతికి గురవుతారు. నిజంగానే మనోజ్ కళ్లకు ప్రమాదం జరగడంతో ప్రభావతి మనసులో బాలుపై మరింత కోపం పెరుగుతుంది. మరోవైపు బాలు మాత్రం తాను కోపంలో అన్న మాటలు ఇలా నిజం కావడంతో ఎలా స్పందిస్తాడు? ప్రభావతి-బాలు మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయా? మనోజ్‌కు కంటి చూపు తిరిగి వస్తుందా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications