Gundeninda Gudigantalu July 8th Episode:బాలు త్యాగం..చేతులేత్తేసిన రోహిణి.. మనోజ్‌కు కంటి చూపు వస్తుందా?
Gundeninda Gudigantalu:'గుండె నిండా గుడిగంటలు' మంగళవారం ఎపిసోడ్ షాకింగ్ ట్విస్టులతో సాగింది. తన తండ్రి సత్యం కష్టాన్ని తక్కువ చేసి, తాను చదువుకున్నది పూర్తిగా తన కష్టంతోనే అంటూ మనోజ్ అవమానించడంతో బాలు తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ఈ సమయంలో అతడిని నేమ్‌ప్లేట్‌తో కొడతాడు. మీనా, రవి, శృతి లు కూడా మనోజ్ వైఖరిని తప్పుబడుతారు. కానీ ప్రభావతి మాత్రం తన కొడుకుకే మద్దతు ఇస్తుంది. కోపంతో బాలు "నీ కళ్లు పోతాయి" అంటూ శాపనార్థాలు పెడతాడు. మరో వైపు ఫర్నిచర్ షాప్‌కు హెల్మెట్ ధరించి వచ్చిన మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి రోహిణి కంగారుపడుతుంది. అతడు బీరువా కొనుగోలు చేసి వెళ్లే సమయంలో ఫోన్ మర్చిపోవడంతో బాలు అనుమానపడినా, పెద్దగా పట్టించుకోడు.
మరోవైపు అవమానంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మనోజ్‌కు, రూ.30 లక్షలు మోసం చేసిన విల్లా సుభాష్ కనిపిస్తాడు. అతడిని వెంబడిస్తూ రోడ్డుపై పరుగెత్తిన మనోజ్ వేగంగా వస్తున్న లారీని ఢీకొని తీవ్రంగా గాయపడతాడు. ఆస్పత్రికి తరలించిన మనోజ్‌కు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ప్రాణాపాయం లేదని, కానీ గాజు పెంకులు కళ్లలోకి గుచ్చుకోవడంతో కంటి చూపు గురించి ఇప్పుడే చెప్పలేమని వెల్లడిస్తారు. ఉదయం బాలు కోపంతో అన్న మాటలు గుర్తుకు రావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురవుతారు. ప్రభావతి మాత్రం జరిగిన ప్రమాదానికి కూడా బాలునే కారణమంటూ నిందిస్తుంది.

Courtesy: Jio hotstar
బుధవారం ఎపిసోడ్ ఆరంభం నుంచే భావోద్వేగాలతో సాగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను డాక్టర్లు అత్యవసరంగా ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనలో మునిగిపోతారు. మనోజ్ పరిస్థితి ఏంటో తెలియక హాస్పిటల్ బయట టెన్షన్‌తో ఎదురు చూస్తుంటారు. ఈ సమయంలో బాలు ఆందోళనతో డాక్టర్లను ఆపి, "మా అన్నయ్య కళ్లకు ఎలాంటి ప్రమాదం లేదు కదా డాక్టర్?" అని అడుగుతాడు. అందుకు డాక్టర్లు, "ప్రస్తుతం ఏమీ చెప్పలేం. కళ్లలోకి గుచ్చుకున్న గాజు పెంకులను తొలగించాం. అయితే పూర్తి రిపోర్టులు వచ్చిన తర్వాతే కంటి చూపు గురించి స్పష్టంగా చెప్పగలం" అని సమాధానం ఇస్తారు. ఈ మాటలు వినగానే కుటుంబ సభ్యులు మరింత కంగారుపడతారు.
ఇప్పటికే ఉదయం బాలు కోపంతో "నీ కళ్లే పోతాయి" అని మనోజ్‌ను తిట్టిన విషయం గుర్తు చేసుకున్న ప్రభావతి తీవ్ర ఆవేదనకు గురవుతుంది. కోపంతో బాలువైపు తిరిగి, "నీ నోటి నుంచి వచ్చిన మాటే నిజమైతే ఈ జన్మలో నీ ముఖం కూడా చూడను. నా కొడుకుకు ఏమైనా జరిగితే నిన్నెప్పటికీ క్షమించను" అంటూ కన్నీళ్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభావతి మాటలు విన్న బాలు తీవ్ర పశ్చాత్తాపానికి లోనవుతాడు. కోపంలో అన్న మాటలు ఇలా నిజమవుతాయేమోనన్న భయంతో లోలోపల కుమిలిపోతాడు.
ఇంతలో మనోజ్ ప్రమాదానికి సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వస్తుంది. యాక్సిడెంట్ సమయంలో గాయపడిన కొందరు వ్యక్తులు హాస్పిటల్‌కు వచ్చి కుటుంబ సభ్యులను కలుస్తారు. "మీ అన్నయ్య వల్ల మేమూ తీవ్రంగా గాయపడ్డాం. ఆయన ఒక వ్యక్తిని వెంబడిస్తూ రోడ్డుపై పరుగెత్తడంతో ప్రమాదం జరిగింది. మేము కూడా దెబ్బలు తిని ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ ప్రమాదం వల్ల మాకు దాదాపు రూ.30 వేల వరకు నష్టం జరిగింది" అని చెబుతారు.
వారి మాటలు విన్న బాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. "రూ.30 వేలా? అసలు ఏం జరిగింది?" అని ప్రశ్నించగా, వారు జరిగిన సంఘటన మొత్తం వివరిస్తారు. "మీ అన్నయ్య ఒక వ్యక్తిని పట్టుకోవడానికి వేగంగా పరుగెత్తాడు. అదే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ ఉన్న మేమే వెంటనే స్పందించి అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చాం. లేకపోతే పరిస్థితి మరింత విషమించేది" అని చెబుతారు. వారి మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బాలు, ఎలాంటి ఆలోచన చేయకుండా వారు చెప్పిన రూ.30 వేల నష్టపరిహారాన్ని వెంటనే చెల్లిస్తాడు. "మీరు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేం" అంటూ వారికి ధన్యవాదాలు చెబుతాడు. వారు కూడా "మీ అన్నయ్య త్వరగా కోలుకోవాలి" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఈ విషయాన్ని మీనా రోహిణికి చెప్పడంతో ఆమె కూడా ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. మనోజ్ తన డబ్బుల కోసం పరుగెత్తి ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఏ విషయాన్నీ పట్టించుకోకుండా ఇంకా బాలునే నిందిస్తూ ఉంటుంది. "నా కొడుకు కళ్లుతెరిచి క్షేమంగా బయటకు వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను" అంటూ శపథం చేస్తుంది. ఆమె ఏడుపు చూసి కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ అవుతారు.
అప్పటికే హాస్పిటల్‌లో మరోసారి కలకలం మొదలవుతుంది. డాక్టర్లు హడావుడిగా మళ్లీ ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లడం చూసి కుటుంబ సభ్యులు మరింత భయాందోళనకు గురవుతారు. ఏమైందో తెలుసుకోవడానికి బాలు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి, "మా అన్నయ్యకు మళ్లీ ఏమైంది డాక్టర్?" అని ఆత్రంగా అడుగుతాడు.
అప్పుడు డాక్టర్ చెప్పిన విషయం కుటుంబాన్ని మరింత షాక్‌కు గురి చేస్తుంది. "ఇప్పటివరకు చేసినది ప్రాథమిక శస్త్రచికిత్స మాత్రమే. స్కాన్ రిపోర్టులు పూర్తిగా పరిశీలించగా కళ్లలో ఇంకా కొన్ని చిన్న గాజు పెంకులు మిగిలి ఉన్నట్లు గుర్తించాం. వాటిని వెంటనే తొలగించకపోతే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే వెంటనే మరో మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. దయచేసి అవసరమైన డబ్బులు వెంటనే చెల్లించండి. ఆ తర్వాతే ఆపరేషన్ ప్రారంభిస్తాం" అని డాక్టర్ స్పష్టం చేస్తాడు. డాక్టర్ మాటలు విన్న ప్రభావతి, సత్యం, రోహిణి, మీనా, రవి, బాలు అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.
మేజర్ సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పిన కొద్దిసేపటికే నర్సులు హడావుడిగా వచ్చి, "వెంటనే ఆస్పత్రి బిల్లు చెల్లించండి. ఆలస్యం చేయొద్దు" అని కుటుంబ సభ్యులను హెచ్చరిస్తారు. దీంతో బాలు వెంటనే, "ఇంతకీ బిల్లు ఎంత అయింది?" అని అడుగుతాడు. దానికి నర్సులు, "కౌంటర్ దగ్గరకు వెళ్లి అడగండి. అక్కడ పూర్తి వివరాలు చెబుతారు" అని సమాధానం ఇస్తారు. వెంటనే బాలు, మీనా, రోహిణి ముగ్గురూ బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్తారు. అక్కడ రిసెప్షన్ సిబ్బంది బిల్లు మొత్తం రూ.1,70,000 అయ్యిందని చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. "ఏంటి... అంత పెద్ద బిల్లా?" అని ఆశ్చర్యపోతాడు. అందుకు హాస్పిటల్ సిబ్బంది, "మీ అన్నయ్యకు చిన్న చికిత్స కాదు, మేజర్ సర్జరీ జరిగింది. పరిస్థితి కూడా విషమంగా ఉంది. అందుకే వెంటనే బిల్లు చెల్లించాలి. డబ్బులు కట్టిన తర్వాతే తదుపరి ఆపరేషన్ ప్రారంభమవుతుంది" అని స్పష్టం చేస్తారు.
బాలు పరిస్థితిని అర్థం చేసుకుని, "మీరు ఆపరేషన్‌కు సిద్ధం చేయండి. నేను డబ్బులు ఏర్పాటు చేసి వెంటనే వస్తాను" అని చెప్పినా, హాస్పిటల్ సిబ్బంది మాత్రం, "ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అడగకుండా చికిత్స ప్రారంభించాం. కానీ ఇక మేజర్ సర్జరీ కాబట్టి బిల్లు కచ్చితంగా చెల్లించాల్సిందే" అంటూ తేల్చి చెబుతారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన బాలు ముందుగా రోహిణిని, "నీ దగ్గర ఎంత డబ్బు ఉంది?" అని అడుగుతాడు. దానికి రోహిణి, "నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మొన్ననే వేరే అవసరాలకు మొత్తం ఖర్చు చేశాను" అని సమాధానం ఇస్తుంది. తర్వాత శృతిని అడగగా, "మీరు ఇచ్చిన డబ్బులన్నీ నేను సేవ్ చేసి డైమండ్ రింగ్ కొనుక్కున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కావాలంటే మా నాన్నను అడిగి తెప్పిస్తాను" అంటుంది. అయితే బాలు, "అనవసరంగా వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు" అంటూ తిరస్కరిస్తాడు.
ఈ సమయంలో సత్యం కూడా ముందుకు వచ్చి, "డబ్బులు అవసరమైతే నన్ను అడుగు. నాకు తెలిసిన వాళ్ల దగ్గర నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తాను" అని చెబుతాడు. కానీ బాలు మాత్రం అసలు విషయం చెప్పకుండా, "అవసరం వస్తే తప్పకుండా అడుగుతాను నాన్న" అని సమాధానం ఇస్తాడు. ఇదే సమయంలో మీనా తన దగ్గర రూ.60 వేలు ఉన్నాయని చెబుతుంది. దీంతో బాలు లెక్కలు వేసుకుని, "ఇంకా రూ.1,10,000 కావాలి. నేను బయట ప్రయత్నిస్తాను. ఎక్కడైనా సర్దుబాటు అయితే మిగతా డబ్బులు తెచ్చి బిల్లు కడదాం" అని నిర్ణయించుకుంటాడు.
డబ్బుల కోసం బాలు ఎన్నో చోట్ల ప్రయత్నించినా ఎక్కడా సహాయం దొరకదు. చివరకు తనతో కలిసి డ్రైవింగ్ చేసే స్నేహితుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. వారి స్థోమత మేరకు కొంత డబ్బు ఇచ్చి సహాయం చేస్తారు. అయినప్పటికీ అవసరమైన మొత్తం సమకూరదు. చివరికి బాలు కీలక నిర్ణయం తీసుకుంటాడు. మీనాకు తెలియకుండా ఆమె కోసం ఎంతో ప్రేమగా దాచిపెట్టిన పొదుపు మొత్తాన్ని తీసి మనోజ్ చికిత్సకు వినియోగించాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు రాజేష్ ఆశ్చర్యపోతూ, "అరే... ఆ డబ్బులు మీనాకు బంగారం కొనిపెట్టాలని దాచావు కదా. ఇప్పుడు ఎందుకు ఖర్చు చేస్తున్నావ్?" అని అడుగుతాడు.
దానికి బాలు కళ్లలో నీళ్లు తిరుగుతూ, "మీనాకు బంగారం మరోసారి కొనిపెట్టగలను. కానీ మా అన్నయ్య కంటి చూపు పోతే తిరిగి తీసుకురాలేను. ప్రస్తుతం ఆయన ప్రాణాలు, చూపే నాకు ముఖ్యం" అని చెప్పడంతో రాజేష్ కూడా భావోద్వేగానికి లోనవుతాడు. "నిజంగా నువ్వు గొప్ప మనిషివి" అంటూ బాలును అభినందిస్తాడు. చివరికి బాలు తన పొదుపు డబ్బులతో రూ.1,60,000, మీనా తన దగ్గర ఉన్న రూ.10,000 కలిపి మొత్తం ఆస్పత్రి బిల్లు చెల్లిస్తారు. అయితే ఈ విషయం మాత్రం కుటుంబ సభ్యులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు.
ఇదే సమయంలో మీనా స్నేహితురాలు విద్య కూడా హాస్పిటల్‌కు చేరుకుంటుంది. పరిస్థితి తెలుసుకున్న రోహిణి ఆమెను డబ్బులు అడగగా, "నా జీతం మొత్తం ఇప్పటికే ఖర్చయిపోయింది. ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బులు లేవు" అని చెబుతుంది. అయితే కొద్దిసేపటికే బాలు, మీనా బిల్లు చెల్లించడం చూసి ఆశ్చర్యపోతుంది. "నీ జీవితంలో నిజమైన దేవుళ్లు బాలు, మీనాలే" అని రోహిణితో అంటుంది. కానీ రోహిణి మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా లైట్‌గా తీసుకోవడం ఆమె అసలు స్వభావాన్ని మరోసారి బయటపెడుతుంది.
మరోవైపు ప్రభావతి మాత్రం "ఆపరేషన్‌కు డబ్బులు కట్టారా?" అని ఆందోళనగా అడుగుతుంది. వెంటనే బాలు, "అన్నీ అయిపోయాయి... మీరు ఏం కంగారు పడొద్దు" అని మాత్రమే చెబుతాడు. తామే డబ్బులు చెల్లించిన విషయాన్ని మాత్రం బయటపెట్టడు.బిల్లు చెల్లించడంతో డాక్టర్లు వెంటనే మనోజ్‌ను మరోసారి ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తారు. బయట కుటుంబ సభ్యులంతా భగవంతుడిని ప్రార్థిస్తూ మనోజ్‌కు కంటి చూపు తిరిగి రావాలని వేడుకుంటారు. సత్యం కన్నీళ్లు పెట్టుకుంటూ, "చిన్నప్పటి నుంచే వాడికి చీకటి అంటే భయం. ఇప్పటివరకు నా కోసం దేవుడిని ఏమీ కోరుకోలేదు. ఈ ఒక్కసారి నా కొడుకుకు చూపు ఇవ్వమని కోరుకుంటున్నా" అంటూ భావోద్వేగానికి లోనవుతాడు.
సత్యంను ఓదార్చిన మీనా, "మామయ్య... తల్లిదండ్రులు చేసిన పుణ్యమే పిల్లలకు రక్షణగా నిలుస్తుంది అంటారు. మీరు చేసిన మంచి పనుల ఫలితంగా మనోజ్‌కు తప్పకుండా చూపు వస్తుంది. ధైర్యంగా ఉండండి" అంటూ ఆయనకు ధైర్యం చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్లు ఆపరేషన్ పూర్తి చేసి మనోజ్‌ను బయటకు తీసుకొస్తారు. వెంటనే కుటుంబ సభ్యులంతా పరుగెత్తుకుంటూ వెళ్లగా, "ఆపరేషన్ పూర్తయింది. అయితే పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. కంటి కట్లు విప్పడానికి కూడా మరికొంత సమయం పడుతుంది" అని డాక్టర్లు చెబుతారు.
కొంతసేపటి తర్వాత మనోజ్‌కు స్పృహ వస్తుంది. అయితే తన కళ్లకు కట్లు ఉండటంతో తీవ్ర ఆందోళన చెందుతూ, "నాకు మళ్లీ చూపు వస్తుందా? జీవితాంతం గుడ్డివాడిలా ఉండిపోతానా? అందరూ నన్ను కళ్లులేనోడు అని పిలుస్తారా?" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ సమయంలో మీనా "మీకు ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి మీ తమ్ముడు మీ కోసం ఎంతగా తపిస్తున్నాడో మీకు తెలియదు" అని చెప్పడంతో మనోజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. "మొదటిసారి నా గురించి నువ్వు మంచి మాట మాట్లాడావు... నాపై జాలి చూపిస్తున్నావా?" అంటూ భావోద్వేగానికి గురవుతాడు. మనోజ్‌కు నిజంగానే కంటి చూపు తిరిగి వస్తుందా? బాలు చేసిన త్యాగం ఎప్పుడు అందరికీ తెలుస్తుంది? ఆ విషయం తెలిసిన తర్వాత మనోజ్‌లో మార్పు వస్తుందా? ప్రభావతి తన అభిప్రాయం మార్చుకుంటుందా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications