Gundeninda Gudigantalu July 15th Episode: మీనాకు రూ.10 లక్షల ఆర్డర్.. అగ్రిమెంట్‌తో ఉచ్చు బిగించిన చింతామణి!
Gunde Ninda Gudi Gantalu:'గుండె నిండా గుడిగంటలు' బుధవారం ఎపిసోడ్‌లో శోభ ఇచ్చిన బ్లాంక్ చెక్ వ్యవహారం ఇంట్లో పెద్ద చర్చకు దారితీసింది. డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టాలా? లేక స్వాభిమానంతోనే ముందుకు సాగాలా? అనే అంశంపై కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఒకవైపు బాలు రవి ఆత్మగౌరవాన్ని కాపాడాలని గట్టిగా నిలబడగా, మరోవైపు రోహిణి, మనోజ్ మాత్రం శోభ ఇచ్చే ఆర్థిక సహాయాన్ని తీసుకోవడంలో తప్పేమీ లేదని వాదించారు. దీంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రభావతి ఇంట్లో జరిగిన గొడవ, శోభ ఇచ్చిన బ్లాంక్ చెక్, బాలు ఆ చెక్కును చించి పారేసిన విషయం గురించి రోహిణి, మీనా కలిసి రవి, శృతికి వివరిస్తారు. ఈ విషయం విన్న శృతి ఆశ్చర్యానికి గురవుతుంది. "మా అమ్మ రెస్టారెంట్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదు? అందులో తప్పేముంది?" అని రవిని ప్రశ్నిస్తుంది. దానికి రవి ప్రశాంతంగా స్పందిస్తూ, "ఈరోజు డబ్బు తీసుకుంటే రేపు అదే విషయాన్ని మన మీద ఆయుధంలా వాడతారు. ఏదో ఒక సందర్భంలో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు తప్పవు. అందుకే ఆ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు" అని తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తాడు.

Courtesy: jiohotstar
ఈ సమయంలో రోహిణి కూడా తన వాదనను వినిపిస్తుంది. "అందులో తప్పేముంది? శృతి వాళ్ల తల్లిదండ్రుల ఆస్తికి ఆమె ఒక్కతే వారసురాలు. ఈరోజు సహాయం తీసుకున్నా, రేపు ఆస్తి కూడా ఆమెకే వస్తుంది. మరి ఇప్పుడు డబ్బు తీసుకోవడంలో తప్పేంటి?" అని ప్రశ్నిస్తుంది. అయితే బాలు వెంటనే స్పందిస్తూ, "ఇది ఆస్తి గురించి కాదు... ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. పెళ్లి సమయంలో కూడా శృతి తండ్రి మా నాన్నను డబ్బు కోసం అవమానించాడు. రవిని కూడా డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని మాటలు అన్నాడు. అలాంటి వాళ్ల దగ్గర నుంచి మళ్లీ డబ్బు తీసుకుంటే రేపు అదే విషయాన్ని పట్టుకుని మనల్ని అవమానిస్తారు. అందుకే ఈ నిర్ణయం" అంటూ గట్టిగా సమాధానం చెబుతాడు.
ఈ చర్చలో మనోజ్ మరోసారి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. "బాలు, మీనా మీరు ఇద్దరూ రవి ఎదగడం ఇష్టంలేకే ఇలా మాట్లాడుతున్నారు. మంచి అవకాశం వచ్చినా వద్దంటున్నారు" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు మాత్రం అతడిని అడ్డుకుంటూ, "అనవసరంగా గొడవలు పెట్టకు. ఇది రవి వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. డబ్బు తీసుకోవాలా? వద్దా? అనేది అతడే నిర్ణయించుకోవాలి. మనం అతనిపై మన అభిప్రాయాన్ని రుద్దకూడదు" అని స్పష్టం చేస్తాడు.
ఇంట్లో అందరూ వెళ్లిపోయిన తర్వాత రవి ఒంటరిగా కూర్చుని జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తాడు. ముఖ్యంగా శృతి, "నీ మెంటాలిటీ ఇలాగే ఉంటే మనం జీవితంలో ఎదగలేం. అమ్మ ఇచ్చే డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు" అంటూ తన తల్లి వైపు నిలబడిన మాటలు అతనిని తీవ్రంగా కలచివేస్తాయి. ఒకవైపు భార్య అభిప్రాయం, మరోవైపు తన ఆత్మగౌరవం మధ్య రవి తీవ్ర మానసిక సంఘర్షణలో పడతాడు.
ఇదే సమయంలో బాలు, మనోజ్ ఇద్దరూ దాబాపై మాట్లాడుకుంటారు. మనోజ్, "ఎంతోమంది అత్తమామల సహాయంతో జీవితంలో ఎదిగారు. విలువలు, ఆత్మగౌరవం అంటూ కూర్చుంటే అవకాశాలు కోల్పోతారు" అంటూ రవికి డబ్బు తీసుకోవాలని సూచిస్తాడు. కానీ బాలు మాత్రం, "ఈరోజు డబ్బు తీసుకుంటే రేపు అదే డబ్బు గురించి మాటలు వినాల్సి వస్తుంది. అప్పుడు జీవితం కుక్కలు చింపిన విస్తరిగా మారుతుంది. డబ్బుకంటే మనిషి వ్యక్తిత్వం గొప్పది" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు.
ఈ క్రమంలో మనోజ్, "నువ్వు కూడా ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నావు. ఎదగలేదు. ఇంకొకరిని కూడా ఎదగనివ్వడం లేదు" అని వ్యంగ్యంగా మాట్లాడుతాడు. దానికి బాలు ఒక్కసారిగా, "నువ్వు నాన్న దగ్గర తీసుకున్న 40 లక్షలు ముందు తిరిగి ఇవ్వు. అందులో మా వాటా తర్వాత చూసుకుందాం. ముందుగా రవికి రావాల్సిన 15 లక్షలు ఇచ్చేయ్" అంటూ నిలదీయడంతో మనోజ్ దగ్గర సమాధానం ఉండదు. వెంటనే మాట మార్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు రోహిణి, మీనా, శృతి మధ్య కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. రోహిణి, "రవి చాలా ఫూలిష్‌గా ఆలోచిస్తున్నాడు" అని అనగానే మీనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. "ఇది మూర్ఖత్వం కాదు... ఆత్మగౌరవం. ఈరోజు డబ్బు తీసుకుని రేపు అవమానం ఎదురైతే రవి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడు. అప్పుడు మీ ఇద్దరి జీవితం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. నేను డబ్బు తీసుకోవద్దని చెప్పడం లేదు. కానీ నిర్ణయం పూర్తిగా రవిదే" అంటూ శృతికి అర్థమయ్యేలా వివరిస్తుంది.
అయినా రోహిణి, "మీనా మీ ఇద్దరూ ఎదగకుండా చేయాలనే ఇలా మాట్లాడుతోంది" అంటూ మరోసారి శృతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో మీనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "మీరు కూడా మామయ్య దగ్గర నుంచి 30 లక్షలు తీసుకున్నారు కదా. అందులో రవికి రావాల్సిన వాటా ముందుగా ఇవ్వండి. ఆ తర్వాత ఈ విషయంపై మాట్లాడండి" అంటూ గట్టి కౌంటర్ ఇస్తుంది. ఆ మాటలకు రోహిణి ఒక్కసారిగా నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చివరగా మీనా శృతిని ప్రశాంతంగా ఉద్దేశించి, "మీ ఇద్దరి జీవితానికి సంబంధించిన నిర్ణయం మీరే తీసుకోవాలి. కానీ డబ్బు కారణంగా మీ ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకో. రవి ఆత్మగౌరవాన్ని కూడా అర్థం చేసుకో" అంటూ విలువైన సలహా ఇస్తుంది.
మరోవైపు.. మీనా తన పూల డెకరేషన్ వ్యాపారంలో ఇప్పటివరకు ఊహించని స్థాయిలో అవకాశాన్ని అందుకుంటుంది. ఓ ఈవెంట్ మేనేజర్ ఆమెను కలిసి రూ.10 లక్షల విలువైన డెకరేషన్ ఆర్డర్ ఇవ్వాలని చెబుతాడు. అంత పెద్ద ఆర్డర్‌ను పూర్తి చేయగలవా అని సందేహం వ్యక్తం చేయగా, మీనా ఆత్మవిశ్వాసంతో "తప్పకుండా పూర్తి చేస్తాను" అని హామీ ఇస్తుంది. ఆ తర్వాత అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని ఈవెంట్ మేనేజర్ కోరతాడు.
అయితే మీనా తనకు పెద్దగా చదువు లేదని, అగ్రిమెంట్ చదవలేనని, తన మరిది వచ్చాక సంతకం చేస్తానని చెప్పుతుంది. కానీ ఆ ఈవెంట్ మేనేజర్ మాత్రం "ఇందులో ఎలాంటి క్లిష్టమైన షరతులు లేవు. మీకు ఆర్డర్ ఇచ్చిన విషయం, ఎంత అడ్వాన్స్ ఇచ్చామన్న వివరాలే ఉన్నాయి. ఇది అర్జెంట్" అంటూ ఆమెను ఒప్పిస్తాడు. కొంత సందేహం ఉన్నప్పటికీ చివరికి మీనా అగ్రిమెంట్‌పై సంతకం చేస్తుంది. అనంతరం రూ.10 లక్షల ఆర్డర్‌కు అడ్వాన్స్‌గా రూ.1 లక్ష ఆమె చేతిలో పెడతాడు. ఆ డబ్బు చూసిన మీనా ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక చింతామణి పన్నిన ప్లాన్ ఉందని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఈవెంట్ మేనేజర్‌తో మాట్లాడిన చింతామణి, "ఆ అగ్రిమెంట్‌ను చాలా జాగ్రత్తగా దాచిపెట్టు. భవిష్యత్తులో అది మనకు చాలా ఉపయోగపడుతుంది" అని చెప్పడం కథలో పెద్ద ట్విస్ట్‌ను సృష్టిస్తుంది. ఆమె అసలు ఏం ప్లాన్ చేస్తోందో తన అసిస్టెంట్‌కే అర్థం కాకపోవడం ఆసక్తిని మరింత పెంచుతుంది. దీంతో మీనాకు వచ్చిన ఈ భారీ ఆర్డర్ ఆనందాన్ని భవిష్యత్తులో పెద్ద సమస్యగా మార్చేందుకు చింతామణి కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇంటికి చేరుకున్న మీనా రూ.10 లక్షల ఆర్డర్ విషయం బాలుకు చెప్పి, అడ్వాన్స్‌గా వచ్చిన రూ.1 లక్ష అతని చేతిలో పెడుతుంది. ఆ విషయం విన్న బాలు ఆనందంతో ఉప్పొంగిపోతూ మీనాను ఎత్తుకుని తిప్పేస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రభావతి, "ఇది ఇల్లా... లేక ఇంకేదైనా అనుకున్నారా?" అంటూ మందలిస్తుంది. దానికి బాలు, "నా భార్య జీవితంలోనే మొదటిసారి రూ.10 లక్షల ఆర్డర్ తెచ్చుకుంది. నేను సంతోషపడకుండా ఎలా ఉంటాను?" అని చెప్పడంతో ప్రభావతి కూడా ఆశ్చర్యపోతుంది. సత్యంతో పాటు కుటుంబ సభ్యులంతా మీనాను అభినందిస్తారు.
అయితే మనోజ్ మాత్రం తన స్వభావం మార్చుకోకుండా, "కేవలం రూ.10 లక్షల ఆర్డర్‌కే ఇంత హంగామా చేస్తున్నారా? రూ.10 కోట్లు వచ్చినట్టు సంబరపడుతున్నారు" అంటూ వెటకారం చేస్తాడు. వెంటనే బాలు కౌంటర్ ఇస్తూ, "నీ కంటి చూపు రావడానికి నేను కారణం. నీ ఆపరేషన్ కోసం నా డబ్బులు ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఖర్చు అయిన రూ.2 లక్షలు తిరిగి ఇవ్వు" అంటూ నిలదీస్తాడు. దీంతో మనోజ్ ఒక్కసారిగా నోరు మూసుకుంటాడు. సత్యం కూడా, "బాలు నీ కోసం ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు చేశాడు. అతని డబ్బులు తిరిగి ఇవ్వాలి" అని కొడుకుకు సూచిస్తాడు.
అయితే రోహిణి మాత్రం, "ప్రస్తుత పరిస్థితుల్లో అంత డబ్బు ఇవ్వడం కష్టం" అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో మీనా జోక్యం చేసుకుంటూ, "మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మాత్రం అందరికీ గుర్తుంటుంది. తిరిగి ఇవ్వాల్సినప్పుడు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు" అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఆమె మాటలకు ప్రభావతి కోపంగా స్పందించగా, మీనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, "మా డబ్బులు ఇవ్వలేకపోతే మీ బంగారాన్ని తాకట్టు పెట్టి అయినా మాకు ఇవ్వండి. లేదంటే ఈ విషయంపై మాట్లాడకండి" అంటూ ధైర్యంగా సమాధానం ఇస్తుంది.
దీంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. బాలు కూడా కోపంతో మనోజ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా, మీనా అతడిని అడ్డుకుని బయటకు తీసుకెళ్తుంది. ఈ గొడవ మొత్తాన్ని గమనించిన శృతి సరదాగా, "అనవసరంగా శాపం మిస్ అయిపోయింది" అని వ్యాఖ్యానించడం నవ్వులు పూయిస్తుంది. మరోవైపు ప్రభావతి మాత్రం, "నేను ఇంట్లో ఉన్నానా... లేక హిమాలయాల్లో ఉన్నానా అర్థం కావడం లేదు" అంటూ తన అసహాయతను వ్యక్తం చేస్తుంది.
ఇక బాలు జీవితంలో కూడా మరో శుభవార్త చోటుచేసుకుంటుంది. అతని వ్యాపారానికి రూ.90 వేల విలువైన లాంగ్ టర్మ్ ఆర్డర్ వస్తుంది. కస్టమర్లతో బాలు ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడడం చూసి మీనా ఆశ్చర్యపోతుంది. "మీకు ఇంగ్లిష్ ఇంత బాగా ఎలా వచ్చింది?" అని అడగగా, "కస్టమర్లతో మాట్లాడుతూనే అలవాటు అయింది. అంతేకాదు నాకు ఇంగ్లిష్‌లో 92 మార్కులు వచ్చాయి" అంటూ సరదాగా సమాధానం ఇస్తాడు. బాలు మాటలకు మీనా కూడా ఆశ్చర్యపోతూ నవ్వుతుంది.
ఒకవైపు మీనాకు రూ.10 లక్షల భారీ ఆర్డర్, మరోవైపు బాలుకు కొత్త వ్యాపార అవకాశం రావడంతో ఈ కుటుంబంలో కొత్త ఆశలు చిగురించినట్లే కనిపిస్తోంది. కానీ అదే సమయంలో చింతామణి పన్నిన రహస్య కుట్ర, మీనా సంతకం చేసిన అగ్రిమెంట్ భవిష్యత్తులో ఆమెకు పెద్ద ప్రమాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్డర్ మీనా జీవితాన్ని మార్చేస్తుందా? లేక చింతామణి ఉచ్చులో చిక్కుకునేలా చేస్తుందా? అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగియడంతో తదుపరి భాగంపై ఆసక్తి మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications