Gunde Ninda Gudi Gantalu July 19th: మరీ దిగజారిపోయిన మనోజ్.. పరువు తీసిన బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 18వ తేదీ 469వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కెనడా వెళ్లడం కోసమని మనోజ్ రోహిణిని డబ్బులు అడుగుతాడు. అప్పటికే అప్పుల మీద అప్పులు చేసి ఉండటం, పైగా దినేష్ రోహిణిని బ్లాక్ మెయిల్ చేస్తుండటం.. అదే సమయంలో మనోజ్ డబ్బులు అడగటంతో రోహిణి మండి పడుతుంది. మీ అమ్మను అడగమని, మీ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి 14 లక్షలు ఇవ్వమని సూచిస్తుంది. ఎలాగూ మీ అమ్మకు నువ్వంటే ఇష్టమే కాబట్టి అడగగానే ఇస్తుందని చెబుతుంది. ఇప్పుడు మా నాన్న మలేషియా జైలులో ఉన్నారు కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేనని అంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడమే మార్గమని చెబుతుంది. ఇక రోహిణి మాటలు నమ్మి మనోజ్ వెళ్లి తండ్రి సత్యం, తల్లి ప్రభావతిని డబ్బులు అడుగుతాడు. ఇప్పటికే నీ మీద చాలా ఖర్చు పెట్టామని, ఇకపై చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదని తండ్రి సత్యం అంటాడు.
ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలిరా అని ప్రభావతి అడుగుతుంది. ఈ ఇంటి పత్రాలను తాకట్టు పెడుదామని మనోజ్ అంటాడు. దాంతో ప్రభావతి, సత్యం, బాలు, మీనా షాక్ అవుతారు. ఈ ఇంటి పత్రాలు తాకట్టు వచ్చిన డబ్బుతో కెనడాకు వెళ్లి లక్షలు సంపాదిస్తానని చెబుతాడు. నాకు ఉన్న క్వాలిఫికేషన్ కు ఇక్కడ సరైన ఉద్యోగం రావడం లేదని, కెనడా వెళ్లడమే మార్గమని అంటాడు. దాంతో సత్యం స్పందిస్తూ ఇప్పటికే నువ్వు చేసిన అప్పులు అలాగే ఉన్నాయని, నా రిటైర్ మెంట్ డబ్బులు మొత్తం కాజేశావని సత్యం అంటాడు. ఇప్పటికీ నిన్ను నేనే పోషించాల్సి వస్తోంది. కెనడా గినడా వదిలేసి ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకోమని అంటాడు. అదే సమయానికి రోహిణి కూడా వచ్చి ఈ ఒక్కసారికి డబ్బులు ఇవ్వొచ్చు కదా అత్తయ్య అని ప్రభావతిని అడుగుతుంది. దాంతో ప్రభావతి నీ భర్తపై నీకు అంత ప్రేమ ఉంటే మీ నాన్నను అడగమని అంటుంది. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జూలై 19వ తేదీ 470 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మనోజ్ డబ్బులు అడిగితే ప్రభావతి మాత్రం అస్సలు ఇవ్వనని చెబుతుంది. ఇక తొలిసారిగా మనోజ్ పై మండిపడుతుంది. అసలు మొదటి నుంచి నిన్ను వెనకేసుకొని వస్తున్నానని, నీ వల్ల ఇంట్లో వాళ్లందరితో తిట్లు పడుతున్నానని అంటుంది. ఇన్నాళ్లు నిన్ను వెనకేసుకొని వచ్చాను. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని పనిచేసుకొని బతకమని అంటుంది. రోహిణికి కూడా క్లాస్ పీకుతుంది. కొన్నాళ్లుగా వందల సార్లు చెబుతూనే ఉన్నాను. ఒక్కసారి మీ నాన్నకు ఫోన్ చేసి బిజినెస్ పెట్టించమ్మ అని చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు మీ నాన్న ఆస్తులన్నీ మలేషియా పోలీసులు స్వాధీనం చేశారు. ఇక మీ కర్మ మీరు అనుభవించండి. ఈ ఇంటిని మాత్రం అస్సలు తాకట్టు పెట్టనివ్వను. ఇది మా నాన్న నాకు రాసిచ్చిన ఇల్లు. ఇలా ఇంటిని తాకట్టు పెట్టి మిమ్మల్ని బయటికి పంపిద్దామని చూస్తున్నారా? అని అడుగుతుంది. ఇంకోసారి ఇంటిని తాకట్టు పెట్టాలనే ఆలోచన వచ్చినా తాట తీస్తానని హెచ్చరిస్తుంది.
ప్రభావతి తొలిసారిగా మనోజ్ పై ఫైర్ అవ్వడం చూసి తండ్రి సత్యం, బాలు షాక్ అవుతారు. ప్రభావతిలో ఇంత మార్పు ఏంటంటూ ఆశ్చర్యపోతారు. ఏదేమైనా మనోజ్ కు బుద్ధి చెప్పిందని అనుకుంటారు. ఇక ఇంట్లో ఎంత ట్రై చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మనోజ్ వెళ్లి మళ్లీ పార్కులోనే కూర్చొంటాడు. అదే సమయంలో తన పార్కు స్నేహితుడు అక్కడకు వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది బ్రదర్ నా పరిస్థితి అని అంటాడు. దీంతో ఏమైందో పూర్తిగా చెప్పమని అంటాడు. నాకు డబ్బులు కావాలి అని అంటాడు. పోయిన సారి ఎప్పుడు అడిగినా డబ్బులు ఇస్తానని అన్నావ్ కదా ఇప్పుడు అవసరం ఉందని ఇస్తావా? అని అడుగుతాడు. పోయిన సారి 20 వేలు ఇచ్చినందుకే ముప్పు తిప్పలు పెట్టావ్.. ఇంక నిన్ను నమ్మి డబ్బులు ఎలా ఇవ్వాలని అని అంటాడు. మా ఇంట్లో కూడా ఇవ్వనని అంటున్నారని చెబుతాడు. మంచి జాబ్ మిస్ అవుతుందని, కెనడాకు వెళితే లక్షలు సంపాదించవచ్చని అంటాడు. కానీ 14 లక్షలు కడితేనే ఏజెన్సీ వాడు పంపిస్తాడని వివరిస్తాడు. అక్కడికి వెళ్లాక లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుందని చెబుతాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణతో డబ్బులు త్వరగా సంపాదించే మార్గం ఏంటా అని ఆలోచిస్తారు. ఇక బిక్షం ఎత్తుకోవడం కరెక్ట్ ఏమోనని, అది పెద్ద వ్యాపారం అని చర్చించుకుంటారు. సమాజాన్ని పట్టించుకోకుండా, కొద్ది రోజులు బిచ్చం ఎత్తుకుంటే లక్షలు వస్తాయని తన పార్కు స్నేహితుడు అంటాడు. ఆ మాటలు నమ్మి మనోజ్ వెళ్లి గుడి మెట్ల మీద అడుకునేందుకు సిద్ధమవుతాడు. ఇక ఓ గుడి మెట్ల మీద కూర్చొని డబ్బులు అడుకుంటూ ఉంటాడు. అదే గుడికి మీనా కూడా వెళ్తుంది. అక్కడ బిక్షగాళ్లకు తలో రూపాయి వేస్తూ వెళ్తుంది. మీనా చూసి మనోజ్ షాక్ అవుతాడు. అతన్ని ఎక్కడ చూస్తుందోనని బిక్షం అడుక్కోవడం మానేసి మొహం చుట్టూ గుడ్డను చుట్టుకుంటాడు. కానీ మీనా గుర్తు పడుతుంది. వెంటనే ఆ గుడ్డను తీసి మొహం చూపించమని అంటుంది. మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. అసలు నువ్వు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది. వెంటనే బాలుకు ఫోన్ చేసి మనోజ్ సంగతి అంతా చెబుతుంది. త్వరగా గుడి దగ్గరకు రమ్మని అంటుంది. ఆ విషయం తెలుసుకున్న బాలు వెంటనే గుడి దగ్గరకు బయల్దేరుతాడు. ఇక బాలు, మీనాకు మనోజ్ బాగోతం తెలియడంతో ఇంట్లో చెబుతారా? లేక తమ మదిలోనే దాచుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










