Gundeninda Gudigantalu january 31th Episode: నడిరోడ్డుపై బాలు,మీనా రచ్చ..పోలీస్ ఎంట్రీతో షాక్..చిక్కులో రోహిణి

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌ మొత్తం కుట్రలు, అపార్థాలు, ధైర్యమైన కౌంటర్లు, చివర్లో మైండ్ గేమ్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనాపై చాడీలు చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్న ప్రభావతి, శృతి తల్లి శోభన ఇంటికి రాగానే తన అసలు పని మొదలుపెడుతుంది. చాలా నాటకీయంగా "చూడమ్మా శోభనా... నీ అమ్మాయి శృతి గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి. ఆ మీనా స్నేహంతో శృతి పూర్తిగా పాడైపోతోంది. మీనా దగ్గర ఉంటే శృతి జీవితం నాశనం అవ్వడం ఖాయం" అంటూ విషం చల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రభావతి మాటలు విని శోభన రెచ్చిపోతుందని, మీనాపై కోపంతో దూకుతుందని ఆమె ఆశించినా, అక్కడే ఆమె ప్లాన్‌కు ఊహించని షాక్ తగులుతుంది.

శోభన గట్టిగా స్పందిస్తూ 'ప్రభావతి గారు... నా కూతురు ఎలా ఉండాలో, ఎవరితో స్నేహం చేయాలో తనకు తెలుసు. మీ ఇంట్లో జరిగే అంతర్గత గొడవల్లోకి నన్ను లాగకండి. ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి నన్ను పిలవొద్దు" అని చెప్పి విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ మాటలతో ప్రభావతి ముఖం పూర్తిగా మాడిపోతుంది. 'దీనికి ఇంత పొగరేంటి?' అంటూ తనలో తాను గొణుక్కుంటూ, మీనాను దెబ్బ కొట్టాలనుకున్న తన ప్లాన్ ఇలా ఎందుకు దెబ్బతిందో అర్థం కాక తీవ్ర నిరాశలో మునిగిపోతుంది. ఇదే సమయంలో మరోవైపు రోహిణికి తన తల్లికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడంతో, అసలు నిజం చెప్పకుండా కంగారులో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ పరిణామాలతో ప్రభావతి మనసులో మరింత అనుమానాలు స్టార్ అవుతాయి. అదేవిధంగా డ్యాన్స్ స్కూల్‌లో చేరిన ప్రేమజంట ప్రవర్తనపై కూడా ప్రభావతికి అనుమానం మొదలవుతుంది.

Gundeninda Gudigantalu january 30th Episode

photo courtesy by star maa and JioHotstar

ఇక ఎపిసోడ్‌లో కీలక మలుపు శోభన-మీనా మధ్య జరిగిన రోడ్డు సీన్. కారులో వెళ్తున్న శోభన, రోడ్డు పక్కన మీనాను చూసి కారు ఆపుతుంది. ప్రభావతి చెప్పిన మాటలు ఆమె మనసులో గిర్రున తిరుగుతూనే ఉంటాయి. మీనా ఎంతో మర్యాదగా "నమస్కారం అమ్మా... బాగున్నారా?" అని పలకరిస్తే, శోభన వ్యంగ్యంగా 'నువ్వు ఉండగా ఎవరు బాగుంటారు? నా కూతురు సంసారంలో నిప్పులు పోస్తున్నావట కదా' అంటూ ఒక్కసారిగా దాడి చేస్తుంది. 'నీ అత్తయ్య ప్రభావతి, రోహిణి అన్నీ చెప్పారు నీ గురించి'అంటూ అసలు కారణాన్ని బయటపెడుతుంది. ఈ మాటలతో మీనాకు వెంటనే అర్థమవుతుంది-ఇదంతా ప్రభావతి వేసిన కుట్ర అని.

మీనాపై నిందలు పెరుగుతుండటంతో ఆమె తొలుత శాంతంగా స్పందిస్తుంది. 'అమ్మా... శృతి నాకు చెల్లెలు లాంటిది. ఆమె గురించి మీరు ఇలా మాట్లాడటం బాగోలేదు'అని చెప్పినా, శోభన మాటలు మరింత దిగజారుతాయి. 'నీ మొగుడికి తాగడానికి డబ్బులు లేక, మీ సంసారంలో గొడవలు ఉండబట్టే నా కూతురిపై పడిపోయావు' అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక్కడే మీనా ఇక మౌనంగా ఉండకుండా, గౌరవాన్ని కాపాడుకుంటూనే గట్టి కౌంటర్ ఇస్తుంది. 'మీరు శృతి తల్లి కాబట్టి ఇప్పటివరకు గౌరవంగా మాట్లాడుతున్నాను. మాటలు సరిగ్గా రాని మీలాంటి వాళ్లకు శృతి లాంటి తెలివైన అమ్మాయి ఎలా పుట్టిందో అర్థం కావడం లేదు. శృతి మీద ఆసిడ్ పోసిన వాడిని నేనేం చేశానో మీకు తెలుసు. ఆ పరిస్థితి నా మీదకు తెచ్చుకోకండి" అంటూ హెచ్చరిస్తుంది. అయినా శోభన నోటికి తాళం పడకపోవడంతో, మీనా స్నేహితురాలు జోక్యం చేసుకుని 'ఇక్కడే నీ కారును తగలబెట్టేస్తాం'అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో శోభన భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఈ దృశ్యాలన్నీ దూరం నుంచి గమనించిన బాలు, వెంటనే మీనా దగ్గరకు వచ్చి 'ఏమైంది? ఆవిడ ఎందుకు అలా వెళ్తోంది?' అని ఆందోళనగా అడుగుతాడు. మీనా మాత్రం విషయం దాచేందుకు ప్రయత్నిస్తూ "ఏం లేదు... పూలు కొనడానికి వచ్చింది. రేటు విషయంలో చిన్న మాట వచ్చింది'అంటూ అబద్ధం చెబుతుంది. కానీ బాలు ఆమె ముఖంలోని ఆవేశాన్ని గమనించి 'నీ ముఖం చూస్తే అర్థమవుతోంది. ఆమె పూల కోసం కాదు, నీతో గొడవ పడటానికే వచ్చింది' అంటూ నిలదీస్తాడు. మీనా మౌనంగా తలదించుకుంటుంది. అప్పుడు మీనా స్నేహితురాలు మొత్తం నిజాన్ని బయటపెట్టి, శోభన మీనా-బాలుపై ఎలా లేనిపోని నిందలు వేసిందో వివరిస్తుంది.

నిజం తెలిసిన బాలు కోపంతో ఊగిపోతాడు. 'మీనా... కారు ఎక్కు. ఇప్పుడే ఇంటికి వెళ్దాం. ఎవరు నిందలు వేసారో అక్కడే తేల్చుకుందాం' అంటూ ఆవేశంగా ఇంటివైపు బయలుదేరుతాడు. బాలు-మీనా కోపంగా ఇంటికి రావడం చూసిన ప్రభావతి లోలోపల పండగ చేసుకుంటుంది. 'నేను పెట్టిన మంట ఇప్పుడు రాజుకుంది' అంటూ మురిసిపోతుంది. గదిలోకి వెళ్లి రవి,శృతికి బాలు గట్టిగా అరుస్తాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. బాలు, మీనా, రవి, శృతి నలుగురూ ఒకరికొకరు సైగలు చేసుకుని ముందే ఫిక్స్ అయిన డ్రామాను స్టార్ట్ చేస్తారు. శృతి ప్రభావతిని నమ్మించేందుకు 'ఇకపై నేను మీనా మాటలు వినను. అత్తయ్య గారే నా సర్వస్వం' అంటూ నటిస్తుంది. నలుగురూ పెద్దగా అరుస్తూ గొడవపడుతున్నట్టు నటిస్తూ గదుల్లోకి వెళ్లిపోతారు.

బయట ఉన్న ప్రభావతి ఆనందానికి అవధులు ఉండవు. తన ప్లాన్ సక్సెస్ అయిందని ఫుల్ ఖుషీ అవుతుంది. సత్యం ఇంటికి వచ్చి 'ఇంట్లో ఇంత అరుపులు ఎందుకు?' అని అడిగితే, ప్రభావతి 'మీ గారాల కొడుకులు, కోడళ్లు గొడవ పడుతున్నారు'అంటూ ఆనందంగా చెబుతుంది. చివరగా బాలు కిందికి వచ్చి 'ఇకపై మా నాన్నను గానీ, మీనాను గానీ ఎవరైనా అంటే ఊరుకోను' అంటూ వార్నింగ్ ఇస్తాడు. మీనా కూడా అదే ధోరణిలో స్పందిస్తుంది. శృతి కూడా 'అత్తయ్యే నాకు సర్వస్వం'అని చెప్పడంతో ప్రభావతి గాల్లో తేలిపోతుంది. కానీ అసలు నిజం ఏంటంటే.. ఈ మొత్తం డ్రామాతో నలుగురూ కలిసి ప్రభావతినే బకరా చేశారు. ఇదంతా తెలియని ప్రభావతి ఆనందంలో మునిగిపోతుండగానే, ఉత్కంఠభరితంగా శుక్రవారం నాటి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక అప్కమ్మింగ్ ఎపిసోడ్ లో కథ మరోసారి హై వోల్టేజ్ డ్రామాతో సాగింది. ప్రభావతి పెట్టిన చిచ్చుతో మీనా-శ్రుతి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు నానా మాటలు పడతాయి. మీనాను శ్రుతి పొగరుబోతని, బాలు కంటే గయ్యాలినని తీవ్రంగా తిడుతుంది. ఇక నుంచి కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా, భోజనం కావాలన్నా అత్తయ్యే పెడతారని వ్యంగ్యంగా చెప్పి మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనికి ప్రతిగా శ్రుతి కూడా 'నాకు అన్నీ అత్తయ్యే చూసుకుంటారు' అంటూ వెళ్లిపోతుంది. ఇద్దరు తోడి కోడళ్ల గొడవ వంటింటి దాకా రావడంతో ప్రభావతి లోలోపల సంతోషంతో పొంగిపోతుంది. ఇకపై ఈ ఇద్దరు ఉప్పు-నిప్పులా ఉంటారని, ఎప్పటికీ కలవరు అని భావిస్తూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది.

ఇదిలా ఉండగా రోహిణి సొంతూరికి వెళ్లడం మరో కీలక మలుపు తిరిగినట్టు తెలుస్తోంది. అక్కడ చింటు ఏడుస్తూ కనిపిస్తాడు. తల్లి సుగుణను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. స్పృహలోకి వచ్చిన సుగుణ, రోహిణితో భావోద్వేగంగా మాట్లాడుతూ, "నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. నేను పోతే చింటు పరిస్థితి ఏమవుతుంది?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇకపై నీ కొడుకు బాధ్యత పూర్తిగా నీమీదేనని, అత్తింట్లో ఏం చెప్పినా సరే చింటును తప్పకుండా తీసుకెళ్లాలని సుగుణ చెబుతుంది. ఈ మాటలతో రోహిణి కుంగిపోతుంది. ఇప్పటికే తన పరిస్థితి బాగోలేదని, ఇప్పుడు కొడుకు బాధ్యత కూడా తన మీదే పడిందని రోహిణి బాధపడుతుంది.

మరోవైపు బాలు కారులో ఓ ప్యాసెంజర్‌ను తీసుకుని బయల్దేరతాడు. పెళ్లికి అర్జెంట్‌గా వెళ్లాలంటూ ప్యాసెంజర్ తొందరపడుతుంటే, బాలు తన స్టైల్‌లో పెళ్లి మీద సెటైర్లు వేస్తాడు. ఇదే సమయంలో ఎదురుగా స్కూటీపై వస్తున్న మీనా కారుకు తాకడంతో ఇద్దరి మధ్య నడిరోడ్డు మీదే మాటల యుద్ధం మొదలవుతుంది. పూలగంప, ముళకంప గురించి ఇన్‌డైరెక్ట్ పంచ్‌లతో ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకుంటారు. ట్రాఫిక్ పోలీస్ వచ్చి గొడవ ఏంటని అడిగి, రాంగ్ రూట్‌కు 500 రూపాయల ఫైన్ వేస్తానంటాడు. చివరకు మీనా "ఈయనే మా ఆయన" అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో పోలీస్, ప్యాసెంజర్ షాక్ అవుతారు. సరదా గొడవ అని అర్థం చేసుకుని పోలీస్ వెళ్లిపోతాడు. చివర్లో "ఇంటికి రండి... మీ సంగతి చెబుతాను" అంటూ మీనా ఇచ్చిన వార్నింగ్‌తో ఎపిసోడ్ నవ్వులు, ఉత్కంఠతో ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X