Gundeninda Gudigantalu February 28th Episode: మౌనికపై నీలకంఠ కుట్ర.. రోహిణికి బాలు షాక్..
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ లో పూజా పనుల్లో బాలు పూర్తిగా మునిగిపోయి తన ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి మర్చిపోతాడు. అదే ఫోన్‌లో శివకు సంబంధించిన కీలక వీడియో ఉందని తెలుసుకున్న రోహిణి, ఎలాగైనా ఆ ఫోన్‌ను దొంగిలించి వీడియో డిలీట్ చేయాలని ప్లాన్ వేస్తుంది. 'ఈ బాలు గాడి ఫోన్ దొరికితే చాలు.. నా గుట్టు బయట పడకుండా చూసుకుంటా' అని తనలో తాను అనుకుంటుంది. అయితే పరిస్థితులు ఆమెకు అనుకూలంగా ఉండవు. మీనా ఫోన్ చేయడంతో గందరగోళం ఏర్పడుతుంది. ఆ హడావిడిలో రోహిణి ఫోన్‌ను ఒక మూలలో దాచిపెట్టి వెళ్తుంది. కానీ అక్కడే ఉన్న ఒక చిన్నారి ఆ ఫోన్‌ను తీసేసుకుంటుంది. ఆ పిల్ల మామూలుదికాదు.. ఫోన్‌తో వీడియోలు తీస్తూ రచ్చ చేస్తుంది. రోహిణి స్నేహితురాలు విద్య ఆ ఫోన్ అడిగితే, 'ఇది నా ఫోన్. మళ్లీ అడిగితే పోలీసులకు ఫోన్ చేస్తా' అంటూ ఆ చిన్నారి షాక్ ఇస్తుంది. విద్య బిత్తరపోయి అక్కడి నుంచి జారుకుంటుంది. రోహిణి ప్లాన్ ఇక్కడితో తారుమారవుతుంది.
బావపై ప్రేమ కురిపించిన బాలు
మీనా ఇచ్చిన వార్నింగ్‌తో సంజు, మౌనిక పూజకు వస్తారు. పాత గొడవలు పక్కనబెట్టి బాలు సంజును ఎంతో గౌరవంగా ఆహ్వానిస్తాడు.'రండి బావగారు.. మీ రాకతో మా ఇల్లు పావనమైంది' అంటూ తనదైన శైలిలో మాట్లాడతాడు బాలు. సంజు ఆశ్చర్యపోతూ 'ఇందులో ఏదో మతలబు ఉంది' అంటాడు. పూజ అనంతరం బాలు జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి సంజుకు ఇస్తాడు. 'విషం కాదు బావా.. నా ప్రేమ కలిపాను' అంటూ నవ్వుతాడు. బాలులో వచ్చిన ఈ మార్పు చూసి సంజు అయోమయంలో పడిపోతాడు. యాగం పూర్తయ్యాక ప్రభావతి తన ప్రతాపం చూపించాలని నిర్ణయిస్తుంది. 'నేను ఒక పాట పాడతాను' అంటూ మైక్ పట్టుకుంటుంది. కామాక్షి సెటైర్లు వేస్తూ 'గేట్లు మూసేయండి.. జనం రాళ్లు పట్టుకుని వస్తారు' అంటుంది. సుశీలమ్మ కూడా 'పెళ్లి చేసుకున్నది పాటలు పాడవద్దనే కండిషన్ మీద' అంటూ నవ్వులు పూయిస్తుంది.

photo courtesy jiohotstar
అయినా వినకుండా ప్రభావతి కర్ణకఠోరంగా పాడటం మొదలుపెడుతుంది. అది వినలేక మీనాక్షి చెవిలో నుంచి రక్తం వచ్చినట్టు నటిస్తూ కామెడీ పండిస్తుంది. సత్యం మాత్రం ముందే చెవిలో దూది పెట్టుకుని 'వన్స్ మోర్' అంటూ భార్యను ఆటపట్టిస్తాడు. చివరకు బాలు బ్రతిమాలడంతో ప్రభావతి మైక్ వదులుతుంది. పార్వతి 'మా మీనా చాలా బాగా పాడుతుంది' అని చెప్పడంతో అందరూ మీనాను పాడమంటారు. మీనా తియ్యని స్వరంతో భక్తి గీతం ఆలపిస్తుంది. ఇల్లంతా ప్రశాంతత నెలకొంటుంది. బాలు గర్వంగా భార్య వైపు చూస్తాడు. అందరూ మీనాను ప్రశంసలతో ముంచెత్తుతారు.
మరోవైపు రోహిణి, విద్యలు ఆ చిన్నారి వెనుకపడతారు. 'ఫోన్ ఇచ్చేయ్" అని అడిగితే 'మీరు దొంగలు' అంటూ ఆ పిల్ల షాక్ ఇస్తుంది. ఇంతలో బాలు వచ్చి ఐస్‌క్రీమ్ ఆశ చూపిస్తాడు. 'ఇదిగో ఐస్‌క్రీమ్.. నా ఫోన్ ఇవ్వు' అంటాడు. 'ఫోన్ కంటే ఐస్‌క్రీమ్ ఇష్టం'అంటూ ఆ చిన్నారి ఫోన్ ఇచ్చేస్తుంది. ఇలా రోహిణి ఆశలు అడియాశలు అవుతాయి. పూజ అనంతరం ప్రసాదం పంచుతుండగా మౌనిక ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ టెన్షన్ పడుతుంటే, సుశీలమ్మ నాడి చూసి 'మౌనిక గర్భవతి' శుభవార్త చెబుతుంది. ఈ మాట వినగానే ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సత్యం తాత కాబోతున్నాడని తెలిసి అందరూ సంతోషపడతారు.
బాలు ఆనందంతో గంతులు వేస్తూ చెల్లెలిని ఆశీర్వదిస్తాడు. సంజు తండ్రి వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మౌనికను వదిలేయాలని అనుకున్న ఆలోచన అక్కడికక్కడే కూలిపోతుంది. సంజు మనసులో కలగలుపు భావాలు కనిపిస్తాయి. సంజూని హత్తుకుని బాలు 'బావా ఎంత పని చేశావ్.. థాంక్స్ బావా' అంటూ సంబరపడిపోతాడు. కారులో బయలుదేరేటప్పుడు 'మొదటి సారి మనస్పూర్తిగా థాంక్స్ చెబుతున్నా'అంటాడు. సంజూ కూడా కాస్త కరిగిన మనసుతో చూస్తాడు. రాత్రి మీనా తాటి బెల్లం పాలు తీసుకుని బాలు దగ్గరకు వస్తుంది. ఇద్దరూ భవిష్యత్తు, పిల్లల గురించి ముచ్చటించుకుంటారు. 'మౌనికకు శుభవార్త వచ్చింది.. రేపు మనకూ వస్తుంది' అంటుంది మీనా. బాలు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు.
రాబోయే ఎపిసోడ్లలో కథ మరింత ఉత్కంఠగా మారబోతోంది. మౌనిక ప్రెగ్నెంట్ అనే విషయం సంజు తన ఇంట్లో చెప్పగానే, అతని తల్లి ఆనందంతో మురిసిపోతుంది. 'ఇప్పుడు అయినా నా కొడుకు మారుతాడు' అని ఆశ పడుతుంది. కోడలిని ప్రేమగా అంగీకరించే సంకేతాలు కనిపిస్తాయి. ఇంతకాలం అనుమానాలు, చిన్నచిన్న గొడవలతో నడిచిన సంజు-మౌనిక బంధం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. కానీ ఈ ఆనందాన్ని పంచుకోలేని వ్యక్తి నీలకంఠం. తన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిందని అతను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడు. పెళ్లై ఇంత కాలమైనా పిల్లలు పుట్టలేదని మౌనికను ఇంటి నుంచి పంపించాలని భావించిన అతని ఆలోచన ఒక్కసారిగా కూలిపోతుంది. వెంటనే మరో కుట్రకు సిద్ధమవుతాడు.
నీలకంఠం తన కొడుకు సంజీవ్‌తో మాట్లాడి మౌనికను ఇంటి నుంచి పంపించేలా ప్రయత్నించాలనుకుంటాడు. 'ఇప్పుడే చర్య తీసుకోకపోతే ఆలస్యం అవుతుంది' అంటూ తన వాదన వినిపిస్తాడు. కానీ ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతుంది. బాలు కుటుంబం చూపించిన ప్రేమ, మౌనికపై ఉన్న అనుబంధం సంజీవ్ మనసును మార్చుతుందా? లేక తండ్రి మాటకే విలువ ఇచ్చి మౌనికను దూరం చేస్తాడా? సంజీవ్ నిర్ణయం కథను ఏ దిశగా తీసుకెళ్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.
ఇక మరోవైపు రోహిణికి గుణ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 'శివ వీడియో నాకు ఇస్తేనే సహాయం చేస్తా. లేదంటే నీ బాయ్‌ఫ్రెండ్ దినేష్ విషయాన్ని పట్టించుకోను'అంటూ గుణ కఠినంగా చెబుతాడు. దీంతో రోహిణి మళ్లీ బాలు ఫోన్‌పై కన్నేస్తుంది. ఏదైనా చేసి శివ వీడియోను దొంగిలించాలనే ఉద్దేశంతో కొత్త ప్లాన్ వేస్తుంది. కానీ ఈసారి పరిస్థితులు అంత సులభంగా లేవు. రోహిణి ప్రవర్తనలో వచ్చిన మార్పు బాలు, మీనాల దృష్టికి వస్తుంది. బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తి విషయమై పోలీస్ కేసు పెడదామని బాలు అనగానే రోహిణి అడ్డుకోవడం వారికి అనుమానంగా మారుతుంది. ఇంకా బాలు ఫోన్ రోహిణి చేతిలో కనిపించడం మీనాకు షాక్ ఇస్తుంది. 'ఎందుకు బాలు ఫోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తోంది? ఆ ఫోన్‌లో ఆమెకు కావాల్సిన విషయం ఏమిటి?' అని మీనా ఆలోచనలో పడుతుంది. రోహిణి, బ్లాక్‌మెయిలర్ మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్న సందేహం బలపడుతుంది.
మరోవైపు రవి-శృతి మధ్య నీతు ప్రవర్తన వల్ల చిన్న చిన్న గొడవలు చెలరేగేలా కనిపిస్తోంది. నీతు మాటలు, చర్యలు ఈ జంట మధ్య అపార్థాలు పెంచేలా ఉంటాయి. రవి ఎవరిని నమ్ముతాడు? శృతి తన భర్తపై విశ్వాసం కోల్పోతుందా? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకు సాఫీగా సాగిన ఈ జంట బంధంలో కొత్త మలుపు రావడం ఖాయంగా కనిపిస్తోంది. సుశీలమ్మ ప్రభావతికి గట్టి గుణపాఠం చెప్పి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమె నిర్ణయం ఇంట్లో మరో చర్చకు దారితీస్తుంది.
ఇలా మౌనిక గర్భవతి అనే శుభవార్తతో ఒకవైపు ఆనందం వెల్లివిరుస్తుండగా, నీలకంఠం కుట్రలు, రోహిణి ప్లాన్‌లు, రవి-శృతి మధ్య అపార్థాలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. సంజీవ్ నిజంగా మారుతాడా? రోహిణి దొంగతనం విజయవంతమవుతుందా? బాలు-మీనా అనుమానాలు నిజం వైపు దారి తీస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలతో రాబోయే ఎపిసోడ్లు ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి.


Click it and Unblock the Notifications











