Gundeninda Gudigantalu April 25th Episode: రోహిణి సీక్రెట్ బట్టబయలు.. స్కూల్ లో బాలు, సత్యం కంట పడిందా?
Photo courtesy jiohotstar
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే మురళి పూలు, పండ్లు, చీరతో సత్యం ఇంటికి వచ్చి పెద్దలను గౌరవంగా ఆశీర్వాదం తీసుకున్నాడు. మొదట తనను మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిగా పరిచయం చేసుకుని, నెలకు మంచి జీతం వస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయం చెబుతూ మీనాను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇంట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యంగా మీనా కోపంతో ఊగిపోయి, అతడు తెచ్చిన పూలు పండ్ల బుట్టను నేలకేసి కొట్టింది. అప్పుడే ఇంటికి వచ్చిన బాలు పరిస్థితి చూసి ఏం జరిగిందని అడిగాడు. ఇదే సమయంలో మురళి బాలును చూసి "అన్నయ్య" అని పిలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత "ఇకనుంచి నువ్వు అన్నయ్య కాదు.. బావవు" అని చెప్పడంతో మరింత షాక్ నెలకొంది.
అసలు విషయం రవి బయటపెట్టడంతో బాలు తల పట్టుకున్నాడు. "అది నా భార్య.. నేనే దాని మొగుడిని" అంటూ మండిపడ్డాడు. మురళి మాత్రం సోషల్ మీడియాలో మీనా ఫోటో చూసి తాళి కనిపించలేదని, పెళ్లి కాలేదనుకున్నానని అమాయకంగా చెప్పడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. అసలు ట్విస్ట్ ఏమిటంటే.. మీనా వెంటపడటానికి బాలు దగ్గరే ప్రేమ సలహాలు తీసుకున్నాడని బయటపడింది. దీంతో బాలు అవాక్కయ్యాడు. చివరకు మురళిని ఇంటి దగ్గరకు కూడా రాకూడదని హెచ్చరించి పంపించారు. ఈ సంఘటన తర్వాత మీనా నేరుగా బాలు దగ్గరకు వెళ్లి గట్టిగా క్లాస్ తీసుకుంది. "ఏ విషయం అయినా ముందు వెనుక ఆలోచించి సలహా ఇవ్వాలి" అంటూ మందలించింది.

photo courtesy jiohotstar
అయితే బాలు తెలివిగా మాట మార్చి, సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో వల్లే ఈ గందరగోళం జరిగిందని చెప్పాడు. "నిన్ను చూసి కాలేజ్ అమ్మాయిలా ఉందనుకున్నాడట" అని చెప్పడంతో మీనా కోపం కొంత తగ్గింది. తర్వాత బాలు సరదాగా "నేను కూడా సూట్ వేసుకుని ఫోటో పెడతా.. ఎంతమంది నా వెంట పడతారో చూద్దాం" అని చెప్పడంతో మీనా మళ్లీ వెంటపడింది. ఈ ట్రాక్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఇక మరోవైపు మనోజ్, రోహిణి ఇంట్లో అందరినీ హాల్లోకి పిలిచి కొత్త విషయాన్ని ప్రకటించారు. తన బిజినెస్‌లో 10 లక్షల లాభం వచ్చిందని, త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నానని మనోజ్ గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ మాటలకు ప్రభావతి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది.
"మన వంశానికి పేరు తెచ్చేది మనోజ్ మాత్రమే" అంటూ పొగడ్తలు కురిపించింది. అయితే బాలు మాత్రం ఇది నిజమా లేక కొత్త డ్రామానా అని అనుమానం వ్యక్తం చేశాడు. రోహిణి వెంటనే స్పందిస్తూ "కష్టం మాత్రమే కాదు.. స్మార్ట్ వర్క్ కూడా చేయాలి" అంటూ బాలు, మీనాలకు సెటైర్ వేసింది. దీనికి రవి "స్మార్ట్ వర్క్ కొన్నిసార్లు మాత్రమే పనిచేస్తుంది.. హార్డ్ వర్క్ ఎప్పుడూ నిలుస్తుంది" అంటూ కౌంటర్ ఇచ్చాడు.
తర్వాత మనోజ్ తన తల్లి కోసం బంగారు గాజులు తెచ్చి గిఫ్ట్‌గా ఇవ్వడంతో ప్రభావతి ఆనందంలో తేలిపోయింది. కానీ బాలు మాత్రం "ఇంట్లో 40 లక్షలు పోగొట్టి నాలుగు గాజులు తెచ్చాడు" అంటూ చెంపపెట్టు లాంటి డైలాగ్ వేశాడు. ఇదే సమయంలో మనోజ్ త్వరలో ఇల్లు కాదు.. విల్లా కొనబోతున్నానని మరో బాంబ్ పేల్చాడు. ఈ విషయం మీనాను లోలోపల కలిచివేసింది. కానీ అది అసూయ కాదని స్పష్టం చేసింది. "మనోజ్ ఇల్లు కొనడం సమస్య కాదు.. మీ నాన్న కోరికే అసలు విషయం" అంటూ బాలుతో చెప్పింది. కుటుంబమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండాలని సత్యం ఎప్పుడూ కోరుకుంటాడని, ఇప్పుడు మనోజ్ బయటకు వెళ్తే ఉమ్మడి కుటుంబం చీలిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. మీనా ఆలోచనలకు బాలు కూడా షాక్ అయ్యాడు.
చివర్లో కథకు కొత్త మలుపు వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత సత్యం మళ్లీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆయన రెడీ అవుతుండగా బాలు ఆపడానికి ప్రయత్నించాడు. అయితే సత్యం మాత్రం "ప్రభావతి చేసిన తప్పులను సరిదిద్దడానికి ఈ వయసులో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఇప్పుడు సత్యంగా కాదు.. ప్రభావతి భర్తగా వెళ్తున్నాను" అంటూ భావోద్వేగంగా చెప్పాడు. ఈ మాటలు విన్న ప్రభావతి మౌనంగా నిలిచిపోయింది. ఇంతలో మీనా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో సత్యం ఎమోషనల్ అయ్యాడు. "నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది" అన్నాడు. అదే సమయంలో రోహిణి తన కొడుకు చింటూను స్కూల్లో జాయిన్ చేయించేందుకు బయలుదేరింది.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. బాలు తన తండ్రి సత్యంను కొత్తగా జాయిన్ అవుతున్న స్కూల్ దగ్గరకు తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు. స్కూల్ భవనాన్ని చూపిస్తూ సత్యం, "నేను పని చేయబోయేది ఇదే స్కూల్ రా" అని చెప్పడంతో బాలు కాస్త భావోద్వేగానికి లోనవుతాడు. "ఏ మాత్రం కష్టంగా అనిపించినా వెంటనే పని మానేయండి నాన్నా" అంటూ ఆప్యాయంగా చెబుతాడు. అయితే సత్యం మాత్రం "ఇది అంత కష్టమైన పని కాదు.. నాకు టైమ్‌పాస్ కూడా అవుతుంది" అంటూ కుమారుడిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.
మరోవైపు రోహిణి తన కొడుకు చింటూను తీసుకుని అదే స్కూల్‌లో అడ్మిషన్ చేయించడానికి వస్తుంది. ఇదే సమయంలో చింటూ దూరం నుంచి బాలును చూసి ఆనందంతో "బాలు అంకుల్!" అంటూ అరవబోతాడు. వెంటనే షాక్ అయిన రోహిణి అతని నోరు మూసేస్తూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆమె టెన్షన్ మరింత పెరుగుతుంది.
ఇక ఒకే చోట బాలు, సత్యం, రోహిణి, చింటూ ఉండటంతో కథ ఆసక్తికర మలుపు తిరిగింది. సత్యం లేదా బాలు రోహిణిని గుర్తిస్తారా? చింటూ తన తల్లిని వదిలించుకుని బాలు దగ్గరకు పరుగెత్తుతాడా? లేక రోహిణి ఏదైనా అబద్ధం చెప్పి పరిస్థితిని కవర్ చేస్తుందా? అంతేకాదు, సత్యం ఉద్యోగాన్ని కూడా అడ్డుకునేలా ఏదైనా ప్లాన్ వేస్తుందా? లేక ఇన్నాళ్లుగా దాచిన రోహిణి బాగోతం ఒక్కసారిగా బయటపడుతుందా? అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications