Gundeninda Gudigantalu May 30th Episode: మలేషియా ట్రిప్‌కి ప్రభావతి గ్రీన్ సిగ్నల్, రోహిణికి బాలు చావు దెబ్బ,
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా రోహిణి దాచిపెడుతున్న రహస్యం చుట్టూ తిరిగిన కథనం మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఆమె అబద్ధాల వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకునేందుకు బాలు, మీనా చేసిన ప్రయత్నాలు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా చెల్లి సుమతి ఫోన్ చేసి కీలక సమాచారం అందిస్తుంది. గుడికి వచ్చిన రోహిణి, మనోజ్ అక్కడి సీసీటీవీ ఫుటేజ్ గురించి విచారణ చేస్తున్నారని చెబుతుంది. ఈ విషయం విన్న మీనాకు ఇప్పటికే ఉన్న అనుమానాలు మరింత బలపడతాయి. "ఏదో పెద్ద విషయం దాచిపెడుతోంది.. లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ కోసం ఎందుకు తిరుగుతుంది?" అని ఆలోచిస్తుంది. వెంటనే సుమతికి కూడా ఆలయ అధికారులను సంప్రదించి ఫుటేజ్ గురించి తెలుసుకోవాలని సూచిస్తుంది.
ఇక మరోవైపు బాలు, మీనా మధ్య జరిగిన సంభాషణ కథలో కొత్త ఆసక్తిని తీసుకొచ్చింది. గుడి దగ్గర జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న బాలు కూడా రోహిణి వ్యవహారంపై అనుమానపడతాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మనోజ్‌ను పరీక్షించేందుకు బాలు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మలేషియా నుంచి వచ్చిన రవీంద్ర సహాయం చేస్తాడని, జైలు అధికారుల ద్వారా రోహిణి తండ్రి కేసు వివరాలు తెలుసుకుంటామని చెప్పడంతో మనోజ్ ఆనందపడతాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన రోహిణి తీవ్ర ఆందోళనకు గురవుతుంది.

Photo courtesy jiohotstar
"మా వ్యక్తిగత విషయాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?" అంటూ బాలు, మీనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రోహిణి అసహజ ప్రవర్తన చూసిన బాలు వరుస ప్రశ్నలు సంధిస్తాడు. ఆమె మామయ్య ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. దీంతో రోహిణి మరింత ఇబ్బందికర పరిస్థితిలో పడుతుంది. మీనా కూడా తనదైన శైలిలో స్పందిస్తూ రోహిణి కథలో ఎన్నో సందేహాలు ఉన్నాయని పరోక్షంగా చెప్పేస్తుంది.
ఈ ఘటన తర్వాత బాలు, మీనా తమ అనుమానాలను నిజం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. రోహిణి గతాన్ని తవ్వి నిజం బయటపెట్టేందుకు డిటెక్టివ్‌లా వ్యవహరించాలని భావిస్తారు. దర్యాప్తులో భాగంగా బాలు ముందుగా మీనాక్షిని కలుస్తాడు. ఆమెకు హల్వా తీసుకెళ్లి పొగడ్తలతో మెప్పించే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు ఉద్దేశాన్ని వెంటనే గ్రహించిన మీనాక్షి అసలు విషయం అడుగుతుంది. రోహిణి గురించి ప్రశ్నించగా, "ఆమె ఒకసారి పార్లర్‌లో పరిచయమైంది. ఆ తర్వాతే పెళ్లి సంబంధం వరకు వెళ్లింది. ఆమె కుటుంబం గురించి నాకు కూడా పెద్దగా తెలియదు" అని చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. రోహిణి గురించి అందరికీ తెలిసినట్టు కనిపించిన మీనాక్షికే అసలు నిజాలు తెలియకపోవడం అతనిలో కొత్త అనుమానాలకు కారణమవుతుంది.
ఇక మీనా కూడా తన దర్యాప్తును కొనసాగిస్తుంది. రోహిణి స్నేహితురాలు విద్యను కలిసి వివరాలు తెలుసుకోవడానికి వెళ్తుంది. మొదట సాధారణ విషయాలే మాట్లాడిన విద్య, తర్వాత మనోజ్-రోహిణి దాంపత్య జీవితం గురించి మాట్లాడుతుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కథలో కీలక మలుపు తీసుకొస్తాయి. "వాళ్లిద్దరి మధ్య ప్రేమ కంటే ఒకరి మోసాన్ని మరొకరు మోస్తున్నట్టే కనిపిస్తుంది" అని చెప్పడంతో మీనా మరింత అప్రమత్తమవుతుంది. రోహిణి గురించి మరిన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ విద్య స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె ప్రవర్తన చూసి మీనాకు మరో క్లూ దొరికినట్టవుతుంది. రోహిణి మాత్రమే కాదు, విద్య కూడా ఏదో దాచిపెడుతోందని భావిస్తుంది. ఈ విషయం బాలుకి చెప్పగా అతనికి కూడా అదే అనుమానం వస్తుంది.
మరోవైపు మీనా వెళ్లిన వెంటనే విద్య రోహిణికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెబుతుంది. మీనా తన కుటుంబం గురించి ఆరా తీస్తోందని చెప్పడంతో రోహిణి తీవ్ర భయానికి గురవుతుంది. విద్య కూడా "అబద్ధాలు ఎక్కువ కాలం దాచిపెట్టలేం" అంటూ ఆమెను హెచ్చరిస్తుంది. ఈ మాటలు రోహిణిని మరింత ఆందోళనకు గురిచేస్తాయి. ఇదే సమయంలో మనోజ్ మరో సమస్యను తీసుకొస్తాడు. 40 లక్షల వ్యవహారం క్లియర్ కావాలంటే మలేషియాలో ఉన్న మామయ్య సహాయం అవసరమని, వెంటనే ఫోన్ చేయాలని రోహిణిని ఒత్తిడి చేస్తాడు. అసలు లేని మామయ్యను ఇప్పుడు ఎలా చూపించాలా అనే ఆలోచనతో రోహిణి తీవ్ర టెన్షన్‌లో పడుతుంది.
ఇక మరోవైపు చింతామణి కొత్త కుట్రకు తెరలేపుతుంది. మీనా వ్యాపారంలో ఎదుగుతుండటాన్ని తట్టుకోలేక ఆమె పూల డబ్బాను దొంగిలించి తన ఇంటికి రప్పిస్తుంది. అక్కడికి వెళ్లిన మీనాకు చింతామణి ఆశ్చర్యకరమైన ఆఫర్ ఇస్తుంది. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని ప్రతిపాదిస్తుంది. అయితే మీనా ఆ ఆఫర్‌ను సూటిగా తిరస్కరిస్తుంది. "పులికి తోకగా ఉండడం కంటే పిల్లికి తలగా ఉండడం నాకు ఇష్టం" అంటూ గట్టి సమాధానం ఇస్తుంది. ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఎపిసోడ్ చివర్లో బాలు మరో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాడు. ఇంటికి పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తాడు. ఈ సందర్భంగా శృతి, రోహిణికి ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉంటుందని చెబుతుంది. వెంటనే రోహిణి కూడా తాను మలేషియా నుంచి వచ్చానని చెప్పేస్తుంది. ఇదే సమయంలో బాలు అసలు బాంబ్ పేలుస్తాడు. తాను, మీనా ఇప్పటివరకు హనీమూన్‌కు వెళ్లలేదని, ఇప్పుడు మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నామని ప్రకటిస్తాడు. అంతేకాదు మొత్తం కుటుంబం కూడా తమతో రావాలని చెబుతాడు. ఈ మాటలు విన్న వెంటనే అందరూ సంతోషపడినా, రోహిణి మాత్రం లోలోపల కంగారుపడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిన మలేషియా కథలన్నీ అబద్ధాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే మలేషియా వెళ్లాల్సి వస్తే తన రహస్యాలు బయటపడే ప్రమాదం ఉందని గ్రహిస్తుంది.
ఇక అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో .. ఇప్పటికే రోహిణి అబద్ధాలపై అనుమానాలు పెంచుకున్న బాలు.. ఈసారి ఆమె బండారం బయటపెట్టేందుకు మరింత పెద్ద ప్లాన్ వేయబోతున్నాడు. మలేషియా ట్రిప్ పేరుతో రోహిణిని పూర్తిగా ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతాడు. అయితే బాలు వేసిన ఈ ఎత్తుగడతో రోహిణి పరిస్థితి మరింత క్లిష్టంగా మారనుంది. మలేషియా ట్రిప్ గురించి బాలు చెప్పగానే ఇంట్లో అందరూ ఉత్సాహంగా స్పందిస్తారు. ముఖ్యంగా ప్రభావతి మాత్రం తెగ సంతోషపడిపోతుంది. ఇప్పటివరకు రోహిణి చెప్పిన కోట్ల ఆస్తులు, ప్యాలెస్‌లు, కార్లు, వ్యాపారాలు అన్నీ నిజమేనని నమ్ముతున్న ప్రభావతి.. ఈ ట్రిప్ ద్వారా వాటన్నింటినీ ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చిందని ఆనందపడుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఆ ఆస్తులు తమ కుటుంబానికి కూడా ఉపయోగపడతాయనే ఆశతో వెంటనే మలేషియా ట్రిప్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
మొదట శృతి, రవి మాత్రం తమకు పనులు ఉన్నాయని, తాము రాలేమని చెబుతారు. కానీ బాలు అసలు ఉద్దేశం అర్థం చేసుకున్న వాళ్లు వెంటనే ప్లేట్ ఫిరాయిస్తారు. "మేమూ వస్తాం.. మేమూ పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తాం" అంటూ ప్రకటిస్తారు. దీంతో రోహిణి ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. ఇప్పటివరకు తన అబద్ధాలను మాటలతో కప్పిపుచ్చినా.. ఇప్పుడు నిజంగానే మలేషియా వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటనే భయం ఆమెను వెంటాడుతుంది. దీంతో వెంటనే కొత్త డ్రామాకు తెరలేపుతుంది రోహిణి. తన తండ్రిని జైలులో చూడడం తనకు ఇష్టం లేదని, ఆయన పరువు తీయాలని తాను అనుకోవడం లేదని చెబుతుంది. "మనం ఎంజాయ్ చేయడానికి ట్రిప్‌కు వస్తే.. నేను జైలులో ఉన్న నాన్నను ఎలా చూస్తాను? ఆయనకు ఇంకా బాధ కలుగుతుంది" అంటూ అందరినీ ఎమోషనల్‌గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది.
అయితే బాలు మాత్రం ఆమె మాటలకు ఏమాత్రం లొంగడు. "ఇలాంటి సమయంలోనే కుటుంబం అండగా ఉండాలి. నీ నాన్న జైలులో ఉంటే కనీసం నువ్వు వెళ్లి పరామర్శించకపోవడం ఏంటి?" అంటూ ఎదురుదాడి చేస్తాడు. అంతేకాదు, "అక్కడ మీ ప్యాలెస్ ఉంది కదా.. కార్లు ఉన్నాయి కదా.. కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా.. మనం వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండదు" అంటూ కావాలనే సెటైర్లు వేస్తాడు. బాలు మాటలకు ప్రభావతి కూడా వంత పాడుతుంది. "అవునమ్మా.. మీ వాళ్లు పెద్ద కోటీశ్వరులు కదా. మనం వెళ్లి చూస్తే తప్పేంటి?" అంటూ రోహిణిని ప్రశ్నిస్తుంది. వరుస ప్రశ్నలతో రోహిణి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె ప్రవర్తన చూసిన బాలు అనుమానాలు మరింత బలపడతాయి.
ఇక గదిలోకి వెళ్లిన రోహిణి వద్దకు మనోజ్ వస్తాడు. వెంటనే కన్నీళ్లు పెట్టుకున్న రోహిణి తన బాధను నటిస్తూ చెబుతుంది. "మా నాన్నను జైలులో చూడలేను. ఆయన పరిస్థితి నాకు చాలా బాధ కలిగిస్తోంది. త్వరలోనే బయటకు వస్తారు. అప్పుడు అందరం కలిసి వెళ్దాం" అంటూ మనోజ్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో బాలు తనను టార్గెట్ చేస్తున్నాడని, కావాలనే తన పరువు తీయాలని చూస్తున్నాడని మనోజ్ మనసులో విషం నింపుతుంది. రోహిణి మాటలు నమ్మిన మనోజ్.. మలేషియా ట్రిప్‌ను క్యాన్సిల్ చేయించాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే ప్రభావతి దగ్గరకు వెళ్లి రోహిణి పరిస్థితిని వివరిస్తాడు. కానీ ఈసారి ప్రభావతి మాత్రం వెనక్కి తగ్గదు. "ఇలాంటి సమయంలోనే మనం వాళ్లకు అండగా ఉండాలి. రేపు మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్లు కూడా మనకు తోడుగా ఉంటారు" అంటూ ట్రిప్ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోనని చెబుతుంది.
సత్యం కూడా ప్రభావతికి మద్దతు ఇస్తాడు. "ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్లి అతడిని చూడలేదు. కనీసం ఇప్పుడు వెళ్లి ధైర్యం చెప్పాలి" అంటూ మనోజ్‌కు సలహా ఇస్తాడు. దీంతో మనోజ్ పూర్తిగా ఇరుక్కుపోతాడు. రోహిణి ప్లాన్ మరోసారి ఫెయిల్ అవుతుంది. మరుసటి రోజు రోహిణి తన స్నేహితురాలు విద్యను కలిసి జరిగిన విషయాలన్నీ చెబుతుంది. దీంతో విద్య మరోసారి హెచ్చరిస్తుంది. "ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తోంది. ఇకనైనా నిజం చెప్పేయ్" అంటూ సలహా ఇస్తుంది. కానీ రోహిణి మాత్రం భయపడిపోతుంది. "40 లక్షల విషయం బయటపడినప్పుడు నన్ను అందరి ముందు అవమానించారు. ఇప్పుడు నేను కోటీశ్వరురాలిని కాదని తెలిస్తే ఇంట్లో ఉండనివ్వరు" అంటూ తన ఆందోళన వ్యక్తం చేస్తుంది.
చివరకు ఈ సమస్య నుంచి బయటపడటానికి మరోసారి మటన్ కొట్టు మాణిక్యాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంటుంది. విద్య సహాయంతో మాణిక్యానికి ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తుంది. మొదట మాణిక్యం మాత్రం "ఇక నేను అబద్ధాలు చెప్పలేను" అంటూ చేతులెత్తేస్తాడు. కానీ రోహిణి కన్నీళ్లు పెట్టుకుని తన జీవితమే నాశనం అవుతుందని వేడుకుంటుంది. "ఇది చివరిసారి.. నువ్వు తప్ప నాకు సహాయం చేసే వాళ్లు ఎవరూ లేరు" అంటూ బతిమాలడంతో మాణిక్యం కరుగుతాడు. చివరకు మరోసారి మలేషియా మామయ్యగా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అయితే ఈసారి కూడా రోహిణి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మాణిక్యం ఎంట్రీతో అందరూ నమ్మేస్తారా? లేక బాలు ముందుగానే మరో ఎత్తుగడ వేసి రోహిణి అబద్ధాలను బట్టబయలు చేస్తాడా? మలేషియా ట్రిప్ పేరుతో మొదలైన ఈ డ్రామా రోహిణి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోందో చూడాలి.


Click it and Unblock the Notifications