Gunde Ninda Gudi Gantalu June 13th Episode: ప్రభావతి ఇంటికి చింతామణి, మీనాకు అవమానం, చెంప పగలకొట్టిన సత్యం
Courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu:'గుండె నిండా గుడిగంటలు' శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలు, ఉత్కంఠ, కుటుంబ అనుబంధాలతో ఆకట్టుకుంది. రవి-శృతి వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో కథ సాగింది. ఫంక్షన్ హాల్‌కు అతిథులు చేరుకుంటుండగా శృతి మాత్రం కనిపించకపోవడంతో అందరూ "శృతి ఎక్కడ?" అని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. దీంతో రవి తీవ్ర ఆందోళనకు గురైనా, అసలు విషయం బయటపడకుండా పరిస్థితిని చాకచక్యంగా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతిథుల దృష్టిని మరల్చేందుకు తన తల్లి ప్రభావతి, మీనాక్షి, శోభలను స్టేజ్‌పైకి పంపి డ్యాన్సులు చేయిస్తాడు. వారి సందడితో కొంతసేపు వాతావరణం ఉత్సాహంగా మారుతుంది.
ఇక శృతి కనిపించకపోవడంతో బాలు, మీనా ఆమె కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఒక డబ్బింగ్ స్టూడియోలో విచారించగా, శృతి అక్కడికి వచ్చి లాయర్‌ను కలవడానికి వెళ్లిందని తెలుసుకుంటారు. ఈ విషయం విని ఇద్దరూ ఆశ్చర్యానికి గురవుతారు. మరోవైపు ఫంక్షన్ హాల్‌లో రవి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అతిథుల ప్రశ్నలు, కుటుంబ సభ్యుల అనుమానాలు పెరుగుతుండగా, రవి మాత్రం "శృతి వస్తుంది" అంటూ అందరినీ సముదాయించే ప్రయత్నం చేస్తాడు.

Courtesy: jiohotstar
లాయర్‌ను కలవడానికి వెళ్లిన శృతి, రవి తనను మోసం చేస్తున్నాడని అపార్థంతో కోపంగా ఉంటుంది. అయితే అక్కడికి చేరుకున్న బాలు, మీనా అసలు విషయం వివరిస్తారు. నీతూతో రవి సన్నిహితంగా లేడని, కేవలం సహాయం మాత్రమే చేశాడని చెప్పడంతో శృతి తన తప్పు తెలుసుకుంటుంది. రవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తానే కోపంతో స్పందించలేదని గుర్తించి బాధపడుతుంది. అయితే ఇంకా కొద్దిసేపు ఆలస్యం చేయాలని అనుకుంటే, బాలు సరదాగా సెటైర్లు వేస్తూ వెంటనే ఫంక్షన్‌కు రావాలని ఒప్పిస్తాడు.
ఇదే సమయంలో ఫంక్షన్ హాల్‌లో సురేంద్ర, శోభల అనుమానాలు మరింత పెరుగుతాయి. రవిని నిలదీస్తూ శృతి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తారు. సురేంద్ర కోపంతో మాట్లాడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. సత్యం కూడా స్పందించబోతుండగా, సరైన సమయంలో బాలు, మీనా శృతితో కలిసి హాల్‌లోకి రావడం అందరికీ ఊరటనిస్తుంది. శృతిని చూసిన రవి ముఖంలో కనిపించిన ఆనందం ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేస్తుంది. ఆ తర్వాత సత్యం, సురేంద్రకు గట్టిగా కౌంటర్ ఇస్తాడు. నిజం తెలుసుకోకుండా తన కొడుకుపై ఆరోపణలు చేయడం సరైంది కాదని హెచ్చరిస్తాడు. దీంతో సురేంద్ర మౌనంగా మారిపోతాడు. అనంతరం రవి, శృతి తమ యానివర్సరీ వేడుకలను ప్రారంభించి కేక్ కట్ చేస్తారు. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలు నవ్వులు పూయిస్తాయి.
కేక్ కట్ చేసిన తర్వాత శృతి భావోద్వేగంగా మాట్లాడుతుంది. తమ జీవితంలో బాలు, మీనాల పాత్ర ఎంతో గొప్పదని చెబుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఎలా కలిసిమెలిసి ఉండాలో మీనా నేర్పించిందని, ఆమె తనకు వదిన మాత్రమే కాకుండా అక్కలా ఉంటుందని ప్రశంసిస్తుంది. అలాగే బాలు గురించి మాట్లాడుతూ, మొదట్లో అతడిని రౌడీ అనుకున్నానని, కానీ మీనా పట్ల అతడు చూపించే ప్రేమ, గౌరవం చూసిన తర్వాత తన అభిప్రాయం మారిపోయిందని చెబుతుంది. తన దృష్టిలో బెస్ట్ కపుల్ అంటే బాలు-మీనా అని చెప్పడంతో అందరూ చప్పట్లతో అభినందిస్తారు.
రవి కూడా మైక్ తీసుకుని మాట్లాడుతాడు. తమ పెళ్లి జరగడానికి, ఈరోజు సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణం మీనానే అని చెబుతాడు. బాలు-మీనా దాంపత్యం తమకు ఆదర్శమని పేర్కొంటాడు. దీంతో బాలు, మీనా ఇద్దరూ భావోద్వేగానికి గురవుతారు. చివరగా కుటుంబ సభ్యులంతా కలిసి డ్యాన్స్‌లు చేస్తూ వేడుకను ఆనందంగా ముగిస్తారు.
రాబోయే ఎపిసోడ్ ప్రేక్షకులకు మరోసారి భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, కొత్త కుట్రలతో నిండిన ఆసక్తికరమైన మలుపులను చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది . యానివర్సరీ వేడుకలు విజయవంతంగా ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకుంటారు. ఈ సందర్భంగా శృతి, రవి కలిసి మీనాకు ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఆమె కష్టాన్ని గుర్తిస్తూ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్‌గా అందిస్తారు. అయితే మీనా మాత్రం మొదట దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తుంది. "నాకు ఇప్పటికే ఉన్న ఫోన్ సరిపోతుంది" అంటూ సున్నితంగా తిరస్కరిస్తుంది.
అయితే బాలు, శృతి ఇద్దరూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా శృతి, "ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు. నీ బిజినెస్‌కు కూడా చాలా ఉపయోగపడుతుంది. డిజైన్లు, కస్టమర్లకు నమూనాలు చూపించాలంటే మంచి ఫోన్ అవసరం. నా మీద ప్రేమ ఉంటే తీసుకో" అని చెబుతుంది. చివరకు వారి ప్రేమాభిమానాలకు కాదనలేక మీనా ఆ గిఫ్ట్‌ను స్వీకరిస్తుంది. ఈ సన్నివేశం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి హైలైట్ చేయనుంది.
ఇదిలా ఉండగా, మరోవైపు మీనా తన ప్రత్యర్థి చింతామణి అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటుంది. వ్యాపారంలో తనను నేరుగా ఎదుర్కోలేక, ఇప్పుడు ప్రభావతిని అడ్డం పెట్టుకుని తనపై ప్రతీకారం తీర్చుకోవాలని చింతామణి ప్రయత్నిస్తోందని గ్రహిస్తుంది. ప్రభావతి డాన్స్ స్కూల్‌లో స్టూడెంట్‌గా చేరడం వెనుక కూడా అదే వ్యూహం ఉందని మీనా అనుమానిస్తుంది.
ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా తన మామయ్య సత్యంతో పరోక్షంగా పంచుకుంటుంది. మీనా ఆందోళనను గమనించిన సత్యం ఆమెకు ధైర్యం చెబుతాడు. "అనవసరంగా టెన్షన్ పడకు. మనం నిజాయితీగా ఉంటే దేవుడే మనకు దారి చూపిస్తాడు. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి" అంటూ ఆమెకు మానసిక బలం ఇస్తాడు. సత్యం మాటలు మీనాలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.
అయితే మరుసటి రోజు పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. కావాలనే చింతామణి ప్రభావతి ఇంటికి వస్తుంది. ధనవంతులు అంటే ప్రత్యేక అభిమానమున్న ప్రభావతి ఆమెకు ఘన స్వాగతం పలుకుతుంది. ఇంట్లోకి ఆహ్వానించి ప్రత్యేక మర్యాదలు చేస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మీనా చింతామణిని చూసి షాక్‌కు గురవుతుంది. "ఈవిడ ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని ఆశ్చర్యపోతుంది. కానీ ప్రభావతి మాత్రం ఆమెను గొప్ప వ్యక్తిగా పరిచయం చేస్తూ మీనాను మరింత ఇబ్బందికర పరిస్థితిలో పడేస్తుంది.
ఇక అసలు డ్రామా అక్కడి నుంచే మొదలవుతుంది. ప్రభావతి ఆదేశంతో మీనా కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. కాఫీ తీసుకుని వస్తుండగా చింతామణి కావాలనే తన కాలును అడ్డం పెడుతుంది. దీంతో మీనా తడబడిపోతుంది. కాఫీ కప్పులోని పానీయం కొంత చింతామణిపై పడుతుంది. ఇదే అవకాశంగా తీసుకున్న చింతామణి పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది. ప్రభావతి కూడా కోపంతో మీనాపై మండిపడుతుంది. ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగే ప్రవర్తిస్తావా అంటూ ఆమెను అందరి ముందు అవమానించేందుకు ప్రయత్నిస్తుంది.
చింతామణి కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీనాను మరింతగా కించపరిచేలా మాట్లాడుతుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ప్రభావతి కోపంతో మీనాపై చేయి చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. అయితే అదే సమయంలో సత్యం ఎంట్రీ ఇవ్వడంతో సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. "ప్రభావతి!" అంటూ గట్టిగా అరవడంతో అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోతారు. ప్రభావతి తన వాదనను వినిపించేందుకు ప్రయత్నించినా, సత్యం మాత్రం జరిగిన విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మీనాను ప్రశ్నించగా, ఆమె ప్రశాంతంగా నిజం చెబుతుంది. దీంతో అసలు కుట్ర వెనుక ఉన్నది చింతామణేనని సత్యం గ్రహిస్తాడు. అప్పటికీ ప్రభావతి మాత్రం మీనా చింతామణికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. దీంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ప్రభావతికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ, ఇకపై మీనాపై అన్యాయం జరిగితే సహించనని స్పష్టం చేస్తాడు.
అదే సమయంలో బాలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారబోతోంది. మీనాను అవమానించిన చింతామణికి బాలు ఎలా బుద్ధి చెబుతాడు? ప్రభావతి తన తప్పు తెలుసుకుంటుందా? చింతామణి కొత్త కుట్రలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబోయే ఎపిసోడ్‌లలో తెలియనున్నాయి. రాబోయే ఎపిసోడ్‌లో మీనా-చింతామణి మధ్య పోరు కొత్త స్థాయికి చేరుకోగా, సత్యం ఎంట్రీ కథలో కీలక మలుపు తీసుకురానున్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications