Gundeninda Gudigantalu June 20th Episode: ప్రభావతికి సత్యం వార్నింగ్, కష్టాల్లో మనోజ్, రోహిణిపై బాలుకు అనుమానం
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. మీనా జీవితంలో మార్పు తీసుకురావాలని భావించిన బాలు, ఆమెను ఇంటి దాబాపైకి తీసుకెళ్లి మనసులోని మాటలను చెప్పాడు. కుటుంబ సభ్యులందరూ ఆమె మంచితనాన్ని అవకాశంగా తీసుకుని, ఇంటి పనులన్నీ ఆమెపైనే మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా తన విలువను అందరికీ తెలియజేయాలని సూచించాడు. మొదట నిరాకరించిన మీనా, చివరకు బాలు మాటకు ఒప్పుకుని వంటింటిపై సమ్మె ప్రకటించేందుకు సిద్ధమైంది.
డెకరేషన్ ఆర్డర్ విజయవంతంగా పూర్తి చేసినందుకు వచ్చిన డబ్బును కూడా బాలు మీనాకు అందజేస్తూ, ఆ విజయానికి అసలు కారణం ఆమెనే అని ప్రశంసించాడు. అనంతరం ఇంట్లో అసలు నాటకం మొదలైంది. వంట గురించి అడిగిన కుటుంబ సభ్యులకు మీనా ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఉండగా, బాలు "వంటగది మూసివేయబడింది" అనే బోర్డు చూపించాడు. దీంతో ప్రభావతి షాక్‌కు గురైంది. "నా ఇంట్లో వంటగది మూసేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు బాలు "నా భార్య వంటింటికి రాజీనామా ఇచ్చింది" అని ప్రకటించగా, మీనా కూడా ఇక రెండేళ్లు, మూడేళ్లు వంటగదిలో అడుగుపెట్టనని స్పష్టం చేసింది.

Courtesy: jiohotstar
సమ్మెకు కారణం ప్రభావతేనని బాలు కుటుంబ సభ్యుల ముందు వెల్లడించాడు. మీనా ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించాడు. ఇకపై మీనా తన డెకరేషన్ వ్యాపారంపైనే దృష్టి పెడుతుందని ప్రకటించాడు. మీనా కూడా ఈ ఇంట్లో ముగ్గురు కోడళ్లు ఉన్నప్పుడు తనకే ఎందుకు అన్ని పనులు అప్పగిస్తున్నారని ప్రశ్నించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి పనులన్నీ తానే చేస్తున్నానని, అయినా తనకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభావతి మాత్రం తన వైఖరిని మార్చుకోకుండా, సేవలు చేయకపోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే సత్యం జోక్యం చేసుకుని మీనాకు మద్దతుగా నిలిచాడు. ఈ ఇంట్లో ఉండే హక్కు మీనాకు ఉందని, ఇకపై ఆమె ఎవరికి వంట చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
వంట చేయాలని సవాల్ విసిరిన ప్రభావతికి మరో షాక్ ఎదురైంది. గ్యాస్ సిలిండర్‌ను బాలు తొలగించడంతో ఆమె వంట చేయలేకపోయింది. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మనోజ్ ప్రయత్నాలను కూడా బాలు విఫలం చేశాడు. వచ్చిన ఆహారాన్ని డెలివరీ బాయ్‌కే తిరిగి ఇచ్చి అన్నదానం చేశాడు. దీంతో ఇంట్లో అందరూ ఆకలితో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మరోవైపు రవి తన తెలివితో ఎలక్ట్రిక్ కుక్కర్ సహాయంతో నూడుల్స్ శాండ్‌విచ్ తయారు చేసి శృతిని ఆకట్టుకున్నాడు. చివర్లో బాలు తన తల్లిని భావోద్వేగంగా ప్రశ్నించాడు. "నేనూ నీ కొడుకే కదా... ఎప్పుడైనా ప్రేమగా గోరుముద్దలు తినిపించావా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బాలు మాటలకు ప్రభావతి సమాధానం చెప్పలేక మౌనంగా నిలిచిపోయింది. మీనా కోసం బాలు చేస్తున్న పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అన్న ఉత్కంఠ మధ్య ఎపిసోడ్ ముగిసింది.
రాబోయే ఎపిసోడ్స్‌లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభావతి-సత్యం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోగా, మనోజ్ వ్యాపార జీవితంలో కొత్త సమస్యలు తెరపైకి రానున్నాయి. మీనాపై ప్రభావతి ప్రదర్శిస్తున్న వివక్షతను చూసి సత్యం తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. ముగ్గురు కోడళ్లను సమానంగా చూడాలని, కుటుంబంలో భేదాభిప్రాయాలకు తావివ్వవద్దని ప్రభావతికి సూచిస్తాడు.
అయితే ఆమె మాత్రం తన మొండి వైఖరిని కొనసాగిస్తూ, "మీనాను నా కోడలిగా అంగీకరించడం ఈ జన్మలో జరగదు" అని తేల్చి చెబుతుంది. దీంతో సత్యం సహనం కోల్పోయి, "కొడుకు, కోడలు ఎదుగుతుంటే వారిని అణగదొక్కాలని చూసే తల్లిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి బాలు, మీనాలను దూరం చేసుకోకు. రేపు నువ్వు ఇబ్బందుల్లో పడితే నీకు తోడుగా నిలబడేది వాళ్లే" అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు.
అంతేకాకుండా, బాలు-మీనాలకు క్షమాపణ చెప్పే వరకు తనతో మాట్లాడవద్దని ప్రభావతికి స్పష్టం చేస్తాడు. సత్యం మాటలు విన్న ప్రభావతి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఒకవేళ మీనాను అంగీకరిస్తే తన పెద్దరికం తగ్గిపోతుందేమో, ఇంట్లో తన ఆధిపత్యానికి భంగం కలుగుతుందేమో అనే సందేహాలు ఆమెను వెంటాడతాయి. అయినప్పటికీ తన మనసు మార్చుకునే సూచనలు మాత్రం కనిపించవు. మరోవైపు మనోజ్ జీవితంలో కొత్త సమస్యలు తెరపైకి వస్తాయి.
వ్యాపారానికి సంబంధించిన జీఎస్టీ బిల్లులు, పన్ను చెల్లింపులను నిర్లక్ష్యం చేయడంతో అతడు ఇబ్బందుల్లో పడతాడు. వారం రోజులుగా వస్తున్న నోటీసులను పట్టించుకోకుండా వదిలేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఆ నోటీసులను చూసిన రోహిణి షాక్‌కు గురై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించవద్దని మనోజ్‌కు క్లాస్ తీసుకుంటుంది. కానీ మనోజ్ మాత్రం "బిజినెస్ టెన్షన్‌లో చూసుకోలేకపోయాను. రేపు చెల్లిస్తాను" అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తాడు.
అయితే పరిస్థితి అంత సులభంగా ఉండదు. అకస్మాత్తుగా జీఎస్టీ అధికారులు షాపుకు చేరుకుని, బకాయిలు వెంటనే చెల్లించకపోతే వ్యాపారాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తారు. దీంతో రోహిణి అధికారులను వేడుకుని సాయంత్రం వరకు గడువు ఇవ్వాలని కోరుతుంది. కానీ అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూరుస్తారు? మనోజ్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడు? అనేది ఉత్కంఠగా మారింది.
ఇక మరో కీలకమైన ట్విస్ట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. సత్యం పనిచేస్తున్న స్కూల్‌కు వెళ్లిన బాలు అక్కడ అనుకోకుండా రోహిణి తల్లి సుగుణమ్మ, చింటూను గమనిస్తాడు. బాలు కనిపించగానే సుగుణమ్మ అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం అతనికి అనుమానం కలిగిస్తుంది. దగ్గరకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించిన బాలు, "ఈ ఊరిలోనే ఉంటూ ఒక్కసారి కూడా చెప్పలేదేంటి?" అని ప్రశ్నిస్తాడు.
అయితే సుగుణమ్మ మాత్రం తమ గురించి చెప్పేందుకు ఆసక్తి చూపకుండా, అర్జెంట్ పని ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. సుగుణమ్మ ప్రవర్తనలోని ఆందోళనను గమనించిన బాలు, ఏదో పెద్ద రహస్యం దాగి ఉందనే అనుమానానికి వస్తాడు. రోహిణి కుటుంబానికి సంబంధించిన అసలు నిజాలు బయటపడే సమయం దగ్గరపడిందా? సుగుణమ్మ ఎందుకు దాక్కుంటోంది? బాలు ఆ నిజాన్ని కనిపెడతాడా? అనే ఆసక్తికరంగా మారింది.
మరో వైపు. రంగా తమ్ముడి కూతురు సుందరి జీవితంలో చోటుచేసుకోబోయే పరిణామాలు కథను మరింత రసవత్తరంగా మార్చనున్నట్లు తెలుస్తోంది. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రంగా, సుందరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇప్పటికే పెళ్లి కొడుకుల కోసం వెతుకుతున్న అతడు, ఒక సంబంధాన్ని ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, సుందరి కోసం పెళ్లి చూపులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులంతా ఈ సంబంధం పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, సుందరి మనసులో మాత్రం మరో కథ నడుస్తోంది.
అసలు విషయం ఏమిటంటే, సుందరి ఇప్పటికే ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు చెప్పలేదు. తన ప్రేమ విషయాన్ని బయటపెడితే ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందనే భయంతో ఆమె మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పెళ్లి చూపులు జరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తన ప్రేమను కుటుంబ సభ్యుల ముందు వెల్లడించాలా? లేక ఇంట్లో వాళ్లు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకోవాలా? అనే సందిగ్ధంలో సుందరి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సుందరి తన ప్రేమ విషయం గురించి ముందుగా బాలు వద్దకు వెళ్లి సహాయం కోరే అవకాశం ఉందని సమాచారం. కుటుంబంలో అందరి మనసును అర్థం చేసుకునే వ్యక్తిగా బాలు ఉండటంతో, తన సమస్యకు అతడే పరిష్కారం చూపగలడని ఆమె భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, కుటుంబ సభ్యులు తన మాట వినరని భావిస్తే, సుందరి మరింత సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
ఇక సుందరి ప్రేమిస్తున్న యువకుడు ఎవరు? అతని కుటుంబ నేపథ్యం ఏమిటి? అతడు నిజంగా సుందరిని ప్రేమిస్తున్నాడా? లేక ఆమెను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దగ్గరయ్యాడా? అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆ యువకుడి బ్యాక్‌గ్రౌండ్ కథలో కీలక మలుపుకు కారణం అవుతుందని తెలుస్తోంది.
ఒకవేళ సుందరి ప్రేమ విషయం బయటపడితే రంగా ఎలా స్పందిస్తాడు? ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తాడా? లేక కుటుంబ గౌరవం పేరుతో ఆమె ప్రేమకు అడ్డుగా నిలుస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. సుందరి ప్రేమకథ కుటుంబంలో కొత్త వివాదాలకు దారి తీస్తుందా? లేక బాలు మధ్యవర్తిత్వంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రశ్నలతో రాబోయే ఎపిసోడ్స్ మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి.


Click it and Unblock the Notifications