Gunde Ninda Gudi Gantalu September 24th: రవికి బాలు సంబంధం.. నిజాలన్నీ చెప్పిన మీనా.. కథలో బిగ్ ట్విస్ట్
తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూనే ఉంది. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండెనిండా గుడిగంటలు' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంత కాలంగా అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'గుండెనిండా గుడిగంటలు' మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే
పెళ్లిచూపులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన శృతి తల్లిదండ్రులపై ఫైర్ అవుతుంది. తనకు ఇష్టం లేకుండా పెళ్లి ఎలా సెట్ చేస్తారని ప్రశ్నిస్తుంది. కానీ, వాళ్లు మాత్రం ఆమెను అస్సలు లెక్క చేయకుండా సంజూతోనే నీ పెళ్లి ఫిక్స్ అంటూ తేల్చిపడేస్తారు. దీంతో శృతికి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు, శృతి చెప్పిన విషయాన్ని మీనా ఎలాగోలా బాలుకు వివరించి చెప్తుంది. దీంతో అతడు వెంటనే రవి పని చేసే రెస్టారెంట్‌కు వెళ్తాడు. అక్కడ నానా రభస చేస్తాడు. అలాగే, శృతిని ఎలాగైనా మర్చిపోవాలని కూడా వార్నింగ్ ఇస్తాడు. దీంతో రవి షాక్ అయిపోతాడు.

మంగళవారం ఎపిసోడ్‌లో.. బాలు కూడా లవ్ గురించి మాట్లాడడంతో మీనా అతడిని 'మీరు కూడా లవ్‌లో ఫెయిల్ అయ్యారా' అని అడుగుతుంది. దీంతో బాలు ఆమె నెత్తి మీద ఒక్కటి పీకుతాడు. అంతేకాదు, 'వాడినే అన్నీ మర్చిపోవాలని చెప్పాను. మధ్యలో నువ్వేంటి' అని అడుగుతాడు. అప్పుడు మీనా 'రవే మర్చిపోతే మధ్యలో నాకేంటి? అయినా అత్తయ్య గారు కూడా రవికి సంబంధాలు చూస్తున్నారుగా' అంటుంది. దీంతో బాలు 'మా అమ్మ చూస్తే మళ్లీ కోటీశ్వరుల సంబంధం అంటుంది. వాడిని తీసుకెళ్లి డబ్బున్న వాళ్లకు కట్టబెడుతుంది' అంటాడు.
తర్వాత బాలు 'రవి సంబంధం గురించి మా అమ్మకు చాన్స్ ఇవ్వను. నేనే వాడి కోసం ఒక సంబంధం చూశాను. రేపు ఒక చోటుకు వెళ్దాం' అంటాడు. అప్పుడు మీనా ఎక్కడికి అని అడిగినా కూడా అతడు చెప్పడు. ఇక, తర్వాతి రోజు ఉదయాన్నే మీనాను తీసుకుని బాలు కారులో తీసుకు వెళ్తాడు. అప్పుడామె ఎక్కడికి వెళ్తున్నామని అడిగినా బాలు మాత్రం చెప్పడు. ఆ సమయంలో మీనా 'పూల బుట్ట తీసుకు వెళ్తున్నట్లు తీసుకెళ్తున్నారు. టిఫిన్స్ లాంటివి పట్టించుకోకుండా వెళ్తున్నానని అత్తయ్య గారు నా సంగతి చెప్తారు' అంటుంది. దీంతో బాలు కూల్ చేసేస్తాడు.
కారులో వెళ్తుండగా ఒక దగ్గర ఆపిన బాలు పండ్లు కొంటాడు. అది చూసి మీనా ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. కానీ, బాలు మాత్రం సస్పెన్స్‌గానే ఉంచుతాడు. అలా కారును నేరుగా తీసుకుని వెళ్లి మీనా వాళ్ల అమ్మ ఇంటి ముందు ఆపుతాడు. అప్పుడు పార్వతమ్మ కంగారుగా ఏమైందని అడుగుతుంది. కానీ, బాలు మాత్రం అసలు ఏం జరుగుతుందో చెప్పడు. పైగా తాను చెప్పినట్లు చేయాలని ఫోర్స్ చేస్తాడు. తర్వాత ఓ ఇత్తడి పళ్లెం తీసుకు రమ్మనడంతో పార్వతమ్మ తెస్తుంది. అందులో పండ్లు, స్వీట్లు పెట్టి తాంబూళం మాదిరిగా దాన్ని మార్చి మీనాను పట్టుకోమంటాడు.
తాంబూళం పళ్లెం పట్టుకున్న బాలు 'అల్లుడైనా కొడుకైనా మీరే బాబు అని అన్నారు కదా. అంటే ఈ ఇంటి బరువు బాధ్యతలు నేను కూడా పంచుకోవాలి అంతేకదా. పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే బరువు. దాన్ని వదిలించుకోవడం బాధ్యత. మా రవి మంచోడు. ఉద్యోగం కూడా చేస్తున్నాడు. వాడికి మీ సుమతిని ఇచ్చి పెళ్లి చేయడానికి తాంబూళం తీసుకు వచ్చాను తీసుకోండి. ఈ శుభవార్త చెప్తానని మీరు కలలో కూడా అనుకోలేదు కదా' అంటాడు. దీంతో మీనా కంగారుగా ఆ పళ్లెం వదిలేసి పక్కకు వెళ్లిపోతుంది. ఇది తెలిసి పార్వతమ్మ కూడా షాక్ అయిపోతుంది.
బాలు చెప్పిన దానికి పార్వతమ్మ 'ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు బాబు. మీ రవి చాలా మంచోడు కానీ ఇది వద్దు. దీనికి సాక్ష్యం మీ పక్కనే ఉంది. దాన్ని చూసి కూడా ఈ పెళ్లికి ఎలా ఒప్పుకోమంటారు? అయినా మీ అంత పెద్ద స్థాయి వాళ్లకు మేము సరిపోము' అంటుంది. దీంతో బాలుకు అర్థంకాక ఏమైందని అడుగుతాడు. అప్పుడు పార్వతమ్మ 'మీనా ఇంకెలా చెప్పాలే.. బాబు మీ పెద్ద మనసుకు దండం పెడతాను. ఇది కుదరదు.. అయినా మా సుమతి చిన్న పిల్ల. తను చదువుకోవాలి. ఇప్పుడు తనకు పెళ్లి చేసే ఆలోచనలో మేము లేము' అని చెబుతుంది.
అనంతరం 'మీరు మీ నాన్న గురించే మాట్లాడుతున్నారు. కానీ, మీ అమ్మగారి గురించి పెద్దగా చెప్పడం లేదు. మా సుమతి మీ తమ్ముడితో స్నేహంగా ఉంటేనే మీ అమ్మగారు మాపై నిందలు వేస్తోంది. అయినా మీనా పడుతున్న కష్టాలు చూస్తున్నాం. మళ్లీ ఆ ఇంటికి సుమతిని కోడలిగా పంపించి ఇంకా కష్టాలు పడలేము' అంటుంది. దీంతో బాలు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. అప్పుడు మీనా 'అమ్మా నువ్వేమీ తప్పు మాట్లాడలేదు. పైగా ఇప్పుడే సరిగా మాట్లాడావు. నా పెళ్లి సమయంలో ఇలా నువ్వు మాట్లాడి ఉంటే బాగుండేది' అంటూ వెళ్లిపోతుంది.
కారులో వెళ్తుండగా పార్వతమ్మ అన్న మాటలను గుర్తు చేసుకున్న బాలు కోపంతో రగిలిపోతాడు. అప్పుడు కారును ఆపేసి మీనాను కిందకు దిగమంటాడు. అలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో మీనా 'మన పెళ్లి సమయంలో కూడా మీ అమ్మ ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. అప్పటి నుంచి నేను పడుతున్న కష్టాలు చాలవా? రోహిణి వచ్చినప్పటి నుంచి నన్ను ఎలా అవమానిస్తున్నారో చూసి మా అమ్మ అలా చెప్పింది. మమ్మల్ని దొంగల కుటుంబం అంటున్నారు అది చాలదా. అయినా మీరు మీ అమ్మకు చెప్పాలి కదా' అంటుంది.
ఆ తర్వాత మీనా 'నేను ఒకసారి నా బాధను చెప్పుకోడానికి గుడిలో అంగ ప్రదక్షిణ చేశాను గుర్తుందా? ఆరోజు ఎవరు అడిగినా నేను చెప్పలేదు. కానీ, మీ అమ్మ మా గురించి తప్పుగా మాట్లాడితేనే ఎవరికీ చెప్పుకోలేక దేవుడికి చెప్పుకున్నాను. మాటలు భరిస్తేనే తెలుస్తుంది. అయినా నేను పడుతున్నా కదా. మళ్లీ మా చెల్లి కూడా పడాలా' అంటుంది. దీంతో బాలు 'నీ మనసులో ఇంత బాధ ఉందా? అయినా నేను చేసింది కరెక్టు. మీ సుమతి మంచోడు, రవి మంచోడు' అంటాడు. కానీ, మీనా మాత్రం వద్దు అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











